సూరిగాడు బళ్ళో చేరాడు

    1
    5

    [box type=’note’ fontsize=’16’]ఉపాధ్యాయ వృత్తిలోని సాధకబాధకాలను… ముఖ్యంగా గిరిజన ప్రాంతాల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల వృత్తి జీవితాన్ని ఆలోచించేలా వ్యక్తం చేసిన కథ “సూరిగాడు బళ్ళో చేరాడు”. [/box]

    వెంకట్రావ్ సుబ్బారావులిద్దరూ రాంక్యాతండా బడిపంతుళ్లు. చిన్నబడి చింతలు లేని బడి అంటూ హాయిగా ఆడుతూ పాడుతూ బడికి వెళ్లివస్తుండే ఆ పంతుళ్ళకిపుడు మనసు మనసులో లేదు. వారి చూపులు వాలిపోయి నేలను చూస్తున్నాయి. దిగులుతో శుష్కించిన వారి శరీరం మాత్రమే బడిలో ఉంది. మనసు మరొక చోట తనువు తరగతిలో ఉండకూడదన్న ఉద్యోగధర్మం వారికి తెలుసు. నిజానికి వారి మనసులోనూ, వారి తనువులోని అణువణువులోనూ ఆ బడి క్షేమం, ఆ ఊరి బాగోగుల గురించిన తాపత్రయ మాత్రమే ఉంటుంది పాపం. కానీ జరుగుతున్న పరిణామాలకిపుడు కలత చెంది ఉన్న ఆ జంట పంతుళ్ళ బాధ వర్ణనాతీతం. అక్కడకీ ఆ పంతుళ్ళ జంట తిరగని ఇల్లు లేదు. మొక్కని దేవుడు లేడు. వెళ్ళని పుణ్యక్షేత్రం లేదు. సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది. బాధ పంచుకుంటే గుండె తేలికవుతుంది అంటారు. అందుకే అయిన వారికంటే ఆదుకునేదెవరు ? కన్నవారికంటే పంచుకునేదెవరు కనుక.! అందుకే ఆ ఆసాయంత్రం ఎవరి గూటిలో వారు గుండె గోడును తమ వాళ్ళతో పంచుకున్నారు.
    “ఎందుకు నాయనా సుబ్బారావు ఇలా రోజు రోజుకు నీరసించిపోతున్నావు..? ఆ బిత్తరచూపులు తత్తరమాటలు ఎందుకురా కన్నా.? ఏమి జరిగింది బంగారు?”
    “ఇప్పటిదాకా ఏమీ జరుగలేదు నాన్న. ఇక ముందు ఏమి జరగబోతుందో తెలియదమ్మా..?” ఆమె అంటూ ఇద్దరికీ జవాబు చెప్పాడు గుబులు గుబులుగా. అంతలో రేడియోలో “ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించగలరూ..” అన్న పాట వినబడడంతో. మనోడు మరింత దిగులు పడి కనుల నీరు నింపుకున్నాడు.
    ఇక్కడ మరో దృశ్యంలో.. ప్రపంచంలో అర్దాంగికంటే ఆలకించే వారెవరని తలచి. ఆమెతో చెప్పుకోవాలనుకున్నాడు వెంకట్రావు..
    ” అరూ.. అరూ..” అన్నాడు “ఏమిటండి ఏమయ్యింది..?” ఆమె లబలబలాడింది.
    వెంకట్రావు డబాడబా కొట్టుకుంటున్న బరువయిన గుండెను గుప్పిట్లో పెట్టుకుని ఒకసారి చేతులతో గుండెను అదిమిపెట్టి దిగులుతో కన్నీరునించాడు. అది చూసి విల విలలా డిపోయిన అరుంధతి
    “ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు ..? నేనేమయి పోయాను ఉన్నాను..” పాటాడింది.
    “నువ్వు.! నాకు ఎప్పటికీ ఉంటావు అరూ.. కానీ మా బడిలో పిల్లలు.. “ఆమె కొంగును తన నోట్లో కుక్కుకున్నాడు
    “ఎందుకని అసలెందుకనీ.. మీ ప్రభత్వ పంతుళ్ళకే ఇన్ని కష్టాలు..?” గుండెనిండా సానుభూతి చూపింది అరుంధతి. ఆపద వస్తే మెడలోని బంగారమంతా తాకట్టు పెట్టో, పుట్టింటివారిచ్చిన స్థలం అమ్మో అతని అవసరం తీర్చే త్యాగమయి అరుంధతికి మగని కష్టం ఎలా తీర్చాలో అర్ధంకాలేదు. రానున్న విధ్వంసాన్ని ఎదురొకావడానికి సన్నద్ధమవ్వడం తప్ప నాస్తి శరణం అనుకుని, “ఏమండీ కాస్సేపు అలా సుబ్బారావన్నయ్యగారి దగ్గరకయినా వెళ్ళిరండి. ఈ రెండు రోజుల్లో ఎదో ఒక మార్గం దొరక్క పోదు..” అంటూ పతిని పక్కసందులో ఉన్న సుబ్బారావింటికి పంపింది.
    * * *

    ఇలా రెండు దృశ్యాల్లోనూ వాళ్ళు తమ దుఃఖాన్ని మింగలేక కక్కలేక సతమవుతూ వారు పంచుకుంటున్న బాధలెట్టివనగా.. అసలెందుకనగా.. క్షణ క్షణంబులు ప్రభుత్వ చిత్తములు కదా..! రానున్న విద్యాసంవత్సర ప్రారంభంలోనే పంతుళ్ళ పోస్టుల భర్తీలు అని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటే ముందుగా పాత పంతుళ్ళ బదిలీలు జరగాలి. దానికంటే ముందు అర్హులయిన పంతుళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్లు వచ్చిన వారికి, కొత్తగా ఉద్యోగంలో చేరనున్న వారికి ఖాళీలు చూపెట్టాలంటే.. విద్యార్థులు ఉపాధ్యాయులనిష్పత్తి ప్రకారం పంతుళ్ళను బడులకు పంచాలి. హేతుబద్దీకరణ జరగాలి. అంటే అన్ని బడుల్లో పిల్లల పంతుళ్ళ సంఖ్య తేలిపోవాలి. తేలిపోవాలేమిటి..? విద్యాశాఖా పగలు రాత్రులు కూర్చుని అన్నీ తేల్చిపారేయ్యడానికి సిద్దమయిపోతుంటేనూ..
