స్నిగ్ధమధుసూదనం-5

0
6

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 5వ భాగం. [/box]

[dropcap]స్థి[/dropcap]రంగా చెప్పి హంసతూలికా తల్పం వైపు సాగిపోతున్న యువరాణీ వంక నిట్టూరుస్తూ చూసింది విరజ.

“చంద్రహాసినీ…”

అంతపెద్ద ఆంతరంగిక మందిరం మహారాజు కీర్తిసింహుడి గర్జనతో ఉలిక్కిపడింది.

భర్త హూంకరింపుకి భయంతో కూతురి దగ్గరగా జరిగింది మహారాణి రత్నప్రభ. ఆ పరిణామాన్ని ముందే ఊహించినట్టు తలదించుకుని ఏ ఉలికిపాటూ లేకుండా నిలబడింది చంద్రహాసిని.

కూతురి కోరిక విని ఎలా స్పందించాలో తెలియనట్టు, కీర్తి సింహుడు ఆందోళనతో ఎగసిపడుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గంభీరంగా నిలబడ్డాడు.

కాసేపటికి మహారాణి తేరుకుని చంద్రహాసిని చుబుకాన్ని ఎత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ “ఎందుకమ్మా అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావు? నీకు అంత కోరికగా ఉంటే అందమైన ప్రదేశాలు చూడాలనిపిస్తే, ఎంత దూర దేశమైనా సరే యాత్రకు ఏర్పాటు చేస్తారు నీ తండ్రిగారు. సైనికబలంతో పాటు నువ్వు క్షేమంగా అందమైన ప్రదేశాన్ని చూసి వద్దువుగాను. లేకపోతే నువ్వు విద్యాభ్యాసం చేసిన సిధ్ధారణ్యానికే మరోసారి మనమంతా ప్రయాణమై వెళదాం. ఆ ప్రదేశం కూడా బహుసుందరమైనదే కదూ. అక్కడా ఎన్ని రోజులైనా బసకు లోటులేదు.”

తల్లి చేతిని సున్నితంగా తప్పించి ఆమె కళ్ళలోకి సూటిగా చూసింది యువరాణి.

“అమ్మా. మనసుకి నచ్చిన పని చెయ్యలేనప్పుడు ఈ రాజభోగాలన్నీ ఎందుకమ్మా. ఇది నాకు కొత్తగా పుట్టిన కోరిక కాదు. చాలా కాలంగా ఆ అరణ్యం చూడాలని ఉంది. అందరూ ఆ ప్రదేశం గురించి చెప్పుకుంటున్న వార్తలు విని ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్నాను. మనసుని మళ్ళించాలని చూశాను కానీ, ఇక నా కోరికని ఆపుకోవడం నా తరం కావటంలేదు. నేను ఆనందంగా ఉండాలంటే ఒక్కసారి ఆ అరణ్యంలో అడుగుపెట్టాల్సిందే.”

“చంద్రహాసినీ, ఈ విషయాన్ని ఇక ఇంతటితో వదిలెయ్. అక్కడికి వెళ్ళాలన్న కోరిక కలిగింది అన్న విషయమే మర్చిపో. ఇది నా ఆజ్ఞగా తీసుకున్నా సరే.”

మహారాణి ఏదో మాట్లాడేలోపే ఇక ఈ విషయంలో మాటలు అనవసరం అన్నట్టుగా హూంకరిస్తూ అన్నాడు కీర్తిసింహుడు.

“నాన్నగారూ, ఇదే నేను యువరాజుగా పుట్టి ఉంటే ఇంత గట్టిగా నా కోరికని తిరస్కరించేవారా? నేను ఎందులోనూ తక్కువ కాదు. నాకు ఏ ఆపదా రాదు. మనోబలం, మనోధైర్యం ముందు ఏ బెదిరింపులూ, భయాలూ నిలవలేవని మహా వీరులైన మీకు తెలియదా. అసలా అరణ్యం అంత ప్రమాదకరంగా ఎందుకుందో తెలుసుకుని ప్రజలకి ఉపయోగపడేలా ఏదైనా మార్పులు చేసే ప్రయత్నం చెయ్యడం కూడా ఈ దేశాధినేతగా మీ బాధ్యత కూడా కదా. అది నేను చేస్తాను. కొద్దిపాటి సైన్యాన్ని నాకు తోడుగా ఇచ్చి పంపండి చాలు. ఒక్కసారి వెళ్ళి కొన్ని కారణాలైనా తెలుసుకుని తిరిగివస్తాను. కాదనకండి నాన్నగారూ.”

కూతురి పట్టుదలకి కోపంతో ఉన్న కీర్తిసింహుడు కూడా అప్రతిభుడై క్షణకాలం నిలబడిపోయాడు.

“ఇదివరలో కూడా రెండు సార్లు సైన్యంతో ఆ అడవిలో ప్రవేశించాలని చూశాం. అడవి మొదట్లోనే సైనికులంతా మృత్యువాత పడ్డారు. నీకు తెలియని విషయమా తల్లీ.”

తండ్రి గొంతు మెత్తపడడం చూశాక చంద్రహాసినికి కాస్త ధైర్యం వచ్చింది. ఒప్పుకునేవరకూ తండ్రిని అర్థించేతీరాలని నిర్ణయించుకుంది.

“తెలుసు నాన్నగారూ. రెండు సార్లు అలా జరిగిందని ఇక ఆ అడవిలో కాలుమోపడమే మానేస్తామా. ఒక్కసారి నాకు అక్కడికి వెళ్ళే ఆనతిని ఇవ్వండి” అర్థింపుగా అంది.

మహారాజు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు.

“సరే తల్లీ. నీ ఇష్టప్రకారమే కానీ. కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తాను.”

