స్మార్ట్ చిల్డ్రన్-1

0
13

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘స్మార్ట్ చిల్డ్రన్’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

ఇందులో పాత్రలు:

శ్రీకర్: ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

హిమజ: అతని భార్య, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

విద్య: వాళ్ల పాప

తవిటమ్మ: వాళ్లింట్లో పనిపిల్ల

నిర్మల: విద్య స్కూల్లో టీచర్

అర్జునరావు: హిమజ తండ్రి, బరంపురం యూనివర్శిటీ, రిటైర్డు సంస్కృత ప్రొఫెసర్

సుగుణ: హిమజ తల్లి, గృహిణి

డాక్టరు: వ్యామ్రేశ్వరరావు

పంతులుగారు:

తెర లేస్తుంది

దృశ్యం-1

(కనక మహాలక్ష్మీ అమ్మవారి గుడి, బురుజుపేట, విశాఖపట్నం. గుడిలో ఒక మంటపం. అక్కడ విద్యకు అన్నప్రాశన జరుగుతూంది. విద్య తల్లిదండ్రులు శ్రీకర్, హిమజ, పీటల మీద కూర్చున్నారు. పాప తల్లి ఒళ్లో ఉంది. పంతులుగారు గణపతి పూజ చేయించి, అన్నప్రాశన తంతు జరిపిస్తున్నారు)

పంతులుగారు: అయ్యా, అన్నప్రాశన పూర్తయింది. మీ చేతి ఉంగరం తీసి పాయసం గిన్నెలో ముంచి పాపకు తినిపించాలి. ముందు ఈ శ్లోకాన్ని మీ దంపతులిద్దరూ నేను చెప్పినట్లు పలకండి.

శ్లో॥

హిరణ్మయేన పాత్రేణ, సత్యస్యాపిహితం ముఖం।

తత్త్వం పూషన్న పావృణు, సత్యధర్మాయ దృష్టయే॥

(ఇద్దరూ ఆయన చెప్పినట్లు పలికారు. పాప నోట్లో, పాయసం గిన్నెలో ముంచి తీసిన ఉంగరాన్ని పెట్టాడు శ్రీకర్. పాప ఆ తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ తన బోసినోటితో, చిరునవ్వులు చిందించింది.)

శ్రీకర్: గురువుగారూ రకరకాల వస్తువులు వరుసగా పెట్టి పాపను వదలాలి కదా! మర్చిపోయారా? దాన్ని బట్టి భవిష్యత్తులో పాప ఏమి అవుతుందో తెలుస్తుంది కదా! అది చేయించరా, ప్లీజ్!

పంతులుగారు: (నవ్వి), నాయనా, నీవు చెప్పేది తంతులో లేదు. ఎవరో సరదాకు కల్పించారు. అయినా పెట్టండి. దానిదేముంది? అయితే దానికి మంత్రాలు ఏమీ ఉండవు. మన తృప్తి కోసం జరిపే తంతు మాత్రమే అది!

హిమజ: పరవాలేదులెండి! దయచేసి మీరూ ఉండండి. పాపను మీ చల్లని చేతులతో ఆశీర్వదించి వెళుదురు కానీ! మీరు లేకుండానా? (పంతులుగారు విధిలేక ఉండిపోయారు. సంభావన చివర్లోగాని ఇవ్వరని ఆయనకర్థమైంది)

(కొంచెం పక్కగా ఒక దుప్పటి పరిచారు. ఒక పెన్, ఒక పుస్తకం, వంద రూపాయల నోటు, ఒక ఏనుగు బొమ్మ, ఒక లడ్డు, వరుసగా, అడుగు చొప్పున ఎడం ఉండేలా పెట్టారు. ఎనిమిదడుగుల దూరంలో పాపను బోరగిల పడుకోబెట్టారు. పాప పాములా తలెత్తి, ఆ వస్తువులను చూసింది. పొట్టమీద జరుగుతూ, కేరింతలు కొడుతూ, ముందుకు పాకుతోంది).

పంతులుగారు: అయ్యా, వస్తువుల్లో అతి ముఖ్యమైనది ఉంచడం మర్చిపోయారు (నవ్వుతాడు).

హిమజ: ఏమిటండీ, త్వరగా చెప్పండి! ఏం మర్చిపోయామో?

పంతులుగారు: సెల్‌ఫోన్ పెట్టలేదేం? ఇప్పుడది మన జీవితంలో అతి ముఖ్యం కద!

శ్రీకర్: కరెక్టే. ఉండండి (అంటూ జేబులోంచి తన స్మార్ట్ ఫోన్ తీసి, వరుసలో చివర్న పెట్టాడు. అది నిలువుగా, పాపకు కనపడేలా వెనక ఒక యాపిల్ పెట్టి వస్తాడు).

హిమజ : సెల్‌ఫోన్ కూడా పెట్టొచ్చా గురువుగారూ? పరవాలేదా?

పంతులుగారు: భేషుగ్గా! ఇది పెట్టచ్చు, అది పెట్టగూడదని శాస్త్రం ఏదయినా ఉంటేగా తల్లీ! ఇదో వేడుక అంతే.

శ్రీకర్: పాప పట్టుకొనే వస్తువును బట్టి దాని అభిరుచి, చదివే చదువు, చేయబోయే ఉద్యోగం తెలుస్తాయి కదా? కొంతవరకు?

పంతులుగారు: అయ్యా, ఎలా తెలుస్తాయండీ మీరు మరీను. పిల్లలు తమ కంటికి నదరుగా కనిపించినదాన్ని పట్టుకుంటారు. దాన్ని బట్టి మనం నిర్ణయించలేం. ఇదో సరదా. కానివ్వండి. కానివ్వండి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అయితే ఆ పరిమళాన్ని గ్రహించడం ఇలా కాదు సుమండీ!

