ద్రౌపది ఆత్మ ఔన్నత్యానికి అచ్చమైన ప్రతీక – ‘సౌశీల్య ద్రౌపది’ నవల

3
11

[dropcap]పు[/dropcap]రా అపి నవం ఇతి పురాణం – అంటే పాతది అయినా ఇది కొత్తదే. అంటే పురాణాల్లో చెప్పబడిన ఉదాహరణలు, జీవితసత్యాలు అటు ఇటుగా అన్ని కాలాలకీ వర్తిస్తాయి. రామాయణ భారతాలు, ఇతిహాసాలు, పురాణాల కథలు భారతదేశంలోని ఏ మారుమూల గ్రామస్థుడి కైనా, అక్షర జ్ఞానం లేని గొర్రెల కాపరికైనా తెలిసివుండడం చేత భారతీయ సంస్కృతి ఇంకా జీవించే వుంది.

మహోజ్జ్వల చరిత్ర గల పుణ్యభూమి భారతదేశపు సంస్కృతి ఇతర దేశాల సంస్కృతి కన్నా విశిష్టమైంది. రామాయణ భారతాది కావ్యాలు బోధించిన పవిత్రతను, వైభవాన్ని అర్ధంచేసుకోలేని కొందరు తమ మనసుల్లోని కల్మషాన్ని, విషాన్ని వెదజల్లుతూ ఆధునికత పేరుతో విశృంఖలంగా వికృత రచనలు చేస్తున్నారు.

ప్రపంచీకరణ నేపథ్యం కావచ్చు, అత్యాధునిక భావజాలం కావచ్చు నేటి యువతకు భారతీయ సంస్కృతి, పురాణాల విశిష్టత, కావ్యాల్లోని అంతరార్థం పట్ల అనేక సందేహాలు కలుగుతున్నాయి. దురదృష్టవశాత్తు ఆ సందేహాలు తీర్చవలసిన కొద్దో గొప్పో చదువుకున్న పెద్దలు తమకు తోచినట్లు చులకనగా చూస్తూ, వ్యాఖ్యానిస్తూ యువతను మరింత అయోమయానికి గురి చేస్తున్నారు. దానితో, రాబోయే తరంవారు ప్రాచీన ధర్మాలన్నీ వ్యర్థాలంటూ హేళన చేస్తూ వ్యతిరేక భావాలను పెంచుకుంటున్నారు.

ఉదాహరణకి, రామాయణంలో చెప్పబడిన అన్నదమ్ముల, భార్యాభర్తల, మైత్రి మొదలైన మానవ సంబంధాల ఉన్నతిని అర్ధం చేసుకోలేక వికృత వ్యాఖ్యానాలు, ఉపన్యాసాలు చేస్తున్నారు. ఈనాడు ప్రపంచమంతా చెప్తున్న personality development కి “సుందరకాండ”ని మించినదేముంది! పెద్ద పెద్ద సంస్థల్లో ఎంతో ధనం చెల్లించి లెసన్స్ చెప్పిస్తున్నారు కానీ భారతంలో అంపశయ్య మీద వున్న భీష్ముడు చెప్పిన management అంశాలకు మించి ఎవరు చెప్పగలరు! చాణుక్యుని నీతిని సరిగ్గా అవగాహన చేసుకుంటే నేటి రాజకీయనాయకులు క్షుద్రమైన ‘రాజకీయం’ చేయరు. రాజకీయాల్లో, పరిపాలనలో ఒక సిద్ధాంతపరమైన పునాది ఏర్పరచుకోగలరు.

రామాయణ భారతాల పట్ల భక్తి తోనో, అనురక్తితోనో భారతీయ భాషలన్నిటిలోను అనువాదాలే కాక, ఆ కథల ఆధారంగా మరికొన్ని కల్పనల్ని జోడిస్తూ నాటక, నవలల రూపంలోనూ చాలమంది రచించారు. పండితులకే కాక సాధారణ పాఠకులకు కూడ అందలి ఔన్నత్యం తెలియజేస్తూ వచనరూపంలో చిన్న చిన్న కథలు, నవలికల రూపంలో వచ్చాయి. (కొన్ని వెక్కిరింతల కోసం, హేళనల కోసం రాసినవీ ఉన్నాయి.) ఆయా పాత్రల్ని ప్రముఖంగా తీసుకుని, వారి వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రచించినవారు ఉన్నారు.

