స్నేహ కావ్యం

0
10

[dropcap]ను[/dropcap]ను లేత కిరణాలు జగతి అంతటా పరుచుకుంటున్న శుభోదయ వేళ.. సన్నగా కురుస్తున్న మంచు బిందువులు పూల మొక్కలపై నిలిచి మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి!

పడమర నుండి వీస్తున్న పవనాలు గులాబీలను తాకుతూ వెళుతుంటే.. పూలన్నీ గమ్మత్తుగా ఊయలలూగినట్లుగా కదులుతున్నాయి!

పక్షుల కిలకిలారావాల సందళ్ళు.. ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి గుడిగంటల శుభసూచకాలు.. శివాలయం నుండి లయబద్ధంగా వినిపిస్తున్న ఓంకార నాదాలు..

మల్లె మందారాల ముచ్చట్ల పరవశాల పులకరింతలు.. హాయైన వాతావరణం.. మనసులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంటే.. జాగింగ్ చేస్తున్న అభిరాం.. రోడ్డుకి పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్‌పై కూర్చున్నాడు!

పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉండి.. ఇంకా పట్టణం ఆనవాలు సోకని స్వచ్ఛమైన పల్లెటూరది!

అతడికి కాస్త దూరంగా నడుస్తూ అక్కడికి చేరుకున్న శివాజీ కూడా అదే సిమెంట్ బెంచ్‌పై మరో పక్కన కూర్చున్నాడు. వాళ్లిద్దరిది ఇరవైరెండేళ్ల స్నేహం. చిన్ననాటి నుండి కలిసే చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక ఇద్దరూ వేరయ్యారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదవడానికి శివాజీ హైదరాబాద్ వెళ్లిపోగా.. అభిరాం అదే ఊళ్ళో ఉండి.. ఇంటర్మీడియట్, డిగ్రీ, పి.జి. పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇద్దరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.

అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నా.. ఇద్దరూ వ్యక్తిగతంగా కలుసుకున్నది చాలా తక్కువ. చిన్ననాటి సంగతులు అన్నీ సంబరంగా చెప్పుకుంటూ.. ఓ గంటసేపు గడిపారు. అప్పుడు సమయం ఏడున్నర అవుతుంది.

“ఈ సారి మన ఊళ్ళో వారం రోజులు ఉంటాను.” అన్నాడు శివాజీ.

“ఎప్పుడు అలాగే అంటావు రా! కానీ రెండు రోజుల్లోనే హైదరాబాద్ వెళ్ళిపోతావు.. ఎప్పుడో ఆర్నెల్లకోసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి వస్తావు. నువ్వు ఎప్పుడు చదువుల్లో బిజీ కదా?”

“లేదురా! ఈసారి తప్పకుండా వారం రోజులు ఉంటాను. ఇంజనీరింగ్ పూర్తయ్యింది. కానీ క్యాంపస్‌లో జాబ్ సాధించ లేకపోయాను. బయట ఇన్‌స్టిట్యూట్‌లో ఓ సంవత్సరం పాటు రకరకాల కోర్సులు చేశాను. ప్రస్తుతం జాబ్ వెతుక్కునే పనిలో ఉన్నాను. సమయం కాస్త వెసులుబాటు గానే వుంది. ఓ వారం రోజులు తప్పకుండా వుంటాను. రోజూ కలుద్దాం సరేనా!”

“అది సరే కానీ! నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్‌వి కదా క్యాంపస్‌లో సెలెక్ట్ కాకపోవడమేంటి!? ఆశ్చర్యంగా వుందే.”

“నువ్వన్నది నిజమే! నేను స్కూల్ డేస్‌లో మన స్కూల్ మొత్తానికి ఫస్ట్ నేనే. అలాగే హైదరాబాద్‌కి వెళ్ళాక కూడా మా జూనియర్ కాలేజ్ ఫస్ట్ నేనే! ఇంజనీరింగ్ లో నా నిర్లక్ష్యమే నన్ను దెబ్బతీసింది. దాని ఫలితమే ఇదంతా”

“అవునా..?”

“అదంతా తరువాత తీరికగా చెప్తాను లే కానీ.. ఎలా ఉన్నావురా నువ్వు!? పి.జి. పూర్తి చేశావు కదా? మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి! హైదరాబాద్ ఏమైనా వస్తావా? నువ్వు గనక నాతో వస్తే బాగుంటుంది. ఇద్దరం కలిసి హైదరాబాద్‌లో అద్దెకి రూమ్ తీసుకుందాం. ఇంతకాలం హాస్టల్‌లో ఉండి లైఫ్ బోర్‌గా ఉందిరా. వస్తావా మరి.. ఏమంటావు?”