హిమజ: మీరు పురోహితులై ఉండి ఇంత రేషనల్‌గా ఆలోచిస్తున్నారే? (ఆమె గొంతులో కొంచెం అసంతృప్తి, కొంచెం ఆశ్చర్యం)

పంతులుగారు: అమ్మాయీ, పురోహితులకు రేషనల్ థింకింగ్ ఉండకూడదా తల్లీ! నేను బి.యస్.సి. చదివాను. ఉద్యోగం దొరక్క ఈ కుల వృత్తి చేపట్టాను. ఏ వృత్తిలో ఐనా ఆ మాత్రం స్వంత ఆలోచన ఉండదా అమ్మా! (శ్రీకర్ మెచ్చుకోలుగా ఆయన వైపు చూస్తాడు. విద్య వస్తువుల దగ్గరికి వెళ్లి ఆగుతుంది. అన్నింటినీ చూస్తుంది. ముందు ఏనుగు బొమ్మవైపు జరుగుతుంది. దాన్ని పట్టుకోడానికి చేయి చాస్తుంది).

పంతులుగారు: ఇంకేం? శుభం! విఘ్ననాయకుడే పాపను ఆకర్షించాడు. ఈ పిల్ల చదువు. ఉద్యోగం ఏ విఘ్నాలు లేకుండా.. సక్రమంగా జరుగుతాయి. (ఆయన అంటూండగానే పాప తలతిప్పి, చివరగా ఉన్న సెల్‌ఫోన్ చూస్తుంది. ఎత్తుగా ఉందది. దాని కవరు అంచులు నీలంరంగులో మెరుస్తున్నాయి. అటువైపు తిరిగి, పాకుతూపోయి, సెల్‌ఫోన్ తీసుకొని, నోట్లో పెట్టుకుంది!)

పంతులుగారు: శభాష్ బుజ్జితల్లీ! స్మార్ట్ బేబీ భవ! (అని ఆశీర్వదించాడు) (సంభావన తీసుకొని వెళ్లిపోయాడు) (‘అనుకున్నంతా అయ్యింది’ అని మనసులో అనుకుంటాడు) హిమజ పాపను ఎత్తుకుంది. సామాన్లన్నీ రెండు బ్యాగుల్లో సర్దుకుని కారు దగ్గరికి వెళ్లారు. స్టేజి మీద లైట్లారిపోతాయి)

దృశ్యం-2

(రెండు నిమిషాల తర్వాత స్టేజిమీద లైట్లు వెలుగుతాయి. హిమజ, శ్రీకర్ ఆఫీసులకు వెళ్లడానికి తయారవుతుంటారు. హాల్లో పనిపిల్ల తవిటమ్మ పాపను ఆడిస్తూంది. ఆ అమ్మాయికి పన్నెండేళ్లు. శ్రీకర్ సొంత ఊరు ప్రియాగ్రహారం నుంచి తెచ్చుకున్న రామెను, పాపను చూసుకోవడానికి. ఇద్దరూ ఉద్యోగస్తులు కాబట్టి ఈ ఏర్పాటు తప్పదు మరి!)

హిమజ: తవిటీ, మేం వెళ్లొస్తాం. పాప జాగ్రత్త. నీకిచ్చిన సెల్‌ఫోన్‌లో మా నంబర్లు తెలుసు కదా! పాపకేమన్నా ఇబ్బంది కలిగితే మాకు ఫోన్ చేయమ్మా! ఒక గంట తర్వాత పాపకు సెరిలాక్ పట్టు. ముందు తలుపు వేసుకుందువుగాని, రా! జాగ్రత్తగా ఉండాలి! ఎవరైనా వచ్చినా, కీ హోల్ లోంచి చూసి తలుపు తీయి.

(ఇద్దరూ వెళ్లిపోతారు. తవిటమ్మ వెంటనే హాల్లోని టి.వి. ఆన్ చేస్తుంది. ఏదో లైవ్ షో, ‘డ్యాన్సో డ్యాన్సు!’ కార్యక్రమం వస్తూంది. దానిని ఆసక్తిగా చూడసాగింది. పాప కాసేపు బొమ్మలతో ఆడుకుంది. విసుగొచ్చి ఏడ్వడం ప్రారంభించింది. తవిటమ్మ వంటింట్లోకి వెళ్లి సెరిలాక్ ఒక గిన్నెలో కలుపుకొచ్చి. వచ్చి, పాపకు పట్టింది. పాప మిగిలించిన దాన్ని తాను తినేసింది. తిన్న తర్వాత పాపను ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టాలని చూసింది. కాని పాప పడుకోకుండా ఏడవడం మొదలెట్టింది. తవిటమ్మకు లైవ్ షో మీద ఏకాగ్రత కుదరడం లేదు. టీవీ మీద మనసు పీకుతూంది. కొంత అసహనం ఆ పిల్లలో!)

తవిటమ్మ: (తనలో) (ప్రకాశంగా) ఏటి చేస్తును చెపుమీ? గుంటది ఏడుపాపదు. నాను టివి చూసేదెట్ల? (ఆలోచించి) అద్గదీ అవిడియ! ఇలగ చేస్తే సరి! (వాళ్లు తనకిచ్చిన సెల్‌ఫోన్ ఆన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసింది తవిటమ్మ. దాంట్లో ‘క్రేజీఫ్రాగ్’ అనే కార్టున్ ఫిల్మ్ తీసి, పాపకు ఫోన్ యిచ్చింది. రంగురంగుల్లో చిత్ర చిత్రంగా కదులుతున్న కప్పలను చూస్తూ, సెల్‍ను రెండు చేతుల్తో పట్టుకొని, పాప చూడసాగింది. తవిటమ్మ హ్యాఫీగా వెళ్లి టి.వి ముందు కూర్చుంది)

లైట్లు ఆరిపోతాయి.

దృశ్యం-3

మళ్లీ లైట్లు వెలుగుతాయి.

