[‘అంతర్ముఖం’ అనే కథాసంపుటి వెలువరించిన డా. ఆలూరి విజయలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. ఆలూరి విజయలక్ష్మి గారూ.
డా. ఆలూరి విజయలక్ష్మి: నమస్కారం.
~
ప్రశ్న 1. మీరు ఇటీవల ప్రచురించిన 13 కథల సంపుటికి శీర్షికగా మొదటి కథ ‘అంతర్ముఖం’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: ‘అంతర్ముఖం’ కథను పుస్తకం శీర్షికకు ఎంచుకోవడానికి కారణం ఆ కథ నా మెడికల్ కాలేజి స్మృతుల పేటిక, ఒక డాక్టర్‌గా నా విశ్వాసాలను వ్యక్తపరచిన కథ, నా సహాధ్యాయులందరికి బాగా నచ్చిన కథ. నేను చదువుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజి శతాబ్ది ఉత్సవాల సువెనీర్‌లో విశేష ప్రచురణ పొందిన కథ. అంతకంటే ప్రత్యేక కారణమేమీలేదు.
ప్రశ్న 2. మీరు ప్రసూతి వైద్యులుగా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా, అనువాదకురాలిగా 61 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారు. మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: నేను చదవడం నేర్చుకున్న దగ్గర నుండి పుస్తకాలు చదవడం అత్యంత ప్రీతిపాత్రమైన వ్యసనం అయింది. స్కూలు లైబ్రరీ, పంచాయితి లైబ్రరీ లోని పుస్తకాలను సులభంగా తెచ్చుకుని చదవడానికి అవకాశం ఉండడం వలన వందలాది పుస్తకాల్ని చదువుతూ ఇంక పుస్తకం చదవకుండా ఉండలేని స్ధితికి చేరుకుని క్రమేపి రాయాలనే కోరికకు బీజం పడింది. డా. శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’, లత ‘ఊహాగానం’ ప్రేరణ, హిందీ విశారద దాకా చదవడం వలన హిందీ సాహిత్య పరిచయం, నా కోరికకు ఊపిరి పోసాయి.
ఎంబి.బి.ఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు నేను రాసిన తొలి కథ ‘మలుపు’ ఆంద్రప్రభ వారపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో ప్రత్యేక బహుమతిని పొందింది. దానితో రచయిత్రిగా విశాఖకు పరిచయమయాను. అపరిణత వయసు, అరకొర సాహిత్య అవగాహన. సాహిత్య పఠనమే మొదటి ప్రాధాన్యం, ఇష్టం. నా సీనియర్ తంబు, క్లాస్‌మేట్ వివేకానందమూర్తితో పాటు విశాఖ రచయితల సంఘంలో ప్రవేశం పొందాక రావిశాస్త్రి గారు, రంగనాయకమ్మ గారు, కాళీపట్నం రామారావు గారు, బలివాడ కాంతారావు గారు మొదలైన ప్రసిద్ధ రచయితల పరిచయం, వారితో కలిసి విశాఖ రచయితల సంఘం సమావేశాల్లో పాల్గొనడం వలన ఏమి రాయాలో, ఏమి రాయగూడదో, ఎవరి కోసం రాయాలో, కొంతవరకు అవగాహన ఏర్పడింది.
ఆంధ్ర మెడికల్ కాలేజి విద్యార్ధినిగా ఉండగా పొందిన అపురూప గౌరవం ‘విశాఖ సాహితి’ ఆధ్వర్యంలో రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారి సంపాదకత్వంలో ప్రచురింప బడిన ‘విశాఖ’ పత్రిక సంపాదక వర్గ సభ్యత్వం.
చదువు పూర్తి చేసుకుని కాకినాడలో ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించేదాక అప్పుడప్పుడు చాలా తక్కువ కథలు మాత్రమే రాసాను.
తొలి కథా సంకలనం ‘మీరు ప్రేమించలేరు’ను శ్రీరాచకొండ విశ్వనాధశాస్త్రి గారి పీఠికతో 1976లో నవోదయ పబ్లిషర్స్ వారు ప్రచురించారు.
తొలి నవల ‘సజీవ స్వప్నాలు’ ‘విశాలాంధ్ర’ దినపత్రికలో 1978లో సీరియల్‌గా వచ్చింది. దీనిని కూడా నవోదయ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. శ్రీ మహీధర రామమోహనరావు గారు పీఠికను రాసారు. కాకినాడలో నిర్వహింపబడిన అభ్యుదయ రచయితల సంఘం 8వ రాష్ట్ర మహాసభల వేదికపై శ్రీ చాసో ఈ నవలను ఆవిష్కరించారు.
‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’, ‘వనిత’, ‘అభ్యుదయ’, ‘విశాలాంధ్ర’, ‘ఆంధ్రజ్యోతి’, ‘యువజన’, ‘స్పందన సాహితి’, మొదలైన పత్రికలలో ప్రచురింపబడిన కథలను ‘మాకీ భర్త వద్దు’ శీర్షికతో, ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి పీఠికతో నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనంగా ప్రచురించారు. శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
80వ దశకం ప్రారంభంలోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు శ్రీ నండూరి రామమోహన రావుగారి సంపాదకత్వంలో ప్రారంభమయిన ‘వనితా జ్యోతి’ మాసపత్రికలో రెండవ నవల ‘చైతన్యదీపాలు’ సీరియల్‌గా వచ్చింది. దీనిని నవోదయ పబ్లిషర్స్ వారు పుస్తక రూపంలో ప్రచురించారు. ప్రసిద్ధ రచయిత, విమర్శకులు, శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం ఆవిష్కరించారు
1983లో శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి ప్రోత్సాహంతో, ఆయనే పెట్టిన శీర్షిక ‘పేషెంట్ చెప్పే కథలు’ ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో సుమారుగా 30 వారాల పాటు, ప్రతి వారం ప్రచురింపబడినాయి. నవోదయ పబ్లిషర్స్ వారే ఈ కథల్ని కూడా పుస్తక రూపంలో ప్రచురించారు.
80వ దశకంలో ‘ప్రభవ’ మాసపత్రికలో ‘ప్రత్యూషపవనం’ అనే నవలిక, ‘ఆంధ్రభూమి’ మాసపత్రికలో ‘వెలుతురు పువ్వులు’ అనే నవలిక ప్రచురింపబడినాయి. విజయ సమీర పబ్లికేషన్స్ ఈ రెండు నవలికలను కలిపి పుస్తకంగా ప్రచురించింది.
90వ దశకంలో విశాలాంధ్ర, ‘ఆంధ్రప్రభ’, ఆంధ్రజ్యోతి, వనిత, రచన, ఇండియా టుడే, వంటి వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికలు, కళాసాగర్, మద్రాస్ వారి సువెనీర్‌లో అనేక కథలు ప్రచురింపబడినాయి.
కథాసంకలనం, ‘అగ్నికిరణం’ను ‘మాలతీ చందూర్’ గారి పీఠికతో విజయ సమీర పబ్లికేషన్స్ ప్రచురించింది. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకులు శ్రీ వాకాటి పాండురంగారావుగారు ఆవిష్కరించారు.
కథాసంకలనం, ‘జ్వలిత’ ను ప్రసిద్ధ పాత్రికేయులు, సంపాదకులు, శ్రీ ఎ.బి.కె. ప్రసాద్ గారి పీఠికతో విజయ సమీర పబ్లికేషన్స్ ప్రచురించింది.‘జ్వలిత’ను ‘తరుణసాహితి’ హైదరాబాద్, ఆధ్వర్యంలో 2005వ సంవత్సరంలో ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఆవిష్కరించారు.
‘ప్రభవ’. ‘ఆంధ్రభూమి’ మాసపత్రికల అనుబంధ నవలికలు ‘ప్రత్యూషపవనం’, ‘వెలుతురు పువ్వులు’ రెండిటిని కలిపి విజయ సమీర పబ్లికేషన్స్ పుస్తక రూపంలో ప్రచురింపగా 2014లో లోక్‌సత్తా వ్యవవస్ధాపకులు డా. ఎన్. జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు.
‘అంతర్ముఖం’ కథా సంపుటిని విజయ సమీర పబ్లికేషన్స్ పుస్తక రూపంలో ప్రచురింపగా, ‘అంతర్ముఖం’ అక్షరయాన్ ఆధ్వర్యంలో ‘నేటినిజం’ పత్రిక సంపాదకులు శ్రీ భైస దేవదాస్ ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ ‘మహిళ’ లో ప్రచురింపబడిన ‘మహిళలు– సినిమాలు’ అనే వ్యాసాన్ని తరువాత బెంగుళూర్ విశ్వవిద్యాలయం పి.యు.సి. టెక్స్ట్ బుక్‌లో చేర్చారు.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి సంపాదకత్వంలో, రాజాలక్ష్మీ ఫౌండేషన్, మద్రాస్, వారి సువెనీర్ ‘రాజకమలం’లో ప్రచురించిన ‘డాక్టర్ రచయిత అయితే’ అను వ్యాసం తరువాత సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారి బి.ఏ. టెక్స్ట్ బుక్‌లో చేర్చబడింది
‘మాతృత్వం, ఒక తియ్యటి కల’ (గర్భిణులకు సూచనలు-సలహాలు)ను స్వంత ప్రచురణ సంస్ధ ‘విజయ సమీర పబ్లికేషన్స్’ 1982లో ప్రచురించింది. ఆ తరువాత కొన్ని దశాబ్దాలుగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ‘మాతృత్వం’ పేరుతో అనేక వేల ప్రతుల్ని ముద్రించింది. ఈ పుస్తకం గర్భిణులకు కరదీపికగా ఉపయోగపడుతూందని ప్రశంసించబడిరది..
