సిరివెన్నెల పాట – నా మాట – 70 – దుఃఖాన్ని జ్ఞానంతో జయించాలనే పాట

1
13

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

జనం మూగేటట్టు అలా గుక్కెట్టొద్దు

~

చిత్రం: అడవి కాచిన వెన్నెల

సంగీతం: జోస్యభట్ల

సాహిత్యం: సిరివెన్నెల

గానం: సురభి శ్రావణి

~

పాట సాహిత్యం

సాకీ : ఏందయ్యో నీ గోల అసలు నీకేటి కావాల ఇనేవాళ్ళుంటే అనేటోళ్ళింతే అంతాయింతే అంటారంతే

పల్లవి :

జనం మూగేటట్టు అలా గుక్కెట్టొద్దు
గుట్టు మట్టు చూద్దాం పట్టు
ఏ కాకీ ఏకాకిగా ఏడవదంటూ
నిజం తేలేటట్టు మరేం పర్లేదంటూ
ఉసూరని ఏడుస్తూ చతికిల పడితే
అరే అని ప్రపంచమే తలకిందవదే
ఉషారుగా ఈలేస్తూ వెతుకుతుపోతే
అటూ ఇటూ ఏదారో కనబడకుండా పోదే

ఇలా రా ఇదో నా పాట పిలిస్తే
కులాసా ఎటుందో చూడదలిస్తే
ఫలానా అదేదో లేదనిపిస్తే
ఇవాళా హుళక్కే జారవిడిస్తే

చరణం :
సుఖాలవీ దగాలని నమ్మావంటే
ఫకాలని నవ్వాలన్నా భయమేస్తుందే
సమస్యలూ సమాధులే చూస్తూ ఉంటే స్మశానమనిపిస్తుందే జీవితమంటే
నువ్వు కన్నవాళ్ళయినా నిన్ను కన్నోళ్ళయినా నువ్వు అల్లుకున్న బంధాలే ఎవ్వరెందరైనా
కష్టం అనిపించదు నువ్వు కావాలనుకుంటే
నష్టం అనిపించదు ఏం పోయిందనుకుంటే
॥ ఇలా రా ॥

చరణం :
పొద్దుపోని జాగారం చేస్తూ ఉంటే
చిమ్మ చీకటే ఉంటది నీతో పాటే
నిద్దరోయి కమ్మనైన కలగంటుంటే
రాతిరంతా కళ్ళ ఎనక రంగుల తోటే బతకడమైపోయాక అంతా మట్టే
అందాక నిన్ను బతికించేదీ మట్టే
వచ్చే వాళ్ళొస్తారు ఎంత రావొద్దన్నా
వెళ్ళిపోయే వాళ్ళుండరు నువ్వొదొద్దన్నా
॥ ఇలా రా ॥

Life is too short to be lived &

Life is too short to be wasted as well..

జీవించడం అంటే జీవితపు నిజమైన విలువను తెలుసుకోవడం. అతిథులుగా ఈ భూమి మీదకు కొంతకాలం పాటు ఉండడానికి వచ్చిన వాళ్ళం. కనపడే ఆస్తులు ఎన్ని పెంచుకున్నా, అస్థులే మన అంతిమ సత్యం. ఈ కఠిన సత్యాన్ని విప్పి చెప్పేదే వేదాంతం. వేదాంతం, జ్ఞానం యొక్క పరాకాష్ఠ. ఇది జ్ఞానము యొక్క మూల తత్వాన్ని తెలియజేస్తుంది. జీవితంలోని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రాచీన భారతీయ తత్వశాస్త్రమిది. వేదాంత శాశ్వత సత్యాలను తార్కికంగా, క్రమబద్ధంగా వివరించడం ద్వారా ఆనందాన్ని అందుకునే విధానాన్ని రూపొందిస్తుంది. ఇది సత్యాన్వేషణ ద్వారా గ్రహించబడిన జ్ఞాన వ్యవస్థ. జ్ఞానం భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. సమాజానికి శ్రేయస్సును, శాంతిని అందించడంలో సేవ యొక్క ఉన్నత విలువలను చాటి చెబుతుంది. అన్నింటికంటే మించి, దాని తత్వశాస్త్రం ఒకరిని స్వీయ-సాక్షాత్కారం యొక్క అంతిమ లక్ష్యం వైపు నడిపిస్తుంది.

తరతరాలుగా ఈ జ్ఞాన బోధ మనకు, జనపదాలకు కూడా చేరువయ్యే రీతిలో ఇతర సాహిత్యాలతో పాటు, తత్వాలుగా, పాటలుగా కూడా అందించబడుతోంది.

