స్నేహితునికి లేఖ

1
10

[box type=’note’ fontsize=’16’] ఇద్దరి మిత్రుల జీవితాన్ని లేఖారూపంలో చెబుతున్నారు చివుకుల శీలక్ష్మిస్నేహితునికి లేఖ“లో. [/box]

[dropcap]ప్రి[/dropcap]యమైన ప్రాణ స్నేహితుడా!

నేను నీకు ఈ లేఖ ఎందుకు రాస్తున్నానో తెలుసా? మనం చిన్నప్పుడు ఎప్పుడో రెండేళ్ళు కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత వేరైపోయాం.

అవును మా పార్వతీపురం ఐ.టి.డి.ఎ. కు మీ నాన్న పెద్ద ఆఫీసర్ గా వచ్చారు. అక్కడ గిరిజన పాఠశాలలోనే నువ్వు కూడా చేరావు. మా అందరికీ ఆశ్చర్యమే!

అంత పెద్ద ఆఫీసర్ గారి అబ్బాయి మాతో ఉండడమా? అని. నువ్వు దొరబాబు లాగా ఉండే వాడివి. మేమంతా కొండ జాతోళ్ళం. మోటుగా నల్లగా ఉండే వాళ్ళం. ఇంకా ఆ నల్లని కొండ చాయ్ తాగి తాగి మా పెదవులూ, పళ్ళూ కూడా నల్లగా ఉండేవి.  నీతో మాట్లాడాలి అంటే మాకు జంకుగా ఉండేది. కానీ నువ్వు మాత్రం మా అందరితో కలిసిపోయి చనువుగా ఉండేవాడివి. మనిద్దరం స్నేహితులుగా ఒక ఏడాది గడిపాం. తరువాత నేనే ఒకరోజు నిన్ను అడిగాను. మనం నేస్తం కడదామా? అని. నీకు అర్ధం కాలేదు.

మా సవరలతో నేస్తం కట్టడమంటే దానికో పద్ధతి ఉంది. అది నీకు వివరంగా చెప్పగానే వెంటనే మరో ఆలోచన లేకుండా నువ్వు అంగీకరించావు.

ఒక మంచి రోజు చూసి నేను కుండెడు తేనె, అరటి పండ్లు గెల, పసుపు కొమ్ములు, నాలుగు కొండ చీపుళ్ళు, మండిగ నిండా జొన్నలు, అల్లం, పొగాకు తీసుకుని నేస్తం కట్టడానికై  మీ ఇంటికి వచ్చాను. నువ్వు నన్ను ఆదరించి కుర్చీలో కూర్చోబెట్టావు.

నువ్వు ఆ కానుకలను అందుకుని ప్రతిగా ఒక ఎరుపు రంగు తలపాగనూ, రెండు ఫలాలనూ, తవ్వెడు బియ్యం, పసుపు కొమ్మూ, అల్లం ముక్క, పానకం, రెండు పొగాకు చుట్టలూ నాకు అందించావు. తరువాత చీపురుపుల్లలు తీసుకుని  గడీ ఇషాన్, గడీనం అని మూడుసార్లు అనుకుని చీపురు పుల్లలు ఒకరి చేతినుండి మరొకరు మార్చుకుని రెండేసి ముక్కలు చేసి పార వేశాం. సవర భాషలోని ఆ మాటలకు అర్ధం “నా స్నేహితుడా! నీ స్నేహితుడను.”

చీపురు పుల్లలు విరిచి పారెయ్యడం ప్రమాణం చేయడంగా భావిస్తారు. ఆ విధంగా మనమిద్దరం నేస్తం కట్టడం వలన నీవు మా సవర భాష నేర్చుకుందికీ, మా సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుందికీ అవకాశం ఏర్పడింది.

ఒక ఏడాది పాటు ఇద్దరం ఒకే కంచం ఒకే మంచం గా తిరిగాం. ఈ ఏడాదిలో  సవర భాష నేర్చుకోవడం ఎట్లా ఉన్నా  మా సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నాలు బాగా చేసావు.