అలాంటి మంచి ప్రయత్నం చేసారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ. “ద్రౌపది పాత్రను ఆధునిక సమాజంలో మహిళకు ప్రతీకగా చేసి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసాను” అన్నారు. ఈనాటి సమాజానికి అన్వయించి, సందేహాలను తొలగించి, సమస్యలకు పరిష్కారాలను చూపి, పురాణాలు ఏ రకంగా సమకాలీన సమాజానికి ఉపయోగపడతాయో చూపించే ప్రయత్నం చేసానన్నారు.

కృష్ణా… ద్రౌపదీ… పాంచాలీ… యాజ్ఞసేనీ…! ఆకృతి దాల్చిన ఒక లావణ్య కాంతిపుంజం. అప్పుడే విరిసిన ముగ్ధమోహన సౌందర్శరాశి. ఆమే… “సౌశీల్య ద్రౌపది”. ఆమెను పరిచయం చేసే సందర్భంలోనే మురళీకృష్ణ ఒక అద్భుతమైన సన్నివేశం కల్పించారు. స్వర్గారోహణ సన్నివేశం. పంచ పాండవులు నడుస్తున్నారు. ఆ వెనుకనే నడుస్తున్న ద్రౌపది. ఆమె మలుపు తిరగగానే అప్పటివరకు విజృంభిస్తున్న ప్రకృతి హఠాత్తుగా మృదువుగా మారిపోయిందట. అది ఎలా వుందంటే, “తనతో సమానమైన గాంభీర్యం, విజ్ఞానం, విచక్షణ ఉన్న సమానుడిని చూసి, గౌరవంతో పక్కకు ఒదిగి నిలబడ్డట్టుంది” అంటారాయన. ఆ ఒక్క వాక్యంతోనే ద్రౌపది ప్రకృతి స్వరూపిణి అయిన మహాశక్తివంతమైన స్త్రీమూర్తి అని తెలియజేసారు. ఆ లక్షణాలనే ఆసాంతం ప్రకటించే సన్నివేశాలను తన నవలలో వివరించారాయన.

ద్రుపదరాజ పుత్రికగా, దృష్టద్యుమ్నుని సోదరిగా చిన్ననాటినుండి తానొక “కారణజన్మురాలి”గా భావిస్తున్న వాతావరణంలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసంతో పెరిగిన “కృష్ణ” జీవితంలో అనూహ్యంగా ఒక అపార్థం ఎదురైంది. అది ఆమె జీవితాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించింది. అదీ, ఒక స్త్రీ జీవితంలో ప్రధానమైన దాంపత్యం విషయంలో. కఠినమైన విలువిద్య పరీక్షలో కృష్ణని జయించుకొని ఇంటికి తీసుకొని వచ్చిన అర్జునుడు తల్లి కుంతితో “భిక్ష తీసుకొని వచ్చాను” అన్నాడు. రోజులాగే మామూలుగా భిక్ష తీసుకొని వచ్చారనుకొన్న కుంతి ఎప్పటిలానే “అయిదుగురు పంచుకోండి” అంది.

తర్వాత కుంతి తన పొరపాటును తెలుసుకున్నా, తల్లి వాక్కుని శిరసావహించే పాండవులు , ఆమె వాక్కు పోనివ్వరాదని చర్చించుకోసాగారు. తన ప్రమేయం లేకుండానే తన జీవితానికి సంబంధించిన విషయాల గురించి, తనను పంచుకోవడం గురించి వారు చర్చించుకోవడంతో నిర్ఘాంతపోయింది. కోపం, రోషం, ఆగ్రహంతో మనసు అల్లకల్లోలంగా మారిపోయింది. ఆ యింటిలోని ఆయుధాలు, వారి మధ్య సంభాషణలను గమనించిన ఆమె గుర్తించింది, వీరు బ్రాహ్మణులు కారు, క్షత్రియులని. ముఖ్యంగా తండ్రి చెప్తూ ఉండేవాడు, లక్కయింటిలో పాండవులు మరణించి వుండరని, తనని పాండవ మధ్యముడు వివాహమాడతాడని. అయితే, వీరు పాండవులా! తను పాండవపత్ని కాబోతున్నదా!

