స్నేహితుడు

4
8

[శ్రీ అనిసెట్టి శ్రీధర్ రచించిన ‘స్నేహితుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

చోరీ పర్వం

[dropcap]ఆ[/dropcap]రోజు నగల దుకాణంలో పెద్దగా రద్దీ లేదు. సేట్, హరిశంకర్ ఇద్దరే ఉన్నారు. మరో సేల్స్‌గాళ్ ఆరోజు సెలవు పెట్టింది. పిల్లాడికి ఒంట్లో బాగాలేదని సేట్‌కి ఇంటి దగ్గర్నుండి ఫోన్ వచ్చింది.

“నువ్వు చూసుకోగలవా” అడిగాడు హరిశంకర్‌ని. హరిశంకర్ పదేళ్ళ పైనుండే పని చేస్తున్నాడు. చాలా అనుభవజ్ఞుడు. అంతకుమించి నమ్మకస్థుడు. దుకాణంలో అమ్మే బంగారంలానే మేలిమి. ఎన్నో లక్షల రూపాయల లావాదేవీలు అతని చేతి మీదుగా జరిగాయి.

“నేను చూసుకుంటా సేట్. మీరు వెళ్ళండి” అన్నాడు.

నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. తరచూ వచ్చే ఖాతాదారులే. పెళ్ళి నగల కోసం. మధ్యలో వాళ్ళకి కావలసిన చిన్న చిన్న వస్తువుల గురించి కూడా విచారిస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు వచ్చి మరోవైపు కూర్చున్నాడు. ఎక్కడో చూసిన ముఖంలానే అనిపించింది హరిశంకర్‌కి. ఒక ఐదు నిమిషాలు కూర్చోమని చెప్పాడు. ఈలోగా డబ్బులు కట్టేసి ఆర్డర్ ఇచ్చినవాళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళ వస్తువులు డెలివరీ ఇచ్చాడు. ఆ పెళ్ళి నగల బేరం పూర్తయి హరిశంకర్ చూసేసరికి ఆ యువకుడు లేడు.

సేట్ తిరిగి వచ్చాడు.

“చందన్ ఎలా ఉన్నాడు?” సేట్‌కి హరిశంకర్‌లో నచ్చే లక్షణం అదే. చాలా కేరింగ్‌గా ఉంటాడు.

“బాగానే ఉన్నాడు” అన్నాడు.

పెళ్ళివాళ్ళు పెట్టిన ఆర్డర్, ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం సేట్‌కి అప్పజెప్పాడు. సేట్ సంతృప్తిగా తలాడించాడు.

“నారాయణరావుగారి భ్యార్య మొన్న ఒక నెక్లెస్ చూసి వెళ్ళారు కదా. అది తీసుకోవడానికి వస్తానని కబురు పెట్టారు. వస్తువు తీసి నా దగ్గర పెట్టు” అన్నాడు సేట్.

హారం షోకేస్‌లో పెట్టిన చోట లేదు. హరిశంకర్ కంగారుపడ్డాడు. రెండు లక్షలు విలువ చేసే హారం. స్థిమితంగా వెతికాడు. కనిపించలేదు.

“సరిగా చూడు హరీ, అక్కడే పెట్టావా? అలా ఎలా మాయమౌతుంది” అన్నాడు సేట్ ఆందోళనగా.

హరిశంకర్‌కి తను బిజీగా ఉన్న సమయంలో వచ్చిన ఆ యువకుడిపై అనుమానం వచ్చింది. చాలాసేపు కూర్చున్నాడు. అతనెవరో, ఎక్కడుంటాడో తెలియదు. పైగా రుజువులు కూడా ఏమీ లేవు.

సేట్ ముందు తలదించుకుని ఉన్నాడు హరిశంకర్. పదేళ్ళ పైగా సర్వీస్‌లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు.

“నువ్వు దొంగతనం చేసావని నేను అనడం లేదు హరీ. కానీ బాధ్యత నీదే కదా”

హరిశంకర్ జీతమే నెలకి మూడువేలు. పోలీసులు రుజువులు లేవని వదిలేసారు, ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. హరిశంకర్ ఉద్యోగం పోయింది. ఇంక ఏ నగల దుకాణంలోనూ తనకి ఉద్యోగం ఇవ్వరు అనుకున్నాడు. నగల వర్తకులకి ఒక సంఘం ఉంది. అందులో ఈ వార్త క్షణాల్లోనే పాకిపోయింది.

ఏవో అవసరాల్లో ఉండి హరిశంకరే దొంగతనం చేసాడని అనుకున్నారు కొంతమంది.

