రచయిత మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ

0
17

[‘శివస్య కులం’ అనే పుస్తకాన్ని రచించిన శ్రీ మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారూ.

మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్: నమస్కారం.

~

ప్రశ్న 1. మీకు ఇలాంటి పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: నేను నిత్య విద్యార్థిని, ఒక యాదృచ్ఛికమైన రచయితను. గతంలో కాస్ట్ గురించి తెలుసుకుందామని అనేక పుస్తకాలు చదివాను, 19-20వ శతాబ్దాలలో వ్రాయబడిన అనేక గ్రంథాలలో హిందూ కాస్ట్ గురించి ఇచ్చిన వివరణలు అసంబద్ధంగా, సగం సమాచారంతో కూడి విపరీతమైన అయోమయంతో నిండి ఉన్నాయి. ఎక్కువ శాతం గ్రంథాలలో కాస్ట్ వివరణ పాశ్చాత్య సిద్ధాంతాలు, సమాజం ఆధారంగా చేయబడ్డది. కాస్ట్ ముసుగులో హిందూ సమాజ దూషణ కనిపించింది. అదే విధంగా జాతుల మధ్య భేదాలకు కారణాలు కూడా సరిగ్గా వివరించబడలేదు. మన శాస్త్రాలు చెబుతున్నదొకటైతే, వారు చెబుతున్నది మరొకటి. ఈ అయోమయాన్ని ఉపయోగించుకుని, అనేకులు సమాజంలో చిచ్చు రగల్చడానికి నిత్యమూ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దృష్టికోణంలో జాతుల మధ్య నెలకొన్న ఆచారభేదాల గురించి, వాటి వెనుకాల ఉన్న ఉపాసనాభేదాల గురించి సమాజానికి చెప్పడం ద్వారా వ్యవస్థలో నెలకొన్న అయోమయాన్ని కొద్దిగానైనా తొలగించవచ్చనిపించడంతో దీని గురించి వ్రాయడం మొదలుపెట్టాను. నాకు ఆంగ్లంలో పుస్తకాన్ని వ్రాసే ఉద్దేశం లేదు, ఈ అంశాలపై ఆంగ్లంలో వ్యాసాలను రాయాలనిపించింది. అలా వ్రాసిన వ్యాసాలను శ్రీమతి సహనాసింగ్ గారికి పంపాను, ఆమె సూచనలతో ఆ వ్యాసాలను పొడిగించాల్సి వచ్చింది. చివరకు ఆవిడ ఈ పుస్తకం బాగుంది, దీన్ని ఎడిట్ చేయించు అని సలహా ఇచ్చారు. ఆవిడ ఆ మాట అనడంతో, అమ్మవారే ఆవిడ రూపంలో పుస్తకం రాయి అన్నట్లు చెప్పిందనిపించడంతో ఈ పుస్తకం తయారయింది.

ప్రశ్న 2: ఈ ఆలోచన వచ్చిన తరువాత మీరు ఈ పుస్తకానికి సంబంధించిన పరిశోధన ఎలా చేశారు?

జ: గతంలో శ్రీ పి. రంగారెడ్డి గారితో కలిసి ‘కుహనామేధో నియంతలు’ అనే పుస్తకాన్ని వ్రాసాను. ఆ సమయంలో దక్షిణాది జాతుల గురించి బ్రిటిష్ వారు వ్రాసిన గ్రంథాలను చదివాను. అప్పుడు కొన్ని జాతుల ఉపాసనలను బ్రిటిష్ వారు వర్ణించిన తీరు చూసి, వారికి ఆయా జాతుల ఉపాసనలపై లోతైన అవగాహన పాశ్చాత్యులకు లేదని అర్థమయింది. పైగా ఎక్కువగా ఈ జాతులు శక్తిని, భైరవుడిని ఉపాసించేవని బ్రిటిష్ గ్రంథాలు సూచించాయి. దాంతో ఆ ఉపాసనలను వివరించిన గ్రంథాలను వెదకడం మొదలుపెట్టాను. అలా తాంత్రిక గ్రంథాల గురించి, వాటి సిద్ధాంతాల గురించి పరిశోధన సాగింది. వీటికి చెందిన కొన్ని గ్రంథాలను, వ్యాసాలను వెదికి సంపాదించాను, దీనికి కొందరు మిత్రులు కూడా సహాయపడ్డారు. అలా పరిశోధన సాగింది.