/చెప్పలేదంటనకపోయ్యేరు.. నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతుక నేర్చేరు../
/ దేహమంతా చూడరా దేవుడెందున్నాడురా.. సామి యెందున్నాడురా.. ఆత్మలింగా పరలింగపరుడై, ఆత్మలో తనాయెరా/
/ ఎవరు ఎరుంగరు మా ఊరు..ఏ చివర లేనిదే మా ఊరు/
/ఏమి సుఖంబని, దేహము నేనని, తిరుగుచు చెడెదవు ఓ మనసా..
నీమూఢతనంబును మానుచు నీనిజము నెరుంగుము ఓ మనసా/

ఇలా సాహిత్యంలో ప్రవేశించిన ఈ పాటలు.. నెమ్మది నెమ్మదిగా.. చలనచిత్ర సీమలోను తమ ఉనికిని చాటుకున్నాయి.

/అగాధమౌ జలనిధిలోన, ఆణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే../ కుడిఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్../

వంటి వేదాంత సత్యాలను చెప్పే ఆణిముత్యాలు లాంటి ఎన్నో పాటలు తెలుగు తెరను పావనం చేశాయి.

ఉల్లాసాన్ని, ఉద్రేకాన్ని పెంచేలాగా ఉర్రూతలూపే ఐటెం సాంగులు ఇటీవలి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ ఐటెం సాంగ్స్ చాలావరకు శృంగారపరమైన సాహిత్యం, కొన్ని పాటల్లో నేరుగా బూతు ప్రయోగం, మరికొన్ని పాటల్లో symbolic గాను వుండే సాహిత్యం మనకు కనిపిస్తుంది. జీవన తరంగాలు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించిన నందామయా పాటలో మనకు వేదాంత తత్వం కూడా ప్రతిబింబిస్తుంది. ఇలాంటి పాటలు కూడా ఈ సాహిత్యంలో అక్కడక్కడ, మనకు దొరుకుతాయి.

నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా @2
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు@2
ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే..
కుళ్ళు లేని చోటు ఇక్కడే.. అనుభవించు రాజా ఇప్పుడే
ఆనంద సారం ఇంతేనయా.. ఆనంద సారం ఇంతేనయా..

అదేవిధంగా, ఖడ్గం చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..’ అనే క్లబ్ సాంగ్ ద్వారా లోతైన వేదాంత రహస్యాలని పంచుకున్నారు.

ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద || ముసుగు ||

ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో || ముసుగు ||

ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరురా మనకి తోచిందే చేసిచూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా || ముసుగు ||

‘అడవి కాచిన వెన్నెల’ చిత్రం కోసం, ‘చుట్టూ చూస్తూ నిట్టూరుస్తూ.. వేడుగ్గా వేదాంతం వల్లించొద్దు..’, అనే వేదాంతపరమైన పాటని, ఐటెం సాంగ్ రూపంలో వ్యక్తికరించడం ఏ మాత్రం సులభమైన విషయం కాదు! సిరివెన్నెల గారు తప్ప అంతటి చొరవను తీసుకునే సాహసం కూడా ఎవరికి ఉండదు! ఆ పాట విశ్లేషణను ఇప్పుడు గమనిద్దాం.

సాకీ : ఏందయ్యో నీ గోల అసలు నీకేటి కావాల ఇనేవాళ్ళుంటే అనేటోళ్ళింతే అంతాయింతే అంటారంతే
పల్లవి:
జనం మూగేటట్టు అలా గుక్కెట్టొద్దు
గుట్టు మట్టు చూద్దాం పట్టు
ఏ కాకీ ఏకాకిగా ఏడవదంటూ
నిజం తేలేటట్టు మరేం పర్లేదంటూ
ఉసూరని ఏడుస్తూ చతికిల పడితే
అరే అని ప్రపంచమే తలకిందవదే
ఉషారుగా ఈలేస్తూ వెతుకుతుపోతే
అటూ ఇటూ ఏదారో కనబడకుండా పోదే

ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో మన తప్పులు ఎంచారని, ఇంకెవరితోనో మనల్ని మనం పోల్చుకుంటూ.. బాధపడుతూ.. బ్రతుకు భారంగా గడిపేసేవాళ్ల కోసం.. ‘ఏంటయ్యా నీ గోల’ అంటూ మొదలుపెట్టి.. అనేవాళ్ళు అంటూనే ఉంటారు.. అందరూ ఇలాగే మాట్లాడుతారు.. కాబట్టి వినే వాళ్లే తెలివిగా ఉండాలి.. అన్న సాకీతో పాట మొదలవుతుంది.

