కథ, నవలా రచయిత శ్రీ సలీం ప్రత్యేక ఇంటర్వ్యూ

2
16

[‘లోహముద్ర’ అనే నవల రచించిన శ్రీ సయ్యద్ సలీం గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం సలీం గారూ.

సలీం: నమస్కారమండీ.

~

ప్రశ్న 1: స్టువార్ట్‌పురం గురించి, దొంగలుగా ముద్రపడిన ఎరుకల జాతి వారి దుస్థితి ప్రతిబింబించే నవల రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: నా చిన్నప్పుడు స్టువార్ట్‌పురం దొంగల గురించి మా యింట్లో మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళు వొంటినిండా ఆముదం పూసుకుని దొంగతనానికి వెళ్తారని, ఎవరైనా పట్టుకోడానికి ప్రయత్నించినా సులభంగా తప్పించుకుంటారని, వూళ్ళకు వూళ్ళు దోచుకుంటారని చెప్పుకునేవారు. మాది ఒంగోలు దగ్గర త్రోవగుంట అనే గ్రామం. స్టువార్ట్‌పురం మా వూరికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరంలో ఉన్నా మా వూరి ప్రజలు స్టువార్ట్‌పురం పేరు వినగానే ఎందుకు భయపడేవారో అర్థమయ్యేది కాదు. ప్యాసింజర్‌ రైల్లో బాపట్ల వెళ్తుంటే ఈపురుపాలెం దాటాక స్టువార్ట్‌పురం స్టేషన్‌ వచ్చేది. రైలక్కడ ఆగి, బయల్దేరాక ప్రయాణీకుల్లో సన్నటి అలజడి మొదలయ్యేది. బాపట్ల స్టేషన్‌ చేరుకునే వరకు వూపిరాడనట్టు, అస్థిమితంగా కూచునేవారు. యింతక్రితం రైలు ప్రయాణీకుల్ని స్టువార్ట్‌పురం దొంగలు దోచుకున్న సంఘటనలే దానిక్కారణం.

ఒక వూరు వూరంతా దొంగలుగా ముద్ర పడటానికి కారణం ఏమిటి? యాభై కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న వూళ్ళలోని ప్రజలు కూడా స్టువార్ట్‌పురం పేరు వినగానే ఎందుకు భయపడేవాళ్ళు? ఎవరూ పుట్టుకతో దొంగలు కారు. వాళ్ళు దొంగలుగా మారడానికి బలమైన కారణాలేవో ఉండిఉంటాయి. ఈ ఉత్సుకత లోంచి పుట్టిన నవలే ‘లోహముద్ర’.

ప్రశ్న 2: ‘లోహముద్ర’ నవలలోని ప్రాంతం, అక్కడి వాతావరణం, స్థితిగతులపై అవగాహన ఎలా కల్గించుకున్నారు? నవలని సాధికారికంగా ఎలా రచించగలిగారు? ఇందుకోసం ఎలాంటి పరిశోధనలు చేశారు?