“సారీరా! ప్రస్తుతానికి నేను అలాంటి ప్రయత్నమేది చేయడం లేదు. హైదరాబాద్ రాలేను రా. మన నల్గొండలోనే ఏదైనా ఉద్యోగం దొరకకపోతుందా అని ఆశగా ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పటి వరకు నా ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. భవిష్యత్ గురించి కాస్త ఆందోళనకరంగా అనిపిస్తున్నా.. తప్పదురా జీవితం అంటే పోరాటమే! మన ప్రాంతం విప్లవాలకు పురిటిగడ్డ. తిరుగుబాటు తత్వం మన నరనరాల్లో జీర్ణించుకుపోయి వుంటుంది. ఓటమి అంచులకి చేరుకున్నా గెలుపుకోసం పట్టుదలగా పోరు సల్పడం మన ప్రాంతం వాళ్ళ నైజం.”

తన వైపు చూస్తున్న మిత్రుడు అభిరాం వైపు అవునన్నట్లుగా చూశాడు శివాజీ.

“అవున్రా నువ్వన్నది అక్షరాలా నిజం. మన పెద్దవాళ్ళు కమ్యూనిజం భావజాలంతో పెరిగారు. వాళ్ళు నిత్య చైతన్యవంతులు. అదే పద్ధతిలో.. అదే స్ఫూర్తితో.. మనని సైతం పెంచారు వాళ్ళు. ఈ నేల గొప్పతనం అదేరా. కష్టం ఎటువంటి పరీక్ష పెట్టినా ఎదురెళ్ళి గెలుచుకు రావడమే మనకు తెలిసిన విద్య!”

వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే.. కాస్త దూరంలో నిలబడిన ఓ పెద్దాయన వాళ్ళ దగ్గరకు వచ్చాడు.

“నువ్వు నరసింహం గారి అబ్బాయివే కదా?” ప్రశ్నించాడు.

“అవును అంకుల్” అన్నాడు శివాజీ.

లేచి కూర్చోమన్నట్లుగా పెద్దాయనకి చోటిచ్చాడు శివాజీ. ఆయన శివాజీని కుశల ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరే మిగిలారు.

“ఇదివరకు నేను పెద్ద వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడిని. వాళ్ళు లేని సమయంలో వాళ్ల గురించి అసభ్యంగా, అగౌరవంగా మాట్లాడేవాడిని. మొదట్లో నాకు తెలియలేదు, నేను చేస్తుంది తప్పని. నా మాటలని మిత్రులు ఎంజాయ్ చేస్తుంటే గ్రేట్‌గా ఫీల్ అయ్యేవాడిని. నేను మాట్లాడే పద్ధతి తప్పని నాకు తెలిసే సరికి నా ఇంజినీరింగ్ పూర్తయ్యింది. అప్పటికే జరగవలసిన అనర్థం జరిగిపోయింది. ఫలితంగా నేను క్యాంపస్‌లో ఏ ఒక్క ఇంటర్వ్యూలో నెగ్గ లేకపోయాను. కనీసం క్వాలిఫై కాకుండా ఎటువంటి జాబ్ అవకాశం లేకుండా కాలేజ్ నుండి బయటకు వచ్చాను. నా మిత్రులు ఎంతో మంది జాబ్స్‌లో సెలెక్ట్ అవడం నన్ను మరింత నిరాశ పరిచిన అంశం. నేను ఎంత పర్సంటేజ్‌తో ఇంజనీరింగ్ పూర్తి చేశానో తెలిస్తే నువ్వు నమ్మలేవు. కేవలం 50 శాతం మార్క్స్‌తో పాస్ అయ్యాను. నేను పాస్ అయిన రోజు నాన్నెంతో బాధ పడ్డారు. చాలా తక్కువ పర్సెంట్‌తో పాస్ అయ్యానని చివాట్లు పెట్టారు. కానీ ఆ తరువాత నా వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకునేలా నాకు ఎన్నో హిత వచనాలు చెప్పారు. ఇంతటితోనే కోల్పోయింది ఏమీ లేదని భవిష్యత్తులో బాగా చదువుకోమని ప్రోత్సహించారు. అమ్మ నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యానని సంబరపడింది.. అమ్మ ప్రేమ అంతే కదా!

మనం సాధించిన చిరు విజయమైనా అమ్మకి ఘనంగానే ఉంటుంది. ఈ రోజు అలాంటి ధైర్యాన్ని నాలో నింపే స్ఫూర్తి నాన్న లేరు. కానీ ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి. అదే తలుచుకుంటుంటే బాధగా ఉంది. నేడు నాకు అమ్మైనా.. నాన్నైనా.. అమ్మనే!” కళ్ళలో నిలిచిన సన్నని కన్నీటి పొరని తుడుచుకుంటూ అన్నాడు శివాజీ.

సంవత్సరం క్రితం.. శివాజీ ఇంజనీరింగ్ ఫలితాలు వచ్చిన నెల రోజుల తరువాత అతడి తండ్రి మరణించడం అతడి జీవితం విషాదభరితం అవ్వడానికి కారణం. ఊళ్ళో ఉన్న రెండు ఎకరాలతో.. వ్యవసాయం చేస్తూ కీర్తి, శివాజీ లను చదివిస్తూ జీవిస్తున్న నరసింహం.. హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి.

