సిరివెన్నెల పాట – నా మాట – 67 – భావావేశపు లోతులకు తీసుకువెళ్ళే పాట

2
12

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఒక Life ఒకటంటే ఒకటే Life

~

చిత్రం: ఊపిరి

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: గోపి సుందర్

గానం: కార్తీక్

~

పాట సాహిత్యం

పల్లవి:
ఒక Life, ఒకటంటే ఒకటే Life ॥ 2 ॥
ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే, వేరే అవకాశం రాదే
ఇది ఇంతే అనుకుంటే వందేళ్ళు నేడే జీవించే వీలుందే

చరణం:
ఏం ఏం లేదని? మనం చూడాలి గానీ,
ఊపిరి లేదా ఊహల్లేవా నీకోసం నువ్వే లేవా? చీకటికి రంగులేసే కలలెన్నో నీ తోడై వస్తుండగా ఒంటరిగా లేవని ఆశక్కూడా ఆశని కలిగించేయ్! ఆయువు అనేదుండే వరకు ఇంకేదో లేదని అనకు ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదే నీకు!

It was beautiful as long as it lasted, the journey of my life.
I have no regrets whatsoever save the pain I’ll leave behind..

అనేది విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘Farewell my Friends’ అనే కవిత ద్వారా జీవితానికిచ్చిన నిర్వచనం.

‘నా జీవితం కొనసాగినంతవరకు.. అది మధురమైనదే.. దాని వెనుక ఎటువంటి బాధలు దాగి ఉన్నా.. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’.. అంటారు ఠాగూర్.

ఇంత విలువైన జీవితం గురించి, ఎంత మాట్లాడుకున్నా తక్కువే! కొండలు ఉన్న తర్వాత లోయలు ఉండడం ఎంత సాధారణమో, కష్టసుఖాలు ఒకదాని తర్వాత ఒకటి అనుసరించడం కూడా అంతే సాధారణం! నిజం చెప్పాలంటే, ప్రతి కష్టం ఒక మనిషిని పదును పెడుతుంది. ప్రతి నష్టం జీవితాన్ని ఎదుర్కోవడానికి మరింత శక్తిని ఇస్తుంది.. గుండెల్లో బాధలు నింపిన సరే! వ్యథల సుడులు తిప్పిన సరే! ఈ కఠోర సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు.. Every problem is an opportunity.. అనే విషయాన్ని ప్రతివారు అంగీకరిస్తారు. ఈ సత్యాన్ని నిరూపించే ఎన్నో ఉపమానాలు ప్రపంచవ్యాప్తంగా మనకు దర్శనమిస్తాయి. మన జీవితంతో పోరాడే శక్తిని పెంచడానికి మనకు ప్రేరణగా నిలుస్తాయి. ఆ విధంగా విధినెదిరించిన వీరులెందరో, ప్రపంచ మానవాళికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. వారిలో మచ్చుకు కొందరు..

తన బాల్యంలోనే చూపును, వినికిడిని, మాటను కోల్పోయినప్పటికీ, హెలెన్ కెల్లర్ గొప్ప రచయిత్రిగా, స్ఫూర్తిదాయక ఉపన్యాసకురాలిగా 35 దేశాలలో ప్రసంగించడమేకాక రాజకీయ, సామాజిక కార్యకర్తగా ఎన్నో జీవితాలకు అండగా నిలిచారు.

Frida Kahlo అనే మెక్సికన్ పెయింటర్, తన విస్పష్టమైన, భావోద్వేగాలకు అద్దంపట్టే చిత్రీకరణలకు ప్రసిద్ధి చెందింది. బస్సు ప్రమాదం కారణంగా దీర్ఘకాలిక నొప్పితో సహా జీవితకాల ఆరోగ్య సమస్యలను భరిస్తూ కూడా ఆమె ఈ అద్భుతాలు సాధించింది.

తన వినికిడి శక్తిని కోల్పోయిన తర్వాత కూడా Ludwig Van Beethoven, అసాధారణ సంగీతాన్ని సృష్టించగలిగిన ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తగా చరిత్రలో నిలిచారు.

ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీవెన్ హాకింగ్, ALS అనే అరుదైన వ్యాధితో, శరీరంలోని ప్రతి అవయవము నిర్వీర్యం అయిపోయినా, విశ్వోద్భవ శాస్త్రానికి సంబంధించిన అన్వేషణలతో కూడిన (A brief History of Time, Black Hole.) మొదలైన 30కి పైగా అద్భుత పరిశోధనాత్మక రచనలను ప్రపంచానికి అందించారు.

వీరందరి జీవితాలు అంగవైకల్యం కలిగిన వారిని కానీ, ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారి జీవితాలలో కానీ ఎంతో ప్రేరణ శక్తిని నింపి, బలహీనతలను ఎదిరించే ధైర్యాన్ని అందించి, తరతరాలకు ఆదర్శంగా, ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి శాస్త్ర చికిత్స చేసిన కార్డియాక్ సర్జన్ ‘క్రిస్టియన్ బర్నాడ్’ అనుభవం కూడా జీవితంపై మన దృక్పథాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కేప్‌టౌన్‌లోని రెడ్ క్రాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జరిగిన సంఘటనను వివరిస్తూ ఆయన వ్రాసిన “ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్” అనేది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రచన. ఈ కథ ఒక ఆసుపత్రిలో ఫుడ్ ట్రాలీని నడుపుతున్న ఇద్దరు ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న పిల్లలకు సంబంధించిన ఈ సంఘటన జీవితంపై డాక్టర్ బర్నార్డ్ యొక్క దృక్పథాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది.

ఫుడ్ ట్రాలీని నడుపుతూ.. డ్రైవర్, మెకానిక్ అనుభూతి పొందుతూ.. ఆస్పత్రి అంతా ఉల్లాసంగా తిరుగుతూ.. ఆశావహంగా, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్న ఆ ఇద్దరు పిల్లలలో – చేతి ఎముకలో ప్రాణాంతకమైన కణితి వల్ల ఒక చేయి తొలగించబడినవాడు ఒకడు, అగ్నిప్రమాదంలో రెండు కళ్లను కోల్పోయి అంధుడైన బాలుడు ఇంకొకడు.

బాధను అనుభవించకుండా జీవితాన్ని ఆస్వాదించలేమని, ఆ బాధ మనిషిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని డాక్టర్ బర్నార్డ్ గ్రహించాడు.  ఈ ఇద్దరు పిల్లలు డా॥ బర్నార్డ్‌కి ఒక లోతైన జీవిత పాఠాన్ని నేర్పించారు, జీవించడం అనేది సజీవంగా ఉన్నందుకు సంబరాలు చేసుకోవడంలో ఉందనీ, కేవలం ఆనందం, వినోదం, ఆకర్షణల కోసం మాత్రమే కాదనీ, జీవించి ఉండడమే అన్నిటికన్నా గొప్ప వరమనీ,  ఆ పిల్లలు ఆయనకు స్పష్టం చేశారు. వ్యథాభరిత జీవితాలు ఎన్నో, కళాకారులుగా, రచయితలుగా, రాజకీయ నాయకులుగా, సిద్ధాంతలుగా, వేదాంతులుగా, రూపొంది ఉన్నతోన్నత శిఖరాలను చేరుకొన్న సంఘటనలు మనందరికీ తెలియనివి కావు.

‘Intimations of Immortality’ అనే William Wordsworth poem ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది.

What though the radiance
which was once so bright
Be now forever taken from my sight,
Though nothing can
bring back the hour Of splendour
in the grass of glory in the flower;
We will grieve not, rather find..
Strength in what remains behind.

మనకు దూరమైనది, ఎంత వైభవోపేతమైన, అంశమైనా సరే.. అలాంటి వైభవాన్ని ఏ శక్తి వెనక్కి తీసుకు రాలేకపోయినా సరే.. దాని గురించి మనం వేదన చెందకుండా.. మన దగ్గర ఏదైతే మిగిలిందో, దాన్నే శక్తిగా గుర్తించి మలుచుకోవాలని వర్డ్స్‌వర్త్ మానవజాతికి మరపురాని సందేశాన్ని అందించారు.

