ప్రముఖ కథా, నవలా రచయిత్రి శ్రీమతి జి.ఎస్. లక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ

8
13

[ఇటీవల ‘అన్ని రూపాలూ రూపాయే..’ అనే కథా సంపుటిని వెలువరించిన శ్రీమతి జి.ఎస్. లక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం జి.ఎస్. లక్ష్మి గారూ.

జి.ఎస్. లక్ష్మి: నమస్కారమండీ..

~

ప్రశ్న 1: మీ తాజా కథా సంపుటి అన్ని రూపాలూ రూపాయే..లో అధిక శాతం కుటుంబ కథలే ఉన్నాయి. తెలుగువారి ఆచార వ్యవహారాలను కథల్లో ప్రస్తావిస్తూ బంధాలకి ప్రాధాన్యతనిస్తూ రచనలు చేయడం సమాజానికి మేలు చేస్తుందని మీరు భావిస్తున్నారా?

జ: తప్పకుండా భావిస్తున్నానండీ.. ఒక సమాజం నేర రహితమై, ఆదర్శప్రాయమైన సమాజంగా ఉండాలంటే ఆ సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థ ఆదర్శవంత మయినదై ఉండాలి. ఒకే కుటుంబ సభ్యుల మధ్యనే సర్దుబాట్లు లేకుండా స్వార్థం పెరిగితే, ఆ ప్రభావం సమాజం మీద కూడా పడుతుంది. అందుకే నేను నా కథల్లో కుటుంబంలో బంధాలకే ప్రాధాన్యత నిస్తాను.

ప్రశ్న 2: మీరు కథా రచనలో దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ఇతివృత్తానికా? శైలీ శిల్పానికా? కథనానికా? ఆలోచనలకా?

జ: ముందుగా ఇతివృత్తానికే ప్రాధాన్యత నిస్తానండీ. ఇతివృత్తాన్ని బట్టే కథనం నడుస్తుంది. అప్పుడే కథనానికి తగ్గ శైలీ, శిల్పం జోడవుతాయి. ఆలోచనలనేవి ఎప్పుడూ ఉండేవే. వాటిని ఒక క్రమంలో పెట్టి వ్రాస్తేనే చదవదగ్గ కథ అవుతుందని నా అభిప్రాయం.

ప్రశ్న 3: కళ్ళల్లో ప్రాణాలుకథ కల్పితమా లేక రామం లాంటి వ్యక్తిని దగ్గర నుంచి గమనించి అల్లిన కథనా?

జ: నేను సినిమాలు చూస్తున్నప్పుడల్లా అందులో చిన్నపిల్లల పాత్రలు వచ్చినప్పుడు నాకు మనసెందుకో పట్టేసినట్టుండేది. ముఖ్యంగా మరీ నెలల పిల్లల్ని అంతటి ఫ్లడ్ లైట్ల మధ్య షూటింగ్‌కి తీసుకొచ్చారంటే దానికి కారణం ఏమిటా అని ఆలోచించేదాన్ని. సాధారణంగా ఏ మనిషినీ నాకు తప్పు పట్టాలనిపించదు. మరీ ఏదైనా మానసిక రుగ్మత ఉంటే తప్ప సహజంగా ఏ మనిషి దుర్మార్గుడవడు. ఒక మనిషి ఎదుర్కోవలసిన పరిస్థితులు అతనిని ఏ పనైనా చేయడానికి ప్రేరేపిస్తాయి. ఏదో బలమైన కారణం లేనిదే అంత నెలల పిల్లల్ని సినిమాల్లో నటించడానికి తీసుకురారు.

శ్రీ వాకాటి పాండురంగారావుగారి స్మారక కథలపోటీలో ప్రథమ బహుమతి

ఈ విషయం పైనే అలా చిన్నపిల్లల మీద కథ వ్రాయాలనుకున్నాను. కానీ ఇప్పటికే అది కొన్ని కథల్లో వచ్చింది. పిల్లల్ని కాకుండా ఇంకెవరిని తప్పనిసరి పరిస్థితులలో ఇలా నటించడానికి తీసుకొస్తారా అని ఆలోచించినప్పుడు పిల్లల మీదే ఆధారపడి బతుకుతున్న వృధ్ధులైన వారి తల్లితండ్రులు గుర్తొచ్చారు.

