కవయిత్రి సాయిమల్లిక పులగుర్త ప్రత్యేక ఇంటర్వ్యూ

3
12

[‘నల్లమబ్బుపిల్ల’ అనే కవితాసంపుటిని వెలువరించిన సాయిమల్లిక పులగుర్త గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం సాయిమల్లిక పులగుర్త గారూ.

సాయిమల్లిక పులగుర్త: నమస్కారమండీ.

~

ప్రశ్న 1. నల్లమబ్బుపిల్ల పుస్తకం అందంగా తయారు చేశారు. తొలి పుస్తకమే నాణ్యంగా తయారు చేసినందుకు అభినందనలు. ఈ పుస్తకానికి ముఖచిత్రం వేసింది మీరే.. కాబట్టి ముఖచిత్రం వెనుక ఉన్న కథనూ, ముఖచిత్ర చిత్ర రచనలో మీ ఆలోచననూ, శ్రమనూ మా పాఠకులతో పంచుకుంటారా?

జ: నాకు రాయడం కన్నా ముందు తెలిసిన ఇష్టం, బొమ్మలు వేయడం. దానిలో నా ప్రయాణం, చిన్నప్పుడు పలక, ఆ తరువాత కాగితాలు, పెద్దయ్యాక మంచి డ్రాయింగ్ పుస్తకాలు, ఇప్పుడు డిజిటల్ ఆర్ట్. ఏ బుజ్జి ఆనందపు విషయం కనపడినా, ఆ ఆనందం పువ్వును వెంటనే కోసేసి, సంచిలో పెట్టుకుని, అవి అందరికీ చూపించి అందరికీ ఆ ఆనందం పంచేయాలన్నది, నాకు తెలీకుండా వచ్చిన నా చిట్టి కోరిక. నా పుస్తకంపై ఉన్న ముఖచిత్రం కూడా అదే. ఓ పాప, ఈ పెద్ద జీవితం అనే దారిలో అరుదుగా ఎదురయ్యే అందమైన పువ్వులు ఎంచి కోసుకుని తన సంచీలో పెట్టుకుని వెళుతూ చేస్తున్న నా ఈ ప్రయాణమే, ‘నల్లమబ్బుపిల్ల’.

ప్రశ్న 2. మీరు భావ వ్యక్తీకరణకు హైకూ ప్రక్రియను ఎందుకని ఎంచుకున్నారు? మీరు పాటించిన హైకూ లక్షణాలను తెలుపుతారా? ఎందుకంటే, ఇతరుల హైకూలకూ మీ హైకూలకూ తేడా వుంది?

జ: హైకూ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది, మూడు పాదాల ఛందస్సు, 5 7 5 అక్షరాల అమరిక, అలా ఇంకొన్ని. నాకు మాత్రం హైకూ అంటే, మనసులో నుండి ఏ కోటింగూ లేకుండా హఠాత్తుగా బయటకు వచ్చిన ఒక ప్యూర్ భావోద్వేగం. హైకూ రాయాలి అనుకుని రాయలేము. మన కళ్ళకు చెప్పలేని ఓ ఆనందం, ఆశ్చర్యం, కలిగినప్పుడు, దాన్ని మనసు అనే కలంతో మనకు తెలియకుండానే రాయగలిగిన ఒక మరువలేని జ్ఞాపకం.

ప్రశ్న 3. వాన పాటలు ముచ్చటగా, చక్కగా వున్నాయి. ముఖ్యంగా కారు అద్దంపై పడే వాన చినుకులను పాపల రన్నింగ్ రేస్‌తో పోల్చటం.. వంటివి. వర్షపు అనుభవాన్ని ఇంతటి సున్నిత భావాల ద్వారా వ్యక్తం చేయాలన్న సృజనాత్మకపుటాలోచన ఎలా సాధ్యమయింది?

జ: వర్షం చిన్నప్పటి నుండీ అందరూ చూస్తున్నదే. అయినా ఎవరైనా వర్షం పడుతోంది అని చెప్పగానే, పరిగెత్తుకుని బాల్కనీలోకి వెళ్లి, చూసి ఎందుకు మురిసిపోతాము? ఆ పాత వానను అన్ని సార్లు చూసినా, ప్రతీ సారీ ఇంకేదో కొత్త ముద్దైన విషయం కనిపిస్తూనే ఉంటుంది. అలా ఒకరోజు, అమ్మ వడియాలు తెచ్చి ఇస్తే, అవి తింటూంటే, అయిదేళ్ల పిల్లని చేసేసి, రకరకాల పాటలు పాడి వాన నన్ను, నవ్వించిన చిన్ని నవ్వులే, ఈ వాన పాటలు.

ప్రశ్న 4. మీరు, కొన్ని హైకూలకు ప్రేరణ రాశారు. మరికొన్నిటికి రాయలేదు. ఎందుకని?

