స్నేహ జీవిత పరిమళాలు

0
11

[dropcap]సూ[/dropcap]ర్యోదయం వేళ, శీతాకాలం. బాల్కనీలో కూర్చుని హైవే పై వెళ్ళే మనుష్యుల్ని వాహనాలు చూస్తూ కాఫీ తాగుతోంది శౌరి. ఫోన్ మోగుతుంది. టీపాయ్ మీద పెట్టిన ఫోన్ తీసి నంబర్ చూసింది. పేరు లేదు, కొత్త నంబర్. ‘ఇంత ఉదయాన్నే ఎవరూ చేస్తున్నారు అది విదేశీ నంబర్ కూడా’ అనుకుంది. ఉదయం, అర్ధరాత్రి వచ్చే పేరు లేని నంబర్స్‌కి ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. ఇది శౌరి ఇంటి రూల్. ‘విదేశీయులకు వాళ్ళ సమయానికి అనుగుణంగా చేస్తారు’ అనుకుని, ఫోన్ చేతిలోకి తీసుకుని “హలో శుభోదయం” అన్నది

అవతల స్త్రీ గొంతు “నేనే మీ సుష్మని” అంటూ “శుభోదయం” అన్నది.

“నువ్వు కెనడా వెళ్లి పోయావా ఏమిటి? నంబర్ కొత్తది వచ్చింది”

“అవునే ఆరు నెలలు ఇండియా, ఆరునెలలు కెనడాలో. మూడు నెలలు ఒక కొడుకు మరో మూడు నెలలు ఒక కొడుకు దగ్గర. వాళ్ళు అయితే పూర్తిగా విదేశాలకు వచ్చి చెరో ఆరు నెలలు ఉండమని చెపుతారు. పూర్తిగా వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతే ఎలా ఇక్కడ బావగారు, మరుదులు, ఆడపడుచులు అంతా ఉన్నారు, పెళ్లి పేరంటం అన్ని ఉంటాయి. అందుకు మేము వెళ్ళలేదు. మా ఆయన వాళ్ళ వాళ్ళని చూడకుండా ఉండలేరు. వారానికి ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడుతారు. నాకూ మా అన్నయ్యలు అక్కలు పిల్లలతో రోజు ఏదో ఒక వీడియో కాల్ వస్తూనే ఉంటుంది. లేకపోతే నేను చేస్తాను. బంధాలు అనుబంధాలు కావాలి కదా. నువ్వు ఎలా ఉన్నావు ఇంత సేపు నా విషయాలే చెపుతూ ఉన్నాను” అంది సుష్మ.

“మామూలే నా విషయం. పిల్ల అత్తవారి ఇంటికి వెళ్ళింది. అక్కడే ఏదో రకంగా పని నేర్చుకుంటూ వాళ్ళతో గడిపేస్తుంది. ఇప్పటి రోజుల్లో పిల్లల పెళ్లి మహా కష్టంగా ఉన్నది. ఒక్కోసారి ‘అమ్మా నాకు నిన్ను చూడాలని ఉన్నది’ అంటుంది. నా పిల్లకి ఇంకా చిన్నతనం పోలేదు. అక్కడ ఒక్కడే కొడుకు ఎలా రమ్మంటాను చెప్పు?”

“అవును. ఇప్పుడే అంత కూడా ఒంటికాయ శొంఠి కొమ్ములు కదా. పొడగిట్టని పొట్లపాదుల కుటుంబాలు. ఎవరికి వారే యమునా తీరే. ఏదో ఫంక్షన్ అయితే ఈవెంటెంట్ మేనేజర్ ధర్మమా అని అందరూ పలకరించుకుంటారు. సమయానికి అన్ని కూడా తిండితో సహా చేతిలోకి వస్తాయి. ఎక్కడి సమస్య అక్కడ. బ్రతుకులో మార్పులు తప్పవు. ఇక్కడ చలిగాలి నాకు పడదు, అయిన మరి తప్పదు. బ్రతుకు నాటకంలో పుట్టుట తప్ప నట్ట నడుమ పని నాటకమే కదా.”

శ్రీ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన రేవతి రాగంలో యం.యస్ గళంలో అద్భుతంగా వినిపిస్తోంది.

“అవతలి గదిలో కోడలు పెట్టుకున్నది. అవిడ కొంచెం సంగీతం నేర్చుకున్నది.”

“ఆహా మంచిదే, నీకు కుదరలేదు. కోడలు అయిన పాడేది వచ్చింది.”