చేతనైనంతలో పిల్లలని బాగానే చదివించాడు. కీర్తి డిగ్రీ జిల్లా ఫస్ట్ వచ్చింది. కలెక్టర్ నుండి మెమెంటో అందుకుంది. తను మెమెంటో జిల్లా కలెక్టర్ నుండి అందుకునే సమయానికే కాలం చేసిన తండ్రిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ అమ్మాయి. కీర్తి చదువుల్లో నెంబర్ వన్. ఆటపాటల్లో చురుకుగా వుండి అందరి తో శభాష్ అనిపించుకుండే వ్యక్తిత్వం తనది.

శివాజీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు.

“సర్లే రా.. రేపు కలుద్దాం” అన్నాడు అభిరాం.

కాలం చేసే విచిత్రాలు గమ్మత్తైనవి..!

బ్రహ్మ లిఖిత్వాన్ని సైతం మార్చగలిగే శక్తి ఒక్క కృషికి మాత్రమే వుంది. మనం ఊహించినట్లుగా జీవితం జరగకపోయినా.. పట్టుదలగా కృషి చేస్తే మాత్రం విజయం ఏదో ఒక నాటికి విజయం మన వెంటే వస్తుంది.

***

దసరా పండుగ సంబరాలు ఊరిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయంలో నవరాత్రుల కోలాహలం. రోజుకొక్క అవతారంలో అమ్మవారు దర్శనమిస్తూ.. లోకాన్ని సంరక్షిస్తుంది జగన్మాత! గ్రామ దేవత అయిన దుర్గా దేవి.. చల్లని చూపుల కరుణాకటాక్షాలతో గ్రామం చక్కని పాడిపంటలతో.. పచ్చని పైరులు ధాన్యరాశులు.. సుభిక్షంగా..! నిత్యం నిండైన జలసిరులతో ఊరి చెరువు.. ఒక ఆనందకరమైన వాతావరణానికి నెలవు ఆ ఊరు!

***

శమీ వృక్షం దగ్గర ఎదురైన కీర్తితో మాట్లాడాడు అభిరాం.

“ఏంటి అభిరాం.. పి.జి చదువుకున్నావు కదా! ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా.. ఆటో నడుపుతున్నావట? నిజమేనా?”

“అవును”

“చక్కగా హైదరాబాద్ వెళ్ళి మంచి ఉద్యోగం వెతుక్కుని హ్యాపీగా జాబ్ చేసుకోకుండా.. నువ్వు చేస్తున్న పనేమైనా బాగుందా?”

“అది కాదు కీర్తి. నేనేమైనా దోపిడీలు దొంగతనాలు చేస్తున్నానా.. సిగ్గు పడటానికి? గౌరవప్రదమైన పని చేస్తూ నా కాళ్ళపై నేను నిలబడే ప్రయత్నం చేస్తున్నాను కదా?”

“అది కాదు. బాగా చదువుకున్నావు కదా.. ఏంటీ ఈ పని అనే అన్నాను, కానీ కష్టపడి చేసే పనేదైనా గొప్పనే. చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అంతే!”

“కీర్తి అందరూ అలాగే ఆలోచిస్తే.. అందరూ సిటీల బాట పడితే.. మన ఊరి సంగతేంటి? గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయం చేసే వాళ్ళు లేక పంటలు సరిగా పండడం లేదు. పంటలు పండించే రైతే కనుమరుగైతే.. రేపటి రోజున తినడానికి తిండి దొరక్క సమాజం ఆకలితో అల్లాడి పోతుంది. నేను నీకు కేవలం ఆటో డ్రైవర్‌గా మాత్రమే తెలుసు. నీకు తెలియని మరో సంగతి చెప్పనా.. నాన్నతో కలిసి వ్యవసాయ పనుల్లో పాలు పంచుకుంటున్నాను. నాన్న దగ్గర వ్యవసాయ మెళకువలు తెలుసుకుంటున్నాను.” అన్నాడు అభిరాం కీర్తి వైపు చూస్తూ.

“ఆహా! మంచి నిర్ణయం తీసుకున్నావు”అంది కీర్తి.

“శివాజీ పండక్కి రాలేదా?”

“రాలేదు. అన్నయ్యకి మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిందట. శాలరీ కూడా బాగానే ఉందట. ఉదయమే అన్నయ్యతో మాట్లాడాను. ఉద్యోగం బాగుందని పదే పదే చెప్పాడు” అంది కీర్తి సంతోషంగా.

తనలా సంబరంగా చెబుతుంటే.. కీర్తి నయనాలలో కదిలిన సన్నని మెరుపుని గుర్తించి.. స్నేహితుడు బాగానే వున్నాడని గ్రహించి.. హ్యాపీగా ఫీల్ అయ్యాడు అభిరాం.

దగ్గరలో ఉన్న పూల మొక్కల నుండి వస్తున్న సువాసనలు వాళ్ల హృదయాలకు ఆనందాలను అందజేస్తూ మురిపిస్తుంటే.. చిరునవ్వులతో కదులుతున్న కీర్తి వైపు ప్రశంసగా చూశాడు అభిరాం.

