సిరివెన్నెల పాట – నా మాట – 6 – కవి మనోవేదనకి అద్దం పట్టిన పాట

1
9

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

~

చిత్రం : గాయం

సంగీతం : శ్రీ

సాహిత్యం : సిరివెన్నెల

~

సాహిత్యం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
~
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ||నిగ్గదీసి||
~
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ||నిగ్గదీసి||

[dropcap]గ[/dropcap]త కొద్ది శతాబ్దాలుగా ప్రపంచ చరిత్రను గమనిస్తే.. ఏ వర్గాన్ని చూసినా, కులాన్ని, మతాన్ని, జాతిని, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, చూసినా.. ఏమి కనపడుతోంది మనకు? ‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’, అన్న నిత్య సత్యం తప్ప! అటవిక న్యాయం, అన్ని రకాల వివక్షలు, అంతర్యుద్ధాలు, బహిరంగ యుద్ధాలు.. ఎర్రసిరాతో తప్ప.. పచ్చదనంలోని వెచ్చదనం చెప్పే.. అవకాశం ఎక్కడ?

19వ శతాబ్దంలో అయితే, అమెరికన్ సివిల్ వార్, రష్యన్ సివిల్ వార్, చైనీస్ సివిల్ వార్, స్పానిష్.. అలా అలా ఒకటవ, రెండవ ప్రపంచ యుద్ధాలు, కొరియన్ వార్, వియత్నాం వార్.. ఎంత పెద్ద జాబితానో! ఈ మధ్యలో ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా-రష్యాలు సాగించిన ప్రచ్చన్న యుద్ధాలు..(Cold Wars)

ఇక 20వ శతాబ్దానికి వస్తే.. అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అమెరికా రష్యాల ఆరాటం, (Space Race), ఆయుధ పోటీ (Arms Race), ఆధిపత్య పోరు.. రష్యా రాజకీయంగా కాస్త శక్తి హీనమైనా, పరిస్థితులలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు.. ప్రపంచమంతా పెచ్చు పెరిగిన జాతీయ వాదాలు, చైనా ఆక్రమణ విధానం, ప్రపంచ స్థాయి ఆర్థిక యుద్ధాలు (Trade wars) సిద్ధాంతాల వికృత రూపాలు, Kim Jong Un వంటి నియంతల రాక్షస కృత్యాలు..

ఇక సిరియా సివిల్ వార్, సుడాన్ సివిల్ వార్, సోమాలియాలో 1991 నుండి నేటి వరకు కొనసాగుతున్న మారణ హోమం, బోస్నియాలోని కొసోవో జాతిపై జరుగుతున్న నిరంతర దాడులు (బాల్కన్ వార్), వందల వేల మంది Tutsi ethnic వర్గ సభ్యులు బలైపోతున్న భయంకరమైన రువాండా నరమేధం.. (Rwanda Genocide)..

ఈమధ్య ప్రపంచమంతా ఉలిక్కిపడి మన దేశం వైపు చూసిన మణిపూర్ సంఘటన..(నగ్నంగా ఊరేగించబడి, మూకుమ్మడి మానభంగానికి గురై, కాల్చి చంపబడిన మహిళలు, నేలమట్టం చేసిన ఇళ్ళు, జంతువులను కూడా వదలకుండా దాడి చేసి చంపిన వర్గం ఒకవైపు, పోలీసులు తమ వారిపై దాడి చేయకుండా, నగ్నస్త్రీదళం కాపలాగా ఉన్న వర్గం మరోవైపు!!! రెండు జాతుల మధ్య మొదలై, కులాలకు పాకి, రాజకీయ రంగు పూసుకున్న ఒక సంఘటన) ఒకటేమిటి.. అన్నీ అమానవీయతను, రాజకీయ అనిశ్చితిని, బలహీనుల దుస్థితిని.. దీనస్థితిని.. అనుక్షణం ప్రతిబింబిస్తున్నాయి.. మానవత్వాన్ని మంట కలుపుతూనే ఉన్నాయి. ఇలాంటి అమానవీయ సంఘటనల గురించి వ్రాయమంటే, కలం కలవరపడుతుంది, సిరా కూడా సిగ్గుపడుతుంది.

‘The smile of war is the flood of human blood..’. వరదలై పారే మానవ రక్తం యుద్ధానికి ఒక చిరునవ్వు అవుతుందనేది ‘Songs of the Soul’ poem లో శ్రీ చిన్మాయ్ తీర్మానం.

Man seeks war when he thinks that the world is not his.

Man invites war when he feels that he can conquer the world.

Man proclaims war when he dreams

That the world has already surrendered to him…

The animal in the man wants war for the sake of war..

The divine in man wants peace for the sake of peace,

Peace to feed the hungry world…

మానవుడిలోని యుద్ధకాంక్ష పశుత్వానికి ప్రతీక అని, శాంతి కాంక్ష దైవత్వానికి ప్రతీక అనీ, శాంతి కరువైపోయిన ఈ ప్రపంచంలో, అందరూ దాని కొరకే తీరని దాహంతో ఉన్నారని చిన్మాయ్ భావం.

