సిరివెన్నెల పాట – నా మాట – 9 – తరలివచ్చిన సాహితీ వసంతం

3
8

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

తరలి రాద తనే వసంతం

~

చిత్రం: రుద్రవీణ

సాహిత్యం: సిరివెన్నెల

గానం : ఎస్పీ బాలసుబ్రమణ్యం

సంగీతం: ఇళయరాజా

~

సాహిత్యం

పల్లవి:

తరలి రాద తనే వసంతం

తన దరికి రాని వనాల కోసం@2

గగనాల దాక అల సాగకుంటే

మేఘాల రాగం ఇల చేరుకోదా||తరలి రాద||

చరణం:

వెన్నెల దీపం కొందరిదా

అడవిని సైతం వెలుగు కదా@2

ఎల్లలు లేని చల్లని గాలి

అందరి కోసం అందును కాదా

ప్రతీ మదిని లేపే ప్రభాత రాగం

పదే పదే చూపే ప్రధాన మార్గం

ఏది సొంతం కోసం కాదను సందేశం

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కథ

దిశనెరుగని గమనము కద ||తరలి రాద||

చరణం:

బ్రతుకున లేనీ శృతి కలదా

ఎద సడిలోనే లయ లేదా@2

ఏ కళకైనా ఏ కలకైనా

జీవిత రంగం వేదిక కాదా

ప్రజా ధనం కాని కళా విలాసం

ఏ ప్రయోజనం లేని వృథా వికాసం

కూసే కోయిల పోతే కాలం ఆగిందా

పారే ఏరే పాడే మరో పదం రాదా

మురళికి గల స్వరముల కళ

పెదవిని విడి పలకదు కద ||తరలి రాద||

ప్రకృతి విశ్వజనీనమైనది. పారే నీరు, వీచే గాలి, కాచే ఎండ, పూచే వెన్నెల… అందరికీ సమానమే. వీటిలో దేనికీ పేద, గొప్ప భేదం లేదు. ఇవి సామ్యవాదానికి ఉత్తమ చిహ్నాలు. అందుకే ఈ సృష్టికంతా కర్త ఒకడే అని, ఆ పరమాత్ముని కృప అందరిమీద ఒకే రకంగా వర్షిస్తుందని, అన్ని మతాలు చాటి చెప్తున్నాయి. కవిత్వం యొక్క విశ్వాత్మకతను అర్థం చేసుకోవడానికి పూర్వ కవులు లేదా ఇతర భాష కవులు వ్రాసిన సాహిత్యాలను కూడా పరిశీలించడం ఎంతో బాగుంటుంది. ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో ఉండే గొప్ప కవుల మధ్య ఉన్న భావసారూప్యత మనల్ని నిజంగా అబ్బుర పరుస్తుంది.

ఈ సందర్భంలోనే, 600 ఏళ్లకు పూర్వమే మన వాగ్గేయకారుడు అన్నమయ్య, ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ అనే కీర్తన ద్వారా మనమిప్పుడు సోషలిజం అని పిలుచుకునే సమ సమాజాన్ని, తన విప్లవాత్మక భావాలతో మేలుకొలిపాడు.

…………

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే

అండనే బంటు నిద్ర అదియునొకటే..

పగలు శరీర శ్రమనంతా మరిపించే నిద్ర రాజుకైనా, పేదకైనా, పట్టుపరుపుల పైన అయినా, కటిక నేల మీద అయినా.. ఒకటే అని తేల్చి చెప్పాడు.

……….

కడగి యెనుగుమీద గాయు యెండొకటే

పుడమి శునకముమీద బొలయు యెండయునొకటే..

సూర్యుడి నుండి ప్రసరించే వేడి, అంత భారీ జంతువైన ఏనుగుపైన అయినా, చిన్న శునకము పైన అయినా ఒకటే అని, ప్రకృతి ఎటువంటి తారతమ్యాలు చూపించదని, ఈ భేదాలు మానవుడే సృష్టించుకున్నాడనీ సమాజాన్ని నిగ్గదీశాడు ఆనాడే అన్నమయ్య.

