సిరివెన్నెల పాట – నా మాట – 75 – నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని తట్టిలేపే పాట

2
26

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నువ్వెవరైనా నేనెవరైనా

~

చిత్రం: అటు అమెరికా – ఇటు ఇండియా

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం : మాధవపెద్ది సురేష్ చంద్ర

గానం: ఎస్.పి.బాలు

~

పాట సాహిత్యం

పల్లవి:
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే ॥నువ్వెవరైనా॥

చరణం:
ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే, గగనం ఒకటే ఏ భాషలు పలికిస్తున్నా, గొంతులు స్వరతంత్రులు ఒకటే
ఆహారం వేరే అయినా, అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే అయినా, ఆధారం బ్రతుకొకటే
నిను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే ॥2॥
ఎన్నో రంగుల తెల్లకిరణమై వెలుగుతున్న జీవితమొకటే ॥నువ్వెవరైనా॥

చరణం:
ఏ రూపం చూపెడెతున్నా, ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా, పిల్లన గ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా, పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువు ఉన్నా, ప్రాణాలకు విలువొకటే
నీకు నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే ॥2॥
నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే ॥నువ్వెవరైనా॥

‘ఏకోహం, బహుస్యాం- ప్రజాయేయేతి’ అని ఉపనిషత్తులు యుగయుగాలుగా చెప్తూనే ఉన్నాయి. తానొక్కడే అయిన భగవంతుడు, అనేకంగా మారి, తనలోని అనంత వైవిధ్యాన్ని ప్రసరించి ఆనందించాలన్న సంకల్పం ప్రకారం ఆ పరతత్వం అనేక అంతస్తులు దిగి వచ్చి పదార్థంగా మారిందట. ఒక చివర పరబ్రహ్మ, మరో చివర పదార్థం. ముందుగా పదార్థం పైన ప్రాణిక స్థాయి ఒత్తిడి తెచ్చిన కారణంగా అందులో అంతర్లీనంగా వున్న ప్రాణశక్తి పదార్థాన్ని కలుపుకొని వృక్ష సంతతి, జీవకోటిగా వెలికి వచ్చింది. ఆ తర్వాత దశలో పదార్థంపై మానసిక ఒత్తిడి ఫలితంగా సకల జీవరాశిపై తెచ్చిన మార్పు ఫలితంగా, పదార్థాన్ని ప్రాణాన్ని కలుపుకొని బుద్ధిజీవి అయిన మానవుడు వెలికి వచ్చాడు.

ఈ మనస్సుకున్న ప్రధాన లక్షణం ఆలోచన, విభజన, సంకల్ప- వికల్పాలు. మేధాశక్తి నిరంతరంగా ఎదగడం వల్ల హేతుదృష్టి అభివృద్ధి చెందింది. హేతువాదంలో మనిషి మూఢాచారాల నుండి బయటపడ్డాడు. సైన్స్‌ అభివృద్ధి చెందింది. దీనివలన అనేక అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ, మానవులలోని నైతికత దిగజారి పోవడం ప్రారంభించింది.

ఈ మనస్సుకున్న మరో గుణం ప్రతీదానినీ విడగొట్టి చూడటం. ఈ విడగొట్టి చూడటం అనేది వ్యక్తుల మధ్య, సమాజం మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య, వైరాన్ని, వేరు భావాన్ని పెంచి, ఘర్షణలకు దారితీసి, అహానికిలోను చేస్తున్నాయి. సకల సమస్యలకూ అసలు కారణం మానవుడు మానసిక జీవి కావడమే! వ్యక్తుల మధ్య, రాజ్యాల మధ్య, చిచ్చుపెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా మానవులను అది నిట్టనిలువునా చీల్చి వేసింది. ఈనాడు మనకు కన్పించే సమస్యలన్నింటికీ మూలం అదే, వీటన్నింటికీ పరిష్కారం మానవుడు మనస్సును దాటి ఎదగడంలోనే వుంది. అంతవరకూ ఈ సమస్యలకు పరిష్కారం లేదు. మనం ప్రస్తుత ప్రపంచం వైపు దృష్టి సారించి చూస్తే అది సమస్యల వలయంలో పడి కొట్టుకొనిపోతున్నది. ప్రతీ దేశం, ప్రతి సమాజం ఎన్నో సంక్షోభాలతో కునారిల్లుతున్నది. జాతి వివక్షలు, వర్ణవివక్షలు, మత విద్వేషాలు, స్థాయి వివక్షలు, మానవులను పశు ప్రవృత్తి కంటే హీనంగా మార్చి, మన చుట్టూ కనిపిస్తున్న అన్ని దురాగతాలకు మూలమవుతున్నది. స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, మతాల పేరుతో జరుగుతున్న మారణ హోమాలు వీటికి సజీవ సాక్షాలు! కానీ పశువుగా పుట్టిన మానవుడు పశుపతిగా అంటే భగవంతుడిగా ఎదగాలన్న ఆకాంక్షను సిరివెన్నెల ఒకానొక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

