కవి, వ్యాసకర్త డా. ఏల్చూరి మురళీధరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ

3
12

[‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ అనే వ్యాససంపుటి వెలువరించిన డా. ఏల్చూరి మురళీధరరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. ఏల్చూరి మురళీధరరావు గారూ.

డా. ఏల్చూరి మురళీధరరావు: నమస్కారం. ఎంతో ఆత్మీయతతో ఈ వాకోవాక్యరూపేణ మీరు నాకు కల్పిస్తున్న ఈ సదవకాశానికై మీకు మరీమరీ ధన్యవాదాలు.

~

ప్రశ్న 1. వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ అనే పుస్తకం పేరులో వున్న వ్యాసఘట్టాలంటే ఏమిటి?

జ: పుస్తకశీర్షికలోని ‘వ్యాసఘట్టములు’ అన్న పదబంధానికి నేను ‘కాలనిర్ణయ, కర్తృత్వనిర్ణయ, పాఠనిర్ణయ, గ్రంథతాత్పర్యనిర్ణయాల  వల్ల వివాదాస్పదములైన అంశాలు’ అన్న అర్థాన్ని ఉద్దేశించానండీ. “సందిగ్ధే న్యాయః ప్రవర్తతే” అని ఒక న్యాయం. “విచారపాటవేన యావ ద్యావ ద్వివేకదార్ఢ్యం భవతి, తావ త్తావ ద్భ్రమశైథిల్యం జాయతే. తరతమభావాపన్నసాధనాయత్తం ఫలం తరతమభావాపన్న మితి న్యాయాత్‌ విచారవిషయత్వం చ నాజ్ఞాతస్య నాపి నిశ్చితస్య కింతు సందిగ్ధస్య సందిగ్ధం సప్రయోజనం చ విచార మర్హతీతి న్యాయాత్‌”. భ్రమ దేని మూలాన కలుగుతున్నదో విమర్శపూర్వకంగా విచారించినప్పుడు ఆ భ్రమ తొలగిపోతుంది. యథార్థస్వరూపం తెలియరాక సందిగ్ధావస్థలో చిక్కుకొన్న అంశాన్ని పరిష్కరించటం వల్ల ప్రయోజనం ఉంటుందంటే దానిని తప్పక విచారించాలని భావం. అదే ఈ సంపుటికి మహావాక్యం.

వ్యాస-వినాయకుల కథ మనకు తెలిసిందే కదా. వ్యాసమహర్షి చెబుతుండగా వినాయకుడు లేఖనానికి కుదురుకొన్నాడని, వ్యాసుని ఆశుధార ఆగినట్లయితే లేఖనం ఆపివేస్తానని అన్నాడని, అలాగయితే తాను చెప్పిన అక్షరాక్షరం అర్థం చేసుకోకుండా వ్రాసేందుకు వీలులేదని వ్యాసమహర్షి కూడా ప్రతిచ్ఛలంగా ఒక నియమాన్ని విధించాడని, తనకు మాటలు తోచనప్పుడల్లా ఆయన ఒక కఠినమైన శ్లోకాన్ని చెప్పేవాడని, వినాయకుడు దానికి అన్వయం కుదుర్చుకొనే లోగా ఎన్నో శ్లోకాలను మనస్సులో కూర్చుకొనేవాడని ఉన్న ఆ కథ దక్షిణాదిని దొరికిన కొన్ని ప్రతులలో మాత్రమే ఉండటం వల్ల అది అంత ప్రామాణికం కాదని భారత విమర్శకులందరూ అంగీకరిస్తున్నారు. అయితే క్రీ.శ. 10-వ శతాబ్ది నాటి రాజశేఖరుడు తన ‘ప్రచండపాండవ’ నాటకంలో ఈ కథను పేర్కొన్నందున అది అప్పటికే ప్రసిద్ధమై ఉండాలి. సంస్కృత మహాభారతం మౌఖికదశ నుంచి లిఖితరూపాన్ని పొందిన తొలినాళ్ళలో ఈ వ్యాసఘట్టములన్న పదబంధం ‘వ్యాసమహర్షిచే రచింపబడిన కఠినములైన శ్లోకాలు’ అన్న అర్థంలో క్రీ. శ. 10-వ శతాబ్దికి మునుపే భాషలోకి అడుగుపెట్టినట్లు కనబడుతుంది. దీనికి కావ్యకష్టములు, కూట శ్లోకములు, ఘట్ట శ్లోకములు, దుర్ఘటార్థ శ్లోకములు, దృష్ట కూటములు, విషమ శ్లోకములు, వ్యాసకష్టములు, శ్లోక కూటములు మొదలైన పర్యాయపదాలున్నాయి. అచ్చతెలుగులో ఏసకట్టములని వాడుక. నన్నయ గారు భారతావతారిక (1-19) లో “దుర్గమార్థజలగౌరవ భారతభారతీ సముద్రము” అన్నప్పటి “దుర్గమార్థములు” వ్యాఖ్యాతలు పేర్కొన్న దుర్ఘటార్థములు – అంటే, వ్యాసఘట్టములే అని మనము భావింపవచ్చును. సులభంగా అర్థం కాని నేయార్థాలను (కవి తనకు తానై సంకేతించిన శబ్దార్థాలను నేయార్థాలని అంటారు. పంక్తిశతాంగుడు – పంక్తి = పది; శతాంగము = రథము; పంక్తిశతాంగుడు = దశరథుడు ఇత్యాదిగా) పోలిన ప్రయోగాల వల్ల, నిఘంటుధృతములు కాని శబ్దాల వల్ల, అన్వయక్లిష్టత వల్ల ఇవి దురవబోధంగా ఉంటాయి.

ఆ తర్వాత వీటిని అర్థవిస్తృతిమూలాన వ్యాసమహర్షి రచనకే గాక ఎటువంటి క్లిష్టరచనకైనా వ్యవహరించటం మొదలైంది. ‘శ్రీమద్రామాయణములో వ్యాసఘట్టములు’ అన్నట్లు. ఆధునిక కాలంలో ఒక వ్యాసంలోని అంతర్విభాగాలను (Internal divisions of an essay) సైతం వ్యాసఘట్టములని తాతా సుబ్బరాయశాస్త్రి గారి వంటి పెద్దలు వాడుకలోకి తెచ్చారు.

