సిరివెన్నెల పాట – నా మాట – 63 – కథలోని లోతులన్ని కూర్చిన పాట

0
8

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి

~

చిత్రం: అతడు

సంగీతం: మణిశర్మ

సాహిత్యం; సిరివెన్నెల

గానం: శ్రేయా ఘోషల్

~

పాట సాహిత్యం

పల్లవి:
పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెఱ్ఱజేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి ఝల్లుమంటూ ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా!
చరణం:
మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తారంగాల ఒడిలో ఏళ్ళన్ని మరిపించగా
తారలన్నీ తోరణాలై ద్వారాన ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా!
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా!
చరణం:
నవ్వుల్లో హాయిరాగం మువ్వల్లో వాయువేగం ఏమైందొ ఇంతకాలం
ఇంతమంది బృందగానం ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నొ పలికే సరికొత్త రాగాలుగా
నింగిదాకా పొంగిపోగా హోరెత్తిపోతున్న గానాబజానా
చెంగుమంటూ ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా!
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా!

వర్షంలో ఏదో అద్భుతం ఉంది. అది తొలకరితో భూమిని తడుపుతూ, భూతాపాన్ని శాంతపరచడమే కాకుండా సృష్టికీ, జీవ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. సశ్యానికి ఆధారమై, జీవులకు ప్రాణాధారమై, యుగయుగాల నుండి కళాకారులు, కవులు, రచయితల ఊహలకు ఊపిరి పోస్తూ, మన జీవనంలో ప్రధాన భూమికగా నిలిచిందనడంలో ఆశ్చర్యం లేదు. వర్షం వివిధ రూపాల్లో సాహిత్యంలో ప్రశంసించబడింది. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరాలలో ఇది కూడా ఒకటి. వర్షం ఎవరికైనా హర్షాన్ని కలిగిస్తుంది. తెలుగు భాషలో వివిధ రకాల వర్షాలకు 25 రకాల పేర్లు ఉన్నాయంటే నమ్మగలరా? ఊర్లో ఒకచోట పడి ఒకచోట పడకపోతే.. కప్పదాటుడు వాన అంటారట. ఎదురుగా ఏముందో కనపడనంత భారీ వర్షం కురుస్తుంటే గాంధారి వాన అంటారు.. రాత్రంతా పడి పగలు ఆగిపోతే దొంగవాన అంటారు.. ముంతపోత, కుండపోత, ముసురు, తొలకరి (మొదటి వాన), బట్టదడుపు (బట్టలు తడిసేంత మాత్రమే), సాలేటి వాన, ఇరువాలు, మడికట్టు వాన.. ఇలా..

Langston Hughes అనే కవి I love the rain అనే poem లో ఇలా అంటారు.

Let the rain kiss you
Let the rain beat upon your head with silver liquid drops
Let the rain sing you a lullaby
The rain makes still pools on the sidewalk
The rain makes running pools in the gutter
The rain plays a little sleep song on our roof at night
And I love the rain.

వర్షం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ‘పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లీ..’ అనే పాటను ఈరోజు విశ్లేషించుకుంటున్నాం కాబట్టి.‌ అయితే ఈ పాటలోని భావాన్ని, వివిధ దృక్కోణాల్ని అర్థం చేసుకోవాలంటే తప్పకుండా కథా నేపథ్యం మనకు అవగాహనకు రావాలి. కథాపరంగా ఈ పాట ఒక అద్భుతం.. సిరివెన్నెల గారు ఒక పాట ద్వారా ఎంత కథని చెప్పగలరో, అంత చెప్పడానికి ఎంత మేధస్సును ఖర్చు పెట్టాలో అంతా పెడతారని (శ్రమ పడతారనే మాట నేను అనను) ఈ పాటను చూస్తే అర్థమవుతుంది.

చిన్నతనంలో ఒకానొక కారణంగా ఇంట్లో నుండి పారిపోయిన పార్థు.. 12 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడన్న సంతోష వార్తతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. తాత (నాజర్) కి మనవడు పారిపోయిన తర్వాత కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోతారు. తన ముగ్గురు కూతుళ్ళు, అళ్ళుళ్ళు తన ఇంట్లోనే ఉంటారు కానీ, తర్వాత తరంలో ఇంటి వారసుడైన పార్ధు లేకపోవడం అందరికీ కొరతగానే వుంటుంది. రకరకాల ప్రకటనలు ఇస్తూ 12 ఏళ్లుగా వాళ్లు పార్థు కోసం వెతికే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే, పార్థుకు బదులు ప్రాణాలు కోల్పోయిన పార్థు (రాజీవ్ కనకాల) పేరుతోనే ఆ ఇంట్లో అడుగు పెడతాడు, మహేష్ బాబు. ఈ పాటకి ముందు సీన్లో వర్షం రావడం, పూరి విపరీతమైన ఆనందంతో గెంతులేస్తూ ఈ పాట పాడటం, బావపై ఎంతో ఇష్టం ఉన్న పూరి ఈ పాట పాడుతున్న నేపథ్యంలో, ఆడవాళ్లంతా కలిసి డాన్స్ చేయడం, మిగిలిన వారు వీక్షించడం.. ఇలా కుటుంబ సభ్యులందరి పైనా ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది.

