స్నిగ్ధమధుసూదనం-8

0
8

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 8వ భాగం. [/box]

[dropcap]చే[/dropcap]తిలో జయదేవుడి అష్టపదులు పుస్తకం పట్టుకుని ఆమె కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంది.

ఆమె గది కిటికీ నుంచి ఎర్రటిపూలతో అలరించే పెద్ద గుల్మొహర్ చెట్టు, వెనుక అందమైన ఆకాశం కనిపిస్తాయ్.

సంశయిస్తూనే వచ్చి తన్మయి భుజం మీద చెయ్యి వేసింది భార్గవి. ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చి భార్గవిని చూసి చిరునవ్వు నవ్వింది.

“ఏంటీ పుస్తకం?”

“జయదేవుడి అష్టపదులు”

 “పద్యాలా?”

“కాదు… ప్రణయ గీతాలు. విరహ గీతాలు. రాధాకృష్ణుల ప్రణయం, తాపం, విరహం అన్నీ కళ్ళ ఎదుటే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది చదువుతుంటే. ఇవి చదువుతుంటే, నేను నేనుగా ఉండలేను తెలుసా. ఏదో ప్రపంచంలో… నిజంగా… ఇప్పుడు నేనున్న ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ఒక సత్యమైన ఆనంద లోకంలో అలా తిరగాడుతున్నట్టు ఉంటుంది. ఈ గీతాల ప్రభావం కొన్ని రోజుల పాటు నన్ను వదలదు. శరీరం ఇక్కడే మీ మధ్యనే ఉంటుంది కానీ, మనసు…. నా ఆత్మ… నిర్వచించలేని ఒక అత్యద్భుతమైన లోకంలో తిరుగుతూ ఉంటుంది.”

మహా తన్మయత్వంతో చెబుతున్న స్నేహితురాలిని భార్గవి ఆశ్చర్యంగా చూస్తూ తన్మయి చేతిలో పుస్తకం తీసుకుని కొన్ని పేజీలు తిప్పింది.

“తెలుగులోనే వచనం రాసుంది కానీ, ఈ గీతాలన్నీ సంస్కృతమా. నీకు సంస్కృతం వచ్చా బాగా”

“నేర్చుకున్నాను. కొన్నేళ్ళ క్రితం. కేవలం ఈ గీతాలు అర్థం చేసుకోవడం కోసం.” ఇంకా అలా తన్మయత్వంగానే చెబుతున్న తన్మయి వంక కళ్ళు పెద్దవి చేసి చూసింది భార్గవి.

“సఖీ… కేసీ మథన ముదారం….. సమయ మయా సహ మదన మనోరధ… భావితయాస వికారం… భావితయాస వికారం… సఖీ.. కేసీ మథన ముదారం…”

చిన్న గొంతుతో మెల్లగా పాడింది తన్మయి. ఆమె గొంతులో తియ్యదనానికీ, ఆ మైమరపు కలిసి పాట మరింత వీనుల విందుగా అనిపించింది.

“వావ్ తన్మయీ… నువ్వు ఇంత బాగా పాడగలవని కూడా తెలీదు నాకు. ఈ పాట స్వర్ణ కమలం సినిమాలోది కదూ?”

తన్మయి చిన్నగా నవ్వింది. “జయదేవుడి అష్టపదుల్లో ఒకటి. ఈ గీతాన్ని విశ్వనాథ్ గారు తన సినిమాలో పెట్టుకున్నారు.”

“ఓ… అబ్బా నువ్వు పాడితే ఎంత బావుందో.”

“వీటికి అర్థాలు తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా ఈ పాటలు వినడానికి సాహసించను.”

“ఎందుకు?” అర్థం కానట్టు చూసింది భార్గవి.

“వింటే కొన్ని రోజుల పాటు నేను మామూలుగా ఉండలేను. ఈ పాటలు వింటే ఈ పుస్తకం తీసి ఆ గీతాల్ని పూర్తిగా అర్థాలతో మరోసారి చదవాలనిపిస్తుంది. అలా చదివితే ఇక ఈ భౌతికమైన విషయాలు నా మెదడుకి పట్టవు. నా బాధ్యతలేవీ నేను సరిగ్గా పట్టించుకోలేను.”

“మరి ఇవాళెందుకు తీసి చదువుతున్నావ్?”

“అక్కడ చూడు.”  కిటికీలోంచి బయట ఆకాశాన్ని చూపించింది.