***

క్లాక్ టవర్ సెంటర్‌కి దగ్గరలో వున్న బస్ స్టాప్‌లో నిలబడ్డాడు అభిరాం. ప్రయాణికులు ఒక్కొక్కరుగా బస్ దిగుతుంటే.. ఎవరైనా ఆటో కావాలని అడుగుతారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు అభిరాం.

ఆటో ఎక్కిన పెద్దమనిషి.. ‘రామగిరి’ అంటూ అడ్రస్ చెప్పాడు. రేటు చెప్పాడు అభిరాం.

“అలాగే బయలుదేరు” అంటూ సైగ చేశాడు.

తన పేరు జయశంకర్ అని చెప్పాడు ఆ పెద్దాయన.

సీరియస్‌గా డ్రైవ్ చేస్తున్న అభిరాం సడన్‌గా ఆటోకి బ్రేక్ వేశాడు.

ఒక్కసారిగా కుదుపుకి గురైన జయశంకర్ అతికష్టం మీద ఆటోకి వున్న రాడ్ పట్టుకుని “ఏమయ్యా!కళ్ళు మూసుకుని నడుపుతున్నావా? ఏంటి సడన్ బ్రేక్. డ్రైవ్ చేసేటప్పుడు పరిసరాలని గమనించుకోవద్దా?” గట్టిగా అరుస్తుంటే.. పట్టించుకోకుండా గబగబా ఆటో దిగి..

అతివేగంగా రాంగ్ రూట్‌లో ఆటోని క్రాస్ చేయబోయి.. హఠాత్తుగా కిందపడ్డ యువకుడికి చేయిచ్చి లేపాడు. బైక్‌ని కూడా నిలబెట్టాడు.

ఆ యువకుడు..“అన్నా! తప్పు నాదే. ఓవర్ స్పీడ్‌తో బైక్ డ్రైవ్ చేశాను. పైగా నిన్ను అధిగమించే ప్రయత్నంలో బండి స్కిడ్ అయింది.సారీ” అన్నాడు.

అక్కడ చేరిన వాళ్ళంతా చర్చించుకుంటున్నారు. ఏదైనా లారీ అటుగా వస్తే ఊహించలేని ప్రమాదం జరిగి ఉండేది అనుకుంటుండగా.. అక్కడ చేరిన గుంపుని నెట్టుకుంటూ.. వచ్చాడు జయశంకర్.

ఎదురుగా నిలబడిన తండ్రిని చూసి నిర్ఘాంత పోయాడు ఆ యువకుడు.

తప్పు తనదే అంటూ తలొంచున్నాడు.

“ఇలా ఎప్పుడూ ర్యాష్‌గా డ్రైవ్ చేయవద్దు. అతివేగం.. త్వరగా గమ్యాన్ని చేరాలనుకునే తొందరపాటు.. రూల్స్‌కి విరుద్దంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. అది నీకే కాదు ఎదుటి వాళ్లకి సైతం ప్రాణ హాని కలిగిస్తుంది. అర్థమవుతుంది కదా. బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ డ్రైవింగ్!”

అభిరాంకి కృతజ్ఞతలు తెలియజేసి.. ఆటో ఛార్జ్ కంటే ఎక్కువగా డబ్బులు ఇవ్వబోతున్న వారి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసి తనకి రావలసిన డబ్బులు మాత్రమే తీసుకుంటుంటే.. మరొక్కసారి థాంక్స్ చెప్పి ఇంటికి పయనమయ్యారు తండ్రి కొడుకులు!

***

“అన్నయ్య నీకు ఏదో లెటర్ వచ్చింది” అంటూ తమ్ముడు అందిస్తున్న కాల్ లెటర్ అందుకున్నాడు అభిరాం.

హైదరాబాద్‌లో మంచి జాబ్ అవకాశం వచ్చిన విషయం ఆ లెటర్ సారాంశం.

‘నేను ఏ జాబ్ కి అప్లై చేయలేదే’ అనుకుంటూ ఆలోచిస్తున్న కుమారుడితో..

“మేమే నీ పేరున అప్లై చేశాము రా. నీకు తెలియకుండా ఓ మంచి జాబ్‌కి నీ రెజ్యూమ్ పంపాము” అన్నారు తల్లిదండ్రులు మహాలక్ష్మీ, రాజేశ్వరరావు.

“నాన్న! నేను మన ఊరు వదిలి ఏ వూరు వెళ్ళడం లేదు. ఇదివరకే ఈ సంగతి మీకు చెప్పాను. వ్యవసాయం చేస్తూ మీకు చేయూతగా ఉంటాను. నీ వారసత్వాన్ని అందుకుంటాను. మట్టిని నమ్ముకున్న భూమి పుత్రులం మనం. మనం నమ్ముకున్న నేల తల్లే మనల్ని కాపాడుతుంది. ఆ నమ్మకం నాకుంది. నేనో ఆలోచన చేశాను. ఓ సుముహూర్తాన నా మనసులోని ఆ ఆలోచన మీతో తప్పకుండా పంచుకుంటాను.”

కొడుకు మాటను కాదనలేక “సరే” అన్నారు ఆ దంపతులు.

