సోమనాథ క్షేత్ర దర్శనం

0
11

[15 జనవరి 2024 మకర సంక్రాంతి నాడు వనస్థలిపురం సమీపంలో ఉన్న సోమనాథ క్షేత్రాన్ని దర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

భారతదేశం యోగభూమి. ఎక్కడ చూసినా ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు కనిపిస్తాయి. హిందూ సనాతన ధర్మాన్ని, యోగాన్ని, గీతను ఉపనిషత్తులను ప్రజలకు చేరువ చేయడంలో, ఇవి ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. ఈ యోగుల్లో కొందరు భోగులుగా మారి, రాజకీయాశ్రయం పొంది, ఆక్రమాల నిర్వహణను ఒక కార్పొరేట్ స్థాయికి దిగజార్చారు. ఉత్తరభారత దేశంలో ఈ వికృత పరిస్థితి ఇంకా ఎక్కువ.

కాని అలాంటి దొంగ స్వాముల సంఖ్య అదృష్టవశాత్తు తక్కువ. సంక్రాంతి పర్వదినం నాడు, సాయంత్రం మా వనస్థలిపురంలోనే ఉన్న సోమనాథ క్షేత్రాన్ని దర్శించుకున్నాము. నేను, మా బావగారు గురుదత్త ప్రసాద్ గారు వెళ్ళాము. ఆయన భారతీయ స్టేట్ బ్యాంక్‌లో చాలా కాలం పని చేసి, రిటైరైనారు. గొప్ప ఆధ్యాత్మికవేత్త. భగవాన్ రమణ మహర్షుల వారి బోధనలతో ఉత్తేజితుడైనారు.

ఊబర్ ఆటోలో ఇద్దరం సోమనాథ క్షేత్రం చేరుకున్నాం. అది సాగర్ హైవేను ఆనుకొని, బి.ఎన్. రెడ్డి నగర్‌లో, ఒక ఎత్తైన గుట్టమీద ఉంది. బి.ఎన్. రెడ్డి అంటే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు. గొప్ప చలనచిత్ర దర్శకులు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తొలిసారిగా అందుకొన్న మహానీయుడు. పద్మభూషణ్. వందేమాతరం, దేవత, మల్లేశ్వరి లాంటి కళాఖండాల సృష్టికర్త.

వైదేహీనగర్ దాటి, బి.ఎన్. రెడ్డి నగర్ జంక్షన్‌కు కొంచెం ముందు కుడి వైపుకు తిరిగింది మా ఆటో. సందులు గొందులు తిరుగుతూ ఒక చోట మిట్ట, ఎక్కసాగింది. దాన్ని తెలంగాణా వాళ్ళు ‘చడావ్’ అని, మా రాయలసీమవాళ్లు ‘ఎగుమారు’ అని అంటారు.

సోమనాథ క్షేత్రం ప్రధాన ద్వారం!

చాలా పెద్ద గుట్ట. గుట్ట అనే కంటే కొండ అని అనడం మంచిది. ఆశ్రమం ప్రధాన ప్రవేశద్వారం కళాత్మకంగా ఉంది. రెండు వైపులా రెండు గుమ్మటాలు, ఏనుగుల బొమ్మలు ఉన్నాయి.

సోమనాథ క్షేత్రం పైకి వెళ్లే దారి.

పైకి చేరుకోవడానికి మెట్లు కాకుండా, స్లోప్ ఉంది. అది చాలా స్టీప్‌గా ఉంది. కొంత దూరం ఎక్కిన తర్వాత వరుసగా, మూడు నల్లని శివలింగాలు కనబడ్డాయి. ఒక దానికీ మరో దానికీ మధ్య ఐదారు మీటర్ల దూరం ఉండవచ్చు.

అవి నిలువుగా, వరుసగా ఉన్నాయి. వాటి పక్కన మెట్ల దారి. దానికి రెయిలింగ్స్ కూడ అమర్చారు. మొదటి శివలింగం రెండడుగులు, రెండవది మూడడుగులు, మూడవది నాలుగడుగుల ఎత్తు ఉన్నాయి. నల్ల రంగులో, లైట్ల వెలుగులో అవి మెరుస్తున్నాయి. పెద్ద లింగం ముందు భాగాన ఓంకారాన్ని ‘ॐ’ తెల్లని రంగులో చిత్రించారు.

