సోమయ్య బుద్ధిబలం

0
12

[dropcap]సో[/dropcap]మయ్య తెలివిగలవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తగిన విధంగా సలహా ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించేవాడు. అనేక పురాణాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి వాటిలోని సూక్ష్మాలు వివరించి చెప్పేవాడు.

అలా అదే ఊరిలో రంగరాజు వ్యాపారం చేసేవాడు. పక్క ఊరికి వెళ్ళి బండిలో సరుకులు తేవాలని తన అంగడి ముందు నిలబడ్డాడు. అప్పుడే అటు సోమయ్య వస్తూ కనబడ్డాడు. అతన్ని తోడు తీసుక వెళితే బాగుంటుందని “సోమయ్యా, నేను కేశవపురం వెళుతున్నాను, నీవూ వస్తావా? సాయంత్రానికి తిరిగి వచ్చేద్దాము”అన్నాడు.

“సంతోషం, నాకు కూడా కేశవపురంలో పని ఉంది, నేనూ వస్తాను. ఒకరికి ఒకరం తోడు ఉన్నట్టు ఉంటుంది” అన్నాడు సోమయ్య.

ఇద్దరూ బండి ఎక్కి బయలు దేరారు. అలా కొంత దూరం వెళ్ళాక ఓ అడవి వచ్చింది. అడవిలో బండి కొంతదూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఇద్దరు దొంగలు కత్తులు ఝళిపిస్తూ బండిదగ్గరకు వచ్చి “ఉన్నదంతా ఇవ్వండి లేకపోతే చస్తారు” అని భయంకరంగా చెప్పారు.

సోమయ్య, రంగరాజు బండి దిగారు. దొంగల్లో ఒకడు కత్తితో సోమయ్య వద్దకు వచ్చాడు. దొంగల్ని చూసి రంగరాజు వణకడం మొదలు పెట్టాడు. కానీ దొంగల్ని చూసి సోమయ్య భయపడకుండా కత్తితో దగ్గరకు వచ్చినదొంగ చెయ్యి ఒడుపుగా పట్టుకుని మెలితిప్పి వాడిని కింద పడవేశాడు. సోమయ్య పట్టు, బలం చూసి రంగరాజు ఆశ్చర్య పోయాడు. ఇది చూసి రెండో దొంగ సోమయ్య మీదకు వచ్చాడు, వాడిని కూడా చేతులు వెనక్కు వంచి కింద పడవేశాడు, వాడి చెయ్యి విరిగినంత పని అయి వాడు బాధతో మూలగ సాగాడు. మొదటి దొంగ కాలు రాయికి తగిలి రక్తం కారసాగింది! వాడికి కళ్ళలో నుండి నీళ్ళు కారసాగాయి. ఇద్దరినీ బండిలోని పురికోస తాడుతో బంధించి బండిలో వేశాడు!

“ఈ కుస్తీ పట్లు నీకు ఎలా తెలుసు?”అని రంగరాజు ఆశ్చర్య పోతూ అడిగాడు.

“భైరవపురంలో కుస్తీల భీమయ్య వద్ద కుస్తీ విద్య నేర్చుకున్నాను. మనిషి ఏ విద్య నేర్చుకున్నా అది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగ పడుతుంది” అని చెప్పాడు సోమయ్య.

“మరి ఈ దొంగల్ని ఏంచేద్దాం?” అడిగాడు రంగరాజు.

“ఇద్దరినీ పట్టణంలో ఆసుపత్రికి తీసుక వెళ్ళికట్లు కట్టించి మందులు ఇప్పిస్తాను”

సోమయ్య మాటలు విని రంగరాజు ఆశ్చర్య పోయాడు. దొంగల్ని శిక్షించాల్సిందిపోయి చికిత్సచేయించడం ఏమిటని రంగరాజు ఆలోచించసాగాడు.

పట్టణం ఆసుపత్రిలో ఇద్దరికీ వైద్యం చేయించి ఇద్దరితో “దొంగతనం ఎందుకు చేస్తార్రా? బలంగా ఉన్నారు, పట్టణంలో పనివాళ్ళు దొరక్క అనేక సంస్థలు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. మనిషి జన్మ అన్నాక కష్టపడి సంపాదించి తినాలి, గౌరవంగా బతకాలి, వీలైతే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి. ఈ సారి దొంగతనం చేస్తూ పట్టు పడితే ఊరు కొత్వాలుకు అప్పగించి చెరసాలలో వేయిస్తాను.” అని కఠినంగా చెప్పాడు సోమయ్య.

దొంగలిద్దరూ సోమయ్య కాళ్ళ మీద పడ్డారు.

“అయ్యా, ఇక దొంగతనం చెయ్యము, మీరు చెప్పినట్టు కష్టపడి పనులు చేసుకుని గౌరవంగా బ్రతుకుతాము”అని ముక్త కంఠంతో చెప్పారు.

సోమయ్య బుద్ధిబలం,బలం, కరుణ చూసి రంగరాజు ఆశ్చర్య పోయాడు.

ప్రతి ఊరికి సోమయ్యలాటి ఉపకారి ఉండాలి అని రంగరాజు అనుకున్నాడు.

తరువాత ఆ పట్టణంలో సరుకులు కొనుక్కుని,కేశవపురం మీదగా సోమయ్య పని కూడా చూసుకుని తృప్తిగా ఊరికి వెళ్ళిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here