శౌర్య సంగ్రామం

0
11

[dropcap]ప్ర[/dropcap]శాంత వాతావరణంలో చెట్లన్నీ పరవశంతో ఊగుతూ నిశ్శబ్దంతో ముచ్చట్లాడుతున్నాయి. పండుగ రోజులేమో, చలి వణికిస్తోంది. అరుగు మీద కూర్చుని నేను ప్రకృతి అందాలను గమనిస్తుంటే నా మనవరాలు ‘ముగ్ధ’ నేను కప్పుకున్న షాల్‌లో దూరి వెచ్చగా ముచ్చట్లాడుతోంది.

నాలుగవుతోంది. తొందరగా భోగిమంటలు ఎగిసిపడాలి. ఇంత ఆలస్యం చేస్తే ఎలా? మేమయితే రాత్రే అన్నీ సిద్ధం చేసుకోనే వాళ్ళం. ఇంట్లో ఉన్న చెత్తంతా ఏరి ఏరి తెచ్చుకొనేవాళ్ళం. అదో ఆటలా ఆనందించే వాళ్ళం. నెలంతా కొట్టిన గొబ్బెమ్మలు పిడకలును దండగా కట్టి దాన్ని ముందు తయారు చేసే వాళ్ళం. ఎర్రని మంటలు ఎగిసి పడుతుంటేనే అందరం కబర్లు చెప్పుకుంటూ వెచ్చదనాన్ని పంచుకునే ఆ రోజులను తలచుకుంటేనే మది పులకించిపోతుంది.

ఇవే మాటలు పెద్ద మనవడు ‘వికాస్’తో అనగానే “అంతా సిద్ధమే నానమ్మా! క్షణంలో ఆ క్షణాల్ని నీ కళ్ళ ముందుకు తెచ్చేస్తాం. చూస్తూ ఉండు” అంటూనే పేర్చిన కట్టెపుల్లల మధ్య అగ్గిపుల్లను వెలిగించి వేసాడు.

బాగా ఎండిపోయి ఉన్నయేమో, మంట ఒక్కసారిగా పెద్దదై అందరికీ వెచ్చదనాన్ని పంచింది. చిన్నా పెద్దా, పిల్లా పాపలందరూ దాని చుట్టు చేరిపోయారు. ఇక అక్కడ అంతా కబుర్లు, కోలాహలమే!

ఒకప్పటి ‘శౌర్య’ని, ఇప్పుడు ‘శౌర్యమ్మ’ని. ఎగిసిపడుతున్న ఆ మంటలని చూస్తుంటే ఎందుకో గతం అంతా కళ్ళలో మెదులుతోంది.

***

మా ఊరు ‘పోలూరు’. పచ్చదనం చీరలో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. నాన్న ‘నరసయ్య’ పెద్ద మోతుబరి. కాలు బయటపెట్టకుండా, ఇంట్లోంచే అందరికీ పనులు పురమాయించేవాడు. అమ్మ ‘రత్తమ్మ’ మాత్రం కూలివాళ్ళతో పనికి బరిలోకి దిగి పొలం పనులు చూసుకునేది. కూలీలు అయినా తమను సొంత వాళ్ళలా చూసుకునే అమ్మను బాగా ఇష్టపడేవారు.

నలుగురు ఆడపిల్లలు, నలుగురు మొగపిల్లలతో ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. మాకు తోడు మా ‘అశ్విని’. తెల్లటి జూలుతో రాజకుమారిలా అందంతోనే పోటీ పడేట్లుండే ఆ గుర్రంతోనే మా ఆటలు, ముచ్చట్లు. సమయం అసలు తెలిసేదే కాదు, దానితో కబుర్లు చెప్పుకుంటుంటే. దాన్ని చూస్తేనే ఎంతో హాయిగా ఉండేది. ఎంత అందంగా ఉండేదో?

ఇక చిన్నా! వాడికి అమ్మంటే ప్రాణం. పుట్టినప్పుటి నుంచీ మా ఇంట్లోనే పెరిగాడు. వాడు అనాథ అన్న విషయం గుర్తు రానంతగా మా ఇంట్లో కలిసిపోయాడు.

అంతా బాగుండేది కానీ మా నాన్న తాగేసి వచ్చి మా అమ్మను చితకబాడటం మాత్రం నాకు నచ్చేది కాదు. నాన్న ముందుకు వెళ్ళే ధైర్యం లేక ఆ ఘోరాన్ని చూడలేక ఓ మూల నక్కేదాన్ని. కానీ చిన్నా అలా ఊరుకునేవాడు కాదు.

ధైర్యంగా నాన్న ముందుకెళ్ళేవాడు చిన్నా. దెబ్బలు పడతాయని తెలిసినా అవి తినటానికే సిద్ధపడేవాడు. అమ్మను కాపాడటానికి చిన్న వయసు నుంచే ప్రాకులాడేవాడు.