నీకు ఎలా జరుగుతుందో ప్రపంచంలో చాలామందికి అలాగే జరుగుతోంది కాబట్టి.. ఆ సమస్య నీ ఒక్కడికే వచ్చినట్టు పెద్దగా గగ్గోలు పెట్టకు.. అలా చేస్తే జనం అంతా పోగై.. ఓ వింతను చూసినట్టు చూసి, తమకేమీ పట్టనట్టు వెళ్ళిపోతారు.‌ కాబట్టి నీ దుఃఖాన్ని పోగొట్టుకునే గుట్టును.. వెతికి పట్టుకోవాలి.. అంటున్నారు సిరివెన్నెల. అంటే, అజ్ఞానం వల్ల వచ్చే దుఃఖాన్ని, జ్ఞానంతో జయించాలని అర్థం. జ్ఞానం ఎప్పుడూ సత్యాన్వేషణతోనే కలుగుతుంది. అంత గొప్ప రహస్యాన్ని ‘గుట్టు మట్టు చూద్దాం పట్టు’.. అన్న చిన్న ప్రాస పదాలతో కూర్చిన వాక్యం ద్వారా పలికించారు సిరివెన్నెల.‌

ఇక ఈ గుట్టు ఎలా బయటపెట్టాలి? అంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకోమని సందేశం ఇస్తున్నారు. ‘ఏ కాకీ ఏకాకిగా ఏడవదంటూ.. నిజం తేలేటట్టు మరేం పర్లేదంటూ..’. ఈ వాక్యానికి పైకి కనిపించే అర్థం ఏంటంటే, ఏ సమస్య అయినా సమాజంలో ఒక్కరికి మాత్రమే ఉండదు.. అలాంటి సమస్యతో సతమతమవుతున్న వాళ్లు నీ చుట్టూ ఎందరో కనిపిస్తారు, ముందుగా ముఖ్యంగా ఈ నిజాన్ని తెలుసుకో! అని చెప్పడానికి, ఏ- కాకి ఏకాకిగా ఏడవదు.. అనే అద్భుతమైన ఉపమానాన్ని ఇక్కడ ప్రయోగించారు సిరివెన్నెల.

కోకిలతో పోల్చి కాకిని చిన్న చూపు చూస్తారు కానీ, కాకికి ఉండే గొప్ప గుణాలు, దాని జీవన విధానం, ఎవరైనా ఆశ్చర్యపరుస్తాయి. వాటికి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే, కావు.. కావు.. మంటూ సందేశమిచ్చి, అందుబాటులో ఉన్న అన్ని కాకులను ఒక చోటికి చేర్చి ఆహారాన్ని పంచుకుంటాయి. పిల్లల పెంపకంలో కూడా కాకులు సమూహ బాధ్యత తీసుకుంటాయట! ఒక కాకి చనిపోతే, చుట్టూ ఉన్న కాకులన్నీ కన్నీళ్లు కార్చి, నీటిలో మునిగి స్నానం చేస్తాయట! ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో కొత్త విషయాలు మనకు అర్థం అవుతాయి. ఇంత విషయ పరిజ్ఞానాన్ని ఒక వాక్యంలో ఇమిడించి కాకి సంఘ జీవనాన్ని, మానవ సమూహంతో పోలుస్తూ.. ఏ.. కాకి ఏకాకిగా ఏడవదు.. అన్న సూత్రాన్ని, భాషలో శ్లేషను కలిపి ప్రయోగించారు సిరివెన్నెల.

ఉసూరని ఏడుస్తూ చతికిల పడితే
అరే అని ప్రపంచమే తలకిందవదే
ఉషారుగా ఈలేస్తూ వెతుకుతుపోతే
అటూ ఇటూ ఏదారో కనబడకుండా పోదే

ఏదో జరిగిందని, ఏ ఒక్క వ్యక్తో.. బాధపడి కుమిలిపోతే.. ప్రపంచం ఏమాత్రం పట్టించుకోదు.

ప్రపంచమేమి తలకిందులైపోదు. దిగులతో, బాధలతో నిండిపోతే, ఏం చేయాలో పాలుపోదు, కర్తవ్యం గుర్తుకు రాదు.. బ్రతుకంతా నిరాశగా అనిపిస్తుంది.. అందుకే ఆనందాన్ని పంచుకుంటూ, ఈల వేసుకుంటూ.. మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ.. ముందుకు వెళితే.. తప్పకుండా మన సమస్యకు ఒక పరిష్కార మార్గం కనబడుతుంది. అందుకే, ఆనందంగా జీవితం గడపడం నేర్చుకుంటేనే బ్రతుకు ఆనందమయం అవుతుంది అన్న ultimate philosophy of life రంగరించి మనకు అందిస్తున్నారు సిరివెన్నెల.

