రచయిత్రి శ్రీమతి పి. జ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ

7
8

[‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’ అనే పుస్తకం రచించిన శ్రీమతి పి. జ్యోతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం పి. జ్యోతి గారూ.

పి. జ్యోతి: నమస్కారమండీ.

~

ప్రశ్న 1. గురు దత్ గురించి పుస్తకం రాయాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకని అనిపించింది?

జ: నేను సినిమాల గురించి సమీక్షలు చేస్తున్న రోజు నించి నాకు గురు దత్ మీద విపులంగా రాయాలనే కోరిక ఉండేది. అసలు సినీ సమీక్షలు నేను రాయడం మొదలు పెట్టిందే ‘ప్యాసా’ గురించి ఎప్పటికైనా నాకున్న ప్రేమను ప్రకటించుకోవాలన్న కోరికతో. గురు దత్ సినిమాలను ఎన్నో సార్లు చూస్తూ ఆ సినిమాలకీ, గురు దత్ వ్యక్తిత్వానికి పెద్దగా తేడా లేదేమో అనిపించేది. దానితో గురు దత్ సినిమాలలో ఆయనను వెతుక్కోవడం మొదలుపెట్టాను. చాలా మంది టీనేజ్‌లో ఒక హీరో ఫిగర్‌ను పెట్టుకుంటారు కదా. నేను మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ గురు దత్ తోనే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఫీల్ అవుతాను. ఆయన సినిమాలన్నీ ఏడుపు సినిమాలు అని ఎవరన్నా అంటే ఉక్రోషంతో వారిపై విరుచుకు  పడే దాన్ని. అది తొంభైలలో నాతో తిరిగిన స్నేహితులందరికీ తెలుసు. కొందరయితే దిలీప్ కుమార్‌పై నా మొదటి పుస్తకం వచ్చాక, అదేంటీ నువ్వు రాయాల్సింది గురు దత్ పుస్తకం కదా అని అప్పుడే అన్నారు. నా స్నేహబృందం గురు దత్ సినిమా కానీ పాట కానీ వస్తుంటే ఇప్పటికీ నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పడమో,  రికార్డ్ చేసి ఆ పాట పంపడమో చేస్తూ ఉంటారు. అంత ఇష్టం ఉన్నా గురు దత్ గురించి నేను రాయడానికి చాలా సమయం తీసుకున్నాను. మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వారి గురించి రాయడం కష్టం. పాఠకులకు మన ఎమోషన్స్ కన్విన్సింగ్‌గా చెప్పడం ఇంకా కష్టం. దానికి సంయమనం కావాలి. నేను మామూలుగానే కొంచెం ఎక్కువ ఎమోషనల్‌గా రియాక్ట్ అయే స్వభావం ఉన్న వ్యక్తిని. అందుకని గురు దత్‌ని సంయమనంతో అక్షరాలలో నింపడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది.

ప్రశ్న 2. గురు దత్ గురించి, అతని సినిమాల గురించి ఇంత సమగ్రమైన సమాచారం ఇస్తూ, వ్యక్తిగతంగానూ, సినిమా పరంగానూ ఇంత విశ్లేషణాత్మకమయిన పుస్తకం ఏ భాషలోనూ లేదు. ఈ పుస్తకం రచించేందుకు మీరు విషయ సేకరణ ఎలా చేశారు? ఈ విషయంలో మీకు సహాయపడిన వారెవరు? మీ అనుభవాలను వివరిస్తారా?

జ: నా పన్నెండేళ్ళ వయసు నుండి, అంటే నేను ఆరో తరగతిలో ఉండగా దూరదర్శన్‌లో ఓ శనివారం పక్క ఇంటి టీ.వీ.లో ‘ప్యాసా’ చూసినప్పటి నుండి నా మనసు గురు దత్‌కు సంబంధించిన ప్రతి వాక్యాన్ని ఏ పత్రికలో వచ్చినా, పుస్తకంలో వచ్చినా రికార్డ్ చేస్తూనే ఉంది. ఇతర భాషా పుస్తకాల కన్నా ఇది బాగా వచ్చింది అని చెప్పడం మీరు నాకిస్తున్న ప్రోత్సాహంగా భావిస్తాను. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. అప్పట్లో నాకు నచ్చిన వార్తలను పేపర్లో నుండి మేగజీన్ల నుండి చింపి భద్రపరుచుకునేదాన్ని. అలా గురు దత్‌కి సంబంధించి ఓ డైరీ నా దగ్గర ఉండేది. ఆ పేపర్ కటింగ్‌లన్నీ నేను ఒక ఇంటి నుండి మరో యింటికి మారే క్రమంలో పోయినై. కాని అలా సేకరించిన సమాచారాన్ని నేను వందల సార్లు చదవడం వల్ల అవి నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. తరువాత గురు దత్‌పై వచ్చిన ప్రతి పుస్తకాన్ని సేకరించాను. ఆ పుస్తకాలన్నీ నా పర్సనల్ లైబ్రరీలో ఇప్పటికీ ఉన్నాయి. వాటిని ఒకసారి కాదు ఎన్నో సార్లు చదివాను. కాని వీటన్నిటికన్నా గురు దత్ సినిమాలను ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ చూడడం నాకు ఎన్నేళ్ళుగానో ఉన్న వ్యసనం. అందుకే ఆ సినిమాలలోని ఒక్కో సీన్‌లో ఎన్నో కోణాలను నేను చూడగలగడం సాధ్యపడింది. నాకు ఇప్పటికీ ఆ సినిమాలను చూస్తున్నప్పుడు మరో కొత్త కోణం కనిపిస్తుంది. మారుతున్న నా జీవన పరిస్థితులు, నా ఆలోచనా పరిధి, ఇవన్నీ కూడా గురు దత్ సినిమాలలో విభిన్నమైన కోణాలను నేను చూడడానికి సహాయపడ్డాయి. నా ముప్పైవ ఏట నేను ఈ పుస్తకం రాసి ఉంటే అది ఇలా ఖఛితంగా వచ్చి ఉండేది కాదు. అప్పట్లో రాసి ఉంటే ఈ పుస్తకంలోలా నిష్పక్షపాత వైఖరితో నేను రాయగలిగే దాని కాదు. నా జీవితంలోని ఘర్షణ కూడా నేను గురు దత్‌ని అధ్యయనం చేయడానికి సహాయపడింది. అన్ని విషాదాల నుండి లేచి నిలబడిన తరువాత గురు దత్ లోని బలహీన కోణం కూడా నాకు అర్థం అయింది. అది ఒప్పుకోవడానికి నాకే చాలా సమయం పట్టింది. గురు దత్‌ని ఇతర రచయితలు చూసిన దృష్టి కోణం కన్నా నాది భిన్నంగా ఉండడానికి కారణం నా జీవితంలో నేను ఎదుర్కొన్న విషాదం కూడా. ఇవన్నీ ఈ పుస్తక రచనలో నాకు సహాయపడ్డాయి. వెనుక నేను రిఫర్ చేసిన ఓ ఇరవై పుస్తకాల లిస్ట్ ఇచ్చాను. కాని వాటన్నిటికన్నా నా జీవితపు అనుభవాలే ఈ పుస్తక రచనలో ప్రధాన వనరులు అన్నది నిజం.

అయితే అవన్నీ పుస్తక రూపంలో రావడానికి నెను ఒక పద్ధతి పాటించాను. ముందు గురు దత్ సినిమాలన్నిటినీ మూడు సార్లు వరుస క్రమంలో చూసాను. చూస్తున్న ప్రతి సారి నోట్స్ రాసుకున్నాను. మొదటిసారి ప్రేక్షకురాలిగా చూసి ఆ సినిమా కలిగించే ఆలోచనలను నోట్స్‌గా రాసుకున్నాను. అంటే అది ప్రేక్షకుడికి ఎలా అర్థం అవుతుంది అన్నది స్పష్టం అవుతుంది. మరోసారి సంభాషణల కోసం, మూడోసారి నేపథ్య సంగీతం, ఫోటొగ్రపీ చిత్రీకరణ కోసం. అలా విడి విడిగా చూసినప్పుడు నాకు ఇంతకు ముందు కనిపించని విషయాలు కూడా నోట్ చేసుకోగలిగాను. ఉదాహరణకు ‘ప్యాసా’లో ‘జానె వో కైసె లోగ్ థె జిన్కే’, అన్న పాటలో ఒక్క మూడు సెకండ్లు కనిపించే బట్లర్. అదే సినిమాలో మార్కెట్లో తల్లి కనిపించినప్పుడు ఆ ఒక్క సీన్‌లో ఆమెతో పాటు ఉండే విజయ్ అన్న కొడుకు అక్కడ ఉండవలసిన అవసరం, వేశ్యా వాటికలో గులాబో తో నటి కుంకుం సంభాషణలతో వేశ్యావాడలోని స్త్రీల జీవితాలను చూపించిన పద్ధతి, టున్ టున్ పాత్ర క్లాస్ రూం ఎంట్రీలో బెంచి జరపడం తిరిగి పెట్టేయడం. ఇవన్ని సూక్ష్మంగా చూసి నోట్ చేసుకోవడానికి ఇలా మూడు భాగాలుగా చూసి రాయడం నాకు సమగ్రంగా సినిమాను విశ్లేషించడానికి ఉపయోగపడింది. పుస్తకాల సేకరణ ఒక రోజుతో జరగలేదు. ఏదీ స్నేహితుల దగ్గర తీసుకున్న పుస్తకం కాదు. అన్నీ నేను కొని చదివేటప్పుడు అండర్‌లైన్లు చేసుకుంటూ వాటికి ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవడం జరిగింది. గురు దత్ కుటుంబీకుల ఇంటర్వ్యూలలో నేను ఆయన కుమారుడు అరుణ్ దత్, చెల్లెలు లలితా లాజ్మిల ఇంటర్వ్యూలనే ప్రామాణికంగా తీసుకున్నాను. నస్రీన్ మున్నీ కబీర్ డాక్యుమెంటరీ నా దగ్గర ఉంది. ఇది పుస్తకం కన్నా ఎక్కువ సమాచారాన్నిఇచ్చింది.