(అది వీకెండ్. శనాదివారాలు భార్యాభర్తలిద్దరికీ సెలవే. లేటుగా టిఫిన్ చేసి సోఫాలో కూర్చున్నారు. విద్యకు ఎనిమిది నెలలు. తల్లి చేతిలోని సెల్‌ఫోన్ లాక్కోవాలని చూస్తుంది)

హిమజ: (మురిపెంగా) చూడండీ దీన్ని నాటీనెస్! వేలెడు లేదు సెల్ కావాలట. ఉండు తల్లీ, లాగకు! ఇస్తానుగా! (పాపకు సెల్ యిస్తుంది). (పాప సెల్‌లో కార్టూన్ చూడసాగింది)

శ్రీకర్: హిమా! (ఆశ్చర్యంతో) చూడు చూడు! యాడ్స్ వస్తూనే స్కిప్ చేసేసింది. ఎంత తెలివో మా బంగారు తల్లికి! వాటి స్మార్ట్ గర్ల్! (ఇద్దరూ మురిసిపోతారు)

తవి: రోజూ మీరెల్లిపోనాక నాకు మీరిచ్చిన పోనియ్యమని లొల్లి పెడతాదమ్మగారు పాప! అది ఉంటేగాని అన్నం తినదండి! అంతిష్టమండి పోనంటేను. పోను సూస్కుంట బుద్ధిగా అన్నం తినేస్తదండి.

హిమజ: ఈ జనరేషన్ బేబీ అండి మన విద్య ! (అంటుంది గర్వంగా)

శ్రీకర్: నిజమే హిమా! ఇంత చిన్న వయసులో టెక్నాలజీని ఉపయోగించే తరం ఇది. మనకు టెంత్‌కు వచ్చే వరకు ఏమీ తెలిసేది కాదు. మనదంతా అదోరకం! అంతా ఇగ్నొరెన్స్! షీర్ ఇగ్నొరెన్స్!

హిమ: సరేగాని. త్వరలో పాప ఫస్ట్ బర్తడే రాబోతుంది. గ్రాండ్ ప్లాన్ చెయ్యాలి. ముందుగా బుక్ చేయకపోతే హాలు దొరకదు! మనం త్వరపడాలి. మరి దాని సంగతి చూడండి!

శ్రీకర్: అవును డార్లింగ్. ‘దసపల్లా’లో నాకు తెలిసినతను ఉన్నాడు. అతనిది నరసన్నపేట. అతనితో చెబితే అరేంజ్ చేస్తాడు. కొంత ఖరీదే అనుకో, మన బడ్జెట్‍కు. అయినా మన బంగారుతల్లి కంటే ఎక్కువా ఏమిటి? (పాపను ముద్దాడతాడు)

హిమ: వాట్ ఎ నైస్ హబ్బీ అండి మీరు! ఐ లవ్ యు డియర్ (అంటుంది మురిపెంగా). (పాప చేతిలోని సెల్ రింగ్ అవుతుంది. హిమజ దాన్ని తీసుకుని ఆన్సర్ చేస్తుంది. పాప ఏదో పురుగు కుట్టినట్లు కెవ్వున ఏడవసాగింది. శ్రీకర్ నవ్వుతూ తన ఫోన్ ఆన్ చేసి పాపకిచ్చాడు. పాప ఏడ్పు టక్కున ఆగింది)

శ్రీకర్: నవ్వుతూ చూశావా, ఫోన్ మహిమ! ఇంతకూ ఎవరి నుంచి ఫోన్?

హిమ: మా అమ్మ! బెర్హంపూర్ నుంచి. అక్కావాళ్లు ఖరగ్‌పూర్ నుంచి వస్తున్నారట. నాలుగు రోజులు సెలవులు కలిసి వచ్చాయట. మనల్నూ రమ్మంటూంది అమ్మ! మనమూ వెళదామండి, బాగుంటుంది ప్లీజ్!

శ్రీకర్: మనకెలా కుదురుతుంది? మీ బావగారు రైల్వేస్. మీ అక్క టీచర్. వాళ్లకు దొరికినట్లు మనకు సెలవు దొరకదు కదా!

హిమ: నిజమేనండి. కానీ.. అందరం సరదాగా ఎంజాయ్ చేద్దామని.

శ్రీకర్: నీవు కావాలంటే పాపను తీసుకొని వెళ్లిరా. భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్కిస్తా. నేను రాలేను హిమా! ప్లీజ్ బేర్ విత్ మి, డోన్ట్ యు?

హిమ: అమ్మో, నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది. పోన్లెండి ఇంకోసారి చూద్దాం! కెరీర్ తర్వాతే ఎంజాయిమెంట్! వుయ్ హావ్ మెనీ కమిట్మెంట్స్!

లైట్లు ఆరిపోతాయి

దృశ్యం-4

(దసపల్లా హోటల్, జగదాంబ సెంటర్, వందమంది ఆహుతులకు సరిపోయ్యే మినీహాలు. విద్య మొదటి పుట్టినరోజును ఘనంగా జరుపుతున్నారు హిమజ, శ్రీకర్. తవిటమ్మ కూడా మంచి డ్రస్ వేసుకుని ఉంది. బరంపురం నుంచి, ఖరగ్పూర్ నుంచి హిమజ వైపు వాళ్లు, ప్రియాగ్రహారం నుంచి శ్రీకర్ తల్లిదండ్రులు వచ్చారు. కోలాహలంగా ఉంది)

హిమజ: ఏమండీ! అందరూ వచ్చేసినట్లే. కేక్ కట్ చేయిద్దామా ఇక?

శ్రీకర్: ఓ.కె. మన బంగారుతల్లి ఏదీ? విద్యా, మై లిటిల్ డాల్!

(శ్రీకర్ వాళ్లమ్మ మనుమరాలిని ఎత్తుకొని ఉంది. పాప చేతిలో సెల్‌ఫోన్ చూస్తూనే ఉంది. హిమజ అత్తగారి చేతుల్లోంచి పాపను తీసుకుంది)

అత్తయ్య: ఏమ్మా, కోడలా, ఇది క్షణం కూడా ఫోన్ వదలదేమే?

