సోమశిల సందర్శనం

1
15

[dropcap]మే[/dropcap]ము ఎప్పటినుంచో సోమశిల, సంగమేశ్వర ఆలయం చూడాలనుకుంటున్నాం. ఈ సంగమేశ్వరం ట్రిప్ అనేది మూడు సంవత్సరాల క్రితం – నేను, వసంత, రేఖ ముగ్గురం కలిసి చక్కటి ప్లాన్ వేసుకొని యాగంటి నుండి సోమేశ్వరం, కొలను భారతి, తరువాత శ్రీశైలం ఇవన్నీ వెళ్ళాము అన్నమాట. మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళాము. సంగమేశ్వరం అనేది సంగమేశ్వర స్వామి గుడి. అది ఎప్పుడూ నీటిలో మునిగి ఉండి, కొన్ని నెలలు మాత్రమే తేలి ఉంటుంది. అదే ఈ గుడి విశిష్టత అంతా. చక్కటి గుడి మునిగిపోయి, కొన్ని నెలల తర్వాత బయటకు వస్తుంది అన్నమాట. అది అంతా ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది‌. అయితే మేము అక్కడ కొలను భారతి సంగమేశ్వరం వెళ్ళినప్పుడు చాలా బురద నీళ్ళలో అప్పుడే కొద్దిగా తేలి ఉన్న సమయములో వెళ్ళాము‌. చాలా కష్టపడుతూ వెళ్ళాము. అయితే అప్పుడు మేము సోమశిల వెళ్ళినప్పుడు ఆ రెండు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఇప్పుడేమో సోమశిల తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. సంగమేశ్వర్ ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళింది. అయితే సోమశిల చూడడానికి ఈసారి మేము ముగ్గురం జంటలుగా వెళ్ళాము‌‌. రేఖ, వసంత, నేను. పొద్దున్నే లేచి ఆరు గంటలకి తయారయ్యి ఏడు గంటలకే రేఖ ఇంటి దగ్గర కలిసి అక్కడి నుంచి రెండు కార్లలో మా మూడు జంటలు వెళ్ళాము. చక్కగా ఒక ముగ్గురు ఆడవారు ఒక కారులో, ముగ్గురు మగవారు ఒక కారులో ప్రయాణం సాగించాం.

***

అక్కడికి చేరుకోగానే మాకు మొదట్లో ఒక పెద్ద రూమ్, చాలా పెద్ద గది ఇచ్చారు. రూమ్‌లో 6 బెడ్స్ ఉంటాయని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి. ఒక్క రూమ్ మాత్రమే దొరికింది. ఆ ఒక్క రూమ్‌లో… నేను అంటే మా ప్రయాణంలో ఇంత ఒదిగి పడుకోవడం ఇదే మొదటిసారి నా జీవితంలో‌. ముగ్గురు మగవారు బెడ్ మీద పడుకుంటే, మేము ముగ్గురం బెడ్స్ వేయించుకుని ఆ ఒక రూమ్ లోనే సర్దుకొని ఆ రోజు ఉన్నాము. అయితే అక్కడికి వెళ్లగానే అందరూ గొడవ చేశారు రాత్రి కల్లా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. కానీ నేను మాత్రం అన్నాను ఎలా అయినా ఈరోజు we try to accommodate ourselves అని. అందరినీ ఒప్పించి ఆ రోజు అక్కడ ఉండి పోయాము. నిజంగా ఎందుకు అక్కడ ఉండాలి అనిపించింది అంటే, ఆ రూమ్‌లో నుంచి ఒక విండో ఓపెన్ చేసి బ్యాక్‌గ్రౌండ్ చూస్తే రెండు చక్కటి కొండల మధ్య గ్రీనరీ. ఆ గ్రీనరీ కింద మొత్తం నది ఏడు పాయలుగా పారుతూ ఏ న్యూజిలాండ్‌కో వెళ్లిన అనుభూతి కలిగింది. ఎంత చక్కటి ప్రకృతి అందాలు అంటే చాలా చెప్పుకోదగినవి, పరవశించి పోయాను. నాకు ఆ ప్లేస్ నుంచి రావాలని అనిపించలేదు. అయితే ఎంతో కష్టంగా కష్టపడి ఆ రూమ్‌లో పడుకొవడం, ఒదగడం అయినా కూడా నాకు నేను ఎంతో సంతోషం మిగుల్చుకున్నాను.