    ఈ లెక్కల చిక్కులకు ఎవరికి వారు, తాము పనిచేసే బడిలో ఉంటారో..? లేక ఎక్కడకయినా గెంటబడ్తారో అర్ధం కాక, ఉన్నచోటు కాపాడుకోలేక , కొత్త పోస్ట్ ఎక్కడ వస్తుందో తెలియక.. ప్రతి మండలంలో, ప్రతి బడుల్లోను పంతుళ్ళ గుండెల్లో జడివానల్లా అలజడులు మొదలయినాయి. సమాచారం తెలిసిన గంటలోనే వేలాది మంది పంతుళ్ళ వేళ్ళపయి ఈ నిష్పత్తుల లెక్కలు జరిగిపోసాగాయి. ఎక్కడ ఏ పంతులు ఉంటాడో..? ఏ పంతులు హేతుబద్దీకరణలో మరో చోటికి నెట్టబడతాడో మస్తిష్కంలో ఊహలు మొదలయిపోయినాయి. అందులో జూనియర్లు వెళతాలో సీనియర్లు వెళతారో..! ఎవరెవరు ఎన్నేళ్ళనుండి ఎక్కడ ఉన్నారో..? తేల్చుకోసాగారు. ఎక్కడికి వెళ్ళవచ్చో, ఎక్కడకు వెళ్ళలేమో అన్న ఊహలు బయలుదేరి, ఉన్న ప్రాంతం మీద మోహాలు చంపుకుని మొహాలు మాడ్చుకుని.. బదిలీలకు సిద్దమవ్వసాగారు.
    అసలు ఏ బడిలో ఎంత మంది పంతుళ్ళుంటారో..? కాదు కాదు అసలు బడులెన్ని ఉంటాయో..? ఎన్ని మూత పడతాయో కూడా ఊహా మాత్రంగా తెలిసిపోతుంటే గుండె జారి గల్లంతయిపోతున్నది. మన సుబ్బారావు వెంకట్రావులకే కాదు వందలాది మంది పంతుళ్ళ పరిస్థితిపుడు అయోమయంలో ఉన్నది.
    “అసలు ఏంటమ్మా ఈ పరిస్థితి. జనాభా ఇంతలా పెరిగిపోతున్నది అంతలా పెరిగిపోతున్నది అంటారు గాని.. మా సర్కారు బడుల్లో పిల్లలు లేక, మా బడి పొయ్యిలో పిల్లులు వెచ్చగా పడుకుంటున్నాయి తెలుసా?” ఆక్రోశించాడతను.
    “అదేమిటిరా..! అలా అంటావు. మా చిన్నప్పుడు మేమంతా సర్కార్ బళ్ళోనే చదివాము తెలుసా ” అన్నారు నాన్నారు
    “అవునండీ ఉన్న ఊర్లో ప్రభుత్వ బడి వదులుకుని సొమ్ములు పోసి ఎక్కడెక్కడికో పంపి చదివించడం ఏమిటి ? మరీ సోద్యం కాకపోతేనూ.. ”
    “సోద్యమేనమ్మా..! సాధ్యము కాదిక మా బడి పిల్లల సంఖ్య పెంచుట.” వెంకట్రావు ఉవాచ.
    ” మా ఊరు వాళ్ళో, పక్కనే పల్లె వాళ్ళో ఓ పదిమంది పిల్లలను ప్రైవేటు బల్లకు గాకుండా మా సర్కార్ బడికి పంపిస్తే తిరుపతిలో నిలువు దోపిడీ ఇస్తామని నేను. శిరిడీలో వందమందికి అన్నదానం చేయిస్తామని వెంకట్రావ్ మొక్కుకున్నాం. పడిగెలు వేస్తామని నాగేంద్రునికి, కోడిని కోయిస్తానని అమ్మ వారికి ఇద్దరమూ మొక్కుకున్నాము..” నుడివిన వాడు సుబ్బారావ్.
    “ఎందుకంటే.. ఎందుకంటే..నలుగురు పిల్లలు వస్తే ఈ ఊరికి బడి నిలుస్తుంది. మాకు మా పోస్ట్ నిలుస్తుంది అని. పిల్లలు తగ్గితే ఒక పోస్ట్ పోతుంది.” వేదనా భరితమయిన ఆ గళం వెంకట్రావ్ ది
    “వంటరి వాడయినా బడి పంతులు పరిస్థితి మీకు తెలియదు నాన్న. అటు పిల్లలకు పాఠాలే చెప్పాలా.! బియ్యం కొలిచి పప్పు దగ్గరుండి కడిగించి, గుడ్లు లెక్కపెట్టి, ఉడికించిన గుడ్లు శుభ్రంగా వలిపించి బువ్వ దగ్గరుండి పెట్టించి.. ఆ లెక్కలే చూసుకోవాలా.? చదువులే చెప్పాలా.? వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడాలా.? సుబ్బారావు సూటి ప్రశ్నలు సూదుల్లా గుచ్చుకుంటుండగా..
    “అమ్మా..! మా అవసరానికి ఎమ్ ఈ ఓ కి దగ్గరకు వెళ్లినా, పాఠ్య పుస్తకాలకోసమో, ప్రశ్నాపత్రాలు వచ్చాయంటే తెచ్చుకోడానీకే వెళ్లినా, బియ్యం వచ్చాయంటే వెళ్లి తెద్దామన్నా.. టీసీ క్లాస్ ఉన్నదని వెళ్లినా ఊరి వాళ్లంతా బడివదిలి బలాదూర్ తిరుగుతున్నారని మా వంక అనుమానంగా చూస్తారమ్మా infofurmanner.de.” శీల పరీక్షకు నిల్చున్న సీతకథ చెబుతున్నట్లుగా బోరుమన్నా రు సుబ్బారావ్ వెంకట్రావ్ లు..