ఈ ఉపోద్ఘాతాన్ని మీతో పంచుకోవడానికి కారణం, మనం ఈ రోజు విశ్లేషించుకుంటున్న ‘ఊపిరి’ చిత్రంలోని పాట, ఇంకా ఆ కథా నేపథ్యం.

ఫ్రెంచ్ మూవీ ‘The Intouchables’ సినిమాకు అధికారిక రీమేకింగ్ చిత్రంగా రూపొందిన ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున సినిమా మొత్తం wheel chair కే పరిమితమయ్యే విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తాడు. విక్రమాదిత్య.. ఎన్నో వ్యాపారాలు ఉన్న ఓ భారీ పారిశ్రామికవేత్త.. పారిస్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో మెడ కింద నుంచి శరీరమంతా పనిచేయకుండా పోతుంది. దీంతో ప్రతి పనికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. తనకు తోడుగా ఫ్రెండ్ ప్రసాద్ (ప్రకాష్ రాజ్), సెక్రటరీ కీర్తి ఉన్నా ఇంకా ఏదో మిస్ అవుతుంటాడు విక్రమాదిత్య. అలాంటి సమయంలో తనను ప్రేమగా చూసుకునే వ్యక్తి కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాడు. అనుకోకుండా అక్కడకు వచ్చిన శీను (కార్తీక్) దృక్పథం నచ్చి అతన్నే తన కేర్‌టేకర్‌గా తీసుకుంటాడు. ఏదైనా బలహీనతతో బాధపడుతున్న వ్యక్తికి కావలసినవి జాలి, దయ కాదనీ, మానసిక దృఢత్వాన్ని పెంచే సానుకూల దృక్పథమేననీ, ఈ చిత్రం నిరూపిస్తుంది.

తన ప్రతి రచనలోనూ సానుకూల దృక్పథాన్ని, మానసిక దృఢత్వాన్ని ఏరులై పారించే సిరివెన్నెల గారు Positive attitude of life ని ప్రతిబింబించే ఇలాంటి చిత్రాలకు ఎలాంటి పాటలను వ్రాస్తారో.. మనం వివరించాల్సిన అవసరమే లేదు. ఆ చిత్రంలోని రెండు motivational songs లో ఒక దాన్ని ఈరోజు చర్చించుకుందాం. ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే ఉన్న ఈ పాటలో భావవేశపు లోతులకు, విషయ గాంభీర్యానికి ఎల్లలే లేవు.

పల్లవి:
ఒక Life ఒకటంటే ఒకటే Life ॥ 2 ॥
ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే, వేరే అవకాశం రాదే
ఇది ఇంతే అనుకుంటే వందేళ్ళు నేడే జీవించే వీలుందే

మనిషికి ఎప్పటికైనా పోగొట్టుకున్న దాని విలువ అర్థమైనట్టు, పొందిన దాని విలువ అర్థమే కాదు!

The life that I have, Is all that I have అంటారు Leo Marks. అందుకే, attitude of gratitude అలవర్చుకుంటే ప్రతివారికి జీవితం విలువ మరింత సుస్పష్టంగా అర్థమవుతుంది.

మనకున్నది ఒకే ఒక జీవితం! మనకు అందిందే జీవితం! ఇంకెప్పుడో మంచి కాలం వస్తుందని, ఇంకేదో జరుగుతుందనీ ఊహల్లో తేలిపోతూ.. కాలాన్ని కరిగించుకుంటే.. చేతిలో ఉన్న అవకాశం తెలియకుండానే జారిపోతుంది.. వందేళ్ళ జీవితం ఒక్క క్షణంలో ఏమారిపోతుంది! జీవితం మన ముందుకి ఎలా వచ్చిందో అలా జీవించేద్దాం! అని నిర్ణయించుకున్న క్షణం, ఒక్క నిమిషమైనా.. వందేళ్ళ జీవితమంత అనుభూతిని మిగిలిస్తుందన్నది, సిరివెన్నెల గారు పల్లవిలో అందించిన సారాంశం.

