సీత-15

0
8

[dropcap]“అ[/dropcap]మ్మా!” వేణు పిలిచాడు. ఏదో ఆలోచిస్తున్న కృష్ణవేణికి ఈ పిలుపుకి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది.

“ఏంట్రా? రా కూర్చో…!”

“ఏం ఆలోచిస్తున్నవమ్మా?” తన తల్లి భుజం మీద చేయివేశాడు.

“ఏం లేదురా… !” కృష్ణవేణి కన్నీళ్ళు తుడుచుకుంది.

“ఏం బాధ పడకు….! అంతా సర్దుకుంటుంది. నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నాను. కాని రేవతి నీతో ఉంటుంది. ఒక రెండు నెలపాటు. నువ్వు ఈ లోగా పెన్షన్ పనులు పూర్తిచేసుకొని…. తనతోపాటు నా దగ్గరికి వచ్చేయి.” అన్నాడు.

***

మరుసటి రోజే వేణు తిరుగు పయనమయ్యాడు.

అబ్బా ఎనిమిది దాటింది. రేవతి ఇంకా లేవలేదు. కాఫీ కూడా అడుక్కోవాల్సి వస్తుంది.

“నా ఖర్మ” కృష్ణవేణి తిట్టుకుంటూ… వెళ్లి… కాఫీ పెట్టుకొచ్చింది.

రేవతి లేచేటప్పుటికి తొమ్మిది దాటింది.

“ఏమమ్మా… ! ఇంకొంచెం సేపు పడుకొని ఉంటే…. మధ్యాహ్నం భోజనం కూడా సిద్ధంగా ఉండేది కదా….” అని వ్యంగ్యంగా అంది.

విచిత్రం… రేవతికి తిట్లు కూడా అర్థం కావు. కృష్ణవేణి అన్నది పట్టించుకోలేదు. రేవతి వాచి వంక చూసింది.

“అమ్మో! తొమ్మిది అయ్యింది. ఏం చేయాలి… అత్తయ్యా… వచ్చే రెండు నెలలు ఇంటినుంచి పని చేస్తానని మా కంపెనీ వాళ్ళని అడిగాను. అలా చెయ్యాలంటే…. రాత్రిపూట పనిచేయాల్సి ఉంటుంది. అమెరికా టైంలో అని…. వాళ్లు కండిషన్ పెట్టారు.”

“ఏం ఐ.టి. కంపెనీలో ఏంటో?…” కృష్ణవేణి మొఖం తిప్పుకుంది.

ఇంట్లో పని తప్పించుకోవటానికి కాకపోతే… రాత్రి పని చేయడం ఏమిటి? అన్నీ అబద్ధాలే. నేను పిచ్చి మొహాన్ననుకుంటుందో ఏమిటో…! రాత్రంతా కూర్చుని ఆ కంప్యూటర్ చూస్తుంది అంతే.

మధ్యాహ్నం భోజనం చేసి… మళ్ళీ పడుకుంది రేవతి. రేవతి వ్యవహారం కృష్ణవేణికి పిచ్చెక్కించేస్తుంది.

పొద్దున పదింటికి లేవడం…. ఏంటని అడిగితే రాత్రంతా పని అని చెప్పడం. రోజూ వాళ్ళమ్మతో అక్కతో గంటలు గంటలు మాట్లాడటం.

ఏదో ఒకటి ఇష్టమన్నట్లు…. వంటచేసి…. మొఖాన కొట్టడం. చూసి చూసి…. భరించలేక…. తన కొడుకుతో చెప్పింది.

“పోనీలే అమ్మా, నేర్చుకుంటుంది.” అని విషయం పక్కన పెట్టాడు.

అస్సలు వాడు నా మాట వింటే కదా! ఛీ ఛీ ! ఏంటో ఉన్న ఒక్కగానొక్క కొడుకు… జీవితం ఇలా తయారైంది.

ఈ పిల్లతో వీడి జీవితం ఏం బాగుంటుంది? కృష్ణవేణి రోజూ బాధపడేది.

చిన్న చిన్న తగాదాలు, గొడవలు, ఓదార్పుతో రెండు నెలలు చిటికెలో అయిపోయాయి.

***

రేవతి తిరిగి వెళ్ళేరోజు రానేవచ్చింది. వెళ్ళే ముందురోజు రేవతి షాపింగ్ చేసుకొని వచ్చి… కృష్ణవేణికి చూపింది.

చాలానే షాపింగ్ చేసింది.

అమ్మో మొత్తం ఖర్చు ముఫ్పై వేలా?

కృష్ణవేణి గుండె గుబేలు మంది. ఈ మహాతల్లి వాడిని మొత్తం కరిగించేస్తుంది. వాడికేవేమీ అర్థం కావు. పెళ్ళాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు.

