సీత-3

0
7

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఒ[/dropcap]రేయ్, ఇంత సడన్‌గా ఎందుకు రా!” నాన్న ఆశ్చర్య పోయారు.

“అంటే నేను ఎప్పుడూ ఇండియా చూడలేదు కదా నాన్నా.”

“ఇంకా అనేక దేశాలు ఉన్నాయి కద రా….. చూడడానికి.”

“నాన్నా! మనం ఎన్నో దేశాలు చూసాం! కాని ఒక్కసారి కూడా ఇండియాకు వెళ్ళలేదు. మన కుటుంబం మొత్తం హైదరాబాదులో ఉంది. కానీ, కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇప్పటికైనా చెప్పు నాన్నా… ఏం జరిగింది? మనం ఎందుకింత దూరంగా వచ్చేసాం? ప్లీజ్ చెప్పు నాన్నా!”

“పెళ్ళికోసం నీకు ఇండియా అమ్మాయి కావాంటే…. ఇక్కడే బోలెడు మంది ఉన్నారు కదా!” నాన్న నచ్చ చెప్పబోయాడు.

నాకు అవేమి వినిపించటం లేదు.

“మనకీ, మన కుటుంబానికి మొహాలు కూడా చూసుకోనంత శత్రుత్వం ఏంటి? నేనెందుకు నా దేశానికి వెళ్ళకూడదు. మనదీ చాలా పెద్ద కుటుంబం అని అమ్మ చెప్పేది. అంతమందిని ఉంచుకొని….. అనాథల్లా ఎందుకు ఉన్నాం?”

“రాజీవ్!” నాన్న గట్టిగా అరిచాడు.

“ఎన్నిసార్లు నిన్ను అడగొద్దని చెప్పాను. నాకు ఆ విషయం గుర్తుచేసుకోవడం ఇష్టంలేదు. అయిన అది నీకు సంబంధించిన విషయం కాదు. నువ్వు ఇండియాకి వెళ్ళడం కుదరదు. అంతే. సరే! నన్ను కాదని నువ్వు వెళితే నీ ఇష్టం. కానీ ఇక నీకు, నాకు మాటలుండవు.”

***

“ఒరేయ్! పడుకున్నావా?” నాన్న తలుపుకొట్టాడు.

“లేదు నాన్నా!… రండి!”

“మేమంతా కింద ఉంటే…. ఒక్కడివి ఈ గదిలో ఏం చేస్తున్నావురా?” వస్తూనే అడిగాడు.

“ఏం లేదు నాన్నా.” చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టాను.

“ఏంట్రా? చాలా రోజులనుండి అదోలా ఉంటున్నావు.”

నేనేం మాట్లాడలేదు. కాసేపు నాన్న కూడా మాట్లడలేదు.

“నా మీద కోపం ఇంకా పోలేదా?”

కొంచెంసేపు తరువాత అమ్మ కూడా వచ్చింది.

“మరి ఏం చేద్దామనుకుంటున్నావు రా?” నాన్న చాలా గంభీరంగా అడిగాడు.

“దేని గురించి?”

“పెళ్ళి గురించి.”

నేను మళ్ళీ ఏం మాట్లాడలేదు.

ఇప్పటికే వాళ్ళని నేను చాలా ఇబ్బంది పెట్టాను.

నేను నాన్న చాలా సన్నిహితుల్లా ఉంటాం. ఆయన మాటంటే చాలా గౌరవం. చాలా విషయాల్లో అమ్మ పేచి పెట్టేది. కాని నాన్న నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. నా మాటని, ఉద్దేశాన్ని, ఆలోచనల్ని శ్రద్ధంగా వినేవారు. అమ్మ ఏదైన విషయంలో నా గురించి గొడవపడితే…. నాన్న తేలిగ్గా “వాడు ఎలాంటి తప్పుచేయడు. వాడిమీద నాకు చాలా నమ్మకం ఉంది.” అనేవారు.

ఆయన నా వ్యక్తిత్వానికి ఎoతో గౌరవం ఇచ్చారు. ఆయనన్నా, ఆయన మాటన్నా నాకు అంతే గౌరవం.

నాన్న గొంతు సవరించుకున్నాడు.

“చూడరా…! రెబెకా విషయం జరిగి మూడేళ్ళు అవుతుంది. సరే కుదుట పడటానికి నీకు సమయం పడుతుంది కదా అని వదిలేశాం. ఇలా ఎన్ని రోజులురా? దిగులుగా ఉంటున్నావంట, ఎవరితో కలవటం లేదట.”

“అదేం లేదు నాన్నా…!”

“మరి పెళ్ళి సంగతి ఏం చేద్దాం?”

“మీ ఇష్టం నాన్నా.. మీరు చూసిన అమ్మాయిని చేసుకుంటాను.” పొడిపొడిగా అన్నాను.

నాన్న చిన్నగా నిట్టూర్చాడు.

