సీత-20

0
10

[dropcap]“ఏ[/dropcap]మిటి? అర్జెంట్‌గా మాట్లాడాని పిలిచావు?”

“రా ముందు కుర్చో…” రెబెక తన ముందున్న కుర్చీ చూపించింది.

“అసలు నేనే నిన్ను కలుద్దాం అనుకుంటున్నా…. నిన్ననే మా అమ్మ …” నా మాట ఇంకా పూర్తికాలేదు..

“నాకు హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి నా అడ్మిషన్ ఖాయం చేస్తునట్టు లెటర్ వచ్చింది.”

రెబెక ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కళ్ళలో సన్నని నీటిపొర… నేనేం మాట్లాడలేదు.. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. రెబెక చెప్పిన మాటకు సంతోషపడాలో… నా మాట చెప్పలేక పోయానని బాధపడాలో…. ఒక్క క్షణం ఏం తోచక… మౌనంగా ఉండిపోయాను.

“ఏంటి? నువ్వు సంతోషంగా లేవా?” డీలాగా ఉన్న నన్ను ఎగాదిగా చూస్తూ అంది.

“అయ్యో… అలాంటిది ఏమీ లేదు…. కంగ్రాట్స్….”

“నిజంగా మనస్ఫూర్తిగా చెప్పలేదు… ఏదో దాస్తున్నావ్….”

“అదే…. నీతో ఈ రోజు పెళ్ళి విషయం మాట్లాడదామనుకున్నా…. అమ్మ నిన్ను పరిచయం చేయమంటోంది.”

“పెళ్ళా?… ఇదేంటి కొత్తగా…” రెబెక ఆశ్చర్యంగా అంది.

“నా పైచదువు తరువాత అని… ముందే అనుకున్నాం కదా!”

నేనేం మాట్లాడలేదు….. రెబెక నా చేయి పట్టుకుంది.

“రాజీవ్ మన ఇద్దరి మధ్య ఈ ప్రేమ సరిపోదా? పెళ్ళి దేనికి? అదీ ఇప్పుడు… నా కలలు ఇప్పుడే కదా నిజమౌతున్నాయి.”

“కానీ… నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.. రెబెక. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను.”

రెబెక చిన్నగా నిట్టూర్చింది.

“నేను అర్థం చేసుకోగలను…. కాని నన్ను కూడా అర్థం చేసుకో… రాజీవ్, ఈ చదువు కోసం నేను ఎన్నో ఏళ్ళ నుంచి తపస్సు చేసాను. ఎన్ని వదలుకున్నాను? ఎంత కష్టపడ్డాను? ఒక రెండేళ్ళు ఆగు ప్లీజ్…. ఇప్పుడు పెళ్ళి అంటే నా ఇన్నేళ్ళ కల ముక్కలైపోతుంది.”

***

రెబెక నాకు ఫోన్ చేయక రెండు వారాలు దాటింది.

నేను ఫోన్ చెస్తే ఫోన్ ఎత్తటం లేదు. మరో వారం దాటాక రెబెక నుంచి ఫోన్ వచ్చింది.

“ఏమైపోయావ్…. ఇన్ని రోజులు?”

ప్రేమగా పైకి అన్నా…. లోపల నాకు చాలా కోపంగా ఉంది.

“ప్రాజెక్ట్ వర్క్‌తో బిజీ అయిపోయాను.” రెబెక పొడిపొడిగా మాట్లాడింది.

“ఏమిటి? వెళ్లిన రెండు నెలలలోపలే ఇంత మారిపోయావ్. కొంపదీసి…. ఎవరైనా స్టూడెంట్ నచ్చాడా ఏమిటి? ఎవర్నైనా ప్రేమిస్తున్నావా ఏంటి?”

రెబెక చిన్నగా నవ్వింది.

“నీకు నిజంగా అలా అనిపిస్తుందా?” రెబెక బాధగా అడిగింది.

“అయ్యో… నేను సరదాగా అన్నాను అంతే.”

“వెళ్ళిన మొదట్లో రోజుకి రెండుసార్లు మాట్లాడేదానివి.. ఇప్పుడు నెలకి ఒక్కసారి కూడా ఫోన్ చేయడం లేదు.” బెంగగా అన్నాను.

“సారీ రాజీవ్…. ఇంకోసారి ఇలా జరగదు. నా క్లాస్‌కి  టైం అయ్యింది. ఉంటాను.”

రెబెక చెప్పిందనే కాని… ఆచరణలో మాత్రం ఏదీ అలా జరగలేదు. ఎప్పుడో ఒకఫోన్, ఒక ఉత్తరం.