జ: ఒక్కోసారి నేను రాసిన హైకూలు చాలా straight forward గా ఉంటాయి, అంటే వాటికి ప్రేరణ అక్కర్లేదు, ఉదాహరణకి, చంద్రుడి వలపులు, వాన పాటలు. ఇంకొన్నేమో నా జీవితంలో హాఠాత్తుగా వచ్చి చిట్టి చిట్టి ఆనందాలు కలిగించిన కొన్ని సందర్భాలు. వాటికి మాత్రం, హైకూలతో పాటు, ఆ క్షణం నాకు కలిగిన నా భావోద్వేగాన్ని కూడా గుర్తులుగా ప్రేమగా ఒక ప్రేరణను తగిలించి దాచుకున్నాను.

ప్రశ్న 5. చిత్రలేఖనంలో శిక్షణ పొందారా? మీకు చిత్రలేఖనంలో ఆదర్శం ఎవరు?

జ: నాకు చిన్నప్పటి నుండీ, ఏదీ ఇవ్వలేనంత కొత్త ఆనందం బొమ్మలు వేయడంలో ఉండేది. అప్పటి నుండి ఇప్పటి దాకా చాలా breaks వచ్చినా కూడా, మళ్లీ మేమిద్దరం ఏకమవుతూనే ఉన్నాము. నేనెప్పుడూ బొమ్మలు గియ్యడం నేర్చుకోలేదు, నేర్చుకోవాలి అని కూడా నాకు తెలియలేదు. నాకు ఏదైనా నచ్చితే దాన్ని సరదాగా ఓ పుస్తకంలో గీసుకుని అందరికీ గొప్పగా చూపించేదాన్ని. 5 ఏళ్లప్పుడు రెండు రూపాయిల నటరాజ్ పెన్సిల్, ఇప్పుడు 25 ఏళ్లప్పుడు పదివేల డిజిటల్ ఆపిల్ పెన్సిల్, రెండు ఆనందాలు నాకు అపురూపమే. నాకు చిత్రలేఖనంలో ఆదర్శం, ఏడుస్తున్న ముక్కుచీమిడి బుజ్జమ్మ, నీళ్ళ బిందువులు చూసి మురిసిపోతున్న బుజ్జి లేత పువ్వు, హఠాత్తుగా ఎలాగో ఏడు రంగులు కలిపి మనకి చూపించే వాన, అమాయకపు ఆకులు, ఏమీ తెలియని నీళ్ళు, తెగ కూసేసే కోయిలలు..

ప్రశ్న 6. ఈ సంపుటిలో కొన్ని హైకూలు అద్భుతమైన భావాలను ప్రదర్శిస్తాయి. కానీ, కొన్ని సాధారణం అనిపిస్తాయి. హైకూ రచనలో మీకు ఆదర్శం ఎవరు? హైకూ రాయగానే ఎవరికయినా చూపించి అభిప్రాయం అడుగుతారా?

జ: నా హైకూలన్నీ నా జీవితంలో ఎదురైన అందమైన బుజ్జి బుజ్జి విషయాలు. అందులో కొన్ని అద్భుత భావనను తెలుపుతాయి, ఇంకొన్ని సాధారణ విషయాలలో ఉన్న అందాన్ని చూపిస్తాయి. I appreciate both, ప్రస్తుత క్షణంలో దాగి ఉన్న miracles, and the beauty hidden in the routine ordinary. హైకూ రచనలో నాకు ఆదర్శం, నాకు ఎప్పుడూ తోడుగా ఉండే, బుజ్జి పువ్వులు, ఏకాంతపు చీకటిలో మెరుస్తూ మురిపే అందమైన చందమామ నుండి, ఏమీ తెలియని ఓ బుజ్జి ఎండుటాకు దాకా, నన్ను నవ్వించే ప్రతీదీ నాకు అలరించే ఆదర్శమే.

ప్రతీ హైకూ టాపిక్ నేను మొదట ఫేస్‌బుక్‌లో పెట్టేదాన్ని. అవన్నీ కలెక్ట్ చేసి, ఒక పుస్తకరూపంలో పెడదాము అనుకున్నాక, మా పెద్దమ్మ (వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు), బోలెడన్ని సార్లు చాలా జాగ్రత్తగా, అంతకన్నా ఓపిగ్గా అక్షర దోషాలూ, నాకు తెలియని దుష్ట సమాసాలు సరిచేశారు.

ప్రశ్న 7. ఈ పుస్తకం ప్రచురించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టారు?