ఆ మాటతో చంద్రహాసిని ముఖం పున్నమి చంద్రుడిలా వెలిగిపోతుంటే తన మందిరం వైపు వెళిపోయింది. ఆమె వెళ్ళే వరకూ చూసి ఆందోళనగా భర్త వైపు వచ్చింది మహారాణి.

“ఏమిటి ప్రభూ. తను చిన్నపిల్ల. ఏదో ఆవేశంలో ఆ అరణ్యంలో ప్రవేశించే సాహసం చేయాలని చూస్తోంటే, అన్నీ తెలిసి కూడా మీరు అనుమతి ఎందుకు ఇచ్చేశారు? ఒక్కగానొక్క బిడ్డ. ఆడపిల్ల. పెళ్ళి చెయ్యాల్సిన సమయంలో ఇప్పుడెందుకీ అనవసరపు సాహస కార్యాలు?”

ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి చిన్నగా నవ్వాడు మహారాజు.

“ఆడపిల్ల … ఆ పిల్లే నేర్పిస్తే ఎన్ని విద్యల్లో ఆరితేరిందో, విద్యాభ్యాసంలో ఎంత మంది తోటి రాజకుమారులను అన్ని పోటీల్లోనూ ఓడించిందో మర్చిపోయావా దేవీ. ఆడపిల్ల అని అంతఃపురంలో బంగారు బందీని చేస్తే ఏ సామర్థ్యాలూ అక్కరకు రాకుండా పోవా? ఏ పుట్టలో ఏ పామున్నదో ఎవరికి తెలుసు? భయపడితే ఏదీ సాధించలేం. ఆ అరణ్య మధ్యంలో ఉన్న ఆ ఓషధీ కొలను చేరుకునే మార్గం మన బిడ్డే సుగమం చెయ్యాలని రాసి ఉందేమో. తగిన రక్షణ చర్యలు తీసుకునే పంపిస్తాను. ఆమెకి ముందుగా ఎప్పుడూ అత్యంత బలవంతులైన సాయుధులైన భటులు ఉండేలా చూస్తాను. యువారాణికేమీ ప్రమాదం రాదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడకు.”

తన చుబుకాన్నెత్తి ముఖంలోకి చూస్తూ ప్రేమగా చెబుతున్న భర్త మాటలకి ఎదురుచెప్పలేకపోయింది మహారాణి.

***

శుక్రవారం సాయంత్రం.

ఐ.టి కంపెనీల్లో శుక్రవారం అనగానే వారాంతపు ఉత్సాహంలో ఉంటారు అందరూ.

ఆ వేళ పెద్దగా పని ఒత్తిడి కూడా లేకపోవడంతో తన్మయిని బ్రతిమాలి కంపెనీలోని తమ భవనం బయట ఉన్న గార్డెన్లోకి తీసుకువెళ్ళింది భార్గవి.

పేపర్ కప్స్‌లో స్వీట్ కార్న్ కొని తెచ్చి ఒకటి తన్మయి చేతికి ఇచ్చింది. కమ్మటి వాసన ముక్కుపుటాల్ని తాకుతుంటే కప్పుని దగ్గరగా పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆ వాసన క్షణం పాటు ఆస్వాదిస్తున్న తన్మయి వంక చూసి నవ్వింది.

“తన్మయీ, క్రిందటి వారం మీ ఇంట్లో గడిపినది నిజంగా అమూల్యమైన సమయం.”

“అది ఇప్పటికి ఇరవైసార్లు చెప్పేసావ్ భార్గవీ” నవ్వుతూ అంది తన్మయి.

“ఊ..”

“నీకు ఇబ్బందేమీ లేకపోతే, ఈ ఆదివారం కూడా మీ ఇంటికి రావొచ్చా.”

“తప్పకుండా రావొచ్చు.”

“హే.. కళాకారులు వీలైనంతవరకూ నిశ్శబ్దంగా, ఏకాంతంగా సమయం గడపాలని అనుకుంటారు కదా. నాకు తెలుసు. శని, ఆది వారాల్లో నువ్వు పెయింటింగ్స్ వేసుకునే మూడ్లో ఉన్నా, ఏదైనా పుస్తకాలు చదువుతూ గడపాలనుకున్నా నాకు చెప్పేసెయ్ తన్మయీ. నేను వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టను. అలా చెప్పావని కూడా నేను ఏమీ అనుకోను. కానీ, ప్లీజ్ ఏదైనా మొహమాట పడి చెప్పకుండా దాచి, నీ సమయం వృథా అవడానికి కారణం నేను కాకుండా చూడు చాలు.”

తన్మయి ముఖంలో భావాలు చదివే ప్రయత్నం చేస్తూ నిజాయితీగా అంది.

భార్గవి వైపు విరిసిన గులాబిలా నిర్మలంగా చూసింది తన్మయి.

“యు నో వాట్? మా అమ్మకి నిజంగా నువ్వు చాలా నచ్చావు. నువ్వలా తన వెనుకే ఉండి ఆ రోజు కబుర్లు చెప్పావ్ కదా. పొంగిపోయింది మా అమ్మ. తనతో మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు దొరికారు అని. నువ్వొస్తే నాకంటే ముందు మా అమ్మ సంతోషిస్తుంది. ఇక నా సంగతి అంటావా, సరే పెయింట్ వేసే మూడ్ వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానులే.”

“తన్మయీ, తేజా అని నాకు చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్. ఇద్దరం ఒకే స్కూల్లో చదివాం టెన్త్ వరకూ. ఆ తరువాత కాలేజీలు మారి దూరమైనా స్నేహితులుగా ఇంకా దగ్గరగానే ఉన్నాం. తనతోనే నేను ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చూసింది.”

“ఫ్రెండ్? మరి కజిన్ అన్నావ్?”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here