స్నిగ్ధమధుసూదనం-15

0
9

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 14వ భాగం. [/box]

[dropcap]భ[/dropcap]ర్త అలా అడిగేసరికి దుఃఖం ఆగలేదామెకు.

“తన్మయి వ్యవహారం అంతుబట్టడంలేదండీ. ఇన్నాళ్ళూ అదలా ఏమీ పట్టనట్టు ఉంటే, దాని స్వభావం అంతేలే అనుకున్నాను. మీరు గమనించారో లేదో ఈ మధ్య పరధ్యానం ఎక్కువైపోయింది. చివరికివాళ తను జోరు వానలో అంతసేపు తడుస్తున్నట్టు కూడా తెలుసుకోలేనంత దీర్ఘమైన…” ఆపైన ఆమె వెక్కిళ్ళ మధ్య ఏమో చెప్పలేకపోయింది.

ప్రకాశరావు వెంటనే మాట్లాడలేకపోయాడు. భార్య మాటలు నిజమే. గత కొద్ది రోజులుగా కూతురిలో పరధ్యానం ఎక్కువైందని అతనికీ తెలుసు. అది ఆమెకే మంచిదికాదు.

“వర్షంలో తడిసినా తను కిందకి రాలేదనా నీ బాధ?” ఎందుకో తన అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికన్నట్టు అడిగాడు.

“లేదండీ. అంతసేపుగా వాన కురుస్తున్నా, డాబా మీద నుంచి అది క్రిందకి దిగలేదని, ఒకవేళ మెట్ల మీద కూర్చుండిపోయిందేమో చూద్దామని తనని పిలుస్తూ నేను అటు వెళ్ళాను. మెట్ల మీద నుంచి బదులు రాకపోయేసరికి పైకి వెళ్ళాను. అక్కడ ఆ గుల్మొహర్ చెట్టు కింద కళ్ళు మూసుకుని వానలో అలాగే కూర్చుని ఉంది. కనీసం ‘అది వానలో తడవడాన్ని ఆస్వాదిస్తున్నాను’ అని చెప్పినా, నేను ఏమాత్రం బాధపడి ఉండను. అదసలు ఆ సమయంలో స్పృహలోనే లేదు. అలా వానలో తడుస్తోందని పిలిచినా పలకలేదు. చివరికి నేనూ ఆ వానలోకి పరుగున వెళ్ళి దాన్ని భుజాలు పట్టుకుని కుదిపి లేపబోతే అయిదు నిముషాల పాటు ఉలుకూ పలుకూ కూడా లేదు. పైగా, ఉలిక్కిపడి కళ్ళు తెలిచాక, ‘వానలో తడుస్తున్నావేంటమ్మా’ అని అదే ఎదురు ప్రశ్న వేసింది నన్ను. ఆ తరువాత మరో అయిదు నిముషాలకి కానీ, అది కూడా తడిసి ముద్దైపోయిందన్న విషయం దానికి తెలీలేదు.”

దేవకి చెప్పినదంతా నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా విన్నాడు ప్రకాశరావు. అదేమిటి కూతురు అలా?

“దానికేదో అయిందండీ. నాకు భయంగా ఉంది. ఒకసారి ఏ డాక్టరుకో చూపించకూడదూ? ఇలా ఉంటే ఎంత ప్రమాదం?” ఆందోళనగా అడుగుతున్న దేవకి చేతి మీద చెయ్యి వేశాడు ప్రకాశరావు.

“తప్పకుండా చూపిద్దాం. నువ్వు గాభరా పడకు. చిన్న విషయమేనేమో. అనవసరంగా మనమే కంగారు పడుతున్నామేమో. ఏదో ఆనందలోకాల్లో విహరించడం దానికి అలవాటేగా.” విషయాన్ని తేలిక పరచడానికన్నట్టు అన్నాడు ప్రకాశరావు.

దేవకి తల వాలుస్తూ నిట్టూర్చింది. తన గుండె దడ తగ్గించడానికే భర్త అలా చెబుతున్నాడని తనకి తెలుసు. కానీ, ఈ విషయంలో తనింక ఆలస్యం చెయ్యకూడదు. దగ్గరగా తన్మయిని గమనిస్తూ త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి.

దేవకి ఇలా ఆలోచిస్తూ ఉండగానే ప్రకాశరావు మెల్లగా లేచి కూతురి గదివైపు వెళ్ళాడు. తన్మయి అక్కడ లేదు. వంటిల్లూ నిశ్శబ్దంగానే ఉంది. ఆలోచిస్తూ తన్మయి పెయింటింగ్ చేసుకునే గదివైపు నడిచాడు. తలుపులు వేసి ఉండటం, లోపల లైటు వెలగడం తెలుస్తోంది.

దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ మెల్లగా తలుపు తెరిచాడు ప్రకాశరావు. తన్మయి ఆ గదిలో ఉందంటే ఏదో పెయింటింగ్ వేసుకుంటూ ఉంటుంది. తను తలుపు తెరిచే శబ్దం కూడా ఆమె ఏకాగ్రతకు భంగం కలిగించకూడదని అతని అభిప్రాయం. మరెప్పుడైనా అయి ఉంటే తన్మయి ఆ గదిలోంచి బయటికి వచ్చేవరకూ తామెవరూ వెళ్ళి ఆమె పనికి భంగం కలిగించరు. కానీ, ఇప్పుడు దేవకి చెప్పిన విషయం విన్నాక అతనలా తిరిగి హాల్లోకి వెళిపోలేకపోయాడు. అందుకే నెమ్మదిగా తలుపు తీసి మొదట లోపలికి తొంగి చూశాడు.

ఆ గదిలో పెద్ద కిటికీ పక్కన స్టాండ్‌కి కాన్వాస్ బిగించుకుని తన్మయి అత్యంత ఏకాగ్రతతో ఆ ఆన్వాసుపైన స్కెచ్ గీసుకుంటోంది. మామూలు స్థాయి కంటే ఎక్కువగా ఆమె ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు ఎగసిపడటం గమనించాడు ప్రకాశరావు.

ఇక ఆ సమయంలో తన్మయిని ప్రశ్నలతో వేధించదలుచుకోలేదు. తిరిగి శబ్దం రాకుండా గది తలుపులు దగ్గరగా వేసి దేవకి పక్కన వచ్చి కూర్చున్నాడు.

“దేవకీ, తన్మయి ఎంత గొప్పగా చిత్రాలు గీస్తున్నా, తనకంటూ తృప్తి లేదన్న విషయం మనకి తెలుసు కదా. ఏదో సాధించాలని ఎల్లప్పుడూ తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది. నీకు తెలియనిది కాదు కదా. ఉదయం ఆ అందమైన వాతావరణంలో తను గీయబోయే చిత్రాన్ని ఊహించుకుంటూ అలా మైమరచిపోయి ఉంటుంది. మనసునంతా కేంద్రీకరించి దేని గురించయినా మనం దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు మన చుట్టూ ఉండే విషయాలు పట్టకపోవడం విచిత్రమేమీ కాదు దేవకీ. ‘పెయింటింగ్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్’ అన్నారు తెలుసా. పెయింటింగ్ వెయ్యడానికీ, మెడిటేషన్ చెయ్యడానికీ తేడా లేదుట. ఇప్పుడు దీర్ఘంగా పెయింటింగ్ వేసుకుంటోంది. ఆ వాన వాతావరణం చూసేసరికి ఏదో ఆలోచన వచ్చి ఉంటుంది. అందుకే వానలో తడుస్తున్నది కూడా తెలీలేదు తనకి. నువ్వు కంగారు పడకు. నిజంగా ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా డాక్టరు దగ్గరికి తీసుకువెడదాం.

ఇప్పుడు దాన్ని ఏమీ డిస్టర్బ్ చెయ్యద్దు. మనం భోజనం చేద్దాం పద. తన పని అయ్యాక అదే వచ్చి తింటుంది” అంటూ ప్రకాశరావు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీ లాగి కూర్చున్నాడు.

దేవకి మనసులోనే నిట్టూరుస్తూ పైకి లేచింది.

కానీ, అక్కడే ప్రకాశరావు పొరబడ్డాడు. అతను అనుకున్నట్టు తన్మయి మరో రెండు గంటల తరువాత కూడా భోజనానికి రాలేదు.

***

వెన్నెల వెలుగులో సరస్సు అందాల్ని తిలకిస్తూ ఆదమరచి ఉన్న యువరాణి చంద్రహాసిని ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

సరస్సుకి అటు చివర ఏదో నీడలంటిది కదులుతున్నట్టు ఆమె కను చివరలనుంచి కనపడి చివ్వున తల పక్కకి తిప్పింది సరస్సు చివరికంటా చూసింది. తను చూసింది నిజమే. సరస్సు చివర నీటి మీద ఏదో నీడ కదలిక ఆమెకి స్పష్టంగా కనిపించింది.

ఆ నీడ పడిన చోటే పైకి చీసింది. అక్కడ సరస్సు వెనుక చిన్న గుట్ట లాంటిది కనపడింది. అక్కడంతా చీకటిగా ఉంది. ఆ చీకటికి కళ్ళని అలవాటు చేస్తూ మరింత శ్రధ్ధగా చూసింది. పైన కొండ దిగువగా ఉన్న గుట్ట మీద ఏదో మానవాకారం కదులుతున్న నీడ అది.

వెంటనే తన నడుముకి బిగించి ఉన్న కరవాలం పైన చెయ్యి వేసి దిగ్గున లేచిందామె. రుద్రనేత్రుడి వైపు చూసింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. మరో ఆలోచన లేకుండా చంద్రహాసిని ఒంటరిగా సరస్సు చివరి గుట్ట వైపు కదిలింది.

ఒకచేయి ఆమె కరవాలం పైనే ఉంది. గుట్ట పైకే కాకుండా ప్రతి అడుగుకీ చుట్టు పక్కల కూడా జాగ్రత్తగా గమనిస్తూ గుట్టని చేరుకుంది. రాళ్ళూ, రాళ్ళపైన ఎత్తుగా పెరిగిన గడ్డీ, ఆ గుట్ట ఎక్కడానికి వీలుగానే ఉంది.