“మరి కొన్నిరోజుల్లో ఇండియాకు వెళతావా?”

“వద్దు నాన్నా.”

“సారీ రా! నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇష్టం ఉంటేనే వెళ్ళు…. అలాగని బలవంతం ఏమీ లేదు. వెళ్ళితే మాత్రం నాకు ఇష్టమే. మన బంధువులు హైదరాబాదులో ఉంటారు. ఈ సంగతి నీకు తెలిసిందే కదా!”

అవునని తలూపాను.

“అక్కడ మా బాబాయ్ కొడుకు, తన ఇద్దరి చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబం ఉంటారు. వాళ్ళు ఇప్పటికే నాతో చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేసారు.

వాళ్ల చెల్లి కొడుకు అరవింద్ పెళ్ళికి కూడా ఆహ్వానం పంపించారు. కానీ నేను పాతకక్షలు ఏమైనా మనసులో పెట్టుకుంటారేమో అని వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు.

మొత్తం అందరినీ మన కుటుంబానికి దూరంగా ఉంచాను.

కాని మొన్న మీ బాబాయ్ తాను పనిచేసే కంపెనీ పనిమీద మూడు రోజులు హైదరాబాదుకి వెళ్ళాడు కదా! అప్పుడు మీ బాబాయిని కలవడానికి కుటుంబం మొత్తం హోటల్‌కి వచ్చిందట. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారట. ఎవ్వరికీ ఏమీ గుర్తులేదట. అదీ నిజం కావచ్చు. ఎందుకంటే గొడవ జరిగే సమయానికి మా బాబాయి కొడుక్కి పదమూడు ఏళ్ళు ఉంటాయి. వాడికి ఇవన్నీ గుర్తుండకపోవచ్చు.

మీ బాబాయ్ వెళ్ళి వచ్చాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది.

ఇక మొన్న నువ్వు ఇండియా వెళతావన్న తరువాత నేనే స్వయంగా మాట్లాడాను.

ఎంత బాగా మాట్లాడారో!

రా అన్నయ్యా! రా అన్నయ్యా! అని ఒకటే గోల.” నాన్న గొంతు బొంగురుపోయింది.

“నువ్వు ఒకసారి వెళితే ఏమీ కాదేమో అనిపిస్తుంది.

ఎప్పుడూ ఇండియాకి వెళ్ళలేదు కదా! ఇప్పుడు వెళ్ళు.”

అప్పటి వరకు అన్నీ వింటున్న అమ్మ మాటల్ని మధ్యలో ఆపేసింది.

“పనిలో పని అక్కడ నీకు మంచి అమ్మాయిని చూడమని చెబుతాను.”

అమ్మ ఆరాటం చూసి, నాకు నవ్వు వచ్చింది! పాపం, నాకు ఇండియా అమ్మాయితో పెళ్ళి చేయాలని చాలా తపన పడుతుంది.

నవ్వి! “సరే అమ్మ” అన్నాను.

అంతే ఇక అమ్మ ఆనందానికి అవధుల్లోవు. “అబ్బ నీకు అక్కడి అమ్మాయితో పెళ్ళైతే, ఆ వంకతో అయినా ఇండియాకి పోవచ్చు. ఇండియా చూసి ఎన్నో ఏళ్ళు అవుతోంది.”

ఏంటి? అమ్మ ఇండియాకు ఎందుకు ఇప్పటి వరకు వెళ్ళలేదను కుంటున్నారా? మీకు ఇప్పటి వరకు చెప్పలేదు.

అమ్మ బ్రిటన్ అమ్మాయి. నాన్న చదువుతున్నప్పుడు పరిచయం అయింది. ఆమె భావాలు నచ్చి, నాన్న పెళ్ళి చేసుకున్నాడు.

“అమ్మా! ఎందుకమ్మా ఎప్పుడు తెలుగమ్మాయి…. తెలుగమ్మాయి…. అంటావు?” ఉండబట్టలేక అన్నాను.

“ఎంతయినా తెలుగమ్మాయి వేరురా. నోటితో చెప్పేది కాదు. అది తెలుసుకోవాల్సిందే… అంతే! నేను ఉన్న ఎనిమిదేళ్లలో ఎన్నో నేర్చుకున్నాను. వాళ్ళ ఆత్మీయత, నిరాడంబత, కుటుంబం మీద మమకారం, ఆత్మాభిమానం ఇలా ఎన్నో” అమ్మ ఏదో తన్మయత్వంతో మాట్లాడుతోంది.

***

చకచక ఇండియాకి బయలుదేరే పనులు పూర్తయ్యాయి.

అక్కడ ఉన్న మా బాబాయ్ చెల్లెలి కొడుకు అరవింద్‌తో మాట్లాడాను. అతను రిసీవ్ చేసుకుంటానని చెప్పాడు.