హిమజ: (గర్వంగా) సెల్‌ఫోన్ అంటే అంతిష్టమత్తయ్య దానికి! దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో పూర్తిగా నేర్చేసుకుంది. నాటీ గర్ల్! ఎంత తెలివో మీ మనవరాలికి!

తాతయ్య: నాటీ గర్ల్ అంటున్నావుగాని, అమ్మాయ్! నాటీనెస్ మచ్చుకైనా లేదు పాపలో! (సాలోచనగా) పైగా ఏదో డల్‌నెస్ అనిపిస్తుంది నాకైతే! సమథింగ్ అన్‌యూజువల్!

ఒక గెస్ట్ వచ్చి పాప బుగ్గలు పుణుకుతాడు.

గెస్టు: హాయ్ బేబీ! ఎంత క్యూట్‌గా ఉన్నావు? నీ గౌను ఎంత బాగుందో?

హిమజ: గౌను కనక మహాలక్ష్మి సిల్క్ కొన్నాం అండి! గోల్డు చెయిన్ ఏమో ద్వారకా నగర్ లోని ‘ఖజానా జ్యూయులర్స్’ లో తీశాం (అంటుంది గర్వంగా).

గెస్ట్: (పాప పింక్ కలర్ షూస్‌ను లాగుతూ) ఈ షూస్ మా పాపకిచ్చేస్తావా బేబీ ? ఎంత బాగున్నాయో? మా పాప కూడా నీ యీడుదే! ఇస్తావా మరి!

(విద్య దేనికీ స్పందించదు. ఆ పాప దృష్టంతా కార్టూన్ ఫిల్మ్స్ పైనే. పరిసరాలు కూడా గమనించట్లేదు. అందరూ కేకు దగ్గరకు వెళ్ళి గుండ్రంగా నిలబడతారు)

శ్రీకర్: ఆ ఫోన్ తీసేసుకో, హిమజా! కేక్ కట్ చేయిద్దాము.

(హిమజ ఫోన్ తీసుకోగానే విద్య చేతులూ కాళ్లూ కొట్టుకొంటూ ఏడవసాగింది. ఎంత నచ్చచెప్పినా వినట్లేదు. అతిథులందరూ అసహనంగా చూస్తుంటారు. చివరకు విధిలేక, సెల్ పాప చేతికిస్తారు. దాని చూస్తూనే ఉంటుంది. తల్లి కేక్ కోయిస్తుంది ఒక చేత్తో. సెల్లో ‘ఛోటా భీమ్’ వస్తూ ఉంది దాన్ని చూస్తూనే యాంత్రికంగా కేక్ కట్ చేస్తుంది).

‘హ్యాపీ బర్త్ డే టు యు! హ్యాపీ బర్త్ డే విద్య!’ (అంటూ పాడతారు) (కేక్ పాప నోట్లో పెడతారు. డిన్నర్ స్టార్ట్ అవుతుంది. పార్టీకి వచ్చిన పిల్లల్లో అందరూ సెల్లు పట్టుకొని, కుర్చీల్లో కూర్చుని, వాళ్లమ్మలు అన్నం తినిపిస్తూంటే తింటూంటారు. ఏం తింటున్నారో వారికి తెలియదు. వారి ఏకాగ్రతంతా సెల్‌ఫోన్ మీదే).

తాతయ్య 1: ఏమిటి బావగారూ, పిల్లలు హాలంతా పరుగులు పెడుతూ ఆడుకోవడం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఆ దరిద్రపు సెల్ ఒకటి! వాళ్ల మొహాల్లో ఆ వయసులో ఉండవలసిన ‘గ్లో’ లేదు గమనించారా?

తాతయ్య 2: గట్టిగా అనకండి. అది ఇప్పుడు నిత్యావసర వస్తువైంది. ఏం చేస్తాం? కాల మహిమ! మనం ఏమన్నా అంటే అభివృద్ధి నిరోధకులం అంటారు (నవ్వుతాడు).

(విద్య ఫోన్ చూస్తూనే ఏదో తిన్నాననిపించింది)

లైట్లు ఆరిపోతాయి.

దృశ్యం-5

(రాత్రి 10 గంటలు. శ్రీకర్ ఇంట్లో బెడ్రూం విద్య పడుకొని నిద్రపోతూ ఉంది)

హిమజ: నిద్రపోయినప్పుడు మాత్రమే ఫోన్ అడగదు విద్య తల్లి!

శ్రీకర్: సాయంత్రం ‘అప్పుఘర్’కు తీసుకెళ్లాం కదా! ఎన్ని రకాల ప్లేజోన్ లున్నాయి అక్కడ! ఒక్కచోట కూడ ఆడుకోలేదు. తోటి పిల్లల మీద ధ్యాసేలేదు.

హిమజ: బలవంతంగా ’బెలూన్స్ డెన్’ లోకి పంపిన ఐదు నిమిషాల్లో బయటికి వచ్చేసింది. అన్ని రంగు రంగుల బెలూన్స్ కూడ దానినాకర్షించలేదు.

శ్రీకర్: ‘ఫన్నీ చిక్కీ’ పెట్టి ఇమ్మని మారాం చేసి, దాన్ని చూస్తూ ఒక బెంచీ మీద కూర్చుండిపోయింది. అప్పటికిగాని స్థిమిత పడలేదు.

హిమజ: సినిమా ధియేటర్లోనూ అంతేనండి. ‘చిత్రాలయ’ లో బాహుబలి 2 చూస్తుందిలే అనుకున్నా, మూడు నిండి నాలుగు వచ్చాయి. సినిమా చూసే వయసే కదా! అసలా ధ్యాసే లేదు.