ప్రశ్న 3: పుస్తక రచన ప్రణాళిక ఎలా వేసుకున్నారు? ఎంత కాలం పట్టింది మీకు ఈ పుస్తకం రాయటానికి?

జ: ఈ సబ్జెక్టు ను నేను 2017 నుంచి పరిశోధిస్తున్నాను. 2018లో వ్రాసిన ‘కుహనామేధో నియంతలు’ అనే పుస్తకానికి కొనసాగింపే ఈ పుస్తకం. తెలుగులో ప్రస్తుతం వ్రాస్తున్న పుస్తకమే అసలు పుస్తకం, ఆంగ్లంలో 2022లో అచ్చయిన పుస్తకం, దేశీయ దృష్టికోణాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయడం కోసం అప్రయత్నంగా వ్రాయబడింది. తెలుగులో ప్రస్తుతం వ్రాస్తున్న పుస్తకం ఆంగ్ల పుస్తకం కన్నా మరింత లోతైనది, విస్తారమైనది. తెలుగు పుస్తకంలో మొత్తం 15 అధ్యయాలు, ఒక్కో అధ్యాయం ఒక్కో పుస్తకం. ఇవన్నీ అచ్చులోకి రావడానికి మరొక సంవత్సరం పట్టవచ్చు.

ప్రశ్న 4: ఈ పుస్తక రచనలో మీ లక్ష్యం ఏమిటి? పుస్తక రచన ద్వారా ఆ లక్ష్యం నెరవేరిందనుకుంటున్నారా?

జ: తెల్లవారు మనకన్నా గొప్పవారు, తెలివైనవారు, తెల్లవారి సంస్కృతి మనకన్నా గొప్పది అని హిందువులు మూర్ఖంగా నమ్మడం వలన స్వదేశీ విజ్ఞానం, దృష్టికోణం పట్ల ప్రస్తుతం తీవ్రమైన వివక్షాభావం, అపనమ్మకం, అయోమయం నెలకొని ఉంది. ఇంతేకాదు, సామ్రాజ్యవాదులు పాలించే సమయంలో జరిగిన దుష్ప్రచారం, నిరుత్సాహపరిచే చర్యలు స్వాతంత్రానంతరం కూడా కొనసాగడం వలన అనేక జాతులు తమతమ సంప్రదాయాలకు, ఆచారాలకు దూరమవడంతో, ధార్మిక పరంపరకు దూరమైన వారిలో తమ ఉనికిపై అయోమయం నెలకొంది, ఇది ఇతర మతాలకు ఆయా జాతులను మతం మార్చడానికి వరంగా మారింది. ఈ అయోమయం ధార్మిక వ్యతిరేక శక్తుల ప్రోద్బలంతో సృష్టించబడిందని చరిత్ర సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను పొందుతున్న స్వదేశీ దృష్టికోణాన్ని వెలుగులోకి తేవడం ద్వారా జాతులలో సృష్టించబడిన అయోమయాన్ని, వారి మధ్య సృష్టించబడిన అపనమ్మకాన్ని తొలగించి, వారికి ధర్మం పట్ల, ఉపాసన పట్ల సరైన సమాచారాన్ని ఇవ్వడంతో బాటుగా, సమాజంలో ఆయా జాతులను వారి పూర్వపు ఆచారాల- ఉపాసనల ఆధారంగా వారిని ధార్మిక పరంపరతో జోడించడం ఒక లక్ష్యం. ఒక నాగరికత అనే ప్రవాహం, దాని ప్రగతి అందులో జరిగే పరిణామాలు భూత-భవిష్యత్ వర్తమాన కాలాలను కలుపుతూ సాగాలి. ఈ ప్రవాహాన్ని చీల్చి పాశ్చాత్యులకు అనుకూల ప్రవాహాలను తయారుచేసే ప్రయత్నం బ్రిటిష్ వారి కాలంలో జరిగింది, అలాంటి పాయలను తిరిగి ధార్మిక పరంపరాప్రవాహంలో కలపడం ఈ పుస్తకపు మరో లక్ష్యం. ఈ లక్ష్యం వైపు ఆంగ్లంలో వచ్చిన పుస్తకం ఒక అడుగు. శివుడి ప్రేరణతో ఈ పని మొదలుపెట్టానని నా భావన. ఆ శివుడిచ్చిన పనిని యథాశక్తి చేయడానికి ప్రయత్నించాను, లక్ష్యంవైపుకు సమయమొచ్చినప్పుడు ఆ శివుడే తీసుకెళ్తాడు.

