సౌభాగ్య భారతం

13
7

[dropcap]స[/dropcap]ర్వ వ్యాపి నారాయణుడిలా, ఎందెందు వెదకిన అందుండే చక్రిలా
అవినీతి చీడ గాలిలో, నీటిలో నింగి సరిహద్దుగా ఉంది వ్యాప్తిలో
జీవన వ్యాపారమంతా చెదపురుగులై, అణువణువునా అల్లుకుపోయిన
ఆ రాక్షసిని మట్టుపెట్ట పీఠమెక్కిన వీరులెందరో పడ్డారు దాని ఊబిలో
రేషన్ నుండి రాఫెల్ దాకా, పిల్లల తిండి నుండి తల్లుల మందులదాకా
శతఘ్నుల మొదలు శవపేటికలదాకా, అక్రమాల యథేచ్ఛ వెల్లువ

ప్రజాకర్షక పధకాల మత్తు మందిచ్చి, రైతుల్ని నిర్దయతో నేలకి బలిచ్చి
నిరుద్యోగ భృతంటూ యువతని మాయచేసి, జనతని యాచకుల్ని చేసి
వృద్ధుల, బాలల, స్త్రీల రక్షణ మరిచి,ప్రజాస్వామ్యపేరున వారసత్వ పరంపరై
అధికార కాంక్షతో ప్రజల్ని వర్గ,కుల,మత, ప్రాంతాలుగా విడగొట్టి
అస్మదీయుల అభివృద్దే లక్ష్యమైన అక్రమార్కుల ఆగడాలకు అడ్డేది?

ఇకనైనా వాళ్ళనీ వీళ్ళనీ నమ్మినిండా మునగడం మానేద్దాం
అవినీతి భూతం రక్తం కక్కుకుని, నేల కొరిగేదాకా విరామం మరిచి
మూల మూలాల అధర్మ జాడ్యాన్ని సమూలంగా పెకలించి వేద్దాం
పురుగు మందుతో పహారా కాస్తూ, చీడ తెగులుపై ఉద్యమం సాగిద్దాం

దుష్ట సంప్రదాయాల కులాహంకారుల్ని చట్టాల మంటల్లో మాడ్చేద్దాం
అన్యాయంపై యుద్ధంలో సైనికులమై దుర్నీతి కుత్తుకలు ఖండిద్దాం
ఆనాడే ప్రజావళి అసలైన పురోగమనం,మానవాళికి శాంతి సౌభాగ్యం
సంక్షేమరాజ్య నూతన సౌధానికి మనందరం నిర్మాతలమవుదాం

పిల్లలు ప్రశాంతంగా ఆడుకునే, అక్కచెల్లెళ్లు హాయిగా నవ్వుకునే
యువతకు భవిష్యత్ చూపించే, స్వచ్ఛత నిండిన పాలన కోసం
విద్యా,వైద్యం మన హక్కంటూ జనమే చైతన్య స్రవంతి కావాలి
అధర్మంపై సమరానికి ప్రజలంతా ఒక్క త్రాటిననిల్చి ఒట్టేసుకుని
ఓటు చక్రంతో పాలక శిశుపాలుళ్ళ కంఠాలుత్తరించే కృష్ణులైపోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here