యుద్ధం, ప్రేమ కలగలిసి కలకాలం నిలిచే చిత్రరాజం ‘సీతారామం’

2
12

[dropcap]“ఇ[/dropcap]రవయ్యేళ్ల క్రితం రామ్ నాకిచ్చిన ఈ ఉత్తరం సీతకు చేర్చాల్సిన బాధ్యత నీది” అని తన తాత, పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తరాన్ని తప్పనిసరి పరిస్థితిలో అయిష్టంగానే తీసుకొని, తను ఇష్టపడని ఇండియాకి బయలుదేరింది ఆస్రిన్ (రష్మికా మందన్నా). సీత అంటే ఎవరికీ తెలీక పోవడంతో – లెఫ్టినెంట్ రామ్, మద్రాస్ రెజిమెంట్, 1965 కమీషన్డ్, వర్కింగ్ ఇన్ సియాచిన్ అనే ఆధారం పట్టుకొని అన్వేషించ నారంభించింది తన సీనియర్ బాలాజీ (తరుణ్ భాస్కర్) సాయంతో. ఒక్కొక్కరినీ కలుస్తున్న కొద్దీ సీత, రామ్‌ల అద్భుతమైన ప్రేమకథ తెలుసుకోసాగింది.

దుల్కర్ సల్మాన్ తెలుగు డబ్బింగ్ సినిమాలను ఇష్టపడే తెలుగువారు ‘మహానటి’తో పూర్తిగా ఫిదా అయిపోయారు. పైగా హను రాఘవపూడి దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచే మనసు’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ప్రేక్షకులు ఆదరించి, అతని దర్శకత్వం, స్క్రీన్ ప్లే పట్ల ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ఆ అంచనాకు తగినట్లుగా చాలా శ్రమ పడి, యుద్ధం నేపథ్యంలో ప్రేమకథని ఒక అందమైన దృశ్య కావ్యంగా తీసుకువచ్చాడు. తనదైన పద్ధతిలో ఉత్కంఠ కలిగించేలా స్క్రీన్ ప్లే రాసుకొన్నాడు.

జమ్ము కాశ్మీర్‌లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్ ఉగ్రవాదులు కొందరు మైనర్ కుర్రాళ్ళని పంపడం, ఇండియన్ ఆర్మీకి ఆ సమాచారం తెలిసేలా చేయడం, వారిని ఆర్మీ చంపడంతో – ఇండియన్ ఆర్మీకి పాకిస్థాన్ ముస్లింలకు శత్రుత్వం కల్పించి తద్వారా హింసను రేకెత్తించాలని ప్రయత్నం చేసారు. దాన్ని గుర్తించి విధ్వంసాన్ని అరికట్టడంలో ఆర్మీ విజయవంతమైంది. ఆ సందర్భంగా ఆకాశవాణి రేడియో కేంద్రం నుండి విజయలక్ష్మి (రోహిణి) వచ్చి వారిని ఇంటర్వ్యూ చేయడంతో అసలు కథ ప్రారంభమౌతుంది.

రామ్‌కి ఎవరూ లేరని తెలిసి ‘మేమున్నాం’ అంటూ తల్లితండ్రులుగా, సోదరీ సోదరులుగా, మిత్రులుగా ఎందరో ఉత్తరాలు రాస్తారు. వారి ఆప్యాయత చూసి తాను అనాథ కాదని సంతోషపడి అందరికీ రిప్లై ఇస్తాడు. ఆ క్రమంలో ఒక ప్రత్యేకమైన ఉత్తరం… ‘మీ భార్య సీతామహాలక్ష్మి’ అంటూ వచ్చింది. ఫ్రం అడ్రస్ లేదు. భావుకత నిండిన ఆ ఉత్తరాలు అతని మనసులో గాఢంగా హత్తుకుపోయాయి. తనూ జవాబులు రాసాడు కానీ పోస్ట్ చేయడానికి ఫ్రం అడ్రస్ లేదు.

రామ్ సీతను అన్వేషించడం, కలుసుకోవడం, వారిద్దరి మధ్య సంభాషణలు, సన్నివేశాలు, ప్రేమ అద్భుతంగా చిత్రీకరించబడింది. 1965 నాటి వేషధారణ, సెట్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సున్నితమైన ప్రేమ సన్నివేశాలు, సంభాషణలు పట్ల యువ ప్రేమికులు లీనమై పోవడమే కాక, పెద్దవారు గత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు. మొత్తానికి ప్రేక్షకుల కళ్ళు, మనసు సినిమాకి అతుక్కుపోయేలా చేయడంలో సాంకేతిక వర్గం సఫలీకృతం అయ్యారు. పాటల రచన (సిరివెన్నెల గారు రాసిన చివరిపాట), మెలోడీ సంగీతం విశాల్ చంద్రశేఖర్ వీనులవిందుగా అందించారు.