ప్రశ్న 5: ఈ పుస్తక రచనలో మీ టార్గెట్ రీడర్లెవరు? వారిని చేరారనుకుంటున్నారా?

జ: ఆంగ్ల పుస్తకం, ప్రస్తుతం రాస్తున్న తెలుగు పుస్తకం రెండూ మేధావి వర్గాన్ని ఉద్దేశిస్తూ వ్రాయబడ్డాయి. ఆంగ్ల పుస్తకం కొందరు మేధావుల దృష్టిని ఆకర్షించింది. కానీ వారి సంఖ్య అతి స్వల్పం, చేరాల్సిన వారి సంఖ్య చాలానే ఉంది!

ప్రశ్న 6: ‘శివస్య కులం’ అన్న పేరు పెట్టటం వెనుక మీ ఆలోచన ఏమిటి?

జ: తెలుగు ప్రాంతాలలో కులం అనే పదాన్ని జాతి స్థానంలో ఉపయోగిస్తారు. కులం అంటే వంశం అనే అర్థం అందరికీ తెలిసిందే. కానీ కులం అనే పదానికి ఇంకా అనేక అర్థాలున్నాయి. మన వ్యవస్థలో పూర్వం తాంత్రికం పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో ఉండేదన్న విషయం అందరికీ విదితమే. తాంత్రిక గ్రంథాలు కులం అనే పదానికి శక్తి అనే అర్థాన్ని చెప్పాయి. ‘శివస్య కులం’ అంటే, శివుడి శక్తి అని అర్థం. లలితా సహస్రనామస్తోత్రం అమ్మవారిని కులేశ్వరి ఇత్యాది పేర్లతో స్తుతించింది. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న కులం సాధన లేక ఉపాసనకు చెందింది. ఈ సాధన వైదిక-తాంత్రిక భేదంతో ఉంది. కులం అంటే శివుడి శక్తిని వంశపారంపర్యంగా పూజించే వారి సమూహమని అర్థం. శివుడి శక్తిని, శక్తి ఉపాసనను ఉద్దేశిస్తూ ‘శివస్య కులం’ అనే పేరు పెట్టాను.

ప్రశ్న 7: ఈ పుస్తకంలో మీరు అందించిన విషయాలు, ఇచ్చిన రిఫరెన్సులు చూస్తూంటే ఎంతో శ్రమపడ్డారీ రచనకు అని తెలుస్తుంది. కానీ, ఇన్ని అంశాలు ఒకే పుస్తకంలో పొందుపరచటంవల్ల సామాన్య పాఠకుడు అయోమయంలో పడి, మీరు చెప్పిన సత్యాలను గ్రహించలేకపోతాడేమో?

జ: శ్రమ అంతా ఈశ్వరుడి ప్రేరణ, అమ్మవారి దయ! ప్రస్తుతం పుస్తకాలు చదివే అలవాటు, అందులోనూ గంభీరమైన అంశాల గురించి చదివే ఓపిక అందరికీ లేదు. అందువల్ల, ఇది అందరికీ అర్థమయ్యే పుస్తకం కాదు. ముందు చెప్పినట్లు ఇది మేధావి వర్గాన్ని, అకడమిక్ వర్గాలను ఉద్దేశిస్తూ వ్రాసిన పుస్తకం అందువల్లనే అన్ని రిఫరెన్సులు ఇచ్చాను.

ప్రశ్న 8: సాధారణంగా కులభావనను సమర్దించటానికి కానీ, వ్యతిరేకించటానికి కానీ పురుష సూక్తాన్ని వాడటం ఆనవాయితీ. కానీ, మీ పుస్తకంలో పురుషసూక్తం ద్వారా వర్ణ భావనను వివరించటం కన్నా, కులం, వర్ణం వంటి పదాల వివరణపై దృష్టి అధికంగా కనిపిస్తుంది. కుల/వర్ణ భావనలో పురుష సూక్తం ప్రాధాన్యం ఏమిటి మీ దృష్టిలో?

జ: పురుష సూక్తం మన సృష్టిని విరాట్ పురుషుడి రూపంలో వర్ణించింది. ఇది అర్థం కావాలంటే మన సృష్టి క్రమం అర్థం కావాలి. ఇది ఒక పెద్ద అంశం, ఇక్కడ వివరించలేను. దీనిపై తెలుగులో విస్తారంగా వ్రాసాను. ఔత్సాహికులు దీనిని తెలుసుకోవాలంటే శ్రీ కోటా వెంకటాచలం గారు వ్రాసిన ఆర్య విజ్ఞానం-బ్రహ్మాండ విజ్ఞానం అనే గ్రంథాన్ని చూడండి.