పల్లవి:
పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెఱ్ఱజేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి ఝల్లుమంటూ ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా!

ప్రధానంగా ఈ పాట పూరి (త్రిష) కోణంలో సాగుతుంది. పార్ధు బావ (మహేష్ బాబు) ఒరిజినల్‌గా ఒక సిటీలోని అగ్రశ్రేణి ప్రొఫెషనల్ కిల్లర్ – నందు. ఆ విషయం తన ఒక్కడికి తప్ప ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. పార్థు మరణం గురించి ఆ ఇంటి వాళ్లకి సమాచారం అందించాలని వచ్చిన నందు, ఆ ఇంటి వారి ఆప్యాయతలు చూసి.. ఆ సమాచారంతో వాళ్ల మనసులను నొప్పించలేక.. పార్థూగా కొనసాగుతాడు. అతడు, మౌనంగా జరిగేవన్నీ చూస్తూ ఉంటాడు. తనకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్న పూరిని బెదిరిస్తూ, ఏడిపిస్తూ ఉంటాడు.‌

దేవదాసు ఊరికి వెళ్తూ పార్వతి గురించి ఊహించుకుంటూ../ నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేనో/నా దరికి దూకునో.. తా నలిగీ పోవునో.. ఏమౌనొ చూతము/.. అని అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. అదే విధంగా పూరీకి కూడా పార్థుపై బోలెడన్ని అనుమానాలు!

నల్ల మబ్బు(pregnant cloud) కరగాలంటే చల్లగాలి కావాలి. అయినవారితో కలిసి ఉండకుండా, కరుడుగట్టిన మనసు కరిగి, మమతల వాన కురవాలంటే, ఆ మనసును కితకితలు పెట్టే ప్రేమ కావాలి.

ఈ పిల్ల గాలి ఒళ్లంతా గిల్లి, అల్లరి పెడితే, నల్లమబ్బు (హీరో) ఉరుముతుందా? కోపంతో కళ్ళెర్ర చేసి మెరుపులాగా భయపెడుతుందా? ఎల్లలన్నీ కరిగిపోయి చల్లటి వర్షపు జల్లును కురిపిస్తుందా? ఒకవేళ అలా వాన కురిస్తే అది మా కళ్ళలో, వాకిళ్లలో, వేవేల వర్ణాల వయ్యారి జాణగా, అందమైన సిరివానగా ముచ్చటగా కురిసేసమయంలో..‌ అందరాని చంద్రుడైనా మా ఇంట్లో ‘బంధువల్లే’ తిరిగేనా! అన్నది మరో అనుమానం. తిరిగి వస్తాడో రాడో తెలియని పార్థు, ఒక బంధువు ‘లాగా’ తిరుగుతాడా? అన్న భావాన్ని సిరివెన్నెల గారు పలికించడం ఇక్కడ, అతడు నిజానికి బంధువు కాదు.. అన్న గూడార్థాన్ని పలికిస్తుంది.

చరణం:
మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తారంగాల ఒడిలో ఏళ్ళన్ని మరిపించగా
తారలన్నీ తోరణాలై ద్వారాన ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా!
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా!

పాట పూరికి తన బావ మీద ఉన్న ప్రేమకి సంబంధించినదైనా, ఇంటిల్లిపాదీ పార్థు ఇంటికొచ్చాడని ఎంత ఆనందంగా వున్నారో సిరివెన్నెల గారు ఈ పాటలో వర్ణిస్తారు.

ఆ ఫామిలీ ఇంట్రొడక్షన్ సీనులోనే ఎప్పుడూ కూరలో ఉప్పు కూడా వేయని పూరి ఓ పెద్ద ముగ్గు వేస్తుంది. పార్ధు బావ ఏళ్ళ తర్వాత ఇంటికొస్తున్నాడని మనకు పరిచయం చేస్తారు. పూరీకి బావ అంటే ఎంత ఇష్టమో కథలో మనకు దర్శకులు చూపిస్తూనే ఉంటారు.

ఆ కుటుంబ సభ్యుల ఆత్మీయత అనురాగాలను మౌనంగా గమనిస్తూ ఉన్న పార్థు మనసులో ప్రేమ రాగాలు తట్టి లేపనా.. అన్న భావం పూరి మనసులో తుంటరి తిల్లానాలు పలికిస్తున్నాయని సిరివెన్నెల సూచిస్తారు. అలాంటి సరదాలు, సంబరాలన్నీ ఒక ఇంద్రజాలపు మాయలాగా కాలాన్ని హాయిగా గడిపేలాగా చేయాలన్న ఆకాంక్ష ఇక్కడ పలికిస్తారు. ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా.. అన్న వాక్యం వినిపించినప్పుడు.. ఇంటిల్లిపాది టీవీలో సినిమా చూస్తూ కాలక్షేపం చేస్తున్న సన్నివేశాన్ని కూడా మనకు చూపిస్తారు.