కారణాలేమైతేనేం ఈ మధ్య తల్లితండ్రులను వృధ్ధాశ్రమాల్లో చేర్చడం ఎక్కువైందని గణాంకాలు చెపుతున్నాయి. అందుకని అటువంటి వృధ్ధాశ్రమంలో ఉన్న తల్లిని ఒక పాత్రగా తీసుకున్నాను. నిజానికి తల్లిని అలా తీసుకురావడానికి రామం మనసొప్పుకోదు. కానీ తప్పనిసరి పరిస్థితులలో పురిటికి వచ్చిన కూతురి కోసం తన దగ్గర కానీ లేకపోవడం అతనిని ఆ సమయంలో నోరెత్తనివ్వకుండా చేసాయి. అంతే.. కథలో తర్వాతి సంఘటనలన్నీ వరసగా జరిగిపోయాయి. రామం పాత్ర నేను కల్పించిన పాత్రే. వార్తల్లో వినడం తప్పితే అటువంటి వారు నాకు ఇప్పటివరకూ తారసపడలేదు.

ప్రశ్న 4: అన్ని రూపాలూ రూపాయే..కథలో మధ్యతరగతి మనుషుల్లో పాత తరంవాళ్ళు విలువలని నమ్ముకుంటే, ఆధునిక తరం సొంత బాగు కోసం విలువలను పాతరేయడం కనిపిస్తుంది. ఎర్రబస్సూ – ఎయిర్‍బస్సూకథలో పెద్దలే తోటివారిని హేళన చేస్తే, చిన్నవాడైన రవీంద్ర హుందాగా ప్రవర్తించి, వాళ్ళ లోపాన్ని చెప్తాడు. ఇలా భిన్న మనస్తత్వాలను కథలలో ఎలా బాలెన్స్ చేయగలిగారు? ఏ కథలోనైనా చెప్పదలిచిన అంశాన్ని విస్పష్టంగా చెప్పడంలో, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా?

జ: మనుషుల్లో ఏ మనిషికి ఆ మనిషే ప్రత్యేక మయినట్లే కథలలో కూడా ఏ పాత్రకి ఆ పాత్రే ప్రత్యేకం. ఆ పాత్రని దృష్టిలో ఉంచుకుని వ్రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయవలసొస్తుంది. అప్పుడు కానీ ఆ పాత్ర మనసులో భావం కథలో పలకదు. ఇలా భిన్న మనస్తత్వాలను బాలెన్స్ చేయడానికి నాకెప్పుడూ ఇబ్బంది కలగలేదు.

అందుకే ‘అన్ని రూపాలూ రూపాయే’ పాత్రల మధ్య అంత అంతరం కనిపిస్తుంది.

అలాగే ‘ఎర్రబస్సూ – ఎయిర్ బస్సూ’ కథ కూడా. కొంతమంది వయసులో పెద్దవారికి అన్నీ తమకే తెలుసునన్న అహంభావం ఉంటుంది. అటువంటి వ్యక్తే ఈ కథలో దశరథ్. ఆ అహంభావంతోనే వరదరావు దంపతులని హేళన చేస్తాడు.

తెలుగు యూనివర్సిటీ మాతృవందన పురస్కార ప్రదానం

మేము 2000 సంవత్సరం నుండీ 2019 వరకూ అమెరికా ఎనిమిదిసార్లు వెళ్ళివచ్చాము. మొదటిసారి వెళ్ళినప్పటి అనుభవం ఎవరికైనా ఎప్పుడూ ప్రత్యేకమైనదిగానే ఉంటుంది. తర్వాత వాళ్ళే మరికొందరికి సలహాలిచ్చే స్థాయికి కూడా వస్తారు. ఇరవై సంవత్సరాల క్రితం కన్న ప్రయాణీకుల సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. దానితోపాటే రకరకాల అనుభవాలూ కలిగాయి. అలా ఒక సందర్భంలో ఈ దశరథ్ లాంటి వ్యక్తిని చూసాను. అలా ఎదుటి మనిషిని చిన్నబుచ్చడం నాకెందుకో నచ్చలేదు. ఆ మనిషికి ఏమి చెపితే బాగుంటుందా అని ఆలోచిస్తే మనిషికి వయసుతో పరిపూర్ణత (maturity) రాదు, అతని వ్యక్తిత్వం వల్ల వస్తుంది అని చెప్పాలనిపించి రవీంద్ర పాత్రను సృష్టించాను.