జ: స్టువార్ట్‌పురానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈపురుపాలెం, చీరాలలో మా పెద్దమ్మలు ఉండేవారు. వేసవి శెలవల్లో అక్కడికెళ్ళినపుడు తరచూ స్టువార్ట్‌పురం సెటిల్మెంట్‌కి సంబంధించిన వార్తలు తెలుస్తూ ఉండేవి. ఈపురుపాలెంలో కొత్తగా పెట్టిన టుబాకో కంపెనీలో స్టువార్ట్‌పురానికి చెందిన ఆడవాళ్ళు కొంతమంది పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా కొంత సమాచారం తెలుస్తూ ఉండేది. ఆ విధంగా స్టువార్ట్‌పురం నా జ్ఞాపకాల్లో నిక్షిప్తమైపోయింది. బ్రిటీషర్లు సెటిల్మెంట్లని నిర్మించడంలో ముఖ్యోద్దేశం నేరాల్ని కట్టడి చేయడమే అయినా, ఎరుకల్ని సంస్కరించడంలో, వాళ్ళకు విద్యతో పాటు జీవనోపాధి కల్పించడంలో సాల్వేషన్‌ ఆర్మీ పోషించిన పాత్ర గురించి చదివినప్పుడు, ఈ నవల రాయాలన్న ఆలోచన కలిగింది. ఈ నవల రాయడంలో మీనా రాధాక్రిష్ణ రాసిన ‘Dishonoured by History – Criminal Tribes and British Colonial Policy’ అనే పుస్తకం, మల్లి గాంధి మరియు వి. లలిత రాసిన ‘Tribes under Stigma-Problems of Identity’ అనే పుస్తకం విషయసేకరణకు సహాయపడ్డాయి. వీటితో పాటు హిందూ, డెక్కన్‌ క్రానికల్‌ వంటి పేపర్లలో స్టువార్ట్‌పురం గురించి వచ్చిన వ్యాసాలు కూడా ఉపయోగపడ్డాయి.

ప్రశ్న 3: స్టువార్ట్‌పురం స్థాపన, చరిత్ర, బ్రిటీష్‌ అధికారుల ప్రవర్తన తదితర అంశాలలో ప్రత్యక్షానుభవం లేకపోయినా కళ్ళకు కట్టినట్టు వర్ణించగలిగారు. అదెలా సాధ్యమైంది?

జ. సాల్వేషన్‌ ఆర్మీ ఇంటర్నేషనల్‌‌కి సంబంధించిన పుస్తకాల్లో స్టువార్ట్‌పురం అభివృద్ధి కోసం ఆ సంస్థ చేసిన ప్రయత్నాలు వాటి ఫలితాలు నమోదుచేయబడ్డాయి. చారిత్రక నవల రాయడంలో చరిత్రతో పాటు కల్పనని కూడా జోడించాల్సిన అవసరం ఉంది. ఈ నవలలో శీను.. అతని పిల్లలు గౌరి, ప్రసాద్‌.. తిలక్‌, స్వరాజ్యం.. ఇలా మూడు తరాల కథని అల్లుకున్నాను. ఎరుకల జీవన విధానాన్ని, వాళ్ళు పొందిన అవమానాల్ని, వాళ్ళ ఆశల్ని, కోరికల్ని, దొంగలుగా ముద్రపడిన బతుకుల్లోంచి విద్యాధికులై సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందడం కోసం వాళ్ళు చేసిన ఆర్థిక సామాజిక పోరాటాల్ని ఇందులో పొందుపరిచాను.

ప్రత్యక్షానుభవం లేకున్నా కళ్ళకు కట్టినట్టు వర్ణించినపుడే కదా రచయిత కల్పనాశక్తి బైటపడేది.

ప్రశ్న 4: చారిత్రక సంఘటనలకు కల్పనను జోడించి నవలలో హ్యూమన్‌ ఎలిమెంట్స్‌ సృష్టిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: చారిత్రక నవలని రాయడం కత్తి మీద సాము లాంటిది. చరిత్రని ఎంత మేరకు ఉపయోగించుకోవాలనే విషయంలో సంయమనం పాటించాలి. ఉత్సుకత కలిగించేలా కథని నడపాలి. ఎరుకల ఆచార వ్యవహారాల్ని తెలియబరుస్తూనే, సంఘటనల్ని ఆసక్తి కలిగేలా సృజించాలి. లేకపోతే అది నవలగా కాకుండా హిస్టరీ పాఠంలా మారిపోయే ప్రమాదముంది. దాదాపు మూడువందల పేజీల సమాచారాన్ని సేకరించి, దాన్ని నవలలో అవసరమైన చోట మాత్రమే వాడుకుంటూ మూడు తరాల జీవితాల్ని చిత్రించడం మీదే దృష్టిపెట్టడం వల్ల నవలలో పఠనీయత దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డాను.