‘వనిత’ మాసపత్రికలో అనేక కథలు ప్రచురింపబడినాయి. అప్పటికి ఇంకా పత్రికలలో హెల్త్ కాలమ్‌ని అరుదుగా మాత్రమే నిర్వహిస్తున్న సమయంలో కొన్ని సంవత్సరాలపాటు ‘వనిత’లో ‘ఆరోగ్య విజయాలు’ పేరిట మహిళల కోసం ‘హెల్త్ కాలమ్’ ని నిర్వహించడం జరిగింది.
మానవ శరీరంలోని వివిధ వ్యవస్ధల నిర్మాణం, ధర్మాల గురించి సులభంగా సామాన్యులకు అర్థం అయేలా రాయమని ‘వనిత’ సంపాదకులు కోరగా రాసిన వ్యాసాలను ‘వనిత’లో 14 నెలల పాటు ప్రచురించారు. ఈ వ్యాసాలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ‘మన దేహం కథ’ శీర్షికతో పుస్తక రూపంలో ప్రచురించారు. దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ బ్లాక్ బోర్డ్’ కి ఎంపిక చేసి కొన్ని వేల పుస్తకాల్ని అనేక సంవత్సరాల పాటు కొనుగోలు చేసింది.
మహిళల ఆరోగ్య అంశాల అవగాహనకు కథారూపంలో రాసిన 12 రచనలను ‘మాతృక’ పత్రిక ప్రచురించింది.
‘రచన’ మాసపత్రిక లో ప్రచురింపబడిన ‘పూదోట’ అను కథను శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం ‘ఫ్లవర్ గార్డెన్’ పేరిట ఆంగ్లంలోకి అనువదించి ‘హ్యుమన్‌స్కేప్’ అను ఆంగ్ల పక్ష పత్రిక నిర్వహించిన అన్ని భారతీయ భాషలలోని కథల ఆంగ్లానువాదాల పోటీలో 12 అత్యుత్తమ కథలలో ఒకటిగా ఎంపిక అయింది.
90వ దశకంలో నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగపు పరిశోధక విద్యార్ధిని శ్రీమతి సుజాత ‘ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై థీసిస్‌ని సమర్పించి ఎమ్.ఫిల్. పొందారు.
1978లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే తూర్పు గోదావరి జిల్లా గ్రంధాలయ సంస్ధ సభ్యురాలిగా నియామకం చేసింది. 5 సంవత్సరాలపాటు బాధ్యతల్ని నిర్వహించడం జరిగింది.
అధికార భాషా సంఘం జిల్లా కమిటి సభ్యురాలుగా నియామకం.
1993లో న్యూయార్క్‌లో జరిగిన ‘తానా’ సభల్లో కవి సమ్మేళనంలో, మహిళా సమావేశంలో పాల్గొని ప్రసంగించే అవకాశం కలిగింది.
ప్రపంచబేంక్ ప్రాజెక్ట్స్ పోటీలో విజేత: 2004వ సంవత్సరంలో ప్రపంచ బేంక్ భారతదేశ గ్రామాలలో విద్య, ఆరోగ్యం, విద్యుత్తు, వ్యవసాయం, నీరు, ఆర్థిక వనరులు మొదలైన సేవల పెంపుదల కోసం నిర్వహించిన సృజనాత్మక ప్రాజెక్ట్స్ పోటీలో దేశవ్యాప్తంగా సుమారుగా 1500 ప్రాజెక్ట్స్ పోటీలో నిలవగా ప్రపంచబేంక్ 20 ప్రాజెక్ట్స్‌ని విజేతలుగా ఎంపిక చేసింది. ‘మహిళల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత’ అను శీర్షికతో ‘సిడొ’ ప్రాజెక్ట్ కూడా అందులో ఒకటి. ప్రాజెక్ట్ నిర్వహణకోసం ప్రపంచబేంక్ 20,000 అమెరికన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించింది. సంవత్సరం, ఆరు నెలల పాటు ప్రాజెక్ట్‌ని అమలుచేసాక ప్రపంచబేంక్ పోటీలో విజేతలుగా నిలిచిన 20 ప్రాజెక్ట్స్ అమలు పరచిన తీరు, ఫలితాల స్రాతిపదికగా బేరీజు వేసి అత్యుత్తమంగా అమలుపరచిన 5 ప్రాజెక్ట్స్‌ని ఎంపిక చేయగా ఆ 5 లో మా ప్రాజెక్ట్ కూడా ఉంది.