ఇక సైలాబ్ సినిమా కోసం నేను చేయని ప్రయత్నం లేదు. అది లభ్యం అవట్లేదని అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూ ఒకటి చదివే దాకా వెతుకుతూనే ఉన్నాను. ఆ సినిమా గురించి ఇతర పుస్తకాలలో ఉన్న సమాచారం ఆధారంగానే నోట్స్ రాసుకున్నాను. అది నాకిప్పటికీ వెలితిగా ఉంది. గీతా దత్ మీద వచ్చిన ఒకే ఒక పుస్తకం, హేమంతీ బెనర్జీ గారు రాసింది మార్కెట్‌లో లేదు. అంతా వెతికి చివరకు హేమంతి బెనర్జీ గారి ఫోన్ నెంబర్ ఒక స్నేహితురాలి దగ్గర సంపాదించి ఆమెను స్వయంగా కంటాక్ట్ చేస్తే ఆవిడ నా ప్రయత్నం గురించి విని వెంటనే తన దగ్గర ఉన్న పర్సనల్ కాపీ కొరియర్ ద్వారా పంపించారు. అది నాకు గీతా దత్ గురించి అప్పటి దాకా తెలియని ఎంతో సమాచారాన్నిఅందించింది. ఈ పుస్తకానికి ఓ అర్థాన్ని తీసుకువచ్చింది.

గురు దత్ పాటల చిత్రీకరణ కోసం ప్రతి సినిమాలో పాటను మ్యూట్ చేసి సైలెంట్ మోడ్ లో అన్నీ విడిగా చూసాను. అప్పుడు ఆ పాట చిత్రీకరణ బలం నాకు ఇంకా అర్థం అయింది. గురు దత్ శరీర భాషలో సహ నటులతో చేసిన పాటల్లో వచ్చిన తేడాను ఇలా మ్యూట్ చేసిన పాటలను చూస్తే నాకు కొన్ని విషయాలు అర్థం అయ్యాయి. అవన్నీ పాటల విశ్లేషణకు ఉపయోగించుకున్నాను.

ఇక సాహిర్ రాసిన ఉర్దూకి అనువాదం అవసరం. అంతకు ముందు దిలీప్ కుమార్ పుస్తకంలో నేను ఏ పాటను తెలుగీకరించలేదు. అలా చేస్తే ఇంకా బావుండేది అని యెస్.వీ. రామారావు గారి లాంటి సీనియర్ సినీ విశ్లేషకులు చెప్పినప్పుడు గురు దత్ పుస్తకంలో పాటల అనువాదాన్ని పెట్టుకున్నాను. అది చాలా కష్టమైన పని. దానికి నాకు మరొకరి సహాయం అవసరం. ఒక మూడు నాలుగు సార్లు అనువాదాన్ని బిగ్గరగా చదివి సరి చూసుకోవడం తప్పదు. ఉర్దూ పదాలకు అలాంటి తెలుగు పదాలను వెతకడం కష్టం. అప్పుడు భావానువాదం తప్పదు. దీనికి నేను కొంచెం భయపడ్డాను. ముఖ్యంగా కైఫీ ఆజ్మీ కవిత విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని ఉర్దూ పదాల అల్లిక విషయంలో అనుభవం ఉన్న సూర్యనారాయణ కోట గారి సహాయం తీసుకున్నాను. చాలా చర్చించి అనువాదం చేసాం. పదాలను యథాతథంగా అనువదంచే పద్ధతిలో కాకుండా భావం ప్రధానంగా అనువాదం ఉండేలా ఆయన నాకు ఎంతో సహాయం చేసారు.

‘మల్లెపూవు’ తో ‘ప్యాసా’ సినిమాను పోల్చేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాను. విశ్లేషణలో ఎక్కడా లాజిక్ మిస్ అవకుండా ఉండడానికి కష్టపడ్డాను. ఇక ‘కాగజ్ కే ఫూల్’ సినిమాకి రాసేటప్పుడు విషాదం, తీవ్ర విషాదం అనే విషయాలపై కొన్ని వ్యాసాలను చదివాను. ఆ సినిమాకు నేను రాసిన విశ్లేషణ నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అది నా ఇతర సినీ విశ్లేషణాలన్నిటికన్నా చాలా బాగా వచ్చిందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

‘సాహెబ్ బీబీ ఔర్ గులాం’ సినిమాకు హిందీలో వచ్చిన మూల నవలను చదివి అందులో గురు దత్ తీసుకున్న భాగాన్ని వదిలేసిన కథా భాగాన్నీ బేరీజు వెసుకుని నోట్స్ రాసుకున్నాను. ఈ మూడు సినిమాల ఒరిజినల్ స్క్రీన్ ప్లే నాకు నోట్స్ రాసుకునే విషయంలో సంభాషణలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడ్డాయి.

ఈ పుస్తకానికి సరయిన పేరు కోసం కనీసం ఓ వంద ఆప్షన్స్ పెట్టుకుని ఉంటాను. ఆ సమయంలో భువనచంద్ర గారు నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది ‘ఓ వెన్నెల ఎడారి’ ఆయన ఇచ్చిన టాగ్ లైన్. ఈ పుస్తకం రాస్తున్నప్ప్పుడు భువన చంద్ర గారితో గురు దత్ ప్రేమికునిగా జరిపిన సంభాషణ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. పైగా నేను రాసిన ముందు మాటలో ఉన్నది అంతా నా స్వీయానుభవం. అంత పర్సనల్ ముందు మాట నేను ఓ పాఠకురాలిగా ఇప్పటిదాకా చదవలేదు. కాని అది అలాగే రావాలని నా పట్టుదల. ముందుగా దాన్ని చదివి అది అలా ఉండడమే న్యాయం అని దాన్ని అలాగే పబ్లిష్ చేయమని నన్ను ప్రోత్సహించారు భువన చంద్ర గారు.

గురు దత్ తరువాతి తరం అంటే అరుణ్ దత్ పిల్లలు, కూతురు నీనా, అల్లుడు నౌషాద్ మెమోన్, వారి పిల్లలు అందరినీ ఇన్‌స్టగ్రాం, ఫేస్‌బుక్‌లో పట్టుకున్నాను. కాని వారు తమ గత కాలపు ట్రాజెడీకి దూరంగా బ్రతుకుతున్నారన్నది గమనించాను. వారిని కాంటాక్ట్ అవ్వాలని నాకు అనిపించలేదు. నౌషాద్ మెమోన్ గారు చాలా యాక్టివ్‌గా ఫేస్‌బుక్‌లో ఉండేవారు. అయన పోస్ట్ చేసే ఫోటోలలో కొన్ని  నాకు గురు దత్, గీతా దత్ లకు సంబంచించి నెట్‌లో దొరికే ఇంటర్వ్యూల ప్రామాణికతను ఎంచడానికి సహయపడేవి. వారిని నిత్యం పాలో అవుతూనే ఎక్కడా వారిని డిస్ట్రబ్ చేయకుండా జాగ్రత్తపడ్డాను. నీనా దత్ గారితో కాంటాక్ట్ అవాలనే కోరిక ఉన్నావారు దాన్నిఇష్టపడరు అన్న భావం నాలో కలిగేది. అనురాగ్ కష్యప్ గురు దత్‌పై సినిమా తీయాలనుకున్నప్పుడు కుటుంబీకులు అడ్డు చెప్పడం ఇష్టపడకపోవడం లాంటి విషయాలపై వ్యాసాలు చదివాక అరుణ్ దత్ మరణం ప్రొలాంగ్డ్ సూసైడ్ అన్న కవితా లాజ్మి ఇంటర్వ్యూ ఒకటి చదివాక మూడో తరాన్ని నా పుస్తకం కోసం డిస్ట్రబ్ చెయడం తప్పేమో అని అనిపించి ఆ ఒక్క పని చేయలేకపోయాను. నీనా దత్ గారిని కలవాలనే కోరిక మాత్రం నాలో ఇంకా ఉంది.

నేను ఉద్యోగస్థురాలిని, పైగా రెండు ఎన్.జీ.వోలతో పని. రాత్రి తొమ్మిది దాకా కలం పట్టే సమయం దొరకదు. పది నుండి ప్రొద్దున్న  మూడు దాకా రాసుకున్న రోజులు ఉన్నాయి. సెలవు రోజులలో ఇంటి బైటికే రాకుండా ఏకబీగిన రాసిన రోజులూ ఉన్నాయి. ‘సంచిక’లో వచ్చిన వ్యాసాలతో ఆగకుండా పుస్తకం రూపం వచ్చేదాకా మళ్ళీ మళ్ళీ తిరగ రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో అనల్ప బలరాం గారి సహాయంతో ఎనిమిది సార్లు ప్రతి పదాన్ని చదివిన తరువాత వచ్చిన పుస్తకం అది. ఈ విషయంలో ‘మంచి పుస్తకం’ సురేష్ గారు, ‘అనల్ప’ బలరాం గారితో పనిచేసి ఎంతో నేర్చుకున్నాను. అలా ఐదు సంవత్సరాలు ఈ పుస్తకం మీదే పని చేస్తే అది ఈ రూపంలో ముందుకు వచ్చింది.

ప్రశ్న 3. మీ పుస్తకం చదువుతూటే మీరు గురు దత్‌ను విపరీతంగా అభిమానిస్తారు కానీ, మీకు గీతా దత్‌పై అధికమైన సానుభూతి అనిపిస్తుంది. ఇందుకు కారణాలు వివరించండి.

