సిరివెన్నెల పాట – నా మాట – 65 – మానవులలోని పశు ప్రవృత్తిని అంతం చేయమనే పాట

2
10

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

దండాలు పెట్టేము దుర్గమ్మా

~

చిత్రం : మామగారు

సంగీతం: రాజ్-కోటి

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్.పి.బాలు

~

పాట సాహిత్యం

పల్లవి:
అతడు:
దండాలు పెట్టేము దుర్గమ్మా గండాలు దాటించు మాయమ్మా ॥2॥
దిక్కంటు మొక్కేము దుర్గమ్మా దయచూసి దీవించి మాయమ్మా
కదిలొచ్చి మా కీడు కరిగించమ్మా కనకదుర్గమ్మ కనిపించి కాపాడమ్మా ॥ దండాలు పెట్టేము॥

చరణం :
కోరస్: ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి ఓం.. ||4||
దుర్గమ్మ మాయమ్మ కాళమ్మ మాయమ్మ తల్లో తల్లీ ॥2॥

అతడు: రాకాసోల్లే రాజ్యాలేలే రాలుగాయి రోజులోయమ్మా
నలుగురి మేలు చూసేవాళ్ళే కానరాని కాలం ఓయమ్మా ॥ రాకాసోల్లే ॥
ఎక్కడన్న ఒక్కడుంటె ఆళ్ళని నువు బలికోరకమ్మా
భారమింక మొయ్యలేక భళ్ళున భూమి బద్దలౌతదమ్మా
ఈ కాళరాతిరిని శిక్షించు ఈ ఘోర కలి నుంచి రక్షించు
మాంకాళి నీ మహిమ చాటించు, మంచి మనుషుల్ని వేయ్యేళ్ళు బతికించు
॥దండాలు పెట్టేము॥

చరణం :
కోరస్ : ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి ఓం.. ||4||
దుర్గమ్మ మాయమ్మ కాళమ్మ మాయమ్మ తల్లో తల్లీ ॥2॥
అతడు :
అభము శుభము ఎరగని వాడు వెన్నపూస మనసున్నోడు
చీమకు కూడా చెడుచేయనోడు ఉపకారమే ఊపిరైనోడు
అందరికి అయినవాడు అల్లుడు ఆపదల్లో చిక్కినాడు
ఆదరించి అండ చేరు పల్లెకి ఆయువిచ్చి దయచూడు
కనికరమెరగని యములోడు కాటెయ్య‌ ఒచ్చాడు కటికోడు
కన్నెర్రచేయక కరుణించు కంటి దీపాన్ని కలకాలం వెలిగించు
॥దండాలు పెట్టేము॥

దేవీ నవరాత్రులు, శారదా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు దేశమంతా వైభవంగా జరుగుతున్నాయి. అందుకే మనం ఈ వారం, సిరివెన్నెల కలం నుండి జాలువారిన, దేవీ స్తుతులను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, ఆ తల్లి వైభవాన్ని గురించి చర్చించుకుందాం! నిజానికి ఈ నవరాత్రి ఉత్సవాలు ,సంవత్సరంలో మూడు సార్లు జరుగుతాయి. వసంత మాసంలో ‘వసంత నవరాత్రులు’, ఆషాడంలో ‘వారాహి నవరాత్రులు’, శరదృతువులో ‘దేవీ నవరాత్రులు’ జరుపుకుంటారు. ఇటీవల కాలంలో వారాహి నవరాత్రులు కూడా ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. ఈ సమయాల్లో విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ మహాశక్తిని ఉపాసించడం, ఆరాధించడం జరుగుతుంది. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే ధర్మ విరుద్ధమైన చర్యలన్నిటికీ ప్రక్షాళన కోరుతూ, ఆ విశ్వ చైతన్యాన్ని మనలోకి ఆహ్వానిస్తూ (మనలో జాగృతం చేసుకుంటూ), ఆ శక్తి స్వరూపిణి ఆరాధిస్తాము. ‘ఐం హ్రీం శ్రీం క్లీం సౌః’ – అనే ఈ ఐదు బీజాక్షరాలను శాక్తేయ ప్రణవములని పిలుస్తారు. సరియైన గురోపదేశంతో, ఈ బీజాక్షరాలను ఉపాసిస్తే, ఆ మహా శక్తి యొక్క నిరంతర చైతన్యాన్ని మనలో కూడా మేల్కొలిపి, ముక్తిని పొందగలం.