“ఆ ఏదో కొంచెమేలే. పూజలు, పాటలు కూడా వచ్చును. సుఖంగా ఉన్నది అనుకో సుష్మా. ఇంకా నీకు విదేశాలలో మరి సుఖమే కదా” అంది శౌరి.

“ఆహా ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. వాళ్ల కోసం వెళ్ళాలి. పిల్లలు ఇక్కడ అడ్జస్ట్ కాలేరు. అంతకంటే మేము వెళ్ళడం సుఖమే కదా”

“అవును మరి మనుమల కోసం తప్పదు”

“ఇప్పుడు ఎందుకు చేశాను అంటే నాకు రాత్రి ధీర ఫోన్ చేసింది దాని నంబర్ నా దగ్గర ఉన్నది. ఆ సమయంలో ఫోన్ తీసి మాట్లాడితే నా రెండో మనుమరాలు లేచి ఇంకా కబురులు మొదలు పెడుతుంది. మా ఆయనకి మా వాళ్ళకి కూడా డిస్ట్రబెన్స్. అందుకని వాళ్ళు అంతా లేచాక ఫోన్ చేశాను. అది రిటైర్ అయ్యి ఖాళీగా ఉండటం వల్ల ఏమి టైం పాస్ అవడం లేదు అంటూ మన డిగ్రీ బ్యాచ్ అందరూ ఎలా ఉన్నారు నంబర్స్ ఇమ్మన్నది. నీది ఇచ్చాను, నీకు ఫోన్ చేస్తాను అంది. నువ్వు చాలా బిజీగా ఉన్నావు, సోషల్ ఆక్టివిస్ట్‌గా నీకు ఖాళీ ఉండదని చెప్పాను. సరే కోడలు ఆఫీస్‌కి వెళ్ళింది. వంట మనిషి వచ్చింది. మళ్ళీ చేస్తాను” అంది సుష్మ.

“ఏమిటి విదేశాల్లో అమ్మని సుఖ పెట్టడానికి కొడుకులు వంట మనిషిని పెట్టారా, అదృష్టవంతురాలువి”

“అవునే ఇక్కడ జైన్ మహిళలు వచ్చి రోటి చేసి కూర చేసి వెడతారు. నెలకి మూడు వందల డాలర్స్ అలా ఉంటుంది. కొన్ని చోట్ల రోజు లెక్కన డాలర్స్‌కి చేస్తారు. మాకు నెల అంతా వస్తుంధి. వాళ్ళు అసలు నాన్ వెజ్ ముట్టరు. అసలు కోడి గ్రుడ్డు కూడా తినరు. వాళ్ళు కేవలం ఈ బిజినెస్ కోసమే వచ్చి ఉన్నారు. స్వీట్స్ బాగా చేస్తారు. నేను మళ్ళీ మాట్లాడుతాను బై” అంటూ ఫోన్ పెట్టే సింది.

‘ఇప్పటికీ దాని మనస్తత్వం మారలేదు. మనవరాలు నిద్రకి భంగం అని ఫోన్ తియ్యలేదట, నిజమైన అమ్మమ్మ’ అనుకుంది శౌరి.

***

శౌరి, ధీర, సుష్మ, సౌమ్య నలుగురు కాలేజ్‌మేట్స్. ఇంటర్ నుంచి కలిసి చదువుకున్నారు.

సుష్మ వాళ్ళు బాగా విద్యావంతులు. తన అక్కలు కూడా బిఏ, బియిడి చదివారు. మంచి అందగత్తెలు. ఆడ మగా అంతా కలిసి ఒక్కసారి ఇంట్లో భోజనం చేస్తుంటే చూసి తీరాలి. తెల్లగా మొగలి పూల రంగులో పట్టు పంచెలు కట్టుకుని బొట్టు పెట్టుకుని విభూది పెట్టుకుని అన్నం తింటుంటే ఆహా ఎంతో బాగుండేది. ఆడపిల్లలు పట్టు లంగాలు ఓణీలు వేసుకుని జడకుచ్చులు పెట్టుకుని మల్లె కనకాంబరము దండలు పెట్టుకుని నెయ్యి వడ్డిస్తూ మజ్జిగ వేస్తూ జగన్మోహినుల్లా ఉండేవారు