ఏంటో వాడి జీవితంలో సంతోషం లేదు. జరిగిందంతా తలచుకొని కృష్ణవేణి బాధపడిరది. ఉత్తరం తీసి…. లోపల పెట్టి… ఇంటి పనుల్లో మునిగిపోయింది.

***

కృష్ణవేణి కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉంది. ఎదురుగా వేణు. పక్కనే డాక్టర్ కూడా.

“ఎలా ఉందమ్మా!” వేణు పలకరించాడు.

కృష్ణవేణి నీరసంగా తలూపింది.

బాత్రూమ్‌లోకి వెళ్ళాక…. శరీరంలో ఎడమభాగంలో విపరీతంగా నొప్పి మొదలైంది. అది పెద్దదై…. ఒక్కొక్క అవయవం పట్టు తప్పిపోతుంది. అరుద్దామన్నా… నోరు పెగలటం లేదు. తెలియకుండానే తాను స్పృహ తప్పి పోయింది. ఆ తరువాత ఏం జరిగిందో తనకి గుర్తులేదు. లేచేటప్పటికి ఇదిగో ఇలా ఆసుపత్రిలో…

“నువ్వెప్పుడు వచ్చావు రా?” కృష్ణవేణి నోటినుంచి మాట రావటం కష్టంగా ఉంది.

“ఈ రోజు పొద్దున్నే అమ్మా…!”

“ఎన్ని రోజులైంది ఇక్కడ చేరి…” భయంగా అడిగింది.

“నిన్న పొద్దున్నే…. పనమ్మాయి చూసి… పక్కింటివాళ్ళ సహాయంతో చేర్పించిందంట అమ్మా!”

“దేవుడా! నిన్న పొద్దుటినుంచి ఈ రోజు సాయంత్రం వరకు స్పృహలో లేనా? ఏం జరిగిందో ఏమిటో?”

కృష్ణవేణి నీరసంగా కళ్ళుమూసుకుంది.

తనకి పెరాల్సిస్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారట. కాని అదృష్టం బాగుండి… చాలా చిన్నగా వచ్చిందంట. మిగతా అంతా బాగానే ఉందట.

కేవలం నా ఎడమ అరచేయి, వేళ్ళకు స్పర్శ ఉండదు. అంతే మాట్లాడటం, నడవటం, నా గుండె, అన్నీ బాగానే ఉన్నాయట. రెండోసారి రాకుండా జాగ్రత్తపడమని చెప్పి.. నన్ను ఇంటికి పంపించారు.

***

ఢిల్లీకి వచ్చి రెండు వారాలు అవుతుంది.

పాపం వేణు ఇంట్లో ఉండి… తనని చూసుకుంటున్నాడు.

ఢిల్లీలో ఇల్లు చాలా చిన్నది. అస్సలు ఊపిరే ఆడదు. అన్ని గదులు అగ్గిపెట్టెల్లా ఉన్నాయి.

చిన్నహాలు, అందులోనే వంటగది. హాలును అనుకొని ఇంకో చిన్న రూమ్.. అది బెడ్ రూమట.

పక్కన ఎవరో తెలియదు. ముందు ఎవరో తెలియదు. ఎంతసేపు ఆ నాలుగు గోడల మధ్యలోనే చావాలి. తన కొడుకు ఇంట్లో ఉండబట్టి సరిపోయింది. లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో?

రేవతి పొద్దున్నే ఆరు ఇంటికి వెళ్ళిపోతుంది. రాత్రి తొమ్మిది తరువాత వస్తుంది. ఇంటి పని ఒక్కటీ పట్టించుకోదు. మా వాడే వంట, ఇంటికి కావల్సిన సామాన్లు, అన్నీ చూసుకోవాలి. ఆదివారం మాత్రం ఇల్లు కడిగి, శుభ్రం చేస్తుంది. బట్టన్నీ ఉతుకుతుంది. అదీ వాడు సహాయం చేస్తేనే.

“ఏరా! మీ ఆవిడ వంట చేయదా?” ఇక ఉండలేక అడిగేశాను.

“చేస్తుంది. ఎందుకు చేయదు?”

“మరి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా వంట చేయడం చూడలేదు.”

“అదా! నేను ఇంట్లో ఉంటున్నాను కదా… అందువల్ల చేయట్లేదు.. అంతే.”

ఏంటో! వీడికి పెళ్ళాం అంటే పిచ్చిప్రేమ. పోనీ నేనైనా చెబుదాం అంటే… అసలు ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే కదా! ఒక్కోసారి రాత్రి కూడా ఇంటికి రాదు.