ఆ ప్రాజెక్ట్ అమలులో భాగంగా ‘కౌమార బాలికల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత’ పై సమగ్ర అవగాహన కలిగించడానికి ‘కౌమార బాలికల ఆరోగ్యం’ శీర్షికతో పుస్తకాన్ని ప్రచురించగా తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల గ్రంధాలయాలలో రాజీవ్ విద్యా మిషన్ సహకారంతో ఉచితంగా పంచాము.
‘కౌమార బాలికల ఆరోగ్యం’ పుస్తకాన్ని సంక్షిప్తీకరించి బాలురకు కూడా అవగాహన కలిగించేలాగా రాసిన చిన్ని పుస్తకం ‘కౌమార బాలల ఆరోగ్యం’. పాఠశాలలలో చదువుతున్న, బడి మానేసిన సుమారుగా 1,00,000 మంది బాలికలకు ‘కౌమారబాలల ఆరోగ్యం’ పుస్తకాన్ని ఉచితంగా అందించాము.
అనువాదాలు: ‘వైద్యుడులేనిచోట’, ‘మనకు డాక్టర్ లేని చోట’,‘మానపిక వైద్యుడు లేని చోట’- హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్. వైద్యుడు లేని చోట అత్యంత ప్రయోజనం గల, ప్రసిద్ధి పొందిన పుస్తకం.
రక్తం కథ, తుంప మరియు పిచ్చుకలు, తాబేలు మళ్ళీ గెలిచింది –నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, న్యూఢల్లీ.
యోగాతో నడుము నెప్పి నివారణ–వి.జి.కె. పబ్లికేషన్స్, విజయవాడ.
ఆకాశవాణి: విశాఖపట్టణం, విజయవాడ అకాశవాణి కేంద్రాల ద్వారా కథలు ప్రసారమయాయి. ఒక నాటకం ప్రసారమయింది.
దూరదర్శన్ కవిసమ్మేళనాల్లో, చర్చా గోష్టుల్లో పాల్గొనడం జరిగింది.
కేంద్ర సాహిత్య ఎకాడమీ ప్రచురణలు ‘హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియన్ రైటర్స్’, ‘హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియన్ ట్రాన్స్‌లేటర్స్’ లో పేరు చేర్చబడిరది.
సాహిత్య సభల నిర్వహణలో భాగస్వామ్యం:
‘విశాఖ రచయితల సంఘం’ తరపున 1962-1967 మధ్య నిర్వహించిన సభలన్నిటిలోనూ చురుకుగాపాల్గొనడం
‘కవితా స్రవంతి’ సాహిత్య సంస్ధ అధ్యక్షురాలిగా అనేక సాహిత్య సభల నిర్వహణ
1978లో కాకినాడ లో జరిగిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ 8వ రాష్ట్ర మహాసభల ఆహ్వానసంఘ
ఉపాధ్యక్షురాలిగా విధినిర్వహణ
1980లో కాకినాడ లో జరిగిన ‘శ్రీశ్రీ సప్తతి మహోత్సవం’ ఆహ్వాన సంఘ అధ్యక్షురాలిగా విధి నిర్వహణ.
1976- 2013 మధ్య కాలంలో కాకినాడ లో జరిగిన జిల్లాస్ధాయి, రాష్ట్రస్ధాయి రచయితల సభలన్నిటిలోనూ భాగస్వామ్యం.
2012లో కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో కాకినాడలో 3 రోజులు సాహిత్య సభలు, పుస్తక ప్రదర్శననిర్వహణ
శ్రీశ్రీ శతజయంతి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజుల శతజయంతి సభల నిర్వహణ,
శ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి సాహిత్యంపై సెమినార్, చాసో సాహిత్యంపై సెమినార్ నిర్వహణ
శీశ్రీ, శ్రీపాద, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, చాసో సాహిత్యంపై కళాశాల, పాఠశాల విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు పెట్టి, విజేతలకు ఆయా రచయితల సాహిత్యాన్ని బహుమతులుగా ఇవ్వడం జరిగింది.
