రచయిత, అనువాదకులు శ్రీ కల్లూరు జానకిరామరావు ప్రత్యేక ఇంటర్వ్యూ

0
10

[‘కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు’ అనే అనువాద కథాసంకలనం వెలువరించిన కల్లూరు జానకిరామరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కల్లూరు జానకిరామరావు గారూ.

కల్లూరు జానకిరామరావు: సంచిక.కామ్ వారికి నా నమస్కారాలు. ‘కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు’ అనే నా అనువాద కథాసంకలనం గురించి నాతో ముచ్చటించదలచి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నా అభినందనలు. చాలా సంతోషం.

~

ప్రశ్న 1. మీ అనువాద కథల సంకలనానికి కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలుఅనే శీర్షికని ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? సాధారణంగా సంకలనంలోని ఏదో ఒక కథ పేరునే పుస్తకానికి పెట్టడం ఆనవాయితీ కదా?

జ: మంచి ప్రశ్న. మీరన్నట్టుగా ఏదో ఓ కథను ఎంచుకొని ఆ కథ శీర్షికనే పుస్తక శీర్షికగా ఎంచుకోవచ్చు. కాని నా విషయంలో – దానికి భిన్నంగా వుంటే బావుంటుందని నా ఆలోచన. పైగా నే అవవదించివన్నీ కన్నడ కథలే కాన వాటి గుబాళింపులు కూడా ఉండాలి కదా. కుసుమాలన్నీ అతి కోమలాలే కదా. అటు కన్నడ కుసుమానికి తెలుగు కోమలం చేరిస్తే దాని గుబాళింపే వేరు కదా. ఇంకోటేమిటంటే – ఈ కథా సంకలనంలో ఉన్నవన్నీ వేరు వేరు రచయిత(త్రు)ల కథలే గాని అన్నీ ఒకరికే కావు. ఏ ఒక కథా శీర్షికను ఎన్నుకున్నా ఆ కథా రచయితకే ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది కదా. అంతే కాదు, ఈ సంకలనంలో ‘కుసుమ కోమలం’ అనే ఓ కథ ఉంది. అందులో నాయికానాయకుల పేర్లు ‘కుసుమ’, ‘కోమల్’. ఈ కథ కూడా ఆ శీర్షికకు సహకరించింది.

ఈ నా అనువాద కథా సంకలనానికి ఆ పేరు పెట్టడం చాలా నూతనంగానూ, సముచితంగానూ ఉందని చాలామంది మిత్రులు, అభిమానులు, చదువరులు తెలియజేశారు. అంతేకాక నా ముఖచిత్రంతో పుస్తకం ప్రకటించడం కూడా నూతనంగా, ఆకర్షణీయంగానూ ఉన్నదని ప్రశంసించారు. ఐదే దీని వెనుక నున్న విషయం.

ప్రశ్న 2. పదవీ విరమణ తరువాత, 2012 నుంచి అనువాదాలు మొదలుపెట్టినట్టు నా మాటలో తెలిపారు. మీకు అనువాదాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ఇప్పటి వరకు ఎన్ని కథలు అనువదించారు? తెలుగు నుంచి కన్నడంలోకి కూడా అనువాదాలు చేశారా? మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?