మహాభారతంలో వ్యాసఘట్టాలు మొత్తం 8800 ఉన్నాయని అంటారు. అసలు వ్యాసమహర్షి మొదట వ్రాసినవి 8800 శ్లోకాలు కాగా, వాటి చుట్టూ అల్లబడిన శ్లోకసంచయమే మహాభారతమని; ఆ తొలినాటి శ్లోకాలకు వ్యాస-ఘట్టములు (వ్యాసునిచే ఘట్టితములైనవి) అన్న వ్యవహారం ఏర్పడిందని – ఒక సరికొత్త అర్థాన్ని నేను పుస్తకాన్ని ప్రకటించిన తర్వాత చూశాను. పుస్తకాన్ని ప్రకటించిన తర్వాతే నాకు కుబ్జికామత తంత్రంలో ‘ఘట్టము’, ‘ఘట్టజ్ఞుడు’ మొదలైన పదాలు ‘కఠినమైన కృషిచేసి శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవటం, తెచ్చుకొన్నవాడు’ అన్న అర్థంలో కనబడ్డాయి. అంటే కొంత పరిశ్రమ చేస్తే కాని అర్థం కానివి వ్యాసఘట్టాలన్నమాట. ఏయే సన్నివేశాలలో భారతంలో వ్యాసమహర్షి ప్రవేశించి అప్పటప్పటి సమస్యా పరిష్కారార్థమై తన సందేశాన్ని వినిపించాడో, అవి వ్యాసఘట్టములు అన్న ఒక కొత్త అన్వయం కూడా నాకు ఇటీవలే కనబడింది. దీనిని బట్టి ఇది ఎంత లోతుగా పరిశోధన చేయవలసిన విషయమో తెలుస్తుంది.

పుస్తకం ‘ముందుమాట’లో నేను చాలా సంక్షిప్తంగా వ్రాశానే కాని, ఈ పారిభాషిక శబ్దబంధాన్ని గురించి భోజరాజాదులైన ఆలంకారికులు; జార్జ్ బ్యూలర్, మారిజ్ వింటర్నిట్జ్, మిన్కోవ్స్కీ, మైఖేల్ మాయర్, షెల్డన్ పోలాక్, సిల్వియా డి’యింటినో మొదలైన పాశ్చాత్య విద్వాంసులు; రామకృష్ణ గోపాల భండార్కర్, పరశురామ లక్ష్మణ వైద్య, వాసుదేవ శరణ అగ్రవాలా, వెంకట్రామన్ రాఘవన్, పంచానన భోయీ వంటి మహామహులు వ్రాసిన వివరణలను చేర్చనే లేదు. అప్పటికే విరివి మీరుతున్నందువల్ల కాలాంతరంలో వ్రాయవచ్చునని నిలిపివేశాను.

మొత్తం మీద ‘వాఙ్మయచరిత్రలో వివాదాస్పదములైన కొన్ని అంశాలకు నేను సూచింపదలచిన పరిష్కారాలు’ అని ఈ శీర్షికార్థం. అయితే ఇందులో కేవలం అటువంటివే గాక పరిచయాత్మకములు, వివరణాత్మకములు, సంస్మరణాత్మకములు, సమీక్షాత్మకములు అయిన వ్యాసాలు కూడా ఉన్నందున వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్ని విశేషాంశాలు అన్న మంచి శీర్షికను ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు సూచించారు.

ప్రశ్న 2. పుస్తకం ముందుమాటలో మీరు వ్యాసఘట్టాలన్న పదానికి గ్రంథగ్రంథులు అన్న పదం వాడేరు. ఈ పదానికి, వ్యాసఘట్టాలన్న పదానికి నడుమ సంబంధం వివరిస్తారా?

జ: గ్రంథము అంటే 32 అక్షరాల శ్లోకమని ఒక సంకేతం. వెనుకటి రోజుల్లో పుస్తకాలకు ప్రతులు వ్రాసే లేఖకులు, “మూడు వేల గ్రంథాల పుస్తకం కాబట్టి ఇంత మొత్తం ఇవ్వండి” అని అడిగేవాళ్ళు. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారాలలోనూ ఇదే లెక్క. అర్థవిస్తృతి వల్ల ఆ శ్లోకాల సంచయానికి సైతం గ్రంథమని వ్యవహారం ఏర్పడింది. గ్రంథి అంటే ముడి అని కూడా అర్థం ఉన్నది. తాళపత్ర సంపుటాన్ని తాడుతో చుట్టి ముడి వేస్తాము కనుక ‘గ్రథ్యతే బధ్యతే ఇతి గ్రన్థః’ అని. ‘గ్రంథగ్రంథి’ అంటే గ్రంథంలో ఉద్దేశపూర్వకంగా వేసిన ముడి. తాళపత్రాలను చదివేటప్పుడు అర్థం కాని చోట తాడుకు ఒక ముడిని వేసి, ఆ ఆకు నుంచి ముందుకు సాగటం ఉండేది. అర్థం తెలుసుకొన్నాక వెనక్కి వచ్చి ఆ ముడిని విప్పేవారన్నమాట. అటువంటి ముడులను ఎప్పటికప్పుడు విప్పుకొంటూ పాఠకుడు ముందుకు సాగాలి. ఇది ఒక విధంగా ప్రహేళికా రచన వంటిది. “గ్రన్థగ్రన్థి రిహ క్వచిత్క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా” (నేను ప్రయత్నపూర్వకంగా అక్కడక్కడ కొన్ని చిక్కుముడులను వేశాను) అని శ్రీహర్షుడు ‘నైషధీయచరితం’లో అన్నాడు. ‘శ్రీమద్భాగవత భాషా పరిచ్ఛేదం’లో మహనీయులు చారుదేవశాస్త్రి గారు (భారతీయ జ్ఞానపీఠ పురస్కృతులైన ఆచార్య సత్యవ్రతశాస్త్రి గారి తండ్రిగారు) “ఏవమత్ర గ్రన్థగ్రన్థి ర్విత్రంసయతి” అన్నారు. గ్రంథగ్రంథులన్నీ పాఠకులను అట్లా ఇబ్బంది పెట్టేవే. ఆ గ్రంథగ్రంథులు వ్యాకరణాది శాస్త్రపరమైనవి, శ్లేషగతమైనవి, దార్శనికమైనవి, కవిసమయగతమైనవి, విరోధాభాసతో కూడినవి, గూఢార్థవంతమైనవి – ఎన్నో విధాలుగా ఉండవచ్చును. చమత్కారం వీటన్నిటికీ జీవాతువు. వ్యాసఘట్టము యొక్క లక్షణం కూడా ఇదే. సామాన్యదృష్టికి రెండూ పర్యాయ పదాలే.