తన్మయి చూపించినవైపు చూసిన భార్గవికి ఉత్తరంవైపు నుంచి మూసుకొస్తున్న కారు మబ్బులు కనిపించాయ్.

***

ఉత్తరం వైపు కారు మబ్బులు భూమి మీద ముసుగు వేస్తున్నట్టు మూసుకొస్తుంటే కన్నార్పకుండా అటువైపే చూస్తున్నాడు తేజ. మనసుని తట్టిలేపుతున్నట్టున్న చల్లటి గాలి. క్రిందటి రోజు భార్గవి తన్మయి గురించి చెప్పడం. ముఖ్యంగా తన్మయి వేసిన రాధాకృష్ణుల చిత్రాల గురించి చెప్పడం, ఇప్పుడు అకస్మాత్తుగా వాతావరణం ఇలా మనోహరంగా మారిపోవడం, ఎప్పుడూ లేనంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి తేజ మదిలో. మేడ మీద ఒక పక్కగా పెట్టిన రోజా పూల కుండీల్లో విరిసిన పూలు తలలూపుతూ ఉన్న దృశ్యాన్ని చూస్తున్నాడు కానీ, ఆ పూల కుండీలే ఓ పెద్ద పూల పొదరిల్లుగా కనిపిస్తోంది తేజ కళ్ళకి. ఇదే వాతావరణం. మేఘాలు తెచ్చిన చీకటి. పొదరింట్లోంచి కిలకిలలు. బహుసుందర రూపంతో ఆజానుబాహుడైన శ్రీకృష్ణుడు తన హృదయ మనోహరి రాధ కళ్ళలోకి ప్రేమగా చూస్తున్నాడు. రాధ ఆ పొదరింట్లో దూలాన్నించి వ్రేళ్ళాడుతున్న మాలతీ తీగను పట్టుకుని, కృష్ణుడి చూపుల బాణాలు తగిలి తనువంతా విరబూస్తున్న సిగ్గు పూల భారాన్ని మోయలేనట్టు విల్లులా వంగింది. సిగ్గుతో కందిన ముఖాన్ని పక్కకి తిప్పుకున్నా, కనులు ఆమె మాట వినక కృష్ణుడినే చూస్తున్నాయి ఓర చూపుతో. ఆ మోహనాకారుడు రాధ నడుము మీద చెయ్యివేసి, కలువ రేకులాంటి తన అరచేతితో ఆమె చుబుకాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఇదే… ఇదే అద్భుతమైన దృశ్యం కనపడుతోంది తేజకి. అతనిలోని అణువణువూ రాధాకృష్ణుల ప్రేమ బంధం మీదున్న గౌరవ భావంతో పులకరించిపోతోంది.

తేజ ఎదురుగా స్టాండ్‌కి పెద్ద కాన్వాస్ బిగించి ఉంది. పక్కనే చేతికి అందే ఎత్తులో ఉన్న విశాలమైన టేబుల్ మీద అన్ని రంగులూ, పెయింట్ బ్రష్లూ, అవసరమైన ఇతర సామగ్రీ అంతా అమర్చబడి ఉంది.

ఆ పూల కుండీలు ఉన్నవైపు మైమరపుతో చూస్తూనే తనకు అంతర్నేత్రంలో కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని ఆరాధనగా చూస్తూ తనకు తెలీకుండానే బ్రష్ తీసుకుని కాన్వాసుపైన బొమ్మగా గియ్యడం మొదలుపెట్టాడు. అలా ఎంతసేపు బొమ్మ గీస్తో ఉండిపోయాడో తెలీదు కానీ, నుడిటి మీద పెద్ద చినుకు పడటంతో ఉలిక్కిపడ్డాడు తేజ. పెద్ద పెద్ద చినుకులు వేగంగా పడుతూ వాన క్షణాల్లో పెద్దదయ్యేలా ఉండటంతో ఈ లోకంలోకి వచ్చి గబగబా కాన్వాస్ స్టాండ్ మీద నుంచి తీసి తడవకుండా పట్టుకుంటూ మెట్ల మీదుగా కిందకి దిగి తన గదిలోకి వెళ్ళాడు.

అప్పటికే వాన జోరందుకుంది. గది కిటికీ బయట గుల్మొహర్ చెట్టు జోరు వానలో తడుస్తూ అందంగా కనిపిస్తుంటే తేట పడ్డ మనసుతో కాన్వాసుని తీసి తన విశాలమైన మంచం పైన పెట్టాడు.

