రచయిత, కాలమిస్ట్ డా. రేవూరు అనంత పద్మనాభరావు ప్రత్యేక ఇంటర్వ్యూ

1
8

[‘ఆకాశవాణి పరిమళాలు’, ‘అనంతుని ఆత్మకథ’ పేరిట స్వీయచరిత్ర వెలువరించిన డా. రేవూరు అనంత పద్మనాభరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. రేవూరు అనంత పద్మనాభరావు గారూ.

డా. రేవూరు అనంత పద్మనాభరావు: నమస్కారమండీ.

~

ప్రశ్న 1. సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైన ఆకాశవాణి పరిమళాలుశీర్షికలోని ఆర్టికల్స్‌ని అదృష్టవంతుడి ఆత్మకథపేరిట స్వీయచరిత్రగా వెలువరించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? వృత్తిపరమైన అనుభవాలు ఎక్కువగా ఉన్న ఈ రచనలను ఆత్మకథలా ఎందుకు పరిగణించారు?

జ: నాకు ‘అ’, ‘ఆ’లు అని ఆకాశవాణిలో ముద్దుపేరు. ‘అ’ అంటే అనంత పద్మనాభ రావు, ‘ఆ’ అంటే ఆకాశవాణి. అంతటి తాదాత్మ్యం. ఆకాశవాణితో నా అనుబంధం 1974 నుండి 2024 వరకు యాభై ఏళ్లుగా కొనసాగుతోంది. రిటైరై 20 ఏళ్ళు. అయినా ఇప్పటికీ ఆకాశవాణి అధికారులు మైత్రీ భావంతో నా సలహా సంప్రదింపులు కోరుతుంటారు. దీనికి కారణం 1985-90 మధ్యకాలంలో నేను హైదరాబాదు, ఢిల్లీలలో ఆకాశవాణి సిబ్బంది ట్రైనింగ్ కళాశాలలో చాలామంది ప్రోగ్రామ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాను. వారందరూ స్టేషన్ డైరక్టర్లు, డి.డి.జి.లు, డి.జి.లు అయ్యారు. సంచికలో ‘ఆకాశవాణి పరిమళాలు’ శీర్షిక చాలా కాలం నడిపినప్పుడు అందులో అంశాలు నా వ్యక్తిగత జీవితంతో కూడా ముడిపడి వున్నాయి. నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దింది ఆకాశవాణి, అందువల్ల ఈ రచనను ఆత్మకథగా పేర్కొన్నాను. ‘అదృష్టవంతుని ఆత్మకథ’ అనే టైటిల్ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ నా గూర్చి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం ప్రచురిస్తూ కొసమెరుపుగా అన్నారు. లోగడ డి.వి.నరసరాజు తన ఆత్మకథకు అదే టైటిల్ పెట్టారు. అందువల్ల ఆకాశవాణి 50 ఏళ్ల చరిత్ర నా స్వీయచరిత్రతో పెనవేసుకుపోయింది. ఈ రచనకు ముందు ‘నది’ మాస పత్రికలో నేను ‘అలనాటి ఆకాశవాణి’ అని సంవత్సరం పైగా వ్రాశాను, అందులో స్వీయ విషయాలు లేవు.

ప్రశ్న 2. అనంతుని ఆత్మకథ’ -’అదృష్టవంతుడి ఆత్మకథకి సీక్వెల్ అని అన్నారు. ఎందుకని? వివరిస్తారా?

జ: ‘అదృష్టవంతుని ఆత్మకథ’లో ఎక్కువభాగం ఆకాశవాణిలో నా అనుభవాలు – జ్ఞాపకాలు వచ్చాయి. నా బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం, నా రచనలకు ప్రేరణ, నా అవధాన వికాసాలు, నా పరిశోధనలు, నాపై పరిశోధనలు వగైరా అందులో ప్రస్తావించలేదు. వ్యాసభారతానికి అనుబంధంగా హరివంశం వచ్చినట్లు నా ఆత్మకథకు పొడిగింపుగా ‘అనంతుని ఆత్మకథ’ వచ్చింది. 2024 జనవరిలో అప్పాజోశ్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారు నాకు విశిష్ట సాహితీపురస్కారం ఇచ్చారు. అప్పాజోస్యుల సత్యనారాయణగారు ‘అనంతుని ఆత్మకథ’ను ప్రచురించారు. ఈ రచన లేకపోతే నా వ్యక్తిగత జీవనగమనం పాఠకులకు తెలిపే అవకాశం రాదు.

ప్రశ్న 3. స్కూలు/కాలేజీ విద్యార్థిగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు/లెక్చరర్లు ఎవరు? వాళ్ళ నుండి మీరు ఏం నేర్చుకోగలిగారు?

జ: కాలేజి జీవనం రెండు భాగాలు. డిగ్రీ 1962-65 వి. ఆర్. కాలేజీ నెల్లూరులో చదివాను. అక్కడ నన్ను ప్రొత్సహించిన అధ్యాపకులు శ్రీ పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మగారు. సాహిత్య చరిత్ర బోధించడమే గాక, కాలేజిలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా 1964 – 65 మధ్య అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అండదండగా నిలిచారు. వారి శిష్యులే పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్య నాయుడు. ఆయన మా గురువుగారి పేర ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తెలంగాణా సారస్వత పరిషత్ వారు నాకు 2022లో (25వేల రూపాయలు) అందించారు. మరో అధ్యాపకులు పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రిగారు, రేడియోలో సరస వినోదిని సమస్యాపూరణ కార్యక్రమానికి డిగ్రీ రెండో సంవత్సరం నుండి (1963) సమస్యాపూరణ చేసి పంపేందుకు రెండేళ్లు ప్రోత్సహించారు.

1965-67 మధ్య తిరుపతి యస్. వి. యూనివర్శిటీలో తెలుగు ఎం.ఏ. చేస్తున్నప్పుడు బాల వ్యాకరణం బోధించిన శ్రీ తిమ్మావజ్జల కోదండరామయ్య నాలో పరిశోధనా దృక్పథానికి ఒరపిడి కలిగించారు. పాఠశాల స్థాయిలో బుచ్చిరెడ్డిలో నేలనూతల గోపాలకృష్ణయ్య మాస్టారు స్మరణీయులు.

ప్రశ్న 4. మీకు పద్యాలపై ఇష్టం ఎలా ఏర్పడింది? మీ ధారణాశక్తికి కారణం ఏదని మీరు భావిస్తున్నారు?

జ: విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి 16వ ఏట నుండి పద్యం పంపడం మొదలుపెట్టాను, మూడు శతకాలు – ఆంజనేయ శతకం, శ్రీ వెంకటేశ శతకం, పద్మనాథ శతకం వ్రాశాను. మా నాన్నగారు భారత భాగవతరామాయణాలు సాయంకాలం పూట మా యింటి అరుగుపై కూర్చొని భావార్థాలు మిత్రులకు చెప్పేవారు. అది నాకు స్ఫూర్తినిచ్చింది. ధారణాశక్తి నా జాతకరీత్యా లభించిందని నా విశ్వాసం. మకరలగ్న జాతకుడిని, లగ్నంలో రవిబుధులున్నారు. కుశాగ్రబుద్ధి లభించింది. అంతా దైవదత్తం.