ప్రశ్న 5: ఈ నవలకి ‘లోహముద్ర’ అనే పేరు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ముందే టైటిల్‌ అనుకుని ప్రారంభించారా?

జ: లేదు. ఈ నవలకు ముందు అనుకున్న పేరు ‘సువార్తపురం’. స్టువార్ట్‌పురంలో ఎక్కువమంది క్రిస్టియానిటీ స్వీకరించడం వల్ల బైటినుంచి చాలా ప్రతిఘటనని ఎదుర్కోవాల్సి వచ్చింది. స్టువార్ట్‌పురం పేరు వినగానే అది దొంగలపురం అని ప్రజల్లో నాటుకుపోయిన అభిప్రాయం (స్టిగ్మా) నుంచి బైటపడటానికి దాని పేరుని సువార్తపురంగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. చివరికది కార్యరూపం దాల్చలేదు. కానీ నవల పూర్తయ్యాక దాని పేరుని ‘లోహముద్ర’గా మార్చాను. స్టువార్ట్‌పురంలో నివసించే ఎరుకలందరూ దొంగలన్న అపవాదుని వాళ్ళ నుదుటిమీద వేసిన లోహముద్రలా జీవితాంతం మోస్తూ బతికారు. అందుకే ఆ పేరు సరిగ్గా సరిపోతుందనిపించింది.

ప్రశ్న 6: స్టువార్ట్‌పురం గురించి నవల రాయాలనుకున్నప్పుడు ఇదివరకు వచ్చిన తెలుగు నవలలు, కథలను రిఫర్‌ చేశారా? వాటికి భిన్నంగా మీ నవలను ఎలా నడిపారు?

జ: స్టువార్ట్‌పురం నేపథ్యంతో తెలుగులో ఇంతకు ముందు నవలలు వచ్చిన దాఖలాలు లేవు. నా నవలే మొదటి నవల అనుకుంటాను. కథలు వచ్చాయో లేదో నాకు తెలియదు. నేను చదవలేదు.

Version 1.0.0

ప్రశ్న 7: స్టువార్ట్‌పురం పై తెలుగులో వచ్చిన సినిమాలు మీ రచనకి ఏ విధంగానైనా ఉపకరించాయా?

జ: చాలా యేళ్ళ క్రితం ‘స్టువార్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌’ అనే సినిమా వచ్చింది. చేయని నేరాన్ని స్టువార్ట్‌పురం లోని ఎరుకల మీద మోపి, వాళ్ళను జైల్లో వేయడం అనే విషయం తప్ప అందులో ఎరుకల జీవన విధానానికి సంబంధించిన సమాచారమేదీ లేదు. అది ఫక్తు కమర్షియల్‌ నవల. ఈ మధ్య వచ్చిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా చూడలేదు. అప్పటికే నేను నవల రాయడం పూర్తయింది. అది కూడా కమర్షియల్‌ హంగులతో నిర్మించిన సినిమానే అని రివ్యూల్లో చదివాను.

ప్రశ్న 8: ఈ నవలలోని ఏ పాత్ర మిమ్మల్ని ఎక్కువగా వెంటాడింది? ఎందుకు?