    వారిద్దరినీ ఎలా ఓదార్చాలో అర్ధంకాక ఆ పెద్దాళ్ళిద్దరూ వెర్రిచూపులు కొనసాగిస్తుండగా సుబ్బరావింటికి వీరయ్యసార్ కూడా వచ్చారు. సంతాపసభకి హాజరయిన వాడిలా లోనికి వచ్చినిశ్శబ్దంగా ఓ కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికే కంటికి కడివెడుగా ఏడ్చినట్లుగా అతని ముఖం ఉబ్బిపోయి కళ్ళు ఎర్రబారి జుట్టు చెదిరిపోయి ఉంది. ఒక విషాద సమయంలో ఒకరినొకరు ఎలా పలుకరించుకోవాలో తెలియక అక్కడ మౌనం రాజ్యమేలుతున్నది.
    పరిస్థితి అర్ధం చేసుకున్న రాజ్యలక్ష్మి వీరయ్య సార్ కోసం ఒక కప్పు టీ తీసుకోస్తూ మరోసారి వెంకట్రావుకు, సుబ్బారావుకు కూడా తీసుకువచ్చింది. ముందు కాసిన్ని చల్లని మంచినీళ్లు తాగి బాధను దిగ మింగడానికి ప్రయత్నించాడు వెంకయ్య. బాధను దిగమింగడంమంటే అదేమన్నా విటమిన్ టాబిలెట్ మింగడం కాదు కదా.. సాధ్యం కాలా. అందుకే గుటకలు గుటకలుగా టీ తాగుతూ గుండెభారాన్ని తగ్గించుకోవాడానికి శతధా ప్రయతించసాగాడు.
    “నాయనా వీరయ్యా.! నీ బాధేమిటో కూడా చెప్పునాయనా..” జానపద కథల్లో కామనలు తీర్చే కల్పవల్లిలా అడిగింది రాజ్యలక్ష్మి. ఒక్క పలకరింపుకే అతని కన్నుల్లో కన్నీటి చిలుకరింపు ఆరంభమయ్యింది.
    “అమ్మా నేను పనిచేసే రామ్ సింగ్ తండాలో పదిమంది బడి పిల్లలున్నారు. ఉన్నది పదిమందే కదా అని వదిలేస్తే ఆ పిల్లలు అయిదు మైళ్ళ దూరంలో ఉన్న పక్కూరికి వెళ్లి చదువుకోవాలి. ఊర్లో ఉన్న బడి మూతపడితే ఇక ఆ పెద్దలు వారిని బడికి పంపకుండా కూలికే పంపుతారు. అందుకే నేను మొండిగా ఆ బడిని నడిపిస్తున్నాను. కానీ, కానీ రోజూ నేను వెళ్లే సమయానికి. ” చెప్పలేక తల వంచుకున్నాడు.
    జీన్ పాంట్ మీద జారిపడ్డ రెండు కన్నీటిబొట్లు మీద తామరాకు మీద నీటిబొట్లలా మెరవసాగాయి. అక్కడ కూర్చున్న వారి గుండెలు భారం కాగా, బ్రేక్ తరువాత వచ్చే సీరియల్ కోసం చూస్తున్నట్లుగా వీరయ్య వంక చూడసాగారు.
    “అక్కడ.. అక్కడ మా బడిలో” అతను శూన్యంలోకి చూస్తూ.. మళ్ళీ ఆపాడు. వారు కూడా ఆశూన్యంలో అతని బడి కనపడుతుందేమో పరీక్షగా చూసారు.
    “ఆపావేం, చెప్పునాయినా.” రాజ్యలక్ష్మి అన్నది.
    “అక్కడ మాబడిలో.. బర్రెలు కట్టేసుకుంటున్నారమ్మా. నీ బడి యాలకు వీటిని ఇప్పుకుని మేతకు దీస్కపోతాం గదా పరేషాన్ గాకు సార్ ” అంటున్నారు.
    “అయ్యో .. అయ్యో అది బడనుకున్నారా బర్రెల దొడ్డి అనుకున్నారా. ఇదేమీ చోద్యం.. ?” నోరు నొక్కుకుంది రాజ్యలక్ష్మి. సుబ్బారావు తండ్రి సదాశివరావు కూడా కదిలిపోయాడు.
    వీరయ్య అదే శూన్యంలోకి చూస్తూ “అంతే కాదమ్మా పదిమంది పిల్లలకు ఆ గది చాల్లే సారూ అంటూ నా కళ్ళముందే బడి వరండాలో పత్తి ఆరబోసుకుంటున్నారు..”
    “ఆ ఉన్న పదిమందిలో నలుగురు పిలగాళ్లు రానేరారు. ఎందుకు సార్ అరుస్తారు అంటున్నారు.”
    “ఎందుకు రారయ్యా కాస్సేపట్లో వస్తారు. వాళ్ళు మా బడి పిల్లలు. పౌరుషంగా అనబోతే..”
    “రారు లే సార్ వాళ్ళు మా పిల్లలు. మిరప తీస్తానికి మేము పొద్దుగాల్నే చేనుకు బంపినంలే.” అని తేల్చి చెప్పుతారు.
    “నేను వాళ్ళతో మాట్లాడుతుంటే మిగిలిన ఈ నలుగురూ పిల్లలు వెళ్లి బండిచక్రాలాట, బంతాట ఆడుకుంటుంటారు. నేను మళ్ళీ ఆ నలుగురిని కూడేసుకుని వారికి ఇంత కూడు ఉడకేయించి వారికి పెట్టి రేపు తప్పకుండా బడికి రండిరా అని చేతిలో చెయ్యి వేయించుకుని పంపుతున్నానమ్మా..! ఇప్పుడీ హేతుబద్దీకరణ.. బదిలీలులో మా బడి ఏమౌతుందో నన్ను ఏ శంకరగిరి మాన్యాల్లో పడేస్తారో..? అక్కడ ఎంతమంది పిల్లలుంటారో..?” అతని చూపులు ఇంకా శూన్యంలోనే ఉన్నాయి.
    “ఈ బాధలన్నీ తలుచుకుని వెర్రి వాళ్ళయ్యేలా ఉన్నారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు సుమా.” అనుకున్నారు సుబ్బారావు తల్లిదండ్రులు. “కష్టాలు కలలకాలం ఉండవు నాయనా రేపటినుండి ‘బడిబాట’లో పట్టుదలగా చుట్టుపక్కల నాలుగు పల్లెలు తిరిగిరండి. పల్లెకు ఇద్దరు పిల్లలు చేరినా బడిలో నలుగురు పిల్లలు కనపడతారు. వీరతిలకం దిద్ది కదనరంగానికి పంపుతున్న తల్లిలా అన్నదామె. గుండె చిక్కబట్టుకుని కొలువును కొనసాగించడానికి ఆయత్తమయ్యారు వాళ్ళు.
    * * *
    అది మార్చి చివరివారం. మండుటెండలు మాడును మాడుస్తున్నవేళ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. బడులు నింపడానికి పంతుళ్ళంతా పట్టుదలగా పల్లె పల్లెకూ తిరుగుతూ పిల్ల పిల్లాణ్ణి బతిమాలుతూ తిరుగుతున్న సమయం.
    “అమ్మా.! బడి పంతుళ్ళమొచ్చాము.” గేటు ముందు నుంచుని అరిచి మెల్లగా లోనికి వెళ్లారు వాళ్ళు.
    “బాబు.. మీ ఇంట్లో చిన్నపిల్లలెవరయినా ఉన్నారా..?” మరో రెండడుగులు లోనికి వేసి కొద్దిగా గట్టిగా అడిగారు. ఇంతలో లోపలినుండి ఓ తల్లి ఆమె వెనుక ఇద్దరు పిల్లలూ వచ్చారు.
    “ఆ ఉన్నారు. ఉంటే ఏందంట. ?” చిన్న పిల్లను ఎత్తుకుపోడానికి వచ్చిన ముఠాదొంగలను చూసినట్లు చూసి కసిరిందా ఇంటామె..
    “అమ్మా.! మేము ఈ ఊరి బడిపంతుళ్ళం. మీ పిల్లను మా బడికి పంపండి. మేము నాణ్యమయిన చదువు నేర్పుతాము” వినయంగా అనేకంటే దీనంగా చెప్పాడు వెంకట్రావు .
    “లే ..పంపం. మా పోరడిని ఇంగ్లీష్ మీడియాలా ఏస్తున్నం.” ఇక మీరు వెళ్లొచ్చు అన్నరీతిలో అన్నదామె
    “అయ్యో తల్లీ.! కొంచెం మా మాట విను. ఇప్పుడు సర్కార్ బళ్ళో గూడా ఇంగ్లీష్ మీడియం పెడ్తున్నాం.” మానవ ప్రయత్నలోపం ఉండరాదన్న ఆశతో చెప్పాడు. ఈ సందడికి ఒకరికి నలుగురు ఆడవాళ్లు వాళ్ళు మొగవాళ్ళు అక్కడ వాళ్ళు చేరడంతో రెట్టించిన ఉత్సాహంతో..
    “మీ పిల్లను మా బడిలో చేర్పించండి. ఉచితంగా పుస్తకాలిస్తున్నాం. సంవత్సరానికి రెండు జతల బట్టలిస్తున్నాం, రోజూ సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాం. వారానికి మూడు గుడ్లు పెడుతున్నాం.” ఒకరి తరువాత ఒకరు వంతలు పలికారు.
    “మీరు రోజూ గుడ్లుపెట్టినా. కోళ్లే పెట్టినా మా పిల్లలు మీ బడికి రారు.” తెగించి చెప్పిందొకామె.
    “ఎందుకమ్మా అంత మాటన్నావు. ?” గారాబంగా గొణిగాడు సుబ్బారావు.

    “ఎందుకనొద్దు. ఏళ్ళకొద్దీ మీ బడికి సున్నాలే వెయ్యరు. గా “బడ్స్ బడ్స్” బడిలా గోడలనిండా రంగు రంగుల బొమ్మలే..” ఆ మెచ్చుకోలు చూసి చిన్నబుచ్చుకున్నారిద్దరూ. పోనీ చెరో పదివేలు వేసుకునికి మన బడికి సున్నాలేపిద్దామా..?” ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అనుకున్నారు.
    “ఆ ‘ గోల్డెన్ కిడ్స్’ బడిలో చూసిండ్రా బూట్సులు, టై, బెల్ట్ లు వారానికి మూడుతీర్ల డిరెస్ లు..”మళ్ళీ వారిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు.
    “గా ‘జాస్మిన్’ బడిల ఏసినమంటే ఇంటి ముందుకే రంగుల బస్ వస్తాంది సక్కంగా ఎక్కించుకుని తీస్కపొయి మల్ల ఇంటి ముంగటికే దీస్కొస్తున్నారు..”
    “ఇగ మా పిల్లగాళ్ళు ఇంటికి రాంగానే ముద్దుగా ‘మమ్మీ డాడీ’ అనుకుంట ఇగ అంతా ఇంగిలీశే మాట్లాడుతున్నారు..”
    “మా ఊరికి బస్సే రాదు. మీ బడికి బంపాల్నంటే ఆటోలల్ల పోయి ఆగమయిటున్నాం మీరు గిట్ట బస్ ఏసేదుంటే సెప్పుండ్రి..”
    ఇక వాళ్లు ముఖా ముఖాలు చూసుకోలేక, ఆ రూట్ లో ఆర్టీసీ బస్ కూడా రాదు ఆటో వాళ్లు వేలకు వేలు తీసుకుంటారన్న సత్యం ఎరిగిన వారయి, కాస్సేపు అందరి ముఖాలు చూస్తూ కాస్సేపు నిలబడిపోయారు. అయినా పట్టు వదలకుండా.. ప్రభత్వబడుల్లో చేరడం వల్ల పలువిధాలుగా కలిగే లాభాలు, పొందే ఉచిత సౌకర్యాలు ఒకరి తరువాత ఒకరు ఏకరువు పెట్టారు. ఊహు హరికథ విన్నట్లు విని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. చేసేదేమి లేక మరో సందులోకి వెళ్లారు అక్కడ పంతుల్లొచ్చారని చుట్టూ నలుగురు చేరారు. వెంకట్రావ్ కి సంతోష కన్నీళ్లు పొంగాయి.
    “ఇంకా మానవత్వం వట్టిపోలేదు “ఇంకా పంతుళ్ళను చూసి పలుకరించే వారులన్నారు. రండి అంటూ కుర్చీలేసి కూర్చోబెట్టేవారున్నారు. నువ్వున్నావు దేవుడా..! నువ్వున్నావు..!” అనుకుని కూర్చున్నారు . మరొకరు ఫ్రీజ్ లో నుండి మంచినీళ్ల సీసా తెచ్చారు. అంత ఎండలో ఆ నీరు తాగుతుంటే అమృతం గ్రోలుతున్నట్లనిపంచింది. గుండెలోని బాధ తీరేలా గట గటా తాగారు. ఆ చెట్లకింద ఏ సీ అలా అనిపించింది. తమ చుట్టూ చేరిన వారిని చూసి ఇక్కడ తప్పకుండా ఒకరో ఇద్దరో తమతమ పిల్లలను సర్కార్ బడుల్లో చేరుస్తారన్న ఆశ పుట్టింది. గొంతు సరి చేసుకుని అక్కడున్న ఒకాయన భుజంమీద చేయి వేసి..
    “ఏం తమ్ముడూ మీ ఇంట్లో ఓ అమ్మాయి ఉందనుకుంటా కదా మన బడికి పంపించు మరి..” అన్నాడు
    అంతే ఒకామె తారాజువ్వలా ఎగిరిపడుతూ వచ్చింది. ” పోయినేడు మీ బడికాడికి వచ్చి అయ్యా మా పిల్లకు నాలుగేళ్లు వడ్డయి. బడిల ఏసుకొమ్మంటే.. యాడా ఇంకా ఐదో ఏడు రాలెగదా అన్నావు యాదికుందా.. ఆ తెల్లారికే “బడ్స్ బడ్స్” బడోళ్ళు అచ్చి మంచిగ స్కూల్ బస్ ల దీస్కపోయి పిల్లను జేర్చుకున్నారు. అంతే మా యారాలు కొడుకు, మా తమ్ముని బిడ్డా అందరినీ ఆడనే శేరిక్ జేసినం. అందరుగూడి మంచిగా పోయొస్తున్నరు.”ఆమె కచ్చగా అన్నది.
    “గా గోల్డెన్ కిడ్సోడు నా నాలుగేళ్ళ కొడుకుతో పాటు మూడేళ్ళ పిల్లనుగూడా బడిల జేర్చుకున్నరు. ఇగ మీ బాదేందుకు మాకు ..” అనేశాడు. వెంకట్రావు సుబ్బారావు తలలు దించుకుని నేల చూపులు చూసారు. పిల్లవాడికి ఐదేళ్లు వస్తే తప్ప అడ్మిషన్ ఇవ్వరాదన్న సర్కార్ రూలా మా బడుల కొంపలు ముంచుతున్నది. “అయిపోయాం ఇక” వెంకట్రావ్ అనుకున్నాడు .
    “గోల్డెన్ కిడ్సోడు, బడ్స్ అండ్ బడ్సోడు.. బడ్స్ దశలోనే మన ఊరి పిల్లలను కిడ్నాప్ చేసుకెళ్లి పోతున్నారు..” సుబ్బారావ్ గుండెల్లోనే బోరుమన్నాడు. ఇద్దరూగుండెల్లోని బాధను పైకి తెలియనివ్వని స్థిత ప్రజ్ఞత్వం.. ముఖానికి పులుముకుని అక్కడనుండి వెనుతిరిగారు.
    * * *
    మర్నాడు మళ్ళీ దగ్గరలో ఉన్న మరో పల్లెకు వెళ్లారు. వీళ్ళను చూసి పిల్లలు కొందరు పక్క పాకల్లోకి పారిపోతున్నారు.
    “మరుగేలరా ఓ రాఘవా..” అన్న పాటను గుండెల్లో నొక్కి పట్టి.. “రారా బాబు రారా తండ్రి రారా మన బడికింకా నువ్వురారా..” అని పాడుకున్నాడు
    “మీ బడికి బంపితే మా పిల్లలకు సదువులు రావు ..?” తేల్చి పారేశాడో పల్లియుడు
    “అదేంటి అలా అంటారు. మా సుబ్బారావ్ సార్ పీ హెచ్ డీ, నేను ఎమ్మే ఎమ్మెడ్ తెలుసా..?” పౌరుషంగా అన్నాడు.. వెంకట్రావ్.
    “మీరు ఎంత సదివితే మాకేంది..? మీ బడిల అయిదోది దాంక ఉన్నా బడిల ఉండే సార్లు మాత్రం మీరిద్దరే. ఏది జెప్పాలన్నా మీ ఇద్దరే చెప్తరు. మేం జూస్తల్లేమా ఒకళ్ళకి వండిచ్చుడు, తినబెట్టుడు, వాటి లెక్కలు జేసి పంపుడు గిదే సరిపోతున్నది. ఏందో నెల నెల మీటింగ్ లని.. ఇంకేదో క్లాసులనీ ఒగరు బోతే ఇంకొకరుంటారు. వాళ్లు పాఠాలే జెప్తారా..? వంటోళ్లకు బియ్యాలు పప్పులు గొలిసిచ్చి, గుడ్ల లెక్కజూసి, ఏ కులపోళ్ళు ఎంతమంది దిన్నారో లెక్కజేసేటాళ్లకే ఒగ పూటంతా అయిపోతది. గా ‘రోజ్ కిడ్స్’ బడిలో ముప్పయి మంది టీచర్లు. ఒకసారి లోపలకు పంపినమా అంటే మళ్ళీ ఇంటిబెల్లుకే గేటు దీసేది.” అన్నాడు. దూషణ భూషణ తిరస్కారాలు శ్రీరామునకే గాని మనస్సునకంటావు అంట కూడదు అని నిశ్చయించుకున్నవారయి.. అసలే అవేమీ వినపడనట్టుగా చూస్తూ..
    “మీరు ఎందుకలా అంత సొమ్ము ఖర్చు పెట్టుకుని బయట చదివిస్తున్నారో అర్ధం కావడంలేదు మాకు. వాళ్ళు చెప్పినా అవే పుస్తకాలు మేము చెప్పినా అవే పాఠాలు. ఆ పుస్తకాలు కూడా మేమే ఉచితంగా ఇస్తాము..ఇలా ఎన్నెన్నో చెబుతూ మళ్ళీ అదే పాట యుగళగీతం పాడారు. కొందరు సానుభూతిగా విన్నారు. కొందరసలు వినడానికి కూడా ఇష్టపడలేదు. అయినా సరే పట్టు వదలకుండా మారో పది రోజులు తిరిగి గడ్డము పట్టుకుని బతిమాలి, చేతులు పట్టుకుని నచ్చచెప్పి పదిమంది పిల్లలను రాంక్యా తండా ప్రాధమిక పాఠశాలలో చేరుస్తానికి ఒప్పందం చేసుకుని వచ్చారు. అక్కడ వెంకయ్యసార్ మరోచోట అరుణామేడం భారతీమేడం దాదాపు అందరి పరిస్థితి ఇదే . ఇక వేసవి సెలవలు వచ్చాయి. పిల్లలూ పంతుళ్ళూ అన్నీ మరచి సెలవులను ఆనందించే పనిలో పడ్డారు.
    * * *
    వేసవి సెలవలు ముగిసాయి ఎందరో బడికి వెళ్లే బస్సుల్లో ఒకరికొకరు పలకరించుకున్నారు. అరుణ , పార్వతీ, భారతీ టీచర్లు కలిశారు. .
    “అంత పెద్ద లగేజ్ ఏమిటి అరుణా మేడం.?” అడిగాడు వెంకట్రావ్.
    “బడిబాటలో అనుభవంతో మా టీచర్లంతా తలొకింతా వేసుకుని ఉన్న ఎనభయి మంది పిల్లలకు బూట్లూ బెల్ట్ టైలూ కొన్నుకెళ్తున్నాం సార్ ..” అలాగన్న బడికి వస్తారన్న ఆశతో గుస గుసగా చెప్పారు ఇద్దరు టీచర్లు. బస్ కి మరో వైపు నుండి దిగిన రంగారావు మాస్టారు దింపుకున్న మూట చాకోలెట్లూ బిస్కెట్లదట.
    తానూ కొన్న పెన్సిల్ బాక్స్ ల పెట్టె వంక చూస్తున్న సుబ్బారావ్ ని చూసి ” ఇవ్వన్నీ పిల్లలను బడిలో చేర్చడానికి ప్రోత్సహాకాలండీ” అన్నాడు సూర్యారావు సార్. ఎందుకయినా మంచిదని ముందు రోజే బాగ్స్ మూట బడిలో దింపి వచ్చిన విషయం బయటకు చెప్పలేదు. అరవయిమంది పిల్లలకు ఒక జత బట్టలు కొనుక్కుని తీసుకెళ్తున్న విశ్వనాధం సార్ బస్ లో రాలేదు. కానీ ఎవరికీ తెలియదు అనుకుంటూనే అన్ని విషయాలు ఒకరివి ఒకరికి తెలిసి పోతున్నాయి.
    ఉద్యోగపు తొలి రోజులల్లో కూడా పడనంత టెన్షన్ తో సుబ్బారావ్ వెంకట్రావ్ లు బడిలోకి అడుగు పెట్టారు. వేసవి సెలవల్లో వెళ్లి బడికి సున్నాలు కొట్టించి వచ్చారేమో బడి కళకళాడుతున్నది. కానీ పదిమంది పిల్లలు కూడా లేక ప్రార్ధనా సమవేశం వెల వెలబోయింది. ఎందుకయినా మంచిదని పిల్లలతో పాటు వాళ్లిద్దరే గొంతెత్తి స్వరం పెంచి వందేమాతరం పాడారు. ఇష్ట ధైవానికి గట్టిగా మొక్కుకుని రిజిస్టర్ లలో సంతకాలు పెట్టారు.
    బొత్తిగా ముప్పయిమంది పిల్లలతో బడి ఎట్లా నడపడం. మన బడులను ఏమి చేస్తారో.. మనం పట్టు వదలకుండా తిరిగినా నలుగురు పిల్లలను చేర్పించలేకపోతున్నాం చేరుతామని మాటిచ్చిన పిల్లలు చేరకపోగా ఉన్న పిల్లలు కూడా అందరూ రాలేదు. అని ఇద్దరూ మదన పడసాగారు
    అంతలో పిల్లలు వచ్చి వాళ్ళ చుట్టూచేరి..” సార్ రామ్ చరణ్ పాల్వంచ హాస్టళ్ల జేర్తడంటా” అని ఒకరు ” హర్యా నాయక్ కిన్నెరసాని హాస్టల జేరిండంటా..” అని ఒకరూ అన్నారు. “విజయ్ గాడు ఇంట్లనే ఉండి టీవీ చూస్తున్నాడు..” అని ఒకరు చెప్పారు.
    బడిబాట బావుటా పట్టి బండేసుకుని వెళ్లి చేనులో పురుగుమందు కొడుతున్న రాజును, ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న విజయ్ ని, మేకల కాపలాకు వెళ్లిన సందీప్ ని బండి ఎక్కించుకుని బడికి తీసుకు వచ్చారు. పిల్లలను పంపి సరోజను, అనితను రప్పించారు.
    “ఇక ఇవ్వాల్టి నుండీ మళ్ళీ మన ఊరు చుట్టుపక్కల ఊర్లూ తిరిగివద్దాం ఎలాగయినా ఒక పదిమందినయినా చేర్చగలగాలి.” గట్టిగా అనుకున్నారు. మర్నాడు అద్దెకు కారు కూడా తెచ్చుకున్నారు. అది వేసుకుని చుట్టుపక్కల పదిఊర్లు తిరిగారు. వారంరోజుల వీరోచితా విహారంలో తెలుసుకున్న విషయాలెన్నో ..
    “మీ బుజ్జిని మా బడికి పంపు కనకమ్మా..! కళ్ళల్లో పెట్టుకుని కాపాడి చదువు చెబుతాం..”
    “అయ్యో సార్ మా బుజ్జికి కస్తూర్భా బడిల సీటొచ్చింది గాదు.” “కాదనేదేమున్నది కనకమ్మా అది కూడా ప్రభుత్వ బడే కదా చాల సంతోషం..”
    “మీ బాబును మా బడికి పంపు రామయ్యా..! మా కన్న పిల్లలా చూసుకుంటాము.” “అదిగాదు సారూ. ఇంటి దగ్గర బడయితే మాటిమాటికీ ఇంటికి ఉరికి వస్తారు. అందుకే సాంఘీక సంక్షేమ హాస్టళ్ల జైన్ జేస్తాం..”
    “ఓహో మరీ మంచిది సర్కార్ వారి హాస్టలే అది” సమాధానపడ్డారు.
    “ఆ రాజేష్ ను ఐదో తరగతిలో వేస్తాం రాజారావు వాడిని మా బడికి పంపు..”  “ఈడ ఉంటే వాడు మా మాట ఇనడు సార్. అందుకనే బీసీ హాస్టళ్ల ఎసిన.” “కాదనె వారెవరు..?” నీరసంగా బడి చేరారు.
    వెంకయ్య సార్ ఫోన్ మ్రోగింది ఏ అశుభ వార్త వినవలసి వస్తుందో అనుకుంటూనే దడదడలాడుతున్న గొంతుతో ఫోన్ఎత్తాడు వెంకట్రావ్. కానీ అవతల వీరయ్యగారు పగలబడి నవ్వుతూ మాట్లాడడం విని కాస్త ఊపిరిపీల్చుకున్నారు .
    “హ హా .. మాబడి పిల్లలను “మాయ కాన్సెప్ట్ బడి” వాళ్ళు సగం మందిని చేర్చేసుకున్నారు. మిగితావారిలో ఇద్దరు బీసీ హాస్టల్లో ముగ్గురు ఎస్టీ హాస్టల్లో చేరిపోయారు. ఒకడు ఏకంగా ఊరే వదిలి వేరే ఊరికి వెళ్లిపోయారు క్లీన్ బోల్డ్ హ హా ..” అవతలనుండీ పెద్దగా నవ్వులు ..
    “పాపం వెంకయ్యగారూ కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది.” అనుకున్నారు.
    “హాస్టల్లో చేరిన పిల్లలకు మన చేతులతోనే టీసీలు ఇచ్చి పంపుతున్నాం. ఇంతకీ మనకి పోటీ ప్రైవేట్ పాఠశాలలా.? లేక దూరం చూసుకోకుండా వెలసిన మనబడులా.? మన ప్రభుత్వ నిర్వహణలో హాస్టల్లా.?” అడిగాడు సుబ్బారావ్.
    “చూడు..వెంకట్రావ్.. తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడేనా అన్న ప్రశ్నా విత్తు ముందా చెట్టు ముందా అన్న ప్రశ్నలకన్నా మన పాఠశాల భవిష్యత్తు మిన్నా. మన బడిపిల్లల సంఖ్య పదిహేడుకొచ్చింది. దాని ఇరవయి చేయకుంటే మనం వంటికాయ శొంఠికొమ్ములమౌతాము దాని సంగతి చూడండి.”
    “నిజమే. మళ్ళీ తిరగలిలా తిరగాలిగా.” అనుకుని బయలు దేరారు. ఒకరు అటువయిపు ఒకరు ఇటు వైపూ తిరుగుబాట పట్టారు. ఒక గంట తిరిగాక
    “ఓ సుబ్బారావ్ అటు ఎటు వెళతావ్ గాని పండంటి అబ్బాయి దొరికాడు. ఈ ఏడే బడి ఈడు వచ్చిన వచ్చిన అమర్ నాయక్ ఇదిగో..” అంటూ ఎత్తుకుని తీసుకొచ్చాడు. వెంకట్రావ్. ఇద్దరూ వాడిని ముద్దులతో ముంచెత్తి .. మాతా పితల సమేతంగా బడికి తీసుకెళ్లి అమందానంద కందళిత హృదయంతో అడ్మిషన్ రాసేశారు.
    ఇక ఆఉదయానే. ఇది శుభవేళ సుబ్బారావ్.. మొన్న మార్చ్ లో టీసీ తీసుకెళ్లి హాస్టల్లో చేరిన మనోహర్ అమ్మమీద బెంగతో మళ్ళీ మనూర్ వచ్చేసాడట టీసీతో సహా.. దేవుడున్నాడు సుబ్బారావ్ దేవుడున్నాడు.” అన్నాడు.
    “అవును నిజమే ఆ ఇరవయ్యో సంఖ్యలోకి కూడా ఎదో ఒక క్లాస్ లోకి ఒక్కడంటే ఒక్కరు చేరితే ఇద్దరం జంటగా సత్యన్నారాయణ వ్రతం చేసుకుంటాం తండ్రీ.” అని పైకే మొక్కుకుని అంతలోనే ఒకరి మొఖాలొకరు చూసుకుని నాలిక కొరుక్కుని, మా జంటలతో సత్యన్నారాయణ వ్రతం చేసుకుంటాము తండ్రీ..!” కాదు సవరించి మొక్కుకున్నారు.
    ఒక్క చుక్క వానకోసం ఎదురు చూస్తున్న చకోరపక్షిలా.. ఎవరన్నా బడిలో చేరకపోతారా అని ఘడియ ఘడియకు గేట్ వంక చూడసాగారు. ఇప్పుడు ఇద్దరికీ ఆ చుట్టుపక్కల ఓ పదిహేను తండాలు పల్లెలు గూగుల్ మ్యాప్ కంటే స్పష్టంగా తెలిసిపోయింది. ఎవ్వరన్నా చేరే ఆశ అడుగంటసాగింది.
    “జపాన్లో ఒక్క అమ్మాయి చదువుకోసం కోసం రైలు ఆపుతున్నారు.. ఏ పంతొమ్మిది మంది పిల్లలుంటే మాత్రం వాళ్ళు పిల్లలు కారా..? వాళ్ళకోసం ఇద్దరు పంతుళ్లు ఉండకూడదా..?” ఉక్రోషం పడ్డారు.
    అంతలో ఒక ఆటో బడిముందునుండి వెళ్ళింది. “సీతక్కవచ్చిందీ.. సీతకొచ్చిందీ..” అంటూ నలుగురు పిల్లలు రోడ్ మీదకెళ్ళి నుంచున్నారు వాళ్లందరినీ కసిరి ..”ఏంట్రా లేని పిల్లలు లేనే లేరు. ఉన్న పిల్లలన్నా క్రమశిక్షణతో ఉండరా..” అరిచాడు సుబ్బారావ్. అందరూ లోనికి ఉరికారు. ఆ కాస్సేపటికి ఆ బడి గేటును పట్టుకుని సన్నటి కుర్రాడొకడు వేలాడసాగాడు. “కొత్తగా రెక్కలొచ్చెనా.. అన్న పాట బాక్ గ్రవుండ్ సాంగ్ లా వినపడుతుంటే స్లో మోషన్ లో వెంకట్రావ్, సుబ్బారావ్ ఆ పిల్లాడికేసి ఉరికారు. వాడు పిల్లల దొంగల్ని చూసినట్టు చూసి పారిపోతుంటే అక్కడే బండి మీద అమ్ముతున్న ఐస్ క్రీమ్ కొనిచ్చి వాడిని బడిలోకి తెచ్చి కుర్చీమీదా కూర్చుండబెట్టి..
    “నీ పేరేమిటి బాబూ నువ్వీ ఊరికి వచ్చిన విధమెట్టిది..? ” అని అడిగారు. వాడు ఐస్ క్రీం అయ్యేంతవరకు ఒక్కమాటా మాట్లాడలేదు. కానీ చుట్టుపక్కల చేరిన “పిల్లలంతా వీడు సూరిగాడు. మా సీతక్క కొడుకు. శేషగిరి బాబాయి కూతురు సీతక్క పురిటికొచ్చింది. ఈడ్నే ఆర్నెల్లు ఉంటారు.” అని చెప్పారు. చెవ్వుల్లో అమృతం పోసినట్లున్న ఆ మాటలకు పులకించి పోయారు ఇద్దరు పంతుళ్ళు.
    “వీడే వీడే మన ఇరవయ్యో వీరుడు.. కాదు ఇరవయ్యో విద్యార్థి.” అని అరిచారు ఇద్దరూ పిల్లలకేమీ అర్ధంకాక వాళ్ళ క్లాసులకు జారుకున్నారు.
    * * *
    “ఇలా ఎదుర్రా అరుంధతీ” అని వెంకట్రావ్.. శకునం చూసుకున్నాడు. అప్పటికే సుబ్బారావ్. ఆవుపాలతో సుభ్రమన్యునికి అభిషేకం చేసుకుని వచ్చాడు.
    తామిద్దరూ మాత్రమే వెళ్తే పనౌతుందో కాదో అని అనుమానపడి ఆ మధ్యాహ్నం ఓ నలుగురు పెద్దలను తీసుకుని వెళ్లి మంచీ చెడూ మాట్లాడి సీతకు, సూరి అమ్మమ్మా తాతయ్యలకూ, విషయమంతా వివరించారు .
    “అయ్యో సార్ పురిటికొచ్చిన నేను ఎన్ని నెళ్ళుంటా..? వాడు ఏడ మాట ఇంటడు.?” అన్నది సీత.
    “లేదమ్మాఅలా అనకు. నువ్వు అసలే నిండుచూలాలివి. నీకు తగిన విశ్రాంతి అవసరం. నిండు నెలలతో ఉన్ననీవు పిల్లవాడిని ఎలా చూసుకుంటావు చెప్పూ” అంటూ తెచ్చిన పండ్లూఫలాలు అక్కడ పెట్టారు.
    “పురుడయ్యాకా కూడా పుట్టింట్లో కొంతకాలం ఉండాలి కదా తల్లీ. అప్పుడు ఇద్దరు పిల్లలను చూసుకోవడం ఇబ్బందే మరి. అందుకే వాడిని మా బడిలో చేర్పించు. నీవు ఎప్పుడు వెళతావో అప్పుడు తీసుకెళ్దువుగానిలే. ఈలోగా మీ పిల్లాడిని మా పిల్లాడిలా చూసుకునే బాధ్యత మాది.” అంటూ ఎన్నోవిధాలుగా బతిమాలాడారు. ఊరివారంతా ఎన్నో రకాలుగా నచ్చచెప్పగా మొత్తానికి సోమవారం ఉదయం తొమ్మిదిగంటల దివ్య ముహూర్తానికి సూరిగాడిని చిన్నబడికి పంపడాని వాళ్ల పెద్దలు నిశ్చయించారు. ఆనందంతో ఇద్దరి సార్ల చెంపలుతడిచిపోయాయి.
    ముందు కాస్త జిద్దు చేసినా రోజుకో ఐస్ క్రీమ్ కొనిచ్చే ఒప్పందంపై సూరిగాడు బడిలో చేరటానికి ఒప్పుకున్నాడు. బడి ముందుకు వచ్చిన ఐస్ బండి వాడిని రోజూ వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సుముహూర్తం ఈ సోమవారమే..
    ఆదివారం రాత్రి “ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ..?” అని వెంకట్రావ్ ..
    సోమవారం ప్రభాతవేళ..” శ్రీ సూర్యనారాయణా మేలుకో.” అని సుబ్బారావ్ పాడుకున్నారు.
    ఆ తొలిసంజ వేళలో.. సూరిగాడు పుస్తకాల సంచీ వేసుకుని బడిలోకి అడుగు పెట్టాడు. రాంక్యా తండా బడిలో ఇరవయ్యో సంఖ్యలో చేరిపోయాడు..
    ఇప్పుడు పంతులిద్దరికీ ఎంత నిశ్చింతగా ఉందో.! రాంక్యా తండా చిన్నబడిలో రెండు పోస్టులు. ఇరవయి మంది పిల్లలు.

    * * *

    సమ్మెట ఉమాదేవి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here