మర్నాడు శ్రీ కృష్ణుడు వచ్చాడు. “సోదరీ కృష్ణా” అన్నాడు. ఆ అనురాగపూరిత పిలుపుతో ఆమె కంట నీరు తిరిగింది. అతడి అనురాగం ఆమెకు రక్షగా అనిపించింది.

ఇక్కడ మరో అద్భుతమైన పాత్ర ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తారు రచయిత. ఆమే పృథ! దూర్వాసుని వరం వల్ల దేవతల అంశాలతో పాండవులకు జన్మనిచ్చింది. దాని వల్ల అనేకులు ఆమెపై దుష్పచారం చేసారు. రకరకాల వ్యాఖ్యానాలు చేసారు. ఇక ఇప్పుడు ఒక స్త్రీకి అయిదుగురు భర్తలంటే….! సమాజం కాకుల్లా పొడుచుకు తింటుంది. నిప్పులమీద నిలుపుతారు. తన తొందరపాటు, తత్పరిణామం, కృష్ణ పరిస్థితి గురించి విచారంలో మిగిలిపోయిందామె. అయిదుగురు భర్తలతో ఆమె ఎంత ధర్మబద్ధంగా జీవితం గడిపినా, అందరూ నీచంగా చూస్తారు. కుతూహలం, హేళన ఎదుర్కోవలసివస్తుంది. “నువ్వు చేస్తున్న త్యాగం, నీ మనసులోని ఆవేదన నేను తప్ప ఇంకెవ్వరు అర్థం చేసుకోగలరు” అంటుందామె కృష్ణతో. ఆఖరికి తన పుత్రులతో కూడ పృథ “పురుషులు, మీకు అర్థం కావీ విషయాలు. మీరు అర్థం చేసుకోలేరు కూడా” అని లేచి వెళ్ళిపోతుంది. ఒక స్త్రీ హృదయాన్ని మరో స్త్రీ గుర్తించగలదనడానికి ఇంత కంటే స్పష్టంగా మరో ఉదాహరణ చెప్పగలమా! కన్న బిడ్డలో కూడ స్త్రీని అర్థం చేసుకోలేని ‘పురుషుడు’ ఉన్నాడని ఆవేదన ఆమెది.

తర్వాత ద్రౌపది జీవితం అనేక సంఘటనలతో పూర్తిగా మారిపోయింది. పంచపాండవులకి ఆమె పత్ని అవడానికి తండ్రి, సోదరులు అంగీకరించడం జరిగింది.

“ద్రౌపదీ! మా మానం, ధనం, ధైర్యం, గౌరవం నీవు. అమ్మ ఆజ్ఞను మేము స్వీకరించినట్టే నువ్వూ మౌనంగా స్వీకరించావు. మా గౌరవం నిలిపావు. ఇందుకు జీవితాంతం ఋణపడివుంటాం. మా గౌరవం నిలపడం కోసం నువ్వెంత కష్టాన్ని, అపవాదును స్వచ్ఛందంగా స్వీకరించావో మా అందరికీ తెలుసు. అందుకే మేము నీ భర్తలమైనా, నీ పై మా హక్కును ఏ రకంగానూ ఉపయోగించం. నీ పట్ల మేమంతా మా బాధ్యతలను చిత్తశుద్ధితో నిజాయితీగా నిర్వహిస్తాము” అని వాగ్దానమిచ్చిన ధర్మరాజు –

“నా బాహుబలం సర్వదా నీ రక్షణ కోసం సిద్ధంగా ఉంటుంది. నిన్ను అవమానించిన వాడెవడైనా వాడి ప్రాణాలను ఈ చేతులతోనే వాడి శరీరం నుంచి వేరు చేస్తాను” అని ప్రతిజ్ఞ పట్టిన భీముడు –

“నీకు నామీద కోపం ఉంటుందన్న తెలుసు. శరీరాన్ని గెలవడంలో గొప్పలేదు. మనసుని గెలుచుకోవడంలోనే మనిషి ప్రతిభ తెలుస్తుంది. నీ మనసు గెలుచుకున్ననాడే నాకు సంతృప్తి” అని మోకరిల్లిన అర్జునుడు –