వాడు తిన్న దెబ్బలకు మందు వ్రాస్తూ “ఎందుకురా చిన్నా? ఇన్ని దెబ్బలు తింటావు. నువ్వు చేసే పనికి ముద్దకు లోటుండదు. ఇక్కడ నాన్నతో అన్ని తన్నులు తినే బదులు బయటకు వెళ్ళిపోవచ్చుగా” అనేది తను. దానికి మాత్రం ససేమిరా ఒప్పుకునే వాడు కాదు.

“నా ప్రాణం పోయే దాకా అమ్మను వదిలేది లేదు” అని ఖచ్చితంగా చెప్పేసే వాడు ఇంకో మాట కూడా అనేవాడు. కొట్టినా మళ్ళీ దగ్గరకు తీస్తాడుగా నాన్న అని.

వాడి ప్రేమకు ముచ్చటవేసేది. వాడిలా ధైర్యం చేయలేనందుకు సిగ్గుగానూ ఉండేది.

ఆ ఒక్కటే మాకు నాన్నలో నచ్చని విషయం. మిగతా విషయాలలో ఎంతో బాగుండేవాడు.

అమ్మకు సినిమాలంటే చాలా ఇష్టం. మా ఊళ్ళో ఒక్క సినిమా హాలు ఉండేది కాదు. మా నాన్నేమో నెలకొక్కసారే సినిమాకు ఛాన్సు ఇచ్చేవాడు. ఇక ఆ రోజు మాకు జాతరంత సందడి. రెండు ఎడ్ల బండ్లు, ఒక గుర్రపు బండిలో అందరం బయలుదేరే వాళ్ళం. అమ్మ పెద్ద బుట్ట నిండా తినే వస్తువులు సర్దేది. పని వాళ్ళను కూడా మాతో సినిమాకు పంపేవాడు నాన్న. “తిట్టేప్పుడు తిట్టినా కొట్టేప్పుడు కొట్టినా, ఇలాంటప్పుడు మారాజే” అని పొగిడేవాడు మా చిన్నా!

నేను మాత్రం వెళ్ళేప్పుడు గుర్రం బండిలో ఎక్కేదాన్ని, వచ్చేప్పుడు మాత్రం ఎద్దుల బండిలోనే. మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకెండ్ షో అన్నీ చూసి అలిసిపోయి అమ్మ ఒడిలో ఒదిగిపోయేదాన్ని.

అలా నెలకొకసారి ‘నంద్యాల’కి ప్రయాణం మాకొక ఆటవిడుపుగా ఉండేది. ఆట అవగానే అందరం కలిసి తిండి తినటం, మళ్ళీ సినిమా చూడటం. మళ్ళీ తిండి. మళ్ళీ సినిమా. తిరుగు ప్రయాణంలో ఇంటికి వచ్చేటప్పటికి బుట్ట ఖాళీ అయిపోయేది.

దొంగల భయాన్ని పోగొట్టుకోవడానికి కబుర్లు, పాటలు ఒకటేమిటి అందరూ అప్పుడు తమలో ఉన్న కళలను బయటకు తీసేవారు. కొందరు చూసి వచ్చిన సినిమాల్లో సంభాషణలు వినిపించేవారు. అంత చీకట్లో కూడా అశ్విని కళ్ళు అందంగా మెరుస్తూ ఉండేవి. మా అందరి మాటల్నీ ఆలకిస్తూ ఉండేది. మూగగానే దాని ప్రేమనంతా ఒలకబోసేది.

ఇక తెల్లవారి పది, పదకొండు గంటల దాకా నిద్ర లేచే పనే లేదు. అలిసిన మనసుకు విశ్రాంతే విశ్రాంతి మా అందరికీ.

***

అన్నీ మంచి గుణాలే పుణికి పుచ్చుకున్న మా అమ్మకు ఒక చెడ్డగుణం ఉంది. అదే పొగాకు చుట్టను పీల్చటం. వైద్యుడు తనకు కాన్సర్ ఉందని చెప్పినప్పుడు అందరం తెల్లబోయాం. ఆకు, వక్క వాడితే మంచిదని సలహా ఇచ్చారాయన. మా అమ్మ దానితో పొగాకు అలవాటు చేసుకుంది. అదే ఆవిడను మాకు దూరం చేస్తుందని అప్పట్లో మాకు తెలియదు.

అయిదో తరగతి దాకా ఆ ఊర్లోనే చదివా. ఇకపై అక్క వాళ్ళింట్లో ఉండి చదువుకుంటానని, ఇక్కడ ఉండనని మొండికేసా. దానికి అసలు కారణం నాన్న అమ్మను అలా పదే పదే కొట్టడం చూడలేకే అన్నది నా చిన్న మనసుకే తెలుసు.

