కవయిత్రి శ్రీమతి అరుణ నారదభట్ల ప్రత్యేక ఇంటర్వ్యూ

0
12

[‘లోపలి ముసురు’ అనే కవితాసంపుటిని వెలువరించిన శ్రీమతి అరుణ నారదభట్ల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం అరుణ నారదభట్ల గారూ.

అరుణ నారదభట్ల: నమస్కారమండీ.

~

ప్రశ్న 1. ఈ కవితాసంపుటి ముందుమాటలో ఈ కవయిత్రి తాను ఫలానా భావధారకు చెందిన కవయిత్రి అని చెప్పే అవకాశం ఇవ్వదుఅన్నారు. ఈ మాటలను కాస్త వివరిస్తారా? అలాగే, కవయిత్రి ఏదో ఒక భావధారకు చెందటం తప్పనిసరి అంటారా?

జ: 360 డిగ్రీల వృత్తంలో అనంతమైన గీతలు ఎలాగైతే ఉంటాయో అలాగే కవిత్వం. ఎన్ని అంశాలు మనను ఎలా స్పృశిస్తాయో చెప్పలేం. అది కూడా ‘దృష్టిని బట్టే దృశ్యం’. ఏ వాతావరణంలో ఉంటామో ఎలా స్పందిస్తామో చెప్పడం కష్టమే ఐనా ఒకానొక మానసిక స్థాయిని దాటి వెళ్ళాక అంతశ్చేతన ఒక ప్రేక్షకపాత్రను వహిస్తుంది. గడిచిన జీవితపు అనుభవాలు అనుభూతులు కలిగించే ప్రేరణల వల్ల భావధార కవిత్వమై పలకరిస్తుంది. అందువల్లే కవిత్వం తటస్థ వైఖరిలో లీనమై ప్రవహిస్తుంది.

ఏదో ఒక భావధారకు అన్నది పూర్తిగా వ్యక్తిగతం అది వారివారి ఆసక్తి మాత్రమే! నాకు తెలిసి అలా ఉండాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మనసు స్పందించినపుడు వికసించిన కవిత్వం సంతృప్తినిస్తుంది.

ప్రశ్న 2. కవిత్వం ప్రధానంగా అనుభూతి ప్రధానం అంటారు. మీ కవిత్వంలో అనుభూతితో పాటూ నిత్యజీవితంలోని చేదు నిజాలూ కనిపిస్తున్నాయి. ఈ సమన్వయం ఎలా సాధించారు?

జ: జీవితం ఎంత అందమైనదో అంత పదునైనది కూడా. అన్ని రుచులనూ అన్ని పార్శ్వాలనూ తనలో ఇముడ్చుకుంటుంది హృదయం. మనం ఉన్నది విశాలమైన వాస్తవ సమాజంలో గనుక దానికి దగ్గరగా కవిత్వం స్పందిస్తుంది. నవ్వినా ఏడ్చినా కవిత్వమై చుట్టుకుంటుంది.

 

ప్రశ్న 3. ఈ సంపుటిలో మొదటి మూడు కవితలూ, ‘వద్దంటే వాన, ‘చెరువు మాట్లాడింది, ‘వాన వెలిశాకల ప్రేరణ ఒకటే అనిపిస్తుంది. ఈ కవితల నేపథ్యం ఏమిటి?

జ: మూడు కవితలు విభిన్న సందర్భాలలో రాసినవి, వేటికవే ప్రత్యేకం!

ఐనా వర్షం ఎప్పుడు కురిసినా కొత్తగానే ఉంటుంది కదా! పట్టణంలో కురిసే వాన పరిస్థితి వద్దంటే వాన! ఊర్లో ఎండిన చెరువు తరువాతి కాలంలో నీటితో నిండి కళకళలాడటం చూసిన సంతోషం మరోటి! వాన వెలిసాక వచ్చే సూర్యకాంతి, ప్రకృతిలోని మార్పులు, చుట్టూ వాతావరణంలోని మనుషుల్లోని నూతన ఉత్సాహం గురించి ఇంకోటి!

ప్రశ్న 4. ‘నీ చుట్టూ కవితలో అంతర్లీనంగా ఒక తాత్వికత కనిపిస్తుంది. ఆ తాత్వికతను వివరిస్తూ, కవిత్వం అంటే నినాదాలు, ఆవేషాల అరుపులు, తత్కాల తాత్కాలిక స్పందనలుగా మారిన తరుణంలో ఇలాంటి కవిత్వానికి ఆదరణ ఎలా వుంది?