‘కథాసుగంధం’ వేదికను ఏర్పాటు చేసి దాట్ల దేవదానం రాజు, కె.బి.కృష్ణ, స్కైబాబ, పుప్పాల సూర్యకుమారి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి మొదలైన రచయితల సాహిత్యంపై చర్చాగోష్టుల్ని నిర్వహించడం జరిగింది.
శ్రీ పతంజలి శాస్త్రి, శశికాంత్ శాతకర్ణి, గిడుగు రాజేశ్వరరావు, పసుమర్తి పద్మజావాణి, ఎమ్.ఎస్.సూర్యనారాయణ మొదలైన వారి పుస్తకావిష్కరణ సభల నిర్వహణ.
ప్రశ్న 3. పలు సమకాలీన సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలుగా మలిచారు. వీటి వెనుక మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు తోస్తుంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: వృత్తి రీత్యా, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకొనడం వలన, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రోటరీ స్ధానిక విభాగాల అధ్యక్షురాలిగా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, లోక్ సత్తా ఉద్యమసంస్ధ, లోక్‌సత్తా పార్టీ జిల్లా శాఖల అధ్యక్షురాలిగా, అర్బన్ హెల్త్ సెంటర్ కో-ఆర్డినేటర్‌గా, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ వైస్ ఛైర్మన్‌గా, వికలాంగ బాలికల కో ఫౌండర్‌గా, స్త్రీల వృద్ధాశ్రమం ఫౌండర్‌గా, ప్రజలతో, ముఖ్యంగా స్త్రీలతో ఉన్న సాన్నిహిత్యం మనుషులను దగ్గరగా పరిశీలించడానికి, సామాజిక సమస్యల పట్ల నా అవగాహనను పెంచుకోవడానికి, నాకు తోచిన రీతిలో, నా పరిమితి మేరకు ప్రతిస్పందించడానికి తోడ్పడింది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు, ఆ అంశం గురించి బలంగా వ్యక్తపరచడానికి అనువైన నేపథ్యం గురించి ఆలోచిస్తాను. డొంక తిరుగుడు లేకుండా చెప్పదలుచుకున్నదాన్ని సూటిగా చెప్పడాన్ని అనుసరిస్తాను.
ప్రశ్న 4. కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జ: వస్తువు, శిల్పం, శైలి మూడు సముచితంగా ఉంటే గొప్ప కథలు సృష్టించబడతాయి. నా కథల్లో వస్తువుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. శిల్పం, శైలి గురించి నేను అంతగా ఆలోచించను, పెద్దగా ప్రయత్నం చెయ్యను. అది లోపమే కావచ్చు.
ప్రశ్న 5. మీ సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో సమాజంలోనూ, సాహిత్య రంగంలోనూ ఏ మార్పులను మీరు గుర్తించారు? వర్తమాన కథా రచయితలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: గత 3 దశాబ్దాలలో సమాజం వేగంగా మారుతూంది. ముఖ్యంగా గ్లోబలైజేషన్, ఆర్థిక సరళీకరణల తరువాత ఆర్థిక అంతరాలు గాఢంగా మారాయి. సాధారణ ప్రజల బ్రతుక్కు భద్రత, భరోసా లేకుండా పోయాయి. దిశ లేని, లక్ష్యం తెలియని పరుగు మనిషిని వేగంగా నెట్టేస్తూంది. డబ్బుకు పెరిగిన అపరిమితమైన, అనుచితమైన ప్రాధాన్యత, అనుబంధాల క్షీణత మనిషిని ఒంటరిని చేసి ఎమోషనల్‌గా నలిబిలి చేస్తున్నాయి. తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాట, మోసాలు చేసైనా సరే తాను కోరుకునేది పొందాలన్న దురాశ, ప్రక్కవాడిని చంపైనా సరే లాక్కోవాలన్న పైశాచికత్వం, ఎదుటివాడు ఆకలితో చస్తున్నా సరే రవ్వంత కూడా స్పందన లేకపోవడం, ప్రజలకు సేవకులుగా వుండాల్సిన పాలకులు పీడకులుగా ప్రవర్తించడం – ఇలా సమాజంలోనూ, మనుషుల మనస్తత్వాల్లో, ప్రవర్తనలలో వస్తున్న ఉప్పెనలను ప్రతిభావంతంగా, ప్రభావశీలంగా చిత్రిస్తున్న రచనలు, మనిషికి బ్రతుకు మీద ఆశను కలిగిస్తూ, అవసరమైతే పిడికిళ్లు బిగించి ప్రతిఘటించడానికి తగిన ప్రేరణను ఇచ్చే రచనలు రావలసినంతగా రావడం లేదేమోననిపిస్తుంది.