మా కొండదేవతల జాతరలు , సిరిమాను అధిరోహించడాలూ, తుడుము, మోరి, డోలు, కిరిడి, డప్పు, బాకా, జోడు కొమ్ములు, సన్నాయి,   కొమ్ము బూర, పిన్నలగర్ర, మొదలగు వాయిద్యాలతో ఊరేగింపు వెళుతూ ఉంటే వెనుక ఘటాలు తలకెత్తుకున్న నాయిరాళ్ళ నడకలతో వెన్నంటి వచ్చేపేరంటాళ్ళకు పూనకం వచ్చి ఊగిపోతూ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటే… ఉత్సుకతతో మెరిసే కళ్ళతో నువ్వు చూస్తూంటే నేను నిన్నూ, నీ కళ్ళలోని మెరుపునూ చూసేవాడిని.

నేస్తమా!

గుర్తుందా? జాతరలో మనిద్దరం కలిసి పచ్చబొట్టు పొడిపించుకున్నాము. నీ పేరు నా చేతిపైన నా పేరు నీ చేతిపైన. ఇద్దరం చేతులు పక్కపక్కన పెట్టుకుని చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు పెదవులపై నవ్వుల వెన్నెలలు.

మిత్రమా!

చెరువు గట్టు పై షికారు వెళ్ళినపుడు నీకు తినడానికి ఒకటి ఇచ్చాను. ఏమిటంటావా? అభ్యూషబాదిక  అదేనయ్యా! లేత జొన్న కంకులు సన్నని సెగమీద కాల్చి బెల్లంతో కలిపి తినడమే! ఆకలిగా ఉందేమో నీకు భలే నచ్చింది కదా!

ఎన్నని గుర్తు చేయను మిత్రమా!

ఒకరోజు పిడుగులాంటి వార్త! మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందని.నువ్వు వెళ్ళిపోతున్నావంటే నా మనసు ఎంత రోదించిందో మా పెరటిలోని చింతచెట్టుకీ, చెట్టుకి కట్టిన బకరీకే తెలుసు.

నువ్వు వెళ్ళి పోయాక చాలా రోజులు పిచ్చోడి లా తిరిగాను. స్నేహం కూడా ఒక బంధమే! మైత్రీ బంధం.

నీకు తెలుసు కదా మా ఇంటి పరిస్థితి. అమ్మా, అయ్యా కూలిపనికి పొలానికో రాళ్ళు కొట్టడానికి క్వారీకో పోతారు. ఊళ్ళో ఉన్న పదో తరగతి వరకే తప్ప పై చదువు మాట ఎత్తితే అమ్మా అయ్యా ఏడుస్తారు.

ఇంకేం చేస్తాం?

అందుకే రోజూ మన జట్టుగాళ్ళందరం వ్యాయామశాల కమ్ముల షెడ్ లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా! అంతేకాక రోజూ కొండలెక్కీ, దిగీ  లోయలంబడి నడుస్తూ దేహాన్ని ధృఢంగా ఉంచుకోగలిగాం. అందువలన మిలటరీ సెలక్షన్స్‌లో ఎక్కువ మంది ఎంపికయ్యారు. మిగిలిన వారు కూడా మళ్ళీ సంవత్సరం నెగ్గేస్తారు.

చుట్టు పక్కల తండాల్లో గల అమ్మాయిలు “వీరపుత్రుని వరింతుమయ్యా! వీరపత్నిగ గర్వింతుమయ్యా!” అని పాడుకుంటూ మన ఊరి అబ్బాయిలనే మనువాడాలని ఉత్సాహపడతారు తెలుసా?

పండుగలలోనూ, పెళ్ళి వేడుకల్లోనూ థింసా నాట్యం తప్పనిసరిగా చేస్తారు.

మిత్రమా! గుర్తుందా? సాయంత్రం పూట అందరం ఆరుబయలు జాగాలో చేరి ఒక గంట సేపు నాట్యం చేసేవారం.

ఆ పాట గుర్తుందా?