తను వేసిన పెయింటింగ్ చూశాక అప్పటి దాకా మనసులో ఉన్న ఆనందం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది తేజకి. నిరాశగా ఆ చిత్రం వైపు చూస్తూ అలాగే గోడకి ఆనుకుని కూర్చుండిపోయాడు.

కాన్వాసుపైన రూపుదిద్దుకున్న చిత్రం తన అంతర్నేత్రంలో ఉన్న దృశ్యానికి ఏమాత్రం పోలిక లేకుండా ఉంది. రూపు రేఖలు కానీ, రంగుల మేళవింపు కానీ, ఏదీ కనీసం ఒక స్థాయిలో అయినా రాలేదు. ఇది తను తొలిసారిగా చేసిన సాహసం. ప్రతిసారీ, కాన్వాస్ మీద బ్రష్ కానీ, స్కెచ్ గియ్యాలనే ఉద్దేశ్యంతో పెన్సిల్  పెట్టగానే చెయ్యి రాయిగా మారిపోయినట్టు ఎంత ప్రయత్నించినా ఒక్క రేఖని కూడా గియ్యలేకపోతున్నాడు. ఇవాళ తొలిసారి ఇంతయినా చిత్రించగలగడం.

మరోసారి పరిశీలనగా తను వేసిన చిత్రం వైపు చూశాడు తేజ. అతనికి తలలో నరాలు అకస్మాత్తుగా మెలిపడిపోతున్న భావన కలిగింది. నొప్పి భరించలేనట్టుగా రెండు చేతులూ రెండు కణతల దగ్గర పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుని కూర్చుండిపోయాడు.

అతని మస్తిష్కంలో ఎక్కడో మారుమూల ఏదో జ్ఞాపకం. మళ్ళీ అలలు అలలుగా అతన్ని ఆవరించేసింది. రాధాకృష్ణుల రాసలీలలు తను… అవును తనే… అత్యంత మనోహరంగా చిత్రిస్తున్నట్టు. ఎన్నెన్నో చిత్రాలు… తను చిత్రించినవే… వాటి మధ్యన మరో పెద్ద చిత్రం తను లీనమైపోయి గీస్తున్నట్టు…. ఆ చిత్రాలన్నీ అస్పష్టంగా ఉన్నాయ్. ఎక్కడో పచ్చటి ప్రకృతి ఒడిలో…. ఎక్కడ … ఎక్కడ… ఎప్పుడు…

ఈ బలమైన కోరికతోనే ఇన్ని పుస్తకాలు తిరగేస్తున్నాడు. చిత్రకళకి సంబంధించి ఇంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. ఇన్ని ప్రదర్శనలకి వెళుతున్నాడు. అన్ని మెళకువలూ తెలుసు. ఏ రేఖ ఎలా గీస్తే అందంగా వస్తుందో మెదడులో ఆలోచన ఉంది. కానీ, ఎందుకు? చిత్రించలేకపోతున్నాడు? ఇదేమైనా లోపమా. బలహీనతా?

చిన్నతనంలో మూడు నాలుగు సార్లు చిత్రకారుల వద్ద చిత్రకళ నేర్చుకోవడానికి సిధ్ధపడ్డాడు. ఎంత చెప్పినా, బుజ్జగించినా బొమ్మ గియ్యాల్సిన సమయం వచ్చేసరికి తను గియ్యలేకపోవడం చూసి ఆ మాష్టర్లు కూడా పెదవి విరిచేశారు. తను మళ్ళీ ప్రయత్నించలేదు.

ఇవాళ, ఈ ప్రకృతి, భార్గవి చెప్పిన తియ్యటి మాటలతో తనలో కలిగిన స్ఫూర్తి మళ్ళీ బలంగా బ్రష్ పట్టుకోవాలనిపించి చాలా రోజుల తరువాత మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ, నిజంగా ఇది వింతే. ఈ మాత్రం అయినా తనకు తెలీకుండానే తన చెయ్యి కాన్వాసుపైన కదిలించగలిగాడంటే ….

త..న్మ…యి…..

గుండెలో అకస్మాత్తుగా మెదిలింది ఆ పేరు.

తొలిసారిగా భార్గవి తన్మయికి ఉన్న కళ గురించీ, ఆమె చిత్రించే రాధాకృష్ణుల చిత్రాల గురించీ చెప్పాకే కదూ, ఈ విధంగా తన చేయి ముందుకు కదిలింది…..