దేవి నవరాత్రులు ఎప్పుడైనా రాత్రి సమయాల్లోనే ఎందుకు నిర్వహిస్తారు? అన్న ప్రశ్నకు నేను పెద్దల నుండి పొందిన సమాధానం ఇక్కడ పొందుపరుస్తున్నాను. సంధ్య వరకు ఆ జగన్మాత, ఈశ్వరీయ శక్తిగా ఉంటుందట. అందుకే నక్షత్రాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఆ శక్తిని పూజించడం జరుగుతుంది. ఆ జగజ్జననిని ‘చంద్రమండల మధ్య’గా వర్ణిస్తారు. మన శరీరంలో సహస్రార కమలం చంద్రమండల స్థానం కాబట్టి నామోచ్చారణ ద్వారా, మంత్రాల, యంత్రాల, తంత్రాల ద్వారా, ఆ విశ్వశక్తిని రాత్రి వేళల్లో సులభంగా మన శరీరంలో జాగృతం చేయవచ్చట! మనం ఇప్పటివరకు చర్చించిన విషయాలన్నింటినీ క్రోడీకరించి, మాయాబజార్ చిత్రం కోసం ఒక సినిమా పాట ద్వారా పరమశక్తి ఘనతను మనకు అందించిన సిరివెన్నెల అక్షరాంజలి ఒకసారి గమనించండి.

పల్లవి:
జై శక్తి ఓంశక్తి జైమహాశక్తి
శ్రీంశక్తి క్లీంశక్తి జైపరాశక్తి
శిచ్ఛక్తి సద్భక్తి బ్రహ్మాండ శక్తి
సృష్టిస్థితులగతికి ఆధారశక్తి..
ఓ ఆదిశక్తి అద్వైతశక్తి
నాలోన కొలువుండి నడిపించు శక్తి
జై శక్తి ఓంశక్తి జైమహాశక్తి శ్రీం శక్తి క్లీంశక్తి జైపరాశక్తి

చరణం:
సర్వమంత్రాధార శబ్దస్వరూపిణి నిత్యసత్యమ్ములను పలికించవే సర్వయంత్రాధార ప్రజ్ఞస్వరూపిణి సత్వసంపదలెల్ల కలిగించవే
సర్వతంత్రాధార శక్తిస్వరూపిణి
చైతన్యమూర్తిగా నడిపించవే
సర్వలోకాధార మాతృస్వరూపిణి
సకలజనులకు మేలు చేయించవే..

మనలోనే కొలువుండి మనలని నడిపిస్తున్న ఆ ఆదిశక్తికి సర్వ మంత్ర, యంత్ర తంత్ర శక్తుల ద్వారా మన అభీష్టాలు నెరవేర్చమని, ఎంత చక్కటి విన్నపం చేస్తున్నారు కదా! ‘యాదేవీ సర్వ భూతేషు, శక్తి రూపేణ సంస్థితా’ ..ఎన్నో రూపాలలో, ఎన్నో నామాలతో, ఎన్నో రకాలుగా విశ్వమంతా వ్యాపించిన అనంతమైన అనంతమైన కరుణాంబురాశి, ఆ మహాశక్తి, ఆ యోగమాయ, మహామాయ.

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుడి అంశలతో మహా సరస్వతి, మహా లక్ష్మీ, మహాకాళీగా అవతరించిందని చెబుతారు. ఈ మూడు అవతారాల నుంచి మరో రెండు రూపాలు వెలువడ్డాయి. ఇలా తొమ్మిది స్వరూపిణులుగా అంటే నవదుర్గలుగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆ మూలశక్తిని, ఆదిశక్తిగా వర్ణించడంలో ఎంతో అంతరార్థం ఉంది.

‘శక్తి’ అంటే మనం విశ్వాన్ని విభజించుకున్న Matter and Energy.. లోని Energy. The Vast Omnipotent Energy is the Universal Consciousness. శక్తి రూపాలు మనకు, division and distribution of Energy కి సంకేతాలు. మన సనాతన వాఙ్మయంలో సృష్టి రహస్యాలు మొత్తం encode చేయబడ్డాయి. మనం చేయవలసినదంతా కేవలం దాన్ని decode చేసుకోవడమే! అందుకే మనకు భాష్యకారులు, ప్రవచనకారులు ‘లలితా సహస్రనామ రహస్యం’ వంటి అద్భుతమైన విశ్లేషణలను అందిస్తూ, సంకేతాలకు అర్థాన్ని తెలియజేస్తున్నారు.