ఇంత గొప్ప భావాన్ని ఈ పాట పల్లవిలోని రెండు వాక్యాలలో ముద్దుగా ఇమిడించారు సిరివెన్నెల.

అదే విధంగా సృజనాత్మకమైనవి, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే, సంగీతము, నాట్యము, చిత్రలేఖనము శిల్పము వంటి కళలు కూడా విశ్వవ్యాపకాలే. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలే. వీటన్నిటికీ భావంతో తప్ప, భాషతో సంబంధం లేదు. భాష అర్థం కాకున్నా, లయబద్ధమైన, మధురమైన గీతానికి ఎవరైనా తన్మయం చెందుతారు. అందుకే కళలకు ఎల్లలు లేవు. ఎవరి స్థాయిలో వాళ్లు అర్థం చేసుకొని రసానందం పొందే సాహిత్యం ఉందేమో కానీ, శాస్త్రీయం నుండి జానపదం వరకు.. సంగీతం మాత్రం అందర్నీ సమానంగా రంజింపజేస్తుంది.

సూర్యుడు, చంద్రుడు, గాలి, వర్షం.. అన్నీ కూడా మనందరికీ తమ ప్రేమను పంచడమే ఆశయంగా జీవిస్తాయని.. అల్కా అంటుంది.

The sun has the form of a golden dream the moon has the form of celestial love, the rain and the wind winter the solar heat, relieving..

-Alka

ఇక పాట విశ్లేషణలోకి వెళదాం. సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం, బాలు గారి అమృతగళం.. చిత్ర ఇతివృత్తం, తెరమీద చిరంజీవి గారి నటనా కౌశలం.. మధురాతి మధురమైన సంగమం. కథ నేపథ్యానికి వస్తే, రుద్రవీణ, విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు తండ్రి కొడుకుల కథ. తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. శాస్త్రీయ సంగీతం అర్థం చేసుకునే అర్హత కలిగిన రసజ్ఞులకు మాత్రమే పరిమితమని ఆయన అభిప్రాయం. కొడుకు కూడా సంగీత విద్వాంసుడే. సంగీతానికి ఎల్లలు లేవని, అది ప్రజలందరికీ చేరాలని, సామాన్యుడికి అందుబాటులోకి రాని సంగీతానికి విలువ లేదనేది కథానాయకుడి సిద్ధాంతం. ‘తరలిరాద తనే వసంతం – తన దరికి రాని వనాల కోసం’ అనే ఈ నేపథ్య గీతం మొత్తం సినిమా ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంది. సినిమా కథలో ఇమిడి ఉన్న సందేశాన్నంతా ఈ పాట సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ చిత్రానికి సిరివెన్నెల గారి ఈ పాటే ఒక ప్రాణం. తండ్రి కొడుకుల మధ్య ఉండే సైద్ధాంతిక విభేదాలను ఈ పాట పూర్తిగా ప్రతిబింబిస్తూ, సంగీతానికి ఉన్న అజరామరమైన గమ్యాన్ని, కథానాయకుడి పాత్ర ద్వారా మనకు చెప్పిస్తుంది.