ఆ కుటుంబం ఎంతో బాగుంది. ఈ పిల్లల కోసం ఎవరు బంగారు పూలు పూజ చేస్తున్నారో, ఏ ఇంటి అల్లుళ్ళు అవుతారో, ఏ ఇంటి కోడళ్ళు అవుతారో అనుకునేవారు. భోజనం అయ్యాక అంతా ఒకేసారి హరి నామ స్మరణ గోవిందా నామము చెప్పి లేచేవారు. మేనమామలు పిల్లలు ఈడు కాదు, మేనత్త కొడుకులు చిన్న చదువులు. అందుకని అన్ని పై సంబంధాలే వచ్చాయి. ఆడపిల్లలు ఇద్దరికీ ముందు చేసి ఒకళ్ళని విశాఖ ఇంకొకళ్ళకి హైదరాబాద్ చేశారు. పిల్లలు వస్తూ పోతు ఉండేవారు. ఆఖరుది సుష్మ. అన్నలు అక్కలు ఎప్పుడు వచ్చినా ఏదో బహుమతి తెచ్చేవారు. అది ఆనందంగా పట్టుకు వచ్చి లేక కట్టుకు వచ్చి చూపించేది.

అలా వాళ్ళ అన్నలు ఒకరు కెనడా వెళ్లి మిగిలిన అందరును లైన్‌గా విదేశాలకు అవకాశం ఇచ్చి తీసుకు వెళ్ళాడు. మూడో వాడు, ఐదో వాడు మాత్రం ఇండియాలో చాలా మంచి ప్రభుత్వ జాబ్ లలో ఉన్నారు. వాళ్ళు విదేశాలు వెళ్ళి చూసి వచ్చారు. వాళ్ళ పిల్లలు మాత్రం విదేశమే. ఏమిటో ఈ మోజు.

సుష్మ కూడా విదేశాలు వెళ్ళారు. సుష్మ భర్త అస్సాంలో ఇంజినీర్‌గా చేసి రిటైర్ అయ్యి హైదరాబాద్‍లో సెటిల్ అయ్యారు. కారణం పిల్లలు వచ్చి వెళ్ళడానికి విమానాశ్రయము ఉన్నది, ‘సమయం ప్రయాణంలో కాకుండా మా దగ్గరికి తొందరగా వస్తారు’ అంటుంది.

అవును కదా రెండు రోజులు ప్రయాణంలో సరిపోతే మిగిలిన రోజులు తక్కువ అవుతాయి, కోడలి పుట్టినిల్లు అత్త ఇల్లు అన్ని చూడాలి కదా.

సుష్మకి డిగ్రీ కాగానే పెళ్ళి చేశారు. ‘మా పిల్ల ఉద్యోగం చెయ్యలేదు, అలా అక్కరలేని పెద్ద సంబంధం చూసి చేస్తాం’ అని వాళ్ళ వాళ్ళు అలాగే పెద్ద సంబంధం చేశారు. అయితే చాలా దూరం వెళ్లి ఉన్నది. అక్కడే పిల్లలు పురుళ్లు పెంపకలు మొగుడు పెళ్ళాం చూసుకున్నారు. పెద్ద వాళ్ళు ఎవరు వెళ్ళ లేదు. అటు అక్కలు వదినలు అంతా ఎవరి జీవితాలు వారివి అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళని మూడో అన్నయ్య చూస్తాడు.

‘నేను ఒక్కర్తినే దూరంగా ఉన్నాను’ అనుకునేది. ఇంక రిటైర్ అయ్యాక వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. పిల్లలు ఇద్దరు ప్రతి ఏడాది ఆరు నెలలు తమ వద్ద ఉండాలని ఒప్పందం చేశారు. ‘మరి తప్పదు వెళ్లి వస్తాం’ అని అంటుంది. మొదటి నుంచి సౌమ్యంగా ఉండేది, వయసుతో పాటు ఇంకా సౌమ్యం వచ్చింది.

***

శౌరి ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుంచి గారం. ‘ఉద్యోగం చెయ్యవద్దు ఎంత చదివినా విజ్ఞానం కోసమే’ అనే తల్లి తండ్రి చాటు బిడ్డగా గడిచి పోయింది. చదువు అంతా ఇంటి దగ్గర ఊళ్ళో ఉన్నంత వరకు చదివింది. ఆ తరువాత దూరవిద్య కేంద్రం ద్వారా మిగిలిన చదువు చదివింది. మంచి ఆలోచన ఉంది. సమాజ హితం కోరే కార్యక్రమాలు డిజైన్ చేసి ఏడాదికి ఐదు అరు నిర్వహిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ల సహకారం ఉన్నది.