వేదజ్ఞాన భాండాగారాలైన పద్దెనిమిది పురాణాల్లో మార్కండేయ పురాణం ఒకటి. అందులోని అంతర్భాగమే దేవీమహాత్మ్యం. ఇదే 700 శ్లోకాలతో శ్రీదేవీ సప్తశతిగా, చండీ సప్తశతిగా ప్రసిద్ధమైంది. ఇందులోని శ్లోకాలన్నీ మంత్రాక్షరాలే. అసలు శ్లోకాలు 578; ఋషీశ్వరులు తమ విపులీకరణలతో వాటిని ఏడువందలకు పెంచడంతో సప్తశతిగా నిర్దేశితమైంది.

మార్కండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి తొమ్మిది రూపాలను ధరించింది. ఆ రూపాలకే నవదుర్గలు అని పేరు. నేపాల్ లోని షోవా భగవతీ ఆలయంలో ఈ నవదుర్గల ప్రతిరూపాలుంటాయి. విజయ దశమినాడు అక్కడి వారు ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధిలో ‘నవదుర్గ నృత్యం’ చేస్తారు. శ్రీమహా కాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి.. ఈ మూడు రూపాల సమష్టి రూపమే శ్రీదేవి.

శ్రీదేవిని నవమూర్తి రూపంగా ధ్యానించాలని సప్తశతి చెబుతోంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధి ధాత్రి.. నవరూపాలు.

కానీ దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరీ (శతాక్షి), భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ గురించి చెప్పారు. కానీ, వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా వ్యవహరించలేదు.

కానీ, సప్తసతీ దేవతలని మరో సంప్రదాయం ఉంది. దీనిలో నందా, శతాక్షీ, శాకంబరీ, భీమా, రక్తదంతికా, దుర్గా, భ్రామరీ అనే ఏడుగురు సప్తసతుల గురించి సప్తశతీ గ్రంథంలో ఉంది దీనివల్లే ఈ గ్రంథానికి సప్తసతి అని మరో పేరు వచ్చిందంటారు.

శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం అనే పేర్లతో అయిదు విధాలైన మతాచారాలు ఒకప్పుడు అఖండభారతంలో విలసిల్లేవి. ఇందులో శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి.. ఈ అయిదుగురు దేవతలను అర్చించేవారు. పంచాయతనం అని పిలిచే ఈ పద్ధతిలో తమ ఇష్ట దైవాన్ని మధ్యలో ఉంచి మిగిలిన నలుగురు దేవతామూర్తులను చుట్టూ అమర్చి పూజిస్తారు. సౌర, గాణాపత్యాలకంటే శాక్తేయం ప్రబలంగా ఉండేది.. శాక్తేయమంటే, శక్తి రూపాలని ఆరాధించడం. ఎక్కువగా శక్తి ఆరాధన జరగడం వల్ల అనేక శక్తి రూపాలు, పీఠాలు, ఆరాధన పద్ధతులు వెలిశాయి. ధర్మ విరుద్ధమైన కోరికలు త్వరగా సంప్రాప్తించుకోవడానికి వామాచార పద్ధతులు కూడా మొదలయ్యాయి. అంతకంటే ఎక్కువగా శైవవైష్ణవ మతాలు విశేషప్రాచుర్యం పొందాయి. ఈ పంచాయతన పూజా విధానానికి స్కాందం అనే పేరుతో ఆరోదైన సుబ్రహ్మణ్య పూజా విధానాన్ని జోడించి షణ్మత స్థాపనాచార్యులయ్యారు, జగద్గురువు ఆదిశంకరులు.

స్త్రీ రూపాన్ని అత్యున్నత స్థాయిలో దైవంగా, శక్తి స్వరూపిణిగా హిందువులు కొలుస్తారు. స్త్రీలోని అత్యంత శక్తినీ, పట్టుదలను చురుకుదనాన్ని సూచించే విధంగా ‘జగన్మాత’గా ‘ఆదిశక్తి’గా ఆమెను పూజిస్తారు. ఇలా ‘శక్తి’ని పార్వతీ దేవి (లేదా సతి) రూపంలో పూజించే పీఠాలు మన భారత ఉప ఖండంలో 51 ఉన్నాయి. ఇవికాక శక్తి స్వరూపిణిగా వివిధ పేర్లతో దేవతల్ని మన దేశంలో గ్రామ గ్రామానా పూజిస్తారు.