ప్రశ్న 3. ఒక పద్యాన్ని ప్రౌఢపద్యంగా గుర్తించే లక్షణాలేమిటి? అత్యంత ప్రౌఢమయిన పద్యం అనే వ్యాసంలో పలు విభాగాలలో ఒకో పద్యాన్ని వివరించారు. అన్ని విభాగాలను తనలో ఇముడ్చుకున్న ఒక్క పద్యమేదయినావుందా.

జ: వామనుడు ఓజస్సే ‘ప్రౌఢి’ అనే గుణము అన్నాడు. ఆయన చెప్పిన పదార్థములతోడి వాక్యరచన, వాక్యార్థంలో పదముయొక్క అభిధాత్వం, వ్యాసత్వం, సమాసత్వం, సాభిప్రాయత్వం మొదలైన విభజనను నేను పాటింపలేదు కాని, స్థూలంగా శబ్దగతము, అర్థగతము, అన్వయగతము అన్నవి వాటిలోనే అంతర్భవిస్తాయి. ప్రౌఢిని ఆలంకారికులలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిర్వచించారు. నేను శాబ్దిక ప్రౌఢి, ఏకాక్షర ప్రౌఢి, సాంస్కృతిక ప్రౌఢి, తెనుగు మఱుగులు, అనేకార్థ రచనలు, భాషాసమావేశం, సాంకేతిక ప్రౌఢి, ప్రహేళికా భావార్థఘటనలు అన్న విభజన చేసికొని ఈ అంశాన్ని వివరించే ప్రయత్నం చేశాను.

“అన్ని విభాగాలను తనలో ఇముడ్చుకొన్న పద్యం ఏదైనా ఉన్నదా?” అని మీరడిగిన ప్రశ్న విషయం. నాకైతే అటువంటివి రెండు, మూడు పద్యాలు కనబడ్డాయి. ఒకటి ప్రస్తుత వ్యాససంపుటిలో నేను వివరించిన తెనాలి రామకృష్ణకవి రచించిన “అల ఘనచంద్రబింబనిభమై” అన్న పద్యం. రెండవది కూడా ఆయనదే, ఇక్కడ ఉదాహరిస్తాను.

శైవాలంబును సైకతంబు లెదురై చంద్రప్రవాళాంబుజ

గ్రావాకాశభుజంగకూపములు దూరం బైన నేతత్పరీ

క్షావిద్యావిభవం బొనర్పఁగ దశాబ్జజ్యోత్స్నలో నర్ధచం

ద్రావిర్భావముఁ జూపినం గలిసెఁ దా నాత్మేశు భావజ్ఞయై.

అని. అత్యంత ప్రౌఢమైన పద్యం. శబ్దార్థాలు తెలిస్తే సరిపోదు. దీనిని అధికరించిన వ్యాసాన్ని ఇంకా ప్రకటించలేదండీ.

ప్రశ్న 4. అలిధమ్మిల్ల మొదలైనవి పార్వతికి విశేషణాలే కానీ, ఉపమానాలు కావుఅన్నారు. అలిధమ్మిల్ల విశేషణమే అయినప్పుడు, ఉత్పలనేత్రి ఉపమానం ఎలా అవుతుంది?

జ: మీరు పుస్తకాన్ని ఇంత జాగ్రత్తగా చదివి ప్రశ్నలడుగుతుంటే నాకు భయంగా ఉన్నది. 38-వ పేజీలోని ఆ వాక్యసందర్భంలో నేను మరింత జాగ్రత్తగా ప్రూఫు చూసి ఉండవలసింది. కుమారసంభవములోని ఆ పద్యవ్యాఖ్యలో నిజానికి “అలిధమ్మిల్ల మొదలైనవి పార్వతికి విశేషణాలే కానీ, జలజావాసానికి ఉపమానాలు కావు” అని ఉండాలి. ఉపమానోపమేయాల క్రమవిన్యాసంలో లోపం, విశేషణ విశేష్య లింగభేదం అన్న రెండు వ్యతిక్రమాలను వివరించే సందర్భం అది. ఎంతగా అచ్చుపొరపాట్లు రాకూడదని ప్రయత్నించినా, ఇప్పటికే ఏడెనిమిది కనిపించాయి. ఇంకా ఉన్నాయేమో.

ప్రశ్న 5. మీ పుస్తకంలో నన్నెచోడుడు, శ్రీనాథులకు అధికభాగం కేటాయించారు. మీరు బాగా అభిమానించే కవులెవరు? మీ వ్యాసాలు చదువుతూంటే, మీకు నన్నయ పోతనల పట్ల భక్తిభావం, నన్నెచోడుడు, శ్రీనాథుల పట్ల అభిమానం ఎక్కువ అనిపిస్తోంది.

జ: నిజానికి 748 పుటలలో విస్తరించిన అరవై వ్యాసాలలో ఆ ఇద్దరికి సంబంధించినవి అయిదు వ్యాసాలు. నన్నెచోడుని ‘కళావిలాసము’ను గూర్చిన వ్యాసం 53 పుటలకు పైబడి ఉండటం మూలాన విషయవివేచనను బట్టి దానిని మూడు వ్యాసాలుగా విడదీశాను. ‘కుమారసంభవము’లో “అలిధమ్మిల్ల” పద్యం స్థితిస్థాపనను గురించి ఒకటి. శ్రీనాథుని ‘శాలివాహన సప్తశతి’ని గురించిన వ్యాసం, ‘శృంగార నైషధము’లో ఆయన తన ఆంధ్రీకరణ పద్ధతులను వివరించాడని చిరకాలంగా ప్రచారంలో ఉన్న భావం సరికాదని ఒకటి, ‘భీమేశ్వర పురాణము’లో ఆయన తన కవిత్వాదర్శాన్ని సూత్రీకరించిన పద్యంలోని పాఠదోషాన్ని గురించి ఒకటి – మొత్తం అవి అయిదు వ్యాసాలు. ఇంకా ఆ ఇద్దరు కవులను గురించి వ్రాయవలసినవే ఎన్నో అంశాలున్నాయి. ఇక, అభిమాన కవులంటారా? మీరన్నట్లు కవిత్రయం వారు, శ్రీనాథ పోతనలు నాకు ఆరాధ్యదైవతాలే. ఏ కవి రచనను చదువుతున్నా – ‘ఇది నా ఊహకు అందనిది, నా శక్తికి మించినది’ అని అనిపించినప్పుడల్లా ఆ కవిని నేను అభిమానించి మళ్ళీమళ్ళీ చదువుతుంటాను. అందుకు ప్రాచీనులు, ఆధునికులు, అద్యతనులు అన్న వివేచన నా మనస్సులో ఉండదు. ఎప్పుడు ఏ రచనను చదువుతున్నానో, ఆ రచనలో నాకు నచ్చిన అంశాలను గుర్తుంచుకొనే ప్రయత్నం చేస్తాను. వారందరూ నాకు ఆభిమానికులే.