అలాగే నకుల సహదేవులు, ఆమె వైపు చూసే ధైర్యం లేక తలవంచుకొని కూర్చొనే సందర్భం వచ్చింది. అధర్మ ద్యూతక్రీడలో ధర్మరాజు తనను, తన తమ్ములను ఓడిపోయి, ద్రౌపదిని కూడ పణంగా పెట్టి ఓడిపోయినప్పుడు, దుశ్శాసనుడు ఆమె కురులను పట్టి సభలోనికి ఈడ్చుకొని వచ్చి నప్పుడు మౌనం వహించారు. అయిదుగురు బలశాలులు, జగదేకవీరులయిన భర్తలు దుర్యోధనాదుల ముందు బానిసలుగా తలవంచుకొని కూర్చొని వున్నారు.

నిర్ఘాంతపోయింది ద్రౌపది. ఆమె కళ్ళనుండి విస్ఫులింగాలు వెలుపడుతున్నాయి.

“ఏ జాతి అయితే స్త్రీని నగ్నంగా నడిబజారులో నిలిపి సంతోషిస్తుందో, సంబరాలు చేసుకుంటుందో ఆ జాతికి భవిష్యత్తు లేదు. సర్వం నాశనమైపోతుంది. నాశనమైన బూడిదనుంచి స్త్రీని గౌరవించే సంస్కృతి ఉద్భవిస్తుంది”…. ఆనాడు ద్రౌపది మనసులో ఆక్రోశంతో అనుకున్న ఆ మాటలు నిత్యసత్యాలు.

ఇది న్యాయమా, ధర్మమా అని ప్రశ్నంచిన ఆమెకి కురువృద్ధులైన వారెవ్వరూ సమాధానం చెప్పలేక పోయారు. భీముడు మాత్రం లేచి భీకరప్రతిజ్ఞ చేసాడు, ద్రౌపదికి జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటానని.

దృతరాష్ట్రునికి గుండెల్లో భయం పట్టుకున్నది. క్షమాపణలడిగి, వరాలిచ్చి సభ నుండి పంపించివేసాడు. దుర్యోధనాదులకు క్రోధం మరింత పెరిగింది.

“ప్రపంచమంతా తన శరీరాన్ని, లావణ్యాన్ని, సౌందర్యాన్ని చూస్తుంది. తన మనసుని చూసే దెవరు?” నిర్లిప్తంగా అనుకొంది ద్రౌపది. ప్రపంచం కళ్ళకి తానేవో అలౌకిక ఆనందాలు అనుభవిస్తోందని వికృత ఊహలు. కాని తన మూసిన కళ్ళ వెనుక ప్రపంచాన్ని ఎవరూ చూడలేరు.

మళ్ళీ ద్యూతానికి కౌరవులు పిలవడం, ధర్మరాజు వెళ్ళడం తెలిసి ఆమె పెదవులపై వ్యంగ్య పూరితమైన నవ్వు నిలిచింది.

ఆమె అనుకున్నట్లే ధర్మరాజు ఓడిపోయాడు. పన్నెండేళ్ళ అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం. నవ్వుకుందామె. సుభద్ర ద్వారక వెళుతుంది. కుంతి విదురుని ఇంట వుంటుంది. పంచపాండవుల వెన్నంటి వుండేది తనే.

ఆవేదన. గుండెలను మండించే అవమానాగ్ని. అరణ్యవాసంలో తను కష్టపడుతుందని పాండవులు బాధపడుతున్నారు. కౌరవసభలో జరిగిన అవమానం ముందు ఈ అరణ్యవాసం కష్టమనిపించడం లేదు తనకు.

శ్రీకృష్ణుని రాకతో, పాషాణంగా మారిన ఆమె మనసు కరిగి కరిగి కన్నీరైంది.

“కృష్ణా! ఎదురులేని వీరులైన పాండవుల భార్యని, సకల జనపూజ్యుడవైన నీ సోదరిని జుట్టు పట్టి సభలోకి ఈడ్చారు. తలలు వంచుకొని కూర్చున్న వీరి ప్రతాపాలు, శౌర్యాలు ఎందుకు! దిక్కులేని దానిలా సభలో పరాభవానికి గురయ్యాను. దుశ్శాసనుడు తాకిన ఈ నా కురులు ఇంకా భగ్గుమంటున్నాయి. కానీ కర్ణుడు అనిన మాటలు నా హృదయాన్ని చీల్చి హృదయలోతులను మండిస్తున్నాయి” రోదించింది.

