సొంత మనిషి

1
12

[శ్రీ చేకూరి రామలింగరాజు రచించిన ‘సొంత మనిషి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]శాంతంగా వుంది ఉదయం.

“కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దాలా కర్తవ్యం దైవమాహ్నికం”

శ్రావ్యంగా పాడుకుంటూ ఒక్కొక్క పువ్వు దేవుని పటం దగ్గర ఉంచి పారవశ్యంగా కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ పూజ చేసుకుంటోంది శ్రీలత. హఠాత్తుగా “నేను పక్కా లోకల్ పక్కా లోకల్” అంటూ బిగ్గరగా వినిపించేసరికి ఉలిక్కిపడింది. పనిమనిషి వరాలు వచ్చినట్టుంది. ఆమె అసలు పేరు వరలక్ష్మి. అందరూ వరాలు అని పిలుస్తారు. ఆమె సెల్ ఫోన్ లోంచి వస్తోందా పాట.

“ఏయ్ వరాలూ! పొద్దున్నేఆ పాటలేంటే, ఏ భక్తి పాటలో పెట్టుకోవాలిగానీ” అంది శ్రీలత మందలింపుగా.

“అలాగేనమ్మా మరి నాకు ఇట్టాటి పాటలే ఇష్టం.” అంటూ లోపలికి వచ్చి శ్రీలత పూజలో ఉండటం చూసి నాలుక్కరుచుకుంటూ పాట ఆపేసింది. చేతిలోని స్టీల్ బాక్సుని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. శ్రీలత పూజ ముగించుకుని వచ్చి ఆ బాక్సుని చేతిలోకి తీసుకుంది. లోపల ఏవో వున్నట్టుగా అనిపించి తెరిచి చూసింది. రెండు అరవిరిసిన గులాబీలు కనిపించాయి.

“అబ్బ భలే వున్నాయి ఎక్కడివే?” అడిగింది.

“మా దొడ్డ్లో పూసినయ్యి అమ్మగారూ! తల్లో పెట్టుకోండి, బావుంటుంది” అంది అభిమానంగా.

ఒక పువ్వు తీసుకుని జడలో పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది శ్రీలత. వరాలు సింక్ లోని అంట్లు తోముతోంది. శ్రీలత వంటకు సిద్ధం చేసుకోసాగింది.

“అమ్మ మీరో సాయం చెయ్యాలమ్మా!” అడిగింది వరాలు సామాన్లు కుళాయి కింద కడుగుతూ.

“ఏంటో చెప్పు”

“ఏం లేదమ్మా, మా పిల్లోడు ఐదో క్లాసుకి వచ్చాడమ్మా! కాన్మెంటులో యేశాను. ఆ కాన్మెంటోళ్ళు వొచ్చే ఆదివారం పేరంటాళ్ళ మీటింగంట, రమ్మని కబురుపెట్టారు. నాకేమో ఏం మాట్లాడాలో తెలీదమ్మా! మీరు ఓసారి వచ్చి ఆల్లతో మాట్లాడి, మా పిల్లోడికి బాగా సదువు చెప్పాలని చెప్పాలమ్మా!”

“పేరంటాల మీటింగు కాదు. పేరెంట్స్ మీటింగ్” అని నవ్వి “అలాగే ఆరోజు వెళదాం” చెప్పింది శ్రీలత.

“ట్యాంక్సమ్మా!” అంటూ పక్కనే వున్నఓ కాలిఫ్లవర్ తీసుకుని బుకేలా అందించింది. శ్రీలత నవ్వుతూ గరిటతో ఒకటి వెయ్యబోతే తప్పించుకుని దూరంగా జరిగి “అమ్మో! ఒగ్గేసి నా పని ఏంటో చెప్పండమ్మా!” అంది వరాలు తిరిగి నవ్వేస్తూ.

“అదిగో ఆ వాషింగ్ మెషిన్‌లో బట్టలన్నీ తీసి డాబామీద ఆరేసి రా!” అంది శ్రీలత. వాషింగ్ మెషిన్‌లో బట్టలన్నీ బయటకు తీసి టబ్‌లో వేసుకుని నెత్తిమీద పెట్టుకుని బరువుకి తూలిపడబోతూ సర్దుకుని “ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం..” పాట అందుకుని మెట్లవైపు వెళ్ళిపోయింది. ఆమె అల్లరికి నవ్వొచ్చింది శ్రీలతకు.