జ: వివాహం, ప్రేమ, నేను ఎక్కువ జీవితాన్ని ఇన్వెస్ట్ చేసిన అనుబంధాలు,  నాకు చేదు అనుభవాలనే మిగిల్చాయి. ప్రతి సందర్భంలోనూ ఓ స్త్రీగా నేను సంఘర్షణనే అనుభవించాను. ఎంతటి గొప్ప పురుషుడు అయినా స్త్రీని సంపూర్ణంగా అర్థం చేసుకోలేడని, ఆమెను ఎంత ప్రేమించినా జీవన మార్గంలో తనతో సమానంగా స్వీకరీంచలేడన్నది నా అనుభవం. అందుకే గురు దత్‌ని ఎంత అభిమానిస్తున్నా భర్తగా అతని బాధ్యతా రాహిత్యాన్ని ప్రస్తావించకుండా ఉండలేకపోయాను. గీతా దత్ పతనం వెనుక వివాహంలోని ఆమె అసంతృప్తి ముఖ్య కారణం. ఆమె అనుభవించిన బాధను సాటి స్త్రీగా అర్థం చేసుకోలేకపోతే అది నా జాతికి నేను చేస్తున్న అన్యాయమే కదా. మనం ప్రేమించే వారిలోని బలహీనతలను కూడా చూడగలగాలి, వాటిని చర్చించాలి. ఒప్పుకోకూడని విషయాలను ఖండించాలి. నేను నా జీవితంలో ప్రేమ, స్నేహం, అనుబంధాలలో కళ్ళు మూసుకుని ఏ రోజూ జీవించలేదు. గురు దత్ విషయంలోనూ అదే వైఖరిని ప్రకటించాను. అది నా స్వభావం.

గురు దత్, గీతా దత్‌తో బాధ్యతగా ప్రవర్తించలేదన్నది నా భావన. గీతా దత్ తరువాతి జీవితం, ఆమె చేసిన పోరాటం, కోల్పోయిన కెరీర్, ఆమె మరణం దీన్ని దృవీకరిస్తాయి. అయితే ఆమె కూడా గురు దత్ లాగే తన భావావేశాలను నియంత్రించుకోలేక మద్యానికి బానిసయిపోవడాన్ని ఓ పక్క ఆమె అసహాయతగా అర్థం చేసుకుంటూనే,  తల్లిగా తానూ బాధ్యత మరిచి మరణం దిశగానే ప్రయాణించారని చెప్పడానికి సంకోచించను. ఆ ఇద్దరు భార్యాభర్తలూ, తమ భావావేశాలకు లొంగి బాధ్యతగా జీవించలేకపోయారు. దీని వెనుక వారి అసహాయత, అసంతృప్తులు ఉన్నాయన్నది అంగీకరిస్తూనే, వారిని విమర్శిస్తాను కూడ.

ఈమధ్య సాహిర్‌పై నేను రాస్తున్న వ్యాసాల రీసెర్చ్ సందర్భంగా గీతా దత్ గురించి ఓ సంగతి కనుక్కున్నాను. అది ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నాకు తట్టలేదు. హిందీ సినిమాలలో ఉత్తమ గీతాలను ఎన్నుకునే ఓ ప్రయత్నం 2010లో ఔట్ లుక్ పత్రిక చేసింది. దానికి 30 మందిని న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించింది. అందులో కవులు, గాయకులు, సంగీత దర్శకులు ఉన్నారు. గుల్జార్, జావెద్ అఖర్త్, మన్నా డే లాంటి హేమాహేమీలందరూ హిందీలో వచ్చిన అన్ని పాటలను పరిశీలించి, సాహిర్ రాసిన ‘మన్ రే’ అనే పాటను హిందీలో శతాబ్ది ఉత్తమ గీతంగా ఎంచారు. తరువాతి లిస్ట్‌లో పాటలేంటో తెలుసా? రెండవ స్థానంలో మూడు పాటలు ఉన్నాయి ‘గైడ్’ సినిమా నుండి, ‘తేరే మెరే సప్నే’, ‘దిన్ ఢల్ జాయే’, (రఫీ) అమర్ ప్రేమ్ నుండి ‘కుచ్ తో లోగ్ కహేంగే’, (కిషోర్). మూడవ ఉత్తమ గీతం స్థానంలో మరో మూడు పాటలు ఉన్నాయి అందులో మొదటి పాట గీతాదత్ పాడిన ‘వక్త్ నే కియా’ (కాగజ్ కే ఫూల్), ఆ తరువాత రఫీ లత డ్యూయెట్ ‘జో వాదా కియా’, లత పాడిన ‘ప్యార్ కియా తో డర్నా క్యా’. అంటే మొదటి స్థానంలో రఫీ ఉంటే తరువాత కొన్ని వేల పాటలు పాడిన గాన కోకిల లత పాటలిన్నిటినీ  దాటుకుని మొదటి స్థానంలో నిలిచింది గీతా దత్ పాట. ఆ లిస్ట్‌లో గాయనీగా మొదట ప్రస్తావనకు వచ్చింది గీతా దత్, అంటే ఆమె ప్రతిభ అర్థం కాదూ. అలాంటి గాయని జీవితం అల్లకల్లోలం అవడం వెనుక గురు దత్ పాత్ర కూడా ఉందని ఒప్పుకోక తప్పదు. ఒక స్త్రీగా అది చెప్పడం నా కర్తవ్యం అనిపించింది. ఏ స్త్రీ హృదయంతో గురు దత్‌ని ఆరాధించానో అదే హృదయంతో అయన్ని విమర్శించాను కూడా. అందుకే ఈ పుస్తకాన్ని గీతా దత్‌కే అంకితం చేసాను.

ప్రశ్న 4. గురు దత్ సినిమాల్లో మీకు అధికంగా నచ్చే అంశం ఏమిటి?

జ: బతకడానికి జీవించడానికి మధ్య ఉన్న తేడాను స్పష్టపరిచే ఆయన కథన శైలి. మనిషి భావావేశాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత. మనుష్యులలో ఆయన కోరుకున్న సున్నితత్వం, అన్నిటి కన్నా ముఖ్యంగా మనసుకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత. శారీరిక సుఖాన్ని మించిన దాన్ని ప్రేమలో పొందాలనుకుని తపించిన ఆయన గుణం. శరీరాలని దాటుకుని మనిషితత్వాన్ని వెతికిన ఆయన అన్వేషణ. అది ఫలించని అన్వేషణే. కాని ఆ అన్వేషణ లేని బ్రతుకు వ్యర్ధం అని నేను నమ్ముతాను కాబట్టి ఈ అంశాలన్ని పుష్కలంగా ఉండే ఆయన సినిమాలను నేను ఇష్టపడతాను. ఆయన సినిమాలలోని సౌందర్యం, కవితాత్మకత మనసుకు సంబంధించినవి. గురు దత్ శరీరాలను దాటుకుని మనిషిలోకి తొంగి చూడాలనుకున్న వ్యక్తిగా కనిపిస్తాడు. కాని ప్రపంచం మనిషిని ఓ మూసలో ఉంచేసింది. అందులో శరీరమే ప్రధానం, మనసును అవసరం ఉన్నంత మేర మాత్రమే తెరచి మేధను తదనుకూలంగా ఉపయోగించుకుని జీవితాన్ని సౌకర్యవంతం చేసుకోవాలనే మనిషి ఆలోచనలలోని స్వార్థాన్ని గురు దత్ సినిమాలు ప్రశ్నిస్తాయి. అసలు అలా బతకడమే మనిషి విజయం అని ప్రపంచం ఎలుగెత్తి చాటుతుంటే అదీ ఒక బతుకేనా అని పశ్నించే గురు దత్ శైలి నాకు చాలా చాలా ఇష్టం. ఆయన అన్వేషించే మనసులు జీవితంలో లభించవు. అవి లభించే వాతావరణం ఈ ప్రపంచంలో లేదు అని ఆయన ఒప్పుకోలేకపోవడంలో ఒక రకమైన మొండితనం ఉంది. ఆ మొండితనమే ఆయన సినిమాలకు బలం. అందరూ ఆమోదించే మానవ జీవితంలోని హిపోక్రసిని ప్రశ్నించాయి గురు దత్ సినిమాలు. ఇవన్నీ ఆయన సినిమాలలో నేను ఇష్టపడే అంశాలు.

ప్రశ్న 5. ఆరంభంలో గురు దత్ మమూలు కమర్షియల్ సినిమాలు రూపొందించాడు. ఆ సినిమాల్లో ప్యాసా, ‘కాగజ్ కే ఫూల్ వంటి లోతయిన గంభీరమయిన సినిమాల ఛాయలు కనబడవు. హఠాత్తుగా గురు దత్ సీరియస్ సినిమావైపు మళ్ళేందుకు మీరు అనుకుంటున్న కారణాలేమిటి?

జ: నేను చేసిన రీసెర్చ్‌ని బట్టి కమర్షియల్ సినిమాలను ఆయన తన పద్ధతిలో రాసుకున్న కథల కోసమే తీసారనిపిస్తుంది. కమర్షియల్ సినిమాలతో నిలదొక్కుకున్నారని తరువాత తనకు ఇష్టమైన పద్ధతిలో సినిమా తీసారని, ఒక సినిమా తన కోసం, మరొకటి మార్కెట్ కోసం తీసుకుంటూ వెళ్లారని అర్థం అవుతుంది. ‘కాగజ్ కే ఫూల్’ వైఫల్యం తరువాత ‘చౌదవీ కా చాంద్’ సినిమాతో, పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకున్నారు. ఆ తరువాతే ‘సాహెబ్ బీబీ ఔర్ గులాం’ నిర్మించారు. ఆయన తన పంథాకు రావడానికి, సినీ రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రారంభకాలంలో కమర్షియాలిటిపై ఆధారపడ్డారు. అయితే అందులోనూ తన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రల భావోద్వేగాలలో ఓ గాఢత ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ నుండి గమనించవచ్చు.