శ్రీకర్: ఐదు నిమిషాలు కూడ చూడలేదు సినిమా. ‘టామ్ అండ్ జెర్రీ’ చూస్తానని ఒకటే ఏడుపు! ఎదురుగ్గా అంత పెద్ద తెరమీద సినిమా నడుస్తూ ఉంటే, చూడకుండా ఆ సెల్ ఫోనే కావాలంటుంది. పిచ్చిది.

హిమజ: మీకు చెప్పనే లేదు కదూ! నిన్న విద్య వాళ్ల స్కూలు మిస్ నిర్మలగారు ఫోన్ చేసింది. ఒకసారి మాట్లాడాలి రమ్మని సరేలే అని ఆఫీసులో సాయంత్రం ఒక గంట పర్మిషన్ తీసుకుని..

శ్రీకర్: వెళ్లావా మరి!

హిమజ: ఆఁ! వెళ్లాను. మీరు స్నూకర్ కోర్టుకు వెళ్లారు, అప్పుడు.

శ్రీకర్: ఏమంటుంది నిర్మల మిస్? రోటీన్ మీటింగేనా, లేక..

హిమజ: ఏం లేదులెండి, ఏదో జనరల్ గానే మాట్లాడింది.

శ్రీకర్: మామూలుగా పిటియం అని పెట్టి పిలుస్తారు కదా, అదే పేరెంట్ టీచర్ మీట్. దాంట్లో చెబితే పోయేదిగా? పనిగట్టుకొని వెళ్లడానికి మనకు సమయం ఉండద్దూ!

హిమజ: గట్టిగా స్కూల్లో ఉండేది. నాలుగు గంటలు. పన్నెండు కల్లా మన తవిటమ్మ వెళ్లి తీసుకుని రానే వస్తుంది. చదివేది ప్రీస్కూలు. ఏదో పెద్ద అకడమీషియన్ పోజు! అంతా తనకే తెలుసుననుకుంటుందేమో? ఎంత టెక్కో తెలుసాండి?

శ్రీకర్: హిమా! అసలు విషయం చెప్పకుండా ఏదో చెబుతున్నావు. ప్లీజ్ కమ్ టు ది పాయింట్! వాట్ డిడ్ షి డిస్కస్ విత్ యు? అక్కడికి వెళ్లొచ్చిన దగ్గర్నుంచి నీవదోలా ఉండడం గమనించాను. ప్లీజ్ హిమా! ఏం జరిగిందో చెప్పు త్వరగా. ఇది మన పాప భవిష్యత్తు గురించిన విషయం కదా!

హిమజ: (మౌనం) ఆమె ముఖంలో ఒక చిన్న టెన్షన్.

శ్రీకర్: హిమా, నిన్నే అడిగేది. సాయంత్రం కూడ డల్‌గా ఉన్నావు. (లాలనగా ఆమె భుజం మీద చేయి వేసి) స్కూల్లో ఏం జరిగిందో చెప్పు. లెటజ్ డీల్ విత్ ఇట్ టుగెదర్.

హిమజ: (కళ్లనిండా నీళ్లతో) మన విద్య నార్మల్‍గా లేదట. ఆ వయస్సులో ఉండాల్సిన చురుకుదనం అస్సలు లేదట. ఎప్పుడూ డల‌‍గా ఉంటుందట. ఎవరితో కలవదట. గలగలా మాట్లాడదట.

శ్రీకర్: (భృకుటి ముడి వేసి) నార్మల్‌గా లేదా? వాట్ డజ్ షి మీన్ హిమా! వజ్ షి టాకింగ్ సెన్స్? ఎందుకలా అనిపించిందామెకు? పేరెంట్స్‌ మనం అబ్జర్వ్ చేయనిది, ఆమె కనిపెట్టిందా?

హిమజ: ఒక గంట సేపు పిల్లలందర్నీ ఆడిస్తారట. ఏదీ ఆడదట. గట్టిగా చెబితే ఏడుస్తుందట. లేదా బెంచీమీద తలపెట్టుకొని నిద్రపోతుందట.

శ్రీకర్: ఇంకా ఏం చెప్పిందేమిటి?

హిమజ: మన పనమ్మాయి ఎప్పుడు వస్తుందా, వస్తుందా, ఎప్పుడు ఇంటికి తీసికెళ్లిపోతుందా, అని చూస్తూ ఉంటుందట. తవిటమ్మను చూసి పాప ముఖం వెలిగిపోతుందట. వెంటనే ఉషారుగా ఇంటికి బయలుదేరుతుందట.

శ్రీకర్: ఆహా!

హిమజ: అప్పటికీ నేను ఒప్పుకోలేదు తెలుసాండి. “మా పాప అందరు పిల్లల్లా కాదండి. చాలా బుద్ధిగా ఉంటుంది” అన్నాను.

శ్రీకర్: అప్పుడేమంది ఆ మిస్?

హిమజ: “అది బుద్ధిగా ఉండడం కాదేమో?” అందండి. పైగా అది ఒక ‘జడత్వమేమో?’ అని కూడ అంది. ఫిజిక్స్‌లో దానిని ‘ఇనర్షియా’ అంటారని సైన్సు కూడా చెప్పింది, మహాజ్ఞానిలాగా. “మీ పాపలో ఏదో అబార్మాలిటీ ఉంది. అది మీ దృష్టికి తెద్దామనే రమ్మన్నాను” అంది.

శ్రీకర్: నీవేమన్నావు దానికి?

హిమజ: మీరు టూమచ్‌గా ఆలోచిస్తున్నారు మిస్! మా పాప నార్మల్ గానే ఉంది. ఏమంటే అందరు పిల్లల్లాగా అల్లరి చేయదంతే! దానికి స్మార్ట్‌నెస్ ఎక్కువ. మా విద్య బంగారు తల్లి. మీరనుకుంటున్నదేం కాదు” అని దబాయించాను. వినదే?

శ్రీకర్: (సాలోచనగా) ఇంకా ఏం చెప్పింది?