ఆమె భర్త సత్యేన్ద్రమూర్తి, ఎనిమిదేళ్ళ కొడుకు శశాంక్ లేచి తయారవుతున్నారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో జీఎం ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. త్వరగా వంట ముగించుకొని వాళ్లకు టిఫిన్ పెట్టి, లంచ్ బాక్సులు సర్ది వాళ్ళను పంపించింది. ఆ రోజు మంగళవారం ఆంజనేయస్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయాలనుకున్న విషయం గుర్తొచ్చింది. గబా గబా పూలూ, కొబ్బరికాయ చిన్నకవర్‌లో పెట్టుకుంది. ఇంతలో పనిముగించుకొని వరాలు కూడా క్రిందకు రావడంతో ఇద్దరూ బయటకు వచ్చి ఇంటికి తాళం వేసుకుని వరాలు ఇంటికి వెళ్లగా, తాను గుడివైపు బయలుదేరింది.

గుడిలో ఆవరణలో ప్రవేశిస్తుండగా “రామ్మా” అని పలకరించిన పూజారిగారు లోపలికివెళ్లి పళ్లెంతో వచ్చారు. ఆయన దగ్గరకు వెళ్లి పూలూ, కొబ్బరి కాయా ఆ పళ్లెంలో ఉంచింది. తర్వాత గంట మోగించి ఆంజనేయస్వామికి నమస్కరించుకుని ప్రదక్షిణలు ప్రారంభిచింది. కొన్ని ప్రదక్షిణలు అవుతుండగా ఒక కారు వచ్చి గుడి ముందర ఆగింది. అందులోంచి ఒకామె దిగింది. సుమారు ముప్పైఅయిదేళ్ల వయసుండవచ్చామెకు. మంచి ఛాయా, దర్పం ఉట్టిపడుతోందామెలో. కట్టుకున్న చీరా, పెట్టిన నగలు శ్రీమంతురాలని తెలియజేస్తూ ఉన్నాయి. డ్రైవర్ అందించిన పూలూ, పళ్ళూ, కొబ్బరికాయా ఉన్న బుట్టను తీసుకుని హుందాగా లోపలికి నడచివచ్చింది. ప్రదక్షిణలు పూర్తిచేసుకుని పూజారిగారి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకుంటోంది శ్రీలత. వచ్చినామె ఆయనకు “నమస్కారమండీ” అంటూ పూలబుట్టను అందించింది. “నమస్కారమమ్మా!” అని బదులిచ్చి వాటిని అందుకుని “పేరూ గోత్రం చెప్పండమ్మా!” అన్నారు పూజారిగారు. “తనూజ అండీ, కాశ్యపస గోత్రం” చెప్పిందామె. పూజారిగారు గర్భగుడిలోకి వెళ్లి నివేదన చేస్తున్నారు. శ్రీలత మండపంలో ఓ పక్కగా కూర్చుంది. తనూజ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చి శ్రీలతకు దగ్గరలో కూర్చుని పలకరింపుగా నవ్వింది.

బదులుగా నవ్వుతూ “నా పేరు శ్రీలతండి. మీరూ..” అంది అర్ధోక్తిగా. “నా పేరు తనూజ. ఈ వూరికి కొత్తగా వచ్చామండీ. మావారు ఎక్సైజు కమీషనరు. ఇక్కడే శ్రీనగర్ లో ఉంటున్నాం” చెప్పిందామె. మాటల్లో తమ ఇల్లెక్కడో శ్రీలత చెప్పడంతో తామిద్దరూ ఒకే వీధిలో ఉంటున్నట్టు గ్రహించారు. ఇద్దరూ లేచి బయలుదేరుతుండగా “వీలైనప్పుడల్లా దర్శనానికి వస్తూ ఉండండమ్మా, శుభం కలుగుతుంది” అన్నారు తనూజతో పూజారిగారు. “అలాగేనండీ!” అంటూ గుడి ఆవరణ బయటకువచ్చి శ్రీలత నడిచి పోబోతుంటే “రండి కార్లో విడిచిపెడతాను” ఆహ్వానించింది తనూజ.

“ఫర్వాలేదు దగ్గరేకదా, నే వెళ్తానండీ!” అంది శ్రీలత.