ఇలా రా ఇదో నా పాట పిలిస్తే
కులాసా ఎటుందో చూడదలిస్తే
ఫలానా అదేదో లేదనిపిస్తే ..
ఇవాళా హుళక్కే జారవిడిస్తే..

ఏదో పోగొట్టుకున్నామని.. missing feeling తో.. దిగులు పడిపోతూ ఉంటే.. గతంతో పాటు మన వర్తమానం కూడా జారిపోతుంది.. అలా జారవిడిస్తే.. ‘ఈ రోజు’ కూడా హుళక్కి అవుతుంది కాబట్టి ‘కాస్త ఉషారు కావాలంటే, నా పాట నీ హృదయాన్ని తాకితే.. ఆనందాలు పంచే మా వైపుకు రా’..అని.. మనసు గాయాలని మాన్పుకునే దారులు చూపిస్తున్నారు సిరివెన్నెల.

చరణం:
సుఖాలవీ దగాలని నమ్మావంటే
ఫకాలని నవ్వాలన్నా భయమేస్తుందే
సమస్యలూ సమాధులే చూస్తూ ఉంటే స్మశానమనిపిస్తుందే జీవితమంటే
నువ్వు కన్నవాళ్ళయినా నిన్ను కన్నోళ్ళయినా నువ్వు అల్లుకున్న బంధాలే ఎవ్వరెందరైనా
కష్టం అనిపించదు నువ్వు కావాలనుకుంటే
నష్టం అనిపించదు ఏం పోయిందనుకుంటే
॥ ఇలా రా ॥

ఈ చరణంలో నిరాశను పుట్టించే ‘మెట్ట వేదాంతం’ జోలికి వెళ్లొద్దని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ‘సుఖాలన్నీ మాయరా! ఎక్కువగా నవ్వుతూ ఉంటే.. దాని వెంట ఏడుపు తరుముకుంటూ వస్తుంది’..లాంటి ..మాటలు వింటే మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా మనకు భయం వేస్తుంది. ‘తా జెడ్డకోతి వనమెల్లజెరచె’ అన్న సామెతగా తనకు ఫలించలేదు అనే భావనతో తనలో నిరాశ కమ్ముకొని, ఇతరులనూ కార్యరంగంలోకి ఉరకనీయకుండా నిరాశగా మాట్లాడి, పని చేసేవాళ్ళ ఉత్సాహం తగ్గించడం.. వారిని వెనకకు లాగేందుకు ప్రయత్నించడం.. మెట్ట వేదాంతం.. ఇది.. తన వైఫల్యాలకు తన పొరపాట్లు కారణం అని తెలుసుకోకుండా ఇతరులనూ నిరుత్సాహ పరచే మాటలు చెప్పడం మెట్ట వేదాంతం. ఇవి విని విసిగి పోయి – ‘ఊరికే మెట్ట వేదాంతం చెప్పద్దు’, అంటూ ఉంటారు.

ఇలాంటి మెట్ట వేదాంతం వల్ల సమస్యల్లో నుండి ఎప్పటికీ బయటపడలేమని, సమాధి లాంటి జీవితం గడపాల్సి వస్తుందని భావిస్తూ దుఃఖంలో కూరుకుపోవద్దని హెచ్చరిస్తున్నారు సిరివెన్నెల. మనల్ని కన్న తల్లిదండ్రులైనా, మనము కన్న పిల్లలైనా మన మనసుతో మనం అల్లుకున్న బంధాలే కదా! అలాంటి బంధాలకు విఘాతం కలిగినప్పుడు, మనసుకు ఎంతో కష్టం అనిపిస్తుంది. కానీ, ఏం పోయిందిలే! అని నిర్ణయించుకుంటే, కష్టమూ అనిపించదు, నష్టమూ అనిపించదన్నది, అలాంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకోమని సిరివెన్నెల సూచన.

