సీత-5

0
7

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]పె[/dropcap]ళ్ళి చూపులు నెం.1:

ఇద్దరం కేఫ్‌లో కూర్చున్నాం. నేను వెళ్ళేటప్పటికే ఆ అమ్మాయి అక్కడికి వచ్చేసింది.

హాయ్, హలోలు అయ్యాయి.

ఇద్దరం ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకున్నాం, నవ్వుకున్నాం. మొదట నేను పెద్దగా ఆలోచించలేదు. ఏమీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చాను.

తీరా వచ్చాక ఎలా ఉండాలి? ఏం అడగాలి? ఏం మాట్లాడాలి? ఏమీ అర్థం కావటం లేదు.

ఏం చెప్పాలి? అని ఓ అయిదు నిమిషాలు ఆగాను.

ఏమీ తెలియక, ఆ అమ్మాయి ఏం చెబుతుందని మరో అయిదు నిమిషాలు కూడా ఆగాను. లాభం లేదు.

‘‘మీ హాబీస్ ఏంటి?’’ నేనే పలకరించాను.

“రీడింగ్ బుక్స్… వాచింగ్ మూవీస్….”

‘‘ఓ నాకు కూడా…. వాచింగ్ మూవీస్.’’ అన్నాను.

ఆ అమ్మాయి సిగ్గు పడిoది.

మూవీస్ టాపిక్ వస్తే ఇక మాటకి అడ్డు, అదుపూ ఉంటుందా?

ప్రపంచానికి అంతం ఉంటుందేమో కానీ  తెలుగు సినిమాల గాసిప్పులకి అంతం ఉండదు.

‘‘మీ ఫేవరెట్ హీరో?’’ తరువాత ప్రశ్నకి లింక్ దొరికింది అంతే.

సినిమా, హీరో, హీరోయిన్లు, పెళ్ళిళ్ళు, యాక్టింగ్, నచ్చడం, నచ్చకపోవడాలపై చాలాసేపు మాట్లాడాం.

“నాకు మహేష్ బాబు ఇష్టం.” అని ఆ అమ్మాయి చెప్పింది.

“నాకు నాగార్జున.” అన్నాను.

ఆ అమ్మాయి కొంచెం మొఖం మాడ్చుకుంది. “ఎంతయినా నాగార్జున మహేష్ బాబు అంతకాదు. మహేష్ ఈజ్ మహేష్.”

“ఏంటి? అంత లేదు.”

“నాగార్జున స్టయిల్, డ్రసింగ్ సెన్స్ అస్సలు ఎవరికీ లేదు… అస్సలు నాగార్జున స్టైల్‌కి ఎవరైనా పడిపోవసిందే…..” రెచ్చిపోయి మాట్లాడుతున్నాను.

ఆమె వైపు చూసాను.

తలదించుకొని వింటుంది. బాధపడిందేమో అనిపించింది.

“అంటే మహేష్ బాబు కూడా ఇష్టమేననుకోండి. చాలా హాండ్‌సమ్” అంటూ మాట మార్చాను.

తరువాత ఆ విషయం, ఈ విషయం చాలా మాట్లాడాం.

కనీసం రెండు గంటపైనే మాట్లాడాం.

‘‘ఇక నేను వెళతాను.’’ ఆ అమ్మాయి వాచీ చూసుకుంటూ లేచింది.

తనతోపాటు నేనూ లేచాను.

నాకు చాలా సంతోషం అనిపించింది. మొదటిసారి అయినా చాలా చనువు ఏర్పడింది. ఉద్యోగం, చదువు, డబ్బులాంటి ఏమీ అడగలేదు. ఏదో ఫ్రెండ్స్‌ని కలిసినట్లుంది. ఇద్దరం బయటికి వచ్చాం.

‘‘మీకిది ఫస్ట్ టైమా?’’ నవ్వుతూ, సిగ్గుపడుతూ ఆ అమ్మాయి నాకు చేయి అందించింది.

“అవును ఫస్ట్ టైమే.”

అమ్మా!!.. నేను ఈసారి పప్పులో కాలువేస్తానా? తాను రెండో ప్రశ్న అడుగే లోపే సమాధానం చెప్పేశా

“కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. మొత్తం చూశాను”.

ఆ అమ్మాయి ఉన్న ఫలానా తన చేయి వెనక్కి లాక్కుంది.

‘ఏం చూశారూ?’ అంది అనుమానంగా.

“ఆల్మోస్ట్ అన్నీఏరియాలు కవర్ చేశా.” నా మునివేళ్ళతో నా జుట్టును స్టైల్గా వెనక్కి తోస్తూ…

“అఫ్కోర్స్… కొన్ని ఏరియాలు నచ్చాయి, కొన్ని నచ్చలేదు. కానీ కొన్ని అద్బుతంగా ఉన్నాయి. రాత్రంతా ఎక్సైట్మెంట్తో గడిపేయవచ్చు.” హుస్సేన్ సాగర్‌ని చీకటి వెలుగులలో గుర్తుతెచ్చుకుని తన్మయత్వంతో కళ్ళుమూసుకున్నా. కళ్ళు తెరిచేసరికి ఆ అమ్మాయి మాయం.

