మానవీయ “స్పర్శ్”

0
10

కొన్ని సార్లు లఘు చిత్రాలు volumes మాట్లాడతాయి. కాని కొన్ని సార్లు లఘు చిత్రాలు అవి నిడివి తక్కువ వుండడమే అసంతృప్తిని కలిగిస్తాయి. అవి ఇంకాస్త వివరంగా, నమ్మబలికేలా, అర్థమయ్యే పాత్రలతో వుండాలనిపిస్తుంది. ఒక కథ, సినిమాలోనైనా మూలం అదే కదా, అవసరమైనవి అన్నీ ఉంటూనే అనవసరాలు పరిహరించేవిగా ఉండాలి కదా.
ఈ వారం ఎంచుకున్న లఘు చిత్రం “స్పర్శ్” అందులోని నటుడు కే కే మెనన్ ను చూసి ఎంచుకున్నాను. లఘు చిత్రంలో కూడా తన పూర్తి impact చూపించాడు. అతని తర్వాత మరో నటుడు ప్రశాంత్ నారాయణ్ ఆ ముస్లిం కేబ్ డ్రైవర్ గా.
ఇక కథ ముందుకీ వెనక్కీ వెళ్తూ కొంచెం కొంచెం గా వ్యక్తమవుతుంది. ఆ పోలీస్ స్టేషన్ లో కే కే మెనన్ ఒక ఇన్స్పెక్టర్. వ్యవస్థ తో విసుగు పుట్టి VRS కి అప్లై చేసి, వూరు వెళ్ళిపోదామనుకుంటాడు. ఆ ముంబై పట్టణంలోని ఎన్నో నేరాలు చూసాడు. ఎలా ధనవంతుల పిల్లలు అన్యాయం చేసీ తప్పించుకుంటారో, ఎలా ఇంకొందరు బలవుతుంటారో అన్నీ చూసిన వాడు. అతని ముందు ఒక కేసు వస్తుంది. ఒక కేబ్ డ్రైవర్ ఒక మొటొర్ సైక్లిస్ట్ ను గుద్దడం. ఆ స్పాట్ కు వెళ్ళి ఆ గాయ పడ్డ వాణ్ణి ఆసుపత్రికి పంపి, డ్రైవర్ ని అరెస్ట్ చేస్తాడు. ఆ రోజు ఇద్దరు అమ్మాయిలు షేర్ చేసుకున్నారు ఆ కేబ్ ను. ఒకామె తన పుట్టినరోజు పార్టీ కి అందరూ ఎదురు చూస్తున్నారని దిగి ఆటో లో వెళ్ళి పోయింది. రెండో అమ్మాయి అక్కడే ఆగి వుంది, ఆమె డ్రైవర్ తో పోట్లాటకు దిగి అతని కాలర్ పట్టుకుంది, అతను ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమె చెంపలు కంది వున్నాయి.
కే కే మెనొన్ అన్నీ కానిచ్చి, షెర్లాక్ హోంస్ వాట్సన్ సందేహాలు తీరుస్తున్న పధ్ధతిలో అంతా కాన్స్టేబల్ కు వివరిస్తుంటాడు. తప్పెవరిది? ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయిదా? కాలర్ పట్టుకున్న అమ్మాయిదా? డ్రైవర్ దా? కారు కు “అడ్డం” వచ్చిన మోటర్ సైక్లిస్ట్ దా? లేక ఆ రెండో అమ్మాయి బాయ్ ఫ్రెండ్ దా? మన అందరిదీ అంటాడు కే కే మెనొన్.
అంకుష్ భట్ట్ దర్శకత్వం బాగుంది. కథ, కథనాల్లో కొంత శ్రధ్ధ అవసరం, కొన్ని వివరాలు అవసరం. లేదంటే ఏదో నైతికత బోధిస్తున్న కథలా వుంటుంది, సహజంగా అనిపించదు.


బాగానే వుంది. అయితే ఆ అమ్మాయి ఆమె బాయ్ ఫ్రెండ్ ల మధ్య సంబంధం, ఆ రోజు వారి మధ్య జరిగిన దానికి నేపథ్యమై, ఇద్దరి స్వభావాలు మరింత వివరంగా తెలియాల్సిన అవసరం వుంది, సరిగ్గా నిర్ధారణకు రావడానికి. ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మాయి కథలో వున్నంత స్పష్టంగా. ఇక ఆ డ్రైవర్ పాత్ర చిన్నదే అయినా ప్రకాశ్ నారాయణ్ చెప్పకుండానే చాలా చెబుతాడు తన నటనతో.
ఒక మంచి లఘు చిత్రమే, కానైతే షెర్లాక్ హోంస్ కథల్లోలాగా అన్నీ పూర్తి వివరాలుండవు. అదొక్కటే అసంతృప్తి. కే కే మెనొన్ కోసం తప్పక చూడవచ్చు. చిత్రం యూట్యూబ్ లో వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here