రచయిత శ్రీ డి.ఎన్. సుబ్రమణ్యం ప్రత్యేక ఇంటర్వ్యూ

0
12

[‘పితృత్వమ్’ అనే నవలను వెలువరించిన డి.ఎన్. సుబ్రమణ్యం గారితో శ్రీ కోవెల సంతోష్ కుమార్ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

కోవెల సంతోష్ కుమార్: నమస్కారం డి.ఎన్. సుబ్రమణ్యం గారూ.

డి.ఎన్. సుబ్రమణ్యం: నమస్కారం.

~

ప్రశ్న 1. మీలోని సృజనకారుడు పితృత్వమ్ తో బయటికి వచ్చాడు. ఈ నవలకు పితృత్వమ్ అన్న పేరు లోనే ఒక విశిష్టత కనిపిస్తున్నది. దీని విస్తృతమైన అర్థాన్ని వివరించండి.

జ: అలా అని ఏమీ కాదండీ. ‘పితృత్వమ్’ నవల కంటే ముందు కూడా బోలెడు కథలు, వ్యాసాలు, రూపకాలు రాసాను. కాకపోతే ‘పితృత్వమ్’ నేను రాసిన మొట్టమొదటి నవల. అది కూడా.. ప్రయత్నపూర్వకంగా కాక, ‘అనుకోకుండా’ రూపొందిన నవల. ఇక్కడ ‘అనుకోకుండా’ అని అనేందుకు ఓ కారణం ఉంది. ‘పితృత్వమ్’ను మొదట ఒక చిన్న కథానికగా రాసాను. అది ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ప్రసారం అయి ఎన్నో ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కొంత కాలానికి ఫేస్‍బుక్ లోని వివిధ సమూహాలలో ఆ కథను పంచినప్పుడు పాఠకుల నుంచి పెద్ద స్థాయిలో స్పందన వచ్చింది. ఆ స్పందనను చూసి, కథను కొంచెం కొంచెం పొడిగిస్తూ పోయాను. దాంతో వెయ్యి, పదిహేను వందల పదాల నిడివితో ఉన్న ఆ కథ, లక్ష పదాలు దాటిన నవలగా రూపుదిద్దుకుంది.

ఇకపోతే, ఈ కథ మొదట రాసినప్పుడు ఓ కథానిక లాగే రాసాను. వివిధ కారణాల వల్ల ఆలస్యంగా పితృత్వాన్ని పొందిన వ్యక్తి.. ఇంకా కనులైన తెరవని పసిగుడ్డును సాకవలసిన పరిస్థితుల నేపథ్యంలో‌, సమకాలీన సమాజంలోని మానవ సంబంధాల తీరుతెన్నులను ఎత్తిచూపుతూ సాగుతుంది ఆ కథ.

కథ నిడివి ఎలా అయితే పెరుగుతూ పోయిందో, ‘పితృత్వమ్’ అర్థం కూడా అలాగే విస్తృతం అయిపోయింది.

కథానాయకుడు విశ్వనాథ్ ఓ రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయి బోన్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎన్నో మందులు వాడినా, నయం కాకపోగా బోన్ కాన్సర్‌తో మృత్యువాత పడతానేమో అనే భయానక పరిస్థితికి వస్తాడు. అలాంటి సమయాన కీర్తి అనే ఆమ్మాయి కారణంగా మూలికా వైద్యం యొక్క ప్రాశస్త్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు.

విదేశీ పాలకుల కుట్రపూరిత ప్రయత్నాల నేపథ్యంలో సనాతన సంప్రదాయాలతోపాటు ఎంతో అమూల్యమైన దేశీయ వైద్య విధానాలు మరుగున పడి అధునాతన వైద్యం వైపు ప్రజానీకం పరుగులు తీసింది. అతి చౌకయిన ఆయుర్వేద, మూలికా వైద్యాన్ని కాలదన్నుకొని ఖరీదైన అధునాతన వైద్యాన్ని ఆశ్రయించి, ఎంతో ధనవ్యయంతో బాటు ఆ ముందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్ లతో నానా అగచాట్లు పడుతున్న ప్రజానీకానికి.. దేశీయ వైద్య విధానాల ఫలాలు అందుబాటులో ఉండాలని తపిస్తాడు. ఆ దిశగా తను ఎంతో ఆర్తితో కృషి చేస్తాడు.

సాధారణంగా ఒక మనిషికి ఆకలి అయితే తన క్షుద్భాధ తీర్చుకునే ప్రయత్నం చేసి‌, తన ఆకలి తీరగానే ఆ విషయాన్ని అంతటితో వదిలేసి తన పని తను చూసుకుంటాడు. కానీ ఆ మనిషి ఒక ‘తండ్రి’ అయితే, తన వాళ్ళ ఆకలి కూడా తీర్చాలనుకుంటాడు.

ఒక కుటుంబం యొక్క అవసరాలను ఎవరూ అడగకపోయినా ఎంతో బాధ్యతతో తెలుసుకొని, ఆ అవసరాల సాఫల్యానికి పనిచేసేవాడే తండ్రి. అలాగే, సమాజం పట్ల విశ్వనాథ్ కూడా పితృత్వపు భావనతో వ్యవహరించిన తీరు.. ఆ నవలకు ‘పితృత్వమ్’ అనేది సార్ధక నామధేయంగా తనంతట తానే కాకతాళీయంగా నిలిచింది.

మీరు అడిగినట్టు, ‘పితృత్వమ్’ నవలతో నాలోని సృజనకారుడు బయటకు రావడం కాదు కానీ, నాకు జీవనసాఫల్యత ఇచ్చినది మాత్రం ‘పితృత్వమ్’ నవల అని చెప్పగలను.

మొదటి నవలే అంతటి గొప్ప అనుభూతిని, మనస్తృప్తిని నాకు ఇవ్వడం కేవలం భగవత్ప్రసాదమే.

ప్రశ్న 2. నవలలో నెగెటివిటీ కంటే పాజిటివిటీ అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. మీ వెనుక మాటలో కూడా ప్రధానంగా చెప్పిన వర్షపాతం కంటే బాష్పపాతాన్ని కొలిచిన నాడు అందరం ఆనందంగా ఉంటాంఅన్న ఒక్క మాట ఈ నవల మొత్తం సారాన్ని విప్పిచెప్తుంది. ఇందులోని కథానాయకుడు కూడా అలాగే కనిపిస్తాడు. తండ్రి అంటే కేవలం బిడ్డకు తండ్రి కావడమేనా? తండ్రి అనే భావనకు మరింత విస్తారమైన అర్థాన్ని అన్వేషించాల్సిన అవసరాన్ని ఈ నవల స్పష్టంగానే చెప్పింది. దీని గురించి వివరించండి.

జ: చాలా పెద్ద ప్రశ్న అడిగారండీ. జవాబు కూడా పెద్దదిగా ఉంటుంది మరి!

ఇంటా.. బయట.. మనం పని చేసే చోట.. ఆఖరుకు రోడ్డుమీద పోతున్నా సరే.. సర్వత్రా ‘నెగెటివిటీ’నే ఉంటోంది. కథలూ నవలలు టీవీ సీరియళ్ళలో కూడా ఎక్కువగా ఉండేది కుట్రలు కుతంత్రాలే. కనీసం నా వరకు నేను.. రాసే వాటితో పాఠకుల మనసులను మరింత నెగిటివిటీతో నింపడం ఎందుకు అని అనుకున్నాను.

స్వతహాగా నేను ఆశావాదిని. ఓపికగా నిరీక్షిస్తే ఎలాంటి ‘పరిస్థితి’లో అయినా సరే.. గుణాత్మక మార్పు తప్పకుండా ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను.

గుండెల్లో గునపం దించే వారికి సైతం “చెయ్యి జాగ్రత్త.. గాయం అవుతుందేమో..” అని జాగ్రత్తలు చెప్పే మనస్తత్వం నాది.

చూసేవారికి ఇది ఒక పిచ్చితనంగా అనిపించవచ్చు. కానీ, ఆ గునపం దించిన వ్యక్తి మనసులో ఏదో ఒక క్షణాన.. నా గుండెల్లో గునపం దించిన సంగతి, నేను జాగ్రత్తలు చెప్పిన తీరు.. తప్పకుండా గుర్తుకు వస్తాయి. ఆ క్షణమే ఆ కర్కోటకపు మనసుకు చివరి క్షణం అవుతుంది.. ఖచ్చితంగా పరివర్తన వస్తుంది. ఈ విషయం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కూడా!

‘నేను’ అన్న భావన మనలో మొలకెత్తిన నాడు అసలు సమస్య ఆరంభం అవుతుందేమో! అసలు ‘నేను’ అంటే ఎంత ఉంటాను అన్న ఒక్క ఆలోచన మనం చేయగలిగితే మన ఆలోచనాధోరణి ఆసాంతం మారిపోతుంది.

మన చిన్నప్పుడు విన్న ‘సౌర కుటుంబం’ పాఠం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ విశ్వాంతరాళంలో అనేకానేక గెలాక్సీలలో మనది కూడా ఒకటి. ఈ గెలాక్సీలో ఉండే కోటానుకోట్ల నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. ఆ సూర్య కుటుంబంలోని నవగ్రహాలలో, మనభూమి.. ఆ భూమిలో ఖండాలు.. దేశాలు.. రాష్ట్రాలు.. జిల్లాలు.. ఊరు.. వాడ.. మన ఇల్లు.. ఇలా చూస్తే ఓ వ్యక్తిగా ‘నేను’ ఎంత? నా ఉనికి ఎంత అంటారు?

ఈ భూమి పుట్టి కోట్ల సంవత్సరాలయింది. ఇంకా ఎన్నో కోట్ల సంవత్సరాలపాటు తన మనుగడ సాగిస్తూనే ఉంటుంది. అలా చూస్తే, కెమెరాను క్లిక్ చేస్తే షట్టర్ తెరచుకొని.. మూసుకునేంత సేపులో ముగిసిపోయే జీవితం ‘నేను’ది.

మరి ఇంత స్వల్ప ఆయుర్దాయం ఉన్న ‘నేను’ ఎలా ఉండాలి?

కక్షలూ కార్పణ్యాలు, కుట్రలూ కుతంత్రాలతో కలుషితమైన మనసుతో బ్రతికి ఉన్నా ఒకటే. చచ్చిపోయినా ఒకటే కదండీ?!

జీవించి ఉన్న ఈ స్వల్ప కాలంలో, నా చుట్టూ ఉన్న పది మందితో మంచిగా ఉండి.. వారి సుఖదుఃఖాలలో పాలుపంచుకొని.. నేను చనిపోయాక, నాకోసం ఆ పదిమందిలో ఓ నలుగురి కండ్లయినా చమర్చాలి. అప్పుడే నా జన్మకు సార్ధకత అని భావిస్తాను.

అందుకే.. కన్నీళ్ళు అంటే నాకు ఎంతో ఇష్టం.

నా గురించి ఎందరు తమ కన్నీటిని రాల్చారు అన్నది ‘నన్ను గురించిన అంచనా’ నాకు తెలియజెబుతుంది.

నేను వివిధ సందర్భాలలో రాల్చిన కన్నీరు.. నా హృదయంలోని ఆర్ద్రతకు కొలమానంగా నిలుస్తుంది.

‘వర్షపాతం’ లాగా ‘బాష్పపాతం’ ప్రతి మనిషీ కొలువ గలిగిననాడు అందరమూ ఆనందంగా ఉండగలుగుతామన్నది

నా ఫిలాసఫీ! ఇదే విషయాన్ని పుస్తకం కవరు పేజీ మీద ప్రచురించాను.

ఇకపోతే ‘పితృత్వమ్’ కథకు వస్తే, కథానాయకుడు విశ్వనాథ్ సుదీర్ఘ కాలపు నిరీక్షణ తర్వాత తండ్రి అవుతాడు. అయినా సరే, ఆ పసికందును ఎత్తుకునే సాహసం చేయడు. పసిబిడ్డను ఎత్తుకుని, తను నిభాయించుకోలేనేమో.. వాడికి ఏమయినా అవుతుందేమోనని, దూరంగా ఉండి తన శిశువును చూస్తూ మురిసిపోతాడు. అలాంటి విశ్వనాథ్ ఆ పసికందును పూర్తి స్థాయిలో సాకవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది?

విశ్వనాథ్ తరఫు వారు కానీ, అతని భార్య దీప తరఫు వారు కానీ, ఎవరూ ముందుకు రాని పరిస్థితి యొక్క నేపథ్యం ఏమిటి?

పాఠకుల మనసులో ఈ ప్రశ్నలు రేకెత్తించగలిగితే చాలు. అలా చేస్తే‌‌, ఆ భావన పాఠకులను సున్నితంగా స్పృశిస్తుంది. వారి హృదయాలను తట్టి లేపి, ఆ పాత్రతో కనెక్షన్ ఏర్పరుస్తుంది. నెగిటివిటీని ప్రత్యేకంగా చూపించాల్సిన పనేలేదు. నేను అదే చేసాను.

అలాగే, విశ్వనాథ్ తండ్రి కావడం ఒక్కటే ఈ కథారచనకు పురికొల్పిన అంశం కాదు. సమకాలీన సమాజంలో మానవ సంబంధాల తీరుతెన్నులను ఎత్తిచూపే ప్రయత్నం కూడా.

ఒక కాకి నేలకూలితే పదులు.. వందలాది కాకులు వచ్చి వాలుతాయి. నేలకూలిన ఆ కాకిని ఏదోలా నింగికెగిరేలా చేయాలని తపన పడతాయి. మరి బుద్దిజీవులం.. మనకేం అయింది?

ఎందరికో ఎన్నో విధాలా సాయంగా ఉన్నా, ఒక తప్పనిసరి పరిస్థితిలో ఓ వ్యక్తి ఏకాకిగా.. నిస్సహాయతతో ఉండాల్సిన పరిస్థితిని కండ్లెదుటన చూపే ప్రయత్నం చేసాను. అదే సమయంలో కొత్త స్నేహాలు, అనుబంధాలను ఆసరాగా నిలిపి, ఆశావహ దృక్పథం మనలో మాయం కాకుండా ఉండే ప్రయత్నమూ చేసాను.

అలా చేయడం వల్లే ఆయా పాత్రల పట్ల పాఠకులకు గౌరవ భావం ఏర్పడింది.. సందర్భం వస్తే తాము కూడా ఆ పాత్రల వలె ఆపన్నులకు ఆసరాగా నిలవాలి అన్న సంకల్పాన్ని చాలా మందిలో పాదుకొల్పగలిగింది ఈ నవల.

‘పితృత్వమ్’ నవల రాసింది కథానాయకుడు విశ్వనాథ్ పొందిన పితృత్వ హోదాకు ముందు, ఆ తర్వాతి పరిస్థితి గురించి మాత్రమే. కానీ, ఈ నవల నుంచి మూడు పితృత్వపు భావనలు కథానాయకుడు విశ్వనాథ్ పాత్ర ద్వారా వ్యక్తం అయ్యాయి.

ఒకటి కాశీనాథ్ విషయంలో కాగా,  రెండోది కీర్తి విషయంలో.. మూడోది స్వదేశీయ వైద్య ప్రచారక పరిషత్ రూపంలో సమాజం పట్ల..

పితృత్వ భావనను పాఠకులను ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఎంతో కొంత చేయగలిగానని అనుకుంటున్నాను.

ప్రభంజనం, చేయూత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో పితృత్వమ్ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్న ప్రముఖ నఖచిత్రకారులు, గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన శ్రీ పరస రవి

ప్రశ్న 3. ఇవాళ్టి సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అయితే సంపన్న ఉన్నత వర్గాలను.. లేకపోతే.. కింది వర్గాలను గురించి మాత్రమే ఫోకస్ చేసే క్రమంలో మధ్య తరగతి సమాజపు జీవన నిర్మాణాన్ని ఆవిష్కరించిన నవల ఇది. దీని వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి? మీ నిజ జీవితానికి.. ఈ నవలలోని విషయానికి ఉన్న అనుబంధం ఏమిటి?

జ: ఉన్నత వర్గాల వారికి ఇంకొకరి సాయం దాదాపుగా తప్పనిసరి అవసరం కాదని నా భావన. వారి ఆర్థిక హంగులే ఆన్నింటికి సమాధానంగా నిలుస్తుంది. కింది వర్గాల వారికి ఏమి ఉన్నా లేకున్నా అటు వ్యవస్థల నుంచీ ఇటు తోటి వారి నుంచి ఆసరా ఉంటుంది. ఎక్కడైనా ఆసరా కొరవడినా, ఏ.మొహమాటం లేకుండా నిలదీసి అడుగగలుగుతారు. తమ అత్యయిక పరిస్థితి నుంచి ఒడ్డున పడగలుగుతారు. ఎటొచ్చీ ఉన్న సమస్యలు అన్ని మధ్య తరగతి వారికే. మొహమాటాలతో ఎన్నో కష్టాలు మౌనంగా భరిస్తారు.

నేను మధ్య తరగతి వాడిని కావడం వల్ల మాత్రమే ఈ కథనం రూపుదిద్దుకోలేదు. ఒకే ఒక్క అంశం నన్ను ఈ కథ రాసేలా పురికొల్పింది. అదేమిటంటే, మనం బాగా ఉన్నపుడు మనతో సేవలు పొంది, చాకిరీ. చేయించుకుని, మనకు ఆవసరం ఉన్నపుడు మాత్రం ఏవేవో సాకులతో దూరంగా ఉండడం.. మనల్ని నిరాకరించడం అనేది జీర్ణం చేసుకోలేకపోయాను. దానికే నేను అక్షర రూపం ఇచ్చాను.

ప్రభంజనం, చేయూత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో పితృత్వమ్ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్న ప్రముఖ నఖచిత్రకారులు, గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన శ్రీ పరస రవి

ప్రశ్న 4. ఈ నవలలో కథానాయకుడిగా కనిపించిన విశ్వనాథుడికి.. రచయిత సుబ్రహ్మణ్యానికి ఏదైనా సమన్వయం ఉన్నదని భావించవచ్చా?

జ: మీ భావనలో అర్థసత్యం ఉంది.

కాదు.. కాదు.. ముప్పావు సత్యం ఉంది. ‘పితృత్వమ్’ నవల అనే కాదు.. నేను రాసిన అన్ని కథాంశాలూ నా జీవితానికి ఎంతో కొంత అనుబంధత కలిగి ఉన్నవే.

ఈ నవలకు సంబంధించి.. విశ్వనాథ్ పాత్రధారి ఎదుర్కొన్న దాదాపు ప్రతి ఉదంతమూ నేను నిజజీవితంలో చవిచూసిందే. అలాంటపుడు విశ్వనాథ్ లాగే నేనూ మథనపడేవాడిని.. అలాగే ప్రవర్తించేవాడిని. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం విశ్వనాథ్‌కు ఉన్నంత సహనం నాకు లేదు. ఆయా సందర్భాలలో నా నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యేవి.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో తారసపడిన ఎన్నో వ్యక్తిత్వాలు సంఘటనలు ఈ కథలో భాగంగా చేసినా, కొన్ని అంశాలు మాత్రం ‘పితృత్వమ్’ కథకు సంబంధం లేనివే. ఉదాహరణకు ఒక సంఘటన చెబుతాను.

కథలో ప్రొఫెసర్ గీతామాథుర్ పదవీవిరమణ సభలో విశ్వనాథ్ ఆమెకు పాదపూజ చేస్తాడు. ఆ సంఘటన.. నవలలో ఎంతో ఉద్వేగభరితంగా సాగుతుంది. చదివే వారి హృదయాలను ఉద్వేగంతో బరువెక్కింపజేసి, వారి కనులను నీటితో నింపే సంఘటన అది. నిజజీవితంలో అదంతా వాస్తవమే. కానీ.. అది జరిగింది పదవీవిరమణ సందర్భంగా కాదు. గీతామాథుర్ పాత్రధారిణి అయిన నిజజీవితపు శ్రీమతి సరోజిని గారికి తన 60వ పుట్టినరోజును పురస్కరించుకొని, నేను మా ఇంట్లో చేసిన సత్కారం అది!

పట్టు వస్త్రాల ప్రదానం, ముత్తైదువ సత్కారం, పాదప్రక్షాళనం, పాదపూజ, ఆవిడ ఉద్వేగంతో కన్నీరు నింపుకోవడం.. వగైరా వగైరా మాత్రం వాస్తవం.

అలాగే లింగారెడ్డి సర్ పాత్ర. వాస్తవానికి ఆయన ఫార్మా కంపెనీకి సంబంధించిన స్టేషనరీ అవసరాలను నా ప్రింటింగ్ ప్రెస్ సమకూర్చేది.

ఇలా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివిధ సంఘటనలను, నేను ఎదుర్కొన్న ఈతి బాధలు, వివిధ సందర్భాలలో బంధుమిత్రుల నిరాకరణకు గురి కావడం వగైరా వగైరా భావోద్వేగాలతో అల్లిన ఓ పూలమాల ఈ ‘పితృత్వమ్’.

ఆవిష్కరణ అనంతరం సత్కారం (రాజమహేంద్రవరం)

ప్రశ్న 5. నవలలో నాకు ప్రధానంగా నచ్చింది శైలి. నవలా శిల్ప నిర్మాణం. అనేక సన్నివేశాలు.. పాఠకుడిని నీడలా వెంటాడుతూ వస్తుంటాయి. అనేక ఘటనలు కండ్లముందే ఆవిష్కారమవుతుంటాయి. ఉద్యోగంలో ఎదురైన కష్టాల విషయంలో.. కాలు విషయంలో డాక్టర్ దగ్గర సన్నివేశాలు కానీ, తరువాత భార్య దగ్గర వాస్తవాలు దాచలేక దాచడం కానీ, గీత మాధురి, దీప, కీర్తి, శరత్ లాంటి పాత్రలు అనేకం ఉదాత్తంగానే కనిపించాయి. ముఖ్యంగా మూలికా వైద్యం విషయంలో విశ్వనాథ్ వెలిబుచ్చిన అభిప్రాయాలు కానీ,. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా చాలా సన్నివేశాలు పాఠకుడిని పట్టుకొని వదిలిపెట్టవు. రచయిత ఐన మీరు.. ఇందులోని శైలి, నిర్మాణం.. ఆయా సన్నివేశాల చిత్రణ(ప్రజెంటేషన్) పై మీరే ఒక పాఠకుడై చదివితే ఎలాంటి అనుభూతి చెందుతారు?

జ: ‘పితృత్వమ్’ నవల ప్రతిలిపి, కహానియా లాంటి వెబ్సైట్ లలోను, ఫేస్‍బుక్ లోని వివిధ సమూహాల్లో ఏకకాలంలో ధారావాహికగా ప్రచురణ జరుగుతున్నపుడు, పాఠకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చేది. (ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతునే ఉన్నది.) ఆ స్పందనలలో విశ్వనాథ్ కష్టాలకు బాధ వ్యక్తం చేస్తూనే, ఆ బాధలేవో నేనే పెడుతున్నట్టుగా నన్ను నిందించేవారు. “ప్లీజ్.. విశ్వాన్ని ఇక వదిలేయండి” అని బ్రతిమిలాడేవారు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితుల్లో సగం కూడా కథలో విశ్వనాథ్ కష్టాలుగా రాయలేదు. ఆ మాత్రానికే అంతమంది ఆ పాత్రకు అంత పెద్ద ఎత్తున సంఘీభావం చూపిన తీరుకు నా హృదయం ఉప్పొంగిపోయేది. అది నా జీవితంలో నాకు దక్కకపోయెనే అని కొంచెం బాధగా కూడా అనిపించేది.

కానీ, ఆ వెనువెంటనే నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని. అలాటి సంఘీభావం నాకు దక్కితే, నాలో మానసిక సంఘర్షణ ఉండేదీ కాదు.. ‘పితృత్వమ్’ నవల రూపుదిద్దుకునేదీ కాదు కదా అని అనుకునేవాడిని. నేను ఆశావాదిని కదండీ.. ప్రతిదానిలోనూ ధనాత్మకతను చూడడాన్ని నాకు జీవితం నేర్పింది.

సాధారణంగా నేను ఏం రాసినా, ఆ రాసిన దాన్ని ఓ పూట అలా పక్కన ఉంచేసి, అనంతరం ఓ మామూలు పాఠకునిలా చదువుతాను. అందులో ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ఆ మేరకు సవరణలు చేసి దానిని మెరుగుపరుస్తాను.

‘పితృత్వమ్’ విషయానికొస్తే.. ఆ కథ రాస్తున్నపుడు, ఘనీభవించిన మనసుతో చకచకా రాసుకుంటూ వెళ్లేవాడిని. ఆ తర్వాత దాన్ని మెరుగుపరిచేందుకు చదువుతుంటే మాత్రం హృదయం బరువెక్కేది. కండ్లు చెమర్చేవి. అంతేకాదు.. పాఠకుల స్పందనలకు బదులిస్తున్నపుడు..పుస్తక ముద్రణకు సంబంధించి ప్రూఫులు దిద్దుతున్నపుడు.. ఎన్ని వందల సార్లు చదివానో!

చదివిన ప్రతిసారీ,

అదే వేదన నా హృదయంలో..!

అదే తడి నా కనులలో!

ముఖ్యంగా, ఓ ఆంగ్ల మాసపత్రికలో “బోన్ ఇన్ఫెక్షన్ కాన్సర్‌కు దారి తీయవచ్చు” అన్న ఆర్టికల్ చదివినప్పటి ‘నా’ మానసిక పరిస్థితిని, స్వదేశీయ వైద్య ప్రచారక పరిషత్ ఆవిష్కరణ ఉదంతాన్ని, ప్రొఫెసర్ గీతామాథుర్ వీడ్కోలు సమావేశఘట్టాన్ని అక్షరరూపంలో ఓ పాఠకుడిగా నేను చదివినప్పుడు, నన్ను నేనే అభినందించుకోవాలని అనిపించేది. అలా చేస్తే, నాలో అహంకారం పెరిగి, నేను మసకబారుతానేమోనని కూడా అనిపించేది. అంతా ఆ వాగ్దేవి కృప అని కనులు మూసుకుని ఆ అమ్మకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి.

లక్షలు వెచ్చించి, బోలెడు మందులు మింగినా, నా కాలి ఇన్ఫెక్షన్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోగా, మూలికావైద్యంతో.. అది కూడా ఎంతో తక్కువ వ్యయంలో నా కాలి ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టడంతో ఆశ్చర్యచకితుడినయ్యాను. మరణశిక్ష పడ్డ వ్యక్తి ఉరికంబం ఎక్కుతుండగా, ఆ శిక్ష రద్దయినంత ఆనందంగా ఫీలయ్యాను.

అమూల్యమైన ఆ మూలికల గొప్పదనాన్ని గురించి వివరంగా చెబితే అది చదివిన పాఠకులలో ఓ పిడికెడు మందైనా సద్వినియోగం చేసుకుంటే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్టే అనుకున్నాను. అలా అని ఊకదంపుడు ఉపన్యాసంలా ఉంటే చదివేవారికి విసుగు పుడుతుంది కదా. అందుకని ఓ చక్కటి నాటకీయ ఘట్టాన్ని రాసాను.

అదే.. స్వదేశీయ వైద్య ప్రచారక పరిషత్తు ఆరంభం ఏర్పాట్లు.. అదే సమయాన విశ్వనాథ్ దవాఖాన మంచం మీద ఉండి పరిషత్తుకు సంబంధించిన ఓ మాసపత్రికను తయారు చేయడం.. మరోపక్క ఆ పత్రిక ముద్రణ కోసం విశ్వనాథ్ మిత్రుడు మోహన్ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఉండడం.. ఇవి రాస్తూనే మధ్య మధ్యలో, సనాతన ధర్మ సంప్రదాయాలు మన జీవనశైలికి ఎలా దోహదపడతాయో, వివిధ మూలికలలో ఏమేమి ఔషధ గుణాలు ఉంటాయో లాంటి అంశాలతో కూడిన వక్త ప్రసంగాలు రాసాను.

పరిషత్ ఆరంభ సభ.. ఆసుపత్రిలో విశ్వనాథ్.. ప్రెస్‌లో మోహన్ ఇలా మార్చి మార్చి సీన్లు రాయడం వల్ల

విసుగు కలగకుండా, ఆసక్తి చావకుండా ఉత్కంఠభరితంగా కథనం సాగింది. ఇది నాకు అద్భుతంగా అనిపించింది.

బోన్ ఇన్ఫెక్షన్ వల్ల తాను కాన్సర్ బారిన పడితే తన భార్య, పసికందు పరిస్థితి ఏమిటని విశ్వనాథ్ మథనపడడం.. కొందరు మిత్రుల దగ్గరకు వెళ్ళి వారి నుంచి తన తదనంతరం తన కుటుంబానికి నైతిక మద్దతు కోరడం.. అందుకు బదులుగా వారికి పనులు చేసిపెట్టడం.. ఆ ఘట్టం అంతా చాలా హృద్యంగా.. హృదయ విదారకంగానూ ఉంటుంది. ఆ ఘటన ఎపుడు చదివినా మనసు భారంగా అయి కనులు చెమర్చేవి.

కథ నా జీవితానికి దగ్గరిదే అయి.. కథను రాసిందీ నేనే.. అయినప్పటికీ చదివిన ప్రతిసారీ ఆ మోస్తరు ఉద్వేగం నన్ను ఆవరిస్తే, ఇక సగటు పాఠకుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని అనిపించేది.

ప్రశ్న 6. గీతామాథుర్ పాత్ర మీకు జీవితంలో తారసపడిందా? అటువంటి ఫ్రెండ్ మీకు ఎవరైనా ఉన్నారా? వారితో ఉన్న స్నేహానుబంధాన్నే మీరు ఇందులో చిత్రించారా?

జ: అవునండీ. ఉన్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాల అనుబంధం మాది. నాకంటే ఆవిడ చాలా పెద్దవారు. నా జీవితంలోని దాదాపు ప్రతి మోదానికీ ప్రతి ఖేదానికీ స్పందించిన వ్యక్తి.

ఆవిడే.. శ్రీమతి అక్కిరాజు సరోజిని!

‘పితృత్వమ్’ నవలలోని వివిధ ఉదంతాల చిత్రీకరణలో ఆ అనుబంధపు ప్రభావం చాలా ఉంది. నిజజీవితంలో కూడా ఆయా సంఘటనలలో చాలా వాటికి ఆవిడ ప్రత్యక్ష సాక్షి.

వరంగల్లు లో పితృత్వమ్ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్న ప్రముఖ నవలారచయిత సినీదర్శకులు, నంది అవార్డు గ్రహీత శ్రీ ప్రభాకర్ జైనీ.

ప్రశ్న 7. ప్రస్తుత సమాజంలో ఆర్థిక అనుబంధాలకు, మానవ సంబంధాలకు మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడింది. అప్పుడప్పుడూ ఒక తురుపుముక్కలా ఇలాంటి నవల మనిషి లోపలి మనిషిని తట్టి లేపుతుంది. ఈ క్రమంలో ఈ నవల తన ప్రయోజనాన్ని సాధించిందని అనుకోవాలా?

జ: అవును. సాధించింది. అది కూడా ఊహించని విధంగా.

నా దృష్టిలో కథ అంటే ఏదో కాలక్షేపానికి కాకుండా చదివేవారికి ఏదో విధంగా.. ఎంతో కొంత.. ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలి. కనీసం ప్రయోజనం కల్గించకున్నా, హాని చేసేదిగా ఉండకూడదు.

‘పితృత్వమ్’ నవల రాయడం మొదలు పెట్టినపుడు దానికి ఎలాంటి లక్ష్యమూ లేదు. కేవలం నా జీవితంలో నాకు అనుభవంలోకి వచ్చిన వివిధ సంఘటనల నేపథ్యంలో నా వేదనను, మనోభావాలను అక్షరాలుగా మార్చి, సేదతీరాలని చూసాను.

మొదట చిన్న కథగా ఆకాశవాణిలో ప్రసారం కోసం రికార్డింగ్ చేసినపుడు, రేడియో స్టేషన్‌లో ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న టెక్నిషియన్, ఇతర సిబ్బంది చెమర్చిన కండ్లతో నన్ను ప్రశంసలతో ముంచెత్తారు. తర్వాత ఫేస్‍బుక్, ఇతర సామాజిక మాధ్యమాలలో ధారవాహికగా ప్రచురణ సాగుతున్నపుడు పాఠకుల స్పందన విస్తృతం అయింది. అలాగే, నవల ప్రభావం క్రమక్రమేణా గోచరించసాగింది.

కథలో లాగా తాము కూడా కొన్ని సందర్భాల్లో ప్రవర్తించిన తీరుకు సిగ్గు పడుతున్నామని కొందరు వ్యాఖ్యానిస్తే, ఇంకొందరు జీవితంలో మనిషి అంటే ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదో మీ నవల చెబుతోందని అన్నారు. నవల చదివిన బంధుమిత్రులు నా పట్ల ప్రవర్తించే తీరులో స్పష్టమైన మార్పు కనిపించింది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబం మాత్రం నిష్ఠూరమాడింది. అలాగే ఆయుర్వేదం ఇతర దేశీయ వైద్యవిధానాల పట్ల చాలా మంది పాఠకులకు గౌరవం, నమ్మకం కలిగాయి. ఇప్పటికీ కొందరు నన్ను ఆ విషయంగా సమాచారం కోరుతూ ఉంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి హయాంలో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. వీటన్నికన్నా ముఖ్యంగా విశ్వనాథ్, గీతామాథుర్‌ల స్నేహాన్ని పాఠకలోకం చాలా ఇష్టపడింది. ఎంత ఇష్టపడిందంటే నేను సృష్టించిన విశ్వనాథ్ పాత్ర పట్ల నాకే ఈర్ష్య కలిగేంతగా!

కొందరు విశ్వనాథ్ లాంటి స్నేహితుడు కావాలని, కొందరు విశ్వనాథ్ లాంటి కొడుకు కావాలని, ఇంకొందరు విశ్వనాథ్ లాంటి అల్లుడు కావాలని అనేవారు. ఒకమ్మాయి అయితే విశ్వనాథ్ లాంటి పెండ్లి కొడుకును చూడమని కోరింది. అలాగే గీతామాథుర్ పాత్ర , దీప, శరత్ , కీర్తి పాత్రలను పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇంకో ముఖ్యమైన అంశం గమనించాను. ఆడ, మగ‌‌, ముసలి అనే తేడా లేకుండా, ఈ నవల చదివిన దాదాపు ఏ ఒక్కరి కనులూ చెమర్చకుండా లేవు.

‘నవ్వే నవ్వులు ఒకోసారి అబద్ధాలు కావచ్చు కానీ కార్చే కన్నీరు ఎన్నడూ అబద్ధం కాద’ని ఒక సందర్భంలో సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు అన్నట్లు గుర్తు. అలా చూస్తే మీరు అన్నట్టుగా మనిషి లోపలి మనిషిని కదిలించడంలో ఈ నవల తన ప్రభావాన్ని సమర్థవంతంగా చూపిందనుకోవాలి.

ప్రశ్న 8. ఏడ్పించే రాతగాడు అని మిమ్మల్ని మీరు అనుకున్నారు కానీ.. గుండె లోతుల్లోంచి ఉద్వేగం ఉప్పొంగించే రాతగాడు అని నేనంటాను. మీరేమంటారు?

జ: ఆనందంగా, సగర్వంగా శిరసావహిస్తానండీ.

కానీ, ‘ఏడ్పించే రాతగాడు’ అని నన్ను అనుకోలేదండీ. పాఠకలోకం నుండి వచ్చిన మాట అది.

ఫేస్‍బుక్ లోని వివిధ సమూహాలలో ‘పితృత్వమ్’ నవలను ధారావాహికగా పంచుతున్నపుడు ఇంకొద్ది రోజుల్లో కథ ముగించుదామనుకుంటుండగా, ‘నాతి చరామి’ నవలకు సంబంధించిన ప్రోమో ప్రకటన పోస్ట్ చేసాను. సాధారణంగా అలా ప్రోమోలు ఇవ్వడం నాకు అలవాటు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో.. ఆ నవల పట్ల పాఠకులకు ఆసక్తి, ఉత్సుకతలను కలిగించి, తద్వారా పాఠకుల దృష్టిని నవల ఆరంభం కోసం ఎదురు చూసేలా చేయొచ్చు. రెండోది ఏమిటంటే, నవల రాయడానికి నాకు బద్ధకంగా ఉంటే, పాఠకులు నిలదీసినట్టు అడుగుతారు కదా. అప్పుడు చచ్చుకుంటూ నవల రాయడం మొదలు పెట్టొచ్చునని!

అందుకని, ‘పితృత్వమ్’ ధారావాహిక 42వ ఎపిసోడ్ నడుస్తున్నపుడు, ఇంకా పొడిగిస్తే, ఆ నవలకు ఉన్న పాఠకాదరణ తగ్గుముఖం పడుతుందేమోననిపించింది. ఇంకొంచెం రాసి, దానిని 50వ ఎపిసోడ్‌తో ముగించేద్దామనున్నాను. అలాగే మరో కొత్త నవల ‘నాతి చరామి’ని ధారావాహికగా ఫేస్‍బుక్‌లో పోస్ట్ చేయడం ఆరంభించాలని అనుకున్నాను.

తీరా చూస్తే.. పాఠకుల ఆదరణ పెద్ద ఎత్తున ఉండగా, ‘పితృత్వమ్’ నవలను అంత తొందరగా ముగించలేక మరింత పొడిగిస్తూ పోయాను. అది ‘పితృత్వమ్’ పాఠకులకు ఆనందంగానే ఉండేది. కానీ, ‘నాతి చరామి” ప్రోమోలు చూసిన పాఠకులు, ఆ నవల ఎప్పుడు ఆరంభం అవుతుందని అడిగేవారు. దాంతో ‘నాతి చరామి’ నవలను కూడా రాస్తూ ధారావాహికగా పోస్ట్ చేయడం ఆరంభించాను!

ఏక కాలంలో, రెండు విభిన్న కథనాల ఎపిసోడ్స్ రాయడం నాకు ఓ కొత్త అనుభవంగా మిగిలింది.

దైనందిన జీవితపు ఒత్తిళ్ల కారణంగా, ఒక్కోసారి ఆ ఎపిసోడ్స్ రాసి పోస్ట్ చేయడంలో కొంత జాప్యం ఏర్పడేది.

ఆ సమయంలో పాఠకులు అనేవారు..

“కథ రాయకా ఏడిపిస్తావు.. రాసిన కథతోనూ ఏడిపిస్తావు” అని ముద్దు ముద్దుగా తిట్టేవారు.

అంతెందుకు..

సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ శ్రీరామ్ సర్.. మీకు తెలుసు కదా.. ఆయన ఓ రోజు ఫోన్ చేసి “మీకు ఇదేమైనా బాగుందా? మా ఆవిడను పెళ్లి చేసుకుని ముఫ్పై అయిదేళ్లు దాటింది. ఒక్కరోజు కూడా ఆవిడ కంట నీరు నేను చూడలేదు. మీ పుణ్యమా అని నిన్న చూసాను..” అని అన్నారు.

ఆయన మాటలకు ఒక్కసారిగా షాక్ తిన్నా.

“అయ్యో.. అదేమిటి సర్.. నా వల్ల మేడమ్ ఏడ్వడం ఏమిటి? నేనేమన్నాను?” అర్థం కానట్టు అడిగాను.

“కంగారు పడకండి. మీ ‘పితృత్వమ్’ నవల ఎఫెక్ట్ అది. అంటూ 39 నిమిషాల 23 సెకండ్లు మాట్లాడారు. (రత్నా మేడమ్ కూడా మాట్లాడారు)

సర్ ‘పితృత్వమ్’ పుస్తకం చదువుతుండగా, అది చూసి “ఏమిటది?” అని రత్నా మేడమ్ అడిగారట. “మన సుబ్రమణ్యం రాసిన నవల.. బాగా రాసాడు..” అంటూ ఉండగనే, “ఏదీ..చూస్తా” అంటూ నవలను తీసుకున్న ఆవిడ.. దాన్ని పూర్తిగా చదివేదాకా సర్‌కి ఇవ్వలేదుట. చదివినంత సేపు కండ్ల నుంచి అశ్రుధారలు స్రవిస్తునే ఉన్నాయట!

ఎపుడూ ప్రసన్నవదనంతో, మందహాసంతో విలసిల్లే రత్నా మేడమ్.. నవల చదివి కన్నీరు పెట్టుకోవడం చూసి సర్ ఆశ్చర్యపోయారట! ఆ తర్వాత ఆయన కూడా చదివాక.. తనకూ మనసు భారంగా అయిందిట.

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి నవలల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. “మీతో కలిసి, కొంత కాలం పని చేయగలగడం నాకు గొప్పగా ఉంది..” అని ఆయన అంటుంటే నా గొంతు మూగబోయింది! వారి ఆదరాభిమానాలకు నా హృదయం ఉప్పొంగి పోయింది!

మహామహులను సైతం మంత్రముగ్ధులను చేసిన నవల ఈ ‘పితృత్వమ్’!

పాఠకులు అన్నట్టు నా రాతలు ఏడిపించేవో.. లేదా మీరన్నట్లు గుండె లోతుల్లో నుంచి ఉద్వేగాన్ని పొంగింపజేసేవో!

అంతా ఆ వాగ్దేవి కృప. ఇంతకంటే ఏం చెప్పగలనండీ?.

ప్రశ్న 9. మాతృత్వానికి, పితృత్వానికి మధ్య అంతరాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు?

జ: చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారు. అయినా సరే, నా బుద్ధికి తోచినంతలో చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. తొమ్మిది నెలలు మోసి, తన రక్తమాంసాలతో ఓ ప్రాణికి జన్మనిచ్చిన మాతృత్వానికి లభించే ప్రాముఖ్యత, గౌరవం.. ఆ ప్రాణి భావిజీవితానికి ఆసరాగా, ఆలంబనగా నిలిచే పితృత్వానికి అంతగా ఉండవు. అది లోకసహజం.

అలాగే, పితృత్వమ్ సాధించని వ్యక్తిని ఏమీ అనని సమాజం.. మాతృత్వం సాధించని వ్యక్తిని గొడ్రాలు అని వేధిస్తుంది.. వెక్కిరిస్తుంది. ఇదీ లోక రీతే.

~

కోవెల సంతోష్ కుమార్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సుబ్రమణ్యం గారూ.

డి.ఎన్. సుబ్రమణ్యం: ధన్యవాదాలు.

***

పితృత్వమ్ (నవల)
రచన: డి.ఎన్. సుబ్రమణ్యం
పేజీలు: 274
వెల: ₹ 300
ప్రతులకు:
రచయిత
(రూ. 50/- పోస్టేజీ అదనం) మొత్తం : రూ.350/-లు
మీ చిరునామాతో సహా
ఫోన్ నెంబర్ 9848885411కు
Google pay/Bhim/ Paytm (లేక ఇతర UPI ల ద్వారా)
పంపి మీ కాపీ POST/Courier ద్వారా పొందవచ్చు
dnsubramanyam717@gmail.com
ఆన్‍లైన్‍లో
https://books.acchamgatelugu.com/product/pitrutvam/?sku_id=50013873

~

‘పితృత్వమ్’ నవల సమీక్ష:
https://sanchika.com/pitrutvam-book-review-ppr/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here