వయసు పెరిగే కొద్ది ప్రతి కళాకారునిలో వచ్చే పరిపక్వత కూడా ఆయన సినిమాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇరవైలలో ఆయన చేసిన సినిమాలకీ, ముప్పైలలో ఆయన చేసిన వాటిలో చాలా తేడా ఉంది. పైగా ఆయన కెరీర్ మొదలుపెట్టిన సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని నేర్చుకున్నప్పుడు ఆయన మనుసుపై పడిన ముద్రలను ఆయన క్రమంగా వదిలలించుకుని ఒకో సినిమాతో తన సొంత శైలిని నిర్మించుకోవడాన్ని గమనించవచ్చు. ఈ స్పష్టత ఇవ్వడానికే గురుదత్ గురించి రాసిన ఇతర రచయితలు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన సినిమాలను విస్మరించినా వాటినీ విస్తారంగా పూర్తి కథనంతో ఈ పుస్తకంలో జోడించడం జరిగింది. ఎటువంటి సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటూ ఆయన ఎదిగారో పాఠకులు తెలుసుకుని ఆ తరువాత అయన సినిమాలలో వచ్చిన మార్పు పట్ల ఓ అవగాహనకు రావడం కోసం ఆయన సినీ జీవితంలో మొదటి పుటలను కూడా విస్తారంగా ఈ పుస్తకంలో జోడించాను. గురు దత్ సినిమాలలో క్రమంగా వచ్చిన మార్పు ఆయన జీవితానుభవాల ఆధారంగా చేరిన ఆలోచనల, సంఘర్షణల ఫలితం అని నాకు అనిపిస్తుంది. కాని కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడే ఆయన తన పంథాలో కథలను రాసుకున్నారని. వాటిని తాననుకునట్లు తీయగలనన్న నమ్మకం ఏర్పడ్డాకే తీసారని కొన్ని రుజువులతో పుస్తకంలో చూపించాను.

ప్రశ్న 6. గురు దత్ సినిమాలలో పాటల ప్రాధాన్యమూ, ప్రత్యేకతలు మీ అభిప్రాయం ప్రకారం ఏమిటి?

జ: గురు దత్ పాటలను చిత్రీకరించినట్లు మరెవ్వరూ చిత్రించలేరు అన్నది నా అభిప్రాయం. ఆయన పాటల్లో ఇన్టెన్సిటీ కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. వ్యక్తిగతంగా గురు దత్ పాటలు లేని సినిమాలను కోరుకున్నా, హిందీ సినిమా పాటల చిత్రీకరణను హిమాలయాలంత ఎత్తుకు తీసుకువెళ్లిగలిగారు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన పాటలకు సంబంధించి ఒకో షాట్‌ను విశ్లేషిస్తూ పుస్తకంలో చర్చించాను. ఆయన సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య పాటలను ఏ సుదూర సుందర ప్రాంతాలలోకో తీసుకెళ్ళి తీయలేదు. ఓ పాడు బడిన మేడ పైన, ఓ కార్ గారేజ్‌లో, ఓ ఇంటి మెట్ల పైన, వీధిలో, ఖాళీ స్టూడియోలో, కార్‌లో, ఒక మంచంపైన, ఒక చిన్న గదిలో, ఓ అద్దం ముందు పాటలను చిత్రీకరిస్తూ అందులో ఎన్ని అద్భుతాలు చేశారో ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన పాటలన్నీ కూడా కథకు కొనసాగింపుగా వస్తాయి. అంటే ఆ పాట మిస్ అయితే ప్రేక్షకులు కథ మిస్ అవుతారు. ప్రతి పాట ఓ మనసు పాడే గీతంలా అనిపిస్తుంది. ఆ పాత్ర మనసు లోతుల్లోంచి ఆ భావాలు వస్తున్నట్లు ఆయన చిత్రించినట్లు మరెవ్వరూ చేయలేరు అన్నది నా భావన. పైగా ఆ పాటలకు ఆయన ఉపయోగించిన నలుపు తెలుపు ఫోటోగ్రఫీలో ముఖంపై నీడలతో ఆయన చేసిన అద్భుతాలు చూసి తీరవలసిందే. చీకటి వెలుగులను, నలుపు తెలుపులను ఆయన ఉపయోగించుకున్న విధానం అత్యద్భుతం. దానికి వి.కె మూర్తి ఫోటోగ్రఫీ ప్రాణం అయినా, గురు దత్ తరువాత మూర్తి చేసిన సినిమాలలో ఆ ఇంటెన్సిటీ అదే స్థాయిలో లేదన్నది నిజం. అంటే మూర్తిలోని నైపుణ్యాన్ని తన చిత్రీకరణకు అత్యద్బుతంగా ఉపయోగించుకున్న దర్శకుడు గురు దత్.

ప్రశ్న 7. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, వ్యక్తిగా గురు దత్ ప్రత్యేకతలు, బలహీనతలు మీ అభిప్రాయంలో ఏమిటి?

జ: నా దృష్టిలో గురు దత్ అత్యద్భుతమైన దర్శకులు, కళాత్మకత కోసం ఎక్కడా రాజీ పడని నిర్మాత. తన టీం లోని సభ్యులను ట్రైనింగ్ కోసం, రీసెర్చ్ కోసం విభిన్న రాష్ట్రాలకు, విదేశాలకు పంపించిన నిర్మాత గురు దత్. నటుడిగా అయన ఆ తరువాతి స్థానంలోనే ఉంటారు. తన దర్శకత్వంలో ఆయన చూపిన నటనా ప్రతిభ ఇతర దర్శకుల సినిమాలలో లోపించింది. అంటే ఆయన ప్రధానంగా దర్శకులు అన్నది స్పష్టమవుతుంది.

ఇక వ్యక్తిగా గురు దత్‌లో ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తాయి. మిత్రుడిగా గొప్పవాడు, కుటుంబం విషయంలో బలహీనుడు, బాంధవ్యాల పట్ల తీవ్రమైన నిరాశ నిస్పృహలు చూపిస్తూ మళ్ళీ బాంధవ్యాల గురించి ఎంతో తపన కనపర్చి ఆశ్చర్యపరుస్తారు. నిరంతరం ఏదో అన్వేషిస్తూ జీవితాంతం ఆశాంతిగా గడిపిన వ్యక్తి. తన చుట్టూ  ఉన్నవారిని లోతుగా పరిశీలిస్తూ కూడా వారి స్వార్థాన్ని ఎదిరించకుండా వారి ప్రేమకు తపించిన వ్యక్తి. తనను నష్టపరిచే వారు, ప్రేమించే వారి మధ్య తేడా అర్థం అయి వారి మధ్యన లొంగుబాటుతో జీవించలేక, నిరాశతోనూ, డిప్రెషన్ తోనూ యుద్దం చేసిన వ్యక్తి గురుత్ దత్. తన దగ్గరున్నవి తృప్తినివ్వక, కోరుకున్నవి కోరుకున్నట్లుగా లభ్యమవక అలజడితో జీవిస్తూ తన కుటుంబాన్ని అదే అలజడికి గురి చేసారు. కాని కళాకారుడుగా అత్యంత ఉన్నతమైన శ్రేణికి చెందుతాడు గురు దత్. సినిమానే జీవితం, జీవితమే సినిమాగా బ్రతికి మనసులోని అసంతృప్తులతో నలిగి మరణంలోనే ప్రశాంతత వెతుక్కున్న వ్యక్తి.

ప్రశ్న 8. సాధారణంగా గురు దత్ గురించి రచించిన పుస్తకాలన్నిటిలో గురు దత్‌ను గొప్పగా భావిస్తూ రచించిన పుస్తకాలే అధికం. మీరు గురు దత్‌ను విపరీతంగా అభిమానిస్తూ కూడా గుడ్డి అభిమానాన్ని ప్రదర్శించలేదు. గురు దత్‌ను నిష్పాక్షికంగా విశ్లేషించేందుకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: గురు దత్‌పై నాకు భక్తి ఉంది, ప్రేమ ఉంది. నా దృష్టిలో ప్రేమ గుడ్డిది కాదు. ప్రేమ మనిషి ఎదుగుదలకు పునాది కావాలి. మనకున్న విచక్షణతో ప్రేమను స్వీకరించాలని నేను బలంగా నమ్ముతాను. అది నా స్వభావం. అందుకే గురు దత్‌పై నాకున్న అభిమానం ఆయన బలహీనతలను ఒప్పుకోవడంలొ అడ్డుకాలేదు. ఇది ఓ ఇరవై ఏళ్ళ క్రితం మాత్రం సాధ్యం  అయేది కాదు. కాని నా వయసు, జీవితానుభవాలు ఇచ్చిన పరిపక్వత నాకు గురు దత్‌ను ఓ కళాకారునిగా, వ్యక్తిగా విడదీసి చూడడానికి ఉపయోగపడింది. అతనో విశిష్టమైన వ్యక్తి, గొప్ప కళాకారుడు, అంతకు మించి మంచి మనసున్న స్నేహితుడు, లోతైన మనిషి, కాని మంచి భర్త మాత్రం కాదు. ఆ విషయంలో ఆయన చాలా తప్పిదాలు చేశారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. వివాహ వ్యవ్యస్థ స్త్రీకి రక్షణగానూ ఉండగలదు, స్త్రీ అస్తిత్వాన్ని నాశనమూ చేయగలదు. నా జీవితంలో నేను వివాహ వ్యవస్థ చేతిలో మోసపోయాను. స్త్రీగా,  ఓ కూతురుగా ఈ సమాజం నాకు విధించిన పరిమితులకు ఈ నాటికీ మూల్యం చెల్లించుకుంటున్నాను. ఆ అనుభవాలే మానవ సంబంధాలకు సంబంధించి లోతుగా పరిశీలించడానికి నాకు తోడ్పడ్డాయి. నా ప్రేమ నాకెప్పుడు బలహీనత కాలేదు కాబట్టి నేను ప్రేమించిన వ్యక్తుల బలహీనతలను ఒప్పుకోవడానికి నాకు అహం అడ్డు రాదు. అందుకే గురు దత్ విషయంలో నిష్పక్షపాత దృష్టితోనే ఆలోచించగలిగాను. గీతా దత్‌కు జరిగిన అన్యాయాన్ని ఒప్పుకుంటూనే గురు దత్‌ను ప్రేమిస్తాను, అదే స్థాయిలో విమర్శిస్తాను కూడా. గురు దత్‌ను కళాకారుడిగా, నేను అభిమానించే వ్యక్తిగా, ఓ భర్తగా విడదీసి చూడగల పరిపక్వత నాకు రావడానికి నా జీవిత అనుభవాలే ప్రధాన కారణం.

