రచయిత్రి డా. కందేపి రాణీ ప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ

1
10

[‘వర్ణలిపి’ అనే కళా వ్యాసాల పుస్తకం వెలువరించిన సందర్భంగా రచయిత్రి డా. కందేపి రాణీ ప్రసాద్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. కందేపి రాణీప్రసాద్ గారూ.

డా. కందేపి రాణీప్రసాద్: నమస్కారం.

~

ప్రశ్న 1. మీరు చూసిన హస్తకళల మ్యూజియమ్‍లు, మీరు నేర్చుకున్న కళల గురించి ప్రచురించిన పుస్తకానికి ‘వర్ణలిపి’ అనే శీర్షిక పెట్టడం వెనుక మీ ఆలోచనని వివరిస్తారా?

జ: వివరిస్తానండీ. ఈ పుస్తకానికి పేర్లు చాలానే వెతికాను. ఎన్నో రాసి పెట్టుకున్నాను. ఇంద్ర ధనస్సు, వర్ణ మిళితం, కళా కృతి, దీప కళిక, కళార్ణవం వంటి ఎన్నో పేర్లు అనుకున్నాను. నేను ఇంతకుముందే బాల సాహిత్య పుస్తకానికి హరివిల్లు పెట్టటం వాళ్ళ ఇంద్ర ధనస్సు వద్దులే అనుకున్నాను. కళాకృతి, కళార్ణవం వంటి పేర్లను నేను తాయారు చేసిన వ్యర్థాల కళా కృతులకు పెట్టాలని దాచుకున్నాను. వర్ణలేఖ అనే పేరు బాగా నచ్చింది. వర్ణాలతో రాసిన లేఖ కన్నా, వర్ణాల కోసమే తయారైన లిపి బాగుటుందని ఈ పేరును ఎన్నుకున్నాను. కళలు అంటే వర్ణాల కలబోత కూడా. ఈ పుస్తకంలో ఎన్నో రంగుల్ని మేళవించి చేసిన బొమ్మలున్నాయి. రంగు దారాలతో కుట్టిన ఎంబ్రాయిడరీలున్నాయి. అందుకే రంగుల మేళవింపు అనే అర్థం వచ్చేలా చూద్దామనుకున్నాను. రంగుల కోసం తయారైన లిపి అని ‘వర్ణలిపి’గా పెట్టుకున్నాను.

ప్రశ్న 2. మీరు నేర్చుకుని ఆచరించిన సంప్రదాయ కళల్ని నేటి తరానికి పరిచయ చేయడానికి ఈ వ్యాసాలే కాకుండా ఇతర మార్గాలేమయినా ఎంచుకున్నారా?

జ: సంప్రదాయ కళల గురించి మాత్రం ఇదే తొలి పుస్తకం. కరోనా సమయంలో రాసిన వ్యాసాలు కాబట్టి అందరికి కొద్దిగా తెలిసినవే ఉండాలనుకున్నాను. అందువలననే ఈ కళాకృతుల్ని ఎంచుకోవటం జరిగింది. ఆ సమయంలో పూర్వపు ఆటపాటల్ని కూడా పరిచయం చేశాను. మా అమ్మ నడిగి చాలా ఆటల గురించి తెలుసుకుని రాశాను. అలాగే ఇవన్ని దాదాపుగా నేను చిన్నప్పుడు నేర్చుకున్నవి. వెజిటబుల్ కార్వింగ్‌కు సంబంధించి ఒక పుస్తకం రాశాను. అలాగే నా ఆసుపత్రి వ్యర్థాలతో తొలి కళా పుస్తకం 2000 సంవత్సరంలో ప్రచురించాను. ఆ పుస్తకాన్ని రంగుల బొమ్మలతో పిల్లలకు ఆకర్షణియంగా ముద్రించాము. అలాగే ‘వర్ణలిపి’తో పాటుగా ‘మృగయాపురి’ అనే మరొక కళల పుస్తకం 2023లో ముద్రించాము. ఇందులో వంటింటి వస్తువులతో మరియు చెట్ల ఆకులు కొమ్మలతో నూటయాబై జంతువులను తయారు చేసిన వ్యాసాలున్నాయి. భారతీయ రాష్ట్రాల హస్త కళలకు సంబంధించిన వ్యాసాలు మాత్రం ఇందులోనే ఉన్నాయి. నా ఈ కళల్ని రేపటి తరానికి పరిచయం చేయడానికి నేను తయారు చేసిన బొమ్మల్ని మా ఆసుపత్రిలో అందరికి అందుబాటులో ఉంచుతున్నాం. ‘మిల్కీ మ్యూజియం’ ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులే కాకుండా స్కూలు, కాలేజీల విద్యార్థులు టీచర్లు, బిచానా సిబ్బంది వచ్చి చూస్తున్నారు. అనేక స్కూళ్ళలో సైతం మేము ఎగ్జిబిషన్లు పెడుతున్నాం. మ్యూజియం ద్వారా, ఎగ్సిబిషన్ల ద్వారా, రచనల ద్వారా హస్త కళల్ని నవతరానికి అందించడానికి ప్రయతిస్తున్నాను. నేను రాసిన దాదాపు 1200 వ్యాసాలు ఇంకా పుస్తక రూపం దాల్చవలసి ఉన్నది.