వర్ణం-జాతి విషయపు చర్చలో స్మృతులపై పంచాయితీ పెట్టడం బ్రిటిష్ వారు మొదలుపెట్టిన పద్ధతి. అయితే అధికారి భేదంతో కూడిన మన సమాజంలో ఆయా జాతులకు తమతమ ఉపాసనలను, ఆచారాలను పాటించే స్వేచ్ఛ అనాదిగా ఉంది. ఈ ఉపాసనలతో కూడిన ఆచారాలు ఆయా జాతుల సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేసేవి. ధర్మాధర్మ నిర్ణయంలో లోకాచారం కూడా ప్రమాణమైనది. ఆ లోకాచారాలు ఆయా జాతుల పరంపరాగత ఆచారాల ద్వారా ప్రభావితమై ఉంటాయి. స్మృతులు సాత్త్విక లక్షణాలను, సత్త్వగుణాన్ని పెంచే కోణంలో రచించబడ్డాయి. కానీ వ్యవస్థలో రజస్తమో గుణాలతో కూడిన ఉపాసనలు కూడా ఉండేవి. ఉపాసనలలోని ఈ గుణభేదాలను పక్కనబెట్టి, కేవలం పాశ్చాత్య దృష్టికోణంతో భారతీయ ధార్మికతను నిర్వచించే ప్రయత్నం జరిగింది. ఈ పాశ్చాత్య చట్రంలోనుండీ బయటపడాలంటే అధికారభేదంతో కూడిన ఉపాసనా పద్ధతులను వెలుగులోకి తేవడం అతి ముఖ్యం. తద్వారా అన్ని జాతులు బ్రాహ్మణులపైనే ఆధారపడి ఉండేవి కావని, ఆయా జాతులకు ప్రత్యేక ఆచారాలు, వారికి ప్రత్యేక గురువులు ఉండేవారన్న విషయం ఆయా జాతులకు అర్థమైనప్పుడే వారికి ధార్మిక పరంపర యొక్క విశిష్టత అర్థమవుతుంది. వర్ణాలు గుణకర్మల ద్వారా ఏర్పడ్డాయని భగవద్గీత చెబుతోంది. సత్త్వగుణం జ్ఞానాన్ని, సుఖాన్ని ఇస్తుందని తమోగుణం మోహాన్ని, అజ్ఞానాన్ని కలుగచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఏ విధమైన సాధన చేస్తున్నారోనని గమనిస్తే, మనకు ఆయా జాతుల ఆచారాల ద్వారా వారు చేస్తున్న సాధన ఏ గుణాన్ని వృద్ధి చేస్తుందో కూడా అర్థమవుతుంది. తద్వారా వ్యవస్థ అమరిక కూడా అందరికీ అర్ధమయ్యే అవకాశముంది.

ప్రశ్న9: మీరు పుస్తకంలో ఒక చోట Varna system was created by Vedic framework and Kula system by Tantrik framework అన్నారు. తంత్ర కన్నా ముందు కులం లేదా?

జ: జాతి గురించి పలువురు వ్రాసారు, కానీ సాధన గురించి కొందరే వ్రాసారు. వర్ణంలో జాతి అంతర్భాగం, జాతిలో కులం అంతర్భాగం. కులం అంటే ‘సజాతీయానం మాతృ మానమేయానాం సమూహః కులం’ అనే నిర్వచనం భాస్కరరాయలిచ్చారు. ఒక జాతిలో వంశపారంపర్యంగా శక్తిని పూజించే వారి సమూహమే కులమని అర్థం. కులం అనే పదం అమ్మవారితో, ఉపాసనతో ముడిపడి ఉంది. తంత్రం ఒక ఉపాసనాశాస్త్రం. మనది నిగమాగమ సంప్రదాయం. వేదాలు, వాటినుండీ పుట్టిన ఆగమాలు-తంత్రాల ద్వారా మన వ్యవస్థలో విభిన్న ఆచారాలు నెలకొన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పై మాట చెప్పబడింది.

ప్రశ్న 10: మీ పుస్తకంలో బ్రిటీష్ వారు మన పద్ధతులను సరిగా తెలుసుకోలేదన్నారు. కానీ, ఈనాటికీ మనవారు బ్రిటీష్ వారి తీర్మానాలనే ప్రామాణికంగా భావిస్తున్నారు. ఎందుకని? మన దృక్కోణంలో మన సమాజాన్ని, మన చరిత్రను మనం అర్థం చేసుకోలేమా?

