సిరివెన్నెల పాట – నా మాట – 56 – ఎవర్ గ్రీన్ టీజింగ్ పాట

0
11

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

వెయ్యినొక్క జిల్లాల వరకు

~

చిత్రం: సూర్య ఐ.పి.ఎస్.

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: ఇళయరాజా

గానం: ఎస్.పి.బాలు

~

పాట సాహిత్యం

పల్లవి:
వెయ్యి నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావొ ఏమో వయ్యారి
చరణం:
ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గానీ సీత ఊసునే తలచునా
త్వరపడి భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు కానీ బ్రహ్మచారిగా బ్రతుకునా
పొరబడి! ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే పాత యుద్ధ గాథలన్నీ మారి వుండేవే! పొరపాటు బ్రహ్మదిగాని సరిలేనిదీ అలివేణి ॥ వెయ్యినొక్క జిల్లాల వరకు ॥
చరణం:
అల్లసాని వారిదంతా అవకతవక టేస్టు గనక వెళ్ళిపోయేనే చల్లగా ప్రవరుడు
వరూధినిని కాక నిన్నే వలేసుంటే కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు
ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేదు ఎవరూ కాపురాలు గంగకొదిలి వెంట పడతారే!.
ముసలాడి ముడతలకైన కసి రేపగలదీ కూన! ॥ వెయ్యినొక్క జిల్లాల వరకు ॥

Teasing is to make fun someone to disturb or annoy by persistent irritating or provoking especially in a petty, funny or mischievous way. టీజింగ్ అంటే ఆట పట్టించడం.. సరదాగా ఏడిపించడం..

Aizzur Festejo అనే కవి teasing అనే కవితలో ఇలా వ్రాస్తారు.

I tease you to make things exciting.
I tease you so everything seems more relaxing.
I tease you to make you laugh.
I tease you when life’s getting rough.
But sometimes,
I tease you to expose my wickedness.
I tease you to show my sweetness.
I tease you to get your attention.
I tease you to give words to my affection.
If I crossed the lines,
What will happen if I stop teasing you?
Should I just do tricks like peek-a-boo?

~

ఏడిపించే వాళ్లకి అదొక సరదా.. అయితే ఏడిపించబడేవాళ్లు? వాళ్లు ఎంత ఉడుక్కుంటే, ఇవతల వారికి అంత ఆనందం. మాటల్లో ఏడిపించడం కాకుండా, పాటల్లో ఏడిపించడం సినిమాల్లో బాగా క్లిక్ అయిన ఒక ప్రయోగం. ఈ teasing songs అన్ని భాషల్లోనూ బాగా ఆదరణ పొందాయి. తెలుగు సినిమాల్లో కూడా, బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి, వాటి జోరు, హుషారు, క్రేజ్.. ఈనాటి సినిమాల వరకు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటు హీరో హీరోయిన్‌ను ఏడిపించినా, అటు హీరోయిన్ హీరోను ఆట పట్టించినా, ప్రేక్షకులు మాత్రం చాలా సరదాగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాంటి టీజింగ్ సాంగ్స్ తెలుగు సినిమాలలో లెక్కకు మిక్కిలిగా దొరుకుతాయి.

హీరోయిన్‌ను హీరో ఆట పట్టిస్తూ సాగిన (నాకు గుర్తు వచ్చిన..) కొన్ని టీజింగ్ సాంగ్స్ ఇక్కడ ప్రస్తావిస్తాను.

కన్ను మిన్ను కానరాని కాని తరపు గిత్తరా..
పట్టుకుంటే మాసిపోవు పాలపళ్ళ గిత్తరా
ఒంటి మీద చేయి వేస్తే ఉలిక్కిపడే గిత్తరా..
పొగరుబోతు పోట్లగిత్తరా ఓరయ్య దీని చూపే సింగారమవునురా, ఓరయ్య దీని రూపే బంగారమవునురా.. కొసరాజు సాహిత్యం, నమ్మినబంటు చిత్రం.

~
నడకలు చూస్తే మనసవుతుంది
కులుకులు చూస్తే మతిపోతుంది
ఆహా.. ఓయబ్బో ఏమి సింగారం
ఓయబ్బో లేత బంగారం@2.. డాక్టర్ సినారె, చిత్రం- టక్కరి దొంగ చక్కని చుక్క.

~
చిక్కావు చేతిలో చిలకమ్మా
నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా.. ఆత్రేయ రచన- చిత్రం, విచిత్ర బంధం.

~

నెరా నెరా నెరబండి జరజర నిలుపు బండి
లేడీస్ సైకిల్ బండి బోల్తా కొట్టిందండి.. ఆరుద్ర సాహిత్యం.. చిత్రం- మంచి కుటుంబం
~
ఓ చిన్నదానా ఓ చిన్నదాన నన్ను విడిచి పొతావటే పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటు చూడు.. పిల్లా మనసువిప్పి మటాడు.. బుల్లి ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాటాడు నిజం చెప్పవలెనంటే నీకు.. నాకు.. సరిజోడు గుంతలకడి గుంతలకడి గుమ్మా హ.. గుంతలకడి గుంతలకడి గుమ్మా గుంతలకడి గుంతలకడి గుమ్మా
– కొసరాజు సాహిత్యం, నేనంటే నేనే చిత్రం కోసం.

