స్నేహ బంధం

0
10

[ఆగష్టు 4, 2024 న Friendship Day సందర్భంగా ‘స్నేహ బంధం’ అనే కవితని అందిస్తున్నారు డా. చెంగల్వ రామలక్ష్మి.]

[dropcap]భి[/dropcap]న్న దృక్పథాలు
విభిన్న మనస్తత్వాలు, అభిరుచులు
అంతస్తుల అంతరాలు

ఒకరేమో ప్రాచీన సాహిత్య సముద్రంలో ఈదుతూ,
లోతులకు వెళ్ళిపోతూ, రసాస్వాదనలో తేలిపోతూ,
ఈ లోకంలో ఉంటూ లేనట్లుగా
సమూహపు ఏకాంతంలో జీవన సాఫల్యాన్ని నిర్వచిస్తూ ఉంటారు.

మరొకరు కలల ప్రేయసితో కలయికను కలగంటూ
చెట్టులో, పుట్టలో కొమ్మ కొమ్మకు పూసే పువ్వు పువ్వులో
ఊహా ప్రేయసినే చూస్తూ ప్రకృతి ఒడిలో పరవశిస్తూ
భావనా లోకంలో విహరిస్తూ ఉంటారు
అష్టాదశ పురాణాలను, వేద వేదాంగాలను అధ్యయనం చేసి
ప్రవచనమార్గంలో ప్రసిద్ధులైపోయిన వారు వేరొకరు

అభ్యుదయమే ప్రగతి దారి అని నినదించేది ఒకరు
విప్లవమే వర్ధిల్లాలని గొంతెత్తి గర్జించేది ఒకరు!
పురుషాధిపత్యాన్ని, స్త్రీల అణచివేతను
ధిక్కార స్వరంతో ప్రశ్నించేవారు ఒకరైతే

తన భర్త, తన పిల్లలు,
తన చాకిరీ ఇదే శాశ్వతమని,
సత్యమని సుందరమని
అంకితభావంతో నమ్మి
తన సంసారపు బావి నుంచి
బైటకి రావటానికి కూడా ఇష్టపడని
ఇంటికి దీపం ఇల్లాలు ఒకరు

విశ్వవిద్యాలయ ప్రాంగణం దాటి
నాలుగు పదుల వర్షాలు దాటినా ఎవరూ మారలేదు
వారి స్నేహ సుగంధమూ తరగలేదు
ఆకారాలలో, ఆహార్యాలలో, ఆహారాలలో మార్పు తప్ప!
ఎవరి సిద్ధాంతాల పట్ల ఎవరి రాద్ధాంతం ఉండదు
ఒకరి భావజాలం మరొకరికి సరిపడినా పడకపోయినా
తమవైన సంతోషాలు, బాధలు పంచుకోవటానికి
వారిని కలిపి వుంచిన ఒకే ఒక బంధం పేరు ‘స్నేహం’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here