చరణం:
పొద్దుపోని జాగారం చేస్తూ ఉంటే
చిమ్మ చీకటే ఉంటది నీతో పాటే
నిద్దరోయి కమ్మనైన కలగంటుంటే
రాతిరంతా కళ్ళ ఎనక రంగుల తోటే బతకడమైపోయాక అంతా మట్టే
అందాక నిన్ను బతికించేదీ మట్టే
వచ్చే వాళ్ళొస్తారు ఎంత రావొద్దన్నా
వెళ్ళిపోయే వాళ్ళుండరు నువ్వొదొద్దన్నా

బ్రతుకును ఎలా గడపకూడదో మొదటి చరణం లో చెబితే, దాన్ని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో రెండవ చరణంలో వివరిస్తున్నారు. కార్యాచరణలోకి దిగకుండా, దిగుళ్ళు, చింతల భారాలు మోస్తూ, కాలం గడిపేస్తే.. బ్రతుకంతా చిమ్మ చీకట్లోనే ఉండిపోతుంది.. అలాకాకుండా భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటూ, ప్రశాంతంగా నిద్రపోతూ.. జీవితాన్ని ఆ దిశగా నడిపిస్తే..

రాతిరంతా కళ్ళ ఎనక ‘రంగుల తోటే!..’ జీవితం రంగుల మయమవుతుందట! అంటే, చేదు నిజాన్ని జీర్ణం చేసుకోలేనప్పుడు.. ఊరించే ఊహతో అయినా ముందుకు సాగమన్న బలమైన సందేశమది.

తను ఎప్పటికీ తల్లి కాలేదు! అన్న వార్త విని ఒక స్త్రీ, మానసికంగా క్రుంగిపోయి, మతిస్థిమితం కోల్పోతుంది. అన్ని విషయాల పట్ల స్తబ్ధుగా మారిపోతుంది. అయితే, ఒక మంచి సైకియాట్రిస్ట్ కొంతకాలానికి ఆమెను బాగు చేస్తాడు. ఆమె దాదాపు అన్ని రకాలుగా మామూలు వ్యక్తిగా మారిపోతుంది. అయితే, రాత్రిపూట మాత్రం, వారానికో పది రోజులకో ఒకసారి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి, తనకు అప్పుడే కవల పిల్లలు పుట్టినట్టు, లేదా పాపో, బాబో పుట్టినట్టు.., వాళ్లు చాలా అందంగా ఉన్నట్టు.. వాళ్లతో ఆడుకుంటున్నట్టు.. ఫోన్ చేస్తూ ఉంటుంది.  అది తెలిసిన ఆమె తల్లి డాక్టర్ గారిని, ‘ఈ కాస్త పిచ్చిని కూడా నయం చేయవచ్చు కదా?’, అని అడుగుతుంది. తన గుండెను కోసే, తల్లి కాలేదన్న చేదు వాస్తవం కన్నా, తాను తల్లి అయ్యానన్న భ్రమలో ఆమె జీవితం ఆనందంగా నడుస్తోంది. ఆ hallucination లోనే ఆమెను ఉంచేద్దామని… నేను ట్రీట్‌మెంట్ ఆపేశాను అని చెప్పారు.. ఈ వాక్యంలోని భావం, అతికినట్టుగా సరిపోయే, వాస్తవ గాథ ఇది!

మట్టిలోనే పుట్టి, మట్టి సాయంతో పెరిగి, మట్టిలో కలిసిపోయే ఈ జీవితాన్ని వృథా కానివ్వకూడదు. ఇంత గొప్ప జీవితానికి సార్థకత సాధించుకోవాలి. రావద్దు అని ఆపినా, మన జీవితంలోకి వచ్చేవాళ్లు ఆగరు. పోవద్దు అని కాళ్ళా వేళ్ళా పడినా, మనల్ని వదిలి వెళ్లిపోయేవారు ఆగరు. కాబట్టి మన జీవితంలోకి ఎవరు వచ్చినా, పోయినా, దాన్ని ఒక సాక్షి లాగా గమనిస్తూ ఆస్వాదించాలి తప్ప.. దానికోసం జీవితాన్ని దుఃఖమయంగా మార్చుకోకూడదు.. ఈ జీవన నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు అన్న సత్యాన్ని అర్థం చేసుకున్న వారు, తమ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు.

ఈ పాట ద్వారా సిరివెన్నెల మనకు అందించిన జీవిత సత్యాలను అర్థం చేసుకుని పాటిస్తే, జీవితం ఎంతో ఆనందమయంగా మారుతుంది. సుఖమైనా, దుఃఖమైనా మనం చూసే కోణాన్ని బట్టి మారుతుంది కాబట్టి mindset ని set చేస్తే జీవితం సుఖమయం అవుతున్నది అన్నది, సిరివెన్నెల అందించిన ultimate outlook of life!

మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి ఉద్దేశించిన పాటల్లో కూడా మానసిక వికాసాన్ని కలిగించే సూత్రాలను, తన philosophic outlook ను ప్రతిబింబించేలా వ్రాయగలిగిన, వ్రాసి మెప్పించగలిగిన ఘనత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిది.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here