ఇలా యుద్ధానికీ, అశాంతికి వ్యతిరేకంగా, కదంతొక్కిన పదునైన కలాలు, ఎలుగెత్తి గర్జించిన గళాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి.

నాకు బాగా నచ్చిన యుద్ధ వ్యతిరేక పాటలలో, Buffy Sainte-Marie యొక్క ‘The Universal Soldier’ లో యుద్ధానికి బాధ్యులైన అందర్నీ ప్రశ్నిస్తూ, ఇష్టపూర్వకంగా యుద్ధంలో పాల్గొన్న సైనికులను కూడా నిరసిస్తూ, ‘మీరు లేకుంటే యుద్ధం సాగదు కదా?’ అని పదునుగా ప్రశ్నిస్తుంది.

And he’s fighting for democracy, he’s

fighting for the reds

He says it’s for the peace of all.

He’s the one who must decide who’s to live and who’s to die,….

……….

He’s the one who gives his body as the

weapon of the war

And without him all this killing can’t go on..

తన శరీరాన్ని ఒక ఆయుధం చేసి, మారణ హోమాన్ని సృష్టించి, తనకు తానే బలైపోయే సైనికుడే లేకపోతే యుద్ధం ఎందుకు జరుగుతుంది.. అన్నది ఆమె సూటి ప్రశ్న.

ఇప్పుడు మనం విశ్లేషించబోయే గీతానికి ఉపోద్ఘాతమిది. ఇప్పుడు పాట విశ్లేషణలోకి అడుగుపెడదాం. కథానాయకతో కలిసి విలేఖరి ఎంత ప్రయత్నించినా హింసకాండ ఆగకపోవడంతో, విలేఖరిగా నటించిన సీతారామశాస్త్రిగారి పైనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను చిత్రీకరించారు. దర్శకుడు ఆశించినట్టుగానే, తెరమీద విలేఖరిగా పాట పాడుతున్న ఆయన కళ్ళలో కత్తుల పదునూ, ముఖంలో నిప్పుల ఉప్పెన, హావభావాల్లో ఉప్పొంగే ఆవేశం మనకు కనిపిస్తాయి.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని

మారదు లోకం మారదు కాలం

దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ

మారదు లోకం మారదు కాలం..

ఈ పాటను చిత్ర నేపథ్యంలో కాకుండా సజీవ సామాజిక నేపథ్యంలో విశ్లేషించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈ పాట వికృత రూపం దాల్చిన సమాజాన్ని, నిలబెట్టి మెడ పట్టుకొని ప్రశ్నిస్తోంది కాబట్టి! సిరివెన్నెల గారి ఈ గీతంలో సమాజం సమూలంగా మారాలన్న దృఢమైన ఆకాంక్ష, మారడం లేదన్న నిర్వేదం, ఉక్రోషం మనకు కనిపిస్తాయి. Impersonal గా, నిస్వార్ధంగా ఆలోచించగలిగే వాళ్ళందరూ సమాజం పట్ల ఏ భావాన్ని కలిగి ఉన్నారో, అదే భావాన్ని, ఆవేదనను, పలికిస్తున్నాయి సిరివెన్నెలగారి భావాలు. మనిషిలోని చైతన్యాన్ని తట్టి లేపేటట్టుగా సిరివెన్నెల గారి కలం ముందుకు కదిలింది.

పాజిటివ్ ఎనర్జీకి ఒక ఊట బావిలాంటి సీతారామశాస్త్రిగారు, “దేవుడు దిగివచ్చినా, ఎవరు ఏమైపోయినా లోకం మారదు, కాలం మారదు,” అనడం ఏమిటా అనిపిస్తుంది. కానీ ఇది ఎలుగెత్తిన నిరసన గళం. కాలం మారడం లేదన్న ఆవేదన, నిర్వేదం, నిస్సహాయత.. వీటన్నిటి వెనుక.. సక్రమమైన గమ్యం వైపు ఈ లోకం సాగాలన్న బలమైన ఆకాంక్ష. జీవచైతన్యమే లేకుండా, తమకు ఎలా అనుకూలంగా ఉంటే ఆ విధంగా సాగిపోతున్న సిగ్గుమాలిన జనాన్ని, నిలదీసి ప్రశ్నించమంటోంది, సిరివెన్నెల కలం. దాన్ని ప్రక్షాళన చేయడం కోసం, అగ్గితో కడగమంటోంది.