కణతల మీదనుంచి చేతులు తీసి విప్పారిన కళ్ళతో ఆకాశం వంక చూశాడు తేజ.

ఎవరీ తన్మయి? ఇంతగా తనని ఎలా ప్రభావితం చెయ్యగలిగింది? ఆమెని తప్పకుండా కలవాలని మొదటిసారిగా అనిపించింది తేజకి. భార్గవిని అడిగితే తప్పకుండా పరిచయం చేస్తుంది. ఆమె వేసిన చిత్రాలు చూడాలి. ఆ ఆలోచన మనసులో మెదిలిందే తడవుగా అప్పుడే ఆ క్షణమే తన్మయి చిత్రాలు చూడాలన్నంత బలమైన కోరిక కలిగింది తేజకి. బయటికి చూశాడు. వర్షం జోరుగా కురుస్తోంది. ఆదివారమే కానీ అప్పటికే సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది. ఈ వాతావరణంలో తను కూడా ఎక్కడికీ వెళ్ళలేడు. ఆవేశపడకుండా కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. వచ్చే వారంతంలో తప్పకుండా తన్మయి చిత్రాల్ని చూపించమని భార్గవినడగాలి.

ఆలోచిస్తున్న తేజ వేళ్ళు కిటికీ గ్రిల్‌కి బిగుసుకున్నాయ్.

వాన పెద్దదవడంతో నీటి తుంపర్లు కిటికీ లోంచి లోపలికి పడుతున్నాయ్. విశాలమైన ఎర్రటి పూల కిరీటం పెట్టుకున్నట్టుగా ఉన్న గుల్మొహర్ చెట్టు ఆ వర్షంలో తడుస్తూ తేజ మనసుకి ఏదో తెలీని హాయినిస్తోంది.

***

తన కిటికీ బయట మనోహరంగా కనిపిస్తున్న ఎర్రటి గుల్మొహర్ పూలని చూస్తూ తన మొబైల్లో వినిపిస్తున్న పాట వింటోంది తన్మయి.

“చందన చర్చిత నీల కళేబర…”

ఎప్పుడు వర్షం కురిసినా ఆ పాట వినడం తన్మయికిష్టం. చేతిలో జయదేవుడి అష్టపదుల పుస్తకం, మొబైల్‌లో అత్యంత మధురమైన ఆ పాట ఎదురుగా కృష్ణవర్ణాన్ని పులుముకున్న ఆకాశం తను మోయలేకపోతున్న ప్రేమనంతా భూమి మీదకి ఒలకబోస్తూ.

లిప్తకాలం ఆ ఆకాశం రాధమోములోకి చూస్తూ అరమోడ్పు కన్నులతో మురళి వాయిస్తున్న కృష్ణుడిలాగా, ఈ భూమి కృష్ణ మురళీ గానానికి పరవశయై కనులుమూసుకున్న రాధలాగా కనపడింది తన్మయికి.

పాట పూర్తయింది. తన్మయి వాన ఉధృతికి ఏకమవుతున్నట్టుగా కనిపిస్తున్న నింగీ నేలనీ కూడా రాధా కృష్ణులుగా దర్శిస్తూ మైమరపులో ఉంది. ఆమె పెదవుల్లో అనిర్వచనీయమైన ఆనందం వజ్రంలా మెరుస్తోంది.

తన్మయంగా పాట వింటున్న ఆమెని కదిలించకూడదని అప్పటి దాకా తనూ గుమ్మం దగ్గరే నిలబడి విన్న భార్గవి తన్మయి ముఖం వైపు ఆశ్చర్యంగా చూసింది.

“తన్మయీ, నువ్వు నిజంగానే నాకో అర్ధంకాని అద్భుతానివి.”  దగ్గరకు రాకుండా గుమ్మం దగ్గరనుండే అంది భార్గవి.

తన్మయి ఇంకా ఆకాశాన్నే చూస్తోంది. ఆమెకి భార్గవి మాటలు వినపడినా తన నిశ్శబ్దంలోంచి బయటపడలేనట్టు తనకు కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని మనోనేత్రంలో దీక్షగా దర్శిస్తూ, మనోఫలకంపైన శ్రధ్ధగా ముద్రించుకుంటోంది.

తనవైపు చూడకుండా ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్న తన్మయిని మౌనాన్ని భంగపరచకుండా హాల్లోకి వెళిపోయింది భార్గవి.