మధ్యమధ్యలో తను చేసిన రచనలను పంపించేది. నేను ఎన్ని ఉత్తరాలూ రాసినా, జవాబు రాలేదు.

ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.

ఒక రోజు రెబెక దగ్గర నుంచి ఇ-మెయిల్ వచ్చింది. అప్పుడు చదివితే అర్థం కాలేదు. రెబెక నన్ను ఎంత మోసం చేసింది, తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అనుకున్నాను. తనకి స్వార్థం మాత్రమే ఉంది అనుకున్నాను.

ఇదిగో మళ్ళీ నిన్న చదివాను.

“రాజీవ్!

ఎలా ఉన్నావ్? సారీ! నీకు చాలా రోజునుండి ఉత్తరం రాద్దామను కుంటున్నాను. కానీ.. పని ఒత్తిడివల్ల కుదరటం లేదు. ఉత్తరం ఎలా మొదలెట్టాలో…. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో…. అర్థం కావటం లేదు. రాజీవ్ నువ్వు ఒకసారి నన్ను అడిగావ్ గుర్తుందా? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా.. అన్నావు? ఆ రోజు నేను నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాను.

కాని ఆ రోజు నాలో ఆలోచన మొదలైంది. నీ అనుమానం నిజమే…

నేను ప్రేమిస్తున్నాను. నీ కన్నా, నా కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నా చదువుని ప్రేమిస్తున్నాను. ఒక పుస్తకం చదువుతూ…. నేను కూర్చున్న చోటునుంచి ఎన్ని గంటలు గడిచినా.. చివరికి రోజులైనా…. పుస్తకం పూర్తయ్యే వరకు జరగలేదనే విషయం నువ్వు నమ్మగలవా? కాని ఇది సత్యం. నేను ఒక పుస్తకం చదువుతుంటే నాకు ఆకలి, నిద్ర ఏమీ గుర్తుండవు. నేను దానిలో అంతగా లీనమైపోతాను.

రాజీవ్, ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను తప్పుగా అనుకోకు. కానీ నేను ఈ ప్రేమ, పెళ్ళి బంధాలో ఇమడలేనేమో అనిపిస్తుంది. అలా అని నిన్ను ప్రేమించటంలేదని అనుకోకు… నిన్ను ప్రేమించినంతగా… ఎవ్వరిని ఎప్పటికి ప్రేమించలేను. ప్రేమించను కూడా… ఎప్పటికి నా మనసులో నువ్వే వుంటావు.

కానీ నేను ఎంచుకున్న మార్గం వేరు. నా మార్గంలో పెళ్ళి, బంధాలకు నేను న్యాయం చేయలేను. నా జీవితం ఈ ప్రకృతికి అంకితం ఇద్దామనుకుంటున్నాను. కానీ నువ్వు నాకో మాట ఇవ్వాలి. నాకోసం నీ జీవితం వృథా చేసుకోవద్దు. వచ్చే నెల మా విశ్వవిద్యాయంనుంచి కొంతమంది కలసి ఒక ట్రూప్‌గా అంటార్కిటికాలో జంతువు గురించి పరిశోధన చేయడానికి బయలుదేరుతున్నారు. అందులో నేను ఒకదాన్ని.

నాకు చాలా గర్వంగా ఉంది. రాజీవ్ నేను వెళుతున్న ఈ బాటలో విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించు, ఉంటాను.

నీ రెబక”

***

బామ్మ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.

“సారీ రా… ఈ అమ్మాయి ఇలా విడిపోతుందని అనుకోలేదురా.”

నేను సమాధానంగా చిన్నగా నవ్వాను.

“నేను రెబకని వదిలేసాక మనిషిని కాలేకపోయాను. మళ్లీ మూడేళ్లు పట్టింది.ఇప్పటికీ తనంటే నాకు ప్రేమే. కాని అప్పుడు నేను వేరు ఇప్పుడు వేరు. అప్పుడు రెబెక చేసింది మోసం అనిపించింది, ఇప్పుడు త్యాగం అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు బామ్మా….! నీకేమనిపిస్తుంది? రెబెక నన్ను మోసం చేసిందనిపిస్తుందా?”

లేదని బామ్మా తల అడ్డంగా ఊపింది.

ఆ కదలికకు ఆమె కళ్ళల్లో నిండుకున్న నీళ్ళు జలజల కారిపోయాయి.

“మరి ఏమనిపిస్తోంది? రెబెక ఆశయం ముందు నా ప్రేమ చిన్నగా అనిపిస్తుంది కదా…”

బామ్మ అవునని తల ఊపింది.  త్యాగంలో ఉన్న గొప్పతనం అటువంటిది.