ప్రశ్న 6. ప్రౌఢకావ్యాలను లోతుగా అభిమానించి విశ్లేషించిన మీరు ఆధునిక వచన కావ్యాలను కూడా లోతుగా విశ్లేషించారు. కానీ, ప్రాచీనకావ్యాలలోని పవిత్రత, సాంద్రత, గాంభీర్యాలు ఆధునిక వచనకవిత్వంలో లోపించాయనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి?

జ: ‘పవిత్రత’ అన్నది కేవలం కాలగతమూ, వస్తుగతమూ మాత్రమే కాదేమో. అది ఆయా వ్యక్తుల అంతశ్శుద్ధికి, ఆత్మసంస్కారానికి, జీవనవిధానానికి, మనోధర్మానికి సంబంధించిన దృగ్విషయం. సాంద్రత (Intensity), గాంభీర్యము (Profundity) అన్న అర్థచ్ఛాయలను పరిశీలిస్తే అవి కాలాతీతములైన కవిత్వధర్మాలు. ఏ రచనకైనా చిరంజీవితను ప్రసాదింపగల ప్రాణశక్తులు. అవి లేని ఏనాటి రచనమైనా లోపభూయిష్ఠమే.

ప్రశ్న 7. ఛందోబద్ధ రచనల నుంచి వచన కవిత్వం దాకా తెలుగు సాహిత్య పరిణామక్రమాన్ని గమనిస్తున్న మీకు వ్యక్తిగతంగా ఎలాంటి రచనలు ఇష్టం? ఈ పరిణామ క్రమాన్ని గమనిస్తే  సాహిత్య నాణ్యత ఎదుగుతోందనిపిస్తోందా? దిగజారుతోందనిపిస్తోందా?

జ: మీరు నిర్దేశించిన పూర్వాపరాలు కేవలం పరిణామక్రమం లోనివి కావేమో. నాకు రెండు ప్రక్రియలూ కళ్ళకద్దుకోవలసినవే. ప్రామాణ్యవివేకంతో ‘నాణ్యత’ను నిర్ణయింపగల గీటురాళ్ళేవీ నా దగ్గర లేవు. నేను చదువుతున్న రచనలో నేర్చుకోదగినది నేర్చుకొన్నప్పుడు ఎదుగుతున్నానని; ఇంద్రియనిగ్రహానికి భంగపాటును కలిగించేవి, జాతి పురోగతికి అవరోధం కాగలిగినవి అయిన రచనలు, దృశ్యాలు నన్ను ప్రభావితం చేస్తే దిగజారుతున్నానని అనుకొంటాను.

ప్రశ్న 8. మీరు రచించిన వ్యాసాలు అత్యంత లోతయిన, నిగూఢమయిన విషయాలను వివరిస్తాయి. ఒకో వ్యాసం రచించేందుకు మీకు ఎంతకాలం పట్టింది? రచన ప్రణాళిక ఎలా వేసుకుంటారు?

జ: అది మీరు కేవలం అభిమానంతో అంటున్న మాట. కొన్ని వ్యాసాలను ఒక రాత్రంతా కూర్చొని వ్రాసి, మరునాడు అక్షరదోషాలను సవరించి పత్రికకు పంపించటం జరిగేది. కొన్ని మనస్సులో చాలా కాలం నిలిచి, ప్రాకరాలన్నీ కుదురుకొన్న తర్వాత ఒక్క ఉదుటున వ్రాయటం జరిగింది. ఒక ‘ప్రణాళిక’ అన్న నైపథ్యానుసంజనతో నిర్ధారిత పద్ధతిలో ఎప్పుడూ వ్రాయలేదు. ‘కృత్యాద్యవస్థ’ అంటే కృతిని మొదలుపెట్టడానికి పడే అవస్థ కాదని, కృతి పూర్తయిన తర్వాత నానా అవస్థలూ పడి దానిని ఎవరికి ‘అంకితం’ చేయాలో, వారు తనకు ఏమి ఇస్తారో నిర్ణయించుకొన్న తర్వాత – ‘అవతారిక’ను (కృత్యాదిని) వ్రాసేందుకు పడే అవస్థ అని నేనెప్పుడూ అనుకొంటూ ఉంటాను. కాదు, రచనకు ముందు పడే అవస్థే అనుకొంటే ఆ అవస్థ నాకెప్పుడూ ఉండనే ఉంటుంది. వ్యాసం పూర్తయినాక మాత్రం అదేదో రక్తదానం చేసినట్లు మనస్సు నీరవమైపోతుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది.

ప్రశ్న 9. ఈ వ్యాసాల రచనకు ఉపయోగించిన విషయసేకరణ కోసం మీరు పడిన శ్రమ వివరిస్తారా?

జ: భలే ప్రశ్న వేశారండీ. మేము చిన్నప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు అక్కడ ఎన్నో గ్రంథాలయాలుండేవి. ఏదైనా సంశయనివృత్తికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, అనిసెట్టి, దాశరథి, తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు, మా నాన్నగారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారల వంటి కవులుండేవారు. మా యింటిలోనూ వేలకొద్దీ పుస్తకాలుండేవి. నేను విజయవాడలో చదువుకొన్నపుడు, ఆకాశవాణిలో పనిచేసినప్పుడు అక్కడ రామమోహన గ్రంథాలయం వంటి నిధులుండేవి. విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, విక్రాల శేషాచార్యులు, పొట్లపల్లి సీతారామారావు, పైడిపాటి సుబ్బరామశాస్త్రి, రెంటాల గోపాలకృష్ణ, అజంతా, శనగన నరసింహస్వామి, ఉషశ్రీ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి వంటి పెక్కుమంది మహనీయులను కలుసుకొనే సదవకాశం ఆయాచితంగానే సమకూడింది. ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర కళాశాల తెలుగు శాఖలో చేరాక మా కళాశాలలో లెక్కలేనంత గ్రంథసంచయం దొరికింది. ఢిల్లీలో గ్రంథాలయాలు కూడా అనేకం ఉన్నాయి. దొరికిన పుస్తకమల్లా చదివే ప్రయత్నం చేశాను. మిత్రులతో లేఖాముఖంగా అడిగి సందేహాలను తీర్చుకొనే అవకాశం దొరికింది. బిరుదురాజు రామరాజు గారయితే, “నాయనా! నువ్వు రాత్రి రెండు గంటలకైనా సరే, ఫోను చెయ్యవచ్చు” అని సందేహాలను నివర్తింపజేసేవారు. ఈ సంపుటిలో నన్నెచోడుని గురించి, సుబంధుని గురించి, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని గురించి వ్రాయవలసివచ్చినప్పుడు చాలా కాలం చదువుకోవలసివచ్చింది. ఒక పుస్తకంలో నుంచి వేరొక పుస్తకంలోకి లంకె దొరికేది.