ప్రశ్న 5: అనుబంధాలుకథ దిగువ మధ్యతరగతి మనుషుల్లోని నిస్సహాయతలకి అద్దం పడుతుంది. కథ చదువుతున్నంత సేపు ఒక రకమైన ఉద్విగ్నత కలుగుతుంది. ఈ కథ రాసినప్పుడు మీలో కలిగిన భావాలేవి?

జ: ఈ ‘అనుబంధాలు’ కథ వ్రాస్తున్నప్పుడు నా మనసు కూడా చాలా ఉద్విగ్నతకు లోనయిందండీ. ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి కొట్టాడని ఇంట్లోంచి పారిపోయినవాళ్ళు నాకు తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇళ్ళల్లో జరిగిన మార్పులు గమనించిన నాకు పరిస్థితులు మనిషి మనసుని ఎలా నలిపేస్తాయో చెప్పాలనిపించి ఈ కథ వ్రాసాను.

‘అతను – ఆమె – కాలం’ కథాసంపుటికి గోవిందరాజు సీతాదేవి అవార్డ్.

ప్రశ్న 6: ఈ సంపుటిలోని కథల్లో మీ మనసుకు బాగా దగ్గరగా ఉన్న కథ ఏది?

జ: నా మనసుకి నచ్చిన భావాలనే నేను కథలుగా మలిచానండీ. నా కథలన్నీ నాకు ఇష్టమే.

ప్రశ్న 7: ఏ కథ రాయటానికి మీరు ఎక్కువగా శ్రమించారు?

జ: ‘అనుబంధాలు’ కథ వ్రాయడానికి కాస్త శ్రమ పడవలసి వచ్చింది. చిన్నప్పుడు ఆ పిల్లాడు దెబ్బలు తింటున్నప్పుడు ఆ తల్లి నిస్సహాయత, ఆ కుర్రాడి పసితనం, ఉక్రోషం, కొడుకుని క్రమశిక్షణలో పెట్టాలన్న ఆ తండ్రి కరకుదనం లాంటివన్నీ సన్నివేశంలో చూపించడానికి కాస్త కష్టపడ్డాను. అన్నేళ్ళ తర్వాత గూటికి చేరిన ఆ పక్షి ఆ గూడే వదిలేయవలసి రావడానికి గల కారణం బలంగా ఉండాలని పరమశివం పాత్రని కఠినమైనవాడిగా చిత్రీకరించాను. చిన్నారి తమ్ముడిని గుర్తుపట్టి కూడా నోరు విప్పి తమ్ముడిని పిలవలేకపోయింది వరలక్ష్మి. రక్తసంబంధం కన్న కన్నతల్లిగా ఆమె బాధ్యత ఆమెని నోరెత్తనివ్వలేదు. ఇవన్నీ కథ చదివే పాఠకుని కళ్ళముందుకి తేవడం చాలా కష్టమయింది.

భీమన్న సాహితీనిధి సంస్థ ద్వారా శ్రీమతి కొత్తూరి వెంకటలక్ష్మి, శ్రీ కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు పురస్కార ప్రదానం

ప్రశ్న 8: ఏదయినా కథ ఇంకా బాగా రాసి ఉండాల్సింది అనిపించిందా? కొంచెం నిడివి పెంచితే చెప్పాల్సింది ఇంకా బాగా చెప్పి ఉండవచ్చనిపించిందా?

జ: అలాంటిదేమీ లేదండీ.. నేను కథను ఒకటికి పదిసార్లు చదువుకుని, సంతృప్తి చెందాకే పరిశీలనకు పంపుతాను.