శ్రీకృష్ణుని కళ్ళు దయతో నిండాయి. చల్లని దృక్కులతో ఆమెకు ఉపశమనం కలిగిస్తూ అన్నాడు

“స్త్రీని అవమానించిన ఏ రాజ్యం ప్రశాంతంగా ఉండలేదు. నీ ప్రతీకారజ్వాలల్లో సర్వ కౌరవవంశం మాడి బూడిదవుతుంది” అన్నాడు.

అవమానాల పరంపర ఆగలేదు. జయద్రధుని రూపంలో మరోసారి. వావివరసలు మరిచి అన్న వరస అయ్యే, దుస్సల భర్త తన శరీరసౌందర్యాన్ని చూసాడు. కోరుకున్నాడు. పట్టి బంధించాడు. తన శరీరం వెనక ఒక మనస్సు వుంటుందని, దాని వెనుక ఆత్మ వుందని ఈ ప్రపంచానికి తెలీదు. ఈసారి పాండవులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారు. ఇన్నాళ్ళకు తన భర్తలు తనను అవమానించిన వాడిని ‘వెంటనే’ బుద్ధి చెప్పారు. అది చాలు. అందుకే అతన్ని సంహరించకుండా, ధర్మరాజు ఆజ్ఞతో భీముడు అతని తల గొరిగి పంపేస్తే ఊరుకొంది.

పన్నెండేళ్ళ అరణ్యవాసం పూర్తయింది. అందరూ విరాటరాజు కొలువులో మారువేషాలలో అజ్ఞాతవాసం చేస్తున్నారు. విరటుని భార్య సుధేష్ణకి మాలిని పేరుతో శిరోజాలంకరణ చేసే సైరంద్రి వృత్తిలో చేరింది ద్రుపదరాజపుత్రి. పాండవపత్ని.

ఈసారి కీచకుని రూపంలో మరో పరాభవం. “నిన్ను చూడగానే నా మనసు మన్మథవశమై నీ సౌందర్యానికి పరవశమైపోయింది” అంటున్న ఆ వదరుబోతు దుష్ట వాక్కులకు ద్రౌపది మనసులో పురుషులంటేనే ఒక అసహ్యభావన అలలా ఎగసిపడింది.

“ఎందుకని పురుషుడు స్త్రీని మనిషిలా చూడలేడు! ఆమెకు ఇష్టాయిష్టాలుంటాయని ఎందుకనుకోడు! ఆమెకూ మనసుంటుందన్న ఆలోచన ఎందుకురాదు! స్త్రీ ఎలాంటిదయినా తనను చూడగానే మోహించేస్తుంది, సర్వం త్యజించి తన పొందు కోసం సిద్ధపడిపోతుందన్న భ్రమ పురుషుడికి ఎందుకు కలుగుతుంది! ఎందుకని స్త్రీ నిరుపమాన సౌందర్యం పురుషుడిలో దైవత్వ భావన కలిగించే బదులు పాశవికతను ప్రకోపింప చేస్తుంది! ఇది సృష్టి లోపమా! మానవసంస్కార దోషమా! స్త్రీ అంటే భోగవస్తువా!” అని నాడు ఆక్రోశించిన ద్రౌపది మాటలు నేడూ, ఆధునిక స్త్రీ కూడ అనుకుంటోంది.

సౌశీల్య ద్రౌపది నవలలో రచయిత కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల్లో తన అభిప్రాయాల్ని స్పష్టంగా తెలియజేసారు. ముందుమాటలో ‘ఆధునిక మహిళ ఆలోచనలనుండి కూడ ద్రౌపదిని చూస్తాను’ అని చెప్పినట్లు, ద్రౌపది మానసిక సంక్షోభాన్ని, ఆమె ఆత్మవిశ్వాసాన్ని, సంఘర్షణను రచయిత వర్ణించడం… స్త్రీవాదులైన వారు కూడ చెయ్యలేదేమో అనిపిస్తుంది. స్త్రీ శరీరాన్ని కాదు, హృదయాన్ని అర్ధం చేసుకోవాలి అనే కదా ఆధునిక స్త్రీ ఆశిస్తోంది!