బాహ్య ప్రపంచంలో మనిషి ఆలోచనా పరిధిని దాటిపోయిన ప్రగతి కనపడుతోంది. సాంకేతికంగా మనం చూడని అభివృద్ధి లేదు! పరిధులన్నిటినీ చెరిపేసి, గ్రహాంతర యానం చేయగలుగుతున్నా, అంతరంగ ప్రపంచం వైపు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాం. ప్రగతి అనేది ఒక ప్రక్కనే జరుగుతూ, రెండవ ప్రక్కన కుంచించుకుపోవడం వలన సమతుల్యత లోపించి, ప్రపంచంలోని సంక్షోభాలన్నింటికీ మూల కారణమైంది. పరిణామ వికాసం ఒక వైపే జరుగుతూ ప్రపంచం అంగవైకల్యంతో అసహ్యంగా తయారైంది. ప్రపంచంలో ఏ సమాజంలో చూసినా, బలహీనులపై బలవంతుల పెత్తందారీతనం, అవినీతి, లంచగొండితనం, స్వార్థం, భోగలాలసత్వం, దుర్మార్గం, దుర్నీతి, అత్యాచారాలు, జంతు ప్రవృత్తి. ఇదంతా చూసి మానవత్వం సిగ్గుతో తలదించుకుంటున్నది. మృగంలోంచి మానవుడు వచ్చాడంటాడు డార్విన్‌. కానీ ఈనాడు మనిషిలోంచి మృగం సంపూర్ణంగా బయటికి వస్తోంది. దీనికంతటికీ కారణం పరిణామ క్రమం ఒకచోట ఆగిపోవడం కాక, ఇప్పుడు అది తిరోగమనంలో ఉంది. సృష్టిలో మానవుడితో పరిణామ క్రమం ఆగిపోకూడదు. అతడింకా ముందుకు సాగాలి. ఆదిమ మానవుడు, యాంత్రిక మానవుడయ్యాడు, సాంకేతిక మానవుడయ్యాడు. అంతటితో ఆగిపోయి, ముందుకు సాగే దారి అర్థం కాక మరలా వెనక్కు తిరిగి మృగ ప్రాయుడవుతున్నాడు.

ఇటువంటి పరిస్థితిలో, మృగం నుండి మళ్లీ అసలైన మానవుడు బయటికి రావాలంటే, మానవ జీవిత పరమార్థం తెలుసుకొని, ఆ దిశగా అడుగులు వేయాలి. మత గ్రంథాలను సరైన కోణంలో అర్థం చేసుకొని, భగవంతుని తత్వాన్నిగ్రహించగలగాలి. ఎదుటి ప్రాణిలో, మనిషిలో, తనను తాను చూసుకోగలిగితే.. ఈ సమస్యలన్నీ అంతమైపోతాయి. అలాంటి జ్ఞానాన్ని పంచే సాహిత్యం కూడా మన ఆలోచనపై దాని ప్రభావాన్ని చూపించగలుగుతుంది. ఉదాహరణకు,

పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటె
విశ్వదాభిరామ! వినుర వేమ!

మనుష్యులంతా ఒక్కటే. పశువులు వేరువేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనుషులు వివిధ వర్ణాల వారైనా మనసులు ఒకటిగా మసలుకోవాలంటాడు వేమన. పూవులు వేరువేరు రంగులతో ఉన్నా పూజకు వినియోగపడటంలో అవన్నీ ఒక్కటే గదా! అని మరో ఉపమానాన్ని జోడిస్తాడు.