జ: ఈ నవల్లో శీను పాత్రని మలచడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. దొంగతనాలు చేయడం అతనికిష్టం ఉండదు. కష్టపడి పనిచేసి, గౌరవంగా బతకాలనుకుంటాడు. అలా బతికే అవకాశం ఇవ్వదు సమాజం. అతను గత్యంతరం లేక దొంగగా మారతాడు. అతని తాతల కాలంలో అడవుల్లో స్వేచ్ఛగా బతికిన ఎరుకలు అతనికాదర్శం. అటువంటి బతుకు బతికే అదృష్టం తనకు లేనందుకు బాధపడ్తుంటాడు. తన కొడుకు ప్రసాద్‌ తనలా దొంగ కాకూడదన్న తాపత్రయం. కానీ ప్రసాద్‌ ఓ దేవాలయంలో దొంగతనం చేసి జైలుకెళ్తాడు. శీను దొంగతనాలు మానేసి, వ్యవసాయం చేసుకుంటూ గుట్టుగా బతుకుతున్నా, అతను చేయని నేరాన్ని అతని మీద రుద్ది జైలుకి పంపిస్తారు. తన మనవడు తిలక్‌ని ఆదర్శ యువకుడిలా తీర్చిదిద్దడంలో అతను కృతకృత్యుడౌతాడు. చివరికి “నేను కలెక్టర్‌గా కుర్చీలో మొదటిసారి కూచోబోతున్న సమయంలో నువ్వు నా ఎదురుగా ఉండాలి తాతా” అని కోరిన తిలక్‌ కోరిక తీర్చకుండానే చనిపోతాడు.

ప్రశ్న 9: ఈ నవలలో ఏ పాత్రని సృష్టించడం, జవసత్వాలు నింపడం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది?

జ: స్టువార్ట్‌పురం సెటిల్మెంట్‌ ప్రారంభించాక దానికి మేనేజర్‌గా పనిచేసిన రోబిల్లియర్డ్‌ పాత్రని మలచడంలో కొంత కష్టపడ్డాను. హెరోల్డ్‌ స్టువార్ట్‌ గురించి ఇంటర్నెట్లో సమాచారం ఉంది. సాల్వేషన్‌ ఆర్మీకి కమీషనర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్‌ బూత్‌ టక్కర్‌‌కి సంబంధించిన సమాచారం కూడా దొరికింది. కానీ రోబిల్లియర్డ్‌ గురించి ఎటువంటి సమాచారమూ దొరకలేదు. ఆ పాత్రని పూర్తిగా వూహల్తోనే మల్చుకోవాల్సి వచ్చింది. అతని దయాగుణం, ఎరుకల జీవితాల్లో వెలుగుని నింపడం కోసం చేసిన ప్రయత్నాలు, అంకితభావం.. వీటితో పాటు ముత్తయి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాసినట్టు కొంతమందిని స్వచ్ఛందంగా క్రిస్టియన్‌ మతాన్ని స్వీకరించేలా చేయడంలో విజయం సాధించడం, తద్వారా అపవాదుల్ని ఎదుర్కోవడం, దాంతోపాటు భౌతికదాడికి గురికావడం.. ఇవన్నీ కల్పనతో సృష్టించిన సంఘటనలే.

ప్రశ్న 10: ఈ నవలలో ప్రస్తావించిన స్టువార్ట్‌పురం ఎరుకలజాతివారు క్రైస్తవంలోకి మారడం గురించి అంత ప్రామాణికంగా ఎలా రాయగలిగారు? ఏ ఆధారాల్ని సంప్రదించారు?

జ: సాల్వేషన్‌ ఆర్మీకి సంబంధించిన పుస్తకాల్లో సెటిల్మెంట్లలో ఏర్పాటుచేసిన ప్రార్థనా మందిరాల గురించి, కొంతమంది ఇష్టపూర్వకంగా క్రైస్తవమతం తీసుకోవడం గురించి, చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు దానికి వ్యతిరేకంగా చేసిన అలజడుల గురించి, హెరాల్డ్‌ స్టువార్ట్‌కి పంపిన అర్జీల గురించి రాసి ఉంది. దానికి కొంత కల్పన జోడించడం వల్ల ప్రామాణికత ఏర్పడింది.

ప్రశ్న 11: ఓ గుడిని దోచుకోవాలనుకున్న ముఠాలో జరిగిన చర్చ సందర్భంగా ఓ స్త్రీలో దైవభీతి కలిగినట్టు రాశారు. నేరం చేయకుండా దైవభీతి ఎందుకు నిరోధించలేకపోయింది?