వీలైనంత వరకు పూర్వులు చెప్పని కొత్త విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేశాను.

నన్నయ తిక్కనలు, శ్రీనాథ పోతనలు, పినవీరభద్రుడు మొదలైన కవుల రచనలను చదువుతున్నప్పుడు ఆయా ప్రయోగాలను బట్టి వారింటిలో ఉండిన గ్రంథాలయాలను గుర్తించే ప్రయత్నం నాకు చాలా ఇష్టం. నవమ స్కంధంలోని గంగావతరణ గద్యలో “మహాభాష్యరూపావతారవృత్తివృద్ధిగుణసమర్థం బై” అన్న దళాన్ని చూడండి. ఎక్కడో శ్రీలంకలో 12-వ శతాబ్దిలో వెలసిన ధర్మకీర్తి రచించిన వ్యాకరణగ్రంథం – ఈ రోజుల్లోనే ఎవరికీ తెలియని ఎంతో అపురూపమైన ‘రూపావతార వృత్తి’ – బమ్మెరలో ఏ రాజోపచారాలూ లేని పోతన గారికి ఎట్లా లభించినట్లు? దానిని ఆ సందర్భంలో వాడుకోవాలని ఎట్లా స్ఫురించినట్లు? ఆ గద్యను పరిశోధించటం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది!

1994 లో అనుకొంటాను, నేను కుందుర్తి వేంకటాచలకవి ‘మిత్రవిందా పరిణయము’ కోసం వెతుకుతూ, పూజ్యులు శ్రీ సన్నిధానం నరసింహశర్మ గారిని, “గౌతమీ గ్రంథాలయం నుంచి నాకు మిత్రవిందా పరిణయ కావ్యం కావాలి, దయచేసి దాని జెరాక్స్ ప్రతిని ఖర్చులను నేను చెల్లించే ఒప్పందం మీద పంపించగలరా?” అని లేఖ వ్రాశాను. వారు వెంటనే ఏ ఖర్చునూ తీసుకోకుండానే నాకు పోస్టులో పంపించారు. అయితే నేను ఉత్తరంలో పొరపాటున కవి పేరును వ్రాయనందువల్ల వారు కుందుర్తి వేంకటాచలకవి రచనతోపాటు శ్వేతాచల జనార్దన రంగారాయల వారి మిత్రవిందాపరిణయాన్ని కూడా పంపించారు. ఆ విధంగా నాకు అపురూపమైన ఆ మహాద్భుతకావ్యం గురించి తెలిసింది.

ఇటువంటివన్నీ విషయవిశేషాల సేకరణకు, తదుపరి శేఖరణకు తోడ్పడినవని అనుకొంటాను.

‘శబ్దరత్నాకరము’ పీఠికలో బహుజనపల్లి సీతారామాచార్యుల వారు తమకు నిఘంటునిర్మాణవేళ పదాల సేకరణకు ఆకరాలైన కావ్యాలకు వాటివాటి ఉపయోగాన్ని బట్టి ‘మార్కు’లను వేశారు. సంస్కృతాంధ్ర నిఘంటువులకు (అవి స్వతఃప్రమాణములు కాబట్టి) సున్న అంకె. ఆంధ్ర భారతానికి ఒకటి అంకె (ప్రయోగనిర్ధారణకు ప్రథమస్థానమన్నమాట). చేమకూర వేంకటకవికి విజయవిలాస రచనా నైపుణ్యాన్ని బట్టి నాలుగవ స్థానం ఇవ్వవలసినప్పటికీ, సారంగధర చరిత్ర రచనను బట్టి అయిదవ స్థానంలో చేర్పవలసి వచ్చింది – అని వ్రాశారు. అది తమ నిఘంటు పదాల సేకరణకు సంబంధించిన నిర్ణయమే కాని, కవిత్వవైభవానికి సంబంధించింది కాదు. ఆ విధంగా నా పుస్తకంలో ఒక్కొక్క వ్యాసంలో విషయాల సేకరణకు తోడ్పడిన పుస్తకాల ఖర్చును బట్టి తమాషాగా అంకెలను ఇవ్వాలని ఉండింది కాని, ఇవ్వలేదు.

మీరడిగిన ప్రశ్నకు ఇంకొక సమాధానం: ఏ వ్యాసాన్ని గానీ, పుస్తకాన్ని గానీ చదువుతున్నప్పుడు మరి పది రచనలను చేయటానికి మనకు స్ఫూర్తి కలుగుతుందో, మరిన్ని మధురోహలకు తావలం అవుతుందో, మరొకరి విషయసేకరణకు ఆధారకల్పం కాగలుగుతుందో – సాహిత్యచరిత్రలో ఆ రచన నిజంగా గొప్పదని నేననుకొంటాను.

ప్రశ్న 10. మీ యీ వ్యాసాలు చదువుతుంటే తెలుగు ప్రాచీన సాహిత్యానికి సంబధించిన అనేకానేక విషయాలు ఇంకా మరుగునపడివున్నాయని, పరిశోధించి ఆవిష్కరించాల్సిన అంశాలనేకం వున్నాయని అనిపిస్తుంది. ఎందుకని ఈ విషయంలో పరిశోధనలు జరగటంలేదు? మీరు చెప్పేవరకూ వ్యాసఘట్టములు అన్న పదమే కాదు, ఇందులో ప్రస్తావించిన అనేక అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకని ఈ విషయాలగురించి చర్చలు, పరిశోధనలు జరగటం లేదు?

