స్నిగ్ధమధుసూదనం-9

0
8

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 9వ భాగం. [/box]

[dropcap]యు[/dropcap]వరాణి సైగని అర్థం చేసుకున్న రుద్రనేత్రుడు అక్కడ ఆగిన సైన్యమంతటికీ అభిముఖంగా తిరిగి “ఈ అడవి అతి గుబురుగా ఉన్న పొదలతో ఉండడం వల్ల మనందరమూ మూడు వరుసలుగా ముందుకు పోదాం. అందరికంటే ముందు ఉన్న భటులు మీ కత్తులతో అడ్డుగా ఉన్న పొదల్నీ, తీగల్నీ నరుకుతూ వెనుక ఉన్న వారికి దారి కల్పిస్తూ ఉండాలి. వెంటనే మీరంతా మీ మీ అశ్వాలతోనే మూడు వరుసలుగా నిలవండి” అన్నాడు.

రుద్రనేత్రుడు చెప్పడం పూర్తికాగానే యువరాణి గంభీరమైన గొంతుతో “ఆగండి. మీలో ఎవరైనా ఈ పని ప్రాణ భయంతో చేస్తున్నట్టయితే నిరభ్యంతరంగా ఇక్కడే ఆగిపోవచ్చు” అంది.

రుద్రనేత్రుడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. “వీరంతా అరణ్య ప్రవేశానికి సిధ్ధపడే ఇక్కడికి వచ్చారు యువరాణీ. ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఎటువంటి అనుమానాలూ పెట్టుకోకండి” అన్నాడు.

“లేదు రుద్రనేత్రా. ఈ అరణ్యాన్ని చూస్తూనే, అడవిలోంచి వినపడుతున్న మృగాల అరుపులు వింటూనే ఇక్కడున్న కొందరి మొహాల్లో భయాన్ని చూశాను. ప్రాణ భయంతో నాకోసం వారు ఈ సాహసానికి సిధ్ధపడటం నాకు అంగీకారం కాదు.”

రుద్రనేత్రుడు ఆమె మాటలకి విస్తుపోతూ భటుల వంక చూశాడు. కొందరు భటులు వెంటనే తలలు దించుకున్నారు. చంద్రహాసిని ‘ఇప్పుడేమంటావు’ అన్నట్టు చూసింది రుద్రనేత్రుడి వైపు.

రుద్రనేత్రుడి కళ్ళు కోపంతో ఎరుపెక్కడం చూసి చంద్రహాసిని వారింపుగా చూస్తూ “రుద్రనేత్రా, వారి మీద కోపం వద్దు. యుధ్ధానికైతే వీరంతా తమ ప్రాణాలివ్వడానికైనా సిధ్ధమే అని మనకి తెలిసిన విషయమే. ప్రమాదకరమని తెలిసిన ఈ అరణ్య ప్రవేశం కూడా యుధ్ధానికి వెళ్ళినట్టు తమ ప్రాణాలు పణంగా పెట్టి రావాలని ఎదురుచూడటం మనకే సమంజసం కాదేమో” అంది.

“యువరాణీ, ఇక్కడ మీ భద్రత మాకు ముఖ్యం. మా అందరి బాధ్యత. మీ రక్షణే ధ్యేయంగా కనపడాలి వీళ్ళందరికీ. అంతే కానీ, ఎందుకూ పనికిరాని అరణ్య ప్రవేశం చేస్తున్నామన్న ఆలోచన ఉంటే వీరెవరూ ధీరులనిపించుకోరు” పళ్ళు కొరుకుతూ అన్నాడు రుద్రనేత్రుడు.

“లేదు రుద్రనేత్రా. నిజానికి ఇది నా మూర్ఖపు కోరిక. ఇక్కడికి చేరుకునే దారిలో మనల్ని చూసి ప్రజల ముఖాల్లో కనపడిన ఆశ్చర్యాందోళనలు మీరు గమనించలేదా. ఇక్కడికి చేరగానే కొందరు భటుల గుండెలు భయంతో కొట్టుకోవడం మీకు వినపడలేదా? నా సంతోషం కోసం, వీళ్ళందరినీ ప్రమాదానికో, ఇలా భయానికో గురిచెయ్యలేను నేను.”

యువరాణి సునిశిత పరిశీలనా శక్తికి విస్తుపోతూ ఆమె వైపు చూశాడు రుద్రనేత్రుడు. ఆమె తమ పైన చూపిస్తున్న అభిమానానికి కరిగిపోతూ అరణ్యప్రవేశానికి భయపడిన భటులంతా ఏకకంఠంతో “యువరాణీ, మీ కోరిక తీర్చడం కోసం మా ప్రాణాలను పణంగా పెట్టడం మాకు ఆనందమే” అన్నారు.