***

పశ్చాత్తాప పర్వం

ఒకరోజు హరిశంకర్‌కి ఇంటి దగ్గర ఉన్న ఎస్.టి.డి. బూత్‌కి ఫోన్ వచ్చింది.

“ఎవరు?”

“సార్. నా పేరు మురళి. మీ షాప్‌లో నెక్లెస్ పోయింది కదా. అది నేనే దొంగతనం చేసాను.”

హరిశంకర్‌కి ఆశ్చర్యం వేసింది. ఇంకేం చెబుతాడో అన్నట్టు మౌనంగా ఉన్నాడు.

“నేనో అనాథని సార్. ఇక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను రాణి అనే అమ్మాయిని ప్రేమించాను. పోయిన నెల మీ షాప్‌లో తనకోసం ఒక చిన్న ఉంగరం కొన్నాను.”

అప్పుడు గుర్తుకువచ్చింది హరిశంకర్‌కి. ఇలాంటి చిన్న చిన్న బేరాలు తనతో పాటు పనిచేసే అమ్మాయి చూసుకుంటుంది. బిల్లింగ్ తను చేశాడు. వాళ్ళు నెక్లెస్ గురించి అడిగితే వివరించి ధర ఎంతో తనే చెప్పాడు.

“ఆ నెక్లెస్ బహుమతిగా ఇవ్వమని తను చాలా గొడవ పెట్టింది సార్. చిరుద్యోగిని. నా దగ్గర రెండు లక్షలు ఎక్కడ ఉంటాయి. నన్ను వదిలేస్తానని బెదిరించింది. జీవితంలో ప్రేమరాహిత్యాన్ని అనుభవించినవాడిని. నా ప్రేమని చంపుకోలేక దొంగతనం చేసానండి.”

“ఇప్పుడు ఎందుకు తిరిగి ఇచ్చేద్దామనుకుంటున్నావు?”

“నేను నెక్లెస్ ఆ అమ్మాయికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామనుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళా సార్. కానీ తను ఆ సమయంలో బాగా డబ్బున్న అబ్బాయితో..” అతని గొంతులో బాధ.

పైపై మెరుగుల గిల్ట్ నగలాంటి అమ్మాయిని ప్రేమిస్తే ఇదే జరిగేది అనుకున్నాడు.

“కానీ నేను నెక్లెస్ తిరిగి ఇచ్చేటపుడు మీరు ఒక్కరే ఉండాలి. లేదంటే జనం నన్ను దొంగనని కొట్టి పోలీసులకి అప్పజెబుతారు.”

హరిశంకర్ ఆలోచనలో పడ్డాడు. తను ఒక్కడే నెక్లెస్ తీసుకుని సేట్‌కి తిరిగి ఇస్తే తనే దొంగతనం చేసి ఇలా నాటకం ఆడుతున్నాడని అనుకోవచ్చు. అందుకని సేట్ కూడా ఉండడం మంచిది అనిపించింది. మురళి ఒప్పుకున్నాడు.

అతను చెప్పిన ప్రదేశానికి హరిశంకర్, సేట్ కలిసి వెళ్ళారు. ఉహు, ఎంతసేపు ఎదురుచూసినా అతని జాడ లేదు. హరిశంకర్ ముఖంలో నిరాశ స్పష్టంగా కనపడుతోంది.

“ఎవరో ఆకతాయి ఫోన్ చేసి ఉంటాడు హరీ” అన్నాడు యజమాని. నెక్లెస్ దొరికితే బాగుండునని అతనికీ అనిపించింది. ముఖ్యంగా హరిలాంటి పనిమంతుడిని పోగొట్టుకోవడం బాధగానే ఉంది.

***

స్వర్గారోహణపర్వం

మరుసటి రోజు టీకొట్టు దగ్గర కూర్చుని దినపత్రిక చూస్తున్న హరిశంకర్‌ని ఒక వార్త ఆకర్షించింది.

రోడ్ ప్రమాదంలో యువకుడి మృతి అని ఫోటో వేసారు.

ఆరోజు షాప్‌లో తచ్చాడిన కుర్రాడి ఫోటోనే!

వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడాడు. హరిశంకర్ సందేహం నిజమైంది. ఆ యువకుడి పేరు మురళి! అతను అనాథ అని, ఒక ప్రైవెట్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసింది.

“గదిలో ఏమైనా దొరికాయా సార్?”

“ఏం దొరకలేదు. బట్టలు, కొంత సామాను మాత్రమే ఉన్నాయి”

నెక్లెస్ తనకి తిరిగి ఇద్దామని వస్తుండగా రోడ్ ప్రమాదం జరిగి చనిపోయి ఉంటాడు. మరి నెక్లెస్ ఏమయ్యింది? ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎవరికైనా దొరికి జేబులో వేసుకుపోయారా?