జ: ఈ సృష్టి, ప్రకృతి మన చుట్టూ ఎలా స్పందిస్తూ ప్రభావితం చేస్తున్నాయన్న భావనలో రాసిన కవిత ఇది. ప్రకృతి చైతన్యం నిండి ఉంటుంది గనక ఆ చేతనత్వమే లోతైన భావాలనూ ఉనికినీ తెలియపరుస్తుంది. తాత్వికత ఆ అభిరుచి ఉన్నవారిని చేరుతుంది. ఆదరణ కూడా అలాగే ఉంటుంది.

ప్రశ్న 5. మీ కవితలు ఒకటొకటిగా చదువుతూంటే, ఒకవైపు ప్రగాఢమైన అనుభూతి, తాత్వికత, మరోవైపు, నిత్య జీవితంలోని చేదు, చిరాకులను ప్రదర్శించే కవితలు పక్కపక్కనే కనిపిస్తాయి. వీటిల్లో ఎలాంటి కవితలు రచించటం మీకు సంతృప్తినిస్తుంది?

జ: తాత్వికత వైపు మనసు మళ్ళిన తరువాత మిగిలిన విషయాలన్నీ చాలా సహజంగా చిన్నవిగా మామూలుగా అనిపిస్తాయి మనసు నొచ్చుకున్నప్నటికీ! కానీ అంతవరకూ జరిగిన కాలపు అనుభవాలు జ్ఞాపకాల తాలూకు గురుతులు అంత తేలిగ్గా తొలగిపోవు గనక జరుగుతున్న సంఘటనలు సందర్భాలలో ప్రేరణలు తప్పవు కాబట్టి సామాజిక సంఘటనలు విలువలు కోల్పోతున్న సందర్భాలు ఎదురౌతున్నప్పుడు కొంత చికాకులు వ్యతిరేక భావనలు కూడా తప్పవు. కవిత్వపు చివరి సారాంశం తాత్వికతే. నాకు తాత్వికత సౌందర్యం ఇష్టం!

ప్రశ్న 6. ఒక కవిత పేరు పాలపొరక. అంటే ఏమిటి? ఆ కవితకు ఆ పేరు ఎలా సరిపోతుంది?

జ: నా చిన్నప్పటి నుండి గమనించిన మా ఊరి సంసృతిని వాతావరణాన్నీ మా అమ్మమ్మ ఇంటి జ్ఞాపకాలలో రాసిన కవిత!

పాలపొరక అది అడవుల్లో పెరిగే చెట్టు పేరు! దాని విశేషమైన సుగంధం మనసుకు అహ్లాదాన్నిస్తుంది. పూర్వం నుండి మా ఊర్లో వివాహాలు ఉపనయనం వంటి శుభకార్యాలకు ఈ పాలపొరకను ప్రత్యేకంగా అడవి నుండి తెప్పించి వాకిళ్ళలో పందిళ్ళు వేయించేవారు దర్వాజకు ఇరు పక్కలా ఆ కొమ్మలను ఉంచేవారు దాని సువాసనతో ఇల్లంతా ఉత్సాహంగా పాజిటివ్ వాతావరణంగా భావన కలుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు వాడిన వస్తువులు వారి జీవితపు ఆనవాళ్ళు కూడా ఎప్పుడూ పండగల్లాంటివే మనసుకు. అందుకే వాళ్ళ మాటలు జ్ఞాపకాల గురుతుగా పాలపొరక అని పేరు కుదిరింది. చాలామట్టుకు కవితల పేర్లు వాటికవే ముందుకొస్తాయి. కవిత్వమూ అలాగే ప్రవహిస్తుంది.

ప్రశ్న 7. ట్రయల్ రూమ్ దేనికి ప్రతీక? ట్రయల్ రూమ్ అద్దాలని తుడిచేస్తే ఎలా వ్యక్తి తనకు తానుగా మిగులుతాడు?

జ: ప్రస్తుత కాలంలో అంతా ట్రయల్ రూమ్ లాంటి జీవితాలే. ఏది అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉండటం కష్టంతో కూడుకున్న పనిలాగే ఉంది. పూర్తిగా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. బంధాలు బాంధవ్యాలు అన్ని అవసరాల కోసం మాత్రమే అన్నట్టుగా ఉంటున్నాయి. అందుకని మనసును శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అలా ట్రైయల్ రూమ్‌ను మనసుకు ఒక ప్రతీకగా తీసుకున్నాను.