కొంతమంది వర్తమాన రచయితలు సమకాలీన సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్న అంశాల గురించి, ఆధునిక జీవితంలో అనివార్యంగా వస్తున్న కొత్త సమస్యల గురించి బాగా రాస్తున్నారు. సమాజంలోని వైకల్యాల్ని ఎటువంటి పరదాలూ లేకుండా ఎత్తి చూపుతూనే సమాజం ఇంతకంటే మెరుగ్గా మారడానికి అవసరమైన రచనలు ఇంకా ఎక్కువగా రావాలని నా ఆశ.
ప్రశ్న 6. తొలి కథ నాటి నేటి నుంచి ఇటీవలి వాట్సప్ గ్రూపుల కథల వరకూ, ఆడియో కథల వరకూ – పాఠకులను చదివించేందుకు – మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులలో ఏయే మార్పులు గమనించారు? సాంకేతిక అంశాలలో ఎప్పటికప్పుడు ఎలా అప్‍డేట్ అయ్యారు?
జ: ఇప్పుడు చదివే ఓపిక, ఒక విషయం మీద మనసును లగ్నం చేసే తీరిక లేక చిన్న కథల్ని, ఒక పేజీ కథల్ని, కార్డు కథల్ని, ఇంకా, చదివే కథల కంటే వినే కథలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తూంది. సాంకేతికత, అభిరుచుల పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నన్ను నేను మలచుకున్నదేమీ లేదు. పూర్తిగా అవగాహన లేదు కాని సంపూర్ణ అజ్ఞానం కూడా లేదు.
ప్రశ్న 7. ఈ సంపుటి లోని ‘అంతర్ముఖం’ అనే కథ చాలా చక్కని కథ. ఈ కథకి ప్రేరణ ఎంబిబిఎస్ నాటి మిత్రుల రీయూనియన్ లాంటి కలయిక అని అనిపిస్తుంది. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: ‘అంతర్ముఖం’ కథ నా నిజ జీవిత కథ, వాస్తవం ఎక్కువ, కల్పన తక్కువ. 1961లో ఆంధ్రా మెడికల్ కాలేజిలో ఎం.బి.బి.ఎస్.లో చేరిన బేచ్ మీట్ 2012లో విశాఖలో జరిగింది. ఆ వెంటనే కథ రాసాను. ‘చినుకు’ మాస పత్రికలో ప్రచురితమయింది. అప్పుడే మా బేచ్ వాట్సాప్ గ్రూపును ప్రారంభించారు. వాట్సాప్‌లో కథను షేర్ చేసాను. క్లాస్‌మేట్స్ అందరికీ కథ నచ్చింది.
కోవిడ్ సమయంలో 5 వారాలు మా అమ్మాయిలు నన్ను హాస్పటల్‌కి వెళ్ళకుండా నిషేధించారు. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఆమెజాన్ సెల్ఫ్ పబ్లిషింగ్ కోర్స్ చేసాను. తరువాత నా కథల్ని ఇంగ్లీష్‌లోకి అనువదించి అమెజాన్‌లో 2 సంపుటిలుగా సెల్ఫ్ పబ్లిష్ చేసాను.
ప్రశ్న 8. ‘మథనం..’ కథలో ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమైన, చర్చించాల్సిన సమస్యని పాఠకుల ముందు పెట్టారు. విద్య లాంటి తల్లులు, మాధవరావు లాంటి తండ్రులు ప్రస్తుత సమాజంలో ఎంతో అవసరం. కానీ యువతపై బయటి శక్తుల ప్రభావాన్ని నియంత్రించేదెవరు? ఎలా? ఈ విషయంలో ఓ వైద్యురాలిగా, సామాజిక కార్యకర్తగా తల్లిదండ్రులకు, యువతకు మీ సూచనలు, సలహాలు ఏమిటి?