అయినా సందర్భం వచ్చినప్పుడల్లా … కృష్ణవేణి తాను అత్తకి, భర్తకీ ఎంత సేవ చేసేదో చెప్పేది.

ఇక లాభంలేక…. తన కొడుకు పడేబాధ చూడలేక… కృష్ణవేణి రంగంలోకి దిగింది. తను వంట చేయడం మొదలుపెట్టింది.

పాపం వేణు తన వంటని ఆవురావురని తింటుంటే జాలివేసేది.

ఇంటిపని అంతా తనే చేస్తున్నాని… రేవతి తనని ఎంతో కష్టపెడుతుందని… తను ఎంతో మంచి అత్త అని వెనుక నుంచి కృష్ణవేణి వెటకారంగా, వ్యంగ్యంగా అంటూనే ఉండేది.

రేవతి రాత్రి వచ్చి… తను చేసిన వంట హాయిగా తిని…. ఇక మిగిలింది ఏమైనా ఉంటే….ఏం మొహమాటం లేకుండా… మరుసటి రోజుకి టిఫిన్ డబ్బా పెట్టుకెళ్ళేది. కృష్ణవేణి చెప్పిందంతా వినేది తప్ప కనీసం మీకేమన్నా కావాలా? ఏమన్నా చేయాలా? అని మాట వరుసకి కూడా అడిగేది కాదు.

అయినా వీడికి తగిన శాస్తి జరిగింది. ఎంత చెప్పినా వినకుండా…. లవ్ మేరేజ్ చేసుకున్నాడు. కసిగా తన కొడుకుని తిట్టుకుంది.

చూస్తూ చూస్తూ రెండు నెలు గడిచిపోయాయి.

వేణు రెండు గంటల్లో వస్తానన్నాడు. ఎనిమిది కావొస్తుంది.

కాసేపటికి రేవతి ఇంటికి వచ్చింది. వస్తూనే బ్యాగ్ పక్కన పడేసి… కిచెన్‌లోకి వెళ్ళి… ఏముందని గిన్నె వెతికింది.

కృష్ణవేణికి అరికాలి మంట నెత్తికెక్కింది. అస్సలు పనిచేయదు. ఇంకా ఏముందని వచ్చి అడుగుతుంది. ఏంటో నేను… నా కొడుకు సేవకుల్లాగా…

తన కోపాన్ని అణుచుకుంటూ “వేణు ఇంట్లో లేడు.” అంది.

“నాక్కూడా ఓపిక లేదు. అందుకే చేయలేదు.” కృష్ణవేణి కోపాన్ని అణుచుకుంటూ…. మొఖం పక్కకు తిప్పుకుంది.

రేవతి ఇవేమి పట్టించుకోలేదు.

“అయ్యో అవునా….? నాకు బాగా ఆకలేస్తుంది అత్తయ్యా”

“ఏవమ్మా! ఈ రోజు నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా!”

రేవతి ఏదో ఆలోచిస్తున్నట్టు మొఖం పెట్టింది.

“హు… ! సరే మీరు ఏం తింటారు?”

అబ్బా…! కృష్ణవేణికి ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. ఏం చెప్పను? పెళ్ళైన సంవత్సరంలో… మొదటిసారి కావచ్చు…. రేవతి తనని అడిగింది.

ఏం చెబుదామా…? అని కృష్ణవేణి ఆలోచించే లోపే…

“మీకు చేప పులుసంటే ఇష్టం కదా…!” అంది రేవతి.

“అవుననవును…!” కృష్ణవేణి ఆశగా తల ఊపింది.

“ఒక్క నిమిషం!”

రేవతి టకటకా బ్యాగ్ లోంచి ఫోన్ తీసి…. రెండు నిమిషాల్లో ఎవరికో ఫోన్ చేసి…”ఒక చేప పులుసు, రెండు హైదరాబాద్ చికెన్ బిర్యానీ… హోం డెలివరి… కొంచెం తొందరగా బాబు … చాలా ఆకలిగా ఉంది.” అంది.

“అత్తయ్య మీకు ఇంకేమన్నా కావాలా?” వినయంగా కృష్ణవేణిని అడిగింది…!

‘ఓర్నీ …!’ కృష్ణవేణికి కళ్ళు తిరిగిపోయాయి. నోట మాట రాలేదు. ఒక పదినిమిషాలు తనను తాను సర్ది చెప్పుకుంది. కానీ ఇక లాభం లేదు. ఈ రోజు తాడోపేడో తేలాల్సిందే.

“రేవతీ…”

“ఏంటి అత్తయ్య…!”