జ: దైవభక్తి పురుషుల్తో పోలిస్తే స్త్రీలలోనే ఎక్కువ. స్త్రీలలో భావోద్వేగాల తీవ్రత కూడా పురుషుల్తో పోలిస్తే ఎక్కువే. అందుకే గుడిలోని బంగారు ఆభరణాల్ని దోచుకుందామని రాజు చెప్పినపుడు వాసంతి తన అయిష్టతను తెల్పినట్టు రాశాను. రాజు చెప్పిన దానికి ప్రసాద్‌ కూడా అంగీకారం తెల్పడంతో వాసంతి అభిప్రాయం బలహీనపడింది. అప్పటికీ స్త్రీ సహజమైన దైవభీతికి లోనవుతూనే దొంగతనంలో పాల్గొన్నట్టు రాశాను. కొన్ని దశాబ్దాల క్రితం, ఎరుకల స్త్రీ అభిప్రాయాలకు, మగవాళ్ళు అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి ఉంటారని అనుకోను. అందుకే వాసంతి వాళ్ళ మాటలకు లొంగిపోయింది తప్ప వాళ్ళను మార్చలేకపోయింది.

ప్రశ్న 12: హనుమంతు పాత్రలో వచ్చిన పరివర్తన నిజంగా జరిగిందా లేక కథను ముందుకు నడపడం కోసం కల్పించారా?

జ: స్టువార్ట్‌పురం సెటిల్మెంట్లోని కొంతమంది దొంగతనాలు చేసి జైళ్ళకెళ్ళాక, మనసు మార్చుకుని స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నట్టు ఇంటర్నెట్‌లో చదివాను. అందుకనుగుణంగానే హనుమంతు పాత్రని సృష్టించాను. స్వాతంత్రోద్యమకాలంలో బ్రిటీష్‌ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన అణచివేత, అకృత్యాల గురించి రాయకపోతే నవల అసంపూర్తిగా మిగిలిపోతుందన్న ఉద్దేశంతో హనుమంతు పాత్రని మలిచాను.

ప్రశ్న 13: మీరెప్పుడైనా స్టువార్ట్‌పురం వెళ్ళారా?

జ: లేదు. స్టువార్ట్‌పురానికి సంబంధించిన కొన్ని వీడియోలు చూశాను. అంతే.

ప్రశ్న 14: పేదరికం, అవిద్య కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాలలో ఇప్పటికీ ఉన్నాయి. వాటి పరిస్థితులు స్టువార్ట్‌పురం పరిస్థితుల కన్నా ఏ విధంగా భిన్నమైనవి?

జ: పేదరికం, అవిద్యతో పాటు స్టువార్ట్‌పురం వాస్తవ్యులు ఎదుర్కొన్న పెద్ద సమస్య దొంగలనే లోహముద్ర. ఇప్పటి తరం పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు తెచ్చుకుని పేదరికాన్ని జయించినా, వాళ్ళ నుదుట సమాజం పచ్చబొట్టు పొడిచిన దొంగలనే ముద్ర నుంచి బైట పడటానికి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.

ప్రశ్న 15: ఇటువంటి సెటిల్మెంట్లు మరెక్కడైనా ఉన్నాయా? వారికీ స్టువార్ట్‌పురం ప్రజల జీవితాలకీ ఏమైనా పోలిక ఉందా?

జ: విజయవాడ దగ్గర సీతానగర్‌ సెటిల్మెంట్‌, దక్షిణ ఆర్కాట్‌ జిల్లాలో అజీజ్‌నగర్‌ సెటిల్మెంట్‌, చెంగల్పట్‌ జిల్లాలో పల్లవరం సెటిల్మెంట్‌, మద్రాస్‌లో పెరంబూర్‌ సెటిల్మెంట్‌, నెల్లూరు జిల్లాలో కావలి సెటిల్మెంట్‌.. ఇలా డీనోటిఫైడ్‌ ట్రైబ్స్‌ కోసం సాల్వేషన్‌ ఆర్మీ చాలా సెటిల్మెంట్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని పార్థీ తెగ కోసం కూడా సెటిల్మెంట్‌ని ఏర్పాటు చేశారు. స్టువార్ట్‌పురం తప్ప మిగతా సెటిల్మెంట్లలోని జీవితాల గురించి నేను అధ్యయనం చేయలేదు.