జ: ‘మథనం’ కథకు నిజజీవిత మూలం ఉంది. వేగంగా మారుతున్న సమాజంలో కౌమార దశలోని బాలబాలికలు ఒకే సమయంలో తమలో కలుగుతున్న శారీరక, మానసిక, భావోద్వేగ, లైంగిక మార్పుల గురించి తెలుసుకుని, వాటిని సంబాళించుకునే శక్తిని పొందడానికి; తమను అనేక వైపులనుండి వలేసి లాగుతున్న ఆకర్షణల నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన అవగాహనను, సామర్థ్యాన్ని తల్లిదండ్రులు, విద్యావ్యవస్ధ కలిగించాలి. ఆ ప్రయత్నాన్ని నా పరిధిలో నేను చేసాను. ‘కౌమార బాలల ఆరోగ్యం’ పేరుతో ఒక పుస్తకాన్నిరాసి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, రోలరీ, లయన్స్ లాంటి అంతర్జాతీయ సేవాసంస్ధలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఛారిటబుల్ ట్రస్ట్స్, వదాన్యుల సహకారంతో లక్షమంది విద్యార్థులకు అంద జేయడమే కాక సుమారు 25 వేలమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు, ఎస్.సి., బి.సి. హాస్టల్స్ విద్యార్థినులకు ప్రత్యక్షంగా బోధించడమే కాక సుమారు 500 మంది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 500 మంది ఉపాధ్యాయినులకు 5-6 సంవత్సరాల వ్యవధిలో శిక్షణను ఇచ్చాను. ఇందులో కొంతమందైనా ప్రభావితమయారు. ఆ ఎడ్యుకేషన్ అవసరాన్ని గుర్తించి తమంతట తాము క్లాస్ తీసుకోమని నన్ను కోరే చైతన్యాన్ని సంతరించుకున్నారు. జిల్లా కలెక్టర్లు, రాజీవ్ విద్యామిషన్ అధికారులు, స్త్రీ శిశు, సంక్షేమ అధికారులు ఎంతగానో సహకరించారు కాబట్టి ఆ స్వల్పమైనా చెయ్యగలిగాను. కొంత పలుకుబడి ఉంది కాబట్టి అనివార్యంగా ఎదురైన సవాళ్లను కొంత సులభంగానే అధిగమించగలిగాను.
వ్యక్తుల ప్రయత్నాల ప్రభావం పరిమితం. వ్వవస్ధలు పూనుకోవాలి. నిబద్ధతతో పనిచెయ్యాలి.
ప్రశ్న 9. ‘యుద్ధభూమి’ కథలో కరోనా కాలపు కష్టనష్టాలను ఆర్ద్రంగా చిత్ర్రించారు. కరోనా ఇతివృత్తాలపై పేషంట్స్ దృక్కోణం నుంచి కథలు ఎక్కువే వచ్చినా, వైద్యుల దృక్కోణం నుంచి కథలు తక్కువే. డా. నివేదితకి అండగా నిలిచిన శ్వేత, నరేంద్ర లాంటి వ్యక్తులు మీకు తారసపడ్డారా? ఈ కథ వెనుక నేపథ్యం వివరిస్తారా?
జ: ‘యుద్ధం’ కథ ఫస్ట్ వేవ్, ‘యుద్ధభూమి’ కథ సెకండ్ వేవ్ కరోనా అనుభవాలతో రాసిన కథలు, ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వేవ్స్ నడుస్తూ వుండగానే ప్రచురితమయాయి. అలాగే కాకపోయినా ఆ కల్లోల కాలంలో మానవతను చాటుకోవడాన్ని చూసాను, కొంత నా విష్‌ఫుల్ థింకింగ్ కూడా. మనుషులు కొంత స్వార్థాన్ని విడనాడి విశాల హృదయంతో స్పందించాలనే ఆకాంక్ష.
ప్రశ్న 10. ‘ఊబి’ కథలో – “ఇప్పుడిది ఎక్కడో దూరంగా లేదు. మనలాంటి వాళ్ళ ఇళ్ళల్లోకి కూడా వచ్చేసింది..” అన్న వాక్యాలు వాస్తవ పరిస్థితులపై భయాందోళనలు కలిగిస్తాయి. డ్రగ్స్ సమస్యని పూర్తిగా నివారించడమనేది వ్యక్తుల చేతిలో లేకపోయినా, నియంత్రణకి వ్యక్తిగతంగా గట్టి ప్రయత్నమే చేయాలని శైలజ పాత్ర సూచిస్తుంది. ఈ కథ వెనుక నేపథ్యం వివరిస్తారా?
జ: ఒక సింగిల్ పేరెంట్ తండ్రి తన కుమార్తె గురించి పడిన ఆందోళన, ఆవేదన కథకు మూలం, మిగతాది కల్పన. ఇటీవల అన్ని వర్గాల్లోకి వేగంగా చొచ్చుకు పోతున్న డ్రగ్స్ వ్యసనం రేపటి సమాజంపై కలిగించగల ప్రభావం గురించి ఆలోచిస్తే భీతి కలుగుతూంది. నిరోధించవలసిన, నియంత్రించవలసిన వ్యవస్ధల భాగస్వామ్యం, నిర్లక్ష్యం ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఆలోచనాపరులైన అనేక మంది అనుభవం. అత్యవసరమైన ఇలాంటి అంశాల పట్ల ప్రజాగ్రహం పెల్లుబికే సందర్భాలు తక్కువగా ఉండడం విషాదం.
