సిరివెన్నెల పాట – నా మాట – 7 – మధురమైన స్నేహ భావన

0
7

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట

~

చిత్రం: నీ స్నేహం

సంగీతం: ఆర్. పి. పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: ఆర్. పి. పట్నాయక్ & రాజేష్

~

సాహిత్యం

కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వలి
స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి ||కొంతకాలం కిందట||
~
బొమ్మ బొరుసులేని నాణానికి విలువుంటుందా
మన ఇద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడులేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కల చెరగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం ||కొంతకాలం కిందట||
~
వివరిస్తున్నది అద్దం.. మన అనుబంధానికి అర్థం
నువు నాలాగా నేను నీలాగా కనిపించటమే సత్యం
నువు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం ||కొంతకాలం కిందట||

ఎవరికైనా అంతిమ లక్ష్యం ఏముంటుంది? ఆనందం, సంతోషం, సుఖం, తృప్తి. అవన్నీ పొందడానికి ఎన్ని దారులున్నా, వాటిలో స్నేహం మాత్రం తప్పకుండా ఉంటుంది. అన్ని బంధాలలోకి, స్నేహబంధం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. సృష్టిలో అంత తీయదనం స్నేహానికి మాత్రమే ఉంది. అనాథలైనా, ఎవరితో ఒకరితో స్నేహం కలుపుకొని తన బ్రతుకు బండిని లాగించేస్తున్నారంటే.. ఆ స్నేహానికి ఉన్న బలం ఏంటో మనకు అర్థం అవుతుంది. కృష్ణుడు కుచేలుడినీ, కర్ణుడు దుర్యోధనుడినీ, సుగ్రీవుడు శ్రీరాముడిని, గెలిపించడానికి ఎలా ప్రయత్నించారో గమనిస్తే చెలిమిలోని బలం మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే స్నేహితులు మనకు ఆప్తులు, ఆత్మీయులు. మన స్నేహితుల గెలుపే మన గెలుపు లాగా ఆనందాలు కురిపిస్తుంది. ఏమీ లేకపోయినా పర్వాలేదు.. నిజమైన స్నేహితులు ఒక్కరు ఉంటే చాలు! అనిపిస్తుంది. అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ప్రపంచ సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన కవితలు, గేయాలు పుట్టుకొచ్చాయి. స్నేహానికి సంబంధించిన కొన్ని మంచి నిర్వచనాలని ఒకసారి పరిశీలిద్దాం.

~

1975లో షోలే చిత్రంలో, హత్తుకునే లాగా స్నేహాన్ని నిర్వచించిన గీతం, Friendship Dayకి ఒకప్పుడు, ఇప్పటికి కూడా.. Icon లాగా మారిన గీతం..

ఏ.. దోస్‌తీ హమ్ నహీ తోడేంగే..
తోడేంగే.. దమ్ మగర్, తేర సాథ్ నా ఛోడేంగే..

– ఆనంద్ బక్షి.‌ (చిత్రం షోలే)

ఈ గీతాన్ని ఆనంద్ బక్షిగారు వ్రాయగా, కిషోర్ కుమార్, మన్నాడే ఆలపించారు. నీ గెలుపే నా గెలుపు, నీ ఓటమే నా ఓటమి, నీ బాధే నా బాధ, నీ శ్వాసే నా శ్వాస.. అంటూ స్నేహితులిద్దరూ పాడుకుంటూ.. జీవితమంతా కలిసిమెలిసే ఉంటామని, ఊపిరైనా వదిలేస్తాం కానీ స్నేహాన్ని వదలమని, తెలిపే ఆ సూపర్ హిట్ పాటలో ఎంతో భావోద్వేగంతో స్నేహ బంధాన్ని నిర్వచించారు ఆనంద్ బక్షిగారు.

Friends we do remain,
Things changing, and things staying the same.
To each other we still listen and share, About each other, we will always care.. అని స్నేహానికి ఓ ఆంగ్ల కవి నిర్వచనం.

~

True Friends అనే కవితలో Emily ఇలా అంటుంది..
Best friends stick together till the end. They are like a straight line that will not bend.
They trust each other forever, No matter if you’re apart or together.
They can be your hero and save the day. They will never leave your side; they are here to stay.
They help you up when you fall.
Your true friends are best of all.

~

స్నేహబంధము ఎంతమధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము..@2
……………….
ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో @2
ఒకటే దొరుకుతుంది జీవితంలో.. @2
అది ఓడిపోదు.. వాడిపోదు.. కష్టసుఖాల్లో.. -ఆచార్య ఆత్రేయ( చిత్రం: స్నేహబంధం)

~

మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట
నీ బ్రతుకంతా కావాలి పూలబాట..
…………
హృదయమనేది ఆలయము
స్నేహము దేవుని ప్రతిరూపము
కులమేదైనా మతమేదైనా
దానికి లేదు ఏ భేదము…
-డాక్టర్ సి నారాయణ రెడ్డి.. (చిత్రం: మట్టిలో మాణిక్యం)

~

“అల్లాయే దిగివచ్చి.. ఆయ్ మియా.. ఏమి కావాలంటే, మిద్దెలొద్దు, మేడలొద్దు, పెద్దలెక్కే గద్దెలోద్దంటాను, ఉన్న నాడు, లేని నాడు ఓకే ప్రాణమై నిలిచే, ఒక్క తోడే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను..” అన్న వచనం తర్వాత పాట ప్రారంభమవుతుంది.. ఇలా..
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం..
స్నేహమేనాకున్నది స్నేహమేరా పెన్నిధి..
-డాక్టర్ సి. నారాయణరెడ్డి
(చిత్రం: నిప్పులాంటిమనిషి)..