‘ఏమ్మా! కొంచెం పని చేస్తే ఏమన్నా అరిగిపోతావా? భర్తకి, అత్తకి చేయడం నామోషి అనుకున్నావా?” కృష్ణవేణి కోడలును నిలదీసింది.

“అయ్యో అదేం లేదు…! అలసిపోయాను అందుకని…!”

కృష్ణవేణి ఇంకేం మాట్లాడలేదు.

“అయినా నాకు వంట సరిగా రాదు అత్తయ్యా..!”

“నేనేమన్నా నిన్ను రుచిగా వండమన్నానా? వచ్చిందే చేయొచ్చు కదా.”

“చేయొచ్చు… కానీ ఏం చేయను? టైం లేదు!” జాలిగా అంది.

కృష్ణవేణి ఇంకేం మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే…. మళ్ళీ వాడికేం ఎక్కిస్తుందో మహాతల్లి…

ఏం పాపం చేసుంటే…. ఇలాంటి కోడలు దొరికిందో? పోనీలే… నా కొడుకు మాత్రం తల్లి రుణం తీర్చుకుంటున్నాడు.

రెండు నెలలనుండి ఇంటి పట్టునే ఉండి… నన్ను చూసుకున్నాడు. నేను లేచి… మామూలుగా తిరుగుతున్నా అంటే అది వాడి చలవే.. నేను చేసుకున్న పుణ్యమే…

కృష్ణవేణి ఆరోగ్యం మొత్తం కుదుటపడింది. ఎడమచేతిలో కొంచెం స్పర్శ లేదనేదే తప్ప… ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు.

ఆరోగ్యం కుదుటపడ్డాక తిరుపతికి వస్తానని మొక్కుకుంది.

మధ్యాహ్నం ఒంటిగంట కావొస్తుంది. వేణు ఏ నిమిషమైనా రావొచ్చు.

కృష్ణవేణి హడావిడిగా వంట చేస్తుంది.

కాలింగ్ బెల్ మోగింది.

వేణునే ….. అనుకుంటా!…..

కృష్ణవేణి తలపు తీసేసరికి …. వేణు, రేవతి ఇద్దరూ ఉన్నారు.

మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి.

“ఏంటీ?” అనే లోపే…

వేణు కృష్ణవేణి భుజం మీద చేయివేసి… దగ్గరికి తీసుకున్నాడు.

“అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది.”

కృష్ణవేణికి ఆనందం కన్నా ఎక్కువగా అవాక్కయింది.

“ఏంటి? మరి… నీకు ఇన్ని రోజులు ఉద్యోగం లేదా?”

“లేదు అమ్మా…! అందుకే కదా ఇంట్లో ఉన్నాను…”

“నువ్వు నాకు ఒంట్లో బాగోలేదని సెలవు తీసుకున్నావనుకున్నా..!”

“నాలుగు నెలలు ఎవరమ్మా సెలవు ఇచ్చేది?” నవ్వుతూ వేణు సోఫాలో కూలబడ్డాడు.

“అబ్బాఁ ఎంత వెతికాను? ఈ ఉద్యోగం కూడా వస్తుందని అస్సలు నమ్మకం లేదు. ఏదో దేవుడి దయ….”

“అయ్యో! మరి నీకు ఉద్యోగం లేకపోతే ఇంటి అద్దె….. నా మందులు… హాస్పిటల్… ఇవ్వన్నీ ఎలా గడిచాయి రా…!”

“అందుకే కదా…రేవతి ఓవర్ టైమ్, నైట్ షిఫ్ట్ చేస్తోంది….” తాపీగా చెప్పాడు.

“అత్తయ్యా! వంట అయ్యింది. ఆకలేస్తోందా?” రేవతి వంటింట్లో ఏదో వెతుకుతుంది .

మొట్టమొదటిసారి రేవతి కల్మషంలేని పసిపిల్లలా కృష్ణవేణికి కనిపించింది. భోజనం చేస్తున్నంతసేపు ఏదో పశ్చాత్తాపం.

“వాడికి ఉద్యోగం లేదన్న విషయం నాతో ఒక్కమాటైనా చెప్పకూడదా?”

“దాని దేముంది అత్తయ్యా.. అయినా ఈ రోజుల్లో ఉద్యోగాలు పోవడాలు… రావడాలు… అంతా మామూలే…! మామూలుగా నెలలో ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఎందుకో… ఈసారి ఆలస్యమైంది. అంతే… అయినా ఇప్పుడు దొరికింది కదా…!”

కృష్ణవేణి మనసంతా బాధతో నిండిపోయింది.

రేవతి ఎంతో హాయిగా…. ఏమీ జరగనట్టు చెప్పింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here