~

బులి బులి ఎర్రని బుగ్గల దానా,
చెంపకు చారడు కన్నుల దాన
మరచిపోయావా నువ్వే మారిపోయావా.. శ్రీమంతుడు చిత్రం కోసం కొసరాజు సాహిత్యం

~

హాల్లో మేడం సత్యభామా పైన కోపం లోన ప్రేమ (నాదీ ఆడజన్మే) / హవ్వరే హవ్వ హైలెస్సా హహ (బుద్దిమంతుడు) బోల్తా పడ్డవే పిల్ల దాన చెంకీ తిన్నవే చిన్నదానా (పుట్టినిల్లు మెట్టినిల్లు) / అయ్యయ్యో బ్రాహ్మయ్య అన్యాం చేసావేమయ్య (అదృష్టవంతులు) /చీరగట్టి సింగారించి (ఆత్మబందువు) /మీ అందాల చేతులు కందేను పాపం.. ఎందుకు ఈ గొడవ (ప్రేమించు చూడు)/ పోపోయే చినాదానా (గుడిగంటలు)/మా ఊర్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది (అవేకళ్ళు)

~

హలో గురు ప్రేమ కోసమేరా జీవితం..
మగాడితో ఆడదానికేలా పౌరుషం,
ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే,
మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి..
రచన గణేష్ పాత్ర- చిత్రం నిర్ణయం~

ఇక ఇటీవలి చిత్రాల్లో, వయ్యారిభామ నీహంస నడక.. ఎందుకే నా గుండెలో దడ దడ/ శైలజా శైలజా శైలజా/ కాజల్కు చెల్లివా, కరీనాకి కజినివా, కత్తిరిన కైఫ్ వా కత్తిలాంటి ఫిగరువా/చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్/ రాకాసి రాకాసి../ ఓహో లైలా ఓ చారుశీలా కోపమేలా/ నిన్నే ..నిన్నే.. నిన్నే ..ఇష్క్ కియా దిల్సే/ పిల్ల చావ్, పిల్ల చావ్ పిల్ల చావ్../ సిలకా, సిలకా.. రాయే సిలకా, దిల్ మేరే ధడకా/ సుబ్బలచ్మి అబ్బ టచ్ మీ/.. ఇలాంటి ఎన్నో టీజింగ్ పాటలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..

సూర్య ఐపిఎస్ చిత్రం కోసం.. కథానాయకుడు, హీరోయిన్ను.. ఆట పట్టిస్తూ.. సాగే నేపథ్యం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన.. ఒక మంచి టీజింగ్ సాంగ్. ఈ పాటను రీమిక్స్ సంగీతంతో.. మళ్ళీ రావణాసుర చిత్రం కోసం.. రవితేజ మీద చిత్రీకరించారంటే, ఈ పాట రేపిన అల్లరి, ఇచ్చిన హుషారు.. ఎంత ఎవర్ గ్రీన్‌గా ఉందో గమనించండి. ఇక పాట సాహిత్యం ఒకసారి గమనిద్దాం.

వెయ్యి నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావొ ఏమో వయ్యారి

అతిశయోక్తి అలంకారాన్ని వీలైనంత వాడేసి, హీరోయిన్ అందాలను, పీక్స్‌లో పొగిడేశారు సిరివెన్నెల. సాధారణంగా మనందరికీ, నటుడు నూతన్ ప్రసాద్ గారి సుపరిచితమైన డైలాగ్.. ‘నూటొక్క జిల్లాల అందగాణ్ణి..’ అని. అందుకే ఏకంగా 1001 యొక్క జిల్లాలు, నీ అందాల గురించి పొగిడేసుకుంటున్నారని, ఏ మూల విన్నా.. నీ అందమే హాట్ టాపిక్ అయిపోయిందని.. పొగుడుతూ.. అక్కడితో ఆపక.. అత్యంత రమణీయమైన హంపి లోని శిల్పాలకి, ఎల్లోరా గుహల్లోని శిల్పాల నాట్య భంగిమలకు, కొంపతీసి నువ్వేమైనా మోడలా! అన్న అద్భుతమైన వ్యంగ్యాస్త్రాన్ని ప్రయోగించారు సిరివెన్నెల. Heights of Teasing కదా!.. (అయినా హీరోయిన్ విజయశాంతిని.. ఈ పాటలో మరింత అందంగా చిత్రీకరించారు లెండి.)

ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గానీ సీత ఊసునే తలచునా
త్వరపడి భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు కానీ బ్రహ్మచారిగా బ్రతుకునా
పొరబడి! ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే పాత యుద్ధ గాథలన్నీ మారి వుండేవే! పొరపాటు బ్రహ్మదిగాని సరిలేనిదీ అలివేణి

ఇక టీజింగ్ సాంగ్స్‌లో కూడా.. పురాణేతిహాసాలను ఏకరువు పెడుతూ.. హీరో తరఫున.. అల్లరి చేయించడం సిరివెన్నెల గారికే చెల్లింది.. ఉపోద్ఘాతంలో మనం.. ఇలాంటి చాలా పాటలు గమనించాం కానీ, ఒక రచయిత కూడా.. సిరివెన్నెల గారి లాంటి ప్రయోగం చేయలేదు, బహుశా చేయరేమో!

రావణుడు కనుక ఈ అందగత్తెను చూసి ఉంటే, ఈమెతోనే కాంప్రమైజ్ అయిపోయి, సీత జోలికి వెళ్లి ఉండేవాడు కాదట! భీష్ముడు గనక పొరపాటున ఈమెను చూసి ఉంటే, ఆజన్మ బ్రహ్మచర్య వ్రతమే తీసుకొని ఉండడట! ఈ యుగంలో కాకుండా, పూర్వ యుగాల్లో ఈమె పుట్టి ఉంటే, పాత యుద్ధ గాథలన్నిటి వెనుక ఈమె అందమే దాగి ఉండేదేమో! అని పైకి పొగుడుతున్నట్టు కనిపిస్తూ.. వెటకారాన్ని కురిపిస్తారు సిరివెన్నెల ఈ పాటలో. పాత యుద్ధ గాథలన్నీ, అన్న పద ప్రయోగం గమనిస్తే, రామాయణానికి- సీతమ్మ; మహాభారతానికి- ద్రౌపది; Greek mythology లోని Trojan War కు అతిలోక సౌందర్యవతి అయిన, Helen of Troy; వాలి సుగ్రీవుల మధ్య యుద్ధానికి తార; ఇలా, ఎక్కువ యుద్ధాలకు స్త్రీ మూల కారణంగా మారింది. ఇంత సమగ్రమైన సమాచారాన్ని, అంత చిన్న పదబంధంలో, చూపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంత చేసి చివరికి నింద ఎవరి మీద మోపారంటే, బ్రహ్మగారి మీద. ఈ అందాలభరణకి సరిసాటి ఎవరూ లేరు కానీ.. ఈ యుగంలో ఆమెను పుట్టించడం, బ్రహ్మగారు చేసిన తప్పిదమట! ముందు యుగాల్లో పుట్టి ఉంటే చరిత్రలన్నీ మారిపోయి ఉండేవట.

అల్లసాని వారిదంతా అవకతవక టేస్టు గనక వెళ్ళిపోయేనే చల్లగా ప్రవరుడు
వరూధినిని కాక నిన్నే వలేసుంటే కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు
ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేదు ఎవరూ కాపురాలు గంగకొదిలి వెంట పడతారే!.
ముసలాడి ముడతలకైన కసి రేపగలదీ కూన!

ఇక రెండో చరణంలో, ప్రబంధాల ఉదాహరణల తీసుకుని, అల్లసాని వారి స్వారోచిష మనుసంభవం నుండి, వరూధిని ప్రవరాఖ్యుల ఘట్టాన్ని వివరించారు సిరివెన్నెల. ప్రవరాఖ్యుడి మనసును ఆకట్టుకోగలిగిన అందం వరూధినికి లేదట! పెద్దన గారిది సరియైన అభిరుచి కాదు కాబట్టి, వరూధినిని ఎరవేశారు కానీ, ఈమె అందాన్ని గనుక ప్రవరాఖ్యుడికి చూపించి ఉంటే, కళ్ళు, మనసు.. చెదిరిపోయి, ఈమె వలలో పడిపోయి ఉండేవాడట. రెప్ప వేయకుండా చూసే ఆమె అందాలకి, సంసారాలు కూడా గాలికి వదిలేసి, మూలనున్న ముసలాళ్ళకి కూడా ఉల్లాసం కలిగి.. కసి కసిగా ప్రేమ కోసం వెంటపడతారట!..

ఈ పాటను, నిజంగా ఒక అందగత్తెను పొగడడానికి కూడా.. మంచి పాజిటివ్ టోన్‌లో తీసుకోవచ్చు.. ఆ చిత్రంలోని కథనానికి అనుగుణంగా కథానాయికను ఆటపట్టించి, సతాయించే నేపథ్యం కాబట్టి, దీన్ని వ్యంగంగా, అతిశయోక్తిగా, ప్రయోగించినట్టు భావించవచ్చు. ఏది ఏమైనా, పురాణేతిహాసాలను, ప్రబంధాలను కూడా ఇలాంటి టీజింగ్ సాంగ్స్‌లో, తన శైలికి అనువుగా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా చాకచక్యంగా, హాస్యజనితంగా ప్రయోగించిన సిరివెన్నెల గారి రచన చాతుర్యం అద్వితీయం!

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here