ప్రశ్న 9: ఈ సంపుటిలోని చాలా కథలకు బహుమతులు వచ్చాయి. ఆయా కథల్లోని పాత్రల ఆశావహ దృక్పథం, అమితమైన ఆత్మవిశ్వాసం, సమస్యలు ఎదురైనా క్రుంగిపోకుండా నిలవడం వంటి లక్షణాలు – ఆయా కథలకి బహుమతి రావడానికి దోహదం చేసి ఉంటాయాని అనిపిస్తుంది. మీరేమంటారు? మీ కథలకి బహుమతులు రావడానికి మీ దృష్టిలో వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా?

జ: మీరు చెప్పినవి కూడా కొంతవరకూ బహుమతులు రావడానికి కారణాలు అయివుండవచ్చు. నాకు సంబంధించినంతవరకు నా మనసుకి నచ్చినది అనిపించినది వ్రాసి పంపడమే. బహుమతి వచ్చినా, సాధారణ ప్రచురణకు అంగీకరించినా సంతోషంగానే ఉంటుంది. నా భావాలను పదిమందితో పంచుకుంటున్నాననే ఆనందం నాకెప్పుడూ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ వారు ఎన్నుకున్న ఉత్తమకథ పురస్కార ప్రదానం

ప్రశ్న 10: ఈ పుస్తకానికి తాను రాసిన ముందుమాటలో శ్రీ శంకగిరి నారాయణస్వామి గారు – “కొన్ని కథల్లో రచయిత్రి ప్రకటించిన భావాలు, ఎత్తి చూపిన విలువలు నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించాయి. ఇంకా భారతీయ సమాజంలో ఇటువంటి భావాలకి, ప్రవర్తనకీ స్థానం ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను” అని అన్నారు. అయితే మీ కథల్లోని కొన్ని పాత్రలు విస్మరించినా, చాలా పాత్రలు తాము నమ్మిన విలువలను పాటించడానికే ప్రయత్నిస్తాయి. ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటి?

జ: శ్రీ శంకగిరి నారాయణస్వామిగారు మంచి విశ్లేషకులు. నేను బ్లాగులు వ్రాస్తున్నప్పటినుండీ వారు నాకు పరిచయం. గత కొన్ని దశాబ్దాలుగా వారు అమెరికాలో ఉంటున్నారు. మన సంస్కృతీ సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూనే అక్కడి సంస్కృతిని కూడా గౌరవిస్తున్నారు. మన దేశంలో కూడా గత రెండుమూడు దశాబ్దాలుగా కుటుంబ జీవనంలో చాలా మార్పు వచ్చింది. కానీ ఎంత చెప్పినా కూడా ఇంకా అక్కడక్కడ పురుషాధిక్యత అనేది పూర్తిగా పోలేదు. దానినే నేను వ్రాసిన కథలు కొన్నింటిలో ప్రస్తావించాను. నిజమే.. వారన్నట్లు ఇంకా భారతీయ సమాజంలో ఇటువంటి భావాలకి, ప్రవర్తనకీ స్థానం ఉందనిపించే ఆ కథలు వ్రాసాను. అవి ఈ సమాజంలో లేనినాడు ఎంతో సంతోషిస్తాను. ఈ విషయంలో నారాయణస్వామిగారి మాటని నేను గౌరవిస్తాను.

ప్రశ్న 11: కథా, నవలా రచయిత్రిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

జ: ప్రత్యేకంగా ప్రణాళికలంటూ ఏమీ లేవండీ. మనసు కదిలినప్పుడు ఆ భావాలను కథలుగా వ్రాసుకోవడం. దానిని నలుగురితో పంచుకోవడం. అంతే..

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారూ.

జి.ఎస్. లక్ష్మి: నా కొత్త పుస్తకాన్ని ఇంత అందంగా ఇంటర్వ్యూ చేసినట్లు పరిచయం చేసిన సంచిక టీమ్‌కు నేనే ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండీ. నమస్కారం.

***

అన్ని రూపాలూ రూపాయే.. (కథల సంపుటి)
రచయిత్రి: జి.యస్. లక్ష్మి
పేజీలు: 148
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత్రి, 2-2-23/7/1,
బాగ్ అంబర్‌పేట,
హైదరాబాదు, 500013
ఫోన్: 9908648068.

~

‘అన్ని రూపాలూ రూపాయే..’ కథాసంపుటిపై సమీక్ష:
https://sanchika.com/anni-roopaalu-roopaaye-book-review-mk/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here