ఏంటీ? అలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది?

ఏం వచ్చింది దేనికి? ఏంటో ఈ అమ్మాయిులు, అర్థం కారు. ఇంటికి బయలు దేరాను.

దారంతా ఆలోచిస్తూ ఉన్నాను.

జీన్స్ వేసుకుంది. ఆలాగని మరీ మోడరన్‌గా లేదు. మంచి మాటతీరు, హావభావాలు కూడా….

మొదటిసారి కలిసినా హాయిగా, చనువుగా ఉంది. తనకి అన్ని విధాలా కరెక్ట్…

ఈ అమ్మాయి అయితే సరే… ఇంటికి వెళ్ళగానే ఓకే చెప్పాలి…

***

ఇంటికి చేరుకొనే సరికి పిన్ని కంగారుగా బయటకు వచ్చింది. ఏదో తనకోసమే ఎదురు చూస్తున్నట్లుంది.

“ఎంట్రా అలా మాట్లాడావు? ఇదేమన్నా మీ లండన్ అనుకున్నావా?”

“ఎలా మాట్లాడాను?” పిన్ని దేనిగురించి మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు.

‘‘నీ మొఖం…. బాబాయ్ చాలా కోపంగా ఉన్నారు. నువ్వు అలా మాట్లాడలేదని అబద్ధం చెప్పు.’’ చెవిలో గుసగుసగా అంది.

“ఎలా మాట్లాడలేదు?” మళ్ళీ అడిగాను.

లాభం లేదు. నా మాట వినే లోపే పిన్ని కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది.

నేను లోపలికి వెళ్ళే సరికి బాబాయ్, మామయ్య, అరవింద్, సంధ్య, అందరూ కూర్చుని ఉన్నారు. మాయ కూడా అక్కడే ఉంది.

మొఖాలు చూస్తే చాలా గంభీరంగా ఉన్నాయి.

మాయ మాత్రం చేయి తన పెదవి మీద అడ్డుపెట్టుకుంది…. కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి.

“ఏంటి?” అని కనుబొములు ఎగురవేశాను.

“సూపర్!” అంటూ మాయ సైగ చేసింది.

“ఏంటీ పని రాజీవ్?” బాబాయ్ కోపంగా అన్నాడు.

“ఏం పని బాబాయ్?” కన్ప్యూజన్‌లో మైండ్ బద్దలయ్యేలా ఉంది.

“ఏంట్రా? ఎంత లండన్‌లో పెరిగితే మాత్రం, మరీ ఇంత అసహ్యంగా ప్రవర్తించాలా? నా పరువు పోయింది.”

‘కామెడీ కాదు!’ బాబాయ్ నిజంగానే కోపంగా ఉన్నారు.

ఇక నేనూ సీరియస్ అయ్యాను.

“అసలు ఏం జరిగిందో ఎవరూ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది?”

“ఏం జరిగిందా? నువ్వు చేసిన పనికి ఆ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు ఇంటి మీదకి రౌడీను పంపిస్తాం అన్నారు. నేను ఏదో సర్దిచెప్పాను.” మామయ్య నా మొఖం చూడకుండా అన్నాడు.

అంత పని నేనేం చేసాను రా బాబు?

ఒక్క నిమిషం రివైండ్ చేసుకున్నా. అర్థం అయ్యింది.

ఏంటి? ఇక్కడ హీరో ఫ్యాన్స్‌కి మధ్యలో గొడవలు ఉంటాయని విన్నాను. కానీ మరీ ఇంత ఎక్కువా?

ఇంటి మీదికి రౌడీలని పంపిస్తారా?

అమ్మో నాకీ అమ్మాయి వద్దు.

కానీ బాబాయ్‌కి నచ్చజెప్పాలి. ఎలాగైనా కోపం తగ్గించాలి.

“లేదు బాబోయ్…! నాక్కూడా మహేష్ బాబు అంటే ఇష్టం అని చెప్పానే!”

“ఏ మహేష్ బాబు?” ఈసారి బాబాయ్ కన్ఫ్యూజ్ అయ్యారు.

“మరి? ఇంక దేని గురించి?”

“నువ్వు ఆ అమ్మాయి గురించి చాలా వల్గర్‌గా మాట్లాడావట?” ఇంకా బాబాయ్ గుర్తు తెచ్చుకుంటూ ……

“ఫస్ట్ టైమా పెళ్ళిచూపులు? అని అమ్మాయి అడిగితే…. ఆ ఏరియా చూసా! ఇది నచ్చింది. రాత్రి బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు” అన్నావట?

“అయ్యో బాబాయ్, నేను అంది హైదరాబాదు గురించి” గట్టిగా అరిచాను.

బాబాయ్ నావైపు అర్థం కానట్లు చూసాడు.

“ఫస్ట్ టైమా? అంటే హైదరాబాద్‌కి ఫస్ట్ టైమా? అని అనుకున్నా బాబాయ్.”