***

అయితే ఆరోజు మేము పొద్దున్నే పదకొండు గంటలకి బయలుదేరినప్పుడు మధ్యలో మధ్యలో ఆగి అద్భుతమైన గ్రీనరీ ఫోటోలు తీసుకున్నాము. నవ్వుతూ మాట్లాడుకుంటూ మేము సోమశిల చేరగానే వెంటనే గుడికి వెళ్ళాము. గుడిలో కూడా చాలా ఆశ్చర్యకరమైన విశిష్టత ఏమిటి అంటే 12 జ్యోతిర్లింగాలు. భారత దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠాపన చేశారు. ప్రతి ఒక్క జ్యోతిర్లింగంతోటి ఆ గుడిలో పన్నెండు ఆలయాలు ఉన్నాయి. అది ఒక్కటే కాకుండా అక్కడ అమ్మవారి గుడి కూడా చాలా విశిష్టత కలిగినది. ఇవన్నీ కూడా 12 శతాబ్దాలలో కట్టారు అని వాళ్ళు చెబుతున్నారు. అవి అన్ని చూసి చివరికి వచ్చేసరికి అక్కడ యజ్ఞం చేసిన చోట మేము కాసేపు కూర్చుని అన్ని దేవుళ్ళని మొక్కి ఎన్నో ఫొటోస్ కూడా తీసుకొని ఆ జ్ఞాపకాల తోటి మేము రూమ్‍కి వచ్చాము. గదికి వస్తుండగా, దారిలో అక్కడ చాలామంది చేపలు పడుతున్నారు. తాజా చేపలని తీసుకొని వెళ్తున్నారు. మేము ముగ్గురం కలిసి ఒక నాలుగు కిలోల నారా తీసుకుని  దాన్ని మేము ఆ రోజు సాయంత్రానికి ఆర్డర్ ఇచ్చేసి రూమ్‌కి వచ్చేసాము. ఫుడ్ మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము. అందరం కలిసి పులిహోర, చపాతి తర్వాత పూరి రైస్, పప్పు ఇవన్నీ ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాం, ఎందుకంటే బయట కోవిడ్ ఉంది కాబట్టి బయటవి ఎక్కువ తినకుండా ఎవరిని కలవకుండా చక్కటి మెడిటేషన్ లాగా ఆరుగురం కూర్చొని అవి తింటూ ఆనందిస్తూ మేము సోమశిల ఎంజాయ్ చేసాము అన్నమాట. ఆరోజు మధ్యాహ్నం ఒక గంట సేపు అందరం కబుర్లు చెప్పుకుంటూ అలా సోలిపోయాము.

***

ఐదు గంటలకి మేము అందరం తయారు అయి టీ కొట్టు కి వెళ్ళాము. అక్కడ చక్కని టీ తాగి వేసి, అక్కడ సంగమంలో స్నానాలు చేద్దాము అని ఆలోచించాము. అక్కడ ఏడు నదులు కలుస్తూ ఉన్న స్థలంలో స్నానాలు చేయాలి అని చాలా ఉబలాటం, కానీ అక్కడ నీళ్ళు చాలా లోపల వరకు వెళ్లిపోయాయట. చాలా ఎండిపోయి ఉంది. దాని వల్ల స్నానాలు చేయలేరు కానీ అక్కడ నీటి తోటి మాత్రం రూమ్ లోనే స్నానాలు చేశాము. తర్వాత గుడికి వెళ్ళాము. గుడికి వెళ్లి అందరం కలిసి దర్శనం చేసుకుని అక్కడ నుంచి బోటింగ్ ప్లేస్‌కి వెళ్ళాము. ఆ బోటింగ్  దగ్గర ఆ రోజు పడవలు నడవట్లేదు. అంటే పెద్ద బోట్ ఒకటి ఉంటుంది, ఆ పెద్ద బోట్ నడపట్లేదు. అయితే ఫిషర్ మాన్ బోట్ ఒకటి మేము రెంటుకి తీసుకున్నాము. ఒక్కరికి  200 లెక్కన వాళ్లు తీసుకుని మమ్మల్ని అ బోట్ లోకి ఎక్కమన్నారు. మా వారికి ఈ మధ్యన చిన్నగా కాలు బెణికింది, టెన్నిస్ ఆడుతూ ఉంటే. ఆయన కొద్దిగా హెల్ప్ తోటి మెల్లగా కిందకి దిగి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అందరూ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. ఒక టెంపో కూడా వచ్చింది. ఆ చేపలు పట్టి టెంపోలో లోడ్ చేస్తున్నారు. ఇవి అన్నీ చూస్తూ మేము ఆ బోట్ దగ్గరికి వెళ్ళాము. అ బోట్ నీళ్ళలో కొద్దిగా జారుతూంది. అన్ని రాళ్లు రప్పలు, చాలా కష్టపడుతూ ఎక్కాం, రాళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటున్నాయి. అయినా అలాగే బోట్ ఎక్కడానికి ట్రై చేశాము. ఆ ఎక్కేటప్పుడు కూడా అందరు కొద్దిగా కష్టంగా ఎక్కవలసి వచ్చింది. ఇద్దరు ముగ్గురు సహాయం తోటి ఎక్కాము. అది చాలా హైట్‌లో ఉంది అన్నమాట. అయితే కష్టపడుతూ పైకి ఎక్కినా, పడవ ప్రయాణం ఎంతో చక్కగా ఎంజాయ్ చేశాము‌. అంటే లాహిరి లాహిరి పాట పాడుకుంటూ ఇంకా ఎన్నో ఎన్నో పాటలు పాడుకుంటూ చక్కగా అ బోట్‌లో సంగమేశ్వరం… అంటే ఇప్పటి వరకు సోమశిల తెలంగాణలో చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని సంగమేశ్వరం చూడడానికి ఈ బోట్లో బయలుదేరాము.