పల్లెలూ, గ్రామాలూ, ఊర్లూ, పట్టణాలూ ఒక్కో ప్రదేశానికీ ఒక్కో రూపంలో పూజింపబడే అమ్మవార్ల నామాలు కోకొల్లలు. వాటిలో కొన్ని – విజయవాడ కనకదుర్గ, కంచి కామాక్షీ, మధుర మీనాక్షి, ముంబాయిలోని మాంబాదేవి, కలకత్తా కాళీ, మైసూరు చాముండి, మూగాంబికా, వైష్ణవీమాత, కాశీ విశాలాక్షీ, శ్రీశైలం భ్రమరాంబ మొదలైన అమ్మవార్లు. గ్రామదేవతలైన పోలేరమ్మ, ఎల్లమ్మ, పైడితల్లి, మైసమ్మ, బతుకమ్మ, రేణుకా, కాకతమ్మా, మాహురమ్మా, శ్రీనాధుని రచనలలో వర్ణింపబడిన మూలగూరమ్మ, పిఠాపురం పీటలమ్మ, సామర్లకోట చామలమ్మ, దాక్షారామం మాణిక్యాలమ్మ లాంటి రూపాలు మరికొన్ని..

మహామాత, మహాదేవి అయినటువంటి ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండమంతా వ్యాపించివుంది. అయితే లోక రక్షణకు, భక్తుల కోరిక మేరకు, రాక్షస సంహారానికీ, లోకోద్ధరణకు ಆమె ఎన్నో రూపాలలో అవతరించి, ఎన్నో లీలలనూ ప్రదర్శించింది..

వాటిల్లో ప్రముఖమైనవి శ్రీ దేవి యొక్క ‘దశమహావిద్యలు’. తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది.

1) కాళీ 2) తార 3) షోడశి 4) భువనేశ్వరి 5) భైరవి 6) ఛిన్నమస్త 7) ధూమవతి 8) భగళాముఖి 9) మాతంగి 10) కమలాత్మిక.

కొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల యొక్క వర్ణన ఉన్నది. ఇవే ఆ కాళీ మాత యొక్క ఎనమిది రూపాలు.. సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి కాళీమాత అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరించింది. అందుకే కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి.

1.దక్షిణ కాళిక. 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8. మహాకాళిక.

పోతనమాత్యుడు కూడా, దుర్గమ్మను, ఆమె శక్తిని, వైభవాన్ని వేనోళ్ళ కొనియాడాడు, తేట తెలుగులో. కానీ ‘శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి’, శ్రీ మాత్రే నమః వంటి ఘనమైన నామావళిని, ఓంఐంహ్రీంశ్రీంక్లీంసౌః’ వంటి బీజాక్షరాలను, ఎంతో ఘనమైన అంతరార్థాన్ని, ఇందులో నిక్షిప్తం చేశారని, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో తెలియజేశారు.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ.. అంటూ మొదలుపెట్టి, అమ్మకు నీరాజనాలు అర్పించారు. అమ్మా! అని పిలిస్తే, మనసారా తలిస్తే, కొలిస్తే అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ‘శ్రీమాతా’ అంటూ అమ్మదనముతో ప్రారంభమవుతుంది.

సిరివెన్నెల గారు అందించిన మరికొన్ని అద్భుతమైన, దేవి స్తుతులు ఇప్పుడు చూద్దాం.

స్వాతి కిరణం.. చిత్రం కోసం..

శివానీ.. భవానీ.. శర్వాణీ, గిరినందిని శివరంజని భవభంజని జనని

శతవిధాల శ్రుతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ..

అన్న పాట ద్వారా, అగ్నికీలల వంటి తేజముతో, భక్తులనుభయోత్పాతం నుండి బయటపడవేసి, దుష్టశక్తుల సంహారంతో భయాన్ని పోగొట్టే అభయదాత, అని ఆదిశక్తిని వేనోళ్ల కొనియాడారు సిరివెన్నెల.

స్వాతికిరణం చిత్రంలోనే..

ఆలోచనామృతము సాహిత్యము.. సహితహిత సత్యము.. అన్న సారాంశంతో వాగ్దేవిపై సిరివెన్నెల కలం సాహిత్యమృతాన్ని ఒలికించింది.