భీముడు కీచకవధ గావించి ద్రౌపది మనసుకు శాంతి కలిగించాడు. కీచకుని వధతో కౌరవులకీ తెలిసిపోయింది పాండవులు విరాటనగరంలో వున్నారని.

ఉత్తర దక్షిణ గోగ్రహణాలు అయ్యాయి. పాండవుల అజ్ఞాతవాసం పూర్తయింది. సంధికార్యాలు ఆరంభమయ్యాయి. బలాబలాలు అంచనాలు వేసుకుంటున్నారు. ఐదూళ్ళు ఇస్తే చాలన్నాడు ధర్మరాజు.

“నా హృదయంలో అవమానాగ్ని రగులుతోంది. ఒక స్త్రీని అకారణంగా అవమానించి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఏ ఒక్కడూ బ్రతికి ఉన్నంతకాలం ఈ అగ్ని ఆరదు. మహిళను అవమానించిన పాపఫలం వీరు అనుభవించేవరకు నాకు శాంతి లేదు. భవిష్యత్తులో మహిళను చులకనగా చూడాలన్నా, కేవలం లైంగిక వస్తువుగా భావించాలన్నా కౌరవులకు పట్టిన గతి తలచుకుని, వినాశనమైన కౌరవులను జ్ఞప్తికి తెచ్చుకుని మహిళాశక్తికి వంగి నమస్కరించి పక్కకు వెళ్ళిపోవాలి. అలా భీకర సంగ్రామం జరిగి నా అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న తర్వాత సంధి చేసుకోండి. అయిదు ఊళ్ళు తీసుకున్నా అయిదు ఇళ్ళు తీసుకున్నా మీతో సంతోషంగా జీవితం గడుపుతాను. నా అవమానాన్ని దుష్టుల రక్తంతో కడిగిన తర్వాతే దేనికైనా రాజీ పడండి. అప్పుడే నాకు మనశ్శాంతి. మీకు గౌరవం” ముడి వేయని తన వెంట్రుకలు పట్టి చూపుతూ కోపంగా అంది ద్రౌపది.

ఆనాడే కాదు, ఈ రోజుల్లోనూ ద్రౌపది గురించి అవహేళనగా మాట్లాడే మేధావులకు అనేక చురకలు వేసారు రచయిత.

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది. దుశ్శాసనుడి మరణవార్త విన్న తరువాత ఆమె కురులు ముడి వేసుకొంది. లక్షల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులవుతున్నారు. ఇదంతా చూస్తున్న ద్రౌపది మనసు నిర్లిప్తంగా మారిపోతోంది. అంతలో అశ్వద్ధామ నిద్రలో ఉన్న ఉపపాండవులను సంహరించాడు. మాతృ హృదయం క్షోభిస్తున్నా… “ప్రశాంతంగా నిద్రిస్తున్న వారిని సంహరించడానికి నీకు చేతులెలా వచ్చాయి” అంది. “జీవచ్ఛవంలా వదిలేయండి. కనీసం ఒక తల్లికైనా పుత్రశోకం తప్పించిన వాళ్ళమవుతాం” అంది పాండవులతో.

తన జీవితం మొత్తం అపోహలు, అపార్థాలు, అవమానాలు. ఇదేనా స్త్రీ జీవితం! ధర్మం తెలియని వాళ్ళు, అజ్ఞానులు, వేద జ్ఞాన శూన్యులు, సంస్కారహీనులు, పాండిత్య హీనులు నన్ను, నా జీవితాన్ని ఎలాఅర్ధం చేసుకుంటారో నాకు బాగా తెలుసు. తమ ఆలోచనల్లో కుళ్ళును, విశృంఖలతను నాకు ఆపాదించి నన్ను అనంతకాముకిని చేస్తారు. అయిదుగురితో నా మానసిక సంబంధం కాక, శయ్యా సంబంధానికే ప్రాధాన్యమిస్తారు. ఏ యుగంలో ఏ కాలంలో కూడ పురుషుడికి స్త్రీ శరీరంతో తప్ప మనసుతో పనిలేదు కదా… అని ద్రౌపది చేత అనిపిస్తారు రచయిత.