జ: నాలుగేళ్ల క్రితం, నేను వాన మీద రాసినవి సరదాగా రాసిన మొట్టమొదట ఆరు హైకూలు. ఆ తరువాత వాటికి ఇంకో పది యాడ్ అయ్యి, వాటికి ఇంకో సెక్షన్ యాడ్ అయ్యి, అలా తరువాత నెమ్మదిగా నేను లెక్కపెట్టుకోకుండానే, చాలా హైకూలు అయిపోయాయి. అవి వంద అయ్యాయి అని ఒక రోజు, మా మామయ్య (వాడ్రేవు చిన వీరభద్రుడు గారు) దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఆయన 100 కాదు గానీ, ఓ మూడు వందలు రాయి అన్నారు సరదాగా. ఆ సరదా మాట నేను సీరియస్‌గా తీసుకుని రెండు నెలల్లో మిగతావన్నీ రాసేసాను. పుస్తకం లేఅవుట్ అండ్ డిజైన్ – ప్రతీ విషయంలో ఎక్కడైనా విసుగొచ్చి నేను compromise అయినా, ఆయన మాత్రం ప్రతీ చిన్ని డిటైల్ చూసేవారు. ఆ రోజు నుండి ఆయన ఆ భయంకర ఓపిక గురించి ఎక్కడైనా చెప్పాలని అనుకునేదాన్ని.

అవి అలా మొత్తానికి మూడు వందలు అయ్యాయి అని ఒకరోజు తెలిసింది. అయితే ఒక పుస్తకం తయారయి, అది నిజంగా ప్రింటింగ్‌కి వెళ్లిపోయి, బోలెడన్ని నల్లమబ్బుపిల్లలు ఇలా బయటకు వస్తాయని, నేను ఊహించలేదు.

ప్రశ్న 8. కవిత్వము, చిత్రకళ – ఈ రెండింటిలో మీకు ఏది ఎక్కువగా సంతృప్తినిస్తుంది?

జ: నా మనసుకు ఎప్పుడైనా పెద్ద పట్టలేని ఆనందం కలిగినప్పుడు, అది వెంటనే ఇంకెవరికైనా చెప్పేయాలన్న, ఆపుకోలేని వెర్రి చిన్నపిల్ల సరదా నాది. అలా ఎప్పుడూ ఏ కొత్త అందమైన విషయం కనపడినా, మనసుకు కలిగిన ఆ ఆనందాన్ని రాసేసి, కళ్ళకు కలిగిన ఆనందాన్ని చిత్రిస్తాను.

ఆ రెండిట్లో ఏది లేకపోయినా నా సరదాను మీకు పరిచయం చేసే ప్రయత్నాన్ని పూర్తి చెయ్యలేను.

ప్రశ్న 9. పుస్తక ప్రచురణలో మీ అనుభవాలేమిటి?

జ: పుస్తక ప్రచురణ నేను అనుకున్నంత సులువూ కాదు, అందరూ అనుకునేంత కష్టమూ కాదు. కాకపోతే బోలెడంత ఓపిక కావాల్సిన పని అని మాత్రం చెప్పగలను. పుస్తక ప్రచురణ ప్రక్రియ నుండి నేను జీవితానికి కావలసిన, అవసరమైన విషయాలు రెండు నేర్చుకున్నాను. మనకి పుస్తకం ఎంత బాగా రావాలి అన్నది, మన ఓపిక, సహనం మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ఎక్కడ తృప్తి పడాలో కూడా తెలియాలి. అప్పటికప్పుడు భూతద్దంలో చూడ్డం వల్ల నచ్చకపోయినా, కొన్నాళ్ళకి, మనం పడిన కష్టం, సాధించిన చిన్ని విజయపు కలయిక ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది.

ప్రశ్న 10. మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: జీవితాన్ని ఇలా గడపాలి, అలా చెయ్యాలి అని నేనెప్పుడూ ప్లాన్ చేసుకోలేదు, చేసుకున్నా అది అలాగే అవుతుంది అని కూడా చెప్పలేము. ప్రతీ దానిలోనూ నా వంతు 100% ప్రయత్నం చేస్తూ, జీవితం అనే ఓ ప్రయాణం దారిలో నాకు ఎలాంటి కొత్త surprises, ఎన్నెన్నో కొత్త విషయాలు వస్తాయో ఆత్రుతగా కిటికీ దగ్గర కూర్చుని వేచి చూస్తూ ఉంటాను. కానీ భవిష్యత్తులో ఎన్ని పనులున్నా, నేను ఎంత busy అయిపోయినా కూడా, ఇంకో కొత్త అలవాటు నేర్చుకోడానికి, కొత్త విషయం తెలుసుకోడానికి సమయం తప్పక ఉంటుంది అని నేను నమ్ముతాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సాయిమల్లిక పులగుర్త గారూ.

సాయిమల్లిక పులగుర్త: ధన్యవాదాలు. నమస్కారం.

***

నల్లమబ్బుపిల్ల (మరికొన్ని హైకూలు)
రచన: సాయిమల్లిక పులగుర్త
పేజీలు: 144
వెల: ₹ 150/-
ప్రతులకు:
వెన్నెల పబ్లికేషన్స్
హౌస్ నెం. 72,
జూయెల్ మాన్షన్
ఫ్లాట్ నెం. 402, నవోదయ కాలనీ,
మెహిదీపట్నం,
హైదరాబాద్ 500028
ఫోన్: 8008928587.

 

~

‘నల్లమబ్బుపిల్ల’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/nallamabbupilla-book-review-dr-ks/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here