యువరాణి నవ్వి రుద్రదేవుడిని చూస్తూ పల్లకీ దిగింది. భయపడిన భటులందరినీ వేరు వరుసలో నిలబెట్టింది.

“మీరంతా ఇక్కడే జాగరూకులై ఉండండి. మాకు ఎటువంటి ప్రమాదమూ రాదు. అవసరం అయితే అప్పుడు మమ్మల్ని కాపాడేందుకు ఈ అడవిలో అడుగుపెట్టండి” ఆజ్ఞాపిస్తున్నట్టుగా గంభీరంగా ఉన్న యువరాణి గొంతుకి మారు మాట్లాడకుండా భటులంతా ఆమె చెప్పినట్టుగానే విడిపోయారు.

క్షణకాలంలోనే అంతమంది భటుల్లో ఎవరు ముఖాల్లో భయాన్ని చూపించారో గమనించి వారిని గుర్తుపెట్టుకుని మరీ వేరు పరిచిన యువరాణి వంక మరోసారి ఆశ్చర్యంగా చూస్తూ ఆమె ఆజ్ఞకి ఆనందంగా తలవంచాడు రుద్రనేత్రుడు.

ఆగిపోయిన ఒక భటుడి ఆశ్వాన్ని తీసుకుని దాన్ని అధిరోహించింది చంద్రహాసిని. యువరాణి ధైర్యసాహసాల గురించి తెలిసిన విరజకి ఇదేమీ విచిత్రంగా అనిపించలేదు. ప్రియసఖి వైపు మురిపెంగా చూస్తూ పల్లకీ దిగి తనూ ఓ ఆశ్వాన్ని ఎంచుకుని ఎక్కి కూర్చుని యువరాణి వైపు చిరునగవుతో చూసింది.

వారిద్దరినీ చూసి దీర్ఘంగా శ్వాసిస్తూ తన అశ్వాన్ని ముందుకు దూకించాడు రుద్రనేత్రుడు.

ముందుగా అనుకున్నట్టే మూడు వరుసలుగా చీలింది సైన్యం.

ముందు వరుసలో ఉన్న భటులు మహా పదునైన తమ కరవాలాలను చేత బట్టి ముందుకు నడిపించారు తమ వాహనాల్ని. యువరాణీ, విరజల అశ్వాలు మధ్యలో ఉన్నాయి. వారి వెనుక కొంతమంది భటులు తమ ఆశ్వాలతో జాగరూకులై పరిసరాల్ని గమనిస్తూ సాగుతున్నారు.

అరణ్యం దగ్గర పడేకొద్దీ భీకరమైన అరుపులు మరింత స్పష్టంగా వినపడుతున్నాయి. అవి ఏ జంతువు అరుపులో కూడా కనిపెట్టలేనట్టు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ముందు వరుసలో ఉన్న భటులు.

వారి వెనుకగా ఉన్న రుద్రపాదుడి మనసులో మరోసారి అనుమానం లేచింది. ఇంతటి భీకరమైన అడవిలోకి ప్రవేశించాలని యువరాణికి ఎందుకింత పట్టుదల? మరెన్నో సుందరమైన అరణ్యాలుండగా ఈ అరణ్యాన్నే చూడాలని ఎందుకనుకుంటోంది? ఈ అరణ్య ప్రవేశం ఎంత ప్రాణాంతకమైనదో తెలిసి కూడా ఎందుకు ఈమె తన కోరికని అదుపు చేసుకోలేకపోయింది? ఒక్కగానొక్క కూతురు అడిగితే ఇటువంటి కోరికని మహారాజు తీర్చడానికి ఎలా సంసిధ్ధులయ్యారు? ఎంతటి వీరాధివీరులైన భటుల్ని రక్షణగా పంపించినా కూతురి మీదున్న ప్రేమవల్ల తను కూడా బయలుదేరి రావల్సిన మహారాజు నిశ్చింతగా ఎలా కోటలోనే ఉండిపోయారు?

అత్యంత జాగరూకతతో పరిసరాల్ని జల్లెడపడుతూనే ఆలోచిస్తున్నాడు రుద్రనేత్రుడు.

యువరాణి ఎంతటి పరాక్రమవంతురాలో అతనికి తెలియనిది కాదు. కానీ, ఎంతటి వీరవనిత అయినా తల్లి తండ్రులకి కూతురి రక్షణ గురించిన భయం సహజం. ఆ వీరత్వమంతా అడవి కాచిన వెన్నెల చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకూ పనికిరాని ఈ సాహసంలో కూతురు ధీరత్వం చూపించాలని ఎవరూ ఆశపడరు.

రుద్రనేత్రుడు ఆలోచనల్లో ఉండగానే అరణ్య ప్రవేశం జరిగింది. ముందుగా వెళుతున్న భటుల కత్తుల పదునుకి దారికి అడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలు, బలమైన తీగలు తెగి పడుతున్నాయి. వెనుక ఉన్న వారికి దారి సులభమవుతోంది.