జ: అవును, మన వ్యవస్థలకు చెందిన సిద్ధాంతాలను బైబిల్ కథనాలలోకి, పాశ్చాత్య సమాజపు చరిత్రలోకి బ్రిటిష్ వారు ఇరికించి, ఆ విధంగా వ్యాఖ్యానించడంతో, విద్య ద్వారా చిన్ననాటి నుండీ ఆ చెత్తను మన మెదళ్లలో ఎక్కించి వాటిని విషయమయం చేయడంతో మనలో పరస్పర ద్వేషభావం పెరిగింది. బ్రిటిష్ పాలనలో మనలో నెలకొన్న అసమానతలు ఈ ద్వేషభావానికి ఆజ్యం పోశాయి. ఈ రావణ కష్టం నిత్యమూ రగిలేలా చేయడానికి మన రాజకీయ చట్రాలు బ్రిటిష్ వారి ద్వారా నిలబెట్టబడ్డాయి. ఉదాహరణకు జస్టిస్ పార్టీ రాజకీయాల ద్వారా మిషనరీలు, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన సిద్ధాంతాల పునాదులపై రాజకీయ సౌధం నిర్మించబడ్డది. ప్రస్తుత దక్షిణాది రాజకీయాలకు ఇవే ఆధారం. ఇలాంటి దృష్టికోణం పాలకులలో ఉన్నప్పుడు వారికి స్వదేశీ దృష్టికోణం పూర్తిగా వివక్షాపూరితమైనది అనే ఆలోచన ఉండటం సహజం. అలాంటి వారు మనలను పాలించినంతకాలము మన దృష్టికోణాన్ని పాశ్చాత్య సిద్ధాంతాలే ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన చరిత్రను మన దృష్టికోణంలో అర్థం చేసుకోవాలంటే ముందు మేధో సంకెళ్లను తద్వారా ఈ రాజకీయ సంకెళ్లను బద్దలు కొట్టాలి, అప్పుడే మనదైన దృష్టికోణంతో మన చరిత్రను, మహర్షుల దృష్టికోణాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. లేదంటే ఇంకో వందేళ్ల తరువాత కూడా మనం ప్రశ్నకు చెందిన చర్చలోనే ఉంటాము!

ప్రశ్న11: మీరు ఆర్య ద్రవిడ సిధ్ధాంతానికి మద్దతిస్తారా? ఈ పుస్తకంలో శంకరాచార్యులు తాను ద్రవిడశిశువునని చెప్పుకున్నారన్నారు. శంకరాచార్యుడి ద్రవిడ భావనకూ, బ్రిటీషువారు ప్రచారంలోకి తెచ్చిన ద్రవిడ భావనకు తేడా ఏమిటి?

జ: నేను మద్దతు ఇవ్వను. ఎందుకంటే శాస్త్రాలలో ఆర్య అనే పదానికివ్వబడిన అర్థాలు, ద్రావిడ అనే పదానికి మిషనరీలిచ్చిన అర్థాలను, ఇంతవరకూ వాటికి లభించిన ఆధారాలను చూస్తే ఆర్యుల వలసవాద సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది. కానీ గతంలో దేశభక్తుడైన తిలక్ గారు ఆర్య సిద్ధాంతానికి మద్దతిచ్చారు, అలాగే బ్రాహ్మణులను తిట్టిపోసిన అంబేద్కర్ గారు ఆర్య సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ ఆ సిద్ధాంతానికి మద్దతిచ్చామా, కాదా అన్నది ముఖ్యం కాదు. ఆ సిద్ధాంతాన్ని మనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నామా లేదా అన్నది ప్రశ్న అని గతంలో ధర్మరాజ్య అనే దార్శనిక గ్రంథాన్ని రాయడానికి కృషిచేస్తున్న ఖండవల్లి శంకర్ భరద్వాజ్ గారు నాతో అన్నారు.