నా బాధ చివరికి చెప్పాను. నాకు ఏడుపు వచ్చేస్తుంది. వచ్చి బాబాయ్ చేతులు పట్టుకున్నాను.

అప్పటికి వరకు సోఫా వెనుక తన నవ్వుని ఆపుకుంటున్న మాయ ఒక్కసారిగా భళ్ళున నవ్వుకుంటూ వచ్చి, సోఫామీద వాలిపోయింది.

ఇంకో సెకనులో నవ్వుతూ, దొర్లుకుంటూ కింద పడిపోయింది.

***

ఫస్ట్ పెళ్ళిచూపులు పూర్తిగా దొబ్బాయ్. ఏంటలా జరిగింది?

“ఒరేయ్, ఏ లోకంలో ఉన్నావు?” అరవింద్ పలకరించాడు.

“ఆఁ ! ఏమి లేదు. ఏవో ఆలోచనలు.”

“సరే బాటిల్ ఓపెన్ చేయి.”

“ఆగాగు….” అరవింద్ హడావిడిగా నన్ను ఆపాడు.

తీక్షణంగా…. తన వినికిడిని వస్తున్న శబ్దాలపై పెట్టాడు.

“ఎవరో వస్తున్నారు. రచన వస్తుందనుకుంట. బాటిల్స్ దాచేయి…. త్వరగా”

“అదేంటి? మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా! మరి నువ్వు మందు కొడతావని చెప్పలేదా?”

“అబ్బా! అవన్నీ తరువాత చెబుతాను. ముందు బాటిల్స్ దాచిపెట్టు.”

“ఏంటి? ఇద్దరూ ఇక్కడున్నారా?” రచన వచ్చి అరవింద్ పక్కన కూర్చుంది.

“ఏం నువ్వు ఇంకా పడుకోలేదా?” అరవింద్ ఏమి తెలియనట్టు మాట మార్చేసాడు.

ముగ్గురం సరదాగా మాటాల్లో దిగాం.

రచన లండన్ విశేషాలు అన్నీ అడిగి తెలుసుకుంటుంది. హాయిగా మాట్లాడుతుంది.

చూస్తే అరవింద్‌కి, రచనకి మధ్య మంచి చనువుంది.

మరి అరవింద్ ముందు విషయం ఎందుకు దాస్తున్నాడు?

సరే! పాపం మొహమాట పడుతున్నడనుకుంటా…!

నేనే హెల్ప్ చేస్తాను…

“చూడు రచనా…! నిన్ను నేను ఒక విషయం అడగనా?”

“ఏంటి? అడుగు…”

“మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా…!”

“అవును!.”

“అంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పెళ్ళిచేసుకున్నారు కదా!”

“అవును! మేమిద్దరం బెస్ట్  ఫ్రెండ్స్. నాకు అరవింద్ గురించి బాగా తెలుసు.” రచన తృప్తిగా నవ్వింది.

నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నా.

అరవింద్ నా వైపు అనుమానంగా చూస్తున్నాడు. నేను కొంచెం మొహమాట పడుతూ…

“అరవింద్ తాగుతాడు అన్న విషయం నీకు తెలుసా?” ధైర్యం చేసి అడిగేసాను.

అరవింద్ కళ్ళు పెద్దవి చేసి, వద్దు వద్దు అని తల అడ్డంగా తిప్పుతున్నాడు.

రచన గట్టిగా నవ్వేసింది.

“ఎందుకు తెలియదు? తెలుసు. కాని పాపం ఎక్కువగా తాగడు. ఏదో అప్పుడప్పుడు? ఇదిగో నీలాంటి కంపెని దొరికితే …. తాగుతాడు అంతే!.”

రచన ఆ మాట అనగానే ఏదో యుద్ధం గెలిచినంత ఆనందం వేసింది.

అరవింద్ వైపు గర్వంగా చూసాను.

వాడు ఇంకా వద్దు వద్దు అనే సైగ చేస్తున్నాడు.

అయినా మనం వింటే కదా… రెచ్చిపోయాను…

“అవునా? అరవింద్ తాగితే నీకేం ప్రాబ్లమ్ లేదా?”

మళ్ళీ కన్ఫాం చేసుకున్నా.

రచన తల అడ్డంగా ఊపింది.

మరి ఇంకేం… ముఫ్పైరెండు పళ్ళు ఇకిలించి, దాచిపెట్టిన బాటిల్ పైకి తీసాను.

“వైనా? వావ్… నా ఫేవరెట్!”

రచన నా చేతుల్లోంచి బాటిల్ ఎప్పుడు లాక్కుందో, ఎప్పుడు మూత ఓపెన్ చేసిందో, ఏకంగా బాటిల్ పైకెత్తి ఎప్పుడు గడగడ తాగేసిందో, ఎప్పుడు అడ్డంగానే మీద పడిపోయిందో, ఏదీ అర్థం కాలేదు.

ఏదో మెరుపు మెరసినట్లు, షాక్ కొట్టినట్లు, అంతా చకచక ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు, రెండు సెకన్లలో అయిపోయింది. కళ్ళప్పగించి చూడటం తప్ప నేనింకేమి చేయలేకపోయాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here