అమ్మ వాళ్ళకోసం బోలెడంత షాపింగ్ చేసింది. ఏదైతే ఏముంది? ఇండియాకి ప్రయాణం ఇరవై – ఇరవైరెండు ఏళ్ళ తరువాత.

అబ్బ ఎంత సంతోషంగా ఉందో….!

ఏమో అక్కడే నా కల నిజమేవచ్చు.

నా కోసం ఒక అమ్మాయి ఎదురుచూస్తుండొచ్చు.

నేనే సర్వం అని, అన్నీ వదులు కొని, నా కోసం పరిగెత్తుకుంటూ రావచ్చు.

“సర్దుకోవడం ఎంత వరకు వచ్చింది రా!!” అమ్మ కేక వేసింది.

“అయిపోయినట్టే!!”

“ఏం అయిపోయినట్టు!! నెల నుంచి సర్దుతున్నావ్. ఇంకా గందరగోళంగా ఉంది.” అమ్మ కసురుకుంది.

“సరే, భోజనానికి రారా. తరువాత సర్దుకోవచ్చు” నాన్న కూడా పిలిచారు.

అందరం వచ్చి, డైనింగ్ టేబిల్ చుట్టూ కూర్చున్నాం.

“రేపు మధ్యాహ్నం కదా ఫ్లైటు?” నాన్న అడిగారు.

“అవును నాన్నా!!”

“చూడరా! కొంచెం జాగ్రత్త!

ఇన్నేళ్ళ తరువాత వెళుతున్నావు… అదీ ఒక్కడివి… మొదటిసారి…

నువ్వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయి.

వాళ్ళతో నేను మాట్లాడాననుకో… కానీ…

పైకి బాగానే ఉన్నా మనసులో ఏముందో మనకు తెలియదు కదా!”

నాన్న ఇబ్బందిగా పొడిపొడిగా చెప్పారు…

నేను నాన్న చేతిలో చేయి వేశాను. “ఏం భయపడకు.”

“భయం కాదురా, జాగ్రత్త అంతే!!

సరే గాని, చూడు నీకు చిన్నప్పటి ఇండియా విషయాలు ఎoత గుర్తున్నాయో తెలియదు.

అక్కడ మా కుటుంబం పేదరికం అనుభవించిందనే చెప్పాలి.

ఆ రోజుల్లోనే ఉన్న భూమలు అమ్మి, నన్ను ఫారిన్ పంపించారు.

తరువాత కొంత ఆస్తి అమ్మి, మీ బాబాయ్ని కెనడాకి పంపారు.

ఇంకా కొంత భూమి మిగిలింది. ఆరు, ఏడు ఎకరాలు ఉండొచ్చు. అది మా బాబాయి ఆధీనంలో ఉండేది. ఇప్పుడు వాళ్ళ భూమి వారి దగ్గర ఉందో…. మరి అమ్మేసారో…. తెలియదు.

ఒక చిన్న పెంకుటిల్లు ఇంతే.

నువ్వు వాళ్ళ దగ్గర ఉంటే నీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది.

మొన్న మీ బాబాయి వెళ్ళినప్పుడు వ్యాపారం చేస్తున్నారని చెప్పారట. అక్కడ వ్యాపారం ఎలా ఉంటుందో నాకు తెలియదు.

నువ్వు హోటల్లో ఉండు.

వెళ్ళినప్పుడు వీలయితే, నా తరఫున కొంత డబ్బివ్వు.

పాపం నామీదే ఆశలన్నీ పెట్టుకున్నారు. వాళ్ళు త్యాగం చేసి నన్ను చదివించారు.

నేను మాత్రం రుణం తీర్చుకోలేకపోయాను.”

***

విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.

హలో హైదరాబాద్….!!

నేను మెల్లగా ఒళ్ళు విరుచుకున్నా. ఇదిగో నేను వచ్చేసా… బీ రెడీ…! గట్టిగా ఊపిరి తీసుకొని….. ఇంచుమించు ఇరవైరెండు ఏళ్ళ తరువాత ఇండియాకి వచ్చాను.

నా ప్రొఫైల్, నా బ్యాక్‌గ్రౌండ్ ముఖ్యంగా నన్ను, నా స్టైల్ చూసి, ఇక్కడ అమ్మాయిు చచ్చిపోతారేమో… క్యూలు కట్టి ఒళ్ళో వాలిపోతారేమో.

మరి, లండన్ రిటర్న్ అంటే మాటలా? ఒక్కొక్క దానికి పిచ్చెక్కిస్తా!!

రకరకాలుగా.. ఊహులు… అబ్బా… చెప్పొద్దు… ఆలోచనతో గాల్లో తేలిపోవాలనిపిస్తుంది. ఆర్మాని జీన్స్ వేసుకొని, టాప్షాప్ టీ షర్ట్, దానిపై గ్యాప్ లెదర్ జాకెట్, రేబాన్ కళ్లద్దాలు, అడిడాస్ బూట్ వేసుకున్న నా కుడికాలు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటపెట్టింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here