ప్రశ్న 5. డిగ్రీలో కాని పిజిలో గాని మీకు ఎదురైన, చాలా కాలం గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా?

జ: అది 1964 సంవత్సరం. ‘అల్లుడు చూపిన ఆదర్శం’ నాటకంలో స్త్రీ పాత్ర వేశాను. నేను చాలా చిన్న పిల్లవాడిని. మా నాటికకు బహుమతి అందిస్తూ నన్ను చూచి అప్పటి S.V. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గోవిందరాజులు నాయడుగారు – “Are you from High School” అని చమత్కారంగా అన్నారు.

నేను 1967 డిసెంబరులో కందుకూరు కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరాను. నా వయస్సు 20 సంవత్సరాలు. మొట్టమొదటి క్లాసు తీసుకోవడానికి పియుసి సెక్షన్ క్లాసుకు వెళ్లి బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడ్డా విద్యార్థులు లేచి నిలబడలేదు. అంత చిన్నవయసు, ఆకారము నాది.

ప్రశ్న 6. మీకు అవధానంపై ఆసక్తి ఎలా కలిగింది? కందుకూరులో చేసిన మొట్టమొదటి అవధానం గురించి చెప్పండి. అవధానాలలో అంతగా రాణించిన మీరు వాటిని ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది?

జ: ఈ ప్రశ్న మూడు భాగాలు. ఒకటి అవధానంపై అభినివేశం కలగడానికి కారణం – 1966లో ఎం.ఏ. విద్యార్థిగా తిరుపతిలో సి.వి. సుబ్బన్న శతావధానంలో నేను ఒక పృచ్ఛకుణ్ణి. అవధానానంతరం హాస్టల్ రూంకి వచ్చి నా రూమ్‌మేట్ సుబ్బారావుకు అవధాన పద్యాలు అన్నీ కంఠతా చెప్పాను. మిత్రులు ఆశ్యర్యపోయారు. తొలి అవధానం కందుకూరు ప్రభుత్య కళాశాలలో చేశాను (1969 నవంబరు 19). దానికి ముందు ఆరంభంగా 1969 జనవరిలో మా కాలేజి ఆఫీసు సూపరింటిండెంట్ టి. అప్పయ్యశాస్త్రి గారి ఇంటి మేడ మీద నిషిద్ధాక్షరి అంశం లేకుండా చేశాను. కళాశాలలో చేసిన అవధానంలో పృచ్ఛకులుగా అన్నాప్రగడ లక్ష్మీనారాయణ, జంధ్యాల లక్ష్మీనారాయణశాస్త్రి, ఆర్. యస్. సుదర్శనాచార్యులు ప్రభృతులు వ్యవహరించారు. జయప్రదంగా పది సంవత్సరాలు పలు ప్రాంతాల కళాశాలల్లో పాఠశాలల్లో అవధానాలు చేశాను. ‘అవధాన పద్మ సరోవరం’ పేర అవి గ్రంథరూపంలో తెచ్చాను. చిన్న చిన్న పట్టణాలలో పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి చేశాను. దగదర్తి, వెంకటగిరి, కనిగిరి, పొదిలి, వేటపాళెం, దామరమడుగు అందుకు ఉదాహరణ. కందుకూరు, నెల్లూరు, తిరుపతి, బెంగుళూరు, విజయవాడ, కడప, ప్రొద్దుటూరు కళాశాలు ప్రధానాలు.

వేద సంస్కృత పాఠశాల, నెల్లూరులో 1973 జూన్‌లో అష్టావదానం చూసి ఉత్తరప్రదేశ్ గవర్నరు డా. బెజవాడ గోపాలరెడ్డి గారు సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తాను. 1976 జనవరి 26న అంధ్ర సారస్వత సభ అవధానాన్ని బెంగుళూరు ఆకాశవాణి డైరక్టరు డా. బాలాంత్రపు రజనీకాంతరావు రికార్డింగు చేయించి గంట సేపు ప్రసారం చేయించారు.

1976 చివరలో అవధాన ప్రదర్శనలు మూగించడానికి రెండు ప్రధాన కారణలు: 1. కడప డిగ్రీ కళాశాలలో నా అవధాన సభకు అధ్యక్షత వహించిన పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యులవారు నాకొక హెచ్చరిక చేశారు. ‘అవధానం, ఆశుకవిత్వం చిరకాలం నిలవవు. గ్రంథ రచనపై దృష్టి మళ్లించమ’ని సూచించారు. 2. నేను ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‍గా 1975 ఆగస్టులో చేరాను. ఎక్కడైనా అవధానం చేస్తే అప్పట్లో 116/- రూపాయలు, శాలువా ఇచ్చి సత్కరించేవారు. నేను ఆ కార్యకర్తకు ఆకాశవాణిలో ప్రోగ్రాం ఇచ్చినందున నా అవధాన సత్కారం జరిగిందని పిటీషన్ పెట్టడానికి కొందరు శత్రుమిత్రులు తలపెట్టారు. దానికి ముగింపుగా అవధానాలు మానివేశాను.

ప్రశ్న 7.అవధానాలు చేయడం మానేసాకా, ఎప్పుడైనా ఎవరి అవధానంలోనైనా పృచ్ఛకుడిగా పాల్గొన్నారా? పృచ్ఛకుడిగా మీకు అప్రస్తుత ప్రసంగం/నిషిద్ధాక్షరి వంటివి ఏ అంశం ఇష్టం? మీరు అభిమానించే అవధాని ఎవరు?

జ: అవధానాలు మానివేసి 50 ఏళ్లు. అయితే ఆంధ్రదేశంలోని సుప్రసిద్ధ సహస్రావధానుల సభలలో ముఖ్యఅతిథిగా/అధ్యక్షుడిగా/పృచ్ఛకుడిగా పాల్గొంటూనే వున్నాను. ఈనాటి జగజెట్టీలు అందరూ నాకు మిత్రులే. నరాల రామారెడ్డి, డా. మేడసాని మోహన్, డా మాడుగుల నాగఫణి శర్మ, డా. గరికపాటి నరసింహారావు, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా. బేతవోలు రామబ్రహ్మం, వద్దిపర్తి పద్మాకర్, ఆముదాల మురళి ప్రభృతుల అవధాన సదస్సులలో కీలక పాత్ర పోషించాను. వీరందరూ నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తారు. మరుమాముళ్ళ దత్తాత్రేయశర్మ మూడేళ్లుగా హైదరాబాదులో అవధాన శిక్షణా శిబిరాలు ఏటా నిర్వహిస్తున్నారు. అందులో యువ అవధానులకు సూచనలు చేస్తూనే వున్నాను. 2024లో తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం వారు అవధాన సదస్సు నిర్వహించారు. నేను, నాగపణిశర్మ అక్కడ ముఖ్య అతిథులం. అందువల్ల అవధానాలు చేయడం మానివేశాను గాని, అవధాన కళాభిమానం మానలేదు. ఆకాశవాణిలో ఫోన్-ఇన్-ప్రోగ్రాం ద్వారా కడప, విజయవాడ, విశాఖ, హైదరాబాదుల్లో అవధానులను కూర్చొబెట్టి ‘లైవ్’లో అష్టావధానం చేయించి ప్రసారం చేసే ప్రయోగం చేశాను (1994).