పల్లవి:

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే, సత్యార్ధ చంద్రికే, మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే..

శృతిలయలు చిత్రం కోసం, తన గానమే నీరాజనంగా, తన ప్రాణమే నివేదనగా, తన గళ పీఠమే రత్న సింహాసనంగా, సరిగమల స్వరసలిల సంప్రోక్షణను.. బ్రహ్మాణికి అర్పించుకున్న సిరివెన్నెల.

శ్రీ శారదాంబా నమోస్తుతే.. శ్రీ శారదాంబా నమోస్తుతే.. సంగీత సాహిత్య మూలాకృతే.. శ్రీ శారదాంబా నమోస్తుతే.. సంగీత సాహిత్య మూలాకృతే.. శ్రీ శారదాంబా నమోస్తుతే..

శ్యామ్ సింగరాయ్.. చిత్రంలో..

ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి

కమలాలయ శ్రీదేవీ కురిపించవే కరుణాంబురాశి..

అంటూ, నీ దయను నామీద ప్రసరింప చేయవమ్మా.. అనే ప్రార్థనతో ఆదిశక్తిని మనసారా వేడుకున్నారు సిరివెన్నెల.

శుభమస్తు చిత్రంలో.. సరస్వతీ దేవికి స్వరార్చన.

వారిజ భవురాణి వాణి, వారిజ భవురాణి వాణి వర వీణాంచిత మృదుపాణి వర వీణాంచిత మృదుపాణి

హంసవాహన అంబుజనయన హంసవాహన అంబుజనయన

అందుకొనుము ఈ గీతాంజలిని వారి భవురాణి వాణి ||2||

అల్లరి మొగుడు చిత్రంలో.. శారదా మాతకు స్వరార్చన..

నా పాట పంచామృతం.. నా పాట పంచామృతం

నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ@2

గళము కొలను కాగా, ప్రతి పాట పద్మమేగా పదము వెల్లివిరిసి రాదా విదిసతి పాదాపీఠి కాగా శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై

ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం గగనము వెలువగ గమకగతులు సాగా

పశువుల శిశువుల పణుల శిరసులూగా.. ॥ నా పాట పంచామృతం ॥

~

మామగారు చిత్రంలో, సత్తెయ్య పాత్రలో నటించారు దాసరి నారాయణరావుగారు. సత్తెయ్య అనుకొని పొరబడి, అతని అల్లుడైన విజయ్ పై హత్యాయత్నం చేస్తాడు పోతురాజు. విజయ్ కోలుకోవాలని సత్తెయ్య గుడిలో దీక్షను పూనే సందర్భంలో వచ్చే పాట ఇది.

దండాలు పెట్టేము దుర్గమ్మా గండాలు దాటించు మాయమ్మా ॥2॥
దిక్కంటు మొక్కేము దుర్గమ్మా దయచూసి దీవించి మాయమ్మా
కదిలొచ్చి మా కీడు కరిగించమ్మా కనకదుర్గమ్మ కనిపించి కాపాడమ్మా ॥దండాలు పెట్టేము॥

ఒక దుర్గం లాగా మనల్ని కాపాడుతుంది కాబట్టే పరాశక్తికి ‘దుర్గా’ అనే నామం ఒకటిగా స్థిరపడింది. ‘దుర్’ అంతే కష్టం, ‘గ’ అంటే దాటించేది అని కూడా మరొక అర్థం. దుర్గాదేవిని అపరాజితా దేవి, అని కూడా వ్యవహరిస్తారు. అంటే ఆమె ఓటమిని ఎరుగని తల్లి.

The first, most powerful and undefeatable, mother figured, extremely powerful Goddess of Energy గా ఈ ఆదిపరాశక్తిని, ఆంగ్లంలో నిర్వచించుకోవచ్చు.

అమ్మని దిక్కుగా మొక్కేవారెవరికైనా, అన్ని గండాలను గట్టెక్కిస్తుంది కాబట్టి, మనసారా అమ్మవారిని గండాలు దాటించమని కోరుకుంటున్నాడు సత్తెయ్య.