అనాథ శవం అని పూడ్చి పెట్టారట మునిసిపాలిటీ వాళ్ళు. మురళి పనిచేస్తున్న ఆఫీస్‌నుండి ఒకరో, ఇద్దరో వచ్చారట. మారిన మురళిని తను చూడలేకపోయానే అనిపించింది హరిశంకర్‌కి. శ్మశానానికి వెళ్ళాడు.

“ఆ ప్రమాదంలో చనిపోయిన అబ్బాయా” తీసుకెళ్ళి చూపించాడు.

ఒక రోజా పూవు ఉంచాడు హరిశంకర్.

“మీకేమవుతాడు?”

“నా శత్రువు.”

***

మిత్ర పర్వం

బ్యాంక్‌నుండి తన పేరున వచ్చిన ఉత్తరం చూసుకుని ఆశ్చర్యపోయి బ్యాంక్‌కి వెళ్ళాడు హరిశంకర్.

“దినపత్రికలో వార్త, ఫోటో చూసి గుర్తుపట్టామండి. మీరు డెత్ సర్టిఫికెట్ తీసుకు రావాలి.”

మునిసిపల్ ఆఫీస్‌కి వెళ్ళి మరణ ధ్రువీకరణ పత్రం కష్టమ్మీద సంపాదించాడు హరిశంకర్.

తన ఓటర్‌కార్డ్ అసలు చూపించి, నకలు ఇచ్చాడు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు నింపాడు.

“మీ దగ్గర తాళం చెవి ఉందా?”

“లేదు. నాకు ఈ విషయం కూడా తెలియదు. ఆయనకి ఇంకా ఖాతాలు ఏమైనా ఉన్నాయా?”

“పొదుపు ఖాతా ఉంది. అందులో నామినేషన్ వద్దని రాసి ఇచ్చారు. మీరు ఒక పదిరోజుల తర్వాత ఫోన్ చేసి రండి.”

పదిరోజుల తర్వాత..

“తాళం చెవి లేదంటున్నారు కనుక లాకర్ బ్రేక్ ఓపెన్ చేయించాలి. వెయ్యిరూపాయలు ఖర్చు అవుతుంది”

“అందులో ఏమున్నాయి?”

“అది మాకు తెలియదు.”

“బ్రేక్ ఓపెన్ చేసేటపుడు నాతోపాటు ఎవరైనా ఉండొచ్చా?”

“మీరు అనుమతి పత్రం రాసి ఇస్తే.”

తన యజమానిని కూడా తీసుకు వెళ్ళాడు హరిశంకర్.

ఒక బాక్స్ ఉంది. తెరిచి చూస్తే..

గత కొద్ది రోజులుగా తనని, తన కుటుంబాన్ని ఎంతో క్షోభకి గురిచేసిన నెక్లెస్. మురళి ప్రేమించిన రాణి మోహించిన నెక్లెస్!

రోడ్ ప్రమాదంలో చనిపోయిన మురళి ఆ బ్యాంక్‌లో పదిహేను రోజుల క్రితమే లాకర్ తీసుకున్నాడట. అంటే దొంగతనం జరిగిన మూడు రోజులకి. ఆ అమ్మాయిని అలా చూసేసరికి బాధతో తన గదికి వెళ్ళిపోయుంటాడు. నెక్లెస్ గదిలో పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని లాకర్ తీసుకుని ఉండొచ్చు. రెండు, మూడు రోజులు ఆలోచించి నెక్లెస్ తిరిగి ఇచ్చెయ్యాలని నిశ్చయించుకున్నాక తనకి ఫోన్ చేసి బ్యాంక్‌కి వెళుతున్న దారిలో ప్రమాదానికి గురయ్యి ఉంటాడు.

హరిశంకర్‌కి తన నిజాయితీ నిరూపించుకునే, ఉద్యోగం మళ్ళీ వచ్చే అవకాశం ఉందనే ఆనందం కన్నా ఒక నిజాయితీ లేని అమ్మాయి ప్రేమ కోసం దొంగతనానికి పాల్పడి ఇలా అర్థాంతరంగా బ్రతుకు చాలించిన ఆ అనాథ కుర్రాడి పట్ల జాలే ఎక్కువ కలిగింది.

లాకర్ నామినేషన్ ఫామ్‌లో నామినీగా హరిశంకర్ పేరు పక్కన రిలేషన్‌షిప్ ‘స్నేహితుడు’ అని రాసి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here