ప్రశ్న 9. ఈ పుస్తకంలో మీరు ప్యాసా గురించి దాదాపుగా వందా యాభై పేజీలు రాశారు. అంటే అదే ఒక ప్రత్యేక పుస్తకంగా ప్రచురించవచ్చు. కాగజ్ కే ఫూల్, ‘సాహబ్ బీబీ ఔర్ గులామ్ ల గురించి దాదాపుగా సమానంగా రాశారు. గురు దత్ జీవితంలో ఈ మూడు సినిమాల ప్రత్యేకత ఏమిటి? ఎందుకని మీకు ప్యాసా అంత ఇష్టం?

జ: నేను కొన్ని వేల సినిమాలను చూసాను. అన్ని భారతీయ భాషలలోనూ సినిమాలను చూడగలిగాను. అలాగే విదేశీ సినిమాలను అధ్యయనం  చేసే రీతిలో చూసాను. అయినా అన్నిటిలో నాకు నచ్చిన సినిమాగా మొదటి వరుసలో నిలిచేది ఇప్పటికీ ‘ప్యాసా’ మాత్రమే. గురు దత్ తీసిన సినిమాలలో ఏ తప్పు వెతికినా పట్టుకోలేని ది పర్ఫెక్ట్ పిక్చర్ ‘ప్యాసా’. సమాజం పట్ల మనిషికి ఉండవలసిన అసంతృప్తిలన్నిటినీ ఎత్తి చూపిన చిత్రం ‘ప్యాసా’. నేనిక్కడ ఉండవల్సిన అని ఎందుకంటున్నానంటే, మనిషిగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని విజయ్ పాత్ర అంత సున్నితంగానూ లోతుగానూ జీవితం పట్ల అవగాహనతో ఉంటే అది ఎంత ఉన్నత సమాజం అవుతుందో ఊహించండి. సమాజం అలా లేదు. మనిషి అలా లేడు. దేన్ని ప్రేమించాలో, ఏవి కోరుకోవాలో, వేటికి మనిషి ప్రాధాన్యతలివ్వాలో తెలిసి కూడా మనిషి సత్వర సుఖాల కోసం మరో విధంగా ప్రవర్తిస్తున్నాడు. అది హిపోక్రసి కదా. ఆ హిపోక్రసిని ఎత్తి చూపుతూ దాన్ని ఒప్పుకోలేని ఓ వ్యక్తి సంధించిన ప్రశ్నే ప్యాసా.

అయితే విజయ్ లోని భావుకత, ఆ హిపోక్రసిని ఒప్పుకోక దాన్ని తన జీవితం నుండి దూరం చేసుకోలేక తానే సమాజం నుండి దూరం అయే దిశగా మళ్ళింది. సమాజాన్ని త్యజించాడు విజయ్. అది సన్యసించడం కావచ్చు, ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు. అసలు ఆత్మహత్య అంటే ఓ వ్యక్తి సమాజాన్ని త్యజించడం కూడా అనే ఆలోచన కలిగించిన సినిమా ‘ప్యాసా’. అప్పుడు నిశితంగా గమనిస్తే మనల్ని వదిలి ప్రాణాలు తీసుకునే వారందరిలోనూ ఓ విజయ్ కనిపిస్తాడు. పైగా నా కోపం, వ్యక్తులపై కాదు వారిని అలా తయారు చెసిన వ్యవ్యస్థ పై అంటాడు ‘ప్యాసా’లో విజయ్. అంటే వ్యక్తిగత సమస్యలోని సామాజిక కోణాన్ని చూపించిగలిగిన చిత్రం ‘ప్యాసా’.

మన జీవితంలోని ప్రతి సమస్య లోతుల్లోకి వెళితే అది సమాజంలోని లోపాలకే దారి చూపుతుంది. అంటే వ్యక్తిగత సమస్యలన్నీ వ్యక్తిగతం కావు, అవి సామాజిక స్థితిగతుల నుండి ఉద్భవించినవే. ఓ ఒంటరి స్త్రీగా నేను ఎదుర్కున్న సమస్యలు, నా అస్తిత్వ పోరాటం వెనుక నేను పడిన సంఘర్షణ కేవలం నాకే పరిమితమైన సమస్యలు కావు. వాటి మూలాల వెనుక ఓ వ్యవ్యస్థ ఉంది. ఇది అర్థం చేసుకుంటేనే వ్యక్తిగత కోపతాపాల నుండి నుండి బైటపడి మన సమస్యలను మరో కోణంలో చూడగలుగుతాం. ‘ప్యాసా’ అదే చేసింది. అయితే విజయ్ సమాజం అందించే విజయాలను కాదని దూరం వెళ్ళిపోతాడు. ఈ సమాజంలో నేను మనశ్శాంతితో జీవించలేను అని చెప్తాడు. ఆ వెళ్ళిపోవడమే గురు దత్ జీవితంలోని ఆత్మహత్య కూడా. అంటే జీవితాన్ని త్యజించిన వ్యక్తుల నిర్ణయంలో వ్యవస్థ పాత్ర ఎంతగా ఉంటుందో కూడా చెప్పగల సినిమా ‘ప్యాసా’. అందుకే ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఓ హెమీంగ్వే, వర్జీనియా వుల్ప్‌, వాన్ గో తో పాటు ఫైజ్ అహ్మద్ ఫైజ్, సాహిర్ లుధియాన్వీ దాకా నాకు ‘ప్యాసా’ ద్వారానే అర్థం అయ్యారు.

ఇక ఆ సినిమా చిత్రీకరణలో గురు దత్ చూపించిన లోతు, సంభాషణలు లేని సందర్భంలో కూడా సమాజంలోని స్వార్థంతో మనిషి అనుభవించే ఒంటరితనాన్ని ప్రతి ఫ్రేమ్‌లో గురు దత్ చూపించిన విధానం ఆ సినిమాను ఓ మాస్టర్ పీస్ స్థానంలో నిలబెడతాయి. ఇక ‘కాగజ్ కే ఫూల్’ ఓ కళా ఖండం. చిత్రీకరణ విషయానికి వస్తే ‘ప్యాసా’ కన్నా గొప్ప చిత్రం అది. కాని మెలన్‌కొలియాని అర్థం చేసుకోలేని ప్రేక్షకులు దానికి కనెక్ట్ కాలేరు. ‘ప్యాసా’ సినిమాగా గొప్పది. ‘కాగజ్ కే ఫూల్’ చిత్రీకరణ స్థాయిలో గొప్ప సినిమా. ఇక ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’లో స్త్రీ పాత్ర సాంప్రదాయానికి, స్త్రీవాదానికి మధ్య నిలిచే పాత్ర. ఇంతటి వైరుధ్యం ఉన్న మరో పాత్ర అప్పటి దాకా భారతీయ స్క్రీన్‌పై కనిపించలేదు. అందుకే ఈ మూడు భారతీయ సినిమాలలోనే అద్భుతమైన సినిమాలని నా అభిప్రాయం.

ప్రశ్న 10. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55 లో గురు దత్ ఫెమినిజంకు వ్యతిరేకిగా అనిపిస్తాడు. అతని సినిమాల్లో మహిళల పాత్రలు ఎంత శక్తివంతమైనవయినా గురు దత్ నాయికలు నాయకుడి పట్ల ఒక రకమైన సంపూర్ణమయిన అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. అంటే, ఇతర విషయాల్లో ఎంతగా అభ్యుదయ భావాలున్నా, వ్యక్తిగతంగా గురు దత్ తన స్త్రీ తనకు సంపూర్ణంగా లొంగిపోవాలని భావించాడా?