జ: మీ అభిమానానికి, ఆదృతికి హృదయపూర్వక ధన్యవాదాలండీ. ప్రపంచ వాఙ్మయచరిత్రలను చదువుతున్నప్పుడు, మన కావ్యాదికాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేకానేక విషయాలు ఇంకా మరుగున పడి ఉన్నాయని అర్థమవుతుంది. దేశాల ఆనువంశిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, భాషా, లలితకళా చరిత్రల సమన్వయంతో వాఙ్మయచరిత్రను పునరవలోకించేందుకు ఇప్పుడు ఎంతో సామగ్రి అందుబాటులో ఉన్నది. అంతర్జాలం అప్రాపణీయములైన సాహిత్యేతరాధారాలను, గ్రంథాలను మన ముంగిటిలోకి తీసికొనివచ్చింది.

ప్రతిభావంతులైన విమర్శకులు ఈ ఆధునిక శాస్త్రపరిశోధనల దృష్ట్యా సాహిత్యచరిత్రను సంపన్నం చేయవలసి ఉన్నది. చేయగలరు. చేస్తారు కూడాను. ఇక నా విషయానికి వస్తే – బైరాగి గారి కవితలో ఒక మాటను మాత్రం మార్చే సాహసం చేసి, “నాకు చాలు నొక కిరణం, ఒక దుర్బల కాంతికణం, ఈ వాఙ్మయదీపంలో ఒక నిముషపు ప్రజ్వలనం” అనుకొంటాను.

ప్రశ్న11. పోతన భాగవతాన్ని ఇతరులు పూరించారని మీరు ప్రస్తావించారు. ఈ విషయం గురించి మరిన్ని విశేషాలు చెప్తారా?

జ: ఇది చాలా వివరంగా చెప్పవలసిన ప్రశ్నండీ. సంక్షిప్తంగా చెబుతాను. తొలిరోజులలో భాగవతం ప్రతిని ఏ విధంగా కట్టారో మనకు తెలియదు. విద్వాంసులు పరిపరి విధాల ఊహించారు. మొదటి రెండు స్కంధాలూ ఒక కట్ట అనుకొంటే, అందులో ముందువెనుకలు దెబ్బతిన్నాయి. అసలు ‘శ్రీకైవల్యపదంబు’ పద్యమే పోతన గారిది కాదేమో అని చాగంటి శేషయ్య గారు అనుమానించేంతగా అవతారిక దెబ్బతిన్నది. ద్వితీయ స్కంధంలో 93-వ పద్యం నుంచి తాళపత్ర ప్రతులలో  “ఇక్కడ నుండి వెలిగందల నారయ కవిత్వప్రారంభము” అని ఉన్నది. ఆ మాట ఆ స్కంధాంతం వరకు వర్తిస్తుందని అనుకొంటే, ఆ భాగమంతా సరిక్రొత్తగా రచింపవలసినంత దెబ్బతిన్నదన్నమాట. ఆ తర్వాతి రెండు స్కంధాలూ ఒక కట్ట. అందులోనూ లోపాలు లెక్కలేనన్ని కనుపిస్తున్నాయి. విమర్శకులు ఆ అంశాన్ని గురించి పరిశోధనలు చేయలేదు. ఆపై ఇతరులు పూర్తిచేశారు కాబట్టి పంచమ, షష్ఠ స్కంధాలు; చిట్టచివరి ఏకాదశ, ద్వాదశ స్కంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న సంగతి ఎలాగూ స్పష్టమే. అష్టమ, నవమ స్కంధాలలో చాలా చోట్లు దెబ్బతిన్న జాడలున్నాయి. పాఠక్రమంలో జారుపాటులు, పద్యక్రమంలో తారుమారులు కనబడుతున్నాయి. దశమ స్కంధం ఉత్తర భాగంలో 235-వ సంఖ్య గల చోటు నుంచి “ఇక్కడ నుండి వెలిగందల నారపరాజు గారి కవిత్వప్రారంభము” అంటూ – అది వెలిగందల నారయ గారి రచనమని వ్రాతప్రతులలో స్పష్టంగా వ్రాయబడినప్పటికీ, చాలామంది పరిష్కర్తలు ఆ శీర్షికను తొలగించి, మొత్తం పోతన గారి రచన గానే ముద్రిస్తున్నారు. తృతీయ స్కంధం ఆశ్వాసాంత గద్యలో అది పోతన గారి రచనమని ఉన్న ప్రమాణాన్ని పురస్కరించికొని పూర్తిగా పోతన గారి పేరిటనే అచ్చై ఉన్నది కాని, అది కూడా ఆసాంతం పోతన గారి రచన కాదేమోనన్న కర్తృత్వవిషయసందేహం చిరకాలంగా విమర్శకులను వేధిస్తున్నది. అదొక చర్చనీయాంశం. చతుర్థ స్కంధం పోతన గారిది కాకపోవచ్చునన్న అనుమానం చాలా కాలం నుంచే ఉన్నది. షష్ఠ స్కంధాన్ని వ్రాతప్రతులతో పరిశీలించి అమేయంగా ఉన్న పాఠదోషాలను సరిచేయాలి. సప్తమ, అష్టమ, నవమ స్కంధాల కట్టలో అక్కడక్కడ ఛిద్రాలేర్పడినా, ఎన్నో అపపాఠాల చిక్కుముడులున్నా – దక్కినంత మేరకు ఆ మాత్రమైనా పోతన గారి రచనగా మనకు దక్కింది. ఏకాదశ ద్వాదశ స్కంధాలలో హరిభట్టు భాగవతం నుంచి పద్యాలు ఎప్పుడు అడుగుపెట్టాయో పరిశోధింపవలసి ఉన్నది. ఈ సమస్యలు పరిష్కృతమైనాక పోతన గారి భాగవతాన్ని మూలంతోనూ, వ్యాఖ్యలతోనూ మళ్ళీ ఒకసారి సరిపోల్చి పాఠనిర్ణయం చేయవలసి ఉన్నది. దేశవిదేశాలలో సురక్షితములై ఉన్న భాగవతం ముద్రిత ప్రతులను, గ్రంథాలయాలలోని తాళపత్ర ప్రతులను, వ్యక్తిగత సంచయాలలోని తాళపత్ర ప్రతులను సేకరించి, వాటికి కాగితపు ప్రతులను వ్రాయించి, సర్వపాఠాంతర సమాకలనపూర్వకంగా ఇప్పటికైనా ఒక సుపరిష్కృత ముద్రణను వెలయింపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

ఒక్కమాట మాత్రం చెప్పక తప్పదు. బమ్మెర పోతన గారి శ్రీమహాభాగవతం మన జాతీయ గ్రంథం. దానిని కాపాడుకోవలసిన బాధ్యత జాతిజనులందరిపైనా ఉన్నది.