***

“నా దగ్గర నువ్వు అడిగినంత డబ్బులు లేవురా. ఏదో ఆటో అయితే కొనిచ్చాను కానీ ఆటో మెకానిక్ షాప్ పెడతానంటే.. అందుకు అవసరమైన డబ్బులు ఇవ్వలేను రా. నేను చేసే చిన్నపాటి వ్యవసాయంతో ఒక యాభై వేలైతే సర్దగలను. మరో యాభై వేల వరకు ఎవరి దగ్గరైనా అప్పు అడిగి ఇప్పించగలను. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఏర్పాటు చేయలేను రా. ఏకంగా నాలుగు లక్షలంటే ఎక్కడి నుండి తేగలను.” అసహనం, నిస్సహాయత వ్యక్తం చేశాడు రాజేశ్వరరావు.

“నా దగ్గర ఒక లక్ష రూపాయలు వున్నాయి నాన్నా. మరి మిగతా డబ్బులు ఎలా సంపాదించాలో అర్థం కావడం లేదు. నల్గొండ సిటీలో ఆటో మరియు టూ వీలర్ రిపేరింగ్ షాప్ తెరుద్దామనుకుంటున్నాను. షాప్ అద్దె కనీసం ఆరు నెలలకైనా ఇవ్వాలి అడ్వాన్స్‌గా.

రిపేరింగ్ చేయడానికి టూల్స్‌తో పాటుగా ఆటోమొబైల్ పార్ట్స్ కూడా పూర్తిగా మన దగ్గరే లభ్యమైతే.. మనం ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ వాళ్ళ చుట్టూ తిరగ వలసిన అవసరం ఉండదు. సమయం కలిసి వస్తుంది. పైగా ఆర్థికంగా కూడా ఎంతో లాభం వస్తుంది. అందుకు కనీసం మూడున్నర లక్షలైనా అవసరం అవుతాయి.” అంటున్న కొడుకు అభిరామ్ మాటలు వింటున్న రాజేశ్వరరావుకి అంత చలిలోనూ చెమటలు పడుతున్నాయి.

కొడుకు ఆశయం మంచిదని తెలిసినా సహాయం చేయలేని నిస్సహాయ స్థితి తనది. కొడుకు అడిగిన కోరిక తీర్చలేక బాధపడుతున్నాడు అతడు.

నల్గొండ పట్టణానికి దగ్గరలో వున్న ఆ గ్రామం నుండి రోజూ.. ఆటో డ్రైవింగ్‌కి వెళ్ళి రాత్రికి ఇంటికి వస్తూ.. కళ్ళ ముందే ఎదుగుతున్న పుత్రుడ్ని చూసి ఆనందిస్తున్నారు ఆ దంపతులు.

వంటింట్లో వంట చేసుకుంటున్న మహాలక్ష్మి.. ఇంటి ఆరుబయట తండ్రీకొడుకులు మాట్లాడుకుంటున్న మాటలు విని.. వాళ్ల దగ్గరకు వచ్చింది.

“మీరిద్దరూ సరే అంటే నేనో సలహా ఇస్తాను. నాకు చేతనైనంత సాయం చేస్తాను.ఏమంటారు?”

“ఏమంటాం..సరే అంటాం” అన్నారిద్దరూ కోరస్‌గా.

అమె చెప్పిన సలహా విని మొదట కంగారు పడ్డారు తండ్రి కొడుకులు.

“వద్దమ్మ! నువ్వు చెప్పిన మాట నాకే కాదు.. నాన్నకి కూడా ఓ.కే. కాదు” జాలిగా మొహం పెట్టి అన్నాడు అభిరాం.

కుమారుడి నుదుటిపై మెల్లగా సవరిస్తూ.. “పెద్దోడా! నువ్వు తప్పకుండా చేపట్టిన పనిలో విజయం సాధిస్తావురా. ఆ నమ్మకం నాకు వుంది. నాకే కాదు మీ నాన్నకి కూడా ఆ సంగతి తెలుసు. కష్టపడి పని చేస్తే ఎవరైనా ఎంచుకున్న రంగంలో విజయం సాధించగలరు. కృషిని నమ్ముకుని ధీమాగా వెళ్ళే వాళ్ళే విజేతలు! వెంటనే నీ లక్ష్యం దిశగా ప్రయాణాన్ని ప్రారంభించు” అంది ఆమె.

అమ్మ మాటలు శ్రద్ధగా ఆలకించాడు అభిరాం. ఉదయమే తల్లితో కలిసి ఊరిలో ఉన్న బ్యాంక్‌కి వెళ్ళాడు. తెల్లవారుజామున పొలానికి వెళ్ళి తిరిగొచ్చిన రాజేశ్వరరావు వాళ్ల వెనుకే బయలుదేరి బ్యాంక్‌కి వచ్చాడు.

తల్లి బంగారు గాజులు, మెడలోని బంగారు చైన్ తీసి ఇస్తుంటే అభిరాం నయనాల నిండా కన్నీరు ఉబికింది.