ప్రశ్న 8. ‘మీ కోర్కెల్లో నను బంధించకండి కవితలో ఒక రకమైన నిస్పృహ కనిపిస్తుంది. ఈ కవిత నేపథ్యం వివరిస్తారా?

జ: తల్లిదండ్రులు పిల్లలను సాకే విధానం, కార్పోరేట్ సంస్థల ప్రభావము, ఆ ఒత్తిడిని గురించి పిల్లల మనోవేదనను రాసాను.

ప్రశ్న 9. ‘ఈ శరీరాన్నో సమస్యలనో వికృతంగా వర్ణించాలన్న నిన్నుచూస్తే జాలే నాకు..పంక్తుల వెనుక దాగిన వేదననకు, ఆవేశానికి, కసికి కారణం ఏమిటి?

జ: కొన్ని కొన్ని సమకాలీన కవితలు రచనలు గమనించిన నేపథ్యంలో రాసిన కవిత అది!

ప్రశ్న 10. మీరు పద్య కవిత్వం కూడా రాస్తారు. వచన కవిత్వం, పద్య కవిత్వాలలో మీకు వ్యక్తిగతంగా ఎలాంటి కవిత్వం రాయటం ఇష్టం? ఎందుకు?

జ: భావాలు అక్షరాల్లో ఒదిగి పోవడం అంటూ మొదలయ్యాక ఏ ప్రక్రియ నైనా రాయగలమన్న నమ్మకం ఒకటి కలుగుతుంది.

ముఖ్యంగా ప్రథమంగా వచన కవిత్వమే నేను! అది నా ప్రమేయం లేకుండా ప్రేమగా ప్రవహిస్తూనే ఉంటుంది.

పద్యం తక్కువని కాదు. నేను నా మొదటి వచన కవితాసంపుటి అచ్చైన సంవత్సరం తరువాత పద్యరచన అనుకోకుండా ముందుకొచ్చింది. చిన్నప్పుడు నేర్చుకున్న ఛందస్సే ఐనా భావాలను ఛందస్సులో ఒదిగిపోయేలా భావధార కలగడం కూడా ఒక అదృష్టమే! అచ్చంగా గణితసూత్రాల్లో నిశ్శేషంగా భాగించబడ్డ లెక్క వెంటనే వస్తే ఎలా ఉంటుందో పద్యం రాస్తే కూడా అలాంటి ఆనందం వస్తుంది. అది ఒక లయాత్మకంగా సాగే ప్రక్రియ చాలా బాగుంటుంది. పాడటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే నాకు రెండూ ఇష్టమే!

ప్రశ్న11. ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో ఏదో ఒక గుంపుకు చెందకపోతే కవికి కానీ, రచయితకు కానీ, మనుగడలేదంటారు. మీ అనుభవం ఏమిటి?

జ: నేను ఏ గుంపుకూ చెందిలేను. అంతగా గుంపుల వెంట నడిస్తే మాత్రమే కవులుగా రచయితలుగా నిలబడతామన్న భ్రమా లేదు. ఎవరి దారి వారిది. నా అక్షరాలు స్వేచ్ఛగా నా హృదయము స్పందించినపుడు రాస్తుంటాను గనుక వాటి ఉనికిని అవే పదిల పరుచుకుంటాయి. ఐతే నా రచనలు పంచుకోవడానికి అవకాశమిచ్చిన ప్రతి వేదికకు నేను కృతజ్ఞతాపూర్వకంగానే ఉంటాను. అన్ని గుంపులూ ఏదో ఒక ఆశయం కోసం నడుస్తుంటాయి గనుక అన్ని గొప్పవే!

ప్రశ్న12. తెలుగులో వచన కవిత్వ విమర్శపై మీ ఆలోచనలేమిటి?

జ. ఇది మాత్రం కొంచం కష్టమైన ప్రశ్నే!

విమర్శ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్న పని! ఎంతో అధ్యయనం అవసరం. ఎదుటివారి రచనలు చదవడం ఒక కళ! ముఖ్యంగా కవులు రచయితలు విమర్శకులకైతే ఎంతో సహృదయత కావాలి! కవికి వారి కవిత్వ రచనను విశ్లేషించడం అంటే వారిని ఒక రకంగా చదువరులకు మరింత దగ్గర చేయడమే!