‘మేము నీ కోసం నీ వెంట రాము. నీవు ఒక్కర్తి జాబ్ నిమిత్తం వేరే ఊరు వెళ్ళ వద్దు’ అంటూ అన్నీ ఆపేశారు. ఇంకా పెళ్లి కూడా బాగా దగ్గరగా ఉన్న తెలిసిన సంబంధం చేశారు. పిల్లాడు మంచివాడే బ్యాంకులో చేస్తాడు. ట్రాన్స్‌ఫర్ అయినా ఇక్కడి నుంచే వెడతాడు.

‘ఒక పిల్ల చాలు బాగా పెంచాలి, అన్ని నేర్పాలి’ అంటూ సరిపెట్టారు. పిల్ల పెళ్లి అయింది. భార్య భర్త ఫ్లాట్‌లో ఉంటారు. తల్లి తండ్రి వేరే చోట పెద్ద సొంత ఇంట్లో ఉంటారు. అమ్మమ్మ తాత గారం వల్లే బెంగ వస్తూ ఉంటుంది, తరచూ కార్లో వచ్చి వెళ్లి పోతుంది. ఇప్పుడు అదే డ్రైవ్ చేస్తోంది. అందుకు ఆటవిడుపే అంతా కూడా. ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది.

***

ధీర విషయానికి వస్తే తను ఉమెన్ ఎంపవర్‌మెంట్ అంటుంది. పైగా ధీర చదువు కోసం చాలా విధాలుగా తంటాలు పడింది.

సౌమ్యకి మాత్రం డిగ్రీ రిజల్ట్ రాకుండానే పెళ్లి చేసేశారు. వాళ్ళ మామగారు పెద్ద రాజకీయ వేత్త. కొడుకు ఫ్యాక్టరీ చూసుకుంటాడు. అన్నదమ్ములు ఇద్దరు, అక్క చెల్లెళ్ళు ముగ్గురు. అందరూ ఫ్యాక్టరీలో పదవుల్లో ఉన్నారు డైరెక్టర్స్ చైర్మన్‌లు. ఇంకా చదువుతో పని ఏముంది? అంతా సజావుగా వడ్డించిన విస్తరి లాంటి జీవితం.

మగ పిల్లలు ఇద్దరు కూడా ఇంజినీర్స్. వాళ్ల ఫ్యాక్టరీ లోనే అంతా. వచ్చిన వాళ్ళకి కాఫీలు టిఫిన్లు పంపడమే సౌమ్య పని. అతిథి అభ్యాగతితో బిజీ ఆయ్యింది. మాట పెదవిలో వుండగానే సరుకులు కొనిస్తారు ఇది సౌమ్య జీవితం.

ఎటొచ్చీ ధీరకి ఆంధ్ర యూనివర్సిటీ సీటు రాలేదు. వేరే యూనివర్డిటీలో వచ్చింది. అదీ చాలా కష్టం మీద జాయిన్ అయ్యింది. తండ్రి వచ్చి యూనివర్సిటీ వారికి ఫీజు విషయం మాట్లాడుకుని తన వీలును బట్టి పంపుతాను అని పర్మిషన్ పుచ్చుకున్నారు. అక్కడ ఆహారం బాగుండదు, అప్పుడు అన్నం, చపాతీలు, ఏదో రుచి లేని కూర, కారం పులుసు అవి తప్ప ఏమి వంటలు ఉండవు. స్వీట్స్ ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మరమరాలు ఐటమ్స్, స్వీట్స్ పెడతారు.

బెంగగా ఉండేది. మళ్ళీ చదువు మీద ఆసక్తి. ఉద్యోగం చెయ్యాలి. వెనుక ఆస్తులు లేవు. కట్నం ఇచ్చినట్లయితే గానీ మంచి సంబంధాలు రావు. ఇలా ఎలాగో ఫస్ట్ సెమిస్టర్ అయ్యింది.

తెలుసున్న చిన్ననాటి ఫ్రెండ్ రైల్లో కనిపించాడు. అతను రైల్వేలో పని చేస్తున్నాడు. వచ్చి వెళ్ళేటప్పుడు ఏ సహాయం అయినా చేస్తా అన్నాడు.

ఆ పరిచయం మొదటి సంవత్సరంలోనే ప్రేమగా మారి కట్నం లేని పెళ్లిగా అయ్యింది. ఇంకేమి తల్లి తండ్రి చదువు మానిపించి పెళ్లి చేశారు. పెద్ద సంతానం, పెద్ద కొడుకు బాధ్యతలు అన్ని ఉన్నాయి. ఐదుగురు అక్కల పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇంకా ఇద్దరు కూడా తమ్ముళ్ళూ ఉన్నారు.

