ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి శారద ప్రత్యేక ఇంటర్వ్యూ

0
9

[ఇటీవల ‘మలయమారుతం’ అనే కథాసంపుటిని ప్రచురించిన సందర్భంగా రచయిత్రి శ్రీమతి శారద గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము.]

సంచిక  టీమ్: నమస్కారం శారద గారూ.

శారద: నమస్కారమండీ.

~

ప్రశ్న: మీరు ఆస్ట్రేలియాలో వుంటున్నారు. కానీ, మీ ఈ కథల్లో భారత వాతావరణమే వుంది. ఆస్ట్రేలియా కనబడటం లేదు. ఎందుకు?

జ. మీరన్నది నిజమే. నా కథలు ఆస్ట్రేలియాలో జరిగినవే అయినా, వాతావరణం భారతీయ వాతావరణమే వుంటుంది. నా కథలు చాలా వరకు, ఆస్ట్రేలియాలో నివసించే భారతీయుల గురించే కావడం వల్ల కావొచ్చు. నాకు తెలియని వాటి గురించి  రాసే అలవాటు నాకు లేదు. నాకు అనుభవంలోకి వచ్చిన వాటి గురించీ, జీవితాల గురించి రాయడానికే ఎక్కువగా ఇష్టపడతాను.

నేను ఆస్ట్రేలియాలో 1999 నుంచి వుంటున్నా, మా ఇంట్లో భారతీయ వాతావరణమే వుంటుంది. చాలా మంది నా స్నేహితుల ఇళ్ళల్లోనూ అలాగే వుంటుంది. నేను రాసే కథలు చాలావరకు అలాటి వాళ్ళ  గురించై వుంటుంది. అందుకే ప్రాంతం ఏదైనా నా కథల్లో మామూలు మధ్యతరగతి భారతీయ వాతావరణమే కనబడుతుంది.

ప్రశ్న: ఈ కథలని మీరు మీ బ్లాగులోనే ప్రచురించారు. తరువాత పుస్తకరూపంలో తెచ్చారు. కథల విషయంలో ఎవరివయినా సూచనలు సలహాలు తీసుకున్నారా?

జ: 2012 తరవాత నా కథలేవీ బ్లాగులో పెట్టలేదండీ!

ఈ సంకలనంలోనే తీసుకుంటే ఒకటి రెండు కథలు తప్ప మిగతావేవీ నా బ్లాగులో లేవండీ. మీకెందుకలా అనిపినించిందో కానీ!

కథల విషయంలో  వసుంధర దంపతులు చాలా ప్రోత్సహించారు.

ప్రశ్న: ఈ కథలలో ఏదయినా సూత్రం అంతర్లీనంగా వుందా? లేక ఏ కథకు ఆ కథేనా?

జ: ఈ కథలన్నీ ఒకేసారి రాసినవి కావు. అప్పుడప్పుడూ, ఒక పదేళ్ళ కాలంలో వ్రాసినవి. అందువల్ల వీటన్నిటిలో అంతర్లీనంగా సూత్రమేదీ లేదు. ఏ కథకా కథే.

ప్రశ్న: ఈ కథల్లో మీకు బాగా నచ్చిన కథ ఏది? ఎందుకు?

జ: ఈ సంకలనంలో ఐతే నాకు నచ్చిన నా కథ ‘ముసుగులు’. మనుషుల మనస్తత్వాలలోని ఒక కోణాన్ని ఆ కథలో పట్టుకోవడానికి ప్రయత్నించాను.

ప్రశ్న: ఈ కథల్లో ఏ కథ రాయటానికి మీరు బాగా కష్టపడ్డారు? ఎందుకు?

జ: ‘మాతృదేవో భవ’. ఎందుకంటే సాధారణంగా కథలన్నీ అమ్మ చేసే త్యాగాలనీ, అమ్మ కుండే ప్రేమనీ కీర్తిస్తూ వుంటాయి. ప్రేమ ఎంత గొప్పదైనా, హద్దులు మీరితే ఎంత విపరీతంగా వుంటుందో చెప్పడానికి ప్రయత్నించాను.