తరలి రాద తనే వసంతం

తన దరికి రాని వనాల కోసం@2

గగనాల దాక అల సాగకుంటే

మేఘాల రాగం ఇల చేరుకోదా||తరలి రాద||

కథానాయకుడు అడవి దారిలో వెళ్తున్నప్పుడు, అక్కడ కట్టెలు కొట్టుకునే శ్రామికులు, సంప్రదాయ సంగీత కచేరీలు వినే శక్తి తమకు లేదని, ఏదైనా మంచి పాట వినిపించమని అతన్ని అడుగుతారు. అతను హంసధ్వని రాగంలో ఆలాపన మొదలుపెట్టగానే, అందరూ అయోమయంలో పడతారు. అప్పుడు వాళ్ళు ఇస్తున్న తాళానికి అనుగుణంగా ఒక సరళమైన పాటను మొదలుపెడతాడు. వసంతం మాసం దగ్గరికి వనాలు వెళ్లలేవు కాబట్టి, వసంతమే వాటిని వెతుక్కుంటూ వచ్చింది. ఎగసి, ఎగసి అలసిన అల గగనాన్ని చేరలేకపోతే, ఆకాశమే తన వర్షపుధారతో అలవద్దకు వచ్చింది అని. ‘తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం’, అని ఈ వాక్యంలో ఎంత ఆశావహ దృక్పథం ప్రకటితమవుతుంది! తమ బ్రతుకులు బాగుపరిచే వసంతాన్ని వెతుక్కుంటూ వెళ్లలేని నిర్భాగ్యులకు, తాము కోరుకున్న భాగ్యం తనంత తానుగా చేరుకోవడం! సిరివెన్నెల గారి అమూల్యమైన భావ సంపదను ఎంత వర్ణించినా తక్కువే.

వెన్నెల దీపం కొందరిదా

అడవిని సైతం వెలుగు కదా@2

ఎల్లలు లేని చల్లని గాలి

అందరి కోసం అందును కాదా

ప్రకృతిలో మనకు దొరికే అన్ని వరాలు ఏ ఒక్కరి సొత్తు కాదని, అవి అందరికీ సమానంగా అందాలని ఎంతో మంచి ఉపమానాలతో వివరించారు సిరివెన్నెల. ఇదే భావం శతాబ్దాల కిందటి పద కవితా పితామహుడు కూడా వెలువరించడం.. ఎంతో గొప్పగా అనిపిస్తుంది.

ఎక్కువమంది భావ కవులు భావించినట్టు వెన్నెల జనావాసాల్లోనే కాదు, అడవులను కూడా అలరిస్తుంది. ‘అడవి కాచిన వెన్నెల వృథా’, అని సిరివెన్నెల భావించలేదు. అడవిలో కూడా ఆస్వాదించే పక్షులు జంతువులు లేకపోలేదని ఆయన భావం.

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం

పదే పదే చూపే ప్రధాన మార్గం

ఏది సొంతం కోసం కాదను సందేశం

ప్రభాతరాగం అంటే సూర్యోదయం మనసులను తట్టి లేపుతోందట! అలా మేల్కొల్పి, తన కిరణాలను విశ్వమంతా ఒకే తీరున పంచుతూ, ప్రతిరోజూ.. పదే పదే.. ఏదీ నీ సొంతం కాదు.. పంచడం కోసమే అది నీకు ఇవ్వబడింది.. అన్న సందేశాన్ని మనకు అందిస్తున్నాడట!

పరోపకారాయ ఫలన్తి వృక్షాః|

పరోపకారాయ వహన్తి నద్యః ||

పరోపకారాయ దుహన్తి గావః|

పరోపకారార్థమిదం శరీరమ్||

ఎంతో ప్రఖ్యాతమైన మన సంస్కృత శ్లోకం అందించిన భావాన్ని, ఒక్క సామాన్య వాక్యంలో అతి సులభంగా అందించారు సిరివెన్నెల.

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుగడ కథ

దిశనెరుగని గమనము కద ||తరలి రాద||

సిరివెన్నెల గారి పాటలకు వ్యాఖ్యానం వ్రాయాలంటే, ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని పట్టి పట్టి సమీక్షించాలి. ఎందుకంటే అవన్నీ అంత భావ గర్భితంగా ఉంటాయి కాబట్టి. ప్రకృతి శక్తులైన సూర్యుడు – వేడిని, గాలి- ప్రాణవాయువును, నదులు – నీటిని, వృక్షాలు – ఆహారాన్ని పంచకుండా దాచుకుంటే ప్రపంచం మనుగడే శూన్యం. ఇది ప్రకృతికే కాదు వికృత స్వభావులైన మానవులకి కూడా! జ్ఞానాన్ని కానీ, నైపుణ్యాలను కానీ, సంపదలను కానీ పంచకుండా.. పెంచుకుంటూ వెళ్తే.. పర్యవసానం మనందరికీ తెలుసు. ఈ సత్యం తెలియని బ్రతుకులు, దిశా నిర్దేశం లేని జీవచ్ఛావాలని కవి భావన.

సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోగా, వెలుగు పంచడం అనే తన బాధ్యతను నిర్వర్తిస్తూ, తూర్పు నుండి పడమరకు చేరుకోవడం అన్న గమ్యాన్ని(ప్రధాన మార్గం) ప్రతిరోజు మనకు చూపిస్తున్నాడు భానుడు. అదే విధంగా ప్రకృతిలోని అన్ని శక్తులు తమ తమ గమ్యాల వైపు పరుగులు తీస్తుంటాయి. కేవలం మానవులు వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి, అంతే! ఇదే సందేశాన్నిచ్చిన, ప్రపంచ ప్రఖ్యాత కవి రాబర్ట్ ఫ్రాస్ట్.. సాహిత్యాన్ని ఒకసారి గమనిద్దాం.

Stopping by Woods on a Snowy Evening అని poem లో Robert Frost – ఇలా అంటాడు.

The woods are lovely, dark and deep. But I have promises to keep,

And miles to go before I sleep,

And miles to go before I sleep.

మన జీవితంలో ఎదురయ్యే అందమైన మలుపుల దగ్గరికి మనం ఆగిపోతే, గమ్యాన్ని చేరుకోలేము. జీవితం అనే నందనవనం ఎంత అందంగా కనిపించినా, మన చివరి శ్వాస వరకు.. గమ్యాన్ని చేరే దిశగా సాగుతూనే ఉండాలి.. అన్నది దీని సారాంశం.

బ్రతుకున లేనీ శృతి కలదా

ఎద సడిలోనే లయ లేదా@2

బ్రతుకులో అడుగడుగునా.. అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.. అన్నిటికీ వేటి శృతిలయలు వాటికి ఉన్నాయి. వాటి గీతాలు అవి పాడుతూనే ఉన్నాయి. అదే విధంగా, సంగీతం కూడా మనకు ప్రకృతి ఇచ్చిన వరం. భారతీయ సంగీతంలోని సప్త స్వరాలు (సరిగమపదని); పక్షులు, జంతువుల అరుపుల నుండి పుట్టినవే.

స = షడ్జమం (నెమలి క్రేంకారం)

రి = రిషభం (ఎద్దు రంకె)

గ = గాంధర్వం (మేక అరుపు)

మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)

ప = పంచమం (కోయిల కూత)

ద = దైవతం (గుర్రం సకిలింత)

ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

నాదమూలమిదం జగత్. అసలు సృష్టికి శ్రీకరమే ఓంకారం. సర్వం ఓంకార సంభవం. స్వరం ఓంకార సంభవం. సంగీతం ఏ ఒక్కరి సొత్తూ కాదు. మన గుండె చప్పుడులో కూడా, మన బ్రతుకును శృతి చేసి లయ ఉంది.

సంతోషం, బాధ వేదన, ఆర్తి, దుఃఖం, క్రోధం, ఉల్లాసం.. వంటి ఎన్నో శ్రుతులు మన బ్రతుకులో ఉన్నాయి.
అదేవిధంగా, సంగీతం కూడా మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మన శరీరంలోని చక్రాలు సప్త స్వరాలతో అనుసంధానం కలిగి ఉన్నాయి. శరీరంలోని 72,000 నాడులు, 72 మేళకర్త రాగాలతో ఉత్తేజితమవుతాయట!

ఏ కళకైనా ఏ కలకైనా

జీవిత రంగం వేదిక కాదా

ఏ కళ రాణించాలన్న, ఏ కలను సాకారం చేసుకోవాలన్నా, జీవిత రంగమే మనకు వేదిక. అందుకే దీపం ఉండగానే ఇల్లు దిద్దుకోవాలి. ప్రతి వాక్యంలో ఇలాంటి జీవన సందేశం మనకు అందుతూనే ఉంటుంది.

ప్రజా ధనం కాని కళా విలాసం

ఏ ప్రయోజనం లేని వృథా వికాసం

సంగీతం సంఘ హితం. సంగీతం సర్వజనహితం. సంగీతం సర్వజీవహితం. అందుకే సంగీతం సామాన్యులకు కూడా అందుబాటులో రావాలనేది కవి అభిమతం. ఆ ప్రయోజనం లేని ఈ వికాసమైనా నిరుపయోగమే. ‘పరుల కోసం పాటుపడని మనిషి బ్రతుకు దేనికనీ?.. మూగ నేలకు నీరందించని వాగు పరుగు దేనికని?’ అని ప్రశ్నిస్తారు తన ప్రఖ్యాతమైన గజల్ లో డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు.

కూసే కోయిల పోతే కాలం ఆగిందా?

పారే ఏరే పాడే మరో పదం రాదా?

మురళికి గల స్వరముల కళ

పెదవిని విడి పలకదు కద ||తరలి రాద||

అసలు ఇంత గొప్ప expression ని ఏమని వర్ణించాలి? నా కోడి నా కుంపటి లేకపోతే తెల్లారదు! అని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే. జీవితంలో ఏదీ, ఎవరి కోసం ఆగదు.‌ కోయిల పాటతో వసంతకాలం ఆగిపోతే… మరో ఋతువు వస్తుంది.. మరో పాట పాడుతుంది.. ఇదే హృద్యమైన భావాన్ని వివరిస్తుంది ఆల్ఫ్రెడ్ టెనిసన్ కవిత.

‘The Brook’: అనే తన కవితలో Alfred Lord Tennyson, ఒక సెలయేరు మనోగతాన్ని ఈ విధంగా వివరిస్తాడు..

‘And out again I curve and flow / To join the brimming river, / For men may come and men may go, / But I go on for ever,’..

నదితో సంఘమించడానికి సెలయేరు అలా పరుగులు పెడుతూనే ఉంటుంది.. ‘మనుషులు రావచ్చు పోవచ్చు, కానీ నేను మాత్రం కొనసాగుతూనే ఉంటాను’, అంటుందట సెలయేరు.

Ode to Autumn అనే ప్రఖ్యాత కవితలో John Keats హేమంత రుతువుకు కితాబునిస్తూ ఇలా అడుగుతాడు..

Where are the songs of Spring?

Ay, where are they?

Think not of them, thou hast thy

music too,–

ఓ హేమంతమా? నీలో వసంత మాసపు సరిగమలెక్కడ? అని ప్రశ్నించి, అయ్యో! వసంత గీతాలు లేవని దిగులు పడకు! నీదైన సంగీతం నీకు ఉంది అని ఓదారుస్తాడు..

ఇదే ఓదార్పు.. ఇదే శైలి.. ఇదే హైట్స్ ఆఫ్ పాజిటివిటీ.. అడుగడుగునా సిరివెన్నెల సాహిత్యంలో మనకు కనిపిస్తాయి. అంత గొప్ప మురళీ స్వరం మనల్ని అలరించాలంటే, దానికి పెదవుల సహాయం కావాల్సిందే! అంత గొప్ప సంగీతం రాణించాలంటే, సామాన్యుడి సహవాసము కావలసిందే!

ఇదీ, సిరివెన్నెల బాణీ. కలం కదిలితే పాజిటివ్ విస్ఫోటం జరిగినట్టే.. సిరా చుక్క ఒలికితే చైతన్యపు ఉప్పెన కట్టలు తెంచుకున్నట్టే. పామరులైన నాలాంటి శ్రోతల (వనాల) కోసం, మనసున నాటుకునే సినీ గేయాలతో.. మన దరికే తరలివచ్చిన సాహితీ వసంతం.. మన సిరివెన్నెల!

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here