మహాలక్ష్మి మాత్రం తన పుత్రుడు విజయాన్నే సాధిస్తాడన్న నమ్మకంతో ఉంది. అతడికి తన కర్తవ్యం గుర్తొచ్చింది. నేడు తల్లి తన కోసం చేస్తున్న త్యాగాన్ని జీవితకాలం గుర్తుంచుకోవాలనుకున్నాడు.

అతి త్వరలోనే తల్లి బంగారు గాజులు, చైన్ వినిపించడమే కాదు.. అమ్మకు నచ్చిన బంగారు ఆభరణాలు చేయించాలని నిర్ణయించుకున్నాడా క్షణంలో!

‘అయినా ఎంత చేసినా.. తన జీవితకాలం వాళ్ళకి సేవ చేసినా.. వాళ్లు తన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత వెలకట్టలేనివి. అమ్మానాన్నల ప్రేమ అమృతం కంటే ఘనమైనది.’ అనుకున్నాడు.

ఉదయం పొలం పనులకి వెళ్ళి సాయంత్రమెప్పుడో ఇంటికి వచ్చే నాన్న.. రాత్రనక పగలనక కష్టిస్తూ తమ అవసరాలు తీర్చే అమ్మ.. అమ్మానాన్న ఎప్పుడూ గొప్పవాళ్ళే! హృదయం నిండా..తల్లిదండ్రులపట్ల కృతజ్ఞతాభావం నిండిపోగా.. వాళ్ళ వైపు ప్రేమగా చూశాడు.

సిటీలో నూతనంగా ‘అభిరాం ఆటోమొబైల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్’ షాప్ ఓపెన్ చేశాడు.

రాత్రనక పగలనక శ్రమిస్తున్నాడు అభిరాం. రెండు మూడు నెలల్లోనే అభిరాం మెకానిక్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాలం సంతోషంగా సాగుతున్న సమయంలో.. సుందరం రూపంలో అతడికి దురదృష్టం ఎదురయ్యింది. ఆ ఏరియాలో ఉంటున్న బిజినెస్ మ్యాగ్నెట్ సుందరం కొత్తగా అధునాతన పరికరాలతో ఆటోమొబైల్ గ్యారేజ్ కం షోరూం ఓపెన్ చేశాడు.

అభిరాంకి నిరాశ ఎదురయ్యింది. అధునాతన సామగ్రితో, పనిముట్లతో ప్రారంభమయిన ఆ సెంటర్ కొద్దికాలం లోనే అభివృద్ధి బాట పట్టింది. ఫలితంగా అభిరాం గ్యారేజ్ కళ కోల్పోయింది. వచ్చే కష్టమర్స్ కూడా రాకపోవడంతో.. పని లేక ఖాళీగా వుంటున్నాడు అభిరాం.

షాప్ అద్దెకిచ్చిన ఓనర్ అధిక మొత్తంలో రెంట్ ఇవ్వమంటూ లేదా.. ఆరు నెలల అగ్రిమెంట్ పూర్తయ్యింది కదా షాప్ ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేయసాగాడు.

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. ఎన్నో ఆశలతో ఆశయాలతో ప్రారంభించిన ‘అభిరాం ఆటోమొబైల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్’ పనిలేక మూతపడే దీనస్థితికి చేరుకోవడం.. అతడి హృదయాన్ని దహించివేస్తుంది.

గత్యంతరం లేని పరిస్థితుల్లో షాప్ మూసివేసి తిరిగి ఆటో నడపడం ప్రారంభించాడు.

అయినా పి.జి చదువుకున్న వీడు కమ్మగా జాబ్ చేసుకుంటూ.. కాలుమీద కాలేసుకుని దర్జాగా బ్రతక్కుండా ఈ ఆటో నడపడమేంటని స్నేహితులు, బంధువులు చాటుగా కామెంట్స్ చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ ఏదో మూల తప్పు చేస్తున్నానేమో నన్న సంశయం అతడి మదిని వీడడం లేదు.

తల్లిదండ్రులు మాత్రం పరిస్థితులు ఎలాంటివైనా మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కాలం సంధించే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం కష్టమే.. కానీ అసాధ్యం మాత్రం కాదని తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహం నుండి గ్రహించాడు.

ఈ లోకంలో మనం ఎలాంటి ఇక్కట్లకు గురైనా మనకు తోడు, నీడగా నిలిచి ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడే హితులు వాళ్ళు మాత్రమే అని గ్రహించాడు.

***

శివాలయంకి వెళ్ళి పార్వతీపరమేశ్వరులని దర్శించుకున్నాడు. ఆలయం ఆవరణలో ఉన్న మండపంలో కూర్చున్నాడు. ఒంటరితనం బాధిస్తుంది. గుడి దగ్గరలో ఉన్నానన్న భావన మనస్సుకి ఉత్తేజాన్ని కలిగిస్తుందన్న ఆలోచనతో అక్కడ కూర్చున్నాడు. దిగులు మేఘాలు కమ్ముకున్న అతడి వదనం.. నిరాశకు నిలువెత్తు రూపం అతడే అన్నట్లుగా చేస్తుంది.