చివరకు వాళ్ళకు ఒప్పుకోక తప్పలేదు. దాని కోసం అన్నం తినటం కూడా మానేసా. అమ్మకు, అశ్వినికి, చిన్నాకు అందరికీ దూరంగా వెళ్తున్న బాధ కంటే అమ్మను నాన్న పెట్టే హింసను చూడలేనంత దూరంగా వెళుతున్నానన్న ఆనందమే ఎక్కువగా ఉండేది.

తర్వాత కాలంలో ముందు నాన్న, తర్వాత అమ్మ కాలం చేసారు. ఇద్దరూ వ్యసనాల వల్లే మాకు తొందరగా దూరమయ్యారు అన్న నిజం నా గుండెను ఎప్పుడూ పిండేస్తూ ఉండేది. ఇలా ఎవరినీ బలి కాకుండా చెయ్యాలని నా చిన్నతనంలోనే నిశ్చయించుకున్నాను. నలుగురికి ఈ విషయం చేరాలంటే చెప్పే స్థాయిలో నేనుండాలని. అందరూ వినాలంటే నేను ఉపాధ్యాయురాలి నవ్వాలని అప్పటి నుంచే బాగా చదువు మీద బాగ దృష్టి పెట్టడం ప్రారంభించాను. చివరకు సాధించాను.

మద్యపాన నిషేధం పైన నేనే సొంతంగా నాటకాలు రాసేదాన్ని. పండుగలప్పుడు నేనూ, నా స్నేహితులూ వేషాలు వేసుకొని మరీ ఆడేవాళ్ళం. ఎలాగైనా వాళ్ళ మనసుల్లోకి దూరి ఈ వ్యసనాలకు దూరం చెయ్యాలని ఎంతో శ్రమపడేదాన్ని. అమ్మలా ఎవరూ బలి కాకూడదని తాపత్రయపడేదాన్ని.

విన్నా వినకపోయినా చెవిలో జోరీగలా ఈ విషయం గురించి పోరుతూనే ఉండేదాన్ని. కొందరు విసుక్కునేవారు. మరి కొందరు ముచ్చటపడేవారు. ఏదీ పట్టించుకునే దాన్ని కాదు. చిన్నప్పుడు చూపలేని ధైర్యం ఇప్పుడు చూపగలుగుతున్నానని నా భుజాన్ని నేనే ధైర్యంగా తట్టుకొనేదాన్ని. నాకు నేన్నే ఉత్సాహాన్ని నింపుకునే దాన్ని.

ఇంత చేస్తున్నా ఒక విషాదాన్ని మాత్రం ఇప్పటికీ నేను మరిచిపోలేను. అదే ‘అశ్వని’ని మేము వదులుకోవటం. అమ్మ నాన్న పరిస్థితులు బాగోలేని రోజుల్లో దాన్ని అమ్మేయాలనుకున్నారు. ‘ఏదోలా సర్దుకుందాం, దాన్ని మాత్రం పంపొద్ద’ని అందరు గోలగోల చేసాం.

‘చిన్నా వాళ్ళు మీకేం తెలియదు. ఊరుకోండి. దానికి తిండి పెట్టలేని స్థితిలో ఉన్నాం. ఇంకెక్కడికైనా వెళితే అది సంతోషంగా ఉంటుంది’ అని మమ్మల్ని అయితే బుజ్జగించగలిగారు. కానీ అశ్వనీని కాదు. అది వెళ్ళనని ఎంత మారాం చేసిందో? చివరకు వెళ్ళింది కానీ మళ్ళీ రెండు రోజులలో ఎలా వచ్చేసిందో మా ఇంటికి వచ్చేసింది. అందరం సంతోషంగా దానిని చుట్టుముట్టాం. ఒళ్ళంతా నిమిరాం. దాని రెండు కళ్ళలోంచి నీళ్ళు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అమ్మ వాళ్ళు దాన్ని బలవంతంగానే మాకు దూరం చేసారు. అది మా చిన్నమనసులు తట్టుకోలేకపోయాయి.

అందుకే ఇప్పటికీ అలాంటి రోజులు రాకూడదని పొదుపు మంత్రం పాటిస్తాను, ఉన్నప్పుడే కొంత కొంత దాస్తూ. అవసరమైనప్పుడు అది అక్కర తీరుస్తుందని, నేను ఏవైతే పాటిస్తానో అవన్నీ అందరికీ చెబుతాను.

వాళ్ళూ ఆచరించి బాగుపడాలన్నదే నా ఉద్దేశం.

బోధన… నిరంతర బోధనలో మునిగి తేలుతూ ఉండేదాన్ని. దానికి నా భర్త సహకారం కూడా తోడయ్యేది. అదే నన్ను ముందుకు నడిపించేది.