శంకరాచార్యులవారు చెప్పిన ద్రావిడ అన్న భావన ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. మిషనరీలు ప్రతిపాదించిన ద్రావిడ అన్న భావన భాషాశాస్త్రం ఆధారంగా సృష్టించబడింది. ఇది ఒక జాతిని సూచిస్తుంది. ఈ ద్రావిడ జాతి వాద సిద్ధాంతంలో అనేక రకాలైన వక్రీకరణాలున్నాయి. దక్షిణాదిలో శైవాన్ని, శైవంలో అంతర్భాగమైన శాక్తేయాన్ని ధార్మిక పరంపరనుండీ విడదీయాలనుకున్న మిషనరీలు సృష్టించిన వక్రీకరణే ఈ ద్రావిడ మతం. ఈ అంశాన్ని వివరిస్తూ నేను వ్రాసిన ‘మిషనరీ మాయాజాలం-ద్రావిడ మత స్వరూపం’ అనే గ్రంథం త్వరలో విడుదలవుతున్నది. అది చదివితే ఈ సిద్ధాంతంలో ఉండే వక్రీకరణలు అర్ధమయ్యే అవకాశముంది.

ప్రశ్న12. పుస్తక రచనలో మీరు మీ దృష్టిని దక్షిణ భారతంపై అధికంగా కేంద్రీకరించానన్నారు. కానీ, ప్రాచీన భారతంలో ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న తేడాలుండేవా?

జ: ఉత్తరభారతదేశంలో పూజలు ఎక్కువగా వేదపరంపరకు, దక్షిణాదిలో ఎక్కువ ఆగమ పరంపరకు చెందిన పద్ధతులుండేవని కొందరు పండితులు చెబుతారు. నేను పెరిగిన దక్షిణాది సమాజంపై ఈ పుస్తకం ఎక్కువగా దృష్టిపెట్టింది. కానీ పూర్వం ఉత్తరభారతదేశంలో పుట్టిన అనేక సంప్రదాయాలు దక్షిణాదిలో బాగా ప్రాచుర్యంలో ఉండేవని. ఆ సంప్రదాయాలు ఉత్తరాదిలో పుట్టినా వాటి కీలకమైన గ్రంథాలు దక్షిణాదిలో రచించబడ్డాయని చరిత్ర చెబుతున్నది. పుస్తకంలో కేవలం పుస్తక పరిశోధన పరిధి కోసమే దక్షిణాది-ఉత్తరాది అనే మాటను ఉపయోగించాను తప్ప, సంస్కృతి-సంప్రదాయాలను ఉత్తర-దక్షిణ పేర్లతో విడదీసే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. ఆసేతు హిమాచలం ధార్మిక పరంపరకు చెందిన పుణ్య భూమి మన భారతదేశమని అని మన పూర్వులు చెప్పారు, అదే నిజమని నా ప్రగాఢ విశ్వాసం.

ప్రశ్న13. మీరు పుస్తకం చివరలో those who are genuinely looking for answers about Hindu society need only to look for the Origin of Grama devata worship అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను మరింత స్పష్టంగా వివరిస్తారా? అలాగే భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవటంలో గ్రామదేవతల ప్రాధాన్యాన్ని వివరిస్తారా?

జ: గ్రామదేవతల ఉపాసన చాలా కీలకమైనది. ఇది ద్రావిడ ఉపాసన అని రాబర్ట్ కాల్డ్వెల్ వంటి మిషనరీలు తీర్మానించారు, ఈ అభిప్రాయాన్ని బ్రిటిష్ వారు అధికారికంగా ఉపయోగించడం వలన నేటికీ భారతీయులు గ్రామదేవతల ఉపాసన ద్రావిడులకు చెందిందని భావిస్తున్నారు. గ్రామదేవతల ఉపాసనను కూకటి వేళ్ళతో పెకలించాలని మిషనరీలు అనేక గ్రంథాలలో వ్రాసారు. ఆ గ్రామదేవతల గుడులను నాశనం చేస్తే, ఆ గుళ్ళ శకలాలపై చర్చిలు వెలుస్తాయని హెన్రీ వైట్ హెడ్ వంటి మిషనరీలు ఏనాడో ప్రణాళికలు వేశారు. నేడు జరుగుతున్నదిదే. బ్రిటిష్ అధికారులుగా పనిచేసిన వారు వ్రాసిన గ్రంథాలలోనే ఈ గ్రామదేవతల పూజలు ఆగమాలకు చెందినవనే వివరాలు కనిపిస్తాయి. దీనికి చెందిన మరిన్ని వివరాలకోసం ‘మిషనరీ మాయాజాలం-ద్రావిడ మత స్వరూపం’ అనే రాబోయే గ్రంథాన్ని చూడండి. ఈ గ్రామదేవతలు కేవలం ఆగమాలతోనే కాక, వివిధ జాతుల సాధనతో, వైద్యంతో ముడిపడి ఉన్నారు. గ్రామదేవతలతో ఉన్న ఆధ్యాత్మిక, ఆయుర్వేదపరమైన సంబంధాలను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే ద్రావిడ మతం యొక్క అసలు స్వరూపం అర్థమవుతుంది. అప్పుడు మిషనరీల సిద్ధాంతపు డొల్లతనం కూడా అర్థమవుతుంది. అప్పుడు అధికారిభేదంతో కూడిన ధార్మిక పరంపర అసలు తత్త్వం గోచరించే అవకాశముంది.