ఆ రోజు సోమవారం. అదే సమయంలో అక్కడికి చేరుకున్న శివాజీ మిత్రుడ్ని అభిమానంగా పలకరించాడు. పెద్దగా మాట్లాడకుండా ముభావంగా కూర్చున్న మిత్రుడ్ని పరిశీలనగా చూసాడు శివాజీ. కుశల ప్రశ్నలు వేశాడు శివాజీ.

మాట్లాడటం ఇష్టం లేనట్లుగా మాట్లాడుతున్న మిత్రుడి కష్టాన్ని గ్రహించే ప్రయత్నం చేశాడు శివాజీ. అభిరాం మాత్రం ఇదేమీ పట్టనట్లుగా అడిగిన మటుకే సమాధానం చెప్పి ఊరుకున్నాడు.

“నాలుగు రోజులు సెలవు పెట్టి వచ్చాను రా” అంటున్న శివాజీ మాటలు సైతం అతడికి ఉత్సాహాన్ని కలిగించలేకపోయాయి.

“రేయ్! మా చెల్లికి సంబంధం చూశాం. అబ్బాయి గవర్నమెంట్ జాబ్. శాలరీ కూడా బాగానే వస్తుంది. వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. వాళ్ళ సొంత ఊరు నల్గొండనే అయినా.. వాళ్ళ ఫ్యామిలీ పదేళ్ల క్రితమే అక్కడికి షిఫ్ట్ అయ్యిందట.” చెప్పుకుంటూ పోతున్న మిత్రుడి మాటలు అతడికి మరింత నిరాశను తెప్పించాయి.

“ఏంట్రా అలా వున్నావు? అసలేం జరిగింది?” అడిగాడు శివాజీ.

తనకి ఎదురైన కష్టం మిత్రుడికి చెప్పుకోలేకపోతున్నాడు అభిరాం.

“స్నేహితుడి దగ్గర కష్టం దాస్తావా రా? ఇదేనా స్నేహమంటే?”

నిలదిస్తున్నట్లుగా ప్రశ్నిస్తున్న మిత్రుడి వైపు చూస్తూ.. “అద్సరే కానీ..ఎలా ఉందిరా నీ జాబ్” అడిగాడు.

“నా జాబ్ కేం రా. ఇట్స్ సో ఫైన్. లక్ష రూపాయల శాలరీ వస్తుంది” అన్నాడు శివాజీ.

“రేయ్! అసలేం జరిగిందో వివరంగా చెప్పరా..? అవును షాప్ ఏమయ్యింది. మళ్ళీ ఆటో నడుపుతున్నావట?”

అతి కష్టం మీద.. మిత్రుడితో జరిగింది చెప్పసాగాడు.

“శివాజీ. నేను షాప్ ఓపెన్ చేసిన కొత్తలో అంతా సజావుగా సాగింది. కేవలం మూడు నెలల్లోనే సక్సెస్ సాధించాననుకున్నాను. కాస్తంత గర్వం చేరిందేమో తెలీదు కానీ కష్టమర్స్ తగ్గడం ప్రారంభమయ్యింది. అదే సమయంలో సుందరం అని మన జిల్లాలో ఫేమస్ కాంట్రాక్టర్ షోరూం కం గ్యారేజ్ ఓపెన్ చేశాడు. అందరూ అటుగా వెళ్లడం జరిగింది. నాకు పనులు తగ్గాయి. చివరికి రెంట్ సైతం సంపాదించలేని స్థితిలో లక్ష రూపాయల లాస్‌తో షాప్ క్లోజ్ చేశాను. మునుపటిలా ఆటో నడుపుతూ జీవిస్తున్నాను. అటు జాబ్ చేయలేక.. ఇటు నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయలేక సతమతమవుతూ.. అమ్మానాన్నలకి మొహం చూపలేక బ్రతుకు భారంగా గడుపుతున్నాను. నేనెప్పుడూ ఎవరితో పోటీ పడలేదు. నా పనేంటో నేను చేసుకుని బ్రతుకుతాను. అదే తప్పా?” నిరాశగా అతడు అంటున్న ఒక్కోమాట శివాజీ హృదయాన్ని కలిచేస్తుంది.

స్నేహితుడికి ఎదురైన కష్టాన్ని గ్రహించి ఆలోచనలో పడ్దాడు.

“అవున్రా అదే తప్పు. వ్యాపారం అంటే పోటీ. ఎప్పుడూ పోటీ పడుతూ పనిచేయాలా అంటే.. అలాగని ఏమీ లేదు. కానీ నువ్వు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన కొత్తలో పోటీపడుతూనే ప్రారంభించాలి. విజయం సాధించే వరకు.. ఆర్థికంగా స్థిరపడే వరకు పోరాటాన్ని ఆపకూడదు. ఒక్కసారి నువ్వు ఓటమిని ఒప్పుకున్నావంటే ఇక నీ వ్యాపారాన్ని నువ్వు మూసేయాల్సిందే. అందుకే నేనంటాను.. అవిశ్రాంత పోరాటం.. సవాళ్లను ఎదుర్కోగలిగే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడగలుగుతారు.