ప్రశ్న12. బోయి భీమన్న రచన పైరుపాటను విశ్లేషణకు ఎంచుకోవటానికి ప్రత్యేక కారణాలేమైనా వున్నాయా?

జ. భీమన్న గారు మా నాన్నగారికి కూర్మినెచ్చెలి. ‘పైరుపాట’ ఆచ్చయినప్పుడు వారే ఆ ప్రతిని మా నాన్నగారికి ఇచ్చారు. హైదరాబాదులో ఒక సెమినార్ జరిగినప్పుడు సమర్పించిన ప్రసంగ పత్రానికి పరిష్కృతపాఠం ఈ సంపుటిలో ఉన్నది.

1980లో అచ్చయిన Marxist-Leninist Aesthetics and the Arts లో ఎ.కె. ద్రెమోవ్ ప్రతిపాదించిన Romantic Typification అన్న మౌలికమైన ఒక వ్యాసం ఉన్నది. అద్భుతమైన ఆ ఆదర్శవాద ప్రతిపాదనకు తెలుగు సాహిత్యంలో ఒకే ఒక్క లక్ష్యం నాకు భీమన్న గారి ‘పైరుపాట’లో కనిపించింది. దానిని అన్వయిస్తూ “బోయి భీమన్న ‘పైరుపాట’లో ప్రణయతత్త్వ ప్రతీకీకరణం” అని వ్రాశాను.

ప్రశ్న13. బైరాగి కవిత్వంలో నిరాశ అత్యధికంగా కనిపిస్తుంది. మన కావ్యాలన్నీ ఆశాభావం కలిగిస్తాయి. తెలుగు కవిత్వంలో నిరాశాభావం గురించి మీ పరిశీలన చెప్పండి. మనకు ట్రాజెడీలు లేవంటారు. మరి ఆధునిక రచనల్లో నిరాశ ఎలా ప్రవేశించింది?

జ: మా నాన్నగారికి బైరాగి గారితో ఉన్న మైత్రి కారణంగా వారిని నేను ఎన్నోసార్లు కలుసుకోగలిగాను. దాసరి సుబ్రహ్మణ్యం గారి ద్వారా వారిని గురించి ఎన్నో ఆంతరంగిక విషయాలను విన్నాను. బౌద్ధ దర్శనాలలోని నిర్వేదాన్ని, Shopenhauer తాత్త్వికతలోని నైరాశ్యాన్ని తర్కసంగతితో పోల్చి చూసినప్పుడు బైరాగి కవిత్వంలోని నిరాశ ఒక యథార్థనిర్వృత్తమైన జీవితానికి ప్రగాఢ చిత్రీకరణమని బోధపడుతుంది. ఆయన స్వాభావికతకు, కవిత్వాభివ్యక్తికి సారూప్యం అర్థమౌతుంది. అది ‘చీకటి నీడలలో బైరాగి జాడ’ అన్న నా వ్యాసంలో కొద్దిగా వివరింపబడిందని అనుకొంటాను.

రాజకీయాదర్శాల ఆచరణవైఫ్యల్యం వల్ల సమాజంలో స్వార్థపరత్వం మితిమీరి విచ్ఛిన్నకర ధోరణులు పెచ్చరిల్లినప్పుడు కవిత్వం, చిత్రకళ, శిల్పము, సంగీతం, చలనచిత్రాలు మొదలైన కళారూపాలన్నింటిలో నిరాశ ఏకకాలంలో ప్రతిబింబించిందని అనుకొంటాను.

ప్రశ్న14. మీరు విశ్వనాథ రచన రామాయణ కల్పవృక్షాన్ని విశ్లేషించలేదు. ఆ రచనపై మీ ఆలోచనలను పంచుకుంటారా? ఎందుకంటే, ఆధునిక కాలంలో ప్రాచీన కావ్యాల సరసన గర్వంగా నిలబడే రచన అది. ఆ రచనను మీరు విశ్లేషించకపోవటం నిరాశ కలిగించింది.

జ: నిజమేనండీ. ఆ మహాగ్రంథాన్ని, దానిని గురించి వెలువడిన విమర్శలను చదువుకోవటంలో ఒక ఆనందం ఉన్నది. “తెలియకయే సుఖాతిపరిధీకృత ధీ పరిణామం” కలిగించే ఉదాత్తరచనం అది. పైగా మా నాన్నగారు విశ్వనాథ వారి ప్రత్యక్షశిష్యులు. సత్యనారాయణ గారి కుమారులు అచ్యుతదేవరాయలు గారు, వెంకటేశ్వర్లు గారి కుమారులు కృష్ణదేవరాయలు గారు మద్రాసు వచ్చినప్పుడల్లా మా యింటిలోనే ఉండేవారు. ఎన్నో వైయక్తిక విశేషాలను నెమరువేసుకొనేవారు. 1976లో గురువు గారు పరమపదించారన్న వార్త తెలియగానే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి మా నాన్నగారు సచేలస్నానం చేయటం నాకింకా గుర్తున్నది. నేను వారిని గురించి విన్న చిన్నప్పటి జ్ఞాపకాలను, వారి రచనలను అధికరించిన ఏపాటి విమర్శవ్యాసాన్నైనా వ్రాయవలసి ఉన్నది.

ప్రశ్న15. మీ పుస్తకంలోని వ్యాసాలు చదువుతూంటే, ఆ కాలంలో కవులు సరస్వతీదేవి వొడిలో భాషతో ఆటలాడుకున్నారనిపిస్తుంది. పర్యాయ పదాల కావ్యాలు, వ్యంగ్య కావ్యాలు, ఒకే అక్షర పద్యాలు, ఇలా అనేక ప్రయోగాలు అందంగా చేశారు. ఆధునిక రచనల్లో ఇలాంటివి లోపించాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి.

జ: మీ మాటకు అడ్డువస్తున్నానని కాదు కానీ, ఏ కాలంలోనైనా కవులు వాగ్దేవి పర్యంకసీమను లాలింపబడినవారే కదా. కాలాన్ని బట్టి భాష, భాషానుగుణంగా ప్రయోగాలు. భావికాలంలో ఈనాటి రచనలను గురించి కూడా అలాగే అనుకొంటారేమో. ఆయా రూపాలను ఆదరించే రచయితలు, పాఠకులు అన్ని కాలాలలోనూ ఉంటారనుకొంటాను.