హిమజ: ఈ మధ్య కొంతకాలంగా తాను మన విద్యను గమనిస్తూ వస్తూందట. పుస్తకంలోని ఆల్ఫాబెట్, నంబర్లు సరిగా గుర్తించడం లేదట. కళ్లు చికిలించి, అయోమయంగా చూస్తుందట. ‘బి’ ని ‘డి’ అంటుందట. ‘ఇ’ ని ‘ఎఫ్’ అంటుందట. ‘8’ ని ‘3’ అంటుందట. ఇదంతా చెబుదామని నన్ను రమ్మందట. బోర్డుమీద రాసింది సరిగ్గా చూడలేదట.

శ్రీకర్: అసలు అంత చిన్న పిల్లను బడికి పంపడమే మనం చేస్తున్న తప్పు. ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎలా తయారయ్యాయంటే, బ్లేమ్ అంతా పిల్లలమీద, పేరేంట్స్ మీద వేసి, తమ తప్పేమీ లేనట్లు బుకాయిస్తారు. వాళ్లు ఏ మాత్రం బాధ్యత తీసుకోరు, ఫీజులు తప్ప! (శ్రీకర్ ముఖం కోపంతో ఎర్రబడింది).

హిమజ: కరెక్టుగా చెప్పారండి. నేనూ అదే అన్నా. నాకు చాలా కోపం వచ్చిందంటే నమ్మండి. ఎడాపెడా దులిపేశాను.

శ్రీకర్: ఏమన్నావేమిటి? బాగా గడ్డిపెట్టావా లేదా?

హిమజ: వాట్ డుయు మీన్, మేడం? మీకు పిల్లలకు చదువు చెప్పడం రాకపోతే చెప్పండి వేరే స్కూల్లో జాయిన్ చేస్తాము. అంతేగాని అభంశుభం తెలియని పిల్లల మీద నెపం వేస్తారా? వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటారు. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలో తెలియదు మీకు!” అని కడిగేశాను లెండి. “ఏ టీచర్ హు బ్లేమ్స్ హిస్ స్టూడెంట్స్ ఈజ్ అన్ ఫిట్ ఫర్ ది జాబ్!” అన్నాను.

శ్రీకర్: గుడ్ జాబ్. డార్లింగ్! ఇంతకూ ఆ కొటేషన్ ఎవరిదో తెలుసా నీకు?

హిమజ: తెలియదండి. ఎక్కడో చదివినట్లున్నా.

శ్రీకర్: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలు హిమా! ఇంతకూ నీవన్ని మాటలంటుంటే కోపం తెచ్చుకోలేదా, నిర్మల మిస్? తీవ్రంగా రియాక్ట్ అయి ఉంటుందే.

హిమజ: (ఆలోచిస్తూ) లేదండి పైగా నావైపు జాలిగా చూసినట్లనిపించింది నాకు. “ఆల్ రైట్, నాకు అనిపించింది చెప్పడం నా ధర్మం. టీచర్‌గా అది నిర్వర్తించాను. తర్వాత మీ యిష్టం” అన్నది. “మీరు ఈ విషయం సీరియస్‌గా తీసుకోకపోతే ముందు ముందు ఇబ్బంది!” అన్నది.

శ్రీకర్: బాగా గడ్డిపెట్టావులే. ఇక పడుకుందాం. రేపు సోమవారం కదా! మళ్లీ మన ఉరుకులూ పరుగులూ తప్పవు! మన స్ట్రగుల్ ఫర్ ఎక్సిస్టెన్స్ మనకు తప్పదు కదా!

హిమజ: ఏమండీ! మరో విషయం చెప్పడం మరిచిపోయాను.

శ్రీకర్: (ఆవులిస్తూ) ఏమిటి చెప్పు, త్వరగా! నాకు నిద్ర వస్తూంది (అప్పటికీ అతని కళ్లు మూతలు పడుతున్నాయి)

హిమజ: నేను వచ్చేస్తుంటే, వెనక్కు పిలిచి, చెప్పిందండీ! పాప వయసుకు మించి వెయిట్ పెరుగుతుందట. దాన్ని పీడియాట్రిక్ ఒబేసిటీ అంటారట. “మలబద్దకం ఏమయినా ఉందా? పాపకు” అని అడిగిదండి. దాని వల్ల కూడ డల్‌గా తయారవుతారట. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయట. మూడీగా మారతారట.

శ్రీకర్: (లేచి కూర్చుని) అలా అన్నదా ఆమె! నిజమే హిమా! పాప, పోషణ వల్ల బొద్దుగా ఉందనుకుంటున్నాం గాని, ఈ కోణంలో మనం ఆలోచించలేదు. కాన్‌స్టిపేషన్ ఉంది కదా మన విద్యకు. మోషన్ ఫ్రీగా రాక టాయిలెట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మిస్ చెప్పింది, ఇది మాత్రం కరెక్టే.

హిమజ: (దిగులుగా) అవునండి. ఏం చేద్దాం? మన పాప నిజంగా నార్మల్‍గా లేదేమోనండి!

శ్రీకర్: దిగులు పడకు హిమా! నాల్రోజులు చూసి డాక్టర్ దగ్గర చూపిద్దాం. మలబద్ధకం పెద్ద జబ్బా ఏమిటి! గుడ్ నైట్! పడుకో!

లైట్లు ఆరిపోతాయి

దృశ్యం-6

లైట్లు వెలుగుతాయి

(డాక్టర్ వ్యామ్రేశ్వరరావుగారి క్లినిక్. ఆయన పిల్లల డాక్టర్. దొండపర్తిలో ఉంటుందాయన హాస్పిటల్. హిమజ శ్రీకర్‍లను బయట కూర్చోబెట్టి విద్యను పరీక్షించాడాయన! ఇద్దర్నీ లోపలికి రమ్మన్నాడు)

డాక్టర్: శ్రీకర్ గారు మీ ఇద్దరూ ఉద్యోగస్తులేనా?

శ్రీకర్: అవును డాక్టర్. బుల్లయ్య కాలేజీ జంక్షన్ ఉంది కదండీ..

డాక్టర్: ఏది, రేసపువాని పాలెమా?

శ్రీకర్: అదే! అక్కడ టెక్‌హబ్‌లో. టెక్ మహేంద్రా కంపెనీలో ఇద్దరం పని చేస్తామండి.

డాక్టర్: మరి పాపను ఎవరు చూసుకుంటారు? ఇంట్లో పెద్దవాళ్లెవరైనా..

హిమజ: (కల్పించుకొని) లేరండి. పనిపిల్లను పెట్టుకున్నాం.

డాక్టర్: పాపకు డైజెషన్ ప్రాబ్లం బాగా ఉందమ్మా! కాన్‌స్టిపేసన్‌కు సిరప్ రాస్తాను. రోజూ రాత్రి పడుకునే ముందు పది ఎం.ఎల్. కొంచెం నీటిలో కలిపి ఇవ్వండి. ఫ్రీ మోషన్ అవుతుంది. కడుపు నొప్పిలాంటిదేమీ లేదు కదా?

శ్రీకర్: లాక్సేటివ్స్ అలవాటయితే ప్రమాదమంటారు కదా డాక్టర్.

డాక్టర్: (నవ్వుతూ) మీ గూగుల్ నాలెడ్జి అంతా ఇక్కడ చూపించకండి శ్రీకర్ గారు. సరేగాని, సెల్‌ఫోన్ బొమ్మలు సరిగా కనపడవని పాప నాతో చెప్పింది. చూడండి! ఇప్పుడు కూడా..

(విద్య పక్కనున్న సోఫాలో కూర్చొని స్మార్ట్ ఫోన్ చూస్తూంది కళ్లు చికిలిస్తూ)

హిమజ: తానే చెప్పిందా మీతో (ఆశ్చర్యపోతుంది)

డాక్టర్: అవునమ్మా! ఎంత తెలివైనది కాకపోతే అంత చిన్న పాప తన సమస్యను డాక్టర్‌కు చెప్పాలని అనుకుంటుంది? షీ ఈజ్ స్మార్ట్! నేను డాక్టరుననీ, తన సమస్యను పరిష్కరించగలననీ ఇంత చిన్న వయసులో తెలుసుకుందంటే, నిజంగా గ్రేట్! (అమ్మానాన్నలిద్దరూ మురిపెంగా కూతుర్ని చూసుకుంటారు. విద్య అదేమీ గమనించదు)

హిమజ: ఆ విషయం కూడ చెప్పాలి డాక్టర్ మీతో. ఈ మధ్య పాప తడుముకుంటున్నట్లుగా నడుస్తూందండి. చాలాసార్లు గడప తట్టుకొని పడిపోయింది. ఉప్మాలో జీడిపప్పులు కనపడవని, నన్ను ఏరి ఇమ్మంటుంది.

డాక్టర్: (సాలోచనగా) అమ్మా, మీ పాప స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అయినట్లుగా కనిపిస్తుది. క్రమంగా ఫోన్ చూసే అలవాటును తగ్గించాలి మీరు. వెంటనే ఐ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. డా॥ కూర్మారావుగారనీ నా మిత్రుడే. అశీలు మెట్ట జంక్షన్లో ఉంటుంది క్లినిక్ టెస్ట్ చేసి ఏం చేయాలో చెబుతారు ఆయన. అన్నట్లు ఇంట్లో మీరిద్దరూ కూడా ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ చూస్తుంటారా?

ఇద్దరు: (గిల్టీగా) అవును సార్ (తలొంచుకున్నారు).

డాక్టర్: అదీ విషయం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా తల్లీ! మరేం అనుకోకండి. ఇంట్లో పనిపిల్లకు కూడా స్ట్రిక్ట్‌గా చెప్పండి. మీరు లేనప్పుడు పాపకు సెల్‌ఫోన్ ఇవ్వద్దని. ఏదో రకంగా ఎంగేజ్ చేయమని. మీరు జాగ్రత్తపడకపోతే ముందు ముందు పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మిమ్ముల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం పాపకు ఫోన్ ఇవ్వకండి! అదే ఇప్పటి పేరెంట్స్ చేసే పెద్ద తప్పు!

(డాక్టరు గారికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేస్తారు)

లైట్లు ఆరిపోతాయి.

దృశ్యం-7

లైట్లు వెలుగుతాయి.

(శ్రీకర్ వాళ్లింట్లో కళ్లజోడుతో విద్య డైనింగ్ టేబుల్ వద్ద టిఫిన్ చేస్తూంది. హిమజ ఇంకో దోసె తెచ్చి పాప ప్లేట్లో వేస్తుంది. పాప, టేబుల్ మీద, చిన్న స్టాండ్‌కు ఆనించి సెల్ ఫోన్ పెట్టుకుని ‘మోటూ పత్లూ’ చూస్తోంది. శ్రీకర్ హాల్లోంచి వస్తాడు)

శ్రీకర్: విద్యా, ప్లేట్లో దోసె చల్లారిపోతుంది. ఆ ఫోన్ పక్కన పెట్టి, త్వరగా తిను తల్లీ! ఫోన్ చూస్తూ తిండి తినగూడదని చెప్పానా లేదా? దోసె ముక్క ముక్కు దగ్గర పెట్టుకుంటున్నావు చూడు!

