మలేషియన్ లఘు చిత్రం “సిసా బినాసా”

0
8

[dropcap]ఒ[/dropcap]క సినిమా వ్యాకరణాన్ని చదవడానికి లఘు చిత్రాలు పనికొచ్చినంతగా పూర్తి నిడివి చిత్రాలు పనికి రావు. ఈ వారం హిందీ లఘు చిత్రం కాకుండా మలేషియన్ లఘు చిత్రం చూసాను. “సిసా బినాసా” కు ఫిటా అవార్డు లభించింది. దర్శకుడు రిధ్వాన్ సైది. చాయాగ్రహణం అమిరుల్ రహ్మాన్ ది.
చిత్రం మొదలవడం చీకటితో, నిశ్శబ్దం తో. తర్వాత మనకు కనబడేది తక్కువ వెలుతురులో ఒక దృశ్యం. ఇద్దరు కుర్రాళ్ళు నిలబడి చూస్తున్నారు. ఒక బాధితుడు లేదా బాధితురాలు మోకాళ్ళ దగ్గర మడచి, కాళ్ళు జాపి కూర్చుని వున్నాడు/వున్నది. ఆమె/అతని లోంచి ఆ పీడిస్తున్న ప్రేతాత్మను బయటకు తీసే పనిలో ఒక మాంత్రికురాలు. ఆమె ఆ ప్రేతాత్మను వెలికి తీసి వొక కుండలో పెట్టేస్తుంది. ఆ తర్వాత దాన్ని దూరంగా వున్న చెరువులో విసర్జన చేయమంటుంది. ఆ కుర్రాడు దగ్గరికెళ్ళి చూస్తే కుండలో ఒక ముఖం కనిపిస్తుంది, ఒక కంటితో చూస్తూ నవ్వుతున్న ముఖం. రెండో కంటికి నల్లని గుడ్డ కప్పేసి వుంటుంది. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఆ పని చేస్తారు. తర్వాతి దృశ్యం పైనుంచి వాలుగా కిందకి దిగుతున్న, బాగా గడ్డి మొలిచిన నేల, నుంచి చూపిస్తాడు దర్శకుడు. తెరంతా ఆ గడ్డే. ఆ తర్వాత హంటర్ తో కొడుతున్న చప్పుడు. అది మనం తర్వాత పోల్చుకుంటాం. ఒక కావడికి ఆ కుండను కట్టి ఇద్దరు కుర్రాళ్ళు భుజాన మోసుకుంటూ వస్తున్నారు.

వెనుక ఆ మూడవ వాడు వెనక వున్న కుర్రాడి వీపు మీద కొరడా దెబ్బలు వేస్తుంటాడు. సంగీతం భయం కొలిపేదిగా వస్తుంది. గడ్డి పొదల మధ్య సన్నటి నడక దారి వెంట వాళ్ళు నెమ్మదిగా వస్తున్నారు. ఒక చోట ఆగాల్సి వస్తుంది. పక్కన ఉన్న అడవిలోంచి ఒక స్త్రీ ఆత్మ పవిట్లో డప్పు లాంటిది దాచుకుని వస్తుంది. ఒక చోట మోకాళ్ళ మీద కూర్చుని, ఆ డప్పు తీసి మోగిస్తుంది. తర్వాత అంటుందీ : ఈ ప్రకృతి మనల్ని బతికిస్తున్నది. గాలులు చెరువు మీంచి వీస్తున్నాయి, చల్లగా, స్వచ్చంగా. ఆ నీటితో మనకు పంటలు పండి తిండి దొరుకుతున్నది. మీరు చేసే పని వల్ల ప్రకృతికి చేటు కలిగి, మనకు కష్టకాలం వస్తుంది. ఇది తెలుసుకోండి. ఇంతవరకూ చెప్పి (వాచ్యంగా డైలాగు ఇదే. మొదట్లో మాంత్రికురాలన్నది తెర మీద టెక్స్టు, చాప్లిన్ తొలి సినిమాల్లో లాగా) ఆమె వెను తిరిగి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఆ కొరడా అతను ఆ ఆత్మను కొరడాతో బాదుతుంటాడు. కాని ఆత్మకు తగిలితే కదా. కావడిని వెనక నించి మోస్తున్నతను భయపడి కావడిని కిందకు దించి, పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అతని పరుగు కింద నుంచి పైకి. ఆ తర్వాత మిగిలిన ఇద్దరూ కావడిని మోస్తారు. ఇప్పుడు కెమెరా ముందు ఆ ముందున్న కుర్రాడు నెమ్మదిగా ఆ కుండను ఈడ్చుకుంటూ వస్తున్నాడు. అది చాలా బరువుగా వుందేమో అనిపించే దృశ్యం. నెమ్మదిగా నీళ్ళు పారుతున్న చప్పుడు వినిపిస్తుంది. అతను కుండను వొంచుతాడు. ఇక్కడ ఒక సెమి సర్కిల్ షాట్ వుంది. ఆ భయంగా ఉన్న కుర్రాడి ముఖం నుంచి చుట్టూ తిరిగి ఆ చెరువును చూపిస్తుంది. ఇప్పుడు వెక్కిరింతగా నవ్వుతున్న శబ్దాలు వినిపిస్తాయి. ఏవో ఆత్మలు నీటి పైన కనిపిస్తాయి. చివరి సీన్ జూం అవుతూ ఒంటి కన్ను మనిషి ముఖం మీద, చివరికి అతని కనబడుతున్న పళ్ళ మీదకు వెళ్ళి ఆగుతుంది. ఇంతా చేసి చిత్రం నిడివి ఆరు నిముషాలు. “సిసా బినాసా”కు తెలుగులో పదం తెలీదు, అస్థికలు లాంటి అర్థం చెప్పుకోవచ్చేమో.
కథా కాలం 1718. ప్రాంతం మలేషియా లోని పసిర్ ఉడాంగ్. ఆ స్థల పురాణం ఏదో వుండొచ్చు, మనకు తెలీదు. కాని విషయం సార్వజనీనం, సర్వకాలికం కాబట్టి మనం ఇడెంటిఫై అవుతాము.
కెమెరా పనితనం, సంగీతం (ఎవరో తెలీదు) చక్కగా వున్నాయి. యూట్యూబ్ లో వుంది, చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here