పెళ్లి అయిన ఏడాదికి ‘అక్కలకి ఏమి ఆడబడుచు లాంఛనాలు ఇవ్వలేదు. మొదటి పండుగకి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీ నాన్నగారు రిటైర్ అయ్యారు కనుక, నువ్వు మా అక్కల కోసం కొంచెం డబ్బు పుచ్చుకుని ఆ ముచ్చటను బాగా జరిపితే మంచిది’ అన్నాడు. అప్పటికి ఒక పిల్ల తల్లి అయ్యింది ధీర. బారసాల ఘనంగా చెయ్యాలి అన్నారు. సరే అలాగే అన్నారు.

ఆ తరువాత ‘పిల్లకి ఏడాది వచ్చింది కదా, మా ఇంట్లో మా అక్కకి పిల్లలు లేరు, నీ పిల్లని అక్కను పెంచమని ఇచ్చి నువ్వు పిజి పూర్తి చెయ్యి’ అన్నాడు.

చేసేది ఏముంది? అన్ని మర్చిపోయింది. మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లి మూడేళ్ల గాప్ తరువాత చదువు మొదలు పెట్టింది. ముందు యూనివర్సిటీ ఒప్పుకోలేదు. కానీ బ్రతిమాలి ఎక్కవ ఫీజు కట్టి జాయిన్ అయింది. అదంతా తండ్రి పెట్టుకున్నాడు

పిల్ల జ్ఞాపకం వచ్చేది కానీ ఏమి చెయ్యగలదు? సొంతంగా ఫోన్ లేదు, బయటకు వచ్చి భర్తతో మాట్లాడేది. అతను రైల్వే కనుక వారానికి ఒక సారి వచ్చేవాడు

ఏవో మాటలు చెప్పి మరిపించే వాడు, తప్పదు జీవిత వలయం ఇది.

ఎలాగో పిల్లని, కుటుంబాన్ని పక్కన పెట్టి చదువుకున్నది. పిజి అయ్యింది కానీ జాబ్ సరి అయినది రాలేదు. మళ్ళీ బియిడి చేసింది. ఇంకా సర్వీస్ కమిషన్‌లో ఏజ్ బార్ కాకుండా పట్టుదలగా చదివి ఏదో వెనుక ప్రయత్నాలు చేసి ఉద్యోగం సంపాదించింది. జూనియర్ కాలేజ్. రోజు రైల్‍లో సీజన్ టికెట్ పై వెళ్లి వచ్చేది.

శ్రీనివాస్ మనిషి మంచివాడే, కానీ ఆర్థిక పరిస్థితి మనిషిని కష్టపెట్టడం వల్ల భార్య ధీరను చదువుకుని ఉద్యోగం చెయ్యమనడం తప్పలేదు. పిల్లని కూడా తీసుకెళ్లి ఆ ఊళ్ళో కాన్వెంట్‌లో చదివించింది. జీవితం అంతా పోరాటంగా మారింది. శ్రీనివాస్ వేరే చోట, తల్లి పిల్ల వేరే చోట. అయితే రైల్వే వారు కాబట్టి వాళ్ళకి సీజన్ టికెట్ వల్ల డబ్బు ఖర్చు తక్కువతో జరిగిపోయింది.

పిల్ల ఎదుగుతుంది, రక రకాల ఖర్చులు వాటిని తట్టుకోవడానికి అమ్మ ఉద్యోగం.

ఈలోగా ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ‘నలభై దాటి పోతోంది. ఇల్లుకి లోన్ నువ్వు పెట్టు’ అన్నాడు. సరే తప్పదుగా పెట్టింది. అది చాలా లేదు. ‘మీ నాన్న రిటైర్ అయ్యాక అంతా మీ అన్నకు ఇస్తున్నాడు. నువ్వు కూడా కొంత ఇమ్మను’ అన్నాడు.

సరే ధీర తల్లి తండ్రి కొంత ఇచ్చారు. వారి పెన్షన్‌తో ఓ వృద్ధాశ్రమంలో చేరారు. అల్లుడు చూడటానికి ఒప్పుకోలేదు. కొడుకు బొంబాయి కలకత్తా ఉద్యోగం, ఒక చోట ఉండడు. వారి జీవితం వారిది.