ప్రశ్న16. మీరు ఆధునిక అస్తిత్వ ఉద్యమాల కవిత్వాన్ని కూడా పరిశీలించారా? ఇలాంటి కవిత్వంపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: కొంత కొంతగా కొన్ని కొన్నింటిని చదివానండీ. నాకు నచ్చిన కవులున్నారు, కవితలున్నాయి. Let noble thoughts come from all directions. ఆనో భద్రాః క్రతవో యన్తు విశ్వతః.

ప్రశ్న17. ఐతరేయోపనిషత్తును మాత్రమే వ్యాఖ్యానానికి ఎంచుకోవటంలో ప్రత్యేక కారణం ఏమైనా వుందా?

జ: ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదండీ. ఔఫ్రెష్ట్ మహాశయుడు, హొరేస్ హెయ్మన్ విల్సన్ మహాశయుడు  ప్రకటించిన ఐతరేయ బ్రాహ్మణం ప్రతులు, కీథ్ మహాశయుడు ప్రకటించిన ఐతరేయ ఆరణ్యకం, కేవలానంద సరస్వతి గారి ఐతరేయ కోశాలు, శంకర వ్యాఖ్యానువాదాలు మా కళాశాల గ్రంథాలయంలో కనిపించినప్పుడు ‘ఐతరేయ మహిదాసుడు’, ‘బహ్వృచోపనిషత్తు’, ‘ఉక్థము’, ‘మహావ్రతము’, ‘అన్నము’, ‘అన్నాదుడు’ మొదలైన పదాల పట్ల ఆసక్తి కలిగి, చిన్నదే అయిన ఉపనిషత్తును చదివాను. నాకు చేతనైనంతలో ఆ మహనీయుల ప్రసంగసారాన్ని నా మాటలలో చెప్పే ప్రయత్నం చేశాను.

ప్రశ్న18. ఈ పుస్తక ప్రచురణలో మీ అనుభవాలేమిటి?

జ: చాలా మంచి ప్రశ్నను అడిగారండీ. వ్యాసాలను సంకలనం చేసి ఒక పుస్తకంగా ప్రచురించాలనే ఆలోచన వచ్చినప్పుడు అమెరికాలో ఉంటున్న ప్రముఖ విద్వాంసులు, ఆధ్యాత్మిక విద్యావేత్త, పవిత్రజీవనులు డా. ఉపద్రష్ట సత్యనారాయణమూర్తి (సత్యం) గారు ఎంతో ఔదార్యంతో ముద్రణవ్యయాన్ని అవ్యయానందంగా భరిస్తామని ముందుకు వచ్చారు. ఆ సమయంలో నేను ఢిల్లీలో ఉండటం వల్ల డి.టి.పి మొదలైనవి హైదరాబాదులో మంచి చోట చేయించటం, ప్రూఫులను చూడటం ఇబ్బందిగా ఉండేది. ఆ యత్నం కొంత కుంటువడసాగింది. ఒకరోజు ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి పుస్తకావిష్కరణ సభలో నాకు ఏ మాత్రం పరిచయం లేకపోయినా, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు ఎంతో దయతో, ఆత్మీయతతో నా వ్యాసాలను అందంగా అచ్చువేస్తామని మాటయిచ్చారు. భూమయ్య గారు ప్రోత్సహించారు. అప్పుడు ఉపద్రష్ట వారి అనుమతి తీసికొని నేను వ్యాసాలను అప్పాజోస్యుల వారికి ఇచ్చాను. వారు తమ స్వస్థలమైన చీరాలలో దగ్గరుండి కంపోజింగ్ పనులను చేయించటమే గాక, ఎప్పటికప్పుడు అక్షరాక్షరం చదువుతూ, ఒక్కొక్క వ్యాసంపైని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, నేను పుస్తకం పెద్దదవుతుందని వెనుకాడుతుంటే అట్లా ఏ మాత్రం సంకోచింపవద్దని ప్రోత్సహిస్తూ – పుస్తక శీర్షిక తుదిరూపాన్ని తామే సూచించి, ముఖచిత్రాన్ని తామే దగ్గరుండి రూపొందింపజేసి, నేను ఎన్నడూ ఊహింపనంత అందంగా అజో-విభొ-కందాళం ఫౌండేషన్ పక్షాన అచ్చువేయించారు. ఇంతటి దయకు నోచుకొన్న పుణ్యానికి కృతజ్ఞతగా నేను ఈ కృతిని అంకితం ఇస్తానంటే మేదురమైన ఆదరంతో స్వీకరించారు. ఇదంతా పూర్వపుణ్యానుభవం కాకపోతే మరేమిటి?

ప్రశ్న19. ఈ పుస్తకం సాహిత్యం పట్ల తీవ్రమైన ఆసక్తి వున్నవారికి మాత్రమే పరిమితం. ఈ పుస్తకానికి సాహిత్య ప్రపంచంలో ఎలాంటి స్పందన లభిస్తోంది?

జ: ‘కాలోహ్యయం నిరవధి ర్విపులా చ పృథ్వీ’ అని భవభూతి ఊరికే అనలేదు కదా. ప్రతీక్షించినదాని కంటె అనూహ్యమైన ఆత్మీయస్పందన లభిస్తున్నదండీ. మీ వంటి ప్రతిష్ఠిత రచయిత ఆదరణకు నోచుకొన్నాను. విద్వన్మణులైన పెద్దలు ప్రేమాదరాలతో సందేశాలను పంపిస్తున్నారు. మిత్రులు విపుల సమీక్షితాలను వ్రాస్తున్నారు. పత్రికలకు పంపించలేదు. ఆయుర్దాయమంటూ ఉంటే, బాలారిష్టాలను దాటి కాలస్రవంతిలో ఈదగలుగుతుంది. లేదంటే స్మృతిశేషమై వీనుమిగులుతుంది. చేతనైనంతలో వ్రాసే ప్రయత్నం చేశాను. అది ముద్రణకు వచ్చింది. అంతకంటె ఏమి కావాలి? ‘కర్మణ్యే వాధికార స్తే, మా ఫలేషు కదాచన’ అని.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. ఏల్చూరి మురళీధరరావు గారూ.

డా. ఏల్చూరి మురళీధరరావు: ధన్యవాదాలు.

***

వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు
రచన: ఏల్చూరి మురళీధరరావు
ప్రచురణ: అజో-విభొ- కందాళం ఫౌండేషన్
పేజీలు: 800
వెల: ₹ 1,000/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగూడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/products/vangmayacharitralo-konni-vyasaghattalu-marikonni-visheshamshalu

 

 

~

‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/vangmayacharitralo-konni-vyasaghattalu-marikonni-visheshamshalu-book-review-dr-rvl/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here