ఒక అడుగు ముందుకు వేస్తుంటే వెనక్కు లాగే వాళ్ళుండే ఏ పనీ సక్రమంగా చెయ్యలేం. అదే ఒకరు తోడుగా ఉంటే ఎంత కష్టమైన దాన్నయినా సాధించగలం అనే ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యమే ‘శ్రీకుమార్’ నుంచీ నేను పొందగలిగాను.

మా ఊరి జనం నేను చేసే నిస్వార్థ సేవకు గుర్తుగా ‘కార్పోరేటర్’గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత యం.యల్.ఏ. గా మారాను. సమాజానికి కూడా సేవ చేసే స్ధితిలోకి ఎదగగలిగాను.

రాజకీయాలు అంటే కుళ్ళు కాదు, దానిలో ఉండి ఎన్ని మంచి పనులు చేయగలమో చేసి చూపించాను.

మంచి రోడ్లు, మరుగు దొడ్లు… ఇలా ఎన్నో… ఎన్నెన్నో… ప్రభుత్వ పథకాలు అన్నీ మా ఊరి జనాలకు సంక్రమించేలా చర్యలు తీసుకున్నాను.

మా ఇంటి ముందు పోస్ట్ బాక్సులా ఒక బాక్స్ పెట్టించాను. అందులో ఎవరైనా తమ బాధను నాతో పంచుకోవచ్చు.

పేరు రాసినా రాయకపోయినా వాళ్ళ కోరిక తీర్చేదాన్ని, దీని వల్ల మధ్యవర్తుల బెడద లేకుండా పోయేది.

వాళ్ళకు నాకు మధ్య వారధిలా ఆ బాక్సు పని చేస్తూ ఉండేది. అది నాకు ఎంతో ఆనందాన్నిచ్చేది.

మా ఊరి వాళ్ళు ‘మద్యం త్రాగరాదు’ అని నియమం పెట్టేంత వరకూ నేను ఉద్యమిస్తూనే ఉన్నాను.

చివరకు అది సాధించాను.

ఎన్నో కాపురాలు దీని వల్ల సుఖశాంతులు ఏర్పరుచుకున్నాయి. ప్రశాంతత వెల్లివిరిసింది మా గ్రామంలో.

చిన్నప్పటి నుంచీ నేనేదయితే చెయ్యాలనుకున్నానో దాన్ని సాధించగలిగాను. అదే అమ్మ ఉన్నప్పుడే చేస్తే ఎంత బాగుండేది అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది.

పోనీలే, మా అమ్మను రక్షించుకోలేకపోయినా ఎందరో అమ్మలకు తను పిల్లలను చేరువ చేసానుగా అని ఆత్మసంతృప్తి పడుతూ ఉంటాను.

ఎక్కడ ఉన్నా అమ్మ ఆత్మ ఆనందపడుతుంది అన్న అలోచన నాకు వెయ్యి ఏనుగుల బలాన్ని అందిస్తుంది.

నా పరిపాలన బాగుండటంతో మూడు సార్లు వరుసగా యం.యల్.ఏ. పదవి నాకే దక్కింది.

దానికి నేను పొంగిపోయింది లేదు. ప్రజలకు మరిన్ని సేవలు నేను చేసే అవకాశం వచ్చినందుకు ఆనందపడ్డాను.

వారు నాపై ఉంచిన నమ్మకాన్ని మరింత నిలబెట్టుకున్నాను.

ఇప్పుడు ఇలా నా మనవళ్ళు మనవరాళ్ళతో సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటున్నాను.

ఎక్కడెక్కడి వారినీ ఒక చోట చేర్చే ఈ పెద్ద పండుగ అంటే నాకు ప్రత్యేక అభిమానం.

ఒంటరి కాపురాలు చేసుకునే కుటుంబ సభ్యులంతా ముద్దబంతి పువ్వుల్లా ఒక దారికి చేరటం అంటే మాటలా? విదేశాలలో ఉన్నా ఈ పండుగకు ఇక్కడ వాలాల్సిందే.

అందుకే ముఖ్యంగా నాకు పల్లెటూర్లన్నా, ముద్దబంతి పువ్వులన్నా అంత ఇష్టం. ఎన్ని రేకులు కలిస్తే ఓ ముద్ద బంతి పువ్వు అవుతుంది? ఎప్పుడైనా గమనించారా? కలిసి ఉంటే కలదు సుఖానికి ప్రతీక ఈ పువ్వు.

నా కథంతా మీకు వినే లోపు భోగి మంటకు నైవేద్యాలు కూడా పెట్టేసారు. ముగ్ధ మరింత ముడుచుకుపోతూ నాలో ఒదిగిపోయింది మన సంస్కృతిలా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here