చరణం:
ఏం ఏం లేదని? మనం చూడాలి గానీ,
ఊపిరి లేదా ఊహల్లేవా నీకోసం నువ్వే లేవా? చీకటికి రంగులేసే కలలెన్నో నీ తోడై వస్తుండగా
ఒంటరిగా లేవని ఆశక్కూడా ఆశని కలిగించేయ్!
ఆయువు అనేదుండే వరకు ఇంకేదో లేదని అనకు
ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదే నీకు!

ఏ మనిషిని కదిపినా, complaint box లాగా, నాకు ఇవి లేవు, అవి లేవు అంటూ.. చిత్రగుప్తుడి చిట్టా విప్పుతుంటారు! అందుకే సిరివెన్నెల చాలా ఘాటుగా.. లేవు, లేవని నిత్యం వాపోయే వారందరికీ ఘాటైన ప్రశ్నలు సంధించి, నీ దగ్గర ఏం లేదని, మీరు ఇంత వ్యథ చెందుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. జీవించడానికి పనికి వచ్చే ఊపిరి, మీ దగ్గర లేదా? జీవితం పై ఆశలు చిగురింపజేసే ఊహలు మీకు లేవా? అసలు నాకెవరూ లేరు, అన్న ప్రశ్న నీకు ఎందుకు? నీకోసం నువ్వు లేవా?

ఎంత కష్టంలో ఉన్నా, నీ బ్రతుకంతా చిమ్మ చీకటి నిండి ఉన్నా, ఆ చీకటికి కూడా రంగులు వేయగల కలలు నీ వెంటే తోడై ఉన్నాయి కదా? ఒంటరిగా ఉన్నానన్న దిగులు నీకెందుకు? అని ప్రశ్నిస్తూ.. తనదైన శైలిలో అత్యంత ప్రేరణాత్మకంగా, ‘ఆశకు కూడా ఆశను కలిగించమ’ని మనకు ఒక సూచన చేస్తున్నారు సిరివెన్నెల. అసలు.. ఆ positivity ఏంటి, ఆ expression ఏంటి? పూర్తిగా సినిమా టైటిల్‌ని జస్టిఫై చేసే వాక్యం, ఆయువు అనేదుండే వరకు ఇంకేదో లేదని అనకు! ఇంతకంటే గట్టిగా, లోతుగా, బలంగా, చెవి మెలేసి పాటల ద్వారా పాఠాలు చెప్పే గురువు మనకు కనిపిస్తారా! ఒక్కో క్షణము ఈ బ్రతుకు కొత్తదే నీకు! Every minute is a bringer of new things.. నిస్సందేహంగా!

నీ జీవితం ఎలా గడుపుతున్నావు అన్నది, నీలో కానీ, నీ చుట్టూ కానీ ఉన్న మనుషుల పైనా, నీ దగ్గర ఉన్న resources పైనా ఆధారపడదు! అది కేవలం నీ దృక్పథం మీదే ఆధారపడి ఉంటుంది! యద్భావం తద్భవతి, అన్నట్టు జీవితాన్ని నువ్వు చూసే కోణం వల్లనే, నీ జీవితం ఆనందమయమో, దుఃఖమయమో తేలిపోతుంది. ‘నా పరిస్థితులు బాగా లేవు, మనుషులు బాగాలేరు, అందుకే నా జీవితం ఇలా ఉంది’, అని ఎవరు భావించకూడదు. జీవితం మారాలంటే ముందుగా నీవు మారాలి. ప్రపంచాన్ని మనం మార్చే అంత గొప్ప చేయడానికి ముందు, మనల్ని మనం మార్చుకోవాలి. ప్రపంచం మారడం అంటే మనల్ని మనం మార్చుకోవడమే! మన దృక్పథం పాజిటివ్‌గా మారిన రోజు, జీవితం అత్యద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తుంది.. మధురమైన అనుభూతుల్ని కురిపిస్తుంది.. అందుకే జయహో సిరివెన్నెల!! జయ జయహో.. జీవితం!!

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here