ఈ కథ అనే కాదు, చాలాసార్లు మనుషుల బలహీనతల గురించి రాసేటప్పుడు ఒక అనుమానం పట్టి పీడిస్తుంది. మామూలు చిన్న చిన్న విషయాలని ఇంత భూతద్దంలోంచి చూసి విశ్లేషించడం అవసరమా, అని. అయినా ఎలాగో రాసేస్తాను. అలాటి కథలు రాసేటప్పుడు చాలా సెల్ఫ్-డవుట్‌ని అధిగమించి రాయాల్సి వొస్తుంది. అందుకే కష్టం.

రచయిత్రి కుటుంబం

ప్రశ్న: ఇందులోని ఏ కథయినా ఇంకా బాగా రాసి వుండాల్సింది అనిపించిందా?

జ. ‘మలయ సమీరం’ కథ ఇంకా బాగా రాసే అవకాశం వుందేమో. అందమైన, సరళమైన ప్రేమ కథగా మొదలు పెట్టానది. ఇంకొంచెం డెప్త్ వుండేలా రాసి వుండొచ్చు.

ప్రశ్న: కథలు రాయటంలో మీ లక్ష్యం ఏమిటి?

జవాబు: లక్ష్యం అంటూ ఏమీ లేదండీ. ఏదో ఒక విషయం గురించిన నా ఆలోచనలూ, అభిప్రాయాలూ చెప్పడానికి కథలని ఉపయోగించుకుంటానంతే.

ప్రశ్న: మీ రచనలు బ్లాగుకే పరిమితం కావటానికి కారణం ఏమిటి?

జ: నేను 2007 ప్రాంతంలో నీలాంబరి బ్లాగు ప్రారంభించాను. ఊరికే నా ఆలోచనలు పంచుకోవడానికి ప్రారంభించానంతే. ముఖ్యంగా సంగీతం గురించీ, పుస్తకాల గురించీ ఏదో వ్రాసేదాన్ని. దాన్లో అప్పటి వరకూ అచ్చయిన కొన్ని కథలు కూడా పెట్టాను. 2012 ప్రాంతంలో కథలు మాత్రం బ్లాగులోంచి తీసేసాను.

ఇప్పుడైనా, కథలేవీ బ్లాగులో పెట్టడంలేదు. ఆ మాటకొస్తే బ్లాగులో కూడా వ్రాయడం చాలా వరకు తగ్గిపోయింది. కారణం సమయాభావం, అంతే. కథలు ఎక్కువగా ఈమాట, కౌముది, సారంగ, వీధి అరుగు, ఆంధ్రజ్యోతి పత్రికలకి పంపుతూ వుంటాను.

ప్రశ్న: ఈ సంపుటిలో అబోరిజీన్ల ప్రస్తావన వున్న కథ ఒకటుంది. భవిష్యత్తులో ఆస్ట్రేలియా అబోరిజీన్లకు సంబంధించిన కథలు రాసే ఆలోచన వుందా?

జ: అవునండీ, అబోరిజీన్ల గురించిన కథలు రాయాలని వుంది. వీలైతే అబోరిజీన్ రచయితల కథలు అనువాదాలు చేయాలనీ వుంది.

~

సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని కేటాయించి సంచికకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు శారద గారూ.

శారద: నా అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకూ, ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి నన్ను ఆలోచింపచేసినందుకు సంచిక టీం సభ్యులకు ధన్యవాదాలు. నమస్కారం.

***

మలయమారుతం (కథాసంపుటి)
రచన: శారద
ప్రచురణ: అనల్ప పబ్లికేషన్స్,
పేజీలు: 140
వెల: ₹ 150
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
అనల్ప పబ్లికేషన్స్, 7093800303
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://telugu.analpabooks.com/malayamarutham

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here