“కొన్ని సార్లు మంచి చేయడం కోసం చేసే ప్రయత్నం మోసం అవ్వదు బామ్మా. నను రెబెకని అర్థం చేసుకున్నట్టు, ఒక రోజు అంకుల్ కూడా నిన్ను అర్థం చేసుకుంటాడు.”

***

ఇన్నాళ్ళు నందిని విషయంలో ఉన్న సందిగ్ధత, ఇన్ని రోజులు ఉన్న చిక్కుముడి అంతా విప్పినట్టయ్యింది. ఆ సమస్యకు దారి దొరికినట్టనిపించింది.

“ఏంటి ఒంటరిగా మాట్లాడనన్నావంట?”

నందిని పిలుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను.

“షాపింగ్ ఎలా జరిగింది?” మాములుగా అడిగాను.

‘సూపర్…’ అని సైగ చేసింది నందిని.

“నందినీ..నువ్వు ఏం కోరుకుంటున్నావు?” నేను సరాసరి విషయానికి వచ్చాను.

“ఏ విషయం? పెళ్ళి గురించి కదా….”

నందిని తన రెండు చేతులు నడుంమీద పెట్టి… భుజాలు ఎగరేసింది.

“మళ్ళీ మొదలు పెట్టావా? ఎన్ని సార్లు చెప్పాలి సతీష్ నా గతం అని.”

“మరి నువ్వు ఎందుకు సంతోషంగా లేవు?”

“పెళ్లి కదా కొంచెం టెన్షన్ అంతే.!”

“సరే, నేను మొన్న కృష్ణవేణి గారిని కలిసాను.”

“ఎవరు? బామ్మ స్నేహితురాలు కదా.”

“ఆవిడ నన్ను ఒక ప్రశ్న వేసింది.”

“ఏంటది?” నందిని ఆతృతగా అడిగింది.

“నీకు రామాయణం తెలుసు కదా?”

“తెలుసు!”

“సీతని అగ్ని ప్రవేశం చేయమంటే అప్పుడు తలవంచి ఒప్పుకున్న సీత, రాముడు అడవికి పంపించినందుకు మళ్ళీ తిరిగి రాముడు దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని?”

“కోపం వచ్చి ఉంటుంది.”

“ఎందుకు కోపం? అడవికి పంపించడం అగ్నిప్రవేశం అంత పెద్ద శిక్ష కాదు కదా.”

నందిని పెదవి విరిచింది.

“జీవితం అంతా భర్త అడుగుజాడల్లో నడిచి తన పాతివ్రత్యాన్ని చాటిన సీత భర్తను వదిలేసి సమాజానికి ఏం చెప్పాలనుకుంది?”

“నాకు తెలీదు రాజీవ్! నువ్వే చెప్పు.”

“అగ్నిప్రవేశం చేయమన్నది సీత తను నమ్మిన ధర్మాన్ని కాపాడడానికి. అదే రాముడు సీతను అడవికి పంపించింది తను మహారాజు అన్న కిరీటాన్ని కాపాడడానికి! ఏంటి అర్థం కాలేదా??”

సీతా రాముడితో అడవుల వెంట నడిచి సహధర్మచారిణిగా ధర్మాన్ని చాటింది. లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు తను నమ్మిన ఆ ధర్మాన్ని ప్రపంచానికి నిరూపించడానికి అగ్నిప్రవేశం చేసింది. దాని కోసం అన్ని కష్టాలను ఓర్చుకుంది. అన్నిటికీ తలవంచింది.

రాముడు సీత అడవుల పాలు చేసిన కారణం సీత ధర్మం తప్పిందని కాదు, రామరాజ్యంగా తన పరిపాలనకు మచ్చ వస్తుందని. ఇక్ష్వాకుల కులానికి, కిరీటానికి అపకీర్తి తెస్తుందని.

అందుకని సీత తల్లిగా తన బాధ్యతలు నిర్వహించింది కానీ భార్యగా మాత్రం తిరిగి వెళ్లలేదు.

ఏ స్త్రీ అయినా తల్లిగా, భార్యగా తన బాధ్యతని నిలబెట్టుకోవాలి. కానీ, ఎవరో కిరీటాలు మొయ్యడం కోసం జీవితం త్యాగం చెసే అవసరం లేదు..

భర్తని గౌరవించడం వేరు, భరించడం వేరు.

తండ్రి మాట వినడం వేరు, మూర్ఖత్వానికి తలవంచడం వేరు. సీత ఇదే చెప్పాలనుకుంది.

నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. కూతురిగా నీ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎటువంటి అగ్నిపరీక్షనైనా తట్టుకో, అవసరమైతే మీ నాన్నతో యుద్ధం చెయ్యి. నీ ప్రేమని గెలిపించుకో.

లేదా…. సతీష్ నీకు సరైనవాడు కాదు, నేనే నీకు తగిన వాడిని పూర్తిగా నమ్మి నన్ను పెళ్లి చేసుకో.

అంతేగాని….! మీ నాన్న పరువు కిరీటం కాపాడటానికి మాత్రం పెళ్లి చేసుకోకు.”

***

“ఇంకా రెండు రోజుల పెళ్లి” రవీంద్ర తృప్తిగా అన్నాడు.

“ఈ పెళ్ళితో మన మధ్య ఆంతర్యాలు అన్ని తొలగిపోతాయి రాజీవ్. ఇదంతా నీ వల్లే జరిగింది. చెప్పు నీకు ఏం కావాలి? ఏమి ఇష్టమో చెప్పు అది ఏదైనా సరే చేస్తాను.” అంటూ రవీందర్ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

నాకు కోపంగా లేదు అలాగని చిరాగ్గా కూడా లేదు. నిజంగా చెప్పాలంటే ధైర్యంగా ఉంది. అప్పుడే ఆకాశం నుంచి జాలువారిన వానచినుకు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నా ఆలోచన కూడా అంత స్వచ్ఛంగా ఉంది.

“అంకుల్ చాలా థ్యాంక్స్. నాకు ఏది ఇష్టమో చేస్తా అన్నారు. కానీ మీ కూతురికి పెళ్లి ఇష్టమో లేదో కనుక్కున్నారా?”

రవీందర్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. అర్థం కానట్టు పరీక్షగా చూశాడు.

ఎవరి ముఖాలు ఎలా ఉన్నాయో ఏమనుకుంటున్నారో పట్టించుకునే పరిస్థితిలో నేను లేను. నా ప్రశ్న సూటిగా రవీందర్ మీదే.

రవీందర్ కొంచెం సర్దుకున్నాడు.

“చూడు నాకు అర్థమైంది. నందిని ఎవరో ప్రేమించిన విషయం గురించే కదా.”

రవీందర్ ఏం చెప్పాలో అర్థం కాక తటపటాయించాడు.

“నువ్వు పెరిగిన వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం సంప్రదాయాలు వేరు. నీకు చెప్పినా అర్థం కాదు. నందిని తెలిసి తెలియని వయసు, మనమే మంచి చెడు చెప్పాలి.”

రవీందర్ నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.

“నీ మనసులో పెట్టుకోకు రాజీవ్.”

ఆయన పరిస్థితి చూసి నాకు జాలేసింది.

“నిజమే అంకుల్ నందినిది తెలిసి తెలియని వయసు. కానీ మీది అని తెలిసిన వయసే కదా మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?”

“ఒరేయ్ ఏంట్రా? ఈ సమయంలో నువ్వు మాట్లాడేది?” నాన్న అడ్డుపడ్డాడు.

రవీందర్ నాన్నను ఆపేస్తూ…

“ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను అర్థం చేసుకోగలను. నువ్వు లండన్‌లో పెరిగావు నీకు ఇవన్నీ సాధారణ విషయాలు. అక్కడ పెళ్లయ్యాక ఏదైనా జరగరానిది జరిగితే సమాజం తప్పు పట్టదు. అమ్మాయి మళ్ళీ చేసుకోవచ్చు, తన జీవితాన్ని కొనసాగించవచ్చు.

ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వేరు. ఇక్కడ ఇంకా సమాజం నువ్వు అనుకున్నంత మారలేదు. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అన్నాడు. తర్వాత ప్రేమ లేదు అని వదిలేస్తే మళ్ళీ నా కూతురిని సమాజం బ్రతక నివ్వగలదా. ఇవన్నీ నీకు అర్థం కావు రాజీవ్. నీ వయసు అటువంటిది.”

“ప్రేమించిన వాడు వదిలేసి జీవితం పాడైపోతుందని ఇలా చేస్తున్నారు, మరి నేను వదిలేస్తే?”

“ఏంటి ఏం మాట్లాడుతున్నావ్?” రవీందర్ విరుచుకుపడ్డాడు.

“వదిలేస్తే నేను ఊరుకుంటానా? నీ తల అడ్డంగా నరికేస్తా” రవీందర్ కోపం చూసి నాకు నవ్వు వచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here