ప్రశ్న 16: ఈ నవలని ప్రచురణ సంస్థ నిర్వహించిన పోటీ కోసం రాశారు. ఈ నవల బహుమతి పొందడంలో మీ కృషి ఫలించిందని అన్పించిందా? ఇది మీ ఎన్నో నవల?

జ: ఇది నా ముప్పయ్‌ మూడవ నవల. ఈ నవల అన్వీక్షికి పబ్లికేషన్స్‌ వారు నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందింది. నవలల మీద పఠనాసక్తి పెంచడం కోసం పోటీలు నిర్వహించి వివిధ జానర్లలో నవలలకు బహుమతులిచ్చి ప్రోత్సహించిన అన్వీక్షికి పబ్లికేషన్స్‌ వారి కృషి బహుధా ప్రశంసనీయం. ఈ నవల అట్ట చివర్లో పబ్లికేషన్స్‌ వాళ్ళు రాసిన వాక్యాల్ని ఇక్కడ ఉటంకించడం అవసరం.

“తెలుగు సాహిత్యం, సినిమా రంగం స్టువార్ట్‌పురం గురించి అవాస్తవాలను, కల్పిత కథలను ప్రచారం చేయడం ద్వారా తీవ్ర అన్యాయానికి పాల్పడ్డాయి. అయితే లోహముద్ర అనే ఈ నవల నిజానికి అద్దం పడుతుంది. ఇది స్టువార్ట్‌పురం చరిత్రను నిజాయితీగా చూపించిన విలువైన పుస్తకం. ఈ నవల స్టువార్ట్‌పురం స్థాపన నుంచి నేటివరకు జరిగిన పరిణామాలను వివరిస్తుంది. ఈ నవల చదివితే స్టువార్ట్‌పురం ప్రజలు ఎలా నేరస్థులనే ముద్ర నుండి బైటపడి, వివిధ రంగాలలో రాణించారో తెలుస్తుంది.”

నవలకో కథకో బహుమతి రావడం రచయిత కృషి ఫలించిందనడానికి కొలమానం కాదు. బహుమతి వచ్చిన నవలని ఎక్కువమంది చదివే అవకాశం ఉంది. బహుమతి వల్ల రచయితకు ఆ ప్రయోజనం ఒనగూడే అవకాశం ఉంది.

ప్రశ్న 17: భవిష్యత్తులో ఏ ఇతివృత్తాలతో నవలలు రాయాలనుకుంటున్నారు?

జ: రోహింగ్యాల ఇతివృత్తంతో ‘వూరులేనోళ్ళు’ అనే నవల రాశాను. ఆటిజం నేపథ్యంతో మరో నవల రాశాను. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని కథాంశంగా తీసుకుని నవల రాసే ఉద్దేశం ఉంది. ఐదారు సైన్స్‌ ఫిక్షన్‌ నవలికలు రాశాను. నవలలు రాయాలన్న ఉద్దేశం ఉంది.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సలీం గారు.

సలీం: మీకు కూడా ధన్యవాదాలు.

***

లోహముద్ర (నవల)
రచన: సలీం
ప్రచురణ: అన్వీక్షికి ప్రచురణలు
పేజీలు: 225
వెల: ₹ 250/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/Lohamudra-Novel-Saleem/dp/9395117486

 

 

 

~

‘లోహముద్ర’ నవల సమీక్ష:
https://sanchika.com/lohamudra-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here