జ: మహిళల పట్ల సినిమాలో గురు దత్ చూపిన భావజాలంలో ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. స్త్రీ గొప్పది,  ఆమె దేవత అంటూనే నేను ఆమె కన్నా కొంచెం ఎక్కువ అన్న భావం కలబోసి ఉంటుంది ఆయన పురుష పాత్రల చిత్రీకరణ. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ లో కొన్ని సంభాషణలను నేను అంగీకరించనని చెప్తూ విపులంగా ఆ కారణాన్నిపుస్తకంలో వివరించాను. గురు దత్ ఎంత సమాజాన్ని విమర్శించినా, ఇదే సమాజంలో పెరిగిన మనిషే. పైగా సంప్రదాయం, ఆధునికత మధ్య సమాజం చిక్కుకున్న సమయంలోనే గురు దత్ సినిమా రంగంలో అడుగుపెట్టారు. తరాలుగా పురుషుడెలా ఉండాలో స్త్రీలు ఎలా ఉండాలో నిర్దేశించబడి ఉన్న సమాజంలో హఠాత్తుగా స్త్రీ స్వేచ్ఛను గౌరవించే పురుషులు తయారవ్వరు కదా. అదే పురుషాధిక్య భావజాలంతో ఉన్న వ్యక్తి గురు దత్. అది ఆయన సినిమాలలోనూ కనిపిస్తుంది. అయితే స్త్రీపై తన హక్కును బలవంతంగా రుద్దే వ్యక్తిగా కూడా ఆయన తన సినిమాలలో ఎక్కడా కనిపించరు. ‘ఆర్ పార్’ లో ఇల్లు వదిలి రమ్మంటే ప్రియురాలు  రాలేదనే కోపంతో ఆమెకు దూరం అవుతాడు ప్రియుడు. అంటే ‘నా మాట’ అన్న అహం ఆయన నటించిన పురుష పాత్రలలో కనిపిస్తుంది. కాని స్త్రీలపై దౌర్జన్యం, వారి అంగీకారం లేకుండా వారి వెంట పడడం లాంటి వ్యక్తిత్వం ఆయన పాత్రలో కనిపించదు.

కాని ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ చిత్రాలకు వచ్చేసరికి అందులో ఆ పురుషాధిక్యత దాటిన  వ్యక్తివాదం కన్పిస్తుంది. అందులో పితృస్వామ్య ధోరణులు లేవు. అందుకే అవి రెండూ ఆయన తీసిన గొప్ప చిత్రాలనిపిస్తాయి. వీటిలో ఆయన పాత్రలు పురుష అహంకారం, స్త్రీ వాదంని దాటుకుని వ్యక్తివాదం దిశగా ప్రయాణించడం కనిపిస్తుంది. లింగపరమైన భేధాలను ఆయన తన సినీ ప్రయాణంలోని చివరి అంకంలో అధిగమించగలిగారు.

కాని వ్యక్తిగతంగా అప్పటికే ఆయన జీవితంలో వచ్చిన మార్పులు ఆయనలోని ఈ కోణాన్ని జీవితంలో ప్రదర్శించుకోగల అవకాశాన్ని ఇవ్వలేదని, కొన్నాళ్లు ఆయన జీవించి ఉంటే ఆయనలోని ఆ కోణం బైటపడి ఉండేదని నాకనిపిస్తూ ఉంటుంది. ఇది గురు దత్‌పై నా అభిమానాన్ని సమర్ధించుకోడానికి చెప్తున్నది కాదు. ప్రతి సినిమాలోనూ ఆయన ఆలోచనలలో స్పష్టంగా వచ్చిన మార్పును గమనిస్తే ఇలా అనిపిస్తుంది. పురుషాహంకారపు భావజాలాన్ని వ్యక్తివాదం దిశగా తీసుకువెళ్ళడం చాలా ఉదాత్తమైన మార్పని నా అభిప్రాయం. గురు దత్ దాన్ని సాధించారు. కాని జీవితంలో అప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చుకునే సమయం అతనికి లేకుండా పోయంది.

ఇక ఆయన స్త్రీ నుండీ సంపూర్ణమైన సమర్పణా భావాన్నికోరుకున్నది మాత్రం నిజం. అంటే స్త్రీ జీవిత ప్రాధాన్యతలలో తానే ముందుండాలన్న ఉద్దేశంతో ఉన్న పురుష పాత్రలు ఆయన ముందు తీసిన సినిమాలలో కనిపిస్తాయి. కాని గమనిస్తే ‘కాగజ్ కే ఫూల్’ లో అలాంటి స్త్రీ లభించినా అతను ఆమెను చేరుకోడు. ఇక్కడ స్త్రీ కన్నా తన ఆత్మగౌరవానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన సినిమా పాత్రలన్నీ పుషాధిపత్యం నుంఛి వ్యక్తిగత ఆత్మాభిమానం దిశగా చేసిన ఓ దర్శకుని ప్రయాణంగా నాకు అనిపిస్తుంది. అంటే పురుషాధిపత్యం నుంచి ఆధిపత్యాలను ప్రశ్నించే వ్యక్తివాదం దిశగా ఆయన ఆలోచనలలోని మార్పు కనిపిస్తుంది. ఆందుకే ఆయన ఇంకొంత కాలం జీవించి ఉంటే ఆయన జీవితంలోనూ, ఆలోచనలలోనూ మార్పు వచ్చేదేమో అనిపిస్తుంది.

ప్రశ్న11. గురు దత్ ఎంతో మంది కళాకారుల ప్రతిభను గుర్తించాడు. వారికి ప్రోత్సాహమిచ్చాడు. కానీ, గురు దత్ గురించి అధికంగా ప్రస్తావించేది ఒక్క అబ్రార్ అల్వీనే. చివరికి దేవ్ ఆనంద్ కూడా గురు దత్ గురించి ఎక్కువ మాట్లాడడు. ఎందుకంటారు?

జ: గురు దత్‌తో పని చేసిన వారందరికీ ఆయన ప్రోత్సాహం అందించారు. కాని వారంతా ఆర్టిస్టులు. దేవ్ ఆనంద్ మాత్రం ఆర్టిస్ట్ కాదు. అతనో స్టార్. ఇమేజ్ చట్రంలో ఉండడానికి ఇష్టపడిన నటుడు ఆయన. పైగా ఆయన సిద్దాంతాలు, సినిమాను ఆయన చూసిన కోణానికి గురు దత్ భావాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. నవ కేతన్‌కు సినిమాలు నిర్మించి తాను అక్కడ ఇమడలేనని సొంతంగా స్టూడియో నిర్మించుకున్న వ్యక్తి గురు దత్. దేవ్ ఆనంద్ తన ఇమేజికి అనుగుణంగా సినిమాలు తీసేవారు. ఇమేజ్ చట్రానికి దూరంగా పాత్రలు నిర్మించిన దర్శకులు గురు దత్. కాబట్టి ప్రొఫెషనల్‌గా వారి నడుమ చాలా దూరం ఉంది. ‘గైడ్’ సినిమాను అంత హిట్ చేసినా ,  దేవ్ ఆనంద్ శైలి ‘గైడ్’ మూల రచయిత ఆర్. కే. నారాయణ్‌కు నచ్చలేదు. ఆయన ఆ సినిమాను విమర్శించారు. తన కథలోని ఆత్మ చచ్చిపోయిందని వాపోయారు. మరి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది మనకు తెలుసు. అంటే ప్రేక్షకుల పల్స్‌కు అనుగుణంగా కథను, కథనాన్ని మళ్ళించగల స్టార్ దేవ్ ఆనంద్. అది గురు దత్ చేయలేని పని. అందుకే వ్యక్తిగతంగా స్నేహితులయిన వారిద్దరూ ఒకరి పనిని గురించి మరొకరు ఏనాడు మాట్లాడకపోయి ఉండవచ్చు.

అబ్రార్ ఆల్వి ఒకడే గురు దత్‌కు సమీపంగా వచ్చిన వ్యక్తి. గురు దత్ ఆఖరి రోజు దాక తోడున్న వ్యక్తి. గురు దత్ ప్రతి సినిమాకు ఇంచుమించు అబ్రార్ పని చేసారు. గురు దత్ మిత్రులందరూ కూడా తామూ ఆయన్ని అర్థం చేసుకోలేకపోయామనే చెప్పారు. ఎవరినీ తనలోకి తొంగి చూడనివ్వని గురు దత్ తన సినిమాలకు రచయిత అయిన అబ్రర్‌తో ఎక్కువ సమయం గడిపారు. అందుకే అతన్ని అందరికన్నా కాస్త లోతుగా గమనించిన వ్యక్తిగా అబ్రర్ ఆయన గురించి ఎక్కువ మాట్లాడి ఉంటారనిపిస్తుంది. పైగా సినీ ప్రపంచంలోని స్నేహాల గురించి ఆయనే ‘కాగజ్ కే ఫూల్’ లో వివరించారు కదా.

ప్రశ్న12. సాధారణంగా ఒక్కో రచన రచయితపై ప్రభావం చూపిస్తుందంటారు. అతని ఆలోచనా విధానంపై, అతని జీవితంపై ప్రభావం చూపిస్తుందంటారు. గురు దత్ పుస్తక రచన మీపై వ్యక్తిగతంగా, రచయితగా చూపిన ప్రభావం ఏమిటి?

జ: గురు దత్ పుస్తక రచనను నేను మొదలెట్టింది ఆయన ప్రభావంలో  మునిగి, మునకలేసి, దాని నుంఛి తప్పించుకునే ప్రయత్నం చేసి, దాని కోసం ఇతర దర్శకులను అధ్యయనం చేసి అందరిలో ఆయనే నా మనసుకు నచ్చిన కళాకారుడిగా గుర్తించాకే. ఆయనపై ఉన్న గుడ్డి భక్తిని దూరం చేసుకుని ఆయన సినిమాలను విశ్లేషించే స్థితికి చేరుకుని నిష్పక్షధోరణిని అవలంబించగలనన్న నమ్మకం కలిగాకే రచన మొదలెట్టాను. ముఖ్యంగా గురు దత్ గురించి నాకు నేను ఇచ్చుకున్న స్పష్టమైన అవగాహనగా నేను ఈ రచనా కాలన్ని వినియోగించుకున్నాను. నేను ఈ రచన ముందుమాటలో గురు దత్ ప్రభావం, అతని జీవితం ప్రభావం నన్ను ఎలాంటి మార్పులకు గురి చేశాయో నిజాయితీగా రాసాను. వ్యక్తిగతంగా నా జీవితంపై గురు దత్ ప్రభావం చాలా ఉంది. నా జీవితంలో కొన్ని నిర్ణయాలకు అతని జీవిత పాఠాలే ఆదర్శాలు. ఇక రచయితగా ఓ స్పష్టత వచ్చేదాకా ఏ విషయం పై కూడా రచన సాగించకూడదన్న నా ఆలోచనకు బలం ఇచ్చిన రచన ఇది. ఈ పుస్తకం వెనుక ఐదు సంవత్సరాల నా కృషి ఉంటే, అంతకు ముందు ఇరవై సంవత్సరాలుగా గురు దత్‌పై ప్రేమతో నేను చేసిన నా జీవిత ప్రయాణమూ ఉంది. ఈ పుస్తక రచన వ్యక్తిగతంగా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

అంటే నేను అనుకున్నట్లుగానే ఓ పుస్తకాన్ని తీసుకురాగలగడం తెలుగు సాహితీలోకంలో సాధ్యమే అన్నది ‘సంచిక’లో ధారావాహికంగా గురు దత్ వ్యాసాలు వస్తున్నప్పుడు వచ్చిన స్పందన నిజం చేస్తే, దీన్ని ప్రచురించిన అనల్ప బలరాం గారు నాపై ఉంచిన విశ్వాసం నాకు ఎనలేని ధైర్యాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా నేను రాసిన వ్యాసాలు ఎంతో విస్తారంగా ఉన్నా వాటిలో ఒక్క పేజీ కూడా ఆయన క్లుప్తత పేరుతో తీసేయాలన్న ప్రతిపాదన పెట్టలేదు. పుస్తకం పెద్దది అవుతుందని, క్లుప్తత అంటూ తెలుగు సాహిత్యంలో వస్తున్న రచనా శైలిలోని మార్పులను కూడా ఆయన పట్టించుకోకుండా నా రచనకు గౌరవం ఇవ్వడం నాకు తరువాతి రచనలకు కావల్సిన ధైర్యాన్ని ఇచ్చింది. ఇది నేను రాసిన రెండవ పుస్తకం మాత్రమే. ఈ సమయంలో ఆ ధైర్యం నాకు అవసరం. అది ‘సంచిక’ సంపాదకుల నుండి, అనల్ప పబ్లిషర్స్ నుండి నాకు లభించడం నా రచనా వ్యాసంగానికి అందిన ప్రోత్సాహంగా నేను భావిస్తాను. ఒక్క సినిమాపై వంద పేజీలకు పైగా రాసినా వేసుకునే సంపాదకులు తెలుగులో ఉన్నారని నా రచనా క్రమంలోనే తెలుసుకున్నాను.

ప్రశ్న13. గురు దత్ పుస్తకాన్ని రూపొందించటంలో మీ అనుభవాలను పాఠకులతో పంఛుకుంటారా?

జ: దీన్ని నేను ఎంతో ప్రేమతో రాసుకున్నాను. దీనితో నాకు ఏవో పేరు ప్రతిష్ఠలు, గౌరవం వచ్చిపడాలన్న కోరిక కన్నా గురు దత్‌ను నా తరువాతి తరానికి అందించాలన్నతాపత్రయం, గురు దత్‌పై నాకున్న ఇష్టాన్ని, నా కళ్లతో మనసుతో ఇతరులకు అందించాలనే నా కోరిక ఉన్నాయి. అందుకే ఈ పుస్తకంతో నేను ఎటువంటి పబ్లిసిటీ ఆశించలేదు. ముఖ్యంగా నేనంటూ లేకుండా పోయిన రోజున నా తరువాతి తరం నా కళ్ళతో గురు దత్‌ని చూడాలన్న స్వార్థం నా చేత ఈ ప్రయత్నం చేయించింది. ఒక కళాకారుడి జీవితకాలంలో అతనికి జరిగిన అన్యాయానికి అతని అభిమానిగా ప్రతిఫలం అందించాలనిపించింది. గురు దత్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని నాతోనే ఉంచుకోకుండా తెలుగు పాఠకలోకంతో పంచుకోవాలనిపించింది. ఆ ప్రయత్నమే ఈ ‘గురు దత్,   ఓ వెన్నెల ఎడారి’.

ఇది రాస్తున్నప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. గురు దత్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు ఆర్సన్ వెల్స్ సినిమాలన్నీ సంపూర్ణంగా చూసి ఆ ఇద్దరి దర్శకత్వ శైలిలో పోలికలు పట్టుకోగలిగాను. ముఖ్యంగా అరవై దశకం దాక ఆర్సన్ శైలి, ఫోటోగ్రఫీ, చేసిన ప్రయోగాలు గురు దత్ శైలితో పోల్చుకోవచ్చు. ‘సాహెబ్ బీబీ ఔర్ గులాం’ పుస్తకం పూర్తిగా చదివి బెంగాలీ సినిమా చూసిన తరవాతే గురు దత్ ఆ సినిమాకు తిసుకున్న రిస్క్ నాకు ఇంకా బాగా అర్థం అయింది. ‘కాగజ్ కే ఫూల్’ సినిమా కోసం డిప్రెషన్, మెలంకోలియా పై ఎన్నో వ్యాసాలను, చదివాను. ఫెడ్రికో ఫెల్లిని, రాబర్ట్ బ్రెస్సన్ సినిమాలను చూసాను, లైమ్ లైట్, ది ఆర్టిస్ట్, ది స్టార్ ఈజ్ బార్న్ సినిమాలను రెండు మూడు సార్లు చూశాను. ఈ సినిమాలతో ‘కాగజ్ కే ఫూల్’ ని పోలుస్తూ గురు దత్ శైలిని ఇంకొంత అధ్యయనం చేసాను. ఈ పుస్తకం కోసం రెంబ్రాట్, ఇతర చిత్రకారుల చిత్రకళను పరిచయం చేసుకున్నాను. ఈ పుస్తకం రాయక ముందు ‘ప్యాసా’ గురు దత్ సినిమాలలో ది బెస్ట్ అన్న అభిప్రాయం నాది. కాని పుస్తకం రాసే క్రమంలో ‘కాగజ్ కే ఫూల్’ పట్ల ఇంకా ప్రేమ పెరిగింది. కొన్ని సందర్భాలలో గురు దత్‌పై కోపం కూడా కలిగింది. గీతా దత్‌పై చెప్పలేని అనురాగం కలిగింది. ఆమె కోణంలో ఒ పుస్తకం రాయాలనే ఆలోచన కలిగింది. ఒక ప్లాన్ అంటూ లేదు కాని గీతా దత్ గురించి కూడా కొంత రాయాలి అన్న ఆలోచన అయితే అప్పుడప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది.

ప్రశ్న14. సాధారణంగా, త్తెలుగు పాఠకులకు హిందీ సినిమాల పట్ల, కళాకారుల పట్ల అంతగా ఆసక్తి వుండదు అన్న అభిప్రాయం వినిపిస్తూంటుంది. దిలీప్ కుమార్ పుస్తకం, గురు దత్ పుస్తకాల రచయితగా మీ అభిప్రాయం ఏమిటి?

జ: నేనా మాట ఒప్పుకోను. తెలుగువారికి వారి భాష తప్ప మిగతా అన్నిటిపై ఆసక్తి అన్నది నా అభిప్రాయం. అయితే హిందీ సినిమాలపై మన దగ్గర ఎక్కువ పుస్తకాలు రాలేదు. అసలు మన తెలుగులో సినిమాపై మంచి పుస్తకాలు చాలా తక్కువ. సాహితీ, సినీ విశ్లేషణ మన భాషలో లోతుగా జరగలేదు. హైదరాబాద్‌లో జన్మించి ఇదే నగరంలో ఇన్నేళ్ళుగా జీవిస్తున్న నాకు హిందీ పట్ల మా తరంలో ఉన్న ప్రేమ, ఆరాధన ప్రస్తుత తరంలో కనిపించట్లేదు. తెలుగుపైనా వీరికి ప్రేమ తక్కువ. అసలు భాషలను నిబద్ధతతో అధ్యయనం చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. నేను సినిమాల ప్రభావంతోనే హిందీ భాష పట్ల ఇష్టాన్ని పెంచుకున్నాను. ఆ భాషను ముప్పై సంవత్సరాలుగా బోధిస్తున్నాను. ముఖ్యంగా ఆ భాషలోని కవిత్వం నాకు చాలా ఇష్టం. అందుకే హిందీ ఉర్దూ గీతాల కోసం ఆ సినిమాలను చూసేదాన్ని, హిందీ భాష పట్ల ప్రేమకు దిలీప్ కుమార్ కారణం అయితే సినిమా కళపై నాకున్న ప్రేమకు గురు దత్ సినిమాలు కారణం. ఆ ఇద్దరికీ గురు దక్షిణగా నేను ఇచ్చిన నివాళి నా రెండు పుస్తకాలు. ఇప్పుడు అన్ని భాషల చిత్రాలను అందరూ చూస్తున్నారు. ఆ విధంగా మళ్లీ నాకిష్టమైన ఆ ఇద్దరు కళాకారులు తెలుగు వారికి నా పుస్తకాల ద్వారా కొంత అయినా పరిచయం అవుతారని నా ఆశ.

ప్రశ్న15. మీరు దిలీప్ కుమార్ గురించి, గురు దత్ గురించి రాశారు. ఇప్పుడు సంచికలో సాహిర్ లూధియాన్వీ పాటల విశ్లేషణ రాస్తున్నారు. ఈ మూడు రచనలూ పరస్పరంగా భిన్నమైనవి. ఈ మూడు రచనలలో మీ దృక్పథంలో, రచన చేసే విధానంలో, అంశాన్ని పరిశోధించి, విశ్లేషించటంలో తేడాలని వివరిస్తారా?