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి

గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం

ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామబాణమార్పిందా రావణ కాష్టం

కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ||నిగ్గదీసి||

తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా, ఏ దిశలో కావస్తే ఆ దిశలో సాగిపోయే జనావళికి, రాజ్యాంగం, ప్రవర్తన నియమావళి, చట్టాలు ఏవి అవసరం లేదు. ఎంతమంది మహనీయులు, ఎన్ని రకాలుగా జ్ఞాన బోధ చేసినా వీళ్ళ తలకు ఎక్కదు. ఉపోద్ఘాతంలో చర్చించినట్టుగా ప్రపంచ చరిత్రలన్నీ యుద్ధ కల్లోలాన్ని, బీభత్సాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నా, ఎవరి మనసులోనూ, ఎటువంటి మార్పు రావడం లేదు. కార్చిచ్చులాగా వ్యాపించి కబళిస్తున్న ఈ అమానుషత్వం కళ్ళారా చూస్తున్నా, ప్రపంచంలో ఏ జాతీ దీని నుండి పాఠాలు నేర్చుకోవడం లేదు. శాంతి కపోతాన్ని ఎగరవేయాలని ప్రయత్నించడం లేదు. రామబాణం ఒక రావణుడిని మాత్రమే అంతం చేయగలిగింది. కానీ సమాజంలో ఎక్కువ శాతం మనసులు రావణ కాష్టాలై నిరంతరంగా మండుతూనే ఉన్నాయి. విధ్వంసానికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఉత్తమ జ్ఞాన గ్రంథంగా, వ్యక్తిత్వ వికాస ఉపదేశంగా భావించే భగవద్గీత పుట్టిన ఈ దేశంలో కూడా, దాని సారాన్ని అర్థం చేసుకున్న వారు కానీ పాటించేవారు కానీ బొత్తిగా కరువైపోయారు, ఆ జ్ఞాన ప్రేరణతో, చరిత్ర గతిని మార్చే ప్రయత్నాలు జరగడం లేదు.. అన్నది సిరివెన్నెల గారి మనోవేదన.

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా

అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా

వేట అదే వేటు అదే నాటి కథే అంతా

నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ

శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ ||నిగ్గదీసి||

అప్పట్లో అనాగరిక సమాజాలు, పాపం సరియైన రీతిలో నడవలేకపోయాయని.. “బలం ఉన్నవారిదే రాజ్యం.. బలహీనులే వారి భోజ్యం”, అన్న వికృత సంస్కృతి మార్చాలని, నాగరికత పుట్టుకొచ్చింది. ‘నడుమ బట్ట కడితే నగుబాటు.. నాగరికత ముదిరితే పొరపాటు..’ అన్న పాట చందాన, ముదిరిన నాగరికత మళ్ళీ ఆటవిక న్యాయానికే తిరిగి వచ్చింది. బాహ్య స్వరూపాలు మారుతున్నాయి కానీ, అంతర్గతంగా మనిషి స్వభావంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కాకపోతే రాళ్లతో కత్తులతో కొట్టుకోకుండా.. కొత్తరకం మారణాయుధాలతో చంపుకుంటున్నారు. కథలలో మార్పు లేదు వ్యథలలోనూ మార్పు లేదు. ఆటవిక వ్యవస్థ కన్నా అతి వికృత రూపాలను, ఈ నవ నాగరిక సమాజంలో మనం చూస్తున్నాం. దాన్ని ఆధునికత అనుకొని మురిసిపోతున్నాం.

“సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ

సుఖాన మనలేని వికాసమెందుకని

నిజాన్ని బలి కోరే సమాజమెందుకని అడుగుతోంది అదిగో ఎగిరే భారత పతాకం..”

సిరివెన్నెల గారు ‘సిందూరం’ చిత్రం కోసం రాసిన ఈ పాటలో కూడా, మనకు ఘాటుగా ప్రశ్నిస్తున్న ఆ గళం, సమాజ శ్రేయస్సుకై పిడికిలి బిగించిన ఒక ఉద్యమం, ఆవేశంతో ఎగసి లేచే ఒక కెరటం, మనకు దర్శనమిస్తాయి. ఒక మంచి రాజ్యాంగా మారలేని స్వరాజ్యానికి అర్థం ఏముంది, అని ప్రశ్నిస్తూ,

కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచుశిఖరం,

కలహముల హలాహలానికి మరుగుతున్నది హిందుసంద్రం….

భవితకు పునాది అయిన యువతే భస్మాసుర హస్తాలై తిరుగుతున్నాయంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తూ.. మనల్ని సుఖంగా ఉంచలేనప్పుడు వికాసం ఎందుకు? అని ఉద్వేగంతో సమాజానికి ప్రశ్నలు సంధిస్తున్నారు, సిరివెన్నెల.

John Lennon వ్రాసిన చిన్న Imagine అనే పద్యం మనందరి ఆశలకు ఒక రూపాన్ని ఇస్తుంది. ఎటువంటి అత్యాశ, అధికార దాహం, కుల మతాలు లేని ఒక ఊహజనితమైన శాంతియుత ప్రపంచాన్ని, ఆ poem లో ప్రస్తావిస్తాడు.

Imagine there’s no countries

It isn’t hard to do

Nothing to kill or die for

And no religion, too

Imagine all the people

Living life in peace..

చివరిగా, సీతారామశాస్త్రి పాటలలోని సాహిత్యం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ పలికిన అక్షర సత్యమైన అభిప్రాయంతో ఏకీభవిస్తూ, దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ, ఈ విశ్లేషణని ముగిస్తున్నాను. “ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. పదాలు అనే కిరణాలు, అక్షరాలు అనే తూటాలు పట్టుకొని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరుతాడు. నాకు సమాధానం చెప్పండి, అని సమాజంలోకి వస్తాడు. మన పక్కన నుంచుంటాడు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలు సంధిస్తాడు..”.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here