చరణం:
కోరస్: ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి ఓం.. ||4||
దుర్గమ్మ మాయమ్మ కాళమ్మ మాయమ్మ తల్లో తల్లీ ॥2॥

అతడు: రాకాసోల్లే రాజ్యాలేలే రాలుగాయి రోజులోయమ్మా
నలుగురి మేలు చూసేవాళ్ళే కానరాని కాలం ఓయమ్మా ॥ రాకాసోల్లే ॥
ఎక్కడన్న ఒక్కడుంటె ఆళ్ళని నువు బలికోరకమ్మా
భారమింక మొయ్యలేక భళ్ళున భూమి బద్దలౌతదమ్మా
ఈ కాళరాతిరిని శిక్షించు ఈ ఘోర కలి నుంచి రక్షించు
మాంకాళి నీ మహిమ చాటించు, మంచి మనుషుల్ని వేయ్యేళ్ళు బతికించు
॥దండాలు పెట్టేము॥

అలతి పదాలతోనే సాగే ఈ చరణంలో మంచితనం, మానవత్వం కరువైపోతున్న ఈ కాలంలో, అక్కడో ఇక్కడో ఒక మంచి వాడు కనిపిస్తే.. అటువంటి వారిని బలి తీసుకోకమ్మా!

అలా చేస్తే పాప భారం పెరిగిపోయి, ఈ భూమి బద్దలు అయిపోతుందమ్మా! అందుకే నీ మహిమ చూపి, మంచితనాన్ని, మంచి వాళ్లను నువ్వే కాపాడమ్మా! మహిషాసురుడిని మర్థించినట్టుగా మానవులలోని పశు ప్రవృత్తిని అంతం చేయవమ్మా!, అని విన్నవిస్తున్నారు సిరివెన్నెల.

చరణం:
కోరస్: ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి ఓం.. ||4||
దుర్గమ్మ మాయమ్మ కాళమ్మ మాయమ్మ తల్లో తల్లీ ॥2॥
అతడు:
అభము శుభము ఎరగని వాడు వెన్నపూస మనసున్నోడు
చీమకు కూడా చెడుచేయనోడు ఉపకారమే ఊపిరైనోడు
అందరికి అయినవాడు అల్లుడు ఆపదల్లో చిక్కినాడు
ఆదరించి అండ చేరు పల్లెకి ఆయువిచ్చి దయచూడు
కనికరమెరగని యములోడు కాటెయ్య‌ ఒచ్చాడు కటికోడు
కన్నెర్రచేయక కరుణించు కంటి దీపాన్ని కలకాలం వెలిగించు
॥దండాలు పెట్టేము॥

రెండవ చరణంలో, మనసున్న వాడు, ఆపదలో అందరికీ తోడుండేవాడు అయిన తన అల్లుడి ప్రాణాలు అపాయంలో ఉన్నాయనీ, కఠినమైన మనసుగల యముడు ఆయన ప్రాణాలేమన్నా హరిస్తాడేమో అని, నువ్వు కూడా కన్నెర్ర చేయకుండా, కరుణించి అల్లుడి ప్రాణాలు కాపాడి.. మా ఇంటి దీపాన్ని నిలబెట్టావమ్మా! అని ఆర్తితో, అమ్మ మనసు కరిగేలాగా, తన మొరను వినిపిస్తున్నారు,‌ సిరివెన్నెల.

అటు కుటుంబ నేపథ్యం వలన, ఇటు సహజమైన దైవభక్తి వలన, మరోవైపు, సద్గురు శ్రీ శివానందమూర్తిగారి శిష్యులుగానూ, సిరివెన్నెల ఒక ఆత్మ జ్ఞానిగా ఎదిగారు. భారతీయతను, సంస్కృతీ సంప్రదాయాలను, పురాణేతిహాసాలను, భారతీయ సంస్కృతికి సంబంధించిన దేవతారాధనను, సంపూర్ణంగా పాటించే సిరివెన్నెల గారి కలం నుండి ఎన్నో భక్తి సుమాలు జాలువారాయి. అందుకే ఆ పాటల్లో అనుభవైక వేద్యమైన నైవేద్యం ఉంటుంది. అందుకే అవి మనకు భక్తి రసామృత పానాన్ని చేయిస్తాయి.

శారదా దేవి స్తన్యామృతాన్ని గ్రోలి, ఈ భూమిపై ఒక కవిగా జన్మ నెత్తి, ఆ సాహిత్యామృతాన్ని మనందరికీ పంచి, జన్మ చరితార్థం చేసుకున్నారు సిరివెన్నెల. ఆ శారదా పుత్రునికి ఇదే నా హృదయాంజలి.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here