కొద్ది దూరం ప్రయాణించేసరికి చుట్టూ ఉన్న చెట్లు మరింత దట్టంగా మారిపోతున్నాయ్. పెద్ద పెద్ద పాములు కూడా భటుల కరవాలానికి బలవుతున్నాయ్. చెట్ల పైనుంచి కూడా పాముల బుసలు గుండెల్లో గుబులు పుట్టించేలా వినపడుతున్నాయ్ కానీ యువరాణి నిర్భయత్వం చూశాక భయపడే గుండెలు కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్నాయ్.

అలా ఒక రెండు క్రోసుల దూరం నిరాటంకంగా సాగిపోయాక, ఒక నదీపాయ అడ్డుగా వచ్చింది. ఆ నది చాలా లోతుందని చూడగానే తెలుస్తోంది. అందరూ అక్కడిదాకా వచ్చాక ఆగిపోయారు.

యువరాణి ఆ నదీ తీరాన్ని ఆనందంగా పరికించి చూస్తోంది. నది పెద్ద వెడల్పుగా ఏమీ లేదు. నీరు నిండుగా ప్రవహిస్తోంది. నదికి ఆవలి తీరంలో కూడా పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు , పొదలతో చీకటిగా కనిపిస్తోంది. నదిలోకి వంగి ఉన్న కొన్ని వృక్షాలు పూలతో నిండి ఉన్నాయి. వాటి ప్రతిబింబం నీటిలో పడి అదో అద్భుతమైన చిత్రంగా కనిపిస్తోంది. నది నీటిలో రాలిన పూవులు అందంగా తేలుతున్నాయ్. ఇరువైపులా ఏవేవో పక్షుల అరుపులు నిరంతరంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటి కిలకిలలతో ప్రతిధ్వనిస్తున్న ఆ పరిసరాలు మరింత అందంగా అద్భుతంగా తోస్తున్నాయ్. కంటికి కనపడనంత దూరంలో ఆ నదే ఎక్కడో లోయలోకి పడుతున్నట్టుగా జలపాతపు శబ్దం వినిపిస్తోంది.

మైమరచిపోయి ఆ దృశ్యాన్ని అలాగే చాలా సేపు చూసింది యువరాణి. ఆమె హృదయం ఏదో కొత్త రాగాన్ని ఆలపిస్తోంది. అడవి ప్రయాణం ఆమెకు కొత్తేమీ కాదు. పది సంవత్సరాలు ఆమె సిధ్ధారణ్యంలో జ్ఞానదీపుడనే మహర్షి దగ్గరే అన్ని విద్యలూ అభ్యసించింది. ఆ పది సంవత్సరాలూ పచ్చటి అరణ్య ప్రకృతిలో తనూ ఓ పూల తీగై పెరిగింది. ఓ జలపాతమై నర్తించింది. ఓ పాషాణ హృదయమై కొన్ని ప్రమాదాలనీ చూసింది. అక్కడ కూడా జలాశయాలూ, దట్టమైన అడవి ప్రదేశాలూ, మైదానాలూ, కొండ ప్రాతాలూ చూసింది. తిరిగింది. ప్రకృతి ఒడిలో మనసు, తనువు మైమరచిపోవడం ఆ అందాలన్నీ ఆనందాలైపోవడం ఆమెకు కొత్తేమీ కాదు. కానీ, ఈ ప్రదేశం చాలా గాఢమైన ఉద్వేగాన్ని కలిగిస్తోంది ఆమెలో. ఎందుకో , ఏమిటో ఆమెకే తెలియటం లేదు.

“యువరాణీ …”

ప్రియసఖి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూ పిలిచింది విరజ.

“ఇప్పటికే మిట్ట మధ్యాహ్నం అయింది. అందరికీ ఆకలిగా ఉంది. మీరు అనుమతిస్తే…”

వినయంగా అడుగుతున్న విరజ వంక చూస్తూ తనూ నవ్వింది చంద్రహాసిని.

ఆమె ఆనతితో అందరూ అశ్వాల్ని దిగి ఆ నది నీటితోనే కాళ్ళూ, చేతులూ శుభ్రపరుచుకుని అక్కడే ఓ పెద్ద వృక్షం కింద అర్ధచంద్రాకారంలో కూర్చున్నారు. నలుగురు భటులు సాయుధులై నలుదిక్కులా చూస్తూ నిలబడిపోయారు.

చంద్రహాసినీ, విరజా కూడా చేతులు శుభ్రపరుచుకుని వచ్చి తమకు ప్రత్యేకంగా వేసిన చిన్న ఆసనాల్లో కూర్చున్నాక, మరో ఇద్దరు భటులు వెంట తెచ్చుకున్న ఆహార పదార్ధాల్ని అందరికీ వడ్డించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here