***

ఆ బోట్లో బయలుదేరుతూండగా, ఒక కొంగ ఆ చక్కటి పడవ మీద – చిటారు కొమ్మన మిఠాయి పొట్లం లాగా – ఒక చిట్ట చివరన నిలబడి నన్ను చూడు నా తీరు చూడు అని మమ్మల్ని కవ్విస్తూ ఉంది. ఆ కొంగని  ఫోటో తీసుకుని అక్కడి నుంచి మేము ఆ గుడికి బయలుదేరాము. దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు ఆ బోట్ ప్రయాణం చాలా ఆనందించాం. ఎంతో మంచిగా మేము బయలుదేరినప్పుడు లైట్‍గా వర్షం పడుతుంది. అయ్యో వర్షం ఎక్కువైపోతుంది అనుకోని రెండు గొడుగులు, నాలుగు క్యాపులు పట్టుకుని వెళ్ళాము. కాని అదృష్టం… వర్షం అక్కడితో ఆగిపోయింది. చక్కగా వెళ్లి ఒక చివరికి ఒక కొండ దగ్గరికి చేర్చి అక్కడ మేము మెల్లగా ఒక్కొక్కరు అందరూ సహాయం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఒక్కో ఒక్కరూ దిగి ట్రెక్కింగ్ చేశాము. ట్రెక్కింగ్ అంటే సంగమేశ్వరం గుడి కొండ మీద ఉందన్నమాట. అంతకు ముందు మేము వచ్చినప్పుడు మాకు కొండ కిందకి ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడేమో కొండ మీదగా ఉంది. ఎందుకంటే నీళ్లు అన్ని ఎండిపోయాయి కాబట్టి. ఆ కొండ చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఆ కొండ ఎక్కుతూ పాములు ఉంటే ఎలా అని భయపడుతూ అడిగాము.‌ లేదమ్మా పాములు ఏమీ లేవు అని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మమ్మల్ని పై వరకు తీసుకువెళ్లారు. అక్కడికి వెడుతుంటే – ఇక్కడ ఒక చిన్న స్టోరీ అంటే ఈ గుడి ఎందుకు కట్టారు అనేదానికి మన మహాభారతం కథ చెప్పుకొచ్చాడు ఆ బోట్ మాన్.