ప్రశ్న11. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: ఈ సంపుటిలోని కథల్లో నా మనసుకు దగ్గరైన కథ ‘అంతర్ముఖం’.
ప్రశ్న12. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ. ఏ కథకూ రాయడం కష్టమనిపించలేదు. ప్రతి కథ ఇంకా మెరుగ్గా రాయొచ్చేమో అనిపిస్తుంది.
ప్రశ్న13. ఈ సంపుటిలోని కథలను పుస్తకం కోసమే వ్రాశారా? లేక వివిధ పత్రికలలో ప్రచురితమైనవా? ఎందుకంటే కథల చివర పత్రికల పేరు, ప్రచురణ తేదీలు లేవు.
జ: పుస్తకంలో ఉన్న 10 కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి. అంతర్ముఖం, నడుస్తున్న చరిత్ర, అగ్నిగుండం – ‘చినుకు’ మాసపత్రిక, ధిక్కారం, వెన్నెల వాకిట్లో`‘ఆంధ్రప్రభ’, యుద్ధం, యుద్ధభూమి, ఊబి, దిశ-‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం సంచిక, పరిమళం` ‘నవ్య’ వీక్లీ, ‘కల్లోల కడలి` హెచ్.ఐ.వి. నేపధ్యంతో రాసిన కథాసంకలనం ‘ఆశాదీపం’, కేతనం- ప్ర.ర.వే. వారి సంకలనం, మథనం- వేదగిరి రాంబాబు గారు ప్రచురించిన కథాసంకలనంలో ప్రచురింపబడినాయి. ధిక్కారం, వెన్నెల వాకిట్లో నాలుగు దశాబ్దాల క్రితం ప్రచురింపబడగా మిగతా కథలన్నీ గత 12 సంవత్సరాలలో ప్రచురింపబడినవి. ఎప్పుడో రాసిన కథల తేదీలు వెతికితే దొరుకుతాయి, కాని అశ్రద్ధ అయింది.
ప్రశ్న14. ‘అంతర్ముఖం’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ‘అంతర్ముఖం’ పుస్తకం ప్రచురణలో ప్రత్యేకంగాఎదురైన అనుభవాలేమీ లేవు. చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రచురణలు చాలా సులభంగా పుస్తకాన్ని ముద్రించింది. ఈ సంపుటికి ఆంధ్రజ్యోతిలో, నవతెలంగాణలో వచ్చిన సమీక్షలు చదివి సుమారుగా 30 మంది కొని వుంటారు. సేల్ గురించి ప్రత్యేకంగా ప్రమోషనూ, ప్రయత్నమూ చెయ్యలేదు.
ప్రశ్న15. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: సాహిత్యరంగంలో నాకు ప్రత్యేక ప్రణాళికలేమీలేవు. రాయాలనే స్ఫూర్తి కలిగినప్పుడు కథలు రాస్తాను. నాకు మిగిలిన పరిమిత జీవితంలో బాలికలకు, స్త్రీలకు అవసరమైన హెల్త్ ఎడ్యుకేషన్ పుస్తకాల్ని రాయాలనే కోరికతో 7 పుస్తకాల్ని అమెజాన్ లో సెల్ఫ్ పబ్లిష్ చేసాను. ఇంకా కొన్ని రాస్తాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. ఆలూరి విజయలక్ష్మి గారూ.
డా. ఆలూరి విజయలక్ష్మి: ధన్యవాదాలు.
***
అంతర్ముఖం (కథా సంపుటి)
రచన: డా. ఆలూరి విజయలక్ష్మి
ప్రచురణ: విజయ సమీరా పబ్లికేషన్స్
పేజీలు: 132
వెల: ₹ 150
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
Sri Sri Holistic Multispecialities Hospitals
Nizampet Road, Kukatpally, Hyderabad – 500072.
E mail: drvijayaaluri@gmail.com
Mobile: 9849022441
~
ఆన్‍లైన్‌లో
https://www.amazon.in/ANTARMUKHAM-Dr-Aluri-Vijaya-Lakshmi/dp/B0CNWZT6B4
~
అంతర్ముఖం పుస్తక సమీక్ష: