రచయిత, పరిశోధకులు ఆచార్య శ్రీ వెలుదండ నిత్యానంద రావు ప్రత్యేక ఇంటర్వ్యూ

1
16

[ప్రముఖ ఆంగ్ల రచయిత్రి శ్రీమతి కాబేరీ చటోపాధ్యాయ్ ఆత్మకథ Peeping through my Window కు తెలుగు అనువాదం ‘ఆటుపోట్ల కావేరి’ ఆవిష్కరణ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాచార్యులు, ప్రముఖ పరిశోధకులు డా. వెలుదండ నిత్యానంద రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. వెలుదండ నిత్యానంద రావు గారూ.

డా. వెలుదండ నిత్యానంద రావు: నమస్కారం.

~

ప్రశ్న 1. ఆటుపోట్ల కావేరి పుస్తకం గురించి మీకెలా తెలిసింది? ఈ పుస్తకాన్ని అనువదించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: హైదరాబాద్‌లో మిత్రులు, ప్రముఖ అనువాద రచయిత శ్రీ ఎలనాగ గారి గ్రంథావిష్కరణ (4-9-2023) సందర్భంగా జరిగిన సమావేశంలో కలకత్తాలోని విరాసత్ ఆర్ట్ పబ్లికేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ పార్థప్రతిమ్ రాయ్‌ గారితో అనుకోకుండా పరిచయమైంది. ఆయన చేతిలో ఉన్న ఈ ఆత్మకథను చిన్నగనే వుందిగదా అనుకొని అనువాదం చేస్తానని అనాలోచితంగానే అడిగాను. వారు కూడా వెంటనే అంగీకరించారు. అలా నేను ఈ అనువాదం పనికి పూనుకొన్నాను. అనువాదం పూర్తి కావడానికి రెండు నెలలు పట్టింది.

ప్రశ్న 2. ఈ పుస్తకంలో మీకు ప్రత్యేకంగా అనిపించింది ఏమిటి?

జ: జీవితంలో సుడిగుండాలెన్ని ఎదురైనా క్రుంగిపోకుండా స్థిరచిత్తంతో, ధీరత్వంతో, ఆశావహ దృక్పథంతో జీవితాన్ని గెలవాలని ప్రబోధించడం నన్ను బాగా ఆకట్టుకొంది.

ప్రశ్న 3. అనువదించటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: ఈ ఆత్మకథ అనువాదం నాకొక అద్భుతమైన  అనుభవం. నేను తెలుగులో సీనియర్ రచయితనే.  ఏడు సంపుటాల్లో నాలుగు వేల పేజీల్లో నా సమగ్ర సాహిత్యం రావచ్చుగాక! ఇంగ్లీషు నుంచి నాకవసరమైన సమాచారాన్ని, కోటేషన్లను సేకరించుకొని తెలుగులో వాడుకొన్నవాడినే తప్ప, సంపూర్ణంగా ఒక పుస్తకాన్ని అనువదించిన వాడిని కాదు. ఇంగ్లీష్ నా ప్రధాన రంగం కాదని నాకు తెలుసు. దేవుని ప్రణాళికలో యాదృచ్ఛికం ఏమీ ఉండకపోవచ్చు. మనకు మాత్రమే అలా అనిపించవచ్చు.

ఇంగ్లీషునుంచి అనువదించడం నాకిది ప్రథమానుభవమే. అనువాదం చేయమని అభ్యర్థించాలంటే ఆ రంగంలో కాకలు తీరిన వారెందరో ఉన్నారు. అనువాదానికి నన్ను ఎవ్వరూ సూచించరు. నన్నెవ్వరూ అడగరు. నాది ఆ రంగం కాదు కనుక. అనువాదకుడిని అనిపించుకోవాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది. అది బెంగాలీ రచనే కావాలి. ఒక స్వాతంత్ర్య సమరయోధుని జీవిత చరిత్ర కావాలని అనుకొనే వాడిని. ఇది ఊహలకే పరిమితమైంది. తప్ప కార్యరూపం దాల్చలేదు. రోజుకు రెండు మూడు పేజీల చొప్పున భారం పడకుండా, ఇతరపనులకు భంగం కల్గకుండా తీరిగ్గా రెండు నెలల్లో పూర్తి చేశాను. అర్థాన్ని గమనిస్తూ, భావాన్ని గుర్తిస్తూ, తెలుగు నుడికారాలను, జాతీయాలను వాడుకొంటూ మాతృకానుసారంగా ఉంటూనే అనువాద రచన అన్న స్ఫురణ రాకుండా తెలుగు పుస్తకమే ఇది అని పాఠకుడు అనుకొనేలా శాయశక్తులా యత్నించాననే భావిస్తున్నాను.

శ్రేయోభిలాషులు, ఆంగ్లాంధ్రభాషా పండితులు ఆచార్య పి. లక్ష్మీనారాయణగారు,  ఆరితేరిన అనువాదకులు శ్రీ ఎలనాగ, ఆత్మీయమిత్రులు ప్రొఫెసర్ జి. శ్రవణ్‌కుమార్, డా. బి.కృష్ణ,  చంద్రకీర్తి మొదలైనవారు నా అనువాదాన్ని మూలంతో సరిపోల్చి చదివి, చిరుసవరణలు చెప్పి చాల బాగుందని వెన్ను తట్టి ప్రోత్సహించారు. వారికి నా వినమ్రపూర్వక నమస్సులు.

ప్రశ్న 4. మీకు బెంగాలీ సాహిత్యం పట్ల ఎందుకు మక్కువ ఏర్పడింది?

జ: స్వాతంత్ర్య సమరయోధులు, విప్లవ వీరులు, మేధావులు బెంగాల్ నుంచి ఎక్కువగా వచ్చారు. వారి పట్ల ఆరాధన భావం దేశాభిమానమున్న ప్రతివారిలోనూ ఉండడం సహజం. మీరు నవ్వకుండా ఉంటామంటే ఒక సంగతి చెప్తాను. నవ్వినా నేనేమీ అనుకోను. గత జన్మలో నేను బెంగాల్‌లో ఒక విప్లవవీరునిగా జన్మించినట్లు, బ్రిటిష్ వారి మీదికి విసరాల్సిన ఒకబాంబు పొరపాటున నా చేతిలో పేలడంతో మరణించినట్లుగా నాకెప్పుడూ అనిపిస్తుంది. నా దేశాన్ని ఏమాత్రం కించపరిచినట్లు ఎవ్వరు మాట్లాడినా నేను భరించలేను.

65 మంది బెంగాలీ రచయితల గురించి తెలుగు విశ్వవిద్యాలయం భారతభారతి విజ్ఞాన సర్వస్వానికి 1991లో రాశాను. బంకించంద్ర చటర్జీ గురించి సాధికారికమైన పుస్తకం రాశాను. రామకృష్ణ వివేకానందులు, స్వామి యోగానంద, అరవింద, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, చిత్తరంజన్ దాసు, అశుతోష్ ముఖర్జీ, అరవిందయోగి లాంటివారి జీవితచరిత్రలెన్నో చదివాను. నాకు తెలియకుండానే బెంగాలీ సాహిత్యమన్నా, వ్యక్తులన్నా అమితమైన ఇష్టమేర్పడింది. అందునా నా పేరు చైతన్య సంప్రదాయం నుంచి రావడం, మా కుటుంబం శ్రీరామకృష్ణ పరమహంస, కుసుమహరనాథ భక్తులు కావడం కూడా దోహదం చేసి ఉంటుంది.

ప్రశ్న 5. పుస్తకంలో కనబడేది మనకు పరిచయం లేని బెంగాలీ, అస్సామీ వాతావరణం. తెలుగువారు ఈ పుస్తకంలో ప్రదర్శితమయిన జీవితంతో ఎలా స్పందిస్తారన్నది మీ అభిప్రాయం?

జ: భారతదేశం చాలా విచిత్రమైనదేశం. ఆలోచనలు, భావనలు, అనుభవాలు, రోగాలు నొప్పులు, అనుబంధాలు, ఆత్మీయతలు, చాలా మటుకు ఆచారవ్యవహారాలు అన్నీ ఒక తీరుగా కనిపిస్తాయి. 1. తండ్రుల నియంతృత్వాలు, తల్లుల ఆత్మీయతలు 2. బాల్యవివాహాలు-జీవితాంతం వితంతువులుగా బతుకులీడ్వడాలు 3. గుడ్లగూబ అరవడం. చేతిలో ఉన్నవస్తువు జారిపోవడం అరిష్టం, సన్నిహితుల మరణానికి సూచన 4. ముత్తైదువల మరణసందర్భంలో చేసే ఆచారాలు. ఇలాగ ఎన్నెన్నోవిషయాల్లో తెలుగువారికీ, బెంగాలీలకు సాదృశ్యాలు కనిపించాయి. ప్రాంతాల పేర్లు తీసేస్తే ఇది ఒక తెలుగు మహిళ జీవితచరిత్రగానే అనిపించింది.

ప్రశ్న 6. రచయిత్రి మీకు తెలుసా?

జ: ఈ నడుమ కాబే(వే)రీ చటోపాధ్యాయ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయింది. ఎన్నోసార్లు మాట్లాడి నన్ను ప్రోత్సహించింది. అనువాదం పూర్తయ్యేదాక ఆమెను వ్యక్తిగతంగా చూసే అవకాశం నాకు రాలేదు. కానీ ఆమె నిజాయితీ, స్నేహశీలత, స్వచ్ఛమైన హృదయం కారణంగా అనతికాలంలోనే నాకు ‘అక్క’ గా మారింది. అనుబంధం పెరిగింది. అంతేకాక నాలుగేళ్ళ తేడాలో ఒకే నెలలో, ఒకే తేదీన ఇంచుమించు ఒకే సమయంలో మేమిరువురం జన్మించడం కూడా అభిమానం పెరగడానికి దోహదం చేసింది. ఏ పూర్వజన్మ ఋణానుబంధమోకానీ, పుస్తకంతో పూర్తిగా మమేకమైపోయాను. అనువదిస్తున్న వేళ ఆమె జీవితంలోని కష్టాల పరంపరను చూసి చలించిపోయి, ఏడ్చానంటే నమ్మకపోవచ్చు. కానీ వాస్తవం. ఆమె నా ఆహ్వానాన్ని మన్నించి మన ఇంటికి వచ్చింది. అనుకోకుండా మార్చి12న కాబేరీ చటోపాధ్యాయ్ గారి 41వ వివాహ వార్షికోత్సవం. దానితో పుస్తకావిష్కరణతో పాటు, కేకు కోయడం, సత్కారాలు ఆహ్లాదకర వాతావరణంలో చేసాం.

ప్రశ్న 7. ఎవరెవరు వచ్చారు? ఆవిష్కరణ సభ విశేషాలు చెప్పండి.

జ: ప్రముఖ కవి డా. అమ్మంగి వేణుగోపాల్ గారు అధ్యక్షత వహించారు. మా గురువుగారు ఆచార్య యస్వీ రామారావు ‘ఆటుపోట్ల కావేరి’ని ఆవిష్కరించారు. డా. వై. రామకృష్ణారావు, ఆచార్య పి. లక్ష్మీనారాయణ, కొండపల్లి నీహారిణి, డా రేచర్ల శ్రీలక్ష్మి, ఆచార్య డి. కె. మూర్తి, ఇంకా సంచిక ఆన్‌లైన్ వారపత్రికలో ఈ ఆత్మకథను సీరియల్‌గా ప్రచురించిన సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ మొ.వారు ‘ఆటుపోట్ల కావేరి’ గురించి విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. తర్వాత కవిసమ్మేళనం వైవిధ్యభరితంగా జరిగింది. ప్రముఖ అనువాదకులు, కవి ఎలనాగ గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి తమ కవితాగానంతో ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీషు ఆచార్యులు పి. లక్ష్మీనారాయణ ఉర్దూలో, సౌమ్యా త్ర్రిపాఠి హిందీలో చదివిన కవితలు బాగా ఆకట్టుకొన్నాయి. అతిథి పత్రికా సంపాదకులు మద్దాళి వెంకటేశ్వరరావు నా పట్ల అభినందనాత్మక కవిత చదివారు. తుమ్మూరి రామ్మోహన్ రావు గజల్ పాడారు. చింతోజు మల్లికార్జునాచారి పద్యకవిత చదివారు. శ్రీమతి కాబేరీ చటోపాధ్యాయ్ ఆంగ్లంలో స్వీయకవితతో పాటు గులాం నజ్రుల్ ఇస్లాం పాట పాడి అలరించారు. తెలుగు ఏ మాత్రం తెలియని శ్రేయా చటర్జీ తనకున్న సంగీతపరిజ్ఞానంతో ‘మనసా! ఇది ఏనాటి అనుబంధమో!’ అని తెలుగు సినిమా పాటను చక్కగా ఆలపించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదరంగంలో పురస్కారాన్ని ప్రకటించిన ఎలనాగ గారికీ, కాబేరీ చటోపాధ్యాయ్ గారికీ సన్మానం జరిగింది. నూతనంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అభినందనపూర్వకంగా, విచ్చేసిన అతిథులకు యథారీతి సత్కారంతో, విందు భోజనంతో ఆనందకర వాతావరణంలో ముగిసింది. ఇదంతా మన ఇంట్లోనే జరగడం విశేషం.

ప్రశ్న 8. ఆటుపోట్ల కావేరి ఆత్మకథలోని ఇతివృత్తాన్ని మా పాఠకులను పరిచయం చేయండి.

జ: కాబే(వే)రి జీవితం సాదాసీదాగా గడిచింది కాదు. ఈ ఆత్మకథ ద్వారా రచయిత్రి ఎదుర్కొన్న కష్టాలు, కల్లోలాలు, ఆటుపోట్లను ఉన్నది ఉన్నట్లుగా మనతో పంచుకొని ధైర్యంగా, స్థైర్యంగా జీవితనావను నడుపుకోవాలని ప్రబోధిస్తుంది. ఎనిమిదేళ్ళ పసితనంలో ఆడుతూ, పాడుతూ ఎదగాల్సిన కాలంనుంచి కీళ్ళవ్యాధితో మంచానపడిన తల్లికి మలమూత్రాలను సైతం ఎత్తిపోస్తూ 14 ఏళ్ళ పాటు సేవ చేసింది. తమ్ముడిని, చెల్లెలను తయారు చేసి, తాను తయారయి పాఠశాలకు వెళ్ళింది. మానసిక ఎదుగుదలను ప్రభావితం చేసే బాల్యమంతా ఆయాలు/సేవకులపైనే ఆధారపడవలసి వచ్చింది. తండ్రి ఇంగ్లీషు ప్రొఫెసరే అయినా అతి నియంతృత్వ ధోరణి మూలకంగా కావసినంత ప్రేమకు నోచుకోలేదు. కుటుంబ బాధ్యతలు, సొంత చదువులతో ఆమె నలిగిపోయింది. నాయనమ్మ కొంతకాలం బాగోగులు చూసినా, ఆమె కూడా అస్తమించడంతో వృద్ధుడైన తండ్రికీ, చిన్నవారైన తమ్ముడికీ, చెల్లెలికీ తానే ‘తల్లి’గా మారి వారి ఆలనా పాలనా చూడాల్సి వచ్చింది. తనకన్నా ఒకటిన్నర సంవత్సరమే చిన్నవాడయి, చిన్ననాటి ఆటపాటల ఆనందాన్ని పంచుకొన్న ప్రియమైన తమ్ముడు మానసిక వికలాంగుడయి మనోవేదన మిగిల్చాడు. జీవితంలోని ఇన్ని ప్రతికూల అంశాలను మొండిగా భరిస్తూనే ఆంగ్లభాషలో బి.ఎ ఆనర్స్, బి.ఇడి పూర్తి చేసింది. ఆమెకు లభించిన ఏకైక అదృష్టం. అర్థం చేసుకొని ప్రోత్సహించే మంచి జీవనసహచరుడు దీపక్ చటోపాధ్యాయ్ గారి చేయూత లభించడం. తెలివైన పిల్లలు పుట్టడం. తండ్రి గతించాక, మానసిక వికలాంగుడైన తమ్ముడిని రెండున్నర దశాబ్దాలపాటు పోషించగలగడం భర్త సహకారప్రోత్సాహాలు లేకపోతే సాధ్యమయ్యేది కాదని వినమ్రంగా చెప్పుకొంది. కుటుంబ జీవితం దెబ్బతినకుండా జీవితం విసిరే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఆమె సమర్థవంతంగా సమాధానం చెప్పింది.

ఇంతటితో అయిపోలేదు కథ. సమస్యల సుడిగుండాలు, ఆటుపోట్లు అన్ని సమసి, భర్త, పిల్లలు, ఇష్టమైన కవిత్వం, సంగీతం, అధ్యాపక జీవితంతో కుటుంబజీవన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొంటున్న వేళ మరో భయంకర కెరటం విరుచుకపడింది. అదే రొమ్ము క్యాన్సర్. ఎనిమిది కీమోథెరఫీలు, ముప్పయి రేడియో థెరఫీలు జరిగినా, మానసిక స్థైర్యం, ధైర్యంతో అధిగమించింది. ఈ మధ్యనే మోకాళ్శ ఆపరేషన్ జరిగింది. ఆమె ఎప్పుడూ తన నిగ్రహాన్ని కోల్పోలేదు. బెంబేలు పడలేదు. డిప్రెషన్‌లోకి వెళ్లలేదు. దేవుని నిందించలేదు. తనను తాను తిట్టుకోలేదు. ఆశావహ దృక్పథాన్ని ప్రబోధించింది. ఇవన్నీ చాలా చిన్న విషయాలన్నంత తేలికగా తీసుకొంది. జీవన సంగ్రామంలో విజేతగా నిలిచింది. She becomes SHERO in her battle of life ఈ పోరాటంలో ఆమె భర్త పాత్ర చాలా ప్రశంసనీయం. చాలా చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడే యువతరానికి కాబే(వే)రీ చటోపాధ్యాయ్ గారి ఆత్మకథ అవశ్య పఠనీయం. జీవితం మీద మమకారాన్ని పెంచి, స్ఫూర్తినిచ్చే దివ్యౌషధం.

ప్రశ్న 9. భవిష్యత్తులో ఇంకేమయినా రచనలు అనువదించాలనుకుంటున్నారా?

జ: ఇప్పటికయితే ఏం లేదు. కానీ ఉబలాటం మాత్రం ఉంది. చూద్దాం.

ప్రశ్న 10. ఇంతకూ మీ గురించి చెప్పనేలేదు?

జ: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో మూడు దశాబ్దాలపాటు ఆచార్యునిగా పనిచేశాను. మౌలికంగా పరిశోధకునిగా. అకడమీషియన్‌గా పేరు పొందాను. రెండేళ్ళకింద రిటైరయ్యాను. రిటైర్‌మెంట్ సందర్భంలో నేను సమాజం నుంచి తీసుకొన్నదేనా ఇచ్చిందేమైనా ఉందా అన్న విచికిత్సకు లోనయ్యాను. అందునా కరోనా వాతావరణం కల్పించిన గృహనిర్బంధం, ఏకాంత వాతావరణం ఒక ఆత్మావలోకనానికి గురిచేసింది. నా 40 ఏళ్ళ సాహిత్య వ్యాసంగం చాలా ఫలవంతమైందన్న సంతృప్తికరమైన సమాధానం పొందాను. సమీక్షలు, పీఠికలు, పరిశోధనలు విశ్లేషణాత్మక వ్యాసాలు, జీవితచిత్రణలు, సృజనాత్మక రచనలు అన్నీ నాలుగు వేల పుటల్లో ఏడు సంపుటాల్లో సమాజ పరమేశ్వరునికి అర్పించాను. నిస్సందేహంగా ఎన్నెన్నో వినూతనాంశాలు చెప్పానన్న ఆత్మసంతృప్తి నాకుంది. ఈ జీవితానికి నాకది చాలు.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. వెలుదండ నిత్యానంద రావు గారూ.

డా. వెలుదండ నిత్యానంద రావు: ధన్యవాదాలు. చాలా మంచి ప్రశ్నలు అడిగారు. మీ ద్వారా కొంతమంది కొత్త పాఠకులకు నన్ను చేరువ చేశారు. సంతోషం. సంచికలో సీరియల్‌గా ప్రచురించి ప్రోత్సహించిన సంపాదకులు కస్తూరి మురళీకృష్ణగారికీ, వారి సాంకేతిక సిబ్బందికి, కొల్లూరి సోమ శంకర్ తదితరులకు మరోసారి కృతజ్ఞతలు.

***

ఆటుపోట్ల కావేరి (శ్రీమతి కాబేరీ చటోపాధ్యాయ్ ఆత్మకథ అనువాదం)

రచన: డా. వెలుదండ నిత్యానంద రావు

పేజీలు: 104

వెల: ₹

ప్రతులకు:

త్వరలో అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

రచయిత: ఫోన్‌ – 94416 66881

~

ఆటుపోట్ల కావేరి పుస్తకం సమీక్ష:
https://sanchika.com/aatupotla-kaveri-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here