***

ఏడు నదులు కలయిక అనే చాలా విశిష్టతతో కూడుకున్నది ఈ సంగమేశ్వరం. సంగమేశ్వరం క్షేత్రంలో శివుడు – వేపచెట్టు మొద్దు నుండి తయారు చేయబడ్డ స్వామి. ఆయన స్వయంభువు. కర్నూలు సమీపంలో ఉన్న ఈ క్షేత్రం ఆత్మకూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సంగమేశ్వరానికి హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం సోమశిలకి వచ్చి అక్కడి నుంచి బోట్‌లో సంగమేశ్వరం చేరుకోవచ్చు. అయితే ఈ మహారాష్ట్రలో పశ్చిమ కనుమలో పుట్టిన కృష్ణానది సముద్రంలో కలిగే వరకు అనేక సంగమాలు ఉన్నాయి. ఇందులో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, వేమరధి, భవిష్యవాణి అనే నదులు ఈ క్షేత్రం నుంచి ప్రవహిస్తాయి. ఇందులో భవిష్యవాణి పురుష నదిగా కీర్తించబడింది. ఈ నది తూర్పు నుండి పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. మిగతా అన్ని నదులు పశ్చిమం నుండి తూర్పుకి ప్రవహిస్తాయి. అందుకే ఈ ప్రదేశం సప్తనది సంగమము అని, సంగమేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నదులు శ్రీశైలం గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. దక్ష యజ్ఞం జరిగినప్పుడు, దక్షుడు తన కుమార్తెను అవమానించగా, ఆమె ఆత్మాహుతి చేసుకున్నది ఇక్కడే అని అంటారు. అందుకే దేవునికి నివృత్తి సంగమేశ్వర అని పేరు వచ్చింది అని ఇచ్చటి స్థల పురాణం చెబుతుంది. ధర్మరాజు శ్రీకృష్ణుని ఆదేశం మేరకు ఈ సప్తనది సంగమంలో శివ పూజ చేసుకోవాలని అనుకున్నారట.

***

అందుకు కాశీ నుండి లింగం తెమ్మని భీముని పంపించాడు ధర్మరాజు. భీముడు సకాలంలో రానందున ధర్మరాజు అక్కడ ఉన్న వేప చెట్టు మొద్దుని శివలింగంగా తయారుచేసి పూజించాడట. తర్వాత వచ్చిన భీముడు తను తెచ్చిన ఐదు లింగాలని కోపంతో విసిరి వేసాడట. ఆ లింగాలు సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కుబుల్లేశ్వరం, సోమేశ్వరం అని ఐదు చోట్ల ప్రతిష్ఠితమయ్యాయి. ఈ శివ క్షేత్రాలలో పూజలను చేస్తున్నారు. ఆ తరువాత ధర్మరాజు భీముని శాంతింపజేసి మొదటి పూజ నువ్వు తెచ్చిన లింగానికే జరుగుతుంది అని మాట ఇచ్చాడట. అంత కోపం వచ్చింది కదా, అందువలన ధర్మరాజు భీముని శాంతింపజేశారు. నాటినుండి భీమ లింగాలకే  ప్రథమ పూజ జరుగుతుంది. ఇక్కడి విశేషం ఏమిటి అంటే లింగం కేవలం నాలుగు నెలలు మాత్రమే మనకి కనిపిస్తుంది. మిగిలిన ఎనిమిది నెలలు నీటిలోనే ఉంటుంది. వేల సంవత్సరాల చరిత్ర గల ఆలయం ఇది. ఈ ప్రదేశంలో అగస్త్య విశ్వామిత్ర వంటి మహామహులు ఎందరో తపస్సు చేశారు. మార్చి నుంచి జూన్ వరకు మాత్రమే శివుడికి పూజలు జరుగుతాయి. ఇచట ఈశ్వరుడికి ఎదురుగా నల్లరాతితో పొడవైన నంది విగ్రహం ఉంది.

***

వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి అక్కడ తిరుణాలు కూడా జరుగుతాయి. ఇది కమలాపురం సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం నుంచి వచ్చిన వారికి నాలుగు గోపురాలుగా ఉప ఆలయాలతో విశాలమైన ఆవరణలో ఉన్నాయి. ఆలయం గోపురం అత్యధిక శిల్పకళా వైభవంతో శోభిల్లుతుంది. చాళుక్యుల నిర్మాణ శైలితో అలలారే ఈ ఆలయాలు ఎనిమిది నెలలపాటు మునిగి కూడా ఇంత అద్భుతంగా ఉన్నాయి. ఇది గొప్ప విశేషం. ఇక్కడనే ఈ ఏడు నదులు కలయికతో ఉన్న సందర్శించే ముందు మనము స్నానం చేసి వెళ్ళాలి అంటారు. స్వామి వారిని మామూలుగా అందరూ చక్కగా ఇక్కడ వెళ్లి మొక్కుతూ ఉంటారు. అయితే భక్తులు ప్యాగిడ్యాల మండలం మేరకుల వద్ద ఉన్న భీమలింగం దర్శించుకుని, తర్వాత  వేపదారుల లింగాన్ని సమీపిస్తారు. అక్కడ ఇంత మొక్క పోగా ఆ మొద్దు లింగంగా పవిత్రంగా కనిపిస్తూ పూజలు అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తుంది. ఆలయ సమీపంలో అంబికా పరమేశ్వరులు, వినాయకుడు, భైరవుడు మనకు కనిపిస్తాడు. ఈ ఆలయం 2003 వరకు ఎవరికీ కనిపించలేదు. తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం కొంచెం తగ్గడంతో ఈ శివాలయం బయటపడిందట‌. నాటి నుండి భక్తుల రాక ఎక్కువైంది అని అక్కడి వారు చెప్పుతున్నారు.