ప్రశ్న14. ఇంతకీ, భారతీయ సామాజిక వ్యవస్థనుంచి కుల భావనను తొలగించటం సాధ్యమేనా? కులభావనను నిర్మూలించాలంటే ఏం చేయాలి?

జ: ప్రస్తుతం కులం పోవాలనే భావన కేంద్రీకృత పెట్టుబడిదారీ వర్గాలకు, కమ్యూనిస్టు వర్గాలకు అనుగుణంగా ఉండేవారు, వీరి ప్రచారానికి లోబడిన వారు, వారికి సమాధానం చెప్పలేని వారు రేకెత్తుతున్న వాదన. ప్రకృతి భిన్నత్వంతో కూడుకున్నది. ఆ భిన్నత్వాన్ని సరిగ్గా సమన్వయము చేయలేని వారు కులభావనను నిర్మూలించాలంటారు. ప్రకృతి తత్త్వాన్ని, ఉపాసనను, జీవేశ్వరుల సంబంధాన్ని అర్థం చేసుకున్నవారెవరైనా కులం పోవాలి అనరు.

ప్రశ్న15. మీరు సతి సహగమనాన్ని, కారుణ్య హత్య( యూథనేశియా) తో పోల్చారు. ఇది సమంజసమా?

జ: పతివ్రతల సతీత్వ దీక్షను తక్కువచేసే ఉద్దేశం నాకేకోశానా లేదు. సహగమనానికి అనేక కారణాలున్నాయి, అందులో ఒకటి వైద్యంతో ముడిపడి ఉంది. సతీసహగమనం ద్వారా అనేకమంది స్త్రీలు చంపబడ్డారు, ఇది మతం ద్వారా స్త్రీల మీద హిందువులు ఆపాదించిన శిక్ష అన్నది మిషనరీలు సృష్టించిన అపవాదు. ఈ ప్రచారాన్ని నమ్మిన అనేకమంది ధార్మిక పరంపరను శల్యపరీక్ష చేయడంతో బాటుగా, నిత్యమూ దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ సృష్టి కారణ-కార్య భావంతో నడుస్తుంది. దీనినే మనం కర్మ అంటాం. కారణం లేకుండా కార్యం పుట్టదు. స్త్రీలు సహగమనానికి పాల్పడటానికి కారణం వారి భర్తలు చనిపోవడం వలన. అనేక సందర్భాలలో అనేకమంది పురుషులు మశూచి, విశూచి, కలరా ఇత్యాది వివిధ అంటురోగాల వలన చనిపోయారని, అలా చనిపోయిన పురుషుల భార్యలు సహగమనం చేసారని చరిత్ర చెబుతున్నది. ఇలా పురుషులు పెద్ద ఎత్తున చనిపోవడానికి కారణం రోగాలు వ్యాపించడం, ఆ రోగాలకు తగిన చికిత్స లభించకపోవడం. భారతదేశంలో ఇస్లామిక్ పాలనలో, క్రైస్తవ పాలనలో ఆయుర్వేదం నిర్లక్ష్యం చేయబడిందని, ఆ కాలంలో నెలకొన్న దుర్భిక్షం వలన అనేక రోగాలు ప్రబలాయని చరిత్ర పుస్తకాలు ఘోషిస్తున్నాయి. మరి ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేసిన వారిని మీరెందుకు ఆక్షేపించడం లేదు? పైగా ముస్లిములు తమ వైద్యాన్ని వ్యాప్తిచేయడానికి, పాశ్చాత్యులు, తమ వైద్యాన్ని వ్యాప్తిచేయడానికి ఆయుర్వేదానికి అన్నిరకాల ఆటంకాలు కల్పించారని చరిత్ర పుస్తకాలూ స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ప్రక్రియను కోవిడ్ వాక్సీన్ సమయంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడిపై జరిగిన ప్రచారంపై కూడా చూడవచ్చు. సతీసహగమనంపై నెలకొన్న వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అప్పటి అబ్రహామిక్ ప్రభుత్వాల విధానాలను, వ్యవస్థలోని రోగాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే విషయాన్ని సమగ్రంగా అర్థంచేసుకోగలము. పైగా చికిత్స లేని రోగాలున్నవారు అప్పట్లో వివిధ రకాలుగా కారుణ్య హత్యలకు పాల్పడేవారు. ఈ పద్దతి ముస్లింలలో కూడా ఉంది. ఈ ప్రక్రియ నేటి పాశ్చాత్య సమాజాలలో పెద్ద ఎత్తున ఉంది. ఈ మధ్యకాలంలో కెనడాలో సుమారు 10,000 మందికి పైగా కారుణ్య హత్యకు పాల్పడ్డారు. వైద్యం లేనప్పుడు మనుషులు చనిపోవడం తప్పైతే, ఇప్పుడు జరుగుతున్న కారుణ్య హత్యలు ఒప్పెలా అవుతాయనేది ప్రశ్న!