హాల్లో  టీ.వీ లో వస్తున్న సినిమా చూస్తూ సోఫాలో కూర్చున్నారు తన్మయి తల్లీ, తండ్రీ. అప్పటి దాకా భార్గవి కూడా వాళ్ళతో కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది. మధ్యలో ప్రకటనలు వచ్చినప్పుడు తన్మయి ఏంచేస్తోందో చూడాలని ఆమె గదిలోకి వెళితే అక్కడ అష్టపది పాట వింటూ తన్మయత్వంలో మునిగిపోయి ఉంది స్నేహితురాలు.

“ఏమ్మా తన్మయి పడుకుందా…” భార్గవినడిగాడు ప్రకాశరావు.

“మీ కూతురి సంగతి మీకు తెలీదా? వాతావరణం ఇంత ఆహ్లాదంగా ఉంటే దాన్ని ఆస్వాదించకుండా పడుకుంటుందా అది?”  కూతుర్ని తలుచుకుంటూ కాస్త మురిపెంగా అంది దేవకి.

“నిజమే ఆంటీ. పాటలు వింటూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ అలా మైమరచిపోయి నిలబడి ఉంది” నవ్వుతూ చెప్పి భార్గవి సోఫాలో దేవకి పక్కనే కూర్చుంది.

“చల్లగా ఉంది కదా. భార్గవికి కాస్త వేడిగా బజ్జీలో, పకోడీలో వేసి పెట్టకూడదూ.” ప్రకాశరావు అన్నాడు దేవకితో.

“మీకూ తినాలనుందని చెప్పకూడదూ…”

“ఆంటీ, నేను పాలక్ పకోడీలు బాగా చేస్తాను. పొద్దున్న అంకుల్ తాజా పాలకూర తెచ్చారు కదా. నేను చేస్తాను. మీరిద్దరూ సినిమా చూస్తూ ఇక్కడే కూర్చొండి.”

“అయ్యో… ఎందుకమ్మా. చేతులు కాల్చుకున్నావంటే మాకు బాధ. నువ్వుండు. ఆ పాలకూర పకోడీలేవో నేనే చేస్తాను” భార్గవిని ఆపుతూ లేవబోయిన దేవకిని సున్నితంగా వారించి తనే లేచింది భార్గవి.

మరో అరగంటలోపు వేడి వేడి పకోడిలు ప్లేట్లలో పెట్టుకుని ఇద్దరికీ ఇచ్చింది.

ఒక ప్లేట్ తన్మయికి ఇవ్వడం కోసం ఆమె గదిలోకి వెళ్ళింది భార్గవి. అక్కడ తన్మయి కనపడలేదు.

పెయింటింగ్ గదిలో ఉందేమో అని అక్కడికి వెళ్ళిన భార్గవికి తెల్లటి కాన్వాసు మీద పెన్సిల్‌తో కనీకనపడనట్టుగా రాధాకృష్ణుల రూపాల్ని చిత్రిస్తున్న తన్మయి కనపడింది. ఆమె ఏకాగ్రతని భంగపరచకుండా నిశ్శబ్దంగా అక్కడినుంచి హాల్లోకి వెళిపోయింది భార్గవి.

***

సూర్యోదయ సమయం. ఇంకా చీకట్లు విడిపోకమునుపే యువరాణి చంద్రహాసినితో సహా ఆమె ముఖ్య చెలికత్తె విరజ, ఆ దేశపు మహా సేనానికి కుడిచేయి వంటివాడూ, మహావీరుడూ, ధైర్యవంతుడూ అయిన రుద్రనేత్రుడూ, ఇంకా ఆస్వారూఢులైన నలభై మంది భటులతో సహా అందరూ ప్రయాణానికి సిధ్ధమై రాజప్రసాదం ముందుకు వచ్చారు.

అందమైన పల్లకిలో యువరాణీ, విరజా ఎక్కగా బోయీలుగా ఇద్దరు మహాబలవంతులైన భటులు వచ్చారు. యువరాణి ఆపదలు ఎదుర్కొనే సమయాల్లో వేసుకునే ప్రత్యేకమైన కవచాలు ధరించి ఉంది. వాటి వెనుక దాచుకున్న పిడి బాకుని మరో సారి చూసుకుని విరజవైపు చూసింది. విరజ తనూ తన దుస్తుల వెనుక ఆత్మ రక్షణార్ధం తెచ్చుకున్న బాకుని సరిచూసుకుని కళ్ళతోనే తను సిధ్ధమన్నట్టు నవ్వింది. ఒరలో దాచుకున్న పదునైన కరవాలాలను కూడా మరోసారి సరిచూసుకున్నారు ఇద్దరూ.

