స్నిగ్ధమధుసూదనం-4

0
8

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 4వ భాగం. [/box]

[dropcap]“ఇం[/dropcap]కా అంత గొప్పగా వెయ్యలేదు నేను. నాకే తృప్తి లేదు. ఇంతవరకూ నా పెయింటింగ్స్ నేను కూడా ఫొటో తియ్యలేదు.”

“తృప్తి లేదా. అసలెంత గొప్పగా ఉన్నాయో తెలుసా నీ పెయింటింగ్స్? చిత్రకళ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నా అనుకోకు. నాకు చాలానే తెలుసు. మైసూర్లో జగన్మోహన్ పేలస్‌లో ఉంచిన రాజా రవి వర్మ వేసిన ఒరిజినల్ పెయింటింగ్స్ క్రిందటేడాది చూసి వచ్చాను. త్రివేండ్రంలో ఒక ఆర్ట్ గాలెరీలో కూడా ఆయన వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. అవి కొన్ని నెలల క్రితమే వెళ్ళి చూసి వచ్చాను.”

భార్గవి చెప్పిన విషయాలు వింటూనే తన్మయి నిటారుగా కూర్చుంది.

“భార్గవీ, నిజమా. ఎలా? అంటే నీకు కూడా చిత్రకళలో ప్రవేశం ఉందా?”

తన్మయి ముఖంలో ఆనందంతో కూడిన ఉద్వేగాన్ని చూసి భార్గవి ఆశ్చర్యపోయింది. తన్మయి అంత ఉద్వేగంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు తను.

“లేదు. కానీ కాస్తో కూస్తో ఆసక్తి ఉంది. ఎక్కడైనా పెయింటింగ్స్ కనపడితే శ్రధ్ధగా చూసే ఆసక్తి ఉంది.”

“ఆ ఆసక్తితోనే అంత దూరం వెళ్ళి రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసి వచ్చావా? ఆయన పెయింటింగ్స్ అంటే నీకు అంత ఇష్టమా?”

“హ్మ్మ్. నాకంటే నాకు కాదులే. మా కజిన్‌కి చాలా ఆసక్తి. చిన్నప్పటినుంచీ ఎక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినా వెళ్ళకుండా ఉండడు. అప్పుడప్పుడూ ఇలా వేరే ఊర్లు కేవలం రవి వర్మ పెయింటింగ్స్ చూడటం కోసం వెళ్ళి వస్తూ ఉంటాడు. తనతో వెళ్ళాను.”

“ఓ…”

సంభ్రమంగా చూస్తున్న తన్మయిని నవ్వుతూ కుదిపింది భార్గవి.

“ఏంటి?”

‘ఏం లేదు’ అన్నట్టుగా అలా తన్మయంగా చూస్తూనే తలూపింది.

కాసేపటి తరువాత తనే అంది. “చిత్రకళ మీద ఉన్న ఆసక్తితో అంత దూరం వెళ్ళి ఆ చిత్రాలన్నీ చూసి వచ్చారంటే ఎందుకో నాకే ఆనందంగా అనిపించింది. బ్రతకడం తెలిసిన మనుషులు.”

ఆ మాట విని గట్టిగా నవ్వేసింది భార్గవి.

తన్మయికి ఏదో చెప్పబోయి దేవకి అప్పుడే లోపలికి రావడంతో “రండి ఆంటీ” అంటూ జరిగి కూర్చుంది ఆవిడకి కూర్చోవడానికి చోటు ఇస్తూ.

***

రాణీ వాసంలోని యువరాణి చంద్రహాసిని మందిరం.

అర్థరాత్రి సమయం. కీచురాళ్ళ అరుపులు, గస్తీ తిరుగుతున్న సైనుకుల పాద సవ్వడులు తప్ప ఏమీ వినిపించడం లేదు.

రత్నఖచితమైన హంసతూలికా తల్పానికి ఒక పక్కగా యువరాణి ఇష్ట సఖులు విరజ, జయంతి నిద్రపోతున్నారు.

నిద్ర రాక అప్పటి వరకూ అవస్తపడిన చంద్రహాసిని తల్పంపైనుంచి లేచి గవాక్షం వద్దకు వెళ్ళింది.

శరత్కాలపు వెన్నెల ఉద్యానవనాన్ని వెలిగిస్తోంది. చల్లటి గాలి ఒణికిస్తూ వీస్తోంది. ఆ వెన్నెల వెలుగులో పెద్ద పెద్ద వృక్షాలు, పైన వెండి నగలతో వెలిగిపోతున్నట్టుగా ఉన్న ఆకాశం. నవ్వులు చిందిస్తూ చంద్రుడు ఏదో తెలీని తాపాన్ని రేకెత్తిస్తున్నాయి ఆమె మనసులో.