ప్రశ్న16. ఈ పుస్తకానికి స్పందన ఎలావుంది? మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: స్పందన క్రమంగా పెరుగుతోంది. అది అలా ఉండటమే సమంజసం. గతంలో శ్రీ బెల్లంకొండ రామారాయ కవిగారు ఎన్నో అద్భుతమైన పుస్తకాలు వ్రాసి, ఆ పుస్తకాలలో విద్వత్తు ఉంటే, అవి సమాజానికి అవసరమైతే ఆ అమ్మవారే వాటిని ముందుకు తీసుకెళ్తుందనే నమ్మకంతో వాటిని పక్కనపడేసారు. ఆయన నమ్మిక లాగానే సుమారు 100 సంవత్సరాల తరువాత కూడా ఆ పుస్తకాలు నేటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వారే నాకు ఆదర్శం, ఈ పుస్తకంలో మన నాగరికతకు పనికొచ్చే అంశాలుంటే మన సమాజమే దానిని ముందుకు తీసుకెళ్తుంది, లేదంటే చాలా పుస్తకాల లాగానే ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఏది జరగాలన్నా అంతా ఈశ్వరేచ్ఛ. ప్రస్తుతం వ్రాస్తున్న తెలుగు పుస్తకాన్ని ముగించడమే నా ముందున్న లక్ష్యం. ఆ తర్వాత శివుడి ఆజ్ఞ.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సుధామోహన్ గారు.

మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్: ధన్యవాదాలు.

***

రచయిత పరిచయం:

మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ వ్రాసిన ‘శివస్య కులం’ అనే పుస్తకం 2022లో విడుదల అయింది. ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ప్రచురించింది. మైలవరపు సుధామోహన్ వృత్తి రీత్యా ఏవియేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. బ్రిటిష్ పాలనలో, ఆ తరువాత సెక్యులర్ ముసుగులో ధార్మిక పరంపర సిద్ధాంతాలను వక్రీకరిస్తూ చేయబడుతున్న వ్యాఖ్యానాలను, సిద్ధాంతాలను ఖండించే దిశలో ఈయన కృషి ఉంది. గతంలో ఈయన ‘కుహనామేధో నియంతలు’ అనే గ్రంథాన్ని, అంతర్జాలంలో వివిధ పోర్టల్ లలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొన్ని వ్యాసాలు కూడా వ్రాసారు.

జన్మస్థలం తిరుపతి. తండ్రి డా॥ మైలవరపు శ్రీధరరావు గారు, తల్లి మైలవరపు (రాయప్రోలు) సుబ్బలక్ష్మి గారు. హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్సు ఇంజనీరింగ్ చేసారు, అదే విభాగంలో UK లో డిగ్రీని పొందారు. భార్యపేరు గుమ్మరాజు నాగప్రతిభ, ఇద్దరు పుత్రికలు.

sudhamohan@yahoo.com

***

Sivasya Kulam

Author: Mylavarapu VNL Sudha Mohan

Publisher: Samvit Prakashan

Pages: 342

Price: ₹ 599

For copies:

Ajeyam Strategy & Marketing Pvt. Ltd.
91-8248281150.

https://www.amazon.in/Sivasya-Kulam/dp/819504865X

 

 

~

‘శివస్య కులం’ పుస్తక సమీక్ష లింక్:
https://sanchika.com/sivasya-kulam-book-review/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here