‘చంద్రజాలమై తారంగాల ఒడిలో ఏళ్ళన్ని మరిపించగా..’ ఈ వాక్యం ద్వారా సిరివెన్నెల ఎంతో లోతైన భావాన్ని ఇక్కడ పలికిస్తారు. చిన్నతనంలోనే ఇంటి నుండి పారిపోయి, తల్లిదండ్రుల ఆప్యాయతకు దూరమై.. గడిచిపోయిన కాలాన్నంతా ఇప్పుడు పొందుతున్న ఆత్మీయత అనురాగాలు మరిపిస్తాయి.. అని, కథలో రాబోయే మలుపును ఆయన ఇక్కడ చూపిస్తారు. తారంగం.. తారంగం అని.. ఆడించిన, చందమామ రావే జాబిల్లి రావే అంటూ బుజ్జగించిన.. ఆ బాల్యమంతా కరిగిపోయింది.. అన్న వేదనని కూడా.. ఇందులో పలికిస్తారు. వృథాగా కరిగిపోయిన గతమంతా తుడిచిపెట్టుకుపోయి, సంబరాల్లో తేలిపోయినప్పుడు తారలన్నీ తోరణాలై ద్వారాన ముత్యాల హారాలయ్యేనా? చందనాలు చిలికేనా? ముంగిలిలో నందనాలు విరిసేనా?, అనే ప్రశ్నలతో పాటుగా.. అలాగే జరుగుతుంది.. అన్న భావాన్ని కూడా సూచనప్రాయంగా పలికిస్తారు సిరివెన్నెల. ఆయన కవనంలోని ప్రత్యేకత అది!

చరణం:
నవ్వుల్లో హాయిరాగం మువ్వల్లో వాయువేగం ఏమైందొ ఇంతకాలం
ఇంతమంది బృందగానం ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నొ పలికే సరికొత్త రాగాలుగా
నింగిదాకా పొంగిపోగా హోరెత్తిపోతున్న గానాబజానా
చెంగుమంటూ ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా!
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా!

అనాథ, ప్రొఫెషనల్ కిల్లర్ అయిన పార్థు ఆ యింటి ఆప్యాయతలు చవిచూసి ఏం కోల్పోయాడో తెలుసుకుంటాడు. పల్లవి అవ్వగానే.. వర్షం ఆగిపొయినప్పుడు, పూరీ పందెం ఓడిపోయినందుకు.. ఆటపట్టిస్తూ.. అప్పటివరకు సీరియస్‌గా ఎప్పుడూ నవ్వనివాడు మొదటిసారి మనసారా నవ్వుతాడు. అక్కడ మనకి ఈ వాక్యాలు వినిపిస్తాయి.. పూరీతో పాటుగా ఇంటిల్లిపాదీ చేతులు కలిపి నృత్యం చేయడం.. పార్థు రాకకు అందరూ ఆనందించడం చూపిస్తూ.. ఇంతమంది బృంద గానం నీకు ఇంతకాలం దూరంగా ఉన్న నవ్వుని మళ్లీ నీ పెదవుల మీదికి తెప్పించిందా? అని అడుగుతుంది. నిజంగా ప్రకృతిలో కూడా, ఆకాశగంగ దివి నుంచి భువికి దిగాలంటే, మేఘాలను కరిగించే, చల్లటి చెట్ల గాలులు ఆహ్వానం పలకాల్సిందే కదా! పాలవెల్లిలాగా సంతోషాలు చిలికే సరదా సరాగాలు, స్వాతిజల్లుల స్వరాలెన్నో సరికొత్త రాగాలుగా హీరో మనసుకు వినిపిస్తున్నాయని, symbolic గా మనతో చెబుతున్నారు, సిరివెన్నెల. ఉప్పొంగిన మనసుల ఆనందం నింగిదాకా పొంగిపోగా.. గానాబజానా హోరెత్తిపోతోందట. ఆ సంబరంలో చెంగుమంటూ ఆడేనా? చిత్రంగా జావళీలు పాడేనా? అని హీరోయిన్ మురిసిపోతోందన్న సందేశం ఇస్తున్నారు సిరివెన్నెల.

ఈ పాటలో మరో ప్రత్యేకత ఏమిటంటే..

మొదటి చరణం మొత్తం ‘గతం’, అంటే పార్థు ఇంటికొచ్చిన దగ్గరనుంచి ఆ పాట వచ్చేవరకు సంబందించినది కాగా, రెండవ చరణం ‘భవిష్యత్తుకి’, సంబందించినది. పార్థు వచ్చాక, ఆ ఇంట్లో ఎన్నో సంబరాలు చోటు చేసుకోబోతున్నాయని, ఈ చరణం మనకు సూచిస్తుంది.

ఈ రకంగా కథలోని లోతులన్నిటిని ఒక పాటలోకి కూర్చి, ఆలోచనా పూరితమైన తన శైలితో చల్లగాలిలాగా గిల్లి, మన మనసులలో అనుభూతుల వానలను కురిపించి, మనల్ని మురిపించే సిరివెన్నెల గారు కూడా అలుపులేని ఒక అద్భుత భావాల మేఘపు ఝల్లే కదా!

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here