కుసంస్కారుల ఊహకు కూడ అందని ఔన్నత్యమైన వ్యక్తిత్వమామెది. పురుషులలో ఉత్తమ గుణాలన్నీ తమలో నింపుకున్న పాండవులు, అత్యుత్తమ స్త్రీ లక్షణాలు గల ద్రౌపదితో కలవడం— ఉప నదులు మహానదిలో కలిసినంత స్వాభావికంగా, ప్రాకృతికంగా జరిగింది. కలవక ముందు నదులు వేరు, నది నీరు వేరు. కలిసిన తరువాత ఏ నీరు ఏ నదిదో చెప్పడం కుదరదు. అలాగే ద్రౌపదితో వివాహానికి ముందు వారు పంచపాండవులు. కానీ ద్రౌపదితో వివాహం తర్వాత వారు, ద్రౌపదీ సహిత పంచపాండవులు.

రచయిత మురళీకృష్ణ చేసిన ఈ భావన అత్యద్భుతంగా అమరిపోయింది. నదిలా పవిత్రమైన వారి సంగమం తరాల్ని, కాలాన్ని దాటి ఇప్పటికీ జీవంతో ప్రవహిస్తోంది. అలాగే “స్వేచ్ఛ” గురించి రచయిత ఇలా చెప్తారు… “వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వ్యక్తి స్వచ్ఛందంగా నియమాలతో ఒదిగివుండటం వల్ల ప్రస్ఫుటమవుతాయి. తనలో అనంతశక్తి ఉన్నా లోకకళ్యాణం కోసం ఆ శక్తిని నియంత్రణలో ఉంచుకోవడం వ్యక్తి ఇచ్ఛాశక్తికి నిదర్శనం. పెద్దల మాటలు వినడం వ్యక్తిత్వరాహిత్యమనీ, నియమపాలన చేతకానితనమనీ భ్రమపడే వారికి స్వాతంత్ర్యమంటే అర్ధం తెలియదు”.

“దాంపత్య సంబంధంలో స్త్రీ భర్త నిర్ణయాలను అనుసరిస్తుంది. కానీ ఆ నిర్ణయాలలో తననూ భాగస్వామిని చేయాలని ఆశిస్తుంది. అది భర్త తనకు ఇచ్చే గౌరవంగా భావిస్తుంది. తన మేధను భర్త గుర్తించడంలా భావిస్తుంది. అది తెలుసుకొని భార్య అభిప్రాయాన్ని అడగడం భర్త విధి”.

పాశ్చాత్య భావాల్ని పుణికిపుచ్చుకుని, అర్ధంలేని ఆలోచనలతో సతమతమయ్యే ఆధునిక యువతీయువకులకు మురళీకృష్ణ గారు అన్యాపదేశంగా చెప్తున్నారనిపిస్తుంది. అది అర్థం చేసుకునే పరిణత మనసు వీరికి ఎప్పుడు కలుగుతుందో! ఆ పరిణత కలిగించే తల్లిదండ్రులు, చదువులు, సమాజం ఎప్పుడు సన్నద్ధమవుతుందో!

శ్రీ కస్తూరి మురళీకృష్ణ ఈ నవలలో ద్రౌపదిని మహామహిమాన్వితమైన శక్తి స్వరూపిణిగా చిత్రించారు. ఆమె లోని “స్త్రీ హృదయాన్ని” అద్భుతంగా ఆవిష్కరించారు. జీవితంలో, దాంపత్యంలో నాటి (నేటి…!) సమాజపు వికృత వ్యాఖ్యలకు పెనగులాడిన ద్రౌపది లోని సంయమనం, నిర్భయత్వం ఎంతో గొప్పగా వివరించారు. ఆమె మనసులోని సంఘర్షణను విశ్లేషాత్మకంగా వర్ణించారు.

ద్రౌపది ఆత్మ ఔన్నత్యానికి అచ్చమైన ప్రతీక ఈ ‘సౌశీల్య ద్రౌపది’ నవల.

***

సౌశీల్య ద్రౌపది (నవలిక)
రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ,
పుటలు: 96, వెల: రూ.50/-
ప్రతులకు: సాహితీ ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట,
విజయవాడ – 520004. ఫోన్: 0866-2436643
ఈబుక్ కినిగెలో లభ్యం:
http://kinige.com/book/Sowsilya+draupadi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here