ప్రశ్న 3. మన జానపద హస్తకళలే కాకుండా ఇతర రాష్ట్రాలలోని కళలని సైతం మీరు నేర్చుకున్నారు. ఇదెలా సాధ్యమయింది? దీని వెనుక ఉన్న మీ కృషి గురించి చెప్పండి.

జ: మన రాష్ట్రం లోని కళలు వస్తే మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి. నేను నేర్చుకున్నపుడు అవి వేరే రాష్ట్రాల కళలని తెలియదు. ఆప్లిక్ వర్కు, మండల ఆర్ట్, వర్లి ఆర్ట్ వంటి వాటిని చేసినపుడు వాటి పుట్టిళ్ళ గురించి తెలియదు. బిగ్ షాపర్ల వంటి బ్యాగుల మీద, ఇన్విటేషన్ కార్డుల మీద వర్లీ ఆర్ట్ ఉండేది. నేను వాటిని చూసి వెయ్యడం మొదలు పెట్టాను. పుల్లల్లాంటి కళ్ళు, త్రికోణా కారపు శరీరాలు గమ్మత్తుగా అనిపించి చేశాను. మహారాష్ట్ర లోని గిరిజనుల సంప్రాదాయిక కళ అని తెలిసి ఆశ్చర్యపోయాను. అలాగే అప్లిక్ వర్క్ కూడా. బ్లౌజులు కుట్టేటపుడు వేరే వస్త్రాన్ని కత్తిరించి డిజైన్‌గా బ్లౌజు మీద కుట్టే వాళ్ళం. ఇది ఒడిషా రాష్ట్రపు కళ అని పిపిలి వెళ్ళే దాకా తెలియదు. మా వారి కాన్ఫరెన్స్ లకు వెళ్ళినపుడు అక్కడ ఖచ్చితంగా ఆ రాష్ట్ర కళల దుకాణాన్ని పెడతారు. ఆర్ట్ అంటే ఇష్టం కాబట్టి నేను తప్పనిసరిగా చూస్తాను. ఆ కళాకారులతో మాట్లాడతాను. ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటాను. ఇంకొక విషయం ఏమంటే మేము వేరే రాష్ట్రాలు వెళ్ళినపుడు ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్ళ లోనే ఉంటాము. కాబట్టి అక్కడ కూడా హ్యాండి క్రాప్ట్స్ షాపులుంటాయి. నాకు కళలు కళాకృతులు అలా అందుబాటులో ఉంటాయి. ఇంకా రోడ్ సైడ్ అమ్మే ఆడవాళ్లు అక్కడే అల్లి మనకిచ్చేస్తుంటారు. వాళ్ళను మనం గమనించాలి. ఎక్కడైనా మనకు కళాకృతులు చాలా దొరుకుతాయి. అరకులో గిరిజన మహిళల దగ్గర ఎన్నో కళాకృతులు దొరుకుతాయి. మన చూపే మన ఆయుధం.

ప్రశ్న 4. ఈ పుస్తకానికి రాసిన మీ ముందుమాటలో కళల ప్రయోజనం చక్కగా వివరించారు. అయితే క్లాసు బుక్స్ చదువు తప్ప మరేవీ పెద్దగా పట్టని నేటి పిల్లలకి వీటిలో అభిరుచి కలిగించడమెలా?