మనసు స్థిమితంగా ఉంటే కానీ నిద్ర వశం కాదు. తన మనసెందుకు ఇలా అలజడికి లోనవుతోంది. ఎందుకింత అసంతృప్తి. ఏం చేస్తే సంతోషం కలుగుతుంది?

ఎంత ఆలోచించినా, ఎన్ని రకాల విషయాలు గుర్తు తెచ్చుకున్నా ఆమె మనసెందుకో రాజధాని చివర్లో ఉన్న ఆ మహారణ్యంలో అడుగుపెట్టాలన్న చోటే ఆగిపోతోంది. ఆ విషయం గుర్తుకురాగానే చెలికత్తెల హెచ్చరికలూ గుర్తొచ్చి, మనసుని మళ్ళించుకోవాలని ప్రయత్నించినా ఎందుకో అది తనకి శక్యం కావడంలేదు.

గత ఏడాది కూడా ఆ అరణ్యంలో కొంత మార్గమైనా జనావాసంగా మార్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లోపలికి అడుగుపెడితే చాలు అసలు ఎక్కడున్నామో, ఎలా బయట పడాలో తెలీనంత భయంకరమైన అడవి అంటారు. కనీసం వెనుదిరిగి రావాలన్నా సాధ్యం కాదంటారు. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళే లోపునే ఏ క్రూర జంతువుకో బలికావాల్సిందే అంటారు. కానీ, ఒక్క జంతువూ ఆ అరణ్యం దాటి జనావాసంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అలా అని ఆ అడవిలో ఏ మాయల మాంత్రికుడో ఉన్నాడేమో అన్న అనుమానాలూ లేవు. ఎప్పుడూ రుజువు కాలేదు. ధైర్యం చేసి అరణ్యంలో అడుగుపెట్టిన సైనికులెవరూ ప్రాణాలతో దక్కలేదు. కానీ, అడవి మధ్యలో మహాద్భుతమైన ప్రదేశం ఉందనీ, ఔషధ గుణాలు కల సరస్సు, బంగారు వర్ణంతో మెరిసే కలువలూ, చుట్టూ పచ్చికబయలూ అక్కడే జలపాతాలూ అనీ పూర్వీకులు చెప్పగా చాలా మంది విన్నారు. అది నిజమో కాదో మాత్రం ఇప్పుడున్నవారెవరికీ తెలియదు.

అటువంటి మహారణ్యం మీదకి తన మనసెందుకు పదే పదే పోతోంది? అక్కడికి వెళ్ళి తాను సాధించవలసిందేమీ లేదు. ప్రాణాలను పణంగా పెట్టి ఆ అందాల ప్రదేశం చూడకపోతే పోయేదీ లేదు. కానీ, ఎందుకో మనసు పదే పదే అక్కడికి వెళ్ళమనే కోరుతోంది. ఎవరెంత భయపెట్టినా, అక్కడ అడుగుపెడితే కానీ, తన మనసుకు శాంతి లేదు. మనసు శాంతిస్తే కానీ, శరీరం విశ్రాంతి పొందదు. దిగులుగా నిట్టూర్చింది చంద్రహాసిని.

యువరాణి నిట్టూర్పులకి విరజకి మెలకువ వచ్చింది. ఒక్క ఉదుటన లేచి యువరాణి చెంతకు చేరుకుంది.

“ఏమిటమ్మా, ఇంత రాత్రివేళ ఇలా దిగులుగా గవాక్షం దగ్గర నిలబడ్డారు? స్వప్న సుందరుడెవరైనా వస్తాడనా?” నవ్వుతూ అంది.

“పోవే విరజా. స్వప్నం వచ్చేటంతటి నిద్ర ఎక్కడ నాకు?”

“ఎందుకమ్మా అంత నిర్వేదం? ఓ అర్థమయింది నాకు” అంటూ క్షణంలోనే ముఖ కవళికల్ని విచిత్రంగా మార్చిన విరజ వంక ‘ఏం అర్థమయింది?’ అన్నట్టు చూసింది చంద్రహాసిని.

“వయసు వచ్చింది కదా. యవ్వన భారం నిద్రపోనివ్వడంలేదు మిమ్మల్ని” గుసగుసగా అంటున్న విరజ వంక చిరుకోపంగా చూసింది యువరాణి.

“మహారాజు గారూ, మహారాణీ వారూ ఇంకా మీ వివాహం గురించి ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఏమీ తెలియకపోవడం కొంత చిత్రంగానే ఉందమ్మా.”