నేను అప్రస్తుత ప్రసంగం అంశాన్ని అభీష్టంగా ఎంచుకుంటాను. ఆ తర్వాత సమస్యాపూరణ. మీరడిగిన ప్రశ్న – అభిమానించే అవధానికి నా సమాధానం – ‘వ్రతానం ఉత్తమం వ్రతం’ అని ప్రతి వ్రతానికి చెప్తారు. అలానే ఎవరి పాండిత్య ప్రతిభ వారిది. మహిళలలో తొలి అవధాని యం. కె. ప్రభావతి. ప్రస్తుతం బులుసు అపర్ణ జైత్రయాత్రలు చేస్తున్నారు. విదేశీ పండితులు తెలుగువారు అవధాన పతాకం ఎగురవేస్తున్నారు.

ప్రశ్న 8. పిహెచ్.డి. పట్టా కోసం కందుకూరి రుద్రకవి రచనలపై మీరు చేసిన పరిశోధనలో మీరు ఏ విషయాన్ని విశేషంగా ప్రతిపాదించారు? మీకన్నా ముందు లేదా మీ తరువాత గాని ఎవరైనా కందుకూరు రుద్రకవిపై పిహెచ్‍డి చేశారా?

జ: నేను 1973-76 మధ్య మూడు సంవత్సరాలు తిరుపతి విశ్వవిద్యాలయంలో ఆచార్య జాస్తి సూర్యనారాయణ పర్యవేక్షణలో కందుకూరి రుద్రకవిపై పరిశోధన చేశాను. నాకు ముందు ఎవరూ ఆయన రచనలపై పరిశోధనకు పూనుకోలేదు. తర్వాత ఎవరికీ ఆ అవసరం లేదు. రుద్రకవి రాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడని సప్రమాణంగా నిరూపించాను. ఆయన కాల నిర్ణయ విషయంలో నేను చేసిన ప్రతిపాదనను ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి తమ సాహిత్య చరిత్రలో సమర్థించారు.

రుద్రకవి రెండే రెండు గ్రంథాలు వ్రాశారు. నిరంకుశోపాఖ్యాన ప్రబంధము, సుగ్రీవ విజయ యక్షగానము. ఆ తరువాత పేర్కొనదగింది జనార్దనాష్టకం (పద్యాలు).

ఎక్కవ గ్రంథాలు వ్రాసిన వారిపై పరిశోధన సులభం. రెండే పుస్తకాల మీద విశేష శ్రమపడాలి. నేను నిరంకుశునికి సమఉజ్జీలు అనే ప్రకరణంలో తెలుగు సాహిత్యంలో నిగమశర్మ వంటి పాత్రలను పోల్చి చూపించాను. గుణనిధి, మదాలసుడు, మందేహుడు ఇలా అనేక కావ్యాలలోని వ్యక్తులను పోల్చి అద్భుత ప్రకరణం తయారుచేశాను. వారికి ‘తెలుగు సాహిత్యంలో ధూర్త నాయకులు’ అని పేరు పెట్టాను. వెధవ పనులు చేసినా కొద్దిపాటి పుణ్య విశేషంతో అంత్యంలో వారు ముక్తిని పొందారు. రుద్రకవి కాలనిర్ణయం నా ప్రతిపాదనలో ముఖ్యం.

ప్రశ్న 9. కందుకూరి రుద్రకవి రచనలపై మీరు చేసిన పరిశోధన – మీకు యు.పి.ఎస్.సి. వారి ఓ ఇంటర్వ్యూలో ఉపకరించింది. ఆ వివరాలు చెప్తారా?

జ: రుద్రకవి రచనపై నేను చేసిన పరిశోధన – ఇంటర్వ్యూ సమయంలో ఉపకరించిన మాట వాస్తవమే. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రుద్రకవి ఉన్నాడు. ఇంటర్వ్యూలో రాయల వారిని గూర్చి అడిగారు. సాధికారికంగా చెప్పగలిగాను.

ప్రశ్న 10. తొలి రోజుల్లో సాంఘిక నవలలు రాసిన మీరు – తరువాతి రోజుల్లో కాల్పనిక సాహిత్యానికి దూరమై, నాన్-ఫిక్షన్ రచనలవైపు వెళ్ళారు. ఈ మార్పుకు కారణమేమిటో వివరిస్తారా?

జ: నేను మొత్తం నాలుగు నవలలు వ్రాశాను. తొలి నవల మారని నాణెం. 1973లో ప్రచురించాను. 1971 నుండి మూడు సంవత్సరాలు వరుసగా ఆంధ్రప్రభ నవలల పోటీకి మూడు నవలలు వ్రాశాను. బహుమతులు రాలేదు. అవి గ్రంథ రూపంలో విజయవాడ సిద్ధార్థ పబ్లిషర్స్ 1980లో ప్రచురించారు. ఆ తరువాత ‘స్వగతాలు’ అనే నవల 1996 అక్టోబరులో ఆంధ్రభూమి మాసపత్రిక అనుబంధ నవలగా సి. కనకాంబర రాజు ప్రచురించారు. నవలలు రాయడం మానివేశాను గాని ఫిక్షన్‍కు దూరం కాలేదు. నాలుగు కథాసంపుటులు ప్రచురించాను. కథా కమామిషు (2013), గోరింట పూచింది (2013), కథా మందారం (2015), కథా దర్పణం (2017) – ఇలా నాలుగు సంపుటులలో వంద కథలు వచ్చాయి. అందులో కథలు వివిధ వార, మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి. స్వాతి వారపత్రిక కథల పోటీలో ‘వట్టి రాకపోక లొనర్చు వాని సతియు” అనే కథకు 10 వేల రూపాయల పారితోషికం లభించింది. వ్యాసాలు రాయడం, జీవిత చరిత్రలు రాయడం నా కభీష్టం. 15 మంది జీవిత చరిత్రలు వ్రాశాను. ఢిల్లీ ప్రముఖులు, ప్రసార ప్రముఖులు, ఆచార్యదేవోభవ – పేర వందలాది వ్యక్తుల జీవనరేఖలు ప్రచురించాను. వెయ్యికి పైగా పరిశోధనా వ్యాసాలు వచ్చాయి. 120 గ్రంథాలు ప్రచురించాను. వందకు పైగా గ్రంథాలకు పీఠికలు/అభిప్రాయాలు వ్రాశాను. పత్రికలలో గ్రంథ సమీక్షలు 50 దాక రచించాను. ఫిక్షన్ రాయడం తగ్గించాను.