“రండి ఫర్వాలేదు” అని మరోసారి అడిగేసరికి సరేనంటూ కారెక్కింది. కారు వెళుతుండగా శ్రీలత కట్టుకున్న చీరవంక చూస్తూ “చీర చాలా బావుందండి. జాంధానీ చేనేత కదూ!” అడిగింది తనూజ.

“అవునండీ చేనేత చీరే, ఈ మధ్య ఉప్పాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను” చెప్పింది. ఇంతలో ఇల్లు రావడంతో “ఇక్కడే” అని కారాపి దిగుతూ ఉండగా “వీలు చూసుకుని మా ఇంటికిరండి” ఆహ్వానించింది తనూజ.

“అలాగే మీరుకూడా మా ఇంటికి వస్తూ ఉండాలి మరి” అంది శ్రీలత. కారు ముందుకు సాగింది.

అలా పరిచయమైన వాళ్లిద్దరూ ఒకరింటికి మరొకరు రాకపోకలతో స్నేహితులయ్యారు. ఒకరోజు తనూజ ఫోన్ చేసి తనకు ఉప్పాడ చేనేత చీరలు తీసుకోవాలని ఉందని, అక్కడ షాపుల్లో ఎక్కడ బావుంటాయి మీకు తెలుసును గనుక తోడు రాగలరా అనడిగింది. ఆదివారం పెద్దగా పనేమీ లేకపోవడంతో సరేనంది శ్రీలత. భర్తకు విషయం చెప్పి తనకూ పిల్లవాడికి టేబుల్ మీద భోజనం సర్దిపెట్టింది.

కాసేపటికి తనూజ కారు తీసుకుని రాగా వాళ్ళు ఉప్పాడ బయలుదేరారు. ఇంతలో శ్రీలత సెల్ ఫోన్ రింగవుతుంటే చూసింది. వరాలు చేసింది. అప్పుడు గుర్తొచ్చింది ఆమె కొడుకు స్కూలు పేరెంట్స్ మీటింగు వస్తానని మాట యిచ్చిన సంగతి. ఆన్సర్ నొక్కి చెప్పింది “వరాలూ మర్చిపోయాను ఏమనుకోకే, మరోరోజు ఇద్దరం తప్పనిసరిగా వెళదాం.”

“అలాగేనమ్మా!” అంది అవతలవైపు నుండి కాస్త నిరాశగా.

శ్రీలత ఉప్పాడలో తనకు తెలిసున్న మంచి షాపులన్నీ చూపించింది. తనూజకు చీరాల ఎంపికలో సహాయపడింది. షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు. మరునాడు తనూజ ఫోన్ చేసి చీరలు చాలా నచ్చాయనీ, చూసినవాళ్లంతా చాలా బావున్నాయన్నారనీ చెప్పింది.

తర్వాత పండుగులకూ, తన బంధువుల పెళ్లిళ్ల సందర్భంలోనూ వాళ్ళతో శ్రీలతను కూడా తోడు తీసుకెళ్తుండేది తనూజ. కొంత ఆసక్తీ, మొహమాటం వల్ల పిలిచినప్పుడల్లా వెళుతుండేది శ్రీలత. ఈ ఎడ తెరగని ప్రయాణాలతో వరాలు కొడుకు స్కూలుకు వెళ్ళడానికి తీరుబాటు దొరకలేదు శ్రీలతకు.

ఒక రోజు సత్యేన్ద్రమూర్తి ఆఫీసు పనిమీద రెండు రోజులు ఉండాలంటూ ఉదయానే ఊరికి వెళ్ళాడు. కాసేపటికి తనూజ ఫోన్ చేసి వాళ్ళ దగ్గర బంధువులెవరో పెళ్లి బట్టలకోసం వచ్చారనీ ఉప్పాడ వెళదాం తోడు రమ్మని కోరింది. శ్రీలత వాళ్ళాయన ఊరికి వెళ్లిన సంగతి చెప్పి పిల్లవాడు స్కూలునుండి వచ్చేసరికి ఇంటిదగ్గర ఉండకపోతే ఏడుస్తాడనీ.. ఏమీ అనుకోవద్దు రాలేనని చెప్పింది. తనూజ మళ్ళీ ఫోన్ చేసి వచ్చినవాళ్ళు తనకు బాగా దగ్గర బంధువులని, బాబు స్కూలు నుండి వచ్చేసరికి మళ్ళీ వచ్చేయొచ్చని నచ్చచెబుతూ రమ్మని అడిగింది. శ్రీలత సరేననడంతో తనూజ వాళ్ళ బంధువులతో రాగా కారులో వాళ్ళతో వెళ్ళింది.

ఉప్పాడలో ఓ చీరలషాపు ఎంచుకుని చీరలు చూడసాగారు. తనూజతో వచ్చిన బంధువులు షాపులోని అన్ని రకాల చీరలూ చూపించమంటూ చూస్తున్నారు. ధరల విషయంలో షాపతనికి వీళ్లకూ పొంతన కుదరటం లేదు. అతను విస్తుపోయేలా బేరమాడుతూ కాలయాపన చేయసాగారు. మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. అందరికీ ఆకలి వెయ్యడంతో తినడానికి ఏమైనా తీసుకురమ్మని డ్రైవర్ని పంపించారు. అతను దొరికిన బ్రెడ్ బజ్జీల లాంటివేవో తెచ్చాడు. అవి తిని ఆకలి తీర్చుకున్నారు. సన్నగా వర్షం కూడా మొదలయ్యింది. షాపువాడు సహనం కోల్పేయేస్థితికి చేరుకున్నాడు. చివరికి కొనడం పూర్తయ్యింది అనిపించారు. అప్పటికి సాయంత్రం ఆరు గంటలయింది.

తిరుగు ప్రయాణమయ్యారు. వర్షం ఎక్కువయ్యింది. ఇంటి దగ్గర కొడుకు ఎలా ఉన్నాడో అని ఆందోళన పడసాగింది శ్రీలత. కడుపులో తిప్పుతున్నట్టు అనిపించిందామెకు. మరో అరగంటకు శ్రీలత ఇల్లు రావడంతో ఆమెను అక్కడ దింపి తనూజవాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు. శశాంక్ సిటౌట్‌లో స్కూల్ బాగ్ పెట్టి వర్షంలో తడుస్తూ ఆడుతున్నాడు. వాణ్ని మందలించి తలుపుతీసి లోపలికి తీసుకువెళ్ళింది. వాడి తల తుడిచి బట్టలు మార్చి వాడికోసం వంటింట్లో పాలు కలుపుతుండగా కడుపులో తిప్పడం ఎక్కువై తలతిరగసాగింది. నిభాయించుకుని హాల్లోకి వచ్చి పిల్లవాడి చేతికి పాలగ్లాసు ఇచ్చి సోఫాలో కూలబడింది. హఠాత్తుగా కడుపులోంచి ఎగతన్నుకు వస్తున్నట్టు అనిపించి గబగబా వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. భళ్ళున వాంతయింది. తెరలు తెరలుగా వాంతులవ్వసాగాయి. నిస్సత్తువ ఆవరించగా అక్కడే గోడకు చేరి కూలబడింది. ఊపిరి అందక గుండె ఆగిపోతుందేమో అనిపించిందామెకు. ఈ హఠాత్పరిణామానికి భయపడిన పిల్లవాడు ఏడుస్తూ దగ్గరకు వచ్చాడు. వాణ్ణి ఫోన్ తీసుకురమ్మని మొదట తనూజకు ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పింది. అయ్యో ఇప్పుడే వస్తానంటూ సమాధానమిచ్చిందామె. వరాలుకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. “అయ్యో అమ్మా ఇదిగో నేను వచ్చేత్తాను” ఆదుర్ధాగా అంది వరాలు అవతలనుండి.

అప్పుడు రాత్రి 8 గంటలయ్యింది. వర్షం ఇంకా జోరుగా పడుతూనే వుంది.