అటు అమెరికా ఇటు ఇండియా చిత్రంలోని, ‘నువ్వెవరైనా నేనెవరైనా’, అనే పాట ద్వారా ఈ ఆధునిక సమాజానికి ఇటువంటి అత్యంత విలువైన సాహిత్యాన్ని అందిస్తున్నారు సిరివెన్నెల.

పల్లవి:
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే ॥నువ్వెవరైనా॥

అన్ని అరాచకత్వాలకు మూలమైన వైషమ్యాలు దూరమై పోవాలంటే, మానవులంతా ఒకటే! అనే అత్యంత గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలంటున్నారు సిరివెన్నెల. మానవులందరి ఊపిరి పాడే ప్రాణ గీతం అందరికీ ఒకటేననీ, ఎవరు నవ్వినా ఆ నవ్వులు పూచే రంగులు ఒకటేనని, సముద్రంలో ఎన్ని లక్షల కెరటాలు ఎగిరెగిరి పడుతున్నా, వాటన్నిటికీ మూలమైన సముద్రం ఒకటేనని, ఇన్ని జీవాత్మలకు మూల కారణమైన పరమాత్మ ఒకడేనని, వేదాంత సారాన్ని మనకు అందిస్తున్నారు. మనసును తాకే భావోద్వేగాలు కలిగినప్పుడు, ఎవరి చెంపల మీదికైనా జారే కన్నీటికి కూడా ఎలాంటి భేదము లేదని, మానవులు ఎన్ని రకాల భేదాలను ఎందుకు సృష్టించుకున్నారు అనే ఆవేదనను పలికిస్తున్నారు సిరివెన్నెల. ‘Where the world has not been broken up into fragments by domestic walls..

Where words come out from the depth of truth..’ అలాంటి స్వర్గంలోకి నా ప్రజలందరికీ నడిపించు భగవంతుడా, ‌అని రబీంద్రనాథ్ ఠాగూర్ కోరుకున్నట్టు, సిరివెన్నెల కూడా అలాంటి అభిమతాన్నే వెలిబుచ్చుతున్నారు.

Oneness of humanity poem లో Abdul Wahab ఇలానే అంటున్నారు..

Oneness of humanity poem లో Abdul Wahab ఇలానే అంటున్నారు..
Oh, teacher
Be a student for a day
Let me teach you before any thing
The unity of humanity…
From outside we may appear black or white
But we are all like water melon, red
Inside.

We may wear different clothes designed or undersigned
Built differently
Eat different foods
Belong to different religions
But we suffer the same pain
When we are thirsty, hungry or hurt..
…….

చరణం:
ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే, గగనం ఒకటే ఏ భాషలు పలికిస్తున్నా, గొంతులు స్వతంత్రులు ఒకటే
ఆహారం వేరే అయినా, అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే అయినా, ఆధారం బ్రతుకొకటే
నిను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్లకిరణమై వెలుగుతున్న జీవితమొకటే ॥నువ్వెవరైనా॥

విశ్వ మానవ ఏకత్వాన్ని అనేక విధాలుగా ఉదహరిస్తూ, సిరివెన్నెల ఈ చరణాన్ని మనకు అందిస్తున్నారు. ప్రపంచంలో మానవాళికంతా, భూమి, ఆకాశం, గాలి, నీరు, ఒకటేనని.. వీణలో ఉన్న ఒకే స్వరతంత్రి భిన్న రాగాలు పలికించినట్లే, ఎన్ని వేల భాషలు మాట్లాడినా, ఆ భాషలను పలికిస్తున్న స్వరతంత్రులు కూడా ఒకటేనని అందమైన ఉపమానాలను ఆయన అందిస్తున్నారు.