ప్రణాళిక లెప్పుడు దీర్ఘ కాలానికి వుండాలే కానీ స్వల్ప కాల లక్ష్యాలు ఉండకూడదు వ్యాపారంలో. అలాంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాళ్ళు మాత్రమే రాణిస్తారు ఈ రంగంలో! వ్యాపారం చేయాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలి.

నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే విక్రయించాలి. మన దగ్గరకు వచ్చిన వినియోగదారుడి ప్రతి రూపాయికి తగిన సర్వీసింగ్ ఇవ్వాలి. అన్నిటి కంటే ముఖ్యంగా వాళ్ళని ప్రేమగా పలకరించాలి. స్నేహభావం వారిపట్ల చూపుతూ ‘కస్టమర్ శాటిస్ఫాక్షన్’ అయ్యేలా వ్యవహరించాలి.” అన్నాడు శివాజీ.

“నువ్వు చెప్పిందంతా నిజమే.కానీ ఓ సంగతి చెప్పనా.. నా దగ్గర పని చేసే ఇద్దరు మంచి టెక్నిషన్స్‌ని సైతం అధిక మొత్తం శాలరీ ఆఫర్ చేసి వాళ్ళు.. ఆ ఇద్దరిని తమ దగ్గర చేర్చుకున్నారు.” అన్నాడు అభిరాం.

చిరునవ్వు నవ్వాడు శివాజీ.

“మనమెప్పుడూ డబ్బు కోసం పని చేయకూడదు. మనం చేసే కష్టం తప్పకుండా సంపద రూపమై తిరిగి వస్తుంది. మనం ఆ దిశగా ప్రయాణిద్దాం. ఒకసారి నువ్వు యండమూరి వీరేంద్రనాథ్ గారి ‘విజయానికి ఐదు మెట్లు’, శివ్ ఖేరా గారి ‘యు కెన్ విన్’ పుస్తకం చదువు. వాళ్ళు అందులో ఎన్నో జీవన పాఠాలు వ్రాసారు.” అన్నాడు శివాజీ.

ఓటమి ఒక అగాధమై భయపెడుతుంది.. మనసంతా దిగులు మేఘాలు కమ్ముకున్నప్పుడు! అదే ఓటమి నిచ్చెనై విజయాలకి బాటై నిలుస్తుంది.. మనసంతా ధైర్యం నేస్తమై పరిచయమైనప్పుడు!

***

నల్గొండలో హైదరాబాద్ రోడ్‌కి ఆనుకుని ‘విక్టరీ ఆటోమొబైల్స్ సర్వీసింగ్’ పేరుతో షాప్ ఓపెన్ చేశాడు అభిరాం.

అన్నట్లుగానే స్నేహితుడు అందజేసిన ఆర్థిక సహాయంతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆరు నెలలు తిరిగేసరికి లాభాల బాటలోకి చేరాడు. క్రమక్రమంగా రాబడి పెరుగుతుంది.

తనకు స్నేహితుడు శివాజీ అందజేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వబోయాడు అభిరాం.

“లేదురా! మనం ఒక పని చేద్దాం. మనం కూడా సొంతంగా సేల్స్ అండ్ సర్వీసింగ్ ప్రారంభిద్దాం. ఆటోలు, టూవీలర్స్ అమ్మే షాప్‌గా దీన్ని మారుద్దాం.”

“అందుకు చాలా ఖర్చు అవుతుంది రా “

“పర్లేదు.. ధైర్యంగా అడుగు ముందడుగు వేద్దాం… విజయం మనదే. రేపు మా బ్యాంక్ మేనేజర్ అంకుల్‌ని కలుద్దాం. ఆయన సలహా తీసుకుని ముందుకు నడుద్దాం. నేను కూడా జాబ్ మానుకొని నీకు సాయంగా వ్యాపారంలో కలుస్తాను.” అన్నాడు శివాజీ.

“అలాగే” అంటూ సమ్మతించాడు అభిరాం.

ఇద్దరు కలిసి బ్యాంక్‌కి వెళ్ళారు. చాలా కాలం తరువాత తన వద్దకు వచ్చిన మేనల్లుడిని అప్యాయంగా పలకరించాడు జయశంకర్.

ప్రక్కనే వున్న అభిరాంని గుర్తించి.. ఆరోజు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసి.. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ గురించి శివాజీకి చెప్పాడు జయశంకర్.

వారిద్దరు తాము అనుకున్న వివరాలతో కూడిన ఫైల్, వాళ్ళ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జయశంకర్ గారికి అందించి లోన్ కోసం అప్లై చేశారు. త్వరలోనే వాళ్లకు లోన్ శాంక్షన్ అయ్యింది.

‘న్యూ జనరేషన్ మోటార్స్’ పేరుతో సిటీ లో సేల్స్ అండ్ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభించారు ఇద్దరూ కలిసి ఓ సుముహూర్తంలో!

స్నేహానికి అర్థమై నిలిచిన వారిద్దరి జీవితం ఎందరికో ఆదర్శం అయింది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here