చిన్న లింగం పక్కన రెండు తిన్నెల మీద తెల్లని రంగులో, వేగంగా ఉరుకుతున్న భంగిమలో, రెండు వేట కుక్కల బొమ్మలున్నాయి.

“బావా, ఈ కుక్కలు బొమ్మల అంతరార్థం ఏమిటో చెప్పు” అని మా బావగారిని అడిగాను ఆయన – “అదుపు తీకుండా పరుగులు తీసే మన పంచేంద్రియాలను అలా చిత్రీకరీంచారురా, దత్తుడూ!” అని చెప్పారు. నాకు అది తోచలేదు. ఆయన జ్ఞానం వేరు!

పెద్ద లింగం దగ్గర కుడివైపు మళ్లీ మెట్లున్నాయి. స్లోప్ కూడా ఉంది. చాలా ఎత్తుగా ఉంది. మెట్ల మీదుగా పైకి చేరుకున్నాము. అక్కడ ఒకాయన మాకు కనబడ్డారు. ఆయనకు నమస్కరించాము. ఆయన ఆశ్రమ నిర్వాహకుల్లో ఒక ప్రముఖుడట. ఆయన పేరు రఘురామ్ గారు.

మా బావ, గురుదత్తప్రసాద్ గారు తనను తాను పరిచయం చేసుకొని, నన్ను కూడా ఆయనకు పరిచయం చేశారు. నన్ను ఒక రైటర్‌నని చెప్పారు. ఆయన పెద్దగా స్పందించలేదు. మా బావ. తాను భగవాన్ రమణమహర్షి భక్తుడినని చెప్పుకున్నపుడు ఆయన (రఘురామ్) గారి కళ్లూ వెలుగు!

“మీరు ధన్యులు! హారతి పావు తక్కువ ఆరుకే ముగిసింది. మీరు కొంచెం ముందుగా వచ్చి ఉంటే బాగుండును” అన్నారు రఘురాం గారు. “రండి స్వామి మందిరం చూద్దురుగాని, మరో అరగంట దాటితే.. నేను కూడ వెళ్లి పోయి ఉందును” అన్నారు.

తలుపులు తాళం తీసి, మందిరంలో లైట్లు వేశారాయన. శ్వేతవర్ణంలో, లేత బంగారువర్ణంలో గోడలు, స్తంభాలు! వాటిమీద కళాకృతులు. పై కప్పు మీద అష్టదళపద్మాలు. ఒక వేదిక మీద విరాట్ పురుషుని పెద్ద విగ్రహం. అటు తొమ్మిది, ఇటు తొమ్మిది శిరస్సులతో అటు తొమ్మిది, ఇటు తొమ్మిది బాహువులతో గదాధరుడైన, ఆదిశేషుడు, ఆరు పడగలతో భద్రముగా గల మహావిష్ణువు విగ్రహమది.

శ్రీ గురుదత్త ప్రసాద్ గారితో, సోమనాథ క్షేత్రంలో

రెండు వైపులా రెండు కరవాలములను అమర్చిన ఇత్తడి డాలులున్నాయి. విరాట్‍పురుషుని ముందు సోమనాథ మహర్షి విగ్రహం, నిలుచున్న భంగిమలో ఉంది. ఆయన కమండలధారి. పాదుకలు ధరించి ఉన్నాడు. జటాధారి. నల్లని పొడవైన గడ్డం. ఆయన వదనంలో ఒక అలౌకికానందం (బ్లిస్).

వేదిక ముందు మహర్షి పాదుకలు ఉన్నాయి. వారి ఫోటో కూడా ఉంది. పక్కన ఇంకో వేదిక మీద, సోమనాథ యోగి ఆసీనులయి ఉండిన పెద్ద ఆసనం ఉంది.

శ్రీ సోమనాథ మహర్షి వారి ఆసనం

అది సింహాసనం. రోజ్‌వుడ్‌తో చేసినది. ఆనుకునే చోట, చేతులు పెట్టుకునే చోట రోజ్‍వుడ్ తోనే సింహాకృతులు చెక్కారు. కూర్చోడానికి ఎరుపు రంగు ముఖ్‍మల్ క్లాత్ కవర్ గల మెత్తలు (కుషన్స్) ఉన్నాయి. సింహాసనం ముందు కూడా యోగి పాదుకలున్నాయి. ఫోటో ఉంది. నేను, మా బావగారు, పాదుకలకు నమస్కరించాము.