ఆకలిని తీర్చుకునే ఆహార పదార్థాలు భిన్నభిన్నమైనప్పటికీ, ఆకలి అందరికీ సమానమే అంటున్నారు. ఏ దేశంలో ఏ జాతి తల్లి పురుడు పోసుకున్నా, ఆ పురిటి నొప్పుల్లో ఎలాంటి భేదాలు లేవంటున్నారు. అన్ని రంగులు మిళితమైతే ఒకే శ్వేత వర్ణం ఏ రకంగా దర్శనమిస్తుందో, అలా ఎన్నో రంగుల తెల్ల కిరణంలా పలు సమూహాల మానవుల జీవితాలు వెలుగుతున్నాయని హితోపదేశం చేస్తున్నారు సిరివెన్నెల. ఇదే భావాన్ని మనం మరో వేమన పద్యంలో కూడా చూడగలం.

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ పుటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!

వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్ని రకాలైనప్పటికీ, దానికి వాడే మూల పదార్థమైన బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా, వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం. ప్రజాకవి వేమన లాగా, ఆధునిక ప్రజాకవి సిరివెన్నెల మనకందిస్తున్న అపురూపమైన సాహిత్యమిది.

We are one, living in one place wearing different faces
We walk different paths but we all walk the same grass
The unity of our species is often forgotten
Just how lucky we have been to have gotten one another…. అన్నది Luxnor సందేశం.

చరణం:
ఏ రూపం చూపెడెతున్నా, ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా, పిల్లన గ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా, పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువు ఉన్నా, ప్రాణాలకు విలువొకటే
నీకు నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే ॥నువ్వెవరైనా॥

ఎన్ని రకాల శిల్పాలు రూపుదిద్దుకున్నా, శిల – వాటిపై తన విన్యాసం చేసిన ఉలి, ఒకటేనని తెలుసుకోమంటున్నారు. పిల్లనగ్రోవి ఎంత మధురమైన రాగాలను, ఎన్ని రాగాలను పలికించినా, గాలే ఆ మాధుర్యానికి మూలం. ఎన్నో పేర్లతో ప్రఖ్యాతి పొందిన ప్రపంచంలోని అన్ని నాట్యాలకు పదవిన్యాసమే మూలం కదా! ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి చెందిన వారైనా.. అందరి ప్రాణం విలువ ఒకటే.

నేను, నాది, నాకు, నన్ను, నువ్వు, నీది, నీకు, నిన్ను.. అనే అష్ట మాయను ఛేదించగలిగితే, మనం ఎవరో మనకు అర్థం అవుతుందని, తేజ్ గురు సర్ శ్రీ అంటారు. నీకు నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే కాబట్టి, నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే అనే విశ్వ మానవ తత్వాన్ని మనకు ఎంతో సరళంగా వివరిస్తున్నారు సిరివెన్నెల.

మనిషి తన మూలాలు మరిచిపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఎంతో ఆనందంగా జీవించాల్సిన మానవ సమాజం, ఉద్రేకాలతో, ఒత్తిళ్లతో, అర్థంపర్థం లేని ప్రగతితో, వినాశకర పోకళ్ళతో సతమతమైపోతోంది. ఇవన్నీ కలిసి మనిషి మనిషి మధ్య పడగొట్టలేనంత బలమైన ఇనుప గోడలను నిర్మిస్తున్నాయి. అన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. మానవుల అనుసరిస్తున్న అన్ని బేధ భావాలకు చరమగీతం పాడాలనీ, ప్రతి అంశంలోను స్పష్టంగా కనిపిస్తున్న ఏకత్వాన్ని, మూల రూపాన్ని మానవులు గమనించడం, అనుసరించడం అలవాటు చేసుకోవాలనీ గీతోపదేశం చేస్తున్నారు సిరివెన్నెల. మానవుల దృష్టి కోణంలో మార్పు వచ్చినప్పుడే మనిషి మృగంలా కాకుండా, మనిషిగా ఎదిగే ద్వారం తెరుచుకుని, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని సోపానాలు వేస్తూ, విశ్వశాంతికి దారితీస్తుందన్నది సిరివెన్నెల గారి బలమైన సందేశం. పుట్టుకతో మనందరి చుట్టరికం ఒకటే అన్న సున్నితమైన సత్యాన్ని చాటి చెబుతూ మనలో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని సుతారంగా తట్టిలేపుతుంది అద్భుతమైన ఈ గీతం.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here