జ: పిల్లలకు ఏవి రావు అనుకోకూడదు. వేసవి శలవుల్లో కొన్ని స్కూళ్ళలో నేను ట్రెయినింగ్ క్లాసులు తీసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు చాలా చక్కని బొమ్మలు చేసుకొచ్చారు. వాటితో ఎగ్జిబిషన్లు కూడా పెట్టారు. అంటే పిల్లలకు మనం అలవాటు చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇరవై ఏళ్ల క్రితం ‘పాడుతూ తీయగా’ ప్రోగ్రాం పెట్టక ముందు సంగీతమంటే చిన్న చూపుండేది. పిల్లలెవ్వరూ నేర్చుకునేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా పాప సంగీతం నేర్చుకుంటోంది అని గర్వంగా చెబుతున్నారు. అలాగే ఇలాంటి సంప్రదాయ హస్తకళలు కూడా నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఉపిరి సలపని MNC కంపెనీల్లో మైండ్ రిలాక్సేషన్ కోసమని ఆయా కళలు నేర్పించి ఉద్యోగుల చేత చేయిస్తున్నారు. ఒకప్పుడు కుట్లు అల్లికలకు ఒక పిరియడ్ ఉండేది. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా అమలవుతుంది. అప్పుడు క్రాప్ట్ టీచర్లు ఎక్కడున్నారా అని వెతుక్కుంటారు. మానసిక సమస్యల్ని దూరం చేసుకోవాలన్నా, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గలన్నా కళల పరిచయం చాలా అవసరం.

ప్రశ్న 5. ప్రధానంగా పిల్లల కోసం రాసిన ఈ పుస్తకాన్ని వాళ్ళకి చేరువ చేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు?

జ: నేను ఏ పుస్తకం రాసిన పిల్లల కోసమే రాస్తాను. పెద్దవాళ్ళకు అవసరమయ్యేవన్నీ పిల్లలకూ కావాలి. యాత్రా చరిత్రలు కూడా నేను పిల్లల కోసం రాశాను. సైన్స్‌ను కళలను, సాహిత్యాన్ని పిల్లల కోసం రాస్తున్నాను. నేను ప్రత్యేకమైన చర్యలేమీ తీసుకోవడం లేదు. మా ఆసుపత్రికి వచ్చే పిల్లలకు తల్లులకు పుస్తకాలను అందిస్తాను. అలాగే పేషంట్లు మాత్రమే కాకుండా స్నేహితులు, బంధువులు, వచ్చినపుడు మా ఆసుపత్రిలో పెట్టిన బొమ్మల వివరాలన్నీ చెపుతాను. టీచర్లు, విద్యార్థులు, వచ్చినపుడు మొత్తం హాస్పిటల్‌ను చూపించి అది ఏ రాష్ట్రాలకు సంబంధించినయో కూడా కూలంకుషంగా వివరిస్తాను. అలా చాలా మంది సమూహాలుగా మ్యూజియంను చూడటానికి వస్తుంటారు. వచ్చిన వాళ్ళకు అవగాహన కల్పించటం, పుస్తకాలు ఇవ్వటం మాత్రమే చేస్తున్నాను.

ప్రశ్న 6. ఈ పుస్తకంలోని వ్యాసాలు రచించడానికి వేటిని ఆధారంగా తీసుకున్నారు? అంటే ఈ కళల గురించిన వివరాలు ఎక్కడ నుంచి సేకరించారు? ఇంటర్నెట్ నుంచా? లేక ఇతర రాష్ట్రలలోని మిత్రుల ద్వారానా?

జ: ఆయా రాష్టాల కళలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఏ సంవత్సరంలో మొదలై ఎలా వ్యాపించాయి అనే తారీకులు, ఊళ్ళ పేర్లు వంటి వాటి కోసం కొద్దిగా నెట్ మీద ఆధారపడవలసి వచ్చింది. కానీ వ్యాసాలలోని బొమ్మల తయారీ నా స్వంతం కాబట్టి అందులోని కష్ట నష్టాల్నీ నా అనుభవంతో రాశాను. చాలా హ్యాండిక్రాఫ్ట్స్ షాపుల్లో వాళ్ళు ముద్రించే బ్రోచర్లు ఉంటాయి. అవి తెచ్చుకుంటాను. అంతేగాక మా కాన్ఫరెన్సుల్లో పెట్టే స్టాల్స్ సైతం కళలకు సంబంధించిన వివరాల బ్రోచర్లు ముద్రించి ఇస్తారు. లేదా హోటళ్ళలో ఉండే సావనీర్లలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇవన్నీ తెచ్చుకుంటాను. వాటినన్నింటినీ చదువుతాను. నేను ఏదైనా తెలుసుకుంటే ఆ విషయాన్నీ అందరికీ చెప్పాలని ఆశిస్తాను. అలాగే నేను నేర్చుకున్న విషయాలన్నీ పిల్లలకు తెలియచేయ్యాలనే ఆరాటంతో వ్యాసాలు రాస్తున్నాను. నేను చాలా మందిని అడిగినప్పుడు కళా సంబంధ పుస్తకాలు అతి తక్కువగా వచ్చాయని చెప్పారు. అదీ పిల్లల కోసమైతే రాలేదనే చెప్పారు. నేను చేసే అనేక రకాల బొమ్మలు దాదాపు పదివేలకు చేరుతున్నాయి. కాబట్టి కొన్ని బొమ్మలను చూడగానే అర్థమై పోతాయి. షాపులు, స్టాల్స్, దుకాణాలదగ్గర వర్కింగ్ స్టాఫ్ ఉంటారు. కొన్నీ దేశాలలో వర్కింగ్ ప్లేసుల్నీ చూపిస్తారు. అక్కడున్న పని వారితో మాట్లాడవచ్చు. వివరాలు తెలుసుకోవచ్చు. మనసుండాలే కానీ మార్గాలు ఎన్నో ఉంటాయి. విషయాలు చెప్పటమే కాదు ఒక్కోసారి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కూడా. క్విల్లింగ్ కళను షాపులోని వారి వద్దే నేర్చుకున్నాను. టాగూర్ శాంతినికేతన్‌లో విద్యార్థులు ఎన్నో విషయాలు చెప్పారు. బొమ్మల తయారీ చూపించారు.