మందిరం లోనించి బయటకు వచ్చాము. ఏదో అనిర్వచనీయమైన ప్రశాంతత మా మనసులను ఆవరించింది. మందిరం వెలుపల ఒక గానైట్ వితర్దిక మీద తెల్లని పాలరాయి (మార్బుల్‌) తో చెక్కిన సోమనాథ మహర్షి విగ్రహం ఉంది. దాదాపు ఎనిమిదడుగుల ఎత్తు, నాలుగడుగుల వెడల్పు ఉంది. ఒక గ్లాస్ ఛాంబర్‌లో ఉంది విగ్రహం. కాబట్టి పారదర్శకంగా, ధవళకాంతులనీనుతుంది.

యోగి మహరాజ్ ఒక బహుళదళ పద్మం మీద, పద్మాసనస్థితుడై; రెండు చేతులూ యోగముద్రల్లో తొడలమీద పెట్టుకుని, ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు.

మందిరం పక్కన ఒక గ్రిల్డ్ గేటు గుండా వెళ్లాము. అక్కడా స్లోప్ సుమారు ఇరవై ఆడుగులుంది. పైకి వెళ్లి చూస్తే సోమనాథ స్థూపం ఉంది. అది ఒక బృహన్మిర్మాణం. స్తూపం ఎత్తు సుమారు వంద అడుగులు పైనే ఉంది. స్వామి విగ్రహం క్రింద ఉంది.

శ్రీ సోమనాథ స్తూపం

ఎదురుగా ఒక ఎత్తైన ప్రదేశంలో రథారూఢుడైన ఒక దేవుడున్నాడు. అక్కడ వాతావరణం చల్లగా హాయిగా ఉంది. చుట్టూ, మధ్యన చిన్న చిన్న గోపురాలతో, సరిహద్దు గోడ కళాత్మకంగా ఉంది.

అక్కడ నిలబడి చూస్తే వనస్థలిపురం, సాగర్ రోడ్డు, విద్యుదీపాల వెలుగులో, కనుచూపు మేరా కనువిందు చేశాయి.

సోమనాథ క్షేత్రం గుట్ట పైనుండి, వనస్థలిపురం వ్యూ!

క్రిందికి దిగి వచ్చాము. కాసేపు ఒక అరుగు మీద కూర్చున్నాము. వేటకుక్కుల విగ్రహాలకు అటు వైపు, అశ్వారూఢుడు, కరవాలధారి అయిన ఒక వీరుని ధవళ విగ్రహం ఉంది. అది పదిహేను, ఇరవై అడుగుల ఎత్తు ఉంది. గుర్రం తన ముందు కాళ్ళు పైకెత్తి, సకిలిస్తున్నట్లు ఉంది.

సోమనాథ మహర్షి విగ్రహం ( యవ్వనంలో )

“ఈ విగ్రహం ఎవరిది, రఘురాం గారు?” అని మా బావ ఆయన్ను అడిగారు. ఆయన నవ్వుతూ “ఇదీ సోమనాథుల వారిదేనండి. ఆయన యవ్వనంలో ఉన్నపుడు గుర్రం ఎక్కి తిరిగేవారట” అన్నారు.

“స్వామివారి స్వస్థలం?”

“కర్నూలు జిల్లా నెహ్రూనగర్ అండి”

మా బావ అన్నారు “నిజమే. టి.వీ.లో ఆయన ప్రసంగాలు విన్నాం కదా! కర్నూల్ జిల్లా మాండలీకం అనే చెప్పేవారు. ఇప్పుడు గుర్తొస్తూన్నది. మా బావగారిది కూడా కర్నూలేనండి. వెల్దుర్తి.”

“మీ ఊరు?”

“మాది ప్రొద్దుటూరు, రఘురాం గారు. మా చెల్లెలనే ఈయన కిచ్చాం. మా మేనమామ కొడుకే.”

మా బావ మాటల్లో, నా మీద ఆయనకున్న వాత్యల్యమంతా తొణికింది.

“మా బావ మంచి రైటర్ సార్, కథలు, నవలలు, వ్యాసాలు రాస్తాడు, కాలమిస్ట్ కూడా!” అన్నారు మా బావ! కాకి బావ కాకికి ముద్దు.