చంద్రహాసిని ధైర్యంగా గుట్ట ఎక్కాలనే నిర్ణయించుకుంది. గుట్ట మీద కదిలిన మానవాకారం ఇప్పుడు లేదు. కానీ, ఎవరో మనుషులు గుట్ట వెనుక ఉన్నారు. ఎవరది? ఇంత అడవి మధ్యలో మనుషులు నివాసం కూడా ఉంటున్నారనమాట. అయితే ఈ ప్రాంతం అంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు. లేదా ఆ మనిషి దొంగలకో, గూఢచారులకో చెందినవాడైనా అయి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ధైర్యంగా వెళ్ళి తెలుసుకోవాలి.

బలమైన తన చేతులని ఆ బండల మీద వేస్తు నేర్పుగా గుట్ట ఎక్కనారంభించింది.

కాసేపటి తరువాత నడవడానికి వీలుపడేంత మార్గం కనిపించాక, కాసేపు నిలబడి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. చుట్టూ చూసింది. అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది. చెవులు రిక్కించినా అక్కడ ఏ శబ్దమూ వినపడటం లేదు. తను చూసిన మనిషి యొక్క నీడ అవాస్తవం కాదు. తప్పకుండా అతను ఈ గుట్ట మీద నుంచి ఎటో వెళ్ళాడు. ధైర్యంగా ముందుకు పోవాలనే నిర్ణయించుకుంది చంద్రహాసిని. భయం అనేది ఆమె రక్తంలో లేనే లేదు.

కరవాలం చేత్తోనే పట్టుకుని అత్యంత జాగరూకతతో పరిసరాలని గమనిస్తూ, అతి చిన్న శబ్దాలు కూడా నిశితంగా పరిశీలిస్తూ మెల్లగా వెన్నెల వెలుగులో కనిపిస్తున్న ఆ బాట మీదే ముందుకు సాగింది. కాస్త దూరం నడిచాక బాట వంపు తిరిగింది. అంటే గుట్ట వెనుక భాగానికి దారి అన్నమాట. అటు వైపు అడుగులు వెయ్యగానే ఈ గుట్ట నుంచి అదే దారి ఎదురుగా మరో ఎత్తయిన గుట్ట మీదకి సాగడం లీలగా తెలిసిందామెకు. క్షణకాలం నడకని ఆపి ఎదురుగా ఉన్న ఆ గుట్ట వైపు చూపు సారించింది. గుట్ట మధ్యలో చిన్న సందులోంచి ఏదో వెలుగు కనపడుతోంది. దివిటీ వెలుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే గుట్టలోనే ఏదో గుహ ఉండాలి. ఆ గుహలో వెలుగుతున్న దివిటీ సన్నటి సందులోంచి కనపడుతోంది. కానీ అలికిడేమీ వినపడటం లేదు.

చంద్రహాసిని నడక మరింత నెమ్మది చేసి, తన అడుగుల సవ్వడి వినపడకుండా మెల్లగా అటువైపు దారితీసింది. ఆ వెలుగు, ఆ గుహ ద్వారం దగ్గరపడుతున్నకొద్దీ తియ్యటి ఫలాల వాసన తగిందామె ముక్కు పుటాలకి. ఆ ఫలాలు సాయంత్రం ఆ ఔషధ వృక్షాలు ఉన్న స్థలంలో రుత్రనేత్రుడితో కలిసి ఆరగించిన ఫలాల వాసనగా గుర్తించింది.

అంటే ఆ వ్యక్తి ఎవరో అక్కడి దాకా వచ్చి ఆ ఫలాలని తెంపుకుని ఇటువైపు వచ్చి ఉండాలి. అంటే తమ వెనుకే అతను ఉన్నా కూడా తను గమనించనంత పరధ్యానంలో ఉందా? క్షణకాలం అలా అజాగ్రత్తగా గడిపినందుకు తన మీద తనకే ఆగ్రహం కలిగిందామెకి.

అలాగే ధైర్యంగా గుహ ద్వారాన్ని సమీపించి శబ్దం వినడం కోసం తలని అక్కడే ఉన్న బండరాయికి ఆనించింది. ఎవరో ఫలాలు ఆరగిస్తున్నట్టుగా శబ్దం వినపడింది. కొద్ది పక్కకు జరిగితే ఆ వెలుగు వస్తున్న చోట మనిషి పట్టేంత స్థలం ఉంది. అనుకుంటే తేలిగ్గా అటు వెళ్ళవచ్చు. లిప్త కాలం పాటు సందేహించినా, లోపల ఉన్నదెవరో చూడాలనే ఆత్రమే గెలిచింది. లోపలికి వెళ్ళాలనే నిర్ణయించుకుంది చంద్రహాసిని.

కరవాలాన్ని మరింత గట్టిగా పట్టుకుని మెల్లగా ఆ వెలుగు వస్తున్న సందులోంచి సులభంగా లోపలికి ప్రవేశించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here