(విద్య పలకదు, తల తిప్పి నాన్న వైపు చూడదు)

హిమజ: నాన్న పిలుస్తుంటే వినబడలేదేమే నీకు? ఆ ఫోన్ చూసి చూసి కళ్లకు రోగం తెచ్చుకున్నావు. చిన్న వయసులో కళ్లజోడేమిటో ఖర్మ! ఫోన్ పక్కన పెట్టు ముందు! పెడతావా లేదా? మెండితనం చేయకు! (అంటూ ఫోన్ తీసి దూరంగా పెట్టింది)

విద్య: (చేతులూ కాళ్లు కొట్టుకుంటా) నేను తినను. నాకు ఫోనివ్వు! (అంటూ కళ్లజోడు తీసి విసిరి నేలపైకి కొడుతుంది)

హిమజ: ఎంత పొగరే నీకు? కళ్లజోడు విసిరేస్తావా? బోలెడు డబ్బు ఖర్చయింది దానికి! గుడ్డి ముండవైపోదామనుకుంటున్నావా, గుడ్డిముండవి – అంటూ (ఆమె గొంతులో ఆక్రోశం, ఆవేదన, నిస్సహాయత) ధబీధబీమని పాప వీపుపై రెండు దెబ్బలు వేసింది. శ్రీకర్ క్రిందపడిన కళ్లజోడును తీసుకున్నాడు. హిమజను, విద్యను చెరో చేత్తో దగ్గరికి తీసుకున్నాడు.

శ్రీకర్: హిమజా, రాను రాను పిచ్చిదానివైపోతున్నావు? చిన్నపిల్ల దానికేం తెలుసు? మెల్లగా నచ్చచెప్పి, మాన్పించాలి. అవసరమైతే సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళదాం. కొడితే ఏం ప్రయోజనం చెప్పు? బంగారూ, విద్యమ్మా, లేదులే, ఏడవకు, దోసె నేను తినిపిస్తా, సరేనా? ఇదిగో కళ్లజోడు పెట్టుకో తల్లీ, మా అమ్మవు కదా! ప్లీజ్!

(విద్య కళ్లజోడు పెట్టించుకుంది బుద్ధిగా. నాన్న తినిపిస్తూంటే టిఫిన్ తినసాగింది. స్కూలు మార్చలేదు. తవిటమ్మ వెంట స్కూలుకు వెళ్లిపోయింది విద్య. ఇప్పుడు యు.కె.జి. చదువుతోంది. రెండు ఫర్లాంగులు కూడ ఉండదు స్కూలు)

హిమజ: పాప మనకు దక్కదేమోనండీ? ఆ సిరప్ పని చేయడం లేదు. టాయిలెట్లో నరకం చూస్తోంది పాపం! కళ్లు డ్రై అయిపోయాయని డ్రాప్స్ ఇచ్చారు కదా? అవి వేసుకోవడానికి హఠం చేస్తోందండీ! ఒక్కగానొక్క పిల్ల! (వెక్కి వెక్కి ఏడుస్తుంది) ఏమయిపోతుందో ఏమో పిచ్చి తల్లి.

శ్రీకర్: (ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ఓదార్పుగా వీపు నిమురుతూ) హిమా ! కంట్రోల్ యువర్ సెల్ఫ్! పాప ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదు. కళ్లడాక్టరు కూర్మారావుగారు చెప్పారు కదా! ఈ మధ్య మన పాపలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని! టెక్నాలజీ పిల్లలకు పెడుతున్న శాపం హిమా ఇది! (ఆలోచిస్తూ) ఒక పని చేద్దాం మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి రమ్మందాం. పెద్దవాళ్లు, తోడుగా ఉంటే నీకూ కాస్త రిలీప్ ఉంటుంది. రాన్రాను మరీ సెన్సిటివ్‌గా తయారవుతున్నావు.

హిమజ: (సంతోషంగా) అవునండి. మంచి మాట చెప్పారు! ఇప్పుడే చేస్తాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఒక నంబర్ నొక్కింది. అటువైపు ఆమె తల్లి సుగుణ. హిమజ మాట్లాడుతూ, ఏడుస్తోంది)

శ్రీకర్: ఫోన్ స్పీకర్ మోడ్‌లో పెట్టు హిమా!

(హిమజ స్పీకర్ ఆన్ చేస్తుంది)

అమ్మా! నీవు నాన్న, త్వరగా రండే! మీరు ఉంటే.. ( ఆమె గొంతు గద్గదమయింది).

సుగుణ: ఎందుకే పిచ్చితల్లి అలా ఏడుస్తావు? ఇప్పుడేమయిందని? మేం రేపుదయం భువనేశ్వర్ వైజాగ్ ఇంటర్‌సిటీలో వస్తాం. రేపు మీరిద్దరూ రెండోపూట వీలైతే సెలవు పెట్టండి. పాప స్కూలు నుంచి ఎన్ని గంటలకొస్తుంది?

హిమజ: సాయంత్రం 4 గంటలు అవుతుందే అమ్మా.

అర్జునరావు : అల్లుడూ! ఏం దిగులు పడకండి. లెటజ్ డీల్ విత్ దిస్ ట్యాక్ట్‌ఫుల్లీ! ‘ఉద్యమేన హి సిధ్వన్తి కార్యాణి’ అన్నాడు కదా హితోపదేశకర్త. ఎవ్వె రి ప్రాబ్లం విల్ హ్యావ్ ఎ సాల్యూషన్. డోన్ట్ వర్రీ.

శ్రీకర్: థ్యాంక్యూ మామయ్యా! మీ కోసం ఎదురుచూస్తుంటాం. మా అమ్మానాన్నా రాలేరు. వారికి మీ అంత అవగాహన లేదు. మా అమ్మయితే “పిల్లలను పెంచడం చేతగానప్పుడు వాళ్లను కనడమెందుకు?” అని హిమను తిడుతుంది. పైగా ఇది వరి కోతల సీజన్. వారు హార్వెస్టింగ్‌లో బిజీగా ఉంటారు.

అర్జునరావు: డోన్ట్ బ్లేమ్ ది ఎల్డర్స్ మై బాయ్! రేపు కలుద్దాం.

హిమజ: (సంతోషంతో) నాకెందుకో మనసు తేలికగా ఉందండి.

శ్రీకర్: గుడ్. పద బయలుదేరదాం.

లైట్లు ఆరిపోతాయి.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here