రఘురామ్ గారు కనీసం “అలాగా?” అని కూడా అనలేదు. విని ఊరుకున్నారంతే. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్లకు కొంచెం నిరాసక్తత సహజంగా ఉంటుంది. కాని ఇద్దరూ రమణమహర్షిని గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు ఆయన ముఖంలో స్పందన!

“సోమనాథ్ జీ చెప్పేది కూడా రమణుల బోధనకు దగ్గరగా ఉంటుందండి.” అన్నారాయన.

“ఏకం సత్! విప్రాః బహుధావదన్తి అన్నారు కదా జ్ఞానులు!” అన్నాను నేను. వాళ్లిద్దరూ ఆధ్యాత్మికవాదులు. నేను అధిక ప్రసంగం చేశానేమో అనిపించింది.

రఘురామ్ గారు నా వైపు మెచ్చుకోలుగా చూశారు!

“ఈ ఆశ్రమం ఎప్పుడు నెలకొల్పారండి?”

రఘురామ్ గారు చెప్పసాగారు.

“1987లోనండి. అప్పుడిదంతా బండలు, తుప్పలతో నిండి ఉండేది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దించారు సోమనాథులవారు. 2016లో వారు శివైక్యం చెందారు. ఆశ్రమం నిర్వహణకు ఒక ట్రస్ట్ ఉందండి. ప్రతి మాసశివరాత్రికి, మృత్యుంజయ హోమం జరుపుతాము. పేదలకు అన్నదానం చేస్తాము. వనస్థలిపురంలోనే ఆశ్రమం తరపున ఒక అనాథాశ్రమం, దానికి అనుబంధంగా ఒక పాఠశాల ఉన్నాయి. శివరాత్రి పర్వదినాన కోటి రుద్రాభిషేకం జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తారు. రోజూ ఉదయం, సాయం హారతి కార్యక్రమం కనులపండువగా జరుగుతుంది. స్వామి వ్రాసిన పుస్తకాలు తొమ్మిది ఉన్నాయి. ఈ సంవత్సరం వేసిన ఆశ్రమం క్యాలెండర్ కూడా వచ్చింది. మీరు పగటిపూట వస్తే, అవన్నీ ఇవ్వగలను.”

“ఈ ప్రాంతాన్ని ఏమంటారండి?”

“శ్రీ సాయినగర్. బి.ఎన్.రెడ్డి అంటేనే తెలుస్తుంది. మొదట్లో స్వామి మానవత దీక్షలో ఉండేవారు. తపస్సులో ఉండేవారు. తర్వాత సమాజంలో శాంతి, సమదర్శనం స్థాపించడానికి కార్యక్షేత్రంలో ప్రవేశించారు.”

“వారి మార్గం?” మా బావ అడిగారు.

“బ్రహ్మవిద్యాబోధన. దానిని ‘మనో యోగసాధన’గా వ్యాప్తం చేశారాయన. దీని ద్వారా తక్కువ సమయం లోనే మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను పొందవచ్చు. పరమాత్మను దర్శించవచ్చు. దీనిలో ప్రాణాయామం, శ్వాస నిరోధం లాంటి ప్రక్రియలుంటాయి. ప్రాణాయామానికి శాస్త్రయ వివరణ ఇచ్చారు. సోమనాథ మహర్షి, పార్కిన్సన్, మెమెరీ లాస్ లాంటి వ్యాధాలను కూడా నయంచేసేవారు.”

స్వామివారి సమాధి ముందు శిలాఫలకం మీద ‘Man is God. Work is Divine. Creation is a great science’ అని వ్రాసి ఉంది. గీతా మరియు అద్వైతసారం! ఒక చోట ‘Progress and regression are in your hands’ అన్న వాక్యాలు నన్ను ఆకర్షించాయి.

ఆశ్రమంలో జాతి మత వివక్ష లేదు. అందరికీ ‘మనో యోగ సాధన’ శిక్షణ యిస్తారు. హోమాలు, భజనలలో అందరూ పాలుపంచుకోవచ్చు. ఈ ఆశ్రమం మరో శాఖ శ్రీశైలం లోని హఠకేశ్వరం వద్ద కూడ ఉందని రఘురాం చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, నమస్కరించి, ఇంటికి బయలు దేరాము.

అలా సంక్రాంతి పర్వదినాన ఒక చక్కని, ప్రశాంత గంభీరమైన, ఆధ్యాత్మిక ప్రదేశాన్ని దర్శించుకోగలిగాము, శివానుగ్రహంతో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here