***

ఇక్కడ కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఇది ఏడు నదుల సంగమము కనుక ఈ క్షేత్రంలో పిండప్రదానాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించిన పితృదేవతలకు పుణ్యలోకాలు సంప్రదిస్తాయి అని భక్తులు తమ పిత్రుదేవతలకు పిండప్రదానాలు కూడా చేస్తున్నారు. సంగమేశ్వరం స్వామి కోరిన కోరికలు తీర్చు దైవంగా ప్రసిద్ధి గాంచారు. కానీ స్వామి గురించి ఎప్పుడు ఎక్కువ మందిని పట్టించుకోకపోవడం ఎందుకంటే ఇది కూడుక పోవడం వలన ఎక్కువ ఉన్న ఆలయం నేల మట్టానికి  చేరుతుంది. ఆలయానికి సరైన దారి లేదు. దేవదాయ శాఖ శ్రద్ధ వహించకపోతే సంగమేశ్వరం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం వారు పూనుకోవాలి. నీటిలో ఉన్న జంగమయ్య నీటిలోనే అంతర్థానం అవుతాడేమో అని అనుమానం కూడా వస్తుంది. ఇక్కడ చక్కటి దారి ఈ మధ్యన వేస్తున్నారు. ఒక నదిలో స్నానం చేస్తేనే అనేక పాపాలు పోతాయని అని వేదాలు ఘోషిస్తున్నాయి. అలాంటిది సప్తనది సంగమంలో స్థానం ఎంతటి పవిత్రత? పైగా వేపదారుని లింగం పరమ పవిత్రం. దైవం వేపచెట్టు కింద మనకు లింగరూపంగా దర్శనం ఇస్తాడు. ఇంత ప్రసిద్ధమైన గుడిని మేము సందర్శించినందుకు ఎంతో సంతృప్తి చెందాము. చక్కగా బోట్ ప్రయాణం చేసి తిరిగి గదికి వచ్చాము. అక్కడి వంటవారు మేము పొద్దున్నే కొన్న చేపలని చక్కటి ఫ్రై చేసుకుని తీసుకొచ్చారు.

***

అందరం కలిసి ఆ ఫిష్ ఫ్రై తిని చక్కగా కబుర్లు చెప్పుకున్నాము. చిన్ననాటి స్నేహితులు మావారి ఫ్రెండ్స్ ముగ్గురు. నరసింహారెడ్డి, చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి కలిసి హ్యాపీ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు రాత్రి పడుకున్నారు. అయితే ఇందులో మా మరిది గారికి చాలా భయం. చాలా కష్టం కష్టంగా వచ్చారు ఎందుకు అని అంటే అందరితో కలిసి ఉండాలి అని. కాకపోతే అందరం ఎవరి రూమ్ వాళ్ళకి దొరుకుతుందని అనుకున్నాము అక్కడికి వెళ్లేసరికి దొరకలేదు. అందువలన ఆయన రాత్రి మొత్తం ఫేస్‌కి మాస్క్ వేసుకుని పడుకున్నారు‌. అది విచిత్రంగా అనిపించింది నాకు. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పులేదు‌. ఎందుకంటే ఆ రోజుల్లో కరోనా  భయంతోటి చాలామంది ఉన్నారు. అయితే ఉదయం ఐదు గంటల నుంచి ఒక్కొక్కరు లేవగానే స్నానాలు చేద్దామంటే అక్కడ హాట్ వాటర్ గీజర్ పనిచేయటం లేదు. అందరు చల్లటినీళ్లతోనే చేశారు. నేను ఒక రాడ్ వేసి నీటిని వెచ్చ చేయించుకుని హాట్ వాటర్ వేసి స్నానం చేసి బయలుదేరాను. మేము అందరం బయల్దేరుతుండగా – ముగ్గురం ఆడవాళ్లం – ఊరవతల ఉన్న ఎంతో పురాతనమైన శివాలయం చూద్దామనుకున్నాం. సోమశిల లోని ఆ గుడికి వెళ్లి అక్కడ నుంచి మేము గద్వాల్ వెళ్దామని మావారితో చెప్పాను. అయితే మాకు చాలా పనులు ఉన్నాయి. మేము వెళ్లి పోతాము. మీరు ముగ్గురు లేడీస్ ఇంకో కార్లో మీరు వచ్చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు‌.