ప్రశ్న 7. ఈ వ్యాసాల నిడివి చాలా వరకు 2-3 పేజీలకు మించకుండా ఉంది. ఇంత తక్కువ నిడివిలో ఆయా కళని పరిచయం చేయడం, ఎలా చేయాలో వివరించడం – ఎలా సాధ్యమయింది? ఏదైనా వ్యాసాన్ని మరింత పెంచి రాసి ఉంటే బాగుండేదని అనిపించిందా?

జ: వ్యాసాల నిడివి పెరిగే సమస్య లేదు. దినపత్రికలో అర పేజీ మాత్రం నాకు కేటాయించబడింది. కాబట్టి పరిధిని మించి రాయడం జరగదు. అందులోనూ ఈ వ్యాసం కేవలం కళా పరిచయం మాత్రమే కాదు. ఆయా కళలకు సంబంధించిన కళాకృతుల్ని ఎలా తయారు చేసుకోవాలో వివరించే వ్యాసాలు ప్రతి సారీ ఐదు కళాఖండాల, తయారీ గురించి రాసేదాన్ని. ఇంకా ఎక్కవ రాసేస్తే పూర్తి కళా వ్యాసంగా మారుతుంది. పెద్దవాళ్ళ వ్యాసమై పోతుంది. పిల్లలకు బొమ్మలు చేయిసున్నట్లుగా చూపిస్తూ అంతర్లీనంగా కళ గురించి పరిచయం చేయాలి. పరిచయం చాలు ప్రావీణ్యం అవసరం లేదు వారికిష్టమైతే ఆ కళ గురించి తెలుసుకుంటారు. లడ్డూ రుచి మాత్రం చూపించి వదిలేయాలి. కాబట్టి ఏ కళ గురించీ ఎక్కువగా రాయాలని అనుకోలేదు. చాలా సులభంగా అర్థమయ్యేలా పిల్లలకు ఇష్టాన్ని పెంచే విధంగా పరిచయం చేస్తూ రాశాను.

ప్రశ్న 8. ఈ పుస్తకంలోని ఏ వ్యాసం మీకు బాగా నచ్చింది? ఎందుకు?

జ: పుస్తకంలోని అన్ని వ్యాసాలనూ అత్యంత ఇష్టంతో రాశాను. కాబట్టి అన్ని ఇష్టమే. నీ పిల్లల్లో ఎవరెక్కువ ఇష్టం అంటే ఏమనే చెబుతాం. ఇదీ అలాగే మన చేతిలో పురుడు పోసుకున్న ప్రతి వాక్యమూ పుత్ర ప్రేమతో ఉంటుంది అన్నింటినీ సమానంగా ప్రేమిస్తాను. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేను. నాకు సాహిత్యమూ, కళలూ రెండూ రెండు కళ్ళు లాంటివి.

ప్రశ్న 9. ఈ పుస్తకంలోని ఏ వ్యాసం రాయడానికి ఎక్కువ కష్టపడ్డారు? ఎందువలన?