మహారాజు కీర్తిసింహుడు, మహారాణి రత్నప్రభా ఇద్దరూ రుద్రనేత్రుడికీ, మిగిలిన భటులకీ జాగ్రత్తలు చెప్పి బయలుదేరడానికి అనుమతిచ్చారు.

యువరాణి చంద్రహాసిని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఆమెని చూసి విరజ కూడా తన భయాలన్నిటినీ తుడిచేసుకుని మనసుని ఆనందంగా మలుచుకోవడానికి ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, చిరునవ్వుతో తన ముఖాన్ని అలంకరించుకుంది.

ఆ అరణ్యం రాజధాని శివార్లలో ఉంది. రాజధాని చెంగల్వపురం చాలా విశాలమైనది. రాజప్రసాదం నుంచి అరణ్య పొలిమేరలకి చేరుకోవడానికి సుమారుగా మూడు ఘడియల కాలం పడుతుంది. అక్కడి నుంచి వీలైనంత మేర అరణ్యాన్ని చూసి చీకటి పడేవేళకి మునుపే తిరిగి అరణ్యపు మొదలు చేరుకోవాలని ఆలోచన. అప్పటికే ఫలహారాలు తీసుకున్న భటులు ఉత్సాహంగా తమ గుర్రాలను ముందుకురికిస్తున్నారు. బోయీలు వారితో పోటీగా యువరాణి పల్లకి మోస్తున్నారు. ఎక్కడా ఆగకుండా ప్రయాణించి సరిగ్గా అనుకున్న సమయానికంటే కాస్త ముందుగానే అరణ్య పొలిమేరల్ని చేరుకున్నారు వాళ్ళంతా. పొలిమేరల్లో దిగిన అంత మంది అశ్వారూఢులైన భటుల్నీ, పల్లకినీ అక్కడున్న కొద్ది మంది ప్రజలూ విచిత్రంగా చూస్తున్నారు. అక్కడికి అరణ్యం ఇంకా కొద్ది దూరం ఉన్నా, జనావాసం లేదు.

యువరాణి పల్లకిలోంచి తెర తొలిగించి బయటికి చూసింది. అల్లంత దూరంలో అరణ్యం మొదలవుతున్నట్టుగా పొదలతో, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లతో చీకటిగా కనిపిస్తోంది ఆ ప్రదేశం. నడక దారి కూడా అక్కడికి లేనట్టు ఎవరూ ఎప్పుడూ నడవనట్టు పూర్తిగా గడ్డి పెరిగి ఉంది అక్కడివరకూ.

చెవులు రిక్కించి వింటే లీలగా జంతువుల అరుపుల్లాంటివి వినిపిస్తున్నాయ్. నక్కల ఊళలో ఏవో తెలీని ఆ అస్పష్టమైన అరుపులు విని కొందరి భటుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పుడు వచ్చిన సైన్యంలో ఇదివరలో ఈ అరణ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన సైనికుల బంధువులూ, ప్రాణ మిత్రులూ కూడా ఉన్నారు. వారి మనసుల్లో ఏవో దుశ్శకునాల్లాంటి అలజడులు ప్రారంభమయ్యాయి.

యువరాణి మాత్రం ఆ అడవి వంక చూస్తూనే ఏదో తెలీని మధురమైన అలజడికి లోనైన ఎదని తన తమలపాకుల్లాంటి లేత చేతులతో సున్నితంగా నొక్కుకుంది. ఆమె గుండె వేగం హెచ్చింది. భయంతో కాదు. ఆమెకే తెలీని ఒక ఆనందంతో. ఈ ప్రదేశానికి తను ఇదివరకెప్పుడూ రాలేదు. కానీ, ఎందుకో అక్కడేదో తన ప్రాణమున్నంత ఉద్వేగం కలుగుతోంది. ఏమిటీ చిత్రం. లేదు.. తను సాధ్యం కాదనుకున్న కోరిక ఇంత త్వరగా తీరబోతున్నందుకు కలుగుతున్న ఆనందం అది. తనకు తనే సమాధానం చెప్పుకుంటూ రుద్రనేత్రుడి వంక చూసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here