జ: సాహిర్ లుధియాన్వి నాకు పరిచయం అయింది ‘ప్యాసా’ సినిమా తోనే. ముగ్గురు మూడు భిన్న దృవాలు. దిలిప్ కుమార్ అంటే నాకు గౌరవం. ఆయనలో ఓ రాజసం ఉంది. తెలుగులో ఎన్.టీ.ఆర్‌కు ఉన్న రాజసం అది. ఆయన కొంత దారి మార్చుకుని మసాలా సినిమాలు చేశారు కాని దిలీప్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని కళాకారుడు. ఆ రాజసం అందరికీ అబ్బదు. ఆయన మాట్లాడే విధానం, నటన, స్క్రీన్‌పై ఆ ప్రెజెన్స్  అందరికీ రావు. అందుకని ఓ సినీ ప్రేక్షకురాలిగా ఆయన అంటే నాకు అమితమైన గౌరవం. దిలిప్ కుమార్ సినిమాలను చూస్తుంటే సినిమా అంటే చిల్లర వ్యవహారం కాదనిపిస్తుంది. ఇప్పటి తరంలో ఆ ప్రెజెన్స్ ఉన్న ఒక్క నటుడు నాకు కనిపించలేదు. ఆయన డైలాగ్ చెప్పే విధానంలోనే ఓ రాజసం ఉంది. భాష ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది దిలీప్ కుమార్ మాట్లాడుతుంటే.

గురు దత్ పై నాకున్నది అమితమైన ఇష్టం. ఆయన లోపాలను కూడా సహించగలంత ఇష్టం అనుకోండి. కాని సాహిర్‌పై నాకున్నది విపరీతమైన అభిమానం. నా దృష్టిలో ఇవి మూడు విభిన్నమైన ఎమోషన్స్. సాహిర్ కలంతో నేను స్నేహం చేయనట్లయితే గురు దత్ ఆత్మహత్యను నేనూ ఆమోదించేదాన్నేమో. ఆయన ప్రతి పాట ఓ జీవిత పాఠం. ప్రపంచం బావోలేదు. కాని నేను దీనికి లొంగను. తలవంచను అన్న శక్తివంతమైన వ్యక్తిత్వం సాహిర్‌ది. దిలీప్ కుమార్ రాజసంలో ప్రపంచాన్ని ఆడించే నైజం ఉంది. గురు దత్ నిరాశలో ప్రపంచంతో ఏకమవలేని వేదన ఉంది కాని సాహిర్‌లో ఏది ఎలా ఉన్నా నచ్చని వాటిని విభేదిస్తూనే, ప్రశ్నిస్తూనే నేను నాలాగా బతికి చూపిస్తానన్న అహంకారం ఉంది. నాతో ఎవరూ ప్రయాణించక్కర్లేదు, నన్ను సీరియస్‌గా తీసుకోని వాళ్లు నాకు అక్కర్లేదు అనే నిర్ల్యక్షం ఉంది. అది నాకు అత్యంత ఇష్టమైన గుణం. నా ప్రవృత్తికి అతి దగ్గరగా ఉన్న నైజం. అందుకే ఈ ముగ్గురిని ఈ వరుసలోనే రాసుకుంటూ వచ్చాను. కాని సాహిర్ పుస్తకంగా రావడానికి కనీసం ఇంకో రెండు సంవత్సరాల సమయం పడుతుంది. నేను తొందరపడి పుస్తకాల సంఖ్య పెంచుకోవడానికి ఏదీ రాయదల్చుకోలేదు. గురుదత్ పుస్తకం రాసాక నాలోని ఓ పెద్ద భాగం ఏదో బైటికి వచ్చిందన్న భావం కలిగింది. నా ప్రతి పుస్తకం అలా నన్ను పూర్తిగా ఖాళీ చేసి మాత్రమే బైటికి రావాలని నా కోరిక. అందుకే సాహిర్ పుస్తక రూపంలో రావడానికి ఇంకా సమయం ఉంది.

ప్రశ్న16.  రచనా వ్యాసంగంలో మీ లక్ష్యం ఏమిటి?

జ: నేను సినిమాలు, సమీక్షలు, వరకే ఆగిపోదల్చుకోలేదు. స్త్రీ కోణంలో నేను కొన్ని కథలు రాసుకున్నాను. వాటిని తప్పకుండా బైటికి తీసుకువస్తాను. కొన్ని వ్యాసాలు, సమీక్షలు ప్రింట్‌లో తీసుకురావాలని కోరిక. నా జీవిత సంఘర్షణనూ పాఠకులతో పంచుకోవాలనే కోరిక ఉంది. నా లక్ష్యం ఏ వాదాలకు, ప్రలోభాలకూ, చిక్కకుండా స్వతంత్రంగా ఉంటూ స్వేచ్ఛగా నా రచనలలో నన్ను నేను వ్యక్తీకరించుకోగలగాలని. ఇప్పుడు ఈ విషయం పై రాస్తేనే పేరు వస్తుంది అనే సూత్రాలకు నేను వ్యతిరేకిని. పైగా నేను నా మూడ్ ఆధారంగా పని చేసుకుంటూ వెళతాను. అందువల్ల ఈ రచనా ప్రక్రియలో నేను ఏర్పరుచుకున్న లక్ష్యం అంటూ నాకేమీ లేదు. రచనా వ్యాసంగాన్ని ఇప్పుడు ప్రేమిస్తున్నాను. దీన్ని ఆపను. నాకు సంతృప్తి కలిగించే విధంగా రచన రాకపోతే దాని కోసం ఎన్నాళ్ళయినా కష్టపడతాను తప్ప హడావిడిగా పుస్తకాలు తీసుకురాను. నేను రచనలకు సంబంధించి చాలా నేర్చుకోవాలి, నా శైలిలో ఇంకా పట్టు సంపాదించుకోవాలి. ‘అనల్ప’ బలరాం గారితో పని చేస్తూ నా తెలుగు భాషలో వచ్చే ఆంగ్ల పదాలు, ఆంగ్ల వాక్య రచన ఎక్కువగా ఉండడం గుర్తించాను. తెలుగు పదాలున్నప్పుడు వాటిని ప్రస్తుతం ఎవరూ ఉపయోగించట్లేదు అన్న నెపంతో అక్కడ ఆంగ్లం వాడడం అవసరమా అన్న ఆలోచనను ఆయన నాలో కలిగించారు. వారితో కూర్చుని ఈ పుస్తకానికి చేసిన ఎడిటింగ్ నాకు చాలా చాలా నేర్పించింది. ఈ పుస్తకానికి  ఈ రూపం రావడానికి ‘మంచి పుస్తకం’ సురేష్ గారు, ‘సంచిక’ కస్తూరి మురళీ కృష్ణ గారు, ‘అనల్ప’ బలరాం గారు ముగ్గురు నాకు అందించిన సహాయ సహకారాలు మర్చిపోలేను. అవి నాకు నేను ప్రస్తుతం రాయబోతున్న ఇతర పుస్తకాల సందర్భంలో ఎంతో ఉపయోగపడయాయని ఖచ్చితంగా చెప్పగలను. వారికి కృతజ్ఞతలు.

‘గురు దత్ ఓ వెన్నెల ఎడారి’ పుస్తకం ఏ ప్రారంభోత్సవాలు, హడావిడి లేకుండా పాఠకుల మధ్యకు చేరింది. అది అలాగే చేరాలన్నది నాది, సంపాదకుల ఉద్దేశం కూడా. కళను కళాకారులను, సినిమాను ప్రేమించేవారి వద్దకు ఈ పుస్తకం దారి చేసుకుని వెళుతుందని నా నమ్మకం. ఒకప్పుడు ఎవరూ గుర్తుంచుకోని  దర్శకుడు,  ప్రజల ఆదరాభిమానాలకు నోచని కళాకారుడు గురు దత్ మరణించిన ఎన్నో ఏళ్ళ తరువాత మా తరం వారికి చేరువ అవలేదా? ఆనాడు ప్రేక్షకులు మెచ్చని ఫెయిల్యూర్ సినిమా ‘కాగజ్ కే ఫూల్’ ఇవాళ ఎందరి దృష్టిలోనో కళాఖండంగా నిలువలేదా? మన సృజనలో నిజాయితీ, రచనలో విషయం ఉంటే అది చేరవలసినవారిని ఏదో ఒక రోజు తప్పకుండా చేరుతుంది. గురు దత్ గురించి తెలుగులో ఇప్పటి దాకా ఎవరూ రాయలేదు.  గురు దత్ ప్రేమికురాలిగా నా శక్తి మేరా అధ్యయనం చేసి తెలుగు పాఠకులకు  ఓ పుస్తకాన్ని అందించాను. అర్హత ఉన్న పాఠకులకు అది చేరుతుందన్నది నా నమ్మకం.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు పి. జ్యోతి గారూ.

పి. జ్యోతి: ధన్యవాదాలండీ! సంచిక టీమ్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

***

గురు దత్ – ఓ వెన్నెల ఎడారి
రచన: పి. జ్యోతి
ప్రచురణ‏: అనల్ప బుక్ కంపెనీ
పేజీలు: 576
వెల: ₹ 695
ప్రతులకు:
అనల్ప బుక్ కంపెనీ
35-69/1, రెండవ అంతస్తు, జి.కె. కాలనీ బస్ స్టాప్,
నేరేడ్‍మెట్ క్రాస్ రోడ్ దగ్గర,
సికిందరాబాద్-500094,
ఫోన్: 7093800303
contact@analpabooks.com
ఆన్‍లైన్‌లో ఆర్డర్ చేసేందుకు
https://www.amazon.in/DUTT-Biography/dp/9393056749

~

‘గురు దత్ – ఓ వెన్నెల ఎడారి’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/guru-dutt-o-vennela-edaari-book-review-kmk/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here