“విరజా … వివాహం గురించి ఇప్పుడు మాట్లాడకు.”

విసుగ్గా అంటున్న యువరాణి వంక ఈ సారి నిజంగానే చిత్రంగా చూసింది విరజ.

“అవునే. తండ్రి గారు కొద్ది కాలం క్రితమే నా వివాహ ప్రస్తావన తెచ్చారు నా వద్ద. అందుకు నేను ఇప్పుడే సిధ్ధంగా లేనని, కొంత సమయం ఇవ్వమనీ అడిగాను.”

“ఎందుకమ్మా? మీరు ఊ అనాలే కానీ ఎంతమంది యువరాజులూ, చక్రవర్తులూ మీ కోసం పరుగెత్తుకొస్తారు. ఎవరినైనా ప్రేమించారా ఎమిటి?” సందేహంగా అడిగింది.

“ప్రేమా లేదు ఏమీ లేదే. మనసేమీ బాలేదు. ఆ అరణ్యాన్ని ఒకసారి చూసి వస్తే కానీ, నా మనసు శాంతించేలా లేదు.”

చంద్రహాసిని మాట వినగానే ఆమె భుజం మీద చెయ్యేసి దగ్గరగా నిలబడ్డ విరజ అదిరిపడినట్టుగా అప్రయత్నంగా దూరం జరిగింది.

“ఆ రోజు అలా అంటే ఏదో అన్నారులే అనుకున్నాను. నిజం చెప్పండి యువరాణీ, ఎవరూ పట్టించుకోని, అడుగుపెట్టడానికి ధైర్యం చెయ్యని ఆ అరణ్యం చూడాలని మీకు ఎందుకు ఇంత ఆరాటం? నాకు అర్థం కావడం లేదు.”

“నాకూ అర్థం కావటంలేదు విరజా. ఆ అరణ్యం గురించి నేను కొత్తగా విన్నదేదీ లేదు. అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఎందుకో, అందరూ చెప్పుకునే ఆ అందమైన ప్రదేశాన్ని ఒక్కసారి చూసి రావాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఆ కోరిక ముందు ప్రమాదాలేవీ కనిపించడం లేదు నాకు.”

మౌనంగా అందోళనగా తన వైపు చూస్తున్న విరజని చంద్రహాసిని ప్రేమగా చూసింది.

“నేను రాచ బిడ్డని. విలువిద్య, కర్ర సామూ, కత్తిసాముతో పాటు, చెట్లెక్కడం వంటి సకల విద్యలూ నేర్చుకున్నదాన్ని. ఎండ కన్నెరగని సుకుమారినేమీ కాను. ధైర్య సాహసాలు నా రక్తంలో ప్రవహిస్తున్నాయ్. ఎందుకు ఇంతగా భయపడుతున్నావు నువ్వు నన్ను చూసి. నేనేమీ మనిషికి అసాధ్యమైన కోరిక కోరలేదు విరజా.”

“ఎటువంటి విద్యలైనా, ధైర్య సాహసాలైనా మనకి ఆపదలో ఉపయోగించుకుని మనల్ని మనం రక్షించునేందుకు అత్యంత అవసరం. నిజమే రాకుమారీ. కానీ, కోరి కోరి అవసరం లేకుండానే ఆపదల్ని కౌగిలించుకోవాలనుకోవడం అవివేకం కాదంటారా? ఎంతటి ధీరోదాత్తుడైనా నిప్పులో చెయ్యి పెడితే, చెయ్యి కాలకుండా బయటికి తియ్యగలడా.”

ఆ మాటకి సమ్మోహనంగా నవ్వింది చంద్రహాసిని.

“నువ్వు చెప్పింది నిజమే విరజా. కానీ, మనసుకి నచ్చిన పనులు చెయ్యలేని జీవితం ఎందుకు? ఎందుచేత కలిగిందో నాకీ కోరిక. రాత్రి, పగలూ ఎంత ప్రయత్నించినా, మీ అందరి బెదిరింపులూ ఎంతగా గుర్తుచేసుకున్నా, నేను మనసుకి నచ్చచెప్పుకోలేకపోతున్నాను. అటువంటప్పుడు నేను ఇంత శక్తి సామర్థ్యాలూ కలిగీ, ఒక చిన్న కోరిక తీర్చుకోలేకుండా ఆనందంగా ఉండగలనా? అటువంటి జీవితం నాకు తృప్తినిస్తుందా? ఇవ్వదు. నేను నిర్ణయించుకున్నాను. ఒకసారి ఆ అడవిలో నేను పాదం మోపాల్సిందే. రేపే నాన్నగారితో మాట్లాడతాను.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here