కాసేపటికి వరాలు చేరుకుంది. శ్రీలత పరిస్థితిని గమనించి ఒక్క పరుగున ఆమె దగ్గరకు వచ్చి “అయ్యో ఏమైందమ్మా” అంటూ భుజం ఆసరాగా ఇచ్చి పైకిలేపి నడిపించుకుంటూ బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి మంచంమీద కూర్చోబెట్టింది. ఆమెకు మరోసారి వాంతవ్వబోతుంటే తన పమిట కొంగుతో మలినాన్ని పట్టి తీసుకువెళ్లి బాత్ రూమ్‌లో పోసింది. తర్వాత ఒక బకెట్‌తో నీళ్లు తెచ్చి శ్రీలత వంటిమీద మలినాన్ని తడిగుడ్డతో తుడిచి ఆమెను చీర లోంచి నైటీ లోకి మార్చి పడుకోబెట్టింది. అయినా ఇంకా స్థిమిత పడినట్టు అనిపించలేదు శ్రీలతకు. ఎదురు చూస్తున్న తనూజ ఇంకా రాకపోవడంతో వరాల్ని మరోసారి ఫోన్ చెయ్యమంది. వరాలు ఫోన్ చేసింది. అవతల ఎవ్వరూ ఎత్తలేదు. ఆ విషయం చెప్పింది వరాలు. ఒకసారి తనూజ వాళ్ళింటికి వెళ్లి వాళ్ళ కారు తీసుకువస్తే హాస్పిటల్‌కు వెళదాం అని చెప్పింది. అలాగేనమ్మా అంటూ వరాలు గొడుగు తీసుకుని బయటకు వెళ్ళింది. ఆమె తనూజ వాళ్ళింటికి చేరువవుతుండగా వాళ్ళు కారులో ఎక్కెడికో వెళుతుండటం చూసి విరమించుకుని వీధి చివరికివెళ్ళింది ఆటో కోసం. ఈలోగా శ్రీలత సత్యేన్ద్రమూర్తికి ఫోన్ చేసి తన పరిష్టితి తెలియజేసింది. అతను కంగారు పడుతూ త్వరగా హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పాడు. వరాలు ఆటో తీసుకుని వచ్చి శ్రీలతను శశాంక్‌ను ఎక్కించుకుని హాస్పిటల్‌కి బయలుదేరింది.

దారిలో ఉండగా సత్యేన్ద్రమూర్తి ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన వరాలుకు ఏ హాస్పిటల్ కు వెళ్లాలో చెప్పాడు. ఇంతలో తనూజ కూడా ఫోన్ చేసి డ్రైవర్ ఇంటికి వెళ్లిపోవడంతో రాలేకపోయానని చెప్పింది.

శ్రీలతకు జ్వరం వచ్చి ఒళ్ళు వేడెక్కింది. ఆటో హాస్పిటల్‌కు చేరుకుంది. అప్పటికే సత్యేన్ద్రమూర్తి డాక్టరుకు ఫోన్ చేసి ఉండడంతో సిబ్బంది బెడ్ సిద్ధంచేసి ఉంచారు. వీళ్ళు వెళ్ళగానే శ్రీలతను బెడ్ మీదకు చేర్చారు. డాక్టరు వచ్చి పరీక్షించి ఫుడ్ పాయిజనింగ్ వల్ల అయ్యిండవచ్చని చెప్పాడు. ఐ.వీ ఫ్లూయిడ్స్‌తో మందులు ఇస్తూ చికిత్స ప్రారంభించాడు. కాసేపటికి స్తిమితపడి నిద్రలోకి జారుకుంది శ్రీలత.

తెల్లవారు ఝామున మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే ఉన్న వరాలు “ఎలా ఉందమ్మా!” అనడిగింది. బాగానే ఉందంటూ తలఊపింది. రాత్రి శశాంక్‌ని సత్యేన్ద్రమూర్తి వాళ్ళ తమ్ముడు వరస బంధువు వచ్చి తీసుకువెళ్లిన సంగతి చెప్పింది. ఉదయం పదిగంటల వేళ డాక్టరు వచ్చి పరీక్షించి, ఇక ప్రమాదం లేదని, ఇంటికి తీసుకు వెళ్ళవచ్చని చెప్పాడు. ఇంతలో సత్యేన్ద్రమూర్తి కూడా రావడంతో ఆ సాయంత్రం డిశ్చార్జ్ తీసుకుని ఇంటికి చేరుకున్నారు.

మరునాడు ఉదయం విషయం తెలిసిన స్నేహితులు బంధువులు వచ్చి పలుకరించి వెళ్లారు. తనూజ కూడా వచ్చి సమయానికి రాలేకపోయానని బాధపడుతూ చెప్పింది. ఆమె వెళ్ళాక వరాలు వంట చేస్తే భోజనం చేసింది. ఆ మరునాటికి కాస్త ఓపిక వచ్చినట్లయి మెల్లగా వంటింట్లో పనులు చేసుకోసాగింది. ఇంతలో వరాలు వచ్చి “ఎలా ఉంది అమ్మగారూ!” అని పలుకరించి చీపురు తీసుకుని ఇల్లు ఊడవటం మొదలుపెట్టింది. శ్రీలత ఫోన్ రింగవుతుంటే తీసుకుని ఆన్ చేసింది.