జ: అనువాదం పట్ల అభిరుచి ఎలా కలిగిందంటే, మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగుళూరులో, నా పదవీ విరమణ అయిన తర్వాత స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా. మేము 16 అణాల తెలుగు వారమైనా, మా పూర్వీకులు, ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో నివసించినవారు. ఇక్కడికి, అంటే, ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చారు. ఆ కారణంగా ఇంట్లో కన్నడ భాషలో మాట్లాడేవారం. మాట్లాడటమే కాని, చదవటం, రాయటం మాత్రం తెలుగు లోనే. మాతృభాషగా తెలుగునే ఎన్నుకున్నాము. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్న తర్వాత కన్నడభాష నాకు మరీ సన్నిహితమయ్యింది. తెలుగు అక్షరాలకి (వర్ణమాల) కన్నడ వర్ణమాలకి ఏమంత పెద్ద తేడా లేదాయె – ఒక్క పదాల అర్థాలు తప్ప. ధారాళంగా చదవడం వ్రాయటం కూడా నేర్చుకున్నా. కన్నడ మాస, వార, దినపత్రికలైన కస్తూరి, తుషార, తరంగ, ప్రియాంక, మంగళ, సంయుక్త కర్నాటక, విజయవాణి మొదలైన వాట్లో ప్రకటింపబడుతున్న కథలు చదివేవాణ్ణి. ఈ కథలని మన తెలుగు వారికి ఎందుకు పరిచయం చేయకూడదనే తలంపు వచ్చి, నాకు నచ్చిన కథలని తెలుగులోకి అనువదించి పత్రికలకు పంపేవాణ్ణి. నా మొదటి కథ ‘కపిల’. ఇప్పటి వరకూ 150కి పైగా కథలని అనువదించి వుంటాను.

తెలుగు నుంచి కన్నడంలోకి కూడా చేశాను. అవి ఓ ఇరవై దాకా వుంటాయి. అవి ప్రముఖ కన్నడ పత్రికలో చోటు చేసుకున్నాయి. తెలుగు నుంచి కన్నడంలోకి అనువదించిన కథలు చదివిన నా కన్నడ మిత్రులు చాలా మంది – ఇది అనువాదమంటే నమ్మలేకపోతున్నామని అభినందించారు. చాలా చక్కగా అనువదించారని మెచ్చుకున్నారు. ఉదాహరణకి శ్రీ సింగమనేని నారాయణ (కీ.శే) గారి కథ ‘ఆకస్మిక’, శ్రీమతి లక్ష్మీరాఘవ గారి ‘స్మార్ట్ జీవన’. ఈ రెండు కథలని (ఈ రెండు ‘మంగళ’ వారపత్రికలో ప్రచురింపబడ్డాయి) ఎంపిక చేసి, ‘కువెంపు భాషాభారతి ప్రాధికార – కర్నాటక సర్కార, కన్నడ మత్తు సంస్కృతి ఇలాఖె’ – బెంగుళూరు వారు నా అనుమతిని పొంది వారి అనువాదిత కథలని ఓ సంపుటిగా ప్రతి సంవత్సరం ముద్రించే – కథల (అనువాద కథల సంపుటిలో) నా రెండు కథలని ముద్రించారు. పారితోషకంగా కథకి వెయ్యి రూపాయల చొప్పున రెండు వేల రూపాయలు బహూకరించారు.

‘కపిల’ కథ అచ్చయిన నాటి నుంటి నా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తునే ఉన్నా. ఈ ‘కపిల’ కథకి ఎంతటి స్పందన లభించిందంటే – కథ అచ్చయిన రోజు నుంచి విడవక ఫోనుల్లో అభిమానులు అభినందనలు కురిపించారు. ఇది అనువాదమంటే నమ్మలేక పోతున్నామన్నారు. సుమారు 10 రోజుల వరకూ పాఠకుల నుండి ఆ కథారచన గురించి అభినందనలు వస్తూనే వుండేవి. ఒకాయన ఎకాఎకి, నేనో వెటర్నరీ డాక్టర్ అని అనుకొని, “సార్, మా పశువులకి రోగం వచ్చింది, దాని నివారణకి ఓ మార్గం చెప్పండి” అని అడిగాడు. నేను ఆశ్చర్యపోయి, “అయ్యా నేను పశువైద్యుణ్ణి కాను, కేవలం ఆ కథ అనువాదకుడిని మాత్రమే” అని చెబుతూ, ఆ కథా రచయిత ఓ పశువైద్యుడని చెప్పా. నాలోని రచనా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన చదువరులకు నేనెంతో ఋణపడి ఉన్నా.

ప్రశ్న 3. “ఈ అనువాద సంకలనంలోని పదిహేను కన్నడ కథలను ఎన్నుకోవడంలో గొప్ప విజ్ఞత కనబరిచారు కల్లూరు జానకి రామరావుగారు. లోతైన ఆలోచనా విధానం, సామాజిక స్పృహ నిండుగా కనిపిస్తాయి వైవిధ్యభరితమైన ఈ కథలన్నింటిలోనూ” – అని శ్రీ టి.ఎన్.ఎ. కృష్ణమూర్తి గారు తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు. అనువాదానికి మీరెలాంటి కథలు ఎంచుకుంటారు? ఏ ప్రమాణాలను పాటిస్తారు?

జ: ఓ కథ చదివిన తర్వాత ఆ కథ నాకు నచ్చాలి. నేను దీన్ని తెలుగు లోకి అనువదిస్తే, తెలుగు పాఠకులు స్వీకరిస్తారా అని ఆలోచించి మరీ అనువాదానికి పూనుకుంటాను. సామాజిక సృహ కలిగివున్న, హాస్యరస ప్రధానంగా ఉన్న, హృదయాలు కలచివేసే కథలని, క్రైమ్ కథలని ఎన్నుకొంటాను. ఆ కథ తెలుగు వారి పరిధిలోకి వచ్చి ఆకట్టుకుంటుందా లేదా అని ఆలోచించి ఆ తర్వాతే అనువాదానికి పూనుకుంటాను.

ప్రశ్న 4. ఈ అనువాదాల కోసం మీరు ముందుగా కన్నడ రచయితలను సంప్రదించారా లేక, మీ అనువాద నైపుణ్యం గురించి తెలుసుకుని వారే తమ కథలని అనువదించమని అడిగారా?

జ: అవును. తప్పక. కన్నడ పత్రికలలో అచ్చయిన కథారచయితల విలాసాలను తెలుసుకోటానికి ఆయా పత్రికా సంపాదకుణ్ణి సంప్రదించవలసి వస్తుంది. కొన్నిసార్లు వారి ఫోన్ నెంబర్లు ఆయా పత్రికల్లోనే ఇవ్వబడి ఉంటాయి. తద్వారా వారిని ఫోన్ మూలకంగా సంప్రదించి వారి అనుమతి పొంది అనువాదం ప్రారంభిస్తాను. వారి అనుమతి పత్రం తెలుగు వారపత్రికలకు పంపడం జరుగుతుంది. కొందరు కన్నడ రచయిత్రులు, రచయితలు నా అనువాద ప్రక్రియను తెల్సుకుని, తమ కథలని అనువదించమని కోరటం జరిగింది.

ప్రశ్న 5. సాధారణంగా స్వీయ కథలకు (తెలుగు) వస్తువో, శిల్పమో, శైలో ఏదో ఒకటి ప్రధానమని రచయితలు భావిస్తారు! అనువాద కథలకు ఏది కీలకమో వివరించండి.

జ: స్వీయ రచనా కథలకి శిల్పమో, శైలో తప్పక ఉండాలి. అనువాద కథలకి స్వంత శిల్పం, శైలి అనేవి ఉండవని నా భావన. ఎందుకంటే మూల రచయిత భావాలకి అనుగుణంగా అనువాద రచన జరగాలి. కొన్ని సందర్భాల్లో మూల రచయతల అనుమతి పొంది కొద్దిగా మార్పులు చేయాల్సి వుంటుంది. అది కూడా మూలకథకి ఎలాంటి డీవియేషన్ లేకుండా. స్వీయ రచనల్లో రచయితలకు స్వాతంత్ర్యం ఉంటుంది. తనకు వచ్చిన రీతిలో పొందుపరచుకునే హక్కు ఉంటుంది. కాని అనువాదాలలో ఆ స్వతంత్ర్యం వుండదనుకుంటాను. అనువాద కథలకి కీలకం – అనువాదకుడికి రెండు భాషల్లోనూ తగినంత పట్టు ఉండటం. లేకపోతే ఎబ్బెట్టుగా మారే ప్రమాదం ఉంది.

ప్రశ్న 6. ఈ పుస్తకంలోని కొన్ని కథల పేర్లు విభిన్నంగా ఉన్నాయి – అదృశ్య భల్లూకం, నాకేం తెలీదు దేవర, నగరం వివస్త్రమైన ఓ రోజు – వంటివి. మూల కథల పేర్లూ ఇవేనా/ఇలాంటివేనా? కథలలోని సన్నివేశాలకు తగ్గట్టుగా శీర్షికలను మీరే సృజించారా?

జ: దాదాపుగా మూలకథా శీర్షికనే, అనువాద కథలకి పెట్టడం జరిగింది. తెలుగు భాషకి తగినట్టుగా ఉండటానికి, ఆయా రచయితల అనుమతిని పొంది సన్నివేశాలకు తగ్గట్లుగా శీర్షికను సృజించటం జరిగింది.

ప్రశ్న 7. కపిలకథలో పశువైద్యుని మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు. ముఖ్యంగా ఆఖరి రెండు వాక్యాలు చదువుతుంటే మనసు పిండేసినట్టుంటుంది. ఈ కథ కన్నడంలో చదినప్పుడో, తెలుగులోకి తర్జుమా చేసినప్పుడో – మీ మానసిక స్థితి ఎలా ఉంది?

జ: నేనిదివరలో చెప్పాను ‘కపిల’ కథ అనువాదం గురించి. మూల రచయిత శ్రీ మురళీధర్ కిరణ్ కెరె గారు. వృత్తిరీత్యా పశువైద్యుడే. ఆయనతో అనేకసార్లు ముచ్చటించాను. ఆ కథ చదివింతర్వాత కన్నీళ్లు ఆగలేదు నాకు. మెర్సీకిల్లింగ్ – వినటమే తప్ప – ఆ వైద్యుడు మనోవ్యాకులానికి గురి అయ్యానంటాడు. అదే స్థితి నాకు కలిగింది. ఆయన పశువుల ప్రకృతి మొదలగు వాటిని గురించి కొన్ని పుస్తకాలు కూడా వ్రాశారు.

ప్రశ్న 8. నగరం వివస్త్రమైన ఓ రోజుఅధివాస్తవిక కథ. మూల కథ చదివినప్పుడు – ఈ కథ తెలుగువారి నేపథ్యానికి నప్పుతుందని అనుకున్నారా? ఈ కథని అనువదించడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొద్దిగా అటు ఇటూ అయినా, ఎబ్బెట్టుగా మారే ప్రమాదం ఉండేది కదా, వివరించండి.

జ: ఈ కధారచయిత డా. మీర్జా బషీర్. ఈయన కూడా పశువైద్యులే. ఈ కథ చదివినప్పుడు ఇదేదో ఓ విభిన్న కథ లాగున్నదే, దీన్ని అనువదిస్తే – తెలుగు పాఠకులకి నచ్చుతుందా అనే అనుమానం రాకపోలేదు. భిన్నగా వుంది కథ – ఇందులో కొంత రిపిటిషన్ లేకపోలేదు – అదే విషయాన్ని ఆయనతో చర్చించాను. “అనువదించటానికి మీకెలా సరిపోతుందో అలానే చేయండి” అని ఆయన అనుమతి ఇచ్చారు. అలా అని పూర్తిగా స్వతంత్రించలేదు. ఓ పత్రిక వాళ్ళు దీన్ని నిరాకరించినా ‘విపుల’ వాళ్ళు దీన్ని అంగీకరించారు. ఈ కథ The Selfish Giant అనే ఆంగ్ల కథని (రచయిత అస్కార్ వైల్డ్) గుర్తుకు తెచ్చింది. దీన్ని నేను పాఠంగా పిల్లలకి బోధించడం జరిగింది.

ప్రశ్న 9. నెచ్చెలికి బాష్పాంజలికథ ఇతివృత్తం సున్నితమైనది. పిల్లలు కలగని సుమ తీసుకున్న నిర్ణయం గొప్పది! ఈ కథని కన్నడంలో చదివినప్పుడో, అనువదిస్తున్నప్పుడో మీలో ఎలాంటి భావోద్వేగాలు కలిగాయి?

జ: ఈ కథారచయిత్రి శ్రీమతి ఉషా పిరై. ఈమె కథలు చాలా ప్రాశస్త్యాన్ని పొందాయి. అతి సున్నితమైన కథ – మహిళ మనస్తత్వాన్ని మహిళే చక్కగా ఆకళింపు చేసుకోగలదు. సంతానం దేవుడిచ్చేవరం – అయితే అందరూ తల్లులు కాలేరు – మాతృత్వం కోసం ఆరాటం. ఇక సంతానం కలిగే అవకాశమే లేదు. కడుపున పుట్టినవారికే తల్లి కావాల్సిన పనిలేదు. మాతృత్వాన్ని తల్లిడండ్రులు లేని అనాథ శిశువులకీ ప్రసాదించ వచ్చు. అందునా అందరూ ఆరోగ్యవంతమైన, అవయవ లోపం లేని పిల్లలనే ఎంచుకుంటే, లోపాలున్న శిశువుల సంగతేమిటి? సుమ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది. అందరికి నచ్చుతుందనే ఈ కథని ఎంచుకున్నాను. అంతే కాదు.. మా రెండవ అబ్బాయికి వివాహమై పదేళ్లు గడచినా సంతానం లేదు (ఇప్పటికీ). ఈ కథ చదువుతున్నప్పుడు ఇల్లాంటి నిర్ణయం వీళ్లెందుకు తీసుకోకూడదనే అలోచన వచ్చింది (వారింకా ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఉన్నారు. అది వేరే సంగతి). ఇల్లాంటి కథా వస్తువులంటే నాకెంతో ఇష్టం.

ప్రశ్న 10. ఈ సంకలనంలోని ఏ కథైనా మీ మనసులో నిలిచిపోయి, చాలా రోజుల పాటు వెంటాడిన అనుభవం ఉందా? ఉంటే ఏ కథ? వివరించండి.

జ: నా మనసులో నిలిచిపోయిన కథలు రెండు. ‘చీకటి బతుకులు’, ‘ఆర్తనాదం’. ఈ రెండింటినీ తారాభట్ గారు రచించారు (ఇటీవలె ఈమె స్వర్గస్థురాలయిందని తెలిసింది). రెండూ గుండెలను పిండివేసే కథలే. మాన్యులు టి.ఎస్.ఎ. కృష్ణముర్తి గారు చెప్పినట్టుగా, “ఎంతటి రాతిగుండె కలిగిన పాఠకులకైనా ఈ కథ (చీకటి బతుకు) చదివాక హృదయం ద్రవించక తప్పదు”. మానవతా విలువలు ఏ విధంగా క్రుంగిపోతున్నాయో వివరించే కథ ‘ఆర్తనాదం’. “గుండెల్లో చేదును నింపి మనసులలో ముల్లు గుచ్చే విషాధ గాథ” అంటారు వారే. మీరూ ఓసారి వాటిని చదివి చూడండి.

ప్రశ్న11. ఈ సంకలనంలోని ఏ కథ అనువదించడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా తర్జుమా చేసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ఏదీ అంత కష్టమనిపించలేదు.

ప్రశ్న12. ఈ అనువాద కథల సంకలనంలో మీ తెలుగు కథ కుసుమ కోమలంచేర్చడంలో ఏదైనా విశేష కారణం ఉందా? వివరించండి.

జ: ఇది నా స్వీయ తెలుగు కథ. ఇంకో విశేషమేమిటంటే – ఇది ఒక యథార్థ సంఘటనకు ఆధారంగా వ్రాసిన కథ – మా ఇంటికెదురుగా ఓ పోలీస్ కుటుంబం ఉండేది. ఆయన భార్యగారికి కంటిచూపు లేక ఆవేదన పడుతూ ఉండేది. వేరే కన్ను అమర్చితే తప్ప గత్యంతరం లేకుండేది. దురదృష్టవశాత్తు ఆయన ఓ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఆయన కళ్లని భార్యకు అమర్చే ఏర్పాటు చేశారు గాని ఫలించలేదు – దీన్ని ఆధారంగా చేసుకొని ఆ కథ అల్లాను. వైవిధ్యం కోసమే ఈ సంకలనంలో చేర్చాను.

ప్రశ్న13. కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలుపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా?

జ: ఈ పుస్తక ప్రచురణలో నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. ప్రచురణకర్తలైన ‘నాగశ్రీ గ్రాఫిక్స్’ – కుప్పం గారు తక్కువ వ్యవధిలోనే మాకు అందించారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ సంకలనం పుస్తకం రావటానికి ముఖ్య కారకుడు నా తమ్ముడు చి. శ్రీ రాఘవేంద్రరావు, కథా రచయిత – నవలా రచయిత – ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, హస్యకథారర్న అవార్డు గ్రహీత.

ప్రశ్న14. సాహిత్య రంగంలో మీ భవిష్యత్తు ఆలోచనలేమిటి? ప్రస్తుతం సంచికలో వారం వారం వస్తున్న మంకుతిమ్మన కగ్గఅనువాదం కాకుండా, వేరే అనువాదాలేమయినా చేస్తున్నారా? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: ‘కగ్గ’ అనువాదమే కాకుండా – తేటగీతి, ఆటవెలదులలో సుమారు 200లకు పైగా పద్యాలు; ఇటీవల ‘పద్యము కాని పద్యము’ శీర్షికన – భావమే ప్రధానంగా కొన్ని పద్యాలను వ్రాస్తున్నాను. వాట్స‍ప్‌లో అవి ప్రశంసలు పొందుతున్నాయి. ఇవీ కాక ఇంగ్లీషులో కొన్ని POEMS కూడా వ్రాశాను. వాటికి ఆదరణ లభించింది. మొదటి సంకలనంలోని 17 కథలే కాక, ఇంకను 17 కథలు DTP పూర్తి అయి, రెండవ ప్రస్తకరూపంగా బయటపడటానికి సిద్ధంగా వున్నాయి. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పుస్తక ముద్రణ సాహసంగానే కన్పిస్తుంది. 50, 60 వేలు పెట్టి ముద్రించి, ఆ పుస్తకాలు అటక మీద నిద్ర పోయే దానికన్నా, మిన్నకుండటమే మంచిదనిపిస్తున్నది.

ఇంకా, కన్నడంలోని ‘బసవవచనామృతాన్ని’ ఆంధ్రీకరించాలని వుంది. ఆశ.. వున్నది. ఐతే 84 ఏళ్ల వృద్ధాప్యం, సహకరించాలి కదా ఈ శరీరం. కొన ఊపిరి వరకూ రచనా వ్యాసంగం కొనసాగించాలనే ఉంది. అయితే అంతా వాడి దయ. మానవుడి కోర్కెలకు అంతు ఎక్కడ?

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు జానకిరామరావు గారూ.

జానకిరామరావు: మీరూ మీ విలువైన సమయాన్ని నాతో వెచ్చించినందుకు చాలా చాలా సంతోషం. మిమ్ములను ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. ఈ ముఖాముఖి ద్వారా నన్ను పాఠకలోకానికి పరిచయం చేస్తున్నారు. కృతజ్ఞతలు. సెలవు.

***

కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు (అనువాద కథాసంకలనం)
రచన: కల్లూరు జానకిరామరావు
ప్రచురణ: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, బెంగుళూరు.
పేజీలు: xvi+138
వెల: ₹ 130/-
ప్రతులకు:
కల్లూరు జానకిరామరావు,
నెం. 402, ఎ బ్లాక్,
దీపిక పాలెస్, ఎల్.జి. ఎన్‍క్లేవ్,
నంజప్ప సర్కిల్
విద్యారణ్య (పోస్టు)
బెంగుళూరు. 560097
ఫోన్: 97408 49084

 

 

~

‘కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు’ అనువాద కథాసంకలనం సమీక్ష:
https://sanchika.com/kannada-kusumuaalu-telugu-komalaalu-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here