జ: ఈ వ్యాసాలు రాయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే కరోనా సమయంలో రాశాను కాబట్టి పాఠకులు అందర్నీ దృష్టిలో పెట్టుకుని రాయవలసి వచ్చింది. ఆర్ట్‌కు సంబంధించిన వ్యాసాలు అనగానే పక్కన పడేస్తారు. అలా కాకుండా వారు చదివేలా చూడాలంటే కళలో లోతు వెళ్ళకూడదు. పంచదార కోటింగ్‌తో చేదు మాత్రని మింగించినట్లుగా కళా ఖండాల బొమ్మల్ని చూపిస్తూ కళను గురించి చెప్పడం లాంటిది. చాలా సులభంగా చెయ్యగలిగేవి మాత్రమే ఎoచుకున్నాను. నేను ఎప్పుడో చేసిన వాటిని షెల్పుల నుంచి బయటకు తీసి దుమ్ము వాటికి వాటికి ఫోటోలు తీయ్యాలి. ఆ పోటోలను అందంగా తియ్యాలి తర్వాత అవి ఎలా తయారు చేసానో వివరించాలి. నేను తయారుచేసినపుడు ఎలా తయారుచేసినా నేర్చుకునే వాళ్ళకు సులభంగా ఉండేలా స్టెప్ బై స్టెప్ గుర్తు తెచ్చుకోవాలి. తరువాత ఆ కళకు సంబంధించిన విషయాలు చెప్పాలి. ఈ బొమ్మల్ని చేసినపుడు ఆయా రాష్ట్రాలతో గల అనుబంధాన్ని వివరించాలి. ఆయా రాష్ట్రాలు సందర్శించినపుడు జరిగిన సంఘటనలు వివరించాలి. ఇంతా చేసి నిడివి పెరగకూడదు తరగకూడదు. ఈ కళకూ నాకూ మధ్య గల ఆత్మీయత, అనుబంధంతో వ్యాసాలు రాయాలి. ఈ కళా వ్యాసం ఒక్కటి రాసే సమయంలో మమూలు రచనలు అంటే కథలు కవితలు ఎక్కువ రాసుకోవచ్చు. ఇదే విషయాన్ని స్నేహితులు చెప్పినా నాకున్న ఇష్టంతో పెడచెవిన పెడతాను. కళా వ్యాసాలు రాయడం నా దృష్టిలో సమయం ఎక్కవ తీసుకుంటాయి. కష్టం ఎక్కువ ఉంటుంది.

ప్రశ్న 10. వర్ణలిపిపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ పుస్తకానికి ప్రచారం ఎలా కల్పించదలచారు?

జ: ఈ పుస్తకమే కాదు ఏ పుస్తక ప్రచురణ అయినా కష్టంగానే ఉంటుంది. పుస్తకం ప్రచురించేటపుడు టైపింగులు, ప్రింటింగులు, ప్రూఫులు అన్నీ చూస్తుంటే మరోసారి పుస్తకం వెయ్యగూడదు అనుకుంటాము. కానీ మళ్ళీ పుస్తకం మొదలుపెడతాము. కాన్పుల సమయంలో నొప్పి భరించలేక మహిళలు మరోక్కరిని కనకూడదని నిర్ణయించుకునుట్లుగా పుస్తక పురిటి నొప్పులు సైతం అలాంటి వాతావరణమే సృష్టిస్తాయి. ఇలా అనుకుంటూనే యాభై పుస్తకాలు బాలల కోసం రాశారు. మరో యాభై పుస్తకాల అముద్రితాలుగా ఉన్నాయి.

పుస్తకానికి ప్రచారం ఎలా వస్తుందో తెలియదు. అది వార్తాపత్రికల పని. నా వరకు నేను రాసి ముద్రించాను. నేను బొమ్మలు తయారు చేయడం ఒక ఎత్తైతే రాసి ముద్రించడం మరొక ఎత్తు. నేను కళాకారిణిగా, రచయిత్రిగా రెండు పాత్రలు పోషిస్తున్నాను. నిజానికి నాకు రెండు వైపులా ప్రెశంసలు లభించాలి. ఇదే కాదు నేను ఇప్పటి వరకూ చేసిన కృషికి తగిన గుర్తింపు రాలేదన్నే భావిస్తున్నాను. నా కళాకృతులకు; నా పుస్తకాలకు మీ లాంటి వారి ద్వారా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. కందేపి రాణీప్రసాద్ గారూ.

డా. కందేపి రాణీప్రసాద్: ధన్యవాదాలు.

***

వర్ణలిపి (కళా వ్యాసాలు)
రచన: డా. కందేపీ రాణీప్రసాద్‌
ప్రచురణ: తపస్వీ మనోహరం పబ్లికేషన్స్
పేజీలు: 98
వెల: ₹ 125/-
ప్రతులకు: డా. కందేపీ రాణీప్రసాద్‌,
మేనేజింగ్‌ డైరెక్టర్‌, సృజన చిల్డ్రన్స్‌ హాస్పటల్‌,
సిరిసిల్ల – 505301.
తెలంగాణ.
ఫోన్‌: 9866160378

 

 

~

‘వర్ణలిపి’ పుస్తక సమీక్ష
https://sanchika.com/varnalipi-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here