“శ్రీలతగారూ! నేను ఉప్పాడ చీరాల షాపు సతీష్ నండీ” అన్నాడు అవతలనుండి.

“చెప్పండి సతీష్ గారూ! “

“మీతో వస్తుంటారే తనూజగారు, ఆవిడ మొన్నరాత్రి మా షాపులో కొన్న చీరలు కొన్ని మర్చిపోయారు. చెబుదామంటే ఆవిడ ఫోన్ నంబరు నా దగ్గరలేదు వాళ్ళను వచ్చి తీసుకెళ్లామని కాస్త చెబుతారా!”

“అలాగేనండీ! వాళ్లకు చెబుతాను” అంది శ్రీలత.

ఫోన్ పెట్టేసి తనపనులు చేసుకోసాగింది. కాసేపటికి ఆలోచిస్తుంటే ఒక సందేహం వచ్చింది. మొన్న అంటే తనకు ఆరోగ్యం విషమించిన రోజు. ఆ రోజు తనూజా వాళ్ళు మళ్ళీ ఉప్పాడ వెళ్ళారా?

“వరాలూ మొన్న రాత్రి తనూజ వాళ్ళింటికి వెళ్లి కారు అడిగి తీసుకురమ్మన్నాను. నువ్వు వెళ్ళావా?” అడిగింది.

“వెళ్లానమ్మా! నేనెళ్ళేసరికి ఆయమ్మగారు కారులో చుట్టాలతో ఎక్కడికో ఎల్త్తన్నారమ్మా! చూసి అటే ఎల్లి ఆటో తీసుకుని వచ్చాను” చెప్పింది వరాలు. ఆలోచనలో పడింది శ్రీలత.

“తరవాత మనం ఆటోలో హాస్పిటల్‌కి వెళుతుండగా డ్రైవర్ వెళ్ళిపోయాడు అంచేత రాలేదు అని ఫోన్‌లో చెప్పారమ్మా ఆయమ్మ” గుర్తుచేసుకుంటూ చెప్పింది వరాలు. అంటే తనూజ అబద్ధం చెప్పిందన్నమాట. విషయం అర్థమైన శ్రీలత విస్తుపోయింది. తనకు అంత సుస్తీ చేసినా వదిలేసి వెళ్లిపోవడం నిర్ఘాంతపరిచిందామెను.

కొంతకాలానికి ఒకరోజు శ్రీలత ఇంట్లో ఉండగా వరాలు వచ్చి ఇల్లు ఊడ్చుకుంటోంది. ఇంతలో తనూజ వచ్చి కాసేపు ఈ మాట, ఆ మాట అయ్యింతర్వాత “శ్రీలత గారూ ఎల్లుండి మా పిన్నీవాళ్ళు చీరలు కొనుక్కుందామని వస్తున్నారు. మీరు కూడా రాకూడదూ వెళదాం” అంది.

“ఇకనుంచీ నాకు రావడం కుదరదు తనూజ గారూ! అన్నట్టూ నాకు సుస్తీచేసిన రోజు మీరు షాపులో చీరలు మర్చిపోయారట. వెళ్లి తెచ్చుకోండి” ఆమె వైపు సూటిగా చూస్తూ. తనూజ నివ్వెరపోయి చూస్తుండగా చెత్తబుట్టను తెచ్చి వరాలుకి ఇచ్చి చెప్పింది “ఊడ్చిన చెత్త బయట కుండీలో వేసేసి రావే వరాలూ!”

తనూజ లేచి చిన్నబోయిన మొహంతో “వస్తాను శ్రీలతా!” అంటూ బయలుదేరింది.

వరాలు చెత్త బుట్టతో కుండీ వైపు వెళ్తోంది. ‘నిజంగా అవసరానికి ఆదుకునే మనుషులెవరో తెలియక ఇన్నాళ్లూ ఎంత పొరపాటుపడ్డాను’ అనుకుంది శ్రీలత. తిరిగివస్తున్న వరాలు తన సొంత మనిషిలా కనిపించింది. ఆమె మనసు తేలికపడింది. వరాలుతో చెప్పింది “నీ కొడుకు స్కూలుకు రేపువెళదాం వరాలూ!”.

వరాలు మొహం సంతోషంతో నిండిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here