పిల్లను ఎం.బి.ఎ. చదివించింది. తను పడ్డ కష్టం ఆ పిల్ల పడకూడదు అంటూ డబున్న సంబంధం చేసింది. అల్లుడు ఏవో బిజినెస్‌లు చేసి పిల్లని ఉద్యోగం చెయ్యమన్నాడు. సమస్య మళ్లీ మొదలు. కీర్తికి కూడా ఇలాగే వచ్చింది. వాళ్ళింట్లో ఒక్క కొడుకు అని ఆశ పడింది. అతని అక్కలు విదేశాలకి రమ్మని పట్టు పట్టి కాగితాలు కలాలు పెట్టీ తీసుకువెళ్ళారు. ఇప్పుడు కూతురు మనుమడు విదేశాల్లో.

చూసే వారు లేరు! అవడానికి పెద్ద కుటుంబం, అంతే కానీ పలికే వారు లేరు. భర్త కొంచెం సుస్తీ చేసింది.

ఇల్లు కోసం ఇక్కడ ఎందుకు? మనం హైదరాబాద్ వెడదాము. పిల్ల అక్కడ విమానాల విభాగంలో పని చేస్తోంది. దానికి టికెట్ ఫ్రీ కనుక నెలకి ఒకసారి పిల్ల వచ్చి వెడుతుంది అన్నాడు. ధీర కయితే పిల్ల దగ్గరికి వెళ్లాలని ఉంది కానీ భర్త ఒప్పుకోలేదు.

కారణం ఇన్నాళ్ళు ఉద్యోగం చేసింది. ఉన్న చోట కాక వేరే ఊరికి వెళ్లి వచ్చేది. తను వేరే వెళ్లి రావడం కష్టం. శ్రీనివాస్ రైలు ఉద్యోగ జీవితంలో ఎన్నో సమస్యలు. నిజానికి తన భార్య సుఖపడలేదు.

***

ఫోన్ రావడంతో వర్తమానంలోకి వచ్చింది శౌరి. ఆ ఫోన్ ధీర నుంచి.

తన వివరాలు చెప్పుకొచ్చింది ధీర.

ధీర మాట్లాడుతూ – “ ‘కూతురు దగ్గరకి వెళ్లి కష్టపడే అవసరం లేదు, నా డబ్బు నాకు ఉంది నీ పెన్షన్ నీకు వస్తుంది. అక్కడికి వెళ్లి వాళ్ళకి వంటల విషయం చూడాలి. అక్కడ దాని అత్తగారు అడబడుచులు అంతా ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు. సుఖంగా ఇక్కడ ఉండక ఆడపిల్ల ఇంటికి ఎందుకు?’ ఇలా అన్నారు మా ఆయన గారు. ఇంకా చేసేది ఏముంది. ఇదివరలో విదేశాలకు ఛాన్స్ వస్తే తండ్రి కూతురు జాలిగా ముఖం పెట్టారు. నువ్వు వెళ్ళ వద్దు అంటారు, అసలు ఈ ప్రపంచంలో ప్రేమ, కుటుంబ బంధం – ఆడవాళ్ళ మనసుని అడ్డుగా వేసి ఉంచేస్తారు. అదే మగవాడు అయితే వెళ్ళకపోతే ఎలా, అవకాశం వదులు కుంటామా అంటారు. స్త్రీ పరిస్థితి అంతే అనుకోవాలి” అంది.

దానికి శౌరీ నవ్వి “స్త్రీకి కుటుంబ నిర్వహణ శక్తి ఉన్నది. ఆమే త్యాగం చేసి కుటుంబాన్ని ఒక తాటి మీద నడుపుతుంది. రక రకాల మనస్తత్వాలు ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లి జీవిస్తోంది. అంటే మరీ ఆమె ఘనత ఎంతో తెలుసుకో. నువ్వు మొదటి నుంచి వింత స్వభావంతో ఆలోచిస్తూ ఉంటావు. అందుకే అలా ఉంది. స్నేహ పరిమళాలతో జీవితం గడపాలి, అప్పుడే శాంతి సుఖం” అని అంది.

***

‘ఉదయాన్నే వచ్చిన ఫోన్లు జీవిత సత్యాలను స్నేహ జీవిత పరిమళాలు అందించాయి’ అని నవ్వుకుంటూ పెన్ను కాగితం పుచ్చుకుని కథ రాయడానకి శౌరి సన్నద్ధమైంది. దాన్ని ఒక పత్రికకి పంపాలని అనుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here