***

మేము ముగ్గురం కలిసి జటప్రోలు వెళ్ళాము. అక్కడ ఎన్నో దేవాలయాలు. అగస్త్య మహాముని దేవాలయం… అలాగ దాదాపు ఒక 20 ఎకరాలు స్థలంలో 20 దేవాలయాల వరకు ఉన్నాయి అనుకుంటాను. ఇవన్నీ ఏమీ అంటే ఏ సౌకర్యాలు లేకుండా, కనీసం ఊడవకుండా ఉన్నాయి. చాలా నిర్లక్ష్యంగా అనిపించింది అక్కడ. కొన్ని దేవాలయాలలో మాత్రమే పూర్వవైభవం కనిపిస్తుంది. ఆ దేవాలయాలలో కేవలం ఒక్క అగస్త్య మహాముని దేవాలయం మాత్రం అక్కడ పూజలు అందుకుంటున్నది. ఈ దేవాలయం మాత్రమే అది చూసేసి మేము తిరిగి వస్తూ ఉంటే దారి మధ్యలో ఒక గుర్రం కనిపించింది. అక్కడ ఒక ఫోటో తీసుకొని… దూరంగా ఉన్న ఇంకొక గుడికి వెళ్ళాం. చాలా దూరం నుంచి బాగా కనిపిస్తుంది ఆ గుడి. ఇది మా ప్లాన్‌లో లేదు కానీ, ఆ గుడి చూసి చాలా సంబరపడ్డాం. అది ఎంతో ఎత్తున ఉన్న దేవాలయం. శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన దేవాలయం. శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన దేవాలయం ఈ నదిలో మునిగిపోయి అక్కడ డ్యామ్ కట్టినప్పుడు ఈ ఊళ్ళు అన్ని మునిగిపోయాయి. అయితే ఊళ్ళు మునిగిపోతూ ఉన్నప్పుడు ఈ కృష్ణదేవరాయలు కట్టిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్క స్తంభాన్ని ప్రతిదీ నెంబర్లు రాసి ఎలా ఉందో అలా  అక్కడి నుంచి తీసుకువచ్చారు. జటప్రోలు అనే స్థలంలో ఈ దేవాలయం పునః ప్రతిష్ఠ జరిగింది.

***

ఇక్కడ ఎంత చక్కగా ఉంది అంటే కన్నుల పండగ అన్నమాట. అందమైన శ్రీకృష్ణుని దేవాలయం! ఎంతో చక్కగా, అక్కడ ఉన్న పూజారులు ఎంతో విశిష్టంగా చేసిన అలంకరణ చూసి మైమరచిపోయాము ముగ్గురం. గంటన్నర పాటు స్వామిని పూజించాము. చక్కగా అక్కడ కూర్చొన్నాం. ఎంతో విశిష్టత ఉన్న ఆ దేవాలయంలో సమయం గడపడం ఎంతో సంతోషంగా అనిపించింది. తర్వాత అక్కడ ఉన్న ద్వారాల చెక్కటం చూస్తే ఒక ద్వారం ఒక్కటే దగ్గర వంద అడుగుల ఎత్తు ఉందేమో అన్నంత ఎత్తు ఉంది. అది ఎన్ని అడుగులు నాకు తెలియదు కానీ, చాలా చాలా ఎత్తులో ఉంది. అక్కడ వరకు స్తంభాలు అన్నిటిని కూడా శిల్పకళా నైపుణ్యం తోటి ఆ దేవాలయాన్ని చూసి మేము ముగ్గురం చాలా మైమరచిపోయాము. అక్కడ నుంచి గద్వాల్‌కి వెళ్లి గద్వాల్ నుండి మేము మా ఇంటికి చేరుకున్నాము.

ఎంతో సంతోషంగా అనిపించింది సోమశిల సందర్శన. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తూ ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here