~

స్నేహానికన్న మిన్న, లోకాన లేదురా@2
కడ దాక నీడ లాగ , నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది , నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా..
……..
త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం..
ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది, నిర్మలమైనది స్నేహమురా
ధ్రువతారలా స్థిరమైనది, ఈ జగతిలో విలువైనది.. ఈ స్నేహమొకటేనురా..
-భువనచంద్ర.. (చిత్రం: ప్రాణ స్నేహితులు)

~

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
కోపమెక్కువ కానీ మనసు మక్కువ
స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ ||మీసమున్న||
……………
ఒక్కతల్లి సంతానమైన మనలాగ వుండగలరా
ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా
నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రినైనా
ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా
ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను
నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా
నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా..
-సిరివెన్నెల సీతారామశాస్త్రి (చిత్రం: స్నేహం కోసం)..

~

వాహ్!!! చెలిమి రుణం తీర్చుకోవటం కోసం, మరో జన్మ కోరుకోవడం!! ఇంతకన్నా గొప్పగా స్నేహ బంధాన్ని వివరించగలమా?? అనిపిస్తుంది.

~

Friends (They) will be there to share the laughter
Do not forget your friends at all
For they pick you up when you fall
Do not expect to just take and hold
Give friendship back, it is pure gold.
—Gillian Jones

~

స్నేహానికి కేవలం ఒకరిస్తే పుచ్చుకోవడం కాదు, అదే ప్రేమను తిరిగి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి.. ఎందుకంటే ఆ ప్రేమ స్వచ్ఛమైన బంగారం లాంటిది కాబట్టి..

ఇన్ని సాహిత్యాలలోని ఒకే తత్వం, స్నేహమంటే ఏకత్వం. ఇక పాట విశ్లేషణ లోకి వెళ్తే, ఇద్దరు స్నేహితులు పాడుకునే ఈ పాటను సిరివెన్నెల వచన రూపంలోనే, అలతి అలతి పదాలతో వ్రాశారు. పదాలు తేలికగానే అనిపించినా, భావగాంభీర్యం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక కథ చెబుతున్నట్టు, కొంతకాలం కిందట, రెండు ఆత్మలు కలసి బ్రహ్మ దగ్గర వరం కోరుకున్నాయట.. రూపాలు రెండుగా ఉన్నా, ఊపిరి ఒకటిగానే బతకాలని వేడుకున్నాయట.. అంటూ.. పాట సాగుతుంది. ఈ పాటను స్వీయ సంగీత నిర్వహణలో ఆర్. పి. పట్నాయక్, రాజేష్‌తో కలిపి పాడగా ఇద్దరు కథానాయకుల మీద చిత్రీకరించారు.

కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వలి
స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి ||కొంతకాలం కిందట||

ఒకే ఊపిరితో అలా కలిసి జీవించే వరాన్ని స్నేహం అంటున్నామని, వారిద్దరూ స్నేహాన్ని కాపాడే జంట కనురెప్పల వంటి వారని, వారే స్నేహానికి నిర్వచనమనీ ఆనందంగా పాడుకుంటూ వుంటారు.

బొమ్మ బొరుసులేని నాణానికి విలువుంటుందా
మన ఇద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడులేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కల చెరగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం ||కొంతకాలం కిందట||

నాణానికి బొమ్మా, బొరుసులాగా, గగనానికి సూర్యచంద్రుల్లాగా, తమ కళ్ళలో కొలువున్న స్నేహం కూడా విలువైనదనీ, కలలో కూడా చెరిగిపోని చిరునవ్వులాగా, మధురమైన పాట లాగా జీవితం సాగాలని కోరుకుంటారు.

వివరిస్తున్నది అద్దం.. మన అనుబంధానికి అర్థం
నువు నాలాగా నేనీలాగా కనిపించటమే సత్యం
నువు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం ||కొంతకాలం కిందట||

ఇక రెండవ చరణంలో సిరివెన్నెల గారి ముద్ర ఈ పాటలో మనకు బాగా కనిపిస్తుంది. అద్దంలో ప్రతిబింబంలాగా వీరిద్దరూ ఒకటేననీ, తన స్నేహితుడి స్వప్నమే తనకు గమ్యమనీ, తనను గెలిపించడమే అతని ధ్యేయమని, గెలుపుకు రెండు పాదాల లాగా తమ స్నేహం పరుగులు తీయాలనే మధురమైన స్నేహ భావన కవి కలం నుండి జాలువారింది. స్వభావ రీత్యా కూడా సిరివెన్నెల మంచి స్నేహశీలి అనే సత్యం, స్నేహం మీద ఆయన ప్రతిబింబించిన సాహిత్యంలో మనకు కనిపిస్తుంది.

Any Relation may Fail but Real Friendship Never Fails.. నిండైన ప్రేమలో రెండన్నవి ఏవీ లేవు. ఆ బంధానికి ప్రేమ, స్నేహం, అనుబంధం, ఆత్మబంధం, ఆత్మా.. పరమాత్మల బంధం.. అని ఏ పేరు పెట్టినా ఆ రెండు ఏకమే, మమేకమే! అంతా అద్వైతమే!.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here