“హోరి హోరి మోరోలో లారిలోహిరిలోరి ఝూలోయ్ ఝంగాదోలి

మట్టి తిటి పొదం పాదోర్ చిట్టా కొండి నెలాబీ బీజంత దుఃఖ దెలమొత్తా”

దీని అర్థం విత్తనంలో దేవుడు ఉండి మనకు సుఖదుఃఖాలు కలుగచేస్తాడని. ఎంత అద్భుతమైన భావన!

నేస్తమా!

నా ఆకాంక్ష నీకు విన్నవించుకుంటున్నాను ఆలోచించు. ఏడాదికోరోజు పుష్పగుచ్చంతో నివాళి కాదు నేను కోరేది. నిత్యం మీ తలపులలో మేముండాలి.

ఎపుడో వచ్చే యుద్ధం కోసం జవానులపై ఇంత ఖర్చా?? అని హేళన చేసే అజ్ఞానులున్న దేశమిది. మాకిక్కడ రోజూ యుద్ధమేనని తెలియపరచు.

దేశాన్ని ధృఢంగా ఉంచేందుకు తుప్పు పట్టకుండా యుద్ధపరికరాల్ని, దేహాన్ని ధృఢంగా ఉంచేందుకు వ్యాయామాలు విన్యాసాలు అనవరతం చేస్తూనే ఉంటాం.

ఎర్రటి ఎండల్లో ఇసుక ఎడారుల్లో పహారా కాస్తున్నాం దేశం కోసం  గడ్డ కట్టించే చలిలో హిమశిఖరాలలో రేయీ పగలూ తేడా తెలియక తుపాకీ గురిపై పెట్టిన చేయిని దించం. దేశప్రజలు కోసం ఏ శిఖరాలు విరిగిపడినా వాటికింద మేమే! కంటినిండా నిద్రించి ఎన్నాళ్ళైందో? అమ్మ చేతి ముద్ద తిని ఎన్నేళ్ళయిందో??

శత్రువు విజృంభిస్తాడనే ఊహకే ఆకలిదప్పులు దరిచేరవు. నా దేశంకోసం నా ప్రజలందరి రక్షణ కోసం ఈ జవాను దుస్తులతో చేసిన ప్రతిన మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది.

మావి కష్టాలని భయపడవద్దు. జాలి చూపవద్దు.

జై భారత్! నినాదాలతో చిమ్మే మా నెత్తుటి సువాసనలు దేశమంతా ఆఘ్రాణించాలి.

నువ్వు కూడా కలెక్టర్ అయ్యే ఉంటావు. దేశాన్ని శత్రువులు నుండి మేము కాపాడుతూంటే దేశంలోని ధనమూ, మేధాసంపత్తి విదేశాలకు పోతోంది. నీలాంటి చదువుకున్న వారే వారికి అవగాహన కల్పించగలరు.

ఆఖరుగా ఈ లేఖ రాయడం నిన్ను ఒకటి అడగాలని.

మన ఊరి చుట్టూ ఉన్న కొండలలో మైకా గనులు న్నాయని త్రవ్వేస్తున్నారు. కొండలే లేకుంటే మా కొండజాతులు అంతరించిపోవా??

మేమేం చేసాము?? ప్రశాంతమైన జీవనం కోరుకున్నాము. ఆ త్రవ్వకాలలో ఎంతో మంది మావాళ్ళు గాయపడడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది.

ఒక ఆఫీసరుగా నీకు చేతనైనది చేయి. మా కోసం మాట్లాడే ఒక గొంతు ఉందని ప్రపంచానికి తెలియనీ!

మిత్రమా!

నేను విధినిర్వహణలో ఉండగా  తీసిన ఫోటో పంపిస్తున్నాను. పోల్చుకోలేవనుకో! అయినా మా ఊరి అబ్బాయిలు అందరినీ అందులో చూసుకో!

డ్యూటీ లేనప్పుడు మీలాంటి స్నేహితులకు లేఖలు రాసుకుంటూ సమయం గడుపుతాం.

ఉంటాను మిత్రమా!

నువ్వు కూడా అన్ని వివరాలతో పెద్ద లేఖ రాయి.

ఇట్లు

నీ  ప్రాణస్నేహితుడు.

సున్నా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here