ప్రశ్న11. కందుకూరు రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకరిగా ఉండి, పలు పుస్తకాలు ప్రచురించారు. ఈ సంఘం తరఫున నిర్వహించిన కార్యక్రమాలలో ఏది విశిష్టమని భావిస్తారు?

జ: కందుకూరు రాయల కాలం నాటి నుండి ప్రసిద్ధం. రాయలవారి స్కంధావారాలు అక్కడ నిడివి చేశాయి గాబట్టి ‘స్కంధపురి’ అని పేరు. కాలక్రమంలో కందుకూరు అయింది. 1966లో అక్కడ తిక్కవరపు రామరెడ్డి వదాన్యతతో ప్రభుత్వ కళాశాల ఏర్పరచారు. నేను 1967 డిసెంబరులో తెలుగు అధ్యాపకుడిగా చేరాను. జంధ్యాల లక్ష్మీనారాయణ శాస్త్రి మా హెడ్. కావలి తాలూకా రచయితల సంఘ ప్రారంభోత్సవానికి వెళ్లినపుడు కందుకూరులో కూడా ప్రారంభిద్దామని నాకు సంకల్పం కలిగింది. నేను అధ్యక్షుడిగా పవని నిర్మల ప్రభావతి, విక్రాల శేషాచార్యులు గౌరవాధ్యక్షులుగా బి.వి. ప్రసాదరావు కార్యదర్శిగా 1972లో రచయితల సంఘం ప్రారంభించాము. కవి, కథక సమ్మేళనాలతో బాటు కవుల జయంతులు జరిపాము. ఎర్రా ప్రెగడ జయంతి గుడ్లూరులో, పిల్లలమర్రి పినవీరన జయంతి సింగరాయకొండలో, రుద్రకవి జయంతి కందుకూరులో జరిపాం. 1975 ఏప్రిల్‍లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు మా సంఘం పక్షాన ముగ్గురు ప్రతినిధులను ఆహ్వానించారు.

పవని శ్రీధరరావు ప్రోత్సాహంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార శాఖామాత్యులు బత్తిన సుబ్బారావును కందుకూరుకు ఆహ్వానించాం. ఆయన మా రచయితల సహకార సంఘం ప్రారంభించి లక్ష రూపాయాల సబ్సీడీ ప్రకటించారు. శ్రీధరరావు అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షులుగా, ప్రసాదరావు కార్యదర్శిగా గ్రంథ ప్రచురణలు నాలుగు చేశాము. ప్రింటింగ్ ప్రెస్ కొన్నారు. 1975 ఆగస్టులో నేను కందుకూరు వదలి కడప ఆకాశవాణిలో చేరడంతో తరువాత కాలక్రమంగా స్తబ్ధత ఏర్పడింది.

కుసుమాంజలి, శారద నవ్వింది, మాల్యాద్రి వైభవం గ్రంథాల ప్రచురణకు తోడు పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఒక శనివారం 14 మంది కవులం కవి సమ్మేళనంలో పాల్గొన్నాం. కందుకూరు సబ్ జడ్జ్ బి.వి. నరసింహం అధ్యక్షత వహించారు. అదొక మధుర సన్నివేశం. ఆ కవితలు సంపుటిగా వేశాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, యస్.వి.భుజంగరాయ శర్మ, ఆరుద్ర, వి.ఎ.కె. రంగారావు, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి, శంకరమంచి సత్యం, నంబూరి రామకృష్ణమాచార్య ప్రభృతులు కందుకూరు వచ్చి మా రచయితలను బహుధా ప్రశంసించడం సంతోషదాయకం. కావలి, కందుకూరు రచయితల సంఘాలు రెండూ సంయుక్తంగా సమావేశాలు జరిపాయి. అని మధురానుభూతులు.

ప్రశ్న12. మీరు పని చేసిన అన్ని ఆకాశవాణి కేంద్రాలలో మీకు అమితమైన సంతృప్తి ఏ కేంద్రంలో లభించింది? ఏ కేంద్రం అత్యంత దుస్సహంగా అనిపించింది?

జ: నేను ఆకాశవాణిలో 1975- 2005 మధ్య ముప్పయి సంవత్సరాలలో కడవలో మూడు సార్లు, ఢిల్లీలో రెండు సార్లు, విజయవాడ, అనంతపురాలలో ఒక్కొక్క సారి పనిచేశాను. రాయలసీమలో పదేళ్లు, ఢిల్లీలో ప్రదేళ్లు వివిధ హోదాలలో వ్యవహారించాను. కాన్పూరు, కొత్తగూడెం కేంద్రాలలో కొద్దినెలలు, డ్యూటీ మీద వెళ్ళాను. ప్రొడ్యూసర్‍గా రేడియోలో చేరి అదనపు డైరక్టర్ జనరల్‌గా దూరదర్శన్‌లో రిటైరయ్యాను. 25 ఏళ్ళు సంపూర్ణంగా రేడియోలో వున్నాను. చివరలో దూరదర్శన్,

నాకు అనంతపురంలో పనిచేసిన (1990 అక్టోబరు -1993 మార్చి) మూడేళ్లు సంతృప్తినిచ్చింది. కారణం – మట్టి గోడలు, యంత్రాలు తప్ప ఉద్యోగులెవరూ లేని కొత్త కేంద్రంలో 1990 అక్టోబరులో చేరాను. కూర్చొనే కుర్చీ కూడా లేదు. 1991 మేలో ప్రారంభోత్సవానికి కావలసిన సమస్త సదుపాయాలు, సిబ్బంది ఎంపిక, నియామకాలు చేశాను. జిల్లా కేంద్రంగా కొత్త వ్యవస్థ అది. యమ్.యం. రేడియోలు ప్రజల వద్ద లేవు. అట్టి స్థితి నుండి మూడేళ్లలో ‘ప్రజలవాణి ఆకాశవాణి’ అని దినపత్రికలు ప్రశంసించే స్థాయికి చేర్చాను. ఆంధ్రప్రభ రిపోర్టరు యాదాటి కాశీపతి నా వీడ్కోలు సభ వివరాలు ప్రచురిస్తూ- “అనంత పద్మనాభరావు హయాంలో ఆకాశవాణి కేంద్రం దినదినాభివృద్ధి కాక క్షణక్షణాభివృద్ధి చెందింది” అని ప్రశంసించారు.