మతం ప్రస్తావన వచ్చినా రామ్ వంటి కమిట్మెంట్ ఉన్న సైనికులు, 1965 నాటి కొన్ని వాస్తవిక సందర్భాలు, పాక్ ఆక్రమిత భారత భూభాగం, ఆయుబ్ ఖాన్, లాల్ బహదూర్ శాస్త్రి ప్రస్తావన, భారత సైనికులు పాకిస్థాన్‌కి చిక్కితే ‘చచ్చిపోతే బాగుండు’ అనుకునేంతగా వారు పెట్టే హింసలు, కొన్ని సందర్భాల్లో దేశ సంక్షేమం కోసం ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి… సినిమాతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కాశ్మీర్ అందాలు, నవాబుల రాయల్ ప్యాలెస్ సెట్టింగ్స్, పాటల నేపథ్యం దృశ్యాలు కెమెరాలో అందంగా బంధించడంలో వినోద్, కృష్ణల ఫోటోగ్రఫీ పెయింటింగ్ లను చూస్తున్నామా అన్నంత అబ్బురంగా ఉంది.

యార్లగడ్డ సుమంత్ నెగెటివ్ పాత్ర పోషించడంలో ఆశ్చర్యంగా మంచి మార్కులు కొట్టేసాడు. లెఫ్టినెంట్ విష్ణు సార్ లోని భిన్న కోణాలను బాగా ప్రదర్శించాడు. సీతగా మృణాల్ ఠాకూర్ అందం, అభినయం చాలా రోజులు గుర్తుండిపోయేలా ఉంది. ముస్లిం యువతిగా, సీతా రామ్‌లను అర్థం చేసుకునే మనసున్న మనిషిగా రష్మికకు దొరికిన మంచి పాత్రకు న్యాయం చేసింది.

అసలు పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ మనవరాలు ఆస్రిన్ ఒక ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్ ఉత్తరాన్ని సీతకు ఎందుకు అందించాలి? ప్రిన్సెస్ నూర్జహాన్ ఎవరు? రామ్‌ని వెదుకుతున్న ఆస్రిన్‌ని గురించి విష్ణు సార్ ఎందుకు కంగారు పడ్డాడు? గౌతమ్ మీనన్ పాత్ర ప్రాధాన్యత ఏమిటి? చివరికి రామ్ ఏమయ్యాడు? అనూహ్యమైన ట్విస్ట్‌లు సినిమాలో చూస్తేనే థ్రిల్. నిజంగా ఒక క్లాస్ మూవీ.

దేశమంతా ఆజాదీ కా అమృతోత్సవ్ జరుపుకొంటున్న సమయంలో, చాలా రోజులు తర్వాత ఫీల్ గుడ్ మూవీ, హార్ట్ టచింగ్ మూవీ వచ్చింది. సినిమా ప్రారంభం కమిట్మెంట్ ఉన్న లెఫ్టినెంట్‌గా యుద్ధం, మధ్యలో సిన్సియర్ ప్రేమ కోసం యుద్ధం, చివరిలో రామ్ తన మనసుతో వ్యక్తిత్వంతో యుద్ధం…! గెలిచాడా అన్నది నిరభ్యంతరంగా కుటుంబంతో తెర మీద చూడాల్సిందే. ఇలాంటివి ఓటీటీ లలో చూడడం నటీనటులకు, సాంకేతిక వర్గానికి అన్యాయం చేసినట్టే.

ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రలు కొంచెం సేపే అయినా ముఖ్యమైనవి. విడుదలైన ఒక్కరోజు లోనే కోటిన్నర వ్యూయర్స్‌ని సంపాదించుకొన్న ట్రైలర్ అంచనాను మరింత పెంచింది సినిమా.

నటన తండ్రి మమ్ముట్టి వారసత్వంగా వచ్చినా దుల్కర్ సల్మాన్ తనదైన ముద్రతో ప్రతి పాత్రకూ కష్టపడుతున్నాడు. సీతారామంలో లెఫ్టినెంట్ గానూ, లవర్ బాయ్ గానూ నటనలోనే కాకుండా, ముఖ కవళికలు లోనే అనేక భావాలు పలికించడంలో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు.

వైజయంతి మూవీస్, స్వప్న మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here