ప్రస్తుతం పరుగులు తీసే సోషల్ మీడియాల వంటి ప్రసార సాధనాల మాంత్రిక యాంత్రిక కాలంలో ఓపికగా చదవడంతో పాటు పుస్తకాన్ని సమీక్షించడమైనా, విమర్శ రాయడమైనా ఎంతో శ్రద్ధ ఓపిక అధ్యయనంతో కూడిన సహృదయత కావాలి!

కవులు వారు చూసిన అనుభవాలను అనుభూతులను రాస్తారు. కవి ఎక్కడ ఏ అంశాన్ని గురించి రాస్తున్నారన్న విషయంలో కవితో పాటుగా విమర్శకులు కూడా అ సహానుభూతిని పొందగలిగి ఆ కవితావాక్యాల్లోని సాహిత్య సామాజిక ప్రయోజనాలను గుర్తించి చెప్పగలిగాలి. అటువంటి విమర్శకులు అరుదుగా ఉన్నారు.

ప్రశ్న13. ఈ పుస్తక ప్రచురణలో మీ అనుభవాలు పాఠకులతో పంచుకుంటారా?

జ: 2013 సగం గడిచాక అనుకోకుండా కవిత్వం రాయడం మొదలై 2016లో తెలుగు యూనివర్శిటీ ఆర్థిక నహకారంతో ‘ఇన్నాళ్ళమౌనం తరువాత’ నా మొదటి కవితాసంపుటి ప్రచురణ ఐంది 2017 మార్చిలో ఆవిష్కరించాము. ఈ రెండవ కవితాసంపుటి కూడా తెలుగు యూనివర్సిటీ వారి ఆర్థిక సహాయంతో 2022లో అచ్చువేయడం జరిగింది కానీ ఆవిష్కరణ దాదాపుగా మరో రెండేళ్ళకుగానీ 2024 ఫిబ్రవరిలో కుదిరింది.

కవిత్వం అలవోకగా రాసేయొచ్చు గానీ అచ్చువేయడానికి ఎన్నో పరిస్థితులు అనుకూలించాలి.

నా కవిత్వ రచన, పుస్తకాలకు పేర్లు నా కవిత్వానికి తగినట్టుగా కవర్ పేజీ మట్టుకే నేను.

ప్రచురణ విషయంలో ఏ ఫాంట్ ఎలా ఉండాలనేది, అచ్చుతప్పుల వంటి సవరణలు పుస్తకావిష్కకరణ అంతా నా భర్త నారాయణ శర్మ పూర్తి సహకారమే! అందుకు ఎంతో కృతజ్ఞతలు మా శర్మకు!

ప్రశ్న14. మీ భవిష్యత్తు ప్రణాళిక లేమిటి?

జ: ‘నా అమర్నాథ్ యాత్ర’ కథనం అచ్చు వేయడానికి సిద్ధంగా ఉంది.

ఎనిమిదేళ్ళుగా రాసిన కవితల్లో మరిన్ని కవితలతో మరో వచన కవిత్వ సంపుటి కూడా రాబోతుంది.

‘మా ఉత్తర భారతదేశ విహారయాత్ర కులూమనాలి’ కూడా ముగింపులో ఉంది.

పద్య కవిత్వం చాలా ఉంది. అచ్చు వేయాలి.

భవిష్యత్తులో తప్పకుండా ఒకటిరెండైనా దీర్ఘకవితలు రాస్తాను. కథలు, సినిమా పాటలు రాయాలని ఆసక్తి.

సాధ్యమైనంత వరకు మానవ సంబంధాలు మెరుగుపడే రచనలు (సెల్ఫ్ రియలైజేషన్), ప్రకృతిని గురించిన రచనలు చేయడం!

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు అరుణ నారదభట్ల గారూ.

అరుణ నారదభట్ల: ధన్యవాదాలు. నమస్కారం.

***

లోపలి ముసురు (కవిత్వం)
అరుణ నారదభట్ల
పేజీలు: 160
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు
~
అరుణ నారదభట్ల
9705015207

 

 

 

~

‘లోపలి ముసురు’ కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/lopali-musuru-book-review/

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here