1990, 1991, 1922 – వరుసగా మూడు సంవత్సరాలు పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి జన్మదినోత్సవాల రికార్డింగులు స్వయంగా పర్యవేక్షించాను. రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళశర్మ, ప్రధాని శ్రీ పి.వి. నరసింహరావులు విచ్చేసిన ఆ సభల రికార్డింగ్ ఒక మహోజ్జ్వల ఘట్టం. ప్రధానమంత్రిచే సత్యసాయి ఆసుపత్రి ప్రారంభోత్సవం నేను ప్రత్యక్షంగా చూశాను. బాబాగారి ఆశీస్సులు అందుకున్నాను. టి.వి.కె. శాస్త్రి మద్రాసు తెలుగు అకాడమీ పక్షాన ఏర్పాటు చేసిన సంగీతసభలో యం. యస్. సుబ్బలక్ష్మిగారు గానం చేయడం చరిత్రాత్మకం.

ఒక స్టేషన్ ప్రారంభించాననే తృప్తి నాకుంది. అది వృద్ధి చెందడం నా కళ్ళారా 30 ఏళ్ల తర్వాత చూచి సంతోషించాను.

ప్రశ్న13. సాంస్కృతిక కేంద్రమయిన విజయవాడలో పనిచేయడం ఓ ఛాలెంజ్ అని అన్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పని చేసినప్పటి ఏదైనా మరపురాని సంఘటనని పంచుకుంటారా?

జ: ప్రసార రంగంలో దిగ్దంతులైన బాలాంత్రపు రజనీకాంతరావు వంటి వారు పనిచేసిన విజయవాడ కేంద్రంలో 1978-80 మధ్య ప్రొడ్యూసర్ గాను, 1995-1997 మధ్య స్టేషన్ డైరక్టర్ గాను మొత్తం ఐదేళ్లు పని చేశాను. 1990 దశకంలో ఛానళ్లు, దినపత్రికలు ప్రజల నాడిని కనిపెట్టి పని చేస్తున్నాయి. రేడియో శ్రోతల సంఖ్య క్రమంగా వెనకబడిపోయే దశ అది. అదృష్టవశాత్తు నాకు సహచరులు ప్రతిభావంతులు అక్కడ పనిచేస్తున్నారు. వారి సహకారంతో రోజూ ఒక పర్వదినంగా మార్చాము. సాహిత్యకళారంగాలకు చెందిన వారే గాక ఆధ్యాత్మక రంగ ప్రముఖులను స్టూడియోకు రప్పించాను. కుర్తాళం పీఠాధిపతి, కంచిస్వాములవారు, పుష్పగిరి స్వాములవారు, సుందరచైతన్యస్వామి, గణపతి సచ్చిదానందస్వామి, విశ్వయోగి విశ్వంజీ, చినజియ్యర్ స్వామి ప్రభృతుల సందేశాల రికార్డింగు హైలైట్. సినీరంగానికి చెందిన జగ్గయ్య, అల్లురామలింగయ్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, డి.వి.నరసరాజు, జంధ్యాల, సాక్షి రంగారావు, యస్.పి. బాలసుబ్రమణ్యం, పి.సుశీల, జానకి, పి. భానుమతి – ఇలా చెబుతుంటే సుదీర్ఘ జాబితా. నిత్యోత్సవంలా ఆకాశవాణి కేంద్రం విరాజిల్లింది. రాజకీయ ప్రముఖులలో కేంద్ర, రాష్ట్రమంత్రులు పలువురి ఇంటర్వ్యూలు చెప్పారు. కె.రోశయ్య, అశోకగజపతిరాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బోళ్ల బుల్లిరామయ్య, యన్.జి. రంగా ప్రభృతులు స్టూడియోలో ఇంటర్వ్యూలు రికారు చేశారు.

మరపురాని సంఘటన:

సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావు విజయవాడకు ఏదో సభలో పాల్గొనడానికి విచ్చేశారు. వారిని హోటల్లో కలిసి రికార్డింగుకు ఆహ్వానించాను. “చాలాసార్లు రికార్డు చేశాను” అంటూ తిరస్కరించారు. అప్పుడే ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి జాతీయస్థాయిలో బహుమతి లభించింది. “ఆ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి మీ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వండి” అని అభ్యర్ధించాను. ఆయన వెంటనే అంగీకరించారు. “నేను అనేక బహుమతులు తీసుకున్నాను. నా చేతుల మీదుగా బహుమతులివ్వడం సంతోషం” అని మా స్టూడియోలో జరిగిన సభలో చెప్పారు,

మరో చిరస్మరణీయ సంఘటన:

1996 డిసెంబరులో ఆకాశవాణి వార్షికోత్సవానికి కొంగర జగ్గయ్యను ఆహ్వానించడం. 1947 ప్రాంతంలో ఆయన ఢిల్లీలో తెలుగు వార్తలు చదివారు. రెండు సార్లు ఫోను చేసినా రావడానికి అంగీకరించలేదు. మూడోసారి ఫోన్ చేస్తే అంగీకరించారు. సభలో పాల్గొనడమే గాక ఆ మధ్యాహ్నం మా ఇంట్లో ఆతిథ్యం కూడా తీసుకున్నారు.

ప్రశ్న14. ఆకాశవాణి తరపున మీరు చేసిన అనేక ఇంటర్వ్యూలో మీకు బాగా నచ్చిన ఇంటర్వ్యూ ఎవరిది?

జ: భానుమతి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి మా సిబ్బంది జంకుతున్న సమయంలో నేనే రంగంలోకి దిగి ఇంటర్వ్యూ చేశాను. “మీకు అహంకారం అంటారు?” అని అడిగిన ప్రశ్నకు – “కళాకారులకు, ప్రతిభావంతులకు అది అవసరం” అని సమాధానమిచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రశ్నకు ఆమెకు కోపం వచ్చి వెళ్లిపోతుందేమోనని మా సిబ్బంది ఇరుకున పడ్డారు.

నా ఉద్యోగ సమయంలో 1975 నుండి 1990 వరకు నేను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేశారు. స్టేషన్ డైరక్టరుగా నేను ఇంటర్వ్యూలు చేయకూడదనే నియమాన్ని నేనే విధించుకుని తర్వాత కాలంలో ఇంటర్వ్యూలు చేయలేదు.

ప్రశ్న15. గొల్లపూడి గారూ మీరు కలిసి చేసిన బావగారి కబుర్లురేడియో కార్యక్రమంలో గుర్తుండిపోయే అంశం ఏదైనా ఉందా? ఆకాశవాణి కార్యక్రమాలలో మీరు నిర్వహించిన వాటిలో మీకు బాగా నచ్చినది ఏది?

జ: గొల్లపూడి మారుతీరావు, నేను కడప కేంద్రం నుండి 1981లో సంవత్సరం పాటు ‘బావగారి కబుర్లు’ ప్రసారం చేశాము, ఆయనా నేను ‘బావగారూ!’ అని సంబోధించుకునేవాళ్లం. విజయవాడ కేంద్రంలో ప్రతిరోజూ సాయంకాలం నండూరి సుబ్బారావు, సి.రామమోహనరావు – ఇద్దరూ ‘బావగారి కచేరి’ చేసేవారు. అది బాగా పాపులర్. అదే ధోరణిలో సమకాలీన అంశాలపై కబుర్లు చెప్పటం కడప కేంద్రం నుండి ప్రారంభించాం. స్క్రిప్టు వుండదు. యథాలాపంగా మాట్లాడటం. ఆయన, నేను పినిశెట్టి నాటకం ‘ఆడది’లో వేషాలు స్టేజి మీద కడపలో వేశాం, బాగా చనువు. ఆయన శుక్రవారం సాయంకాలం మదరాసు వెళ్లి సోమవారం ఉదయం లోపల వచ్చేవారు. ఒక రోజు రాలేదు, సాయంకాలం దాకా చూశాను, నేనక్కడినే 10 నిముషాలు మాట్లాడాను. “బావగారికి కోపం వచ్చింది. ఏమీ మాట్లాడడం లేదు సుమా!” అని ముగించారు. ఆయన లేని లోటు కనిపించలేదు.

ఆకాశవాణిలో నేను చేసిన కార్యక్రమాలలో ప్రధానంగా గుర్తుంచుకొనే కార్యక్రమం – ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమం. ఒకటిన్నర సంవత్సర కాలం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ‘లైవ్’ ప్రోగ్రాం చెయ్యాలి. నాకు శిష్యుడు మల్లాది సూరిబాబు. 5 సంవత్సరాలుగా విజయవాడ కేంద్రం నుండి ‘ఉషశ్రీ’ ఆ కార్యక్రమానికి జవజీవాలు పోసి పాపులర్ చేశారు. ఆయనను కడపకు, నన్ను విజయవాడకు మార్చారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కొనసాగించాలి. ఆయన భారత, భాగవత, రామాయణాలు ప్రవచనంగా రేడియోలో చెప్పేశారు. నేను ఎర్రన ‘హరివంశం’ ఎంచుకున్నాను. 10 నిముషాలు శ్రోతల ధర్మ సందేహాలకు సమాధానం, 20 నిముషాలు ప్రవచనం. అది బాగా క్లిక్ చేయింది. ‘హరివంశం’ ప్రవచనం గ్రంథ రూపంలో ఉషశ్రీ సోదరులు పురాణపండ రాధాకృష్ణ మూడు దఫాలుగా 10 వేల కాపీలు ప్రింటు చేయించి ప్రచారంలోకి తెచ్చారు.

ఢిల్లీ కేంద్రంలో డైరక్టరుగా సుప్రీంకోర్టు స్వర్లోత్సవ సందర్భంగా ఒక రూపకం తయారుచేయించాను. అందులో చీఫ్ జస్టిస్ ఏ.ఎస్. ఆనంద్ తదితరులు మాట్లాడారు. జాతీయ కార్యక్రమంలో ప్రసారమైంది (2000).

ప్రశ్న16. ఆకాశవాణి నుంచి దూరదర్శన్‍కి మారవలసి వచ్చినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది? సంశయాల వీడి కొత్త బాధ్యతను స్వీకరించేందుకు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు?

జ: ఆకాశవాణిలో 1975 నుండి 2001 వరకు వివిధ హోదాలలో పనిచేసి ‘సమర్థుడ’నని ప్రశంసలందుకున్నాను. రెండేళ్లకొకసారి నేనే ట్రాన్స్‌ఫర్ అడిగి కొత్త చోటుకు లేదా కొత్త సీటు కోరుకొని వెళ్ళాను. 2001 ఆగస్టులో నాతో 12 మందికి డిప్యూట్ డైరక్టర్ జనరల్‌గా ప్రమోషన్  వచ్చింది. అందులో నన్ను ఒక్కడినే దూరదర్శన్‌కు ఢిల్లీలోనే మార్చారు. అక్కడ లంచాల మయం – అని పేరుంది. నేను వెళ్ళనని మోరాయించి అప్పటి సి.ఇ.ఓ. బైజల్ గారికి లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చాను. రేడియోలో గౌహతి వేసినా వెళ్తానని ఖరాఖండిగా చెప్పాను. దూరదర్శన్‍లో కాశ్మీరీ ఛానల్ అధిపతిగా నన్ను నియమించారు, అక్కడ ప్రొడ్యూసర్లకి 30 కోట్లు పంచే వ్యవహారం.

అప్పుడు మా సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్. ఆమె వద్ద సెక్రటరీ అంశుమాన్, ఐ.ఎ.ఎస్. ఆఫీసరు. ఆయన స్వయంగా ఫోన్ చేసి మంత్రిగారిని కలవమని కోరారు. “దూరదర్శన్‌లో ఆ ఛానల్ నిర్వహణకు నిజాయితీ గల ఆఫీసరు మీరని అధికారులు చెబుతున్నారు. మీరు సందేహించవద్దు” అని ఆమె చెప్పారు. రాజకీయ జోక్యం ఉండదని హామీ ఇచ్చారు. ఆమె ఉన్నంత కాలం ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు.

నా కింది డైరక్టరు లంచం తీసుకోవడం తెలిసి మా సి.ఇ.ఓ. అనిల్ బైజల్ గారికి చెప్పాను. వారం లోపల ఆయనను ట్రాప్ చేసి జైలులో పెట్టారు. దూరదర్శన్‌లో పనిచేసిన నాలుగేళ్లు పంచాగ్ని మధ్యంలో నుండి బయటపడి 2005 ఫిబ్రవరి 28న 58వ ఏటనే రిటైరయ్యాను. ఆ కాలంలో ముగ్గురు మంత్రులు, ముగ్గురు డి.జి.లు మారేరు కాలక్రమంలో.

ప్రశ్న17. మీ సుదీర్ఘమైన కెరీర్‍లో ఆకాశవాణి/ప్రసార భారతిలో వివిధ హోదాలలో పనిచేశారు. మీ కార్యదక్షతకీ, నిబద్ధతకీ ఉన్నతాధికారుల నుంచి లేదా మీ శాఖ మంత్రివర్యుల నుంచి గుర్తుంచుకోదగ్గ ప్రశంస ఏదైనా లభించిందా?

జ: మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రసార భారతి ప్రయాణంలో నన్ను ఢిల్లీ స్టేషన్ డైరక్టరుగా 1997లో ఎంపిక చేయడమే పెద్ద ప్రశంసాపత్రం. పైరవీలు చేయలేదు. రాజకీయ ఒత్తిడులు తీసుకురాలేదు. దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మక పదవి అయాచితంగా లభించింది. అలానే దూరదర్శన్‌కు నన్ను ఎంపిక చేయడం కూడా నా పనితీరును మెచ్చుకునే. వీటన్నింటి కంటే నా పదవీవిరమణ వీడ్కోలు సభలో దూరదర్శన్ డైరక్టర్ జనరల్ వినోద కుమార్ “RAP Rao as DDG, Kashmir Channel enhanced the prestige of the institution” అన్నారు. ఆకాశవాణి డైరక్టర్ జనరల్ ఓ.పి. కెజిర్వాల్ నన్ను ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా నియమిస్తూ “Delhi station is window for broadcasting. RAP Rao, is the fittest person to run it” అన్నారు.

మంత్రి సుస్మా స్వరాజ్ నా పని తీరును బహుధా ప్రశంసించారు. అది చాలు.

ప్రశ్న18. మీది ఖచ్చితమైన వశ్యవాక్కు అని అన్నారు. ఏదంటే అది జరిగి తీరుతుందని అన్నారు. హస్తసాముద్రికం నేర్చుకోకపోయినా జోస్యం ఎలా చెప్పగలిగేవారు?

జ: జాతకాలు చూడటం, జ్యోతిషం చెప్పడం నలభై ఏళ్ళుగా అలవాటైంది. ఢిల్లీ భారతీయ విద్యా భవన్‌లో సంవత్సర కాలం (2000 సంవత్సరం) ‘డిప్లొమా ఇన్ జ్యోతిష’ క్లాసులకు హాజరై ‘జ్యోతిష రత్న’ పట్టా పొందాను. నాది వశ్యవాక్కు.

ఎలక్షన్ కమీషనరు జి.వి.జి. కృష్ణమూర్తి గారికి ముందే చెప్పాను “మీకు రాష్ట్రపతి ముద్ర గల పదవి లభిస్తుంది” అని. జాతకం చదివి నాలుగు పేజీలు వ్రాసి ఇచ్చాను. ఆయన అందరికీ చూపించేవారు.

మా మంత్రి హెచ్.కె. యల్. భగత్ వద్ద సెక్రటరీగా ఉన్న రామచంద్రన్ హైదరాబాదు వచ్చినపుడు నాతో దురుసుగా మాట్లాడారు. “6 నెలల్లోనే మీ ఉద్యోగం పోతుంది” అన్నాను. భగత్‍పై కోర్టు తీర్పుతో ఇద్దరికీ ఉద్యోగం పోయింది. లగ్నంలో బుధుడు ఉండటం వశ్యవాక్కుకు కారణమేమో!

ఇటీవల ఒక సుప్రసిద్ధ చలన చిత్ర నటుని కుమారుని వివాహం కూడా నేను చెప్పిన నెల లోనే జరగడం దైవ సంకల్పం.

ప్రశ్న19. తితిదే లో పని చేస్తున్నప్పుడు ఎస్.వి.బి.సి ఏర్పాటులో మీ కృషి చాలా ఉంది. తదుపరి కాలంలో ఎప్పుడైనా ఆ ఛానెల్‍లో మీరు ఏదైనా కార్యక్రమం చేశారా?

జ: తిరుమల తిరుపతి దేవస్థానంలో 2005-2010 మధ్య పనిచేశాను. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు – ఏ.పి.వి.యన్. శర్మ డా. కె.వి. రమణారి, ఇ.వై.ఆర్. కష్ణారావులు నన్ను ఆదరంగా చూశారు. భూమన కరుణాకరరెడ్డి, రమణాచారి ద్వయం భక్తి ఛానల్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దాని ప్రారంభానికి అవసరమైన ఆమోదాలన్నీ ఢిల్లీ నుండి పొందడానికి శ్రీవేంకటేశ్వరుడు నన్ను ప్రథమ సేవకుడిగా ఎంచుకున్నారు. రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా 2008 జూలైలో ఛానల్ ప్రారంభమై విశేష ఖ్యాతి గడించింది.

2010 తర్వాత మూడేళ్ల పాటు వివిధ సందర్భాలలో బ్రహ్మోత్సవాది ప్రత్యక్ష వ్యాఖ్యనాలకు నన్ను ఆహ్వానించారు. సంతోషంగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాం. గత కొద్ది సంవత్సరాలుగా ఛానల్ వారి పిలుపు లేదు, వేరే ఛానళ్ల వారు నా ప్రతిభను గుర్తించి ఆహ్వానిస్తున్నారు.

ఆకాశవాణి పరిమళాలు పుస్తకంతో రచయిత కుమార్తె శ్రీమతి శైలజ

ప్రశ్న20. మీరు చేసిన అన్ని అనువాదాలలో మీకు బాగా పేరు తెచ్చిన లేదా అత్యంత సంతృప్తిని కలిగించిన రచన ఏది? ఆ అనువాదానికి అవకాశమెలా లభించిందో చెప్తారా?

జ: నేను 14 గ్రంథాలు అనువాదం చేశాను. నేను చేసిన అనువాదాలపై చంద్రశేఖర్ పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు. సాహిత్య అకాడమీ NBT, పబ్లికేషన్స్ డివిజన్, ఓపెన్ యూనివర్శిటీ లకు అనువాదాలు చేశాను. తెలుగు విశ్వవిద్యాలయము, కేంద్ర సాహిత్య అకాడమీల అనువాద పురస్కారులు 1993, 2000 లలో లభించాయి.

అన్ని అనువాదాలలో నాకు నచ్చినది – ‘మధుక్షీరాలు’. హీబ్రూ కథల ఆంగ్లానువాదానికి తెలుగుసేత. పబ్లికేషన్స్ డివిజన్ వారు ఆ పని అప్పగించారు. నేను వారికి ఐదు గ్రంథాలు వ్రాశాను. ‘భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు’ – Magnum Opus. ‘మధుక్షీరాలు’ కథల సంకలనం చక్కని ప్రయాగం. నేటివిటీ గల రచన.

ప్రశ్న21. మీరు నాటకాలలో నటించారు. కానీ తర్వాతి రోజుల్లో ఎందుకు మానుకున్నారు? తీరిక లేని ఉద్యోగ బాధ్యతల వల్లా? లేక మరేవైనా కారణాలున్నాయా?

జ: డిగ్రీ చదువుతున్న రోజుల్లో వి.ఆర్. కాలేజి, నెల్లూరులో మూడు సంవత్సరాలు మూడు నాటకాలలో సాంస్కృతికోత్సవాలలో పోటీ నాటకాల్లో వేషాలు వేసి బహుమతులు సంపాదించాను. ఆ తర్వాత కడప ఆకాశవాణిలో ఉండగా గొల్లపూడితో కలిసి ‘ఆడది’ నాటకం రెండు సార్లు ప్రదర్శించినప్పుడు వేషం వేశాను. ఆయనతో కలిసి గెస్ట్ ఆర్టిస్ట్‌గా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు చూపిన ఆదర్శం’ సినిమాలలో కొద్దినిముషాలు నటించాను. భువనవిజయంలో శ్రీకృష్ణదేవరాయలుగా, తిమ్మరుసుగా, తెనాలి రామకృష్ణ తదితర కవుల పాత్రలు పోషించాను. ఉద్యోగ బాధ్యతల నిర్వహణ ముఖ్యంగా భావించాను. సాహిత్యరూపకమైన ఇంద్రసభ, ప్రకాశం దర్బారు వంటివి సమయానుకూల నటనలు.

అనంతుని ఆత్మకథ పుస్తకంతో రచయిత కుమార్తె శ్రీమతి శైలజ

ప్రశ్న22. మీ రచనలపై ఏ యూనివర్శిటీ విద్యార్థులైనా ఎం.ఫిల్/పిహెచ్.డి పరిశోధనలు చేశారా? వారికి డిగ్రీలు లభించాయా?

జ: నా రచనలపై ఐదు విశ్వవిద్యాలయాలలో ఏడుగురు M.Phil/Ph.D. పట్టాలు పొందారు. వారి వివరాలు.

క్రమ సంఖ్య పరిశోధకులు/డిగ్రీ సంవత్సరం విశ్వవిద్యాలయం పర్యవేక్షకులు/ విషయం
1. టి.శ్యాంప్రసాద్, M.Phil, 1993 శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం ఆచార్య కొలకలూరి ఇనాక్/పద్మనాభరావు నవలలు
2. పోతులయ్య, Ph.D., 2007 (అసంపూర్ణం) శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం ఆచార్య హెచ్.యస్. బ్రహ్మనంద/సమగ్ర సాహిత్యం
3. శ్రీమతి డి. నాగమణి, Ph.D., 2013 తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు ఆచార్య టి. గౌరీశంకర్ / సమగ్ర సాహిత్యం
4. కె.చంద్రశేఖర్, M.Phil, 2012  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి డా. పి.సి. వెంకటేశ్వర్లు/నా అనువాద రచనలు
5. కె. చంద్రశేఖర్,  Ph.D., 2014  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి డా.పి.సి, వెంకటేశ్వర్లు/ నేను వ్రాసిన జీవిత చరిత్రలు
6. బి. చిట్టెమ్మ, Ph.D., 2022 కేంద్రయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు ఆచార్య గోనా నాయక్/సృజనాత్మక సాహిత్యం
7. కె. శ్రీనివాసులు, Ph.D., 2020-2024 బెంగుళూరు విశ్వవిద్యాలయం డా. కె. ఆశాజ్యోతి/ప్రసార మాధ్యమ గ్రంథాలు

(సమర్పణకు సిద్ధం)

ప్రశ్న23. సాధారణ ఆత్మకథల్లా రాయని ఈ స్వీయచరిత్రలో చోటు చేసుకోలేకపోయిన వ్యక్తిగత/కుటుంబ/వృత్తిపరమైన అంశాలు ఏవైనా ఉన్నాయా? ఏవైనా అంశాలను మరికొంచెం విస్తృతంగా చెప్పి ఉండవచ్చు అని అనిపించిందా?

జ: స్వీయచరిత్రకు ఫుల్‌స్టాప్ అంటూ వుండదు. ఇది స్వంత డబ్బా లాంటిది. పాఠకుడిని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. వ్యక్తిగత విషయాలలో లోకానికి ఏది హితవో అది మాత్రమే చెప్పాలి.

దాపరికం పనికిరాదు. అతిశయోక్తులు కూడదు. రెండు స్వీయచరిత్రలు నాకు సంతృప్తికరం.

ప్రశ్న24. ఈ రెండు ఆత్మకథల ప్రచురణ అనుభవాలు చెబుతారా? వీటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: ‘ఆకాశవాణి పరిమళాలు’ సంచిక వెబ్ మ్యాగజైన్‍లో మిత్రులు కస్తూరి మురళీకృష్ణ,  సోమ శంకర్‍ల  సౌజన్యంతో ధారావాహికంగా వచ్చింది. పాఠకులు తలలూపారు. ఆ గ్రంథం నేనే ప్రచురించాను, కొని చదివే అలవాటు లేని తెలుగు జనాలకు అది బహుళ సంఖ్యలలో అందలేదు.

‘అనంతుని ఆత్మకథ’ను అప్పాజోశ్యుల సత్యనారాయణగారు ప్రచురించారు. పరిమిత సంఖ్యలో ముద్రణ. విశాఖపట్టణంలో సభకు వచ్చిన వారికి పంచిపెట్టారు. అంతటితో సరి.

ప్రశ్న25. మీ భవిష్యత్తు కార్యక్రమాలు ఏవి? ఏవైనా కొత్త రచనలు చేయాలనుకుంటున్నారా? కొత్త పుస్తకాలు ఏవైనా ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయా?

జ: అవిశ్రాంత జీవనం 2005- 2024 మధ్య గడుపుతూ 20 ఏళ్లలో 70 పుస్తకాలు వ్రాశాను. ఇటీవలే ‘ఆచార్యదేవోభవ’- సంచికలో ధారావాహికగా వచ్చింది.

ప్రస్తుతం ‘తెలుగు జాతికి భూషణాలు’ 25 ఎపిసోడ్స్ సంచికలో వచ్చాయి. 40 దాకా వస్తాయి. రోజూ ఐదారు పేజీలు రాయనిదే నిద్ర పట్టదు.

నా అంతట నేనే కల్పించుకొని ఒక గ్రంథానికి సరిపడా ఇతివృత్తం ఎన్నుకుంటాను. ఇష్టపడి, కష్టపడి విషయసేకరణ చేస్తాను. 50 ఏళ్ల ప్రస్థానంలో 120 పుస్తకాలు వచ్చాయి. ఇది ఫుల్‍స్టాప్ లేని రచనా వ్యాసంగం, కొనసాగుతానే ఉంటుంది. కామా మాత్రమే!! మీలాంటి మిత్రుల ప్రోత్సాహం టానిక్. అవే విటమిన్ టాబ్లెట్లు.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. రేవూరు అనంత పద్మనాభరావు గారూ.

డా. రేవూరు అనంత పద్మనాభరావు: ధన్యవాదాలండీ.

***

ఆకాశవాణి పరిమళాలు (అదృష్టవంతుని ఆత్మకథ)
రచన: డా. రేవూరు అనంత పద్మనాభరావు
పేజీలు: 168
వెల: ₹ 160
ప్రతులకు:
డా. రేవూరు అనంత పద్మనాభరావు,
408, సాయికృపా రెసిడెన్సీ,
మోతీనగర్, హైదరాబాద్. 500114
ఫోన్ 9866586805

 

 

 

~

అనంతుని ఆత్మకథ
రచన: డా. రేవూరు అనంత పద్మనాభరావు
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్
పేజీలు: 202
వెల: ₹ 350
ప్రతులకు:
డా. రేవూరు అనంత పద్మనాభరావు,
408, సాయికృపా రెసిడెన్సీ,
మోతీనగర్, హైదరాబాద్. 500114
ఫోన్ 9866586805

 

 

~

డా. రేవూరు అనంత పద్మనాభరావు గారి స్వీయచరిత్ర – ‘ఆకాశవాణి పరిమళాలు’, ‘అనంతుని ఆత్మకథ’ లను సమీక్ష:
https://sanchika.com/akasavani-parimalalu-anantuni-atmakatha-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here