స్కిల్స్

0
9

[డా. మానస్ కృష్ణకాంత్ రచించిన ‘స్కిల్స్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]ది మూడో ఇంటర్వ్యూ. ఎలా గట్టెక్కుతానో, క్యాంపస్ నుంచి బయటికి వచ్చేశాక ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్టయ్యేలా ఎప్పుడూ చదవలేదు, అలా సెలక్టవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, బయటికొచ్చాక తెలుస్తుంది, ఎంత మంది నాలాంటి వాళ్ళు ఉన్నారో. చదువుని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు, అది అంత అవసరం కాదనుకున్నా జీవితంలో గెలవడానికి. నేను చూసిన, చదివిన, విన్న సక్సెస్ స్టోరీలన్నీ కూడా పెద్దగా చదువుకోనివాళ్ళవే. సచిన్ టెండూల్కర్, స్టీవ్ జాబ్స్ ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ, బాగా సంపాదిస్తున్న వాళ్ళందరూనూ. ఇప్పుడిక ఇంటర్వ్యూలో ఎలా చేస్తానో అనుకుంటూ, డోర్ తీసుకుని లోపలికి వెళ్ళా. ఎంత వేగంగా వెళ్ళానో అంత వేగాంగా బయటికి వచ్చేశా. స్కిల్స్ కావాలంట. సాఫ్ట్ స్కిల్స్ బానే ఉన్నాయి, కానీ కోర్ స్కిల్స్ సరిగ్గా లేవు. ఇప్పుడేం చేయాలి? నాన్న నా మీద అరచినందుకు, కోపంతో ఉద్యోగం వచ్చేంత వరకూ ఇంటికి రానని బయటికొచ్చేశా. ఇప్పుడే ముఖం పెట్టుకొని వెళ్ళాలి. ఇంకా నా తర్వాత, యాబైకి పైగానే ఉన్నారు జనాలు ఇంటర్వ్యూకి. ఒక్క పోస్టుకి ఇంత మందా? అది కూడా ఈ చిన్న కంపెనీలో పాతికవేలు కూడా లేని జీతానికి అనుకుని ఆశ్చర్యపోయా. అంటే నా విలువ పాతిక వేలు కూడా లేదన్న మాట మార్కెట్ లో అనుకున్నా. మా నాన్న ప్రైవేటు కంపెనీలో ఒక చిన్న గుమాస్తాగా పని చేస్తున్నాడు. జీతం మా ఇంటి అద్దెకీ, మేం రెండు పూటలా తినడానికి సరిపోతుంది. మూడో పూట తినాలంటే అప్పు చేయాలి. నెల నెలా అప్పు చేసేంత అవకాశం లేదు, చేసి అవమానపడేంత అవసరమూ లేదు అని మా నాన్న వాదన. అలవాటయితే అయింది రెండు పూటలు మాత్రమే తినడం. కానీ, ఇప్పుడు కాలేజీ అయిపోయింది, ఇంట్లో ఖాళీగా ఉంటే మధ్యాహ్నం కూడా ఆకలిగా ఉన్నట్టనిపిస్తుంది. నా మీద నాకే సిగ్గేసి ఉద్యోగం తొందరగా దొరకాలని బయటికి వెళ్ళి వెతుక్కుంటున్నా. కానీ, ఎక్కడా ఖాళీలు లేవు. ఖాళీలున్నా మన దగ్గర కావల్సిన స్కిల్స్ లేవు. నా స్కిల్స్‌కి సరిపడా ఉద్యోగం ఎక్కడా రాదు. నా బతుకు మీద నాకే అసహ్యమేసింది తలచుకొని. సిగ్గు కాస్తా అసహ్యం అవుతుంది. నా మీద నాకు కలిగే ఫీలింగ్స్ ఈ రెండు మాత్రమే ఈ మధ్య కాలంలో కాలేజీలో ఉన్నప్పటి నా మీద నాకు కోపం వచ్చింది, జుగుప్స కలిగింది. అప్పుడు చదవనందుకు, చదవాల్సిన టైంలో చేసిన పనులకూను. కోపం, జుగుప్సా ఈ రోజు కొత్తగా యాడ్ అయిన ఫీలింగ్స్ అనుకొని బాధపడ్డా. ఏదోకటి చేయాలి, ఏదో ఒక ఉద్యోగం వెదుక్కోవాలి అనుకున్నా. ఎదురుగా హోటల్ కనిపించింది, అక్కడికి వెళ్ళి ఆ మేనేజ్‌మెంట్ హెడ్‌తో మాట్లాడా, ఉద్యోగం గురించి, నా క్వాలిఫికేషన్స్ చెప్పి దూరంగా ఒక వెయిటర్‌ని చూపించి చెప్పాడు వాడు చదివింది MBA అని. ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు, నేను కనీసం కౌంటర్ దగ్గర క్లర్క్ అయినా ఇస్తాడేమో అనుకుంటే వెయిటర్ కూడా ఇవ్వడని తెలిసి. అసహ్యం పోయి జాలేసింది నా మీద నాకు. నా పరిస్థితే ఇలా ఉంటే నాతో పాటు తిరిగిన వాళ్ళ పరిస్థితి తలుచుకొన్నా, ఫోన్ చేయాలనిపించింది. చేశాను. ఒక్కరు కూడా తియ్యలేదు. కొంపదీసి అందరికీ ఉద్యోగాలు వచ్చి బిజీ అయిపోయారా? ఆ ఆలోచనే అసూయ కలిగించింది. ఒళ్ళు భగ్గుమంది. గుండె మాత్రం చల్లగా అయిపోయింది, ఆత్మవిశ్వాసాన్ని ఎవరో నీళ్ళుపోసి ఆర్పినట్టు. అసలు నాకెందుకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చేసిన ఘనకార్యాలేంటి? అనుకున్నా, అంటే ఇంకాస్త ఏదో మూల మిగిలున్న సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోయింది. రెండు మూడు రోజులు గడిచాయి. నాన్న గుర్తొచ్చాడు, ఇల్లు గుర్తొచ్చింది. పౌరుషం ఉందో లేదో తెలీదు కానీ, ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. బహుశా పౌరుషం వల్ల కాదు, సిగ్గువల్లేమో. ఏ ముఖం పెట్టుకుని వెళ్తా. ఆకలి మొదటి రెండు రోజులూ తెలిసింది, మూడో రోజు అలవాటయిపోయింది. రోడ్డు మీదే జీవితం అయిపోయింది. రోడ్డున పడటం అంటే ఇదేనా? టీ తాగాలనిపించింది, ఎదురుగా ఉన్న టీ కొట్టు చూస్తే. కానీ జేబులో రూపాయి లేదు, మనసు మాత్రం ముందుకి తోసింది. టీ కొట్టువాడ్ని అడిగాడు, టీ సప్లయ్ చేసే పని ఉంటే ఇమ్మని. దానికి వాడు కిందా, మీదా చూసి అప్పటికే ముగ్గురు పనోళ్ళున్నారని చెప్పాడు. చేతిలో కాగితం కప్పులో వేసిన కొంచెం టీ పెడుతూ. జాలికి పెట్టాడా, వాలకం చూసి పెట్టాడు అనుకుని, ఏదైతే ఏం ‘టీ’ దొరికిందనుకుని, కరెంటు స్తంభం దిమ్మ మీద కూర్చున్నాను. ఎదురుగా చెత్తకుప్ప, ఎంత పెద్దదంటే, ఒక మూడొందల యాభై ఇళ్ళవాళ్ళు ఒక రోజులో ఏం వాడుతున్నారో చెప్పగలిగేంత. టీ చప్పరిస్తూ దుర్గంధాన్ని కూడా మరచిపోయి, ఆస్వాదిస్తున్నా మూడ్రోజుల తర్వాత నాలుక్కి తగిలిన రుచిని. అంతలో చెత్త కుప్ప దగ్గరగా ఒక బిచ్చగాడు (అయ్యుంటాడు) లేదంటే పిచ్చివాడు వచ్చి ఏదో వెదుకుతున్నాడు. పరిశీలనగా చూస్తే తెలిసింది, తిండి కోసం, అన్ని ప్లేట్లూ, కప్పులూ వెదుకుతున్నాడు. మూతేసిన డబ్బాలూ, కట్ చేసి పారేసిన కేకు డొక్కులూ, జొమాటో వాడి బాక్సులూ, ముడేసి విసిరేసిన ప్లాస్టిక్ కవర్లూ ఒకటేమిటి అన్నీ వెదుకుతున్నాడు. అన్నీ జాగ్రత్తగా విప్పుతున్నాడు పాడైపోకుండా ఉన్నవి తన సంచిలో వేస్తున్నాడు. అంతలో ఎక్కడ్నుంచొచ్చిందో ఒక కుక్కల గుంపు. శరవేగంగా వచ్చాయి. ఒక ఏడెనిమిది కుక్కలు ఆ చెత్తకుప్పదగ్గరికి. పిచ్చోడు బక్కచచ్చిపోయాడు మొదట. కాని, కుక్కలు ఆహారం కోసం వచ్చాయి, అతని కోసం కాదన్నట్టు అన్ని కవర్లూ, బాక్సులను శోధించడం మొదలుపెట్టాయి. పిచ్చోడికి కోపం వచ్చింది కుక్కల మీద, కుక్కలు తనకు దక్కాల్సిన దాన్ని తీసుకెళ్ళిపోతున్నాయని వాడనుకున్నాడు. కుక్కలు అవి వాటివనే హక్కుతో కనీసం వెనుదిరిగి చూడకుండా ఆరగించడం మొదలెట్టాయి. పిచ్చోడు కుక్కల్ని తరుముతున్నాడు కొన్ని లెక్కచేయడం లేదు, కొన్ని పళ్ళు చూపించి బెదిరిస్తున్నాయి. కానీ, పిచ్చోడు అక్కడ్నించి కదలడం లేదు.

ఇదంతా చూస్తున్నాను నేను ఆసక్తిగా. పిచ్చోడు అక్కడే ఎందుకుంటున్నాడు? కుక్కలకి గనుక కోపం వస్తే తన మనుగడకే ప్రమాదం కదా? కానీ, అక్కడ్నుంచి వెళ్ళిపోతే తిండి దొరకదా? వేరే చెత్తకుప్పా? అక్కడ కూడా కుక్కలుంటాయా? అంటే అక్కడ కూడా కాంపిటేషనేనా? ఒక్కసారి నేనూహించనిది జరిగింది, అక్కడ పడి ఉన్న కర్రని పట్టుకొని ఒక కుక్క మీద దెబ్బ వేశాడు. మిగతావి, ముందుకు ఉరకడానికి చూసినా, కర్రని ఒడుపుగా చూపిస్తూ, దగ్గరకొస్తున్నవాటిని నైపుణ్యంగా అదిలిస్తూ దూరంగా తరుముతున్నాడు. రెండు కుక్కలకి దెబ్బలు తగలగానే, అవి వాటి వెంట మిగతావీ పోయాయి.

మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే, మన ఆలోచనా విధానం అలా ఉంటుందేమో. ఎందుకంటే నా పరిస్థితిని నేను పిచ్చోడిగా ఊహించా, కానీ ఇప్పటివరకూ ఒక చోటు నుంచి మరో చోటికి పారిపోతున్న నేను, విశ్వాసం కోల్పోతున్న నేను చేయాల్సింది స్కిల్స్‌ని పెంచుకోవడం. అంతే ఇక